( ప్ర‌జాధ‌నాన్ని అనుత్పాద‌క రంగానికే ఎక్కువ‌గా త‌ర‌లిస్తున్నార‌ని, అందువ‌ల్లే ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వ‌డం కూడా భార‌మైపోయింద‌ని పీఆర్‌సీ ఉద్య‌మంలో ప‌ని చేస్తున్న డీటీఎఫ్ నాయ‌కుడు కె. ర‌త్నం ఏసేపు అంటున్నారు. ఉద్యోగులు, పెన్షనర్లు మెరుగైన పిఆర్‌సి కోసం  చేస్తున్న ఉద్యమం కార్మికవర్గ సంక్షేమంతో ముడిపడి వుంద‌ని అంటున్నారు. దాదాపుగా నూరు శాతం ఉద్యోగ‌వ‌ర్గాలు ఈ ఉద్య‌మంలో భాగ‌మ‌య్యాయ‌ని ఆయ‌న అంటున్నారు. అయితే గ‌తంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద‌, రైతు ఉద్య‌మం లాంటి వాటి మీద ఉద్యోగ‌, ఉపాధ్యాయ వ‌ర్గాలు క‌లిసి వ‌చ్చి ఉంటే ఇప్ప‌డు పీఆర్సీ పోరాటానికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు దొరికేది. దీన్ని అడ్డంపెట్టుకొనే పాల‌కులు ఉద్యోగుల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తున్నారు… ఈ అనుభ‌వంతో అయినా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై జ‌రిగే పోరాటాల‌తో ఉద్యోగులు క‌లిసి రావాల‌ని ఆయ‌న అంటున్నారు. ..వ‌సంత‌మేఘం టీం )

1. రివర్స్‌ పీఆర్‌సి అంటున్నారు కదా. ప్రభుత్వం ఎందుకు ఈ పని చేసిందనుకుంటున్నారు ?

జ. ఇది ముమ్మాటికీ రివర్స్‌ పిఆర్‌సినే. గత పిఆర్‌సిలకు భిన్నంగా ఈ పిఆర్‌సి ఫిట్‌మెంట్‌ను తగ్గించింది. హెచ్‌ఆర్‌ఎ స్లాబులను తగ్గించింది, పెన్షన్‌లోను కోత విధించింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మేజర్‌ ఖర్చుగా ఉద్యోగుల జీతభత్యాల సమస్యను చూస్తూ వుంది. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతభత్యాల బడ్జెట్‌తో పోల్చినపుడు రెగ్యులర్‌ ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించేది ఎక్కువ మొత్తమే. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ సంక్షేమ పథకాలైనప్పటికీ, అనుత్పాదక రంగంలో ఖర్చుపెడుతూ వుండడం వల్ల వ్యక్తిగతంగా లబ్ది చేకూరుతుందేమోగాని, సామాజికంగా అభివృద్ధి జరుగదు. ఉద్యోగుల, పెన్షనర్ల జీతభత్యాలను ప్రభుత్వం  సంక్షేమంగా చూడడం లేదు. వీటిని ‘భారంగా’ భావిస్తున్నందువల్ల ఆ భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నందువల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఉద్యోగులకు, కార్మికులకు మెరుగైన జీతభత్యాలను చెల్లించడం ద్వారా, వారి నుండి పక్కువ సామాజిక ప్రయోజనం నెరవేరుతుంది. దాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు.

2.  పిఆర్‌సి అనేది రొటీన్‌ వ్యవహారం. కానీ ఈసారి పందుకు ఇలా అయింది ?

జ. పిఆర్‌సి ‘రొటీన్‌’గా జరిగే వ్యవహారం. ఇంతవరకు 10 పిఆర్‌సిలు ఉద్యోగులకు, పెన్షనర్లకు అమలయ్యాయి. ప్రతి 5 సంవ‌త్స‌రాల కొకసారి చట్టబద్దంగా పేరివిజన్‌ కమీషన్లు ఏర్పాటు చేయబడతాయి. ఏడాది కాలంలోగా ఆయా కమిటీలు తమ నివేదికను ప్రభుత్వా లకు సమర్పిస్తాయి.  అదేకాలంలో ప్రభుత్వం కూడా  ఉద్యోగ సంఘాలకు, మీడియా ప్రతినిథులకు నివేదికలను విడుదల చేస్తుంది. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఆ పిఆర్‌సి నివేదికలోని అభ్యంతరకరమైన అంశాలను, తమకు నష్టం కలిగించే అంశాలపట్ల ప్రభుత్వానికి ప్రాతినిథ్యాలు చేస్తారు. చర్చలు జరుగుతాయి. ఆర్థిక కార్యదర్శి, సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శులు, కొన్ని సందర్భాలలో ఆర్థికశాఖమంత్రి జోక్యం చేసుకొని ఉద్యోగులకు అమోదయోగ్యమైన రీతిలో అంగీకరించి, పిఆర్‌సి అమలుకొరకై జి.ఓలను (ప్రభుత్వ ఉత్తర్వులను) విడుదల చేస్తారు. పిఆర్‌సి అమలై ఐదేళ్ళపాటు కొనసాగుతుంది. ఉద్యోగులకు, పెన్షనర్లకు చిన్నచిన్న ఆర్థికనష్టాలను కలిగించే అంశాలను పరిశీలించడానికి కూడా ‘అనామలీస్‌ కమిటీ’ని ప్రభుత్వాలు నియమిస్తాయి. ఆయా కమిటీల సూచనలను కూడా ప్రభుత్వాలు అమలు చేస్తాయి. కాని ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. నెలసరి జీతాలు, పెన్షన్‌లను చెల్లించడానికి కూడా అప్పులు చేస్తూ వుంది. ఉద్యోగులు చేస్తున్న ఉద్యమాల ఒత్తిడి వల్ల పిఆర్‌సిని ప్రకటించవలసి వచ్చింది. ఈ ఆర్థిక సంక్షోభ సమయంలో పిఆర్‌సి ప్రభుత్వానికి భారంగానే కనిపిస్తూ వుంది. అందువల్ల  ఆ నివేదికను అమలుపరచడం ఏమాత్రం ఇష్టంలేదు.

3. ప్రభుత్వం బడ్జెట్‌ లెక్కలు ఏవో చెబుతోంది కదా. ఎంత నిజం ఉంది ?

జ. ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌ లెక్కలు తప్పులు తడకలే. ఉద్యమం చేస్తున్న నాలుగు జేఏసీలు ‘‘కొత్త జీతాలు భారంగా వుంటే మాకు పాతజీతాలే ఇవ్వండని, పెరుగుతున్న ధరల సూచికకనుగుణంగా పెండింగ్‌లో వున్న కరువుభత్యం (డి.ఏ.) బకాయీలు చెల్లించండి చాలని చెబుతున్నా, ప్రభుత్వం కొత్త పిఆర్‌సి ప్రకారం బలవంతంగా, అదికూడా ఉద్యోగులు తమ ‘ఆప్షన్‌’ను ఇవ్వకుండానే, జీతాల బిల్లులు ఉద్యోగులు చేయకున్నప్పటికీ ఉద్యోగుల అకౌంట్లలలో జీతాలు వేయడానికి సిద్ధపడిందంటే, కొత్త పిఆర్‌సి ఎవరికి లాభమో అర్థమైపోతుంది. ప్రభుత్వం ప్రకటిస్తున్న లెక్కల మాయాజాలం ఏమిటన్నది బయట పడుతూవుంది.

4. అశుతోష్‌ మిశ్రా నివేదిక నేపథ్యం ఏమిటి? అందులో ఏం ఉండవచ్చని ప్రభుత్వం దాన్ని తొక్కిపట్టింది ?

జ. 11వ పే రివిజన్‌ కమీషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం (అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం) 28-5-2018 నాడు అశుతోష్‌ మిశ్రాగారి నేతృత్వంలో చట్టబద్ధ‌మైన ఉత్తర్వుల ద్వారా ఏర్పాటు చేసింది. ఏడాదిలోగా నివేదిక సమర్పించవలసిన కమిటి నివేదిక చాలా ఆలస్యమై ఐదుసార్లు కాలపరిమితిని పెంచుకుని 5-10-2020 నాడు అనగా 39 నెలల అనంతరం ప్రభుత్వానికి సమర్పించింది. మొదట్లో ఉద్యోగులు కూడా ప్రభుత్వ అనుకూల వైఖరిని అవలంభించారు. ఫలితంగా అశుతోష్‌ మిశ్రా నేతృత్వంలోని పిఆర్‌సి నివేదిక  39 నెలల తర్వాత ప్రకటించబడింది. అది కూడా ఉద్యోగులు ఉద్యమాలు చేయడం ద్వారానే, సాధారణంగా పిఆర్‌సి నివేదికలను ప్రభుత్వాలు బహిరంగంగానే ఉద్యోగులకు, మీడియాకు విడుదల చేస్తాయి. కానీ ఈసారి 11వ పే రివిజన్‌ కమిటి నివేదిక విషయంలో అలా జరుగలేదు. బడ్జెట్‌ భారంగా భావించిన ప్రభుత్వం అసలు నివేదికను ప్రకటించనేలేదు. ఆశుతోష్‌ మిశ్రా పిఆర్‌సి నివేదికను ప్రకటించకుండా, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నేతృత్వంలో 5 మంది కమిటీని నియమించి, పిఆర్‌సి నివేదిక అమలు సాధ్యాసాధ్యాలను చర్చించే బాధ్యతను అప్పగించింది. ఇది చట్టవిరుద్ధమైన కమిటి. దీనికి ఎటువంటి సాధికారతలేదు. అశుతోష్‌ మిశ్రా పిఆర్‌సి నివేదికను ప్రకటించకుండా ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సమీర్‌శర్మ కమిటీ సమర్పించిన పిఆర్‌సి నివేదికనే ప్రభుత్వం అమలు చేయడానికి ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రస్తుతం పిఆర్‌సి సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమాలన్నీ ఈ ప్రధానకార్యదర్శి కమిటీ చేసిన ఉద్యోగ వ్యతిరేక, అసంబద్ధమైన సిఫారసులకు వ్యతిరేకంగానే. కోట్ల రూపాయలు జీతంగా చెల్లించి, ఖర్చుపెట్టి తయారు చేయించిన చట్టబద్ధమైన అశుతోష్‌ మిశ్రా కమిటి నివేదికను ఇంత వరకు బయటపెట్టనేలేదు.

5. ఈ పిఆర్‌సి ఉద్యమం కేవలం ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాల కోసమే జరుగుతోందనుకోవాలి? (అది ఉండదగినదే). దానితోపాటు కార్మికవర్గ స్వభావం దీనికి ఉన్నదని అనుకోవచ్చా?

జ. ఈ పిఆర్‌సి ఉద్యమం ఉద్యోగుల, పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాల కొరకు మాత్రమే కాదు, కార్మికవర్గ ప్రయోజనాలతో కూడుకున్నది. ఇవ్వాళ సాధించుకున్న పిఆర్‌సి వేతనస్కేళ్ళ జీతభత్యాలు, కరువు భత్యాలపైన ఉద్యోగుల భవిష్యత్తే కాదు, మొత్తం కార్మికవర్గం, టెంపరరీ, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీతభత్యాలు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతభత్యాలు కూడా ఆధారపడి వుంటాయి. అందువల్ల నేడు ఉద్యోగులు, పెన్షనర్లు మెరుగైన పిఆర్‌సి కొరకు చేస్తున్న ఉద్యమం కార్మికవర్గ సంక్షేమంతో ముడిపడి వుంది, చాలా ముఖ్యమైనది కూడాను.

6. బహుశా మూడు దశాబ్దాల తర్వాత ర్రాష్టంలో ఉద్యోగులు ఇలాంటి పోరాటం చేపట్టినట్లుంది.  ఉపాధ్యాయ, ఉద్యోగవర్గాలకు ఈ అనుభవం ఎలా ఉండవచ్చనిపిస్తోంది ?

జ. నిజమే! 1986 తర్వాత ఇంత పెద్దఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. 1986లో 19 రోజులు సమ్మె జరిగింది. ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగుల కోర్కెలను ఆమోదించింది. ఉద్యమాలు చేస్తున్న ప్రతిసారి ఉద్యోగులలో కొన్ని సంఘాలు, కొన్ని డిపార్టుమెంట్‌లు ఉద్యమాలకు దూరంగా ఉండేవి. ఆయా సందర్భాలలో ప్రభుత్వమే విభజించు- పాలించు అనే సూత్రాన్ని అవలంభించేవి. కానీ ప్రస్తుతం దాదాపు 100% ఉద్యోగులు, ఉద్యోగసంఘాలు, అన్ని విభాగాలు, చివరికి న్యాయశాఖ, మెడికల్‌ విభాగాలు, ఎపియస్‌ఆర్‌టిసిలు కూడా నేటి పిఆర్‌సి సాధనా సమితి ఉద్యమాలలో పాల్గొంటున్నాయి. సమ్మెకు కూడా సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం అసంబద్ధంగా మొండిగా వ్యవహరిస్తున్నందు వల్లే ఈ పరిస్థితి దాపురించింది. గతంలో ఏ పిఆర్‌సి సందర్భంగా కూడా ఉద్యోగుల హక్కులను హరించివేయలేదు. ఉన్న సౌకర్యాలకు తోడు ఏదో ఒక అదనపు సౌకర్యాన్ని కల్పిస్తూ వచ్చాయి. కాని ప్రస్తుత పిఆర్‌సి నివేదిక ఉద్యోగుల, పెన్షనర్ల ఉన్న హక్కులను సౌకర్యాలను కాలరాస్తూ వుంది. అందుకే ఇంతటి తీవ్ర వ్యతిరేకత.

7. మొత్తంగా పిఆర్‌సి ఉద్యమం ఎక్కడిదాకా వెళ్ళవచ్చని  ఊహిస్తున్నారు ?

జ. పిఆర్‌సి వ్యతిరేక ఉద్యమం రోజురోజుకు బలోపేతమవుతూ కొత్త, కొత్త కార్యక్రమాలను, నిరసన రూపాలను రూపొందించుకుంటూ వుంది. ఉన్న సౌకర్యాలను, హక్కులను కూడా ప్రభుత్వం హరించి వేసింది. ఈ ప్రభుత్వ కుట్రలను ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు గ్రహించినందువల్లే పిఆర్‌సి సాధనా ఉద్యమం రోజురోజుకు బలోపేతమవుతూ వుంది. ప్రభుత్వం సలహాదారులపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటూ వుంది. ఉద్యోగుల పెన్షనర్ల సమస్యలను న్యాయమైన కోర్కెలను, అనుభవిస్తున్న హక్కులను గ్రహించడంలో  వైఫల్యం చెందింది. ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ప్రభుత్వం పట్ల ఉద్యోగులలో, పెన్షనర్లలో, కార్మికులలో వున్న వ్యతిరేకత సాధారణ ప్రజలలోనికి కూడా చేరే ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని ప్రభుత్వం గుర్తించాలి.

8. ఈ ఉద్యమంపట్ల ప్రజాభిప్రాయం ఎలా ఉన్నది ? 

జ. ఉద్యోగులు, పెన్షనర్లు చేస్తున్న పిఆర్‌సి ఉద్యమంపట్ల సహజంగానే వ్యతిరేకత వుంది. ప్రభుత్వ మీడియా, ప్రభుత్వం నిర్వహించే సామాజిక ఫ్లాట్‌ఫామ్‌ సంస్థలు ఉద్యోగులను దోషులుగా చిత్రీకరిస్తూనే వున్నాయి. అయితే గత నెలరోజులుగా ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు చేస్తున్న ఉద్యమాలపట్ల కలిగిస్తున్న అవగాహన వల్ల ప్రజలలో ఉద్యోగులపట్ల వున్న వ్యతిరేకత క్రమక్రమంగా తగ్గిపోతూ వుంది. నేడు ప్రభుత్వాలు పేద ప్రజలకు అమలు చేస్తున్న ఏ పథకాలను కూడా ఉద్యోగులు వ్యతిరేకించడం లేదు. వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడానికి కృషి చేస్తున్నారు. ఉద్యోగులు చేస్తున్న పిఆర్‌సి సాధన ఉద్యమాలకు కార్మికసంఘాలు కూడా మద్దతునిస్తున్నాయి.

9. ఎప్పటిలాగే ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు మధ్య వైరుధ్యం పెంచడానికి పాలకులు ప్రయత్నిస్తున్నట్లు ఉంది కదా. దీన్ని ఉద్యోగులు ఎలా అర్థం చేసుకుంటున్నారు?

జ. నిజమే, ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు మధ్య వైరుధ్యం పెంచడానికి పాలకులు, పాలకపార్టీ కార్యకర్తలు ప్రయత్నిస్తూనే వున్నారు. ప్రభుత్వం నిర్వహించే సామాజిక మాధ్యమాల ద్వారా, ఉద్యోగులపై దుష్ప్రచారం చేస్తూ వుంది. దీనిని ఉద్యోగ సంఘాలు సీరియస్‌గా తీసుకోవాలి. తమ సమస్యను న్యాయమైన సమస్యగా, సంక్షేమ సమస్యగా ప్రజలను ఒప్పించే ప్రయత్నం ఉద్యోగ సంఘాలు చేయాలి. ఇది కొంత కష్టమైనపనే. గతంలో రైతు ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు జరిగినపుడు ఉద్యోగులు ప్రజాసమస్యలను పట్టించుకునే ప్రయత్నం చేసి వుంటే, ప్రజలు కూడా ఉద్యోగుల పట్ల సానుభూతితో వ్యవహరించేవారు. ఉద్యోగుల, ఉద్యోగ సంఘాల విషయంలో ఇది లోపమే. దీని సరిచేసుకుంటే ఉద్యోగుల ఉద్యమాలకు ప్రజలు సహకరిస్తారు.

10. ప్రభుత్వం మీద ఒత్తిడి పెడుతూనే ఉద్యమ నాయకత్వం ఈ సందర్భంగా ప్రజల దృష్టికి ఏం తీసుకొస్తే మంచిదని మీరు అనుకుంటున్నారా?

జ. అవును ఇది ఉద్యోగుల, ఉద్యోగసంఘాల తక్షణ కర్తవ్యం. వివిధ సంఘాలు, ఉద్యోగులు, తమ సమస్యలను, కరపత్రాల రూపంలో, ప్రజలతో చిన్న చిన్న సమావేశాలను నిర్వహించడం ద్వారా తమ ఉద్యమానికి వారి నుండి మద్దత్తును కూడగట్టుకోవలసిన అవసరం ఉంది. నేడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు చేస్తున్న ఉద్యమాలకు ప్రజల సహకారం లభిస్తే ప్రభుత్వాలు దిగివస్తాయి. 

ఉద్యోగులు వేరు, సాధారణ ప్రజలువేరని ప్రభుత్వం భావిస్తూ వుంది. ఉద్యోగులకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతూ వుంది. ఉద్యోగసంఘాలు ప్రజల దగ్గరకు వెళ్ళాలి. సమస్యలను వివరించాలి. వారి కోపాన్ని, ఆవేశాలను ఓపికగా భరించాలి. వారి మద్దతును కూడగట్టాలి. అప్పుడే ప్రభుత్వం దిగివస్తుంది. కాని దీన్ని ఉద్యోగ సంఘాలు ఏ మేరకు చేయగలవో గాని వీలైనంత త్వరగా ప్రారంభించాలి.

కె. ర‌త్నం ఏసేపు

డెమోక్ర‌టిక్ టీచ‌ర్స్ ఫెడరేషన్ నాయ‌కుడు

Leave a Reply