సెప్టెంబర్ మూడవ వారంలో టైమ్స్ ఆఫ్ ఇండియా టీ.ఓ.ఐ. (టాయ్) లో సౌమిత్రాబోస్ ఒక వార్త రాశాడు. మావోయిస్టులు భద్రతా బలగాలలోకి, దుర్గా వేడుకలలోకి, స్లమ్స్ లలోకి తమ శక్తులను చొప్పంచడానికి నూతన పథకం రూపొందిస్తున్నారనీ శీర్షిక పెట్టాడు. పోలీసుల, భద్రతా బలగాల ఇబ్బందులను అవకాశంగా తీసుకొని సానుభూతిపరులను సమీకరించుకోవడం; మహారాష్టలో మావోయిస్టులకు సంబంధించిన 84 అనుబంధ సంఘాల పైన ఇప్పటికీ ప్రజా భద్రతా చట్టం అమలులో వుంది; తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో ఆ చట్టాన్ని వినియోగించుకొనే పట్టణాలలో వారి ప్రమాదాన్నిలేకుండా చేశారు అనే హైలైట్స్ పెట్టాడు. ఆ పక్కనే పార్టీ భావజాలాన్ని వ్యాపింపచేయడానికి స్థానికులను లక్ష్యంగా చేసుకుంటున్నారు అనే చిన్న వార్త ఒకటి రాశాడు. ఈ వార్తలకు ఆధారం తమ చేతికందిన 63 పేజీల రహస్య ఫైల్ అంటూ వివరించాడు.
సౌమిత్రాబోస్, వార్తా కథనంలో రాసిందేమంటే, నిషేధిత భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)కు చెందిన సవివరమైన 63 పేజీల “రహస్య పైల్” ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ఆధీనంలో వుంది అంటూ వార్తను మొదలుపెట్టి పట్టణాలలోని అన్ని తరగతుల వారిలోకి అంటే గృహ సముదాయాలు (హౌసింగ్ సొసైటీలు) మొదలు పూజా వేదికలు, క్రీడా క్లబ్బులు, స్లం కమిటీలు, కార్టానాలు, విద్యా సంస్థలు, రాజకీయ మరియు ప్రభుత్వ సంస్థల వరకు తుదకు నిఘా సంస్థలు, భద్రతా బలగాలలోకి కూడా తమ శక్తులను చొప్పించడానికి ఒక చక్కని బ్లూప్రింట్ తయారుచేసుకున్నారనీ రాశాడు.
బోస్ తన కథనంలో వర్తమాన ఫైల్ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలై కూచుందని పేర్కొన్నాడు. ఆ ఫైల్ లో ప్రభుత్వ భద్రతా సంస్థల, నిఘా సంస్థల, పోలీసు, భద్రతా బలగాల కంప్యూటర్లను కూడ లక్ష్యంగా చేసుకున్నారని వివరించాడు. ఆ తరువాత బోస్ మరేం రాశాడంటే, తమ అనుబంధ సంస్థల ద్వారా పట్టణాలలోని నెట్ వర్క్ ను పటిష్టపరచు కోవాలని అనుకుంటున్నారనీ, గ్రామీణ ప్రాంతాలలోని, సబర్బన్స్ లలోని ప్రజాపునాదితో మమేకమైన తమ గెరిల్లా నిర్మాణాలను పట్టణాలతో అనుసంధానం చేసుకోవాలని అనుకుంటున్నారనీ తెలిపాడు.
ఆ వరుసనే సౌమిత్రా, ఇప్పటికే మహారాష్ట్రలో ని 84 అనుబంధ సంస్థలపై ప్రజా భద్రతా చట్టం ప్రకారం నిషేధం కొనసాగుతోందని, మావోయిస్టుల సమస్యను ఎదుర్కొంటున్నతెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లు ఈ చట్టాన్ని ఉపయోగిస్తూ వారి అనుబంధ సంఘాలను దీటుగా ఎదుర్కొంటున్నాయని వివరించాడు.
మావోయిస్టులు సమాచార సేకరణ నిమిత్తం భద్రతా బలగాలలోకి తమ శక్తులను చొప్పించి, పెంపొందించుకోవడంతో పాటు వారి ఇబ్బందులను, సమస్యలను తెలుసుకొని వాటిని అవకాశంగా తీసుకొని వారి సానుభూతిని కూడగట్టుకోవాలనీ దీర్జకాలంలో వారిని తమ వైపు మలచుకోవాలనీ కూడా తలపెట్టిన్నట్టు రాశాడు. తన చొరబాటు పథకంలో పార్టీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కూడ లక్ష్యంగా పెట్టుకుందనీ బట్టబయలు చేశాడు. “కీలక పరిశ్రమల”లో పార్టీ సెల్స్, ప్రాక్షన్ లను నిర్మించాల్సిందిగా తమ కేడర్లకు సూచించినట్టు కూడ ఆయన దాపరికం లేకుండానే రాశాడు.
సౌమిత్రబోస్ రాసిన చిన్న వార్తా ఐటమ్ లో మావోయిస్టులు ప్రత్యేకంగా రహస్య ఆత్మరక్షణా గ్రూపులను నిర్మించుకో వాలనీ, వాటిని స్దానిక అవసరాలు, పరిస్థితులకు తగిన విధంగా ఆయుధాలను వినియోగించే విధంగా ప్రతిఘటనా టెక్నిక్కులలో సుశిక్షితం చేసుకోవాలనీ వున్నట్టు రాశాడు. ముఖ్యంగా స్లమ్స్ లలో వీటిపైన కేంద్రీకరించాలని వున్నట్టు తెలిపాడు. ఈ వివరాలతో పాటు ఆయన ఆ ఫైల్ లో వుందంటూ రాసిన అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమంటే, స్థానిక గూండాలను, నేరగాళ్లను, ఈవ్ టీజర్స్ ను ఎదుర్కోవడానికి ప్రజలను ప్రోత్సహించాలని, వారిని తమ వైపు ఆకర్షించుకోవాలనీ పట్టణ కేడర్లను పార్టీ కోరినట్టు రాశాడు. పట్టణ ప్రజలు తమ భావజాలంతో రాజకీయంగా రాటుతేలాలనీ తమకు అవసరమైన అభివృద్ధిని తామే రూపొందించుకోవాలనీ, ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనీ కోరినట్టు కూడ ‘నిష్కపటంగానే’ రాశాడు. నిజానికి ఇవన్నీ చాలా మంచి విషయాలే. ఇవాల ప్రజలకు కావలసిందివే.
చివరలో మహారాష్ట్ర రాష్ట్రంలోని నక్సల్ వ్యతిరేక పోలిసు డీఐజీ సందీప్ పాటిల్ ను ఉటంకిస్తూ భద్రతా సంస్థలు నక్సలైట్ల కార్యకలాపాలపై గట్టి నిఘా వేసి వున్నట్టు తెలిపిన విషయాన్ని కూడ పేర్కొన్నాడు.
ప్రస్తుతం టైమ్స్ ఆఫ్ ఇండియా వారి స్వాధీనంలో వున్న మావోయిస్టుల 63 పేజీల రహస్య పైల్ బహిరంగమైతే అందులోని విషయాలన్నీ పబ్లిక్ డొమైన్ లోకే వస్తాయి. అపుడు ఎవరైనా వాటిని చదువుకొని వాటిని తెలుసుకోవచ్చు, తమకు తోచిన విధంగా అన్వయించుకోవచ్చు. కాని, ఇపుడు మాత్రం మనం సౌమిత్రా బోస్ గారిని అభినందించాలి. ఎందుకంటే, ఆయన అంత పెద్ద డాకుమెంటులోని విషయాలను చాలా సంక్షిప్తీకరించి స్థూలంగా పాఠకులకు విషయాన్ని వివరించడం అభినందనీయం. అలాగే, నిజంగానే మావోయిస్టులు తమ వెనుకంజ స్థితిని అధిగమించడానికి అలాంటి “రహస్య ఫైల్” ను రూపొందించుకొని గనుక వుంటే మాత్రం ఆ పథకం దేశంలోని పట్టణ వాసులకు, అనేక బాధలను, అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొంటున్న పోలీసులకు, భద్రతా బలగాల జవాన్ లకు ఊరటనిస్తుందని కూడ నిస్సందేహంగానే చెప్పవచ్చు.
రోజు రోజుకూ మన దేశంలో పట్టణాలు, పట్టణాలలో జనాభా పెరిగిపోతోంది. వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంతో గ్రామాలు తల్లడిల్లుతున్నాయి. దేశ జీడీపీలో వ్యవసాయ రంగం వాటా యేటేటా కునారిల్లుతోంది. గ్రామీణ రైతాంగం వలస పోవడం విపరీతంగా పెరుగుతోంది. కొరోనా కాలంలో వలస కార్మికులు ఎదుర్కొన్న అవస్థలు తలచుకుంటేనే గుండెలవిసి పోతాయి. తుదకు అడవులలోని పల్లెల నుండి ఆదివాసులు కూడ వందలు, వేల సంఖ్యలోనే పట్టణాలకు, నగరాలకు వలసలు పోతున్నారు. అక్కడ వారు ఎదుర్కొంటున్న బాధలు దండకారణ్యం నుండి వెలువడిన సాహిత్యం, వ్యాసాల ద్వార బాగా అర్ధం చేసుకోవచ్చు.
ఇక పట్టణాలలోని కార్మికుల, చిరుద్యోగుల, వుద్యోగుల, విద్యార్థుల, నిరుద్యోగ యువతీ యువకుల, మురికివాడలలో నివసించే అభాగ్యుల జీవితాలలోని వెతలు మీడియా, సోషల్ మీడియా ఫాలోవర్స్ కు సుబోధకమే. కోట్ల సంఖ్యలో వుంటున్న అసంఘటిత కార్మికుల జీవితాలు, గిగ్ వర్కర్ల చాలి చాలనీ బతుకులు సమాజం పట్ల వారిలో ఆక్రోషాన్ని దిన దినం పెంచుతున్నాయి. అక్కడ తాండవించే అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, అత్యాచారాలు చెప్పనలవికాని విధంగానే వుంటున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, హత్యలు నాగరికి సమాజం తలదించుకునే విధంగానే వుంటున్నాయి. పాలకులు “బేటీ పఢావో, బేటీ బఢావో” అసలు బేటీ బచావోకు అర్ధం లేకుండా తల్లి తండ్రుల గుండెలపై అమ్మాయిలు కుంపటిలా తయారవుతున్నారనీ వాపోతున్న కుటుంబాలు కోకొల్లలు. పట్టణాలలోని దారిద్ర్యాన్ని భరించలేక, విద్యా వ్యవస్థలోని పోటీని తట్టుకోలేక, చదువు ‘కొన’ లేక, చదువుకున్నప్పటికీ కొలువులు ‘కొని లేక పోతున్నపోతున్న విద్యార్థి, నిరుద్యోగ యువత పాలుపడుతున్న ఆత్మహత్యలు ఆందోళనకరంగానే తయారవుతున్నాయి.
దేశంలో అధ్వాన్నంగా తయారైన పై సామాజిక పరిస్థితులలో సౌమిత్రా బోస్ పేర్కొన్నట్టు నిజంగానే మావోయిస్టులు పట్టణాలలోని అసాంఘిక శక్తులను, గూండాలను, నేరగాళ్లను నియంత్రించడానికి, ప్రజలను జాగరూకులను చేయడానికి సిద్ధమైతే వారికి పట్టణ జనాలు హారతులు పడుతారనీ నిస్సందేహంగా చెప్పవచ్చు. వారి రాకను ఇప్పటికే సమస్యలతో అతలాకుతలం అవుతున్న ప్రజలు బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో సౌమిత్రాబోస్ రహస్య ఫైల్ ను ఉటంకిస్తూ వార్తా కథనం రాయడం, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెష్టిగేటింగ్ రిపోర్టును అందించడం మండుటెండలో నాలుగు జల్లులు రాలి వాతావరణాన్ని చల్లబరిచిన చందంగా వుంది.
మన ఉభయ తెలుగు రాష్ట్రల ప్రజలకు మావోయిస్టుల గురించి దశాబ్దాల పరిచయం, వారి పోరాటాల అనుభవం తెలిసిందే. పల్లెల నుండి ముఖ్యంగా తెలంగాణ పల్లెల నుండి దొరలు పట్టణాలకు పరుగులు తీయడం తెలంగాణ చరిత్రలో లిపిబద్దమై వుంది. రైతులకు ప్రధానంగా భూమి లేని రైతు కూలీలకు భూములు దొరికి వారికి జీవనోపాధి కలగిన విషయం పల్లె పల్లెలో మనకు కానవస్తుంది. దొరల ఆగడాలకు, గడీలలో దౌర్జన్యాలకు పల్లెల్లో కళ్లెం వేసింది వారుకాకుంటే మరెవరు? ఏ పల్లె మహిళను కదిపినా, నాలుగు దశాబ్దాల క్రితం నాటి గతమెరిగిన తల్లులను కలిసిన వారి యవ్వనంలోని పల్లెలను, పల్లి బతుకులను వాటిని తమ నెత్తుటి త్యాగాలతో మార్చిన మావోయిస్టులను కంటితడి పెట్టి గుర్తుచేసుకోవడం పల్లె పల్లెలో గుండెను కదిలిస్తుంది. ఆ పల్లెలు మావోయిస్టులను కోరుకుంటున్నాయనీ ఎన్ని సర్వేలు తెలుపడం లేదూ! తీన్మార్ మల్లన్న నుండి ఐ డ్రీం జరుపుతున్న ఇంటర్వ్యూలను తిలకించే వారికి ఈ విషయాలు విడిగా చెప్పాల్సిన పని లేదు. పార్టీ గురించి వారు ఏం చెపుతున్నప్పటికీ అత్యధికులు ప్రజలు మాత్రం అన్నలు కావాలని కోరుకుంటున్నట్టే వెల్లడిస్తున్నారు. కాకపోతే గతంలో మావోయిస్టులు చేసిన తప్పులు మళ్లీ మళ్లీ చేయకూడదనీ బహిరంగంగనే ప్రజలు సుద్దులు చెపుతున్నారు.
ఇక పట్టణాల గురించి చెప్పుకోవలసి వస్తే అన్ని పట్టణాలలో రాడికల్స్ గురించి పిల్లాదిమారిగా ఎరిగినదే. ముఖ్యంగా హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ సహ అనేక పట్టణాలలోని, నగరాలలోని యువత రాడికల్స్ తో మమేకమై వుండేవారు. సింగరేణి కాలరీస్‌లోని యువత, కార్మిక బస్తీలలోని యువత రాడికల్స్ తో ఎంతో అన్యోన్యంగా వుండేవారు. అనేక చోట్ల గూండాలను, నేరగాళ్లను, లంపెన్ శక్తులను దారికి తెచ్చింది రాడికల్స్ అనే విషయాన్ని పట్టణాలలోని వీధులను అడిగితే చాటిచెపుతాయి. ఏ వీధిలోని ఆడపిల్లలైనా నిర్భయంగా ఎంత రాత్రయినా తిరిగే వాతావరణం ఏర్పడడం వెనుక ఒక కుమార్ పల్లి, ఒక మంకమ్మతోట, అల్వాల్, వెంకటాపురం లాంటి వీధివాసులకు మళ్లీ “అన్నలు” వస్తున్నారంటే ఎంత సంబురపడుతారో రాయడానికి వారి భావాలు ఏ కలానికి అందేవి కావు. ఏ చానళ్ల వాళ్లు సర్వేలు నిర్వహిస్తున్నా ఈ నిజం వెల్లడవుతునే వుంది. పట్టణాలలో వారితో మమేకమై పని చేసిన కార్మికులు, యువత, విద్యార్థులు, విశ్రాంత వుద్యోగులు, నిరుద్యోగులు ఇప్పటికీ లక్షల సంఖ్యలోనే వుంటారు. రాజకీయాలలో ముఖ్యంగా మీడియాలో వారితో చెలిమి చేసిన శక్తులు అనేకం వున్నాయి. వారంతా రహస్య ఫైల్ కోసం టైమ్స్ ఆఫ్ ఇండియాను సంప్రతించి సంపాదించుకుంటే సౌమిత్ర రాయని బోలెడు విషయాలు బోధపడుతాయి.
మావోయిస్టులు భద్రతా బలగాలలోకి తమ శక్తులను చొప్పించాలనీ అనుకోవడం అద్భుతంగా వుంది. ఒకవైపు అగ్నిపథ్ పథకంతో పట్టణాలు మండుతుంటే, అగ్నివీరులకు ఈ వార్త నిజంగానే ఉపశమనాన్నిస్తుంది. నాలుగేళ్ల ఒప్పందంపై వేలాది యువతను సైన్యంలోకి భర్తీ చేసుకోవడం ప్రారంభమైన నేపథ్యంలో ఉద్యోగాలకు వుద్వాసన చెప్పక తప్పని మూదొంతుల అగ్నివీరులు సమాజంపైబడి ఏ ఘాతుకాలకు పాల్పడుతారోననే ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితులలో మావోయిస్టుల “రహస్య ఫైల్ వార్తలకు ఎక్కడం వుద్యోగాలు కోల్పోక తప్పని అగ్నివీరులకు భవిష్యత్ బాటను అందించినట్టవుతోంది. వారు నాలుగేళ్లు సాయుధ శిక్షణ పొందాక వారు తమ సమస్యల సమూల పరిష్కారానికి గెరిల్లాల గురించి తెలుసుకునే అవకాశాన్ని ‘రహస్య ఫైల్ కల్పిస్తుందని ఆశిద్దాం. ఏ సాయుధ బలగం ఎవరి కోసం పని చేస్తుందో, ఏ సాయుధ సైన్యం ఎవరిని రక్షిస్తుందో, ఏ వర్గాల ప్రయోజనాలను నెరవేర్చడానికి ఆయుధాలు ధరిస్తున్నారో ఆచరణయుక్తంగా తెలిసి వస్తుంది. ఎవరు దేశభక్తులు? ఆ పేరు మీద ఎవరు దేశాన్ని సామ్రాజ్యవాదులకు, బహుళ జాతి కార్పొరేషన్‌లకు, అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారో “హం దోనో, హమారే దోనొ అంటూ వాస్తవాన్ని చక్కగా కాయిన్ చేసినదాని వెనుక నిజాలు బోధపడుతాయి. కాబట్టి వారు తక్షణమే సౌమిత్రాబోస్ ను అడిగి ఆ రహస్య ఫైల్ సంపాదించి అందులోని వాస్తవాలను అవగతం చేసుకోవాలి.
ఇక ఇపుడు నిజానికి మనం అసలు రహస్య ఫైల్ అంటూ ఒకటి ఆ విప్లవపార్టీకి వుందా! అలాంటిది రాజకీయంగా దేశంలో విప్లవాన్ని ఆశించే పార్టీకి వుంటుందా!! అనేది మనం ఆలోచించాల్సిన మౌలిక విషయం. నిజానికి మావోయిస్టుల విప్లవ రాజకీయాలకు రహస్య మేముంటుంది? వారి రాజకీయాలు బహిరంగమే. వారి దస్తావేజులు తమ చేతికి చిక్కిన పోలీసులే చాలావరకు వాటిని అంతర్జాలంలో పెడుతూ వచ్చారు. కొన్ని సందర్భాలలో తమకు అందిన పిదప ఆలోచనాపరులో కుతూహలపరులో వారి దస్తావేజులను అంతర్జాలంలో పెట్టడం కూడ జరిగింది. కానీ, ఇపుడు అధికారికంగానే పార్టీ తమ దస్తావేజులన్నీ అందరికీ అందుబాటులో వుండేలా అంతర్జాలంలో పెట్టడం ప్రారంభించింది. పార్టీ దస్తావేజులను అధ్యయనం చేసిన వారికి సౌమిత్రాబోస్ రాసిన విషయాలన్ని సుబోధకమే. ఇవే కావు, ఇంకా చాలా చాలా విషయాలు వారి దస్తావేజులలో ఎలాంటి దాపరికం లేకుండానే రాసుకున్నపుడు కొత్తగా ఇపుడేదో రహస్య ఫైల్ అంటూ సంచలనవార్తను తెరకెక్కించడం వెనుక నిగూఢంగా వున్నదురాలోచనలను మనం గ్రాహ్యం చేసుకోవాలి.
పోలీసుల, భద్రతా బలగాల సైనిక చర్యలలాగే మావోయిస్టుల మిలిటరీ చర్యలు కూడ రహస్యంగానే వుంటాయనేది ఏ కొద్దిగా వివేచనం చేయగలిగేవారికైనా సులబంగానే తెలిసే విషయం. పోలీసులు, భద్రతా బలగాలు సైతం సమాచార ఆధారిత దాడులంటూ చేస్తున్న సైనిక చర్యలు కూడ రహస్యంగానే కొనసాగుతున్నాయనేది వాస్తవం. అందుకే యుద్ధంలో మోసాలకు హద్దులుండవంటారు. రెండు వైపులా సైన్యాలున్నపుడు అందులో బలహీనమైన సైన్యం, గెరిల్లా యుద్దతంత్రాన్ని కొనసాగిస్తున్నపుడు పరమ రహస్యంగా వుండక తప్పదు. అంతే తప్ప సౌమిత్రాబోస్ రాసిన విషయాలలో ఏ ఒక్కటీ రహస్యమైనది కాదని గమనించాలి. కానపుడు మరి ఇపుడెందుకింత హడావుడి మొదలైంది? ఈ కుట్రలను మనం ఛేదించాలి.
గత కొద్ది మాసాలుగా సంచలనాన్ని సృష్టిస్తున్న వార్త ఏమంటే మరో విడుత దేశవ్యాపిత అరెస్టులకు ఎన్‌ఐఏ రంగం సిద్దం చేసిందనేది అనేక మార్గాల ద్వార వింటున్నాం. ఇప్పటికే రెండు విడుతలలో పెద్ద ఎత్తున అర్బన్ మావోయిస్టులను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ మూడో విడుత అరెస్టులకు నడుం బిగించిందనీ, దేశ వ్యాపితంగా ఎన్‌ఐఏ కొనసాగిస్తున్నదాడులు అందులో భాగమేననీ చాలా మంది చెప్పుకుంటున్నారు. అనేక రాష్ట్రాలలో, అనేక మంది ఇళ్లపై వారి దాడులు ఎడతెరిపి లేకుండా కొనసాగుతునే వున్నాయి. ఆ దాడులలో నిషేధిత పార్టీకి సంబంధించిన రహస్య దస్తావేజులు, ఎలక్ట్రానిక్ గాడ్డెట్స్ (పెన్ డ్రైవ్ లు, మైక్రోచిప్స్, ఎస్.డీ కార్డులు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు మున్నగునవి) దొరుకుతున్నాయని, ఉగ్రవాద సంస్థలతో సంబంధమున్న పత్రాలు లభిస్తున్నాయని మసాలాలు దట్టించిన వార్తలు మీడియాకు అందించడం చూస్తున్నాం. ఈ దాడులకు, టీ.ఓ.ఐ. (టాయ్)వెల్లడించిన రహస్య ఫైల్ కు మధ్యగల అవినాభావ సంబంధం ఏంటి? ఇది చాలా కీలకమైన ప్రశ్న.
గతంలో మహారాష్ట్ర పోలీసులు సహ కేంద్ర నిఘా సంస్థలు ఒక హాస్యాస్పదమైన కేసును ముందుకు తెచ్చాయి. వారు కొన్ని నకిలీ పత్రాలను (ఇలాంటి రహస్య పఫైల్సే) సృష్టించి వాటిలో దేశ ప్రధాని మోదీ హత్యకు పథకం రూపొందించిన వివరాలు వున్నాయంటూ వెల్లడించారు. ఆ పత్రాలు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ ( దీపక్) తన జ్యేష్ట సోదరుడైన దేశంలో ప్రముఖ మేధావీ డాక్టర్ ఆనంద్ తేల్తుంట్లేకు రాసినట్టు, అందులో మోదీ హత్యకు పథకం రూపొందించినట్టు ఆరోపించారు. ఆ హత్య పథకాన్ని అమలు చేయడానికి ఇంకా అనేక మంది పేర్లను కూడ ఆ పత్రాలలో పేర్కొన్నారనీ వారు ఆరోపించారు. వారంతా దేశంలోని ప్రముఖ ప్రజాహిత మేధావులు, సామాజిక కార్యకర్తలు, వకీళ్లు, ప్రొఫెసర్లు, రచయితలు, కళాకారులే కావడం గమనార్హం! ఆ నకిలీ పత్రాల సృష్టిపై దేశంలో తీవ్రమైన నిరసన వెల్లడైంది. ఆ పత్రాలలోని వాస్తవాలను వెల్లడిచేయడానికి స్వచ్భందంగానే అనేక దర్యాప్తు సంస్థలు ముందుకు వచ్చాయి.
అమెరికాలోని గుర్తింపు పొందిన దర్యాప్తు సంస్థ ఆ పత్రాలు కేవలం కల్పితాలేనని వాటి నిగ్గు తేల్చింది. అయినప్పటికీ, దేశ పాలకులు ముఖ్యంగా హిందుత్వ శక్తులు నేటికీ వాటిని నిజమైనవిగానే దబాయిస్తూ ఆరోపితులందరినీ ముంబాయిలోని తలోజా జైలులో బందించారు. దేశ వ్యాపితంగా 16 మందిని అరెస్టు చేసిన ఆ కేసు భీమాకోరేగాం కేసుగా ప్రపంచ వ్యాపితంగా తెలిసిపోయి భారత పాలకుల కుట్రలను బహిర్గతం చేసింది. బీకే-16గా కోర్టు భాషలో వ్యవహరిస్తున్న ఆ కేసులో 83 సంవత్సరాల ఫాదర్ స్టాన్ సామి జైలు అధికారుల నిర్లక్ష్యానికి, ఎన్‌ఐఏ వారి కక్ష సాధింపు చర్యలకు బలై కటకటాల వెనుక సరైన చికిత్స అందని ఫలితంగా విచారణలోనే కన్ను ముశాడు. 80వ పడిలో వున్న ప్రముఖ రచయిత వరవరరావు, ఆరు పదులు దాటుతున్న ప్రముఖ వకీలు, చత్తీస్ గఢ్ ముక్తి మోర్చా కార్మికుల నేత్రి సుధా భరద్వాజ్ లు ముంబాయి దాటకూడని షరతులపై బెయిల్ పై వున్నారు. మిగితా వారంతా అత్యంత నికృష్టమైన జైలు వాతావరణంలో అండా సెల్స్ లలో బందీలుగా వున్నారు. వారిలో హక్కుల కార్యకర్త గౌతం నవల్టా తీవ్ర అనారోగ్యాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ అనుభవం వెలుగులో ఇపుడు ఎన్‌ఐఏ తిరిగి రహస్య దస్తావేజును సృష్టించి వుంటుందని భావించడం సహేతుకంగానే వుంటుంది. ఈ రహస్య ఫైల్ మూడవ విడుత దేశ వ్యాపిత అరెస్టులకు ఆరంగేట్రం కానుందా!?
బీకే-15తో పాటు దేశ వ్యాపిత జైళ్లలో మగ్గుతున్న వేలాదిమంది విప్లవకారుల విడుదలకు ఇటీవలే దాదాపు 6 మాసాలకు పైగా అంతర్జాతీయ కేంపెయిన్ నడిచింది. 23 మార్చ్ ప్రముఖ జాతీయ విప్లవకారులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల అమరత్వ దినం నుండి 13 సెప్టెంబర్ వారి సహచరుడు జాతీయ విప్లవకారుడు అమరుడు జతీంద్రనాథ్ దాస్ అమరత్వ దినం వరకు అనేక దేశాలలో భారతదేశ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలనీ నినదించారు. వారిని రాజకీయ ఖైదీలుగా గుర్తించాలనీ డిమాండ్ చేశారు.
మన దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి అది వరుసగా కుట్ర కేసులను ఎదుర్కొంటునే వుంది. లాహోర్ కుట్రకేసు, కాన్పూర్ కుట్ర కేసుల నుండి రాంనగర్ కుట్ర కేసు, సికిందరాబాద్ కుట్ర కేసు ఆ వరుసన నూతన సహస్రాబ్దంలోని రెండవ దశాబ్దంలో మోదీ హత్య కేసు వరకు కమ్యూనిస్టు పార్టీ దాని నుండి చీలిపోయిన ఈ నాటి మావోయిస్టుల వరకు గడచిన 97 సంవత్సరాలలో అనేక కుట్ర కేసులను ఎదుర్కొన్న అనుభవాలు వున్నయి. ఏ దేశంలోని దోపిడీ వర్గాలైనా విప్లవకారులంటేనే హడలి పోతుంటాయి. బ్రిటిష్ వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్న మన దేశ దళారీ పాలకులు కుట్ర కేసులను, రాజద్రోహ చట్టాలను యధాతథంగా కొనసాగిస్తున్నారు. వారి దోపిడీ విధానాలను నిర్యంద్వంగా బట్టబయలు చేసేది విప్లవ పార్టీలే కాబట్టి వాటి ఉనికిని దోపిడీ పాలకవర్గాలు భరించలేక పోతున్నాయి. వారిని సమూలంగా నిర్మూలిస్తామనీ బహిరంగంగా ప్రకటిస్తూ భారత రాజ్యాంగం బూచీతో నిరంకుశ చట్టాలను రూపొందిస్తూ దేశంలోని ప్రముఖ మేధావులను, హక్కుల కార్యకర్తలను, సామాజిక కార్యకర్తలను అంతమొందించడానికి ఇలాంటి పత్రాలను సృష్టించడం వారి పిరికితనాన్ని చాటుతుంది. వారిని సైద్దాంతికంగా, ఆలోచనా పరంగా ఎదుర్కోలేని దోపిడీ పాలకులు వారిని చట్టాల మాటున, సైనిక అణచివేత కేంపెయిన్ ల ద్వారా భౌతికంగా నిర్మూలించడానికి తలపడడం వారి దోపిడీ నైజాన్ని, విప్లవకారుల నిఖార్సయిన నిజాయితీనీ, త్యాగాలను వర్తమాన, భవిష్యత్ తరాలకు ఆదర్శం చేస్తుంది. అనుసరణీయం అంటుంది.
అయితే టాయ్ వారికి చిక్కిన ఆ రహస్య ఫైల్ ఏదో బయట పెడితేనే కానీ దాని సాధికారత ఎంతో. వెల్లడి కాగలదు. అప్పటివరకు చోటు చేసుకునే విపరణామాలను ధైర్యంగా ఎదుర్కొందాం. “చెఅసాలలు, ఉరికొయ్యలు వెలుగును బందించలేవు, ప్రతి నిముషం పోరాడే ప్రజలను భయపెట్టలేవు” అంటూ అమరకవి చెరబండరాజు చెప్పిన సత్యం నేటి హిందుత్వ పాలకులకు వ్యతిరేకంగా పోరాడే ప్రతి శక్తికి అనుసరణీయమవుతుంది.