పాలస్తీనా భూభాగం లోని ‘జెనిన్’ అనే శరణార్థి శిబిరం మీద ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దారుణమైన దాడి గురించి, దాని పరిణామాల గురించి అరబిక్ భాషలో దృశ్యీకరించిన డాక్యుమెంటరీ చిత్రం “జెనిన్ జెనిన్”. దీని స్క్రిప్ట్ రచన, దర్శకత్వం మొహమ్మద్ బక్రీ నిర్వహించారు. ఈ చిత్ర నిడివి 54 నిమిషాలు.
“జెనిన్, జెనిన్” అనే డాక్యుమెంటరీ చాలా విషాదకరమైన వినాశనకరమైన ‘జెనిన్ యుద్ధం’ గురించి దృశ్య మాధ్యమంలో హృదయ విదారకంగా చిత్రీకరించబడింది. ఇది పాలస్తీనా వెస్ట్ బ్యాంక్ లోని జెనిన్ శిబిరం ప్రజలతో పూర్తిగా దర్శకుడు జరిపిన ఇంటర్వ్యూల ద్వారా కథకుడు లేకుండా చెప్పడం చూస్తారు ప్రేక్షకులు. వివిధ వయసుల వారితో జరిపిన ఇంటర్వ్యూలు ప్రధానంగా బాధాకరమైన పాలస్తీనా ప్రజల భరించలేని వ్యధలను ప్రేక్షకుల కళ్ళకు సజీవంగా చూపుతాయి!
చిత్ర నేపధ్యంలోకి వెళ్తే ఇజ్రాయెల్ సైన్యం జెనిన్ లోని పాలస్తీనా శరణార్థి శిబిరంపై 2002 లో దాడి చేసింది. ఈ దాడి సమయంలో భద్రతా కారణాల వంకతో జర్నలిస్టులను గానీ, మానవ హక్కుల సంస్థలను గానీ శిబిరంలోకి ఇజ్రాయెల్ మిలటరీ అనుమతించ లేదు. దాడి తరువాత కొన్ని రోజులు జెనిన్ శిబిరం మూసి వేయబడింది. పెద్ద పెద్ద భవనాలను ప్రొక్లైనర్లతో కూల్చివేసి పౌరులను వారి ఇళ్లలోనే సజీవంగా ఖననం చేసిన కథలు, మృతదేహాలను శిధిలమైపోయిన భవంతుల ధూళి కింద కప్పెట్టిన కథనాలు అరబ్ ప్రపంచ మంతటా దావానలంలా వ్యాపించాయి. శిబిరంలో కొన్ని వేల మందికి పైగా ప్రజలను ఇజ్రాయెల్ మిలటరీ ఊచకోత కోసి, పాలస్తీనియన్ల మృతదేహాలను లాగిపడేసి, సామూహికంగా శిధిలమైన భవనాల కింద పాతిపెట్టిందని పాలస్తీనా సీనియర్ అధికారి అహ్మద్ అబ్దెల్ రెహ్మాన్ వెల్లడించారు. యునైటెడ్ నేషన్స్ నిజ నిర్ధారణ మిషన్ ఈ మారణహోమం పట్ల ఆగ్రహించి జెనిన్ శిబిరంలోకి ఇజ్రాయెల్ ప్రవేశాన్ని నిషేధించింది!
ఒక పౌరుడు “మేము మా సొంత గూడు నిర్మించుకున్న ప్రతిసారీ వాళ్ళు దానిని నాశనం చేస్తారు, ఒక బిడ్డ పుట్టిన ప్రతి సారీ వాళ్ళు ఆ బిడ్డను వెంటనే చంపేస్తున్నార”ని చెప్పారు. ఒకమూగ మనిషి జరిగిన విధ్వంసాన్ని తన సైగలతో చూపుతుంటాడు.
ఈ చిత్రంలో పాలస్తీనా ప్రజల్లోని ఒక పౌరుడు ప్రముఖంగా ఎక్కువసార్లు కనిపించి జెనిన్ శిబిరం మీద జరిగిన భయంకరమైన దాడుల్ని వివరిస్తారు. ఆయన “ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, స్నిప్పర్ల (పొంచి ఉండి, గురిచూసి తుపాకులు పేల్చే ఆయుధాలు) తో 8 రోజులు ఎడతెరిపి లేకుండా బాంబులు వేశారు. సముద్రం దగ్గర జెనిన్ ఉండి ఉంటే, వాళ్ళు ఖచ్చితంగా తమ నౌకాదళాన్ని ఆశ్రయించి సర్వ నాశనం చేసేవాళ్ళు. జెనిన్ తీరంలో లేనందుకు ఈ మాత్రమైనా మేము మిగిలి ఉన్నందుకు దేవునికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. చివరికి, వాళ్ళు మమ్మల్ని పహారా కాసేందుకు మూడు బెటాలియన్లను పంపారు. వాళ్ళ రక్షణ మంత్రి షాల్ ముఫాజ్ (Shaul Mofaz) తో వచ్చి దాడులను వాళ్ళు మరింత ముమ్మరం చేశారు. వాళ్ళు బుల్డోజర్లతో సహా వచ్చి ఇళ్ళతో పాటు వాటిలో నివశించే మనుషుల్నీ చంపేశారు. యుద్ధ విమానాలు పై అంతస్తులను కొట్టి కూల్చివేసాయి. నిద్రిస్తున్న ప్రజలు నిద్రలోనే తుది శ్వాస విడిచారు”- అని చెప్పారు.
ఒక వృద్ధుడు ‘అర్ధరాత్రి నేను నిద్రలో ఉన్నప్పుడు అక్కడి ఒక పాఠశాల ప్రాంగణంలో అందరూ గుమిగూడాలని లౌడ్ స్పీకర్లలో వినిపించింది. నేను ఆ వేళప్పుడు లేచి రాలేనని చెప్పాను. నన్ను చంపేస్తానని ఇజ్రాయెల్ సైనికుడు బెదిరించాడు. ఆ వెంటనే అతను నా పాదాలకు గురిపెట్టి కాల్చాడని రోదిస్తూ చెప్తారు.
మరొక వృద్ధుడు వాళ్ళు ఇష్టపడినా, ఇష్టపడక పోయినా మేము శిబిరాన్ని పునర్నిర్మించి తీరతాం. అమెరికా యుద్ధం వల్ల వియత్నాం కూడా ఇంతగా పరాయితనాన్నీ, దుఃఖాన్నీ అనుభవించలేదేమో! ఏ అరబ్ దేశం కూడా మాకు మద్దతుగా నిలవని పరిస్థితుల్లో, మాకోసం ఎవరూ ఏమీ చేయలేక పోతున్నప్పుడు, మీ చిత్రీకరణ వల్ల ప్రయోజన మేమిటి అనడుగుతాడు.
కూల్చబడిన ఇళ్ళు, దుమ్ముతో నిండి కనిపిస్తుంటాయి. మరొక పౌరుడు “15 సం. ల, 6 నెలల, 15 రోజులు జైల్లో ఉన్నానని చెప్పడం మొదలు పెడతాడు. మూడున్నరేళ్ల క్రితం విడుదలయ్యానని చెప్తాడు. మేము ప్రజాస్వామ్యవాదులం కాదనీ, నాగరికత అంటే ఏమిటో తెలియని అనాగరికులమని, నాసిరకం ప్రజలమని ఇజ్రాయెల్ వాళ్ళు అంటున్నారు. మేమెప్పుడు ఊపిరి పీల్చుకోవాలో కూడా వాళ్ళే మాకు చెప్తామంటే ఎలా కుదురుతుంది? వారి దయా దాక్షిణ్యాల మీద ఆధార పడకుండా మా బతుకు మమ్మల్ని బతకనివ్వవచ్చు కదా? మా నిత్యజీవితాల కవసరమైన నీటి కోసం కూడా వాళ్ళ మీద ఆధార పడవల్సిందే. ఇదెంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. నా విముక్తి తరువాత కొత్తిల్లు కట్టుకున్నాను. దాన్ని వెంటనే కూల్చేశారు. నేను నిర్మించిన వన్నీ ధ్వంసం చేశారు. వారు మా ఆశలు, మా ఆశయాలన్నింటినీ బద్దలు కొట్టారు. మేమేం చెయ్యాలి? ఇప్పుడు నాకు పిల్లలు పుట్టారు. నా పిల్లల్ని పెంచుకోవాలనీ, బాగా చదివించుకోవాలనీ కలలు కంటున్నాను. నేను ఆక్రమణల కాలంలో పుట్టాను, ఇప్పటికీ విముక్తి లేదు. నా పిల్లలకి నాలాంటి కష్టం రాకూడదు. దీని కొక అంతం కావాలం”టాడు. అతను ముద్దులొలికే పసిపిల్లల్ని స్ట్రోలర్లో వేసుకుని, దాన్ని తోసుకుంటూ శిబిరంలోని చిన్న చిన్న గుడారాల దగ్గరికి వెళ్ళడం కనిపిస్తుంది. పసి కూనలు స్ట్రోలర్లో రాగాలు తియ్యడం ప్రేక్షకులకు వినిపిస్తుంది!
పౌరుడితో పాటు ఈ సినిమాలో పది, పన్నెండేళ్ళ ఒక పాప మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ అత్యంత సాహసోపేతంగా తన అభిప్రాయాలను వ్యక్తం చెయ్యడం చూస్తారు ప్రేక్షకులు. మాదైన ఇంటికి తిరిగి వెళ్లాలన్నదే నా గొప్ప కోరిక అంటుందీ పాప. ఈ బాలిక పెద్దవాళ్ళ కంటే ఎక్కువగా ఇజ్రాయెలీల పట్ల తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. బాలిక మాటల్లో “ఈ శిబిరం కోసం నేను నా జీవితాన్ని త్యాగం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. నాకూ, ఇందులో నివశిస్తున్న మా అందరికీ ఈ శిబిరం అంటే మాకు మా జీవిత సర్వస్వం. మా సామూహిక ఆనందాలు, దుఃఖాల కలబోతకు చిహ్నంగా నిలిచే ఈ శిబిరం మా ఆత్మ. జెనిన్ శిబిరం ఎప్పటికీ మా దృష్టిలో ఉన్నతంగా, గర్వంగా నిలుస్తుంది. ఎప్పుడైనా సరే, శిబిరంలోని ప్రతి వారూ వారి బంధువు కోసమో, వారి ధ్వంసమైన ఇంటి ఆచూకీ కోసమో, కనిపించకుండా పోయిన మనిషి శవం కోసమో నిరంతరం వెతుక్కుంటూ ఉండడం మీరు చూస్తారు. బాధపడని ఒక్క వ్యక్తి కూడా శిబిరంలో మీకు దొరకరు. కానీ ఇజ్రాయెలీలు భావిస్తున్నట్లు మేము దేన్నీ వదులుకోము. వారు అన్నింటినీ నాశనం చేసేశారు. కాని వారి కళ్ళముందే మేము వాటన్నిటిని పునర్నిర్మిస్తాం! మేము మా ప్రతిఘటన ఆధారంగా ప్రతిదాన్నీ పునర్నిర్మించి, మా జెనిన్ క్యాంప్ నిరసననూ, పోరాట దీక్షనూ షారొన్ సాదెహ్ (Sharon Sadeh) తన జీవితమంతా గుర్తుచుకునేలా చేస్తాం! షారొన్ సాదెహ్ ఈ డాక్యుమెంటరీ చిత్రీకరణ సమయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి. ఆయన సారధ్యంలో ఈ దాడులు జరిగాయని బాలికకు ఆయన మీద చాలాకోపంగా ఉంటుంది!
వాళ్ళు జంతు హక్కుల గురించి మాట్లాడతారు గానీ ఏ పాపం ఎరుగని కానరీ పక్షులను అతి కిరాతకంగా చంపేశారంటూ మొదటి పౌరుడు ఆవేదనతో మాట్లాడతారు. వాస్తవానికి, మనుషుల్ని చంపినప్పటి కంటే జంతువుల్ని చంపినప్పుడు పాశ్చాత్య ప్రపంచం ఎక్కువ ఆందోళన చెందుతూ ఉలిక్కి పడుతుంది. ఈ అరబ్ ప్రభుత్వాలు తమ సంఘీభావాన్ని కాగితాలపై మాత్రమే చూపిస్తాయి. వాళ్లు మద్దతు నిస్తున్నట్లు నటిస్తారంతే! వాళ్లు కేవలం కపటవాదులు, నిజానికి వాళ్లు బుష్ అనుచరులు అని చెప్తారు. మళ్ళీ ఆయనే ‘జైళ్లు, కాన్సంట్రేషన్ క్యాంపులు, అణచివేతలు, దౌర్జన్యాలు చేసే ఇజ్రాయేల్ సైనికుల్ని నేను ఏడేళ్ళ వయసు నుంచి చూస్తున్నాను. ప్రపంచం నుంచి ఎన్ని రకాల నిరసనలు వచ్చినా వాళ్ళు విననట్లే, పుట్టు చెవిటి వాళ్ళలా ప్రవర్తిస్తారు. మమ్మల్ని పైశాచిక దాడుల పాలు చేశారు. 10,000 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో 1000 మంది యూదులు నివశిస్తుంటే, మేము మాత్రం 13000 మందిమి అర చదరపు కిలోమీటర్ పరిధిలో నిత్య సమరంలో బతుకులు వెళ్ళదీస్తున్నాం. ఈ ప్రాంతాన్ని తిరిగి మేము పొందేలా ప్రపంచ దేశాలన్నీ మాకు మద్దతు తెల్పి న్యాయం చెయ్యాలి. వాళ్లు మమ్మల్ని జంతువుల్లా చూడాలని కోరుకుంటారు. కుక్కలు కూడా తమను తాము వ్యక్తీకరించు కోవడానికి పెద్దగా మొరుగుతాయి. మేము అలా నిరసన తెల్పడానికి కూడా వీళ్ళ నియంతృత్వం ఒప్పుకోదు!
తర్వాత ఇంటర్వ్యూలో జెనిన్ హాస్పటల్ డాక్టర్ మాట్లాడారు, “ తెల్లవారుజామున 3 గంటలకు ఇజ్రాయెల్ ట్యాంకులు 11 క్షిపణులతో పేలుస్తూ ఆసుపత్రిపై బాంబు దాడి చేశారు. వారు ఆక్సిజన్ సీసాలు, నీటి గొట్టాలు, డ్రైనేజ్ పైపులు, హాస్పిటల్ వార్డులు, వైద్యుల గదుల నన్నిటినీ, ఇన్ఫార్మరీ, వెస్ట్ వింగ్ మొత్తాన్నీ ధ్వంసం చేశారు. గ్యాస్ ఆక్సిజన్ తో కలిసిపోతే అది పెద్ద పేలుడుకు కారణమవుతుందనీ, అది మొత్తం ఆసుపత్రిని మాత్రమే కాకుండా చుట్టు పక్కల ఇళ్లను కూడా నాశనం చేస్తుందనీ ప్రతి ఒక్కరం విపరీతమైన భయాందోళనలకు గురయ్యాం. నేను వెంటనే జరుగుతున్న భీభత్సమైన పరిస్థితిని వివరిస్తూ రెడ్‌క్రాస్ ను సంప్రదించాను. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రెడ్‌క్రాస్ వారు తిరిగి ఇజ్రాయెల్ అధికారులకు తెలియజేయడం వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. హాస్పటల్ బయట భారీ షెల్లింగ్ ల కారణంగా విద్యుత్ వైఫల్యంతో జనరేటర్ కూడా పని చేయలేదు. యుద్ధ విమానాలు ప్రతి మూడు నిమిషాలకు తమ క్షిపణులను ప్రయోగించాయి. షెల్లింగ్ మరింత తీవ్రతరం కావడంతో గందరగోళం తారాస్థాయికి చేరుకుంది. ప్రతి వస్తువూ, మనుషులూ కాల్పుల బారినపడి విధ్వంసమై పోతున్నప్పటికీ కౄరమైన ఇజ్రాయెల్ అధికారులు మాత్రం అగ్నిమాపక దళ ప్రవేశాన్ని అనుమతించలేదు. మాతో పని చేస్తున్న డాక్టర్ ఖలీల్ ఒక క్షిపణి బారిన పడి మేము చూస్తుండగానే 10 కిలోల ముద్దగా మారిపోయారు! “- అని చెప్పారు!
మరొక డాక్టర్- నేను చాలా మందిని క్షిపణుల దాడి నుంచి రక్షించాను. కాని నా కొడుకు అమీద్ మీద తూటాలు పేలి విపరీతమైన రక్తస్రావంతో విలవిల లాడుతూ ప్రాణాలు విడుస్తుంటే రక్షించుకోలేక నిస్సహాయమై పోయానంటూ విలపిస్తూ చెప్తారు!
మళ్ళీ మొదటి పౌరుడు, ‘మా మహిళల్ని స్కర్టులు పైకెత్తమని వారు ఆదేశించారు. మా బట్టలు విప్పారు. మా లోదుస్తులను ఉంచమని మేము వారిని ప్రార్ధించాం. కానీ వారు మా వేడుకోళ్ళను నిరాకరించారు. ఇంతకంటే భయంకరమైన దృశ్యాలు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయా?…
ఈ భయానక విధ్వంసం వల్ల ఎక్కువగా నష్టపోయేది ఇజ్రాయెల్ మాత్రమే! పాలస్తీనా ప్రజలు ఎంతమాత్రమూ కాదు. వాళ్ళు నాశనం చేసిన వాటినన్నిటిని మేము పునర్నిర్మించుకుంటాం. మాకు జరిగిన మానవ నష్టాలకు పరిష్కారంగా మా వితంతువులు మళ్లీ వివాహం చేసుకుంటారు. మా పాలస్తీనీయులకు ఎక్కువ మంది పిల్లలు పుడతారు. కానీ అసలు దేశమనేదే లేని యూదులు తమకు ఆశ్రయ మిచ్చిన పాలస్తీనాలో అన్యాయంగా, దుర్మార్గంగా ఇజ్రాయెల్ గా ఆవిర్భవించి పాలస్తీనా దేశాన్ని కొల్లగొట్టి మా నివాసాలు, ధన, ప్రాణ నష్టాలకు పాల్పడుతూ ప్రపంచవ్యాప్తంగా పోతున్న పరువునీ, జరిగిపోతున్న కాలాన్నీ ఇజ్రాయెల్ ఎలా వెనక్కి తెచ్చుకోగలదు? ముందుగా మేము వారితో కలిసి జీవించడాన్ని సహించాం. మా స్వంత పిల్లల్నిచూసుకున్నంత ప్రేమగా చూస్తూ సహకరించాం. కానీ వారు మాకెంత నమ్మకద్రోహం చేశారు? వారు చేస్తున్న ఘోర కృత్యాలకు ఎలాంటి పరిహారం చెల్లించి, జరిగిన భీభత్సాన్ని భర్తీ చేయగలరు? మా హృదయాల్లోని ద్వేషాన్ని, కఠినమైన భావాలను ఎలా చెరిపి వేయగలరు? మేము రాజీపడే సమస్యే లేదు. కొట్లాడుతూనే ఉంటాం. వాళ్ళను ఖచ్చితంగా ఓడించి తీరతాం! మమ్మల్ని రకరకాల పీడనలకు, చిత్రహింసలకు గురి చేసి, సర్వనాశనం చేస్తున్నప్పటికీ మేము కోల్పోయిన మా మాతృభూమిని తిరిగిపొందాలనే మా ఆకాంక్షల్ని సదా మా మనసుల్లో వెలిగించి ఆరిపోకుండా నిలిపేది మాత్రం మా మహిళలూ, చిన్నారులే’- అని నమ్మకంగా, బలంగా చెప్పారు!
ఒక మహిళ “ఎనిమిది నెలల గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా నన్ను పట్టి ఈడ్చేశారు. కాలిమీద తుపాకీతో కాల్చారు. ఎలా బతికి బయట పడ్డానో గానీ కళ్ళు తెరిచే సరికి నేను జెనిన్ హాస్పటల్లో ఉన్నాను”- అని తన ఆవేదననూ, ఆక్రోశాన్నీ వెళ్ళగక్కేటప్పుడు దుఃఖంతో పూడుకుపోయిన ఆమె గొంతు గద్గదిక మయింది!
మొదటిపౌరుడు – మా పిల్లలు ఈ భయానక పరిస్థితులకు ఎక్కడ మూర్ఛల లాంటి అచేతనావస్థలలోకి వెళ్ళిపోతారోనని, మానసిక స్థబ్తతతో విషాదంలోకి కూరుకు పోతారోనని తెగ బెంబేలుపడిపోయాం. కాని మా అదృష్టం. వాళ్ళలా లేకపోగా పైపెచ్చు మాకే చాలా ధైర్యం నూరిపోసేలా నిబ్బరంగా ఉన్నారు! ఇజ్రాయెల్ ఆక్రమణల గురించి మా పిల్లలు ఏమనుకుంటున్నారో మీరు ఏ బాల బాలికల్ని అడిగినా వారు నమ్మకంగా, బలంగా సమాధానం ఇస్తారు. గంపెడాశల్నీ, కలల్నీ నింపుకుని కోల్పోయిన తాత, ముత్తాతల వారసత్వంగా వచ్చిన మాతృస్థలాలను తిరిగి సాధించాలనే పట్టుదలతో ఉన్న మా చిన్నారుల ఉడుంపట్టును ఎవరూ సడలించలేరు…
ఏ మానవీయ స్పందనలూ, అనుభూతులూ లేని కౄరమైన ఇజ్రాయెలీలు శిబిరంలోని కొంతమంది మానసిక వికలాంగులైన పిల్లల్నీ, మహిళల్నీ పురుగుమందు పిచికారీ చేసి చంపేశారు అని చెప్తారు.
ఇద్దరు చిన్న చిన్న పాపలున్న దగ్గరకు డైరెక్టర్ వచ్చి, “మీదగ్గర మిలియన్ దీనార్లు ఉంటే మీరేం చేస్తారు?” అని అడుగుతారు. ఒక పాప శిబిరాన్ని పునర్నిర్మించడానికి, రక్తాన్ని కొనడానికి, గాయపడిన వారికి వైద్య మందించడానికి సహాయం చేస్తానని చిరునవ్వులు చిందిస్తూ చెప్తుంది. ఇంకో పాప నేను కూడా నా దీనార్లను మా జెనిన్ కార్యాలయానికి విరాళంగా ఇస్తాను. అది నిరాశ్రయులకు పంచి, వారి ఇళ్ళు నిర్మించుకునే వరకు కొన్ని కారవాన్ లను వారు అద్దెకు తీసుకోవడానికి సహాయం చేస్తానంటుంది. నేను తగినంత వయస్సులో ఉండి ఉంటే, గాయపడిన వారికి నా రక్తాన్ని దానం చేసేదాన్నిఅని కూడా జవాబిస్తుంది!
మళ్ళీ మొదటి పౌరుడు ‘మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టేది వాళ్ళ కున్న అమోఘమైన సైనిక ఆయుధాగారం కాదు. ప్రాణం పోతున్న వ్యక్తి చివరి ఘడియల్లో గిల గిలా కొట్టుకుంటుంటే కనీసం అతని దగ్గర కెళ్ళి రవ్వంత ఓదార్పు నివ్వలేని చేతగానితనం, నిస్సహాయతలు మా పాలస్తీనా ప్రజల్ని ఊపిరాడ నివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శిబిరంలోని చిన్న రోడ్డులో బలహీనంగా ఉన్న చిన్నారి పసి బాలుడు తన తల్లి కోసం వెతుకుతుంటే ఆ తల్లి అతన్ని చేయి పట్టి వెంట తీసుకెళ్లే అవకాశం లేకుండా ఉండడం ఎంత విషాదం? ఒక పిల్లవాడు మా చేతుల్లో నిస్సహాయంగా చనిపోయినప్పుడు అది జీవితకాలమంతా మమ్మల్ని కలత పెడుతూ వెంటాడుతుంది. ప్రపంచం మొత్తం ఇజ్రాయెల్ దురాక్రమణను చూస్తూ కూడా మమ్మల్ని అన్ని దేశాల వారూ అమానుషంగా మీ చావు మీరు చావండని వదిలి పెట్టారు. మమ్మల్ని ఏదేశమూ సమర్థించడంలేదు. మామీద జరుపుతున్న దారుణమైన దాడులను, మా జీవన్మరణ సమస్యలను ఎవరూ పట్టించుకోవడంలేదు. జోర్డాన్, ఈజిప్ట్ వంటి ప్రధాన అరబ్ దేశాలు మాలాగే అమాయకంగా ఉన్నాయని భావించి, ఇజ్రాయెల్ నుండి వారి రాయబారులను వెనక్కి రప్పించాలని అభ్యర్ధించాం. ఇంత సామాన్యమైన కోరికకు కూడా వాళ్ళు స్పందించలేదు’ -అని పాలస్తీనా ప్రజల ఘోషను వివరిస్తారు.
పాలస్తీనా బాలలందరూ చెక్కుచెదరని ధైర్య సాహసాలతో ఉన్నప్పటికీ మనం ఇంతకుముందు చెప్పుకున్న ఒక జెనిన్ బాలిక మాత్రం గొప్ప ఆత్మవిశ్వాసంతో మిలిటెంట్ గా పాలస్తీనా ఆత్మను ఆవిష్కరిస్తుంది. ఆమె మాటల్లోనే ‘మేము పక్షిరాజు ల్లాగా గర్వపడతాం, సింహాల లాగా చనిపోతాం, ప్రతి ఇజ్రాయెల్ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పాలనుకుంటున్నాను. ప్రధానమంత్రి షారోన్ శిబిరానికి వస్తున్నాడని విన్నప్పుడు, నేను చాలా ఆగ్రహంగా అతని మీద పగ, ప్రతీకారాలతో రగిలిపోయాను. కన్నీళ్లు ఉబికి వచ్చాయి అని అంటుంది. “నువ్వు షారోన్ ను ఓడించగలవని నమ్ముతున్నావా? అతను నీ కన్నా సర్వ శక్తి సంపన్నమైన బలవంతుడు కదా? ఏం చేయగలవు?” – అని దర్శకుడు అడిగిన ప్రశ్నకు – అవును, నేను ఏమైనా చేయగలను. నేను అతని కంటే మానసికంగా చాలా బలంగా ఉన్నాను, నా ఇష్టానికి కృతజ్ఞతలు. నేను అతనిని ఓడించగల ననుకోగలిగిన నా ధైర్యానికి ధన్యవాదాలు. ఎందుకంటే అతను నాకు బాగా తెలిసిన అమాయక ప్రజలను ఘోరంగా హత్య చేశాడు. నేను అతనిని ఓడించగలననే నమ్మకముంది, ఎందుకంటే అతను ఐక్యంగా ఉన్న మమ్మల్ని చెదర గొట్టాడు. అతను ఒక్క ఇంటిని కూడా విడిచి పెట్టకుండా శిబిరంలోని ప్రతి మూలను నాశనం చేశాడు… శత్రువుతో పోరాడతా నంటున్నానని నన్ను కౄరంగా భావించవద్దు. నా శిబిరాన్ని నేను రక్షించుకోవడం, మా మాతృభూమిని రక్షించు కోవడం నాకు ముఖ్యం…. ఎవరైనా మీ కొడుకును పట్టుకు పోతే, అతన్ని తిరిగి తెచ్చుకోవడానికి మీరేం చేస్తారు? కాబట్టి ఆ శతవిధాలూ మా ప్రజలకు కూడా వర్తిస్తాయి. మా మాతృభూమి అంటే మాకు ప్రతిదీ… నేను ఈ పిరికివారికి భయపడను, వాళ్ళు ఎలుకల లాగా పరమ పిరికి వాళ్ళు. వారి వద్ద అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచంలోనే పేరెన్నిక గల నిఘా వ్యవస్థలు, గొప్ప గొప్ప ఆయుధాలున్నప్పటికీ, మాలాంటి సామాన్య పౌరులకు భయపడుతూ తమ యుద్ధ ట్యాంకుల వెనుక నక్కి నక్కి దొంగలలాగా దాక్కుంటారు. వారి బాంబులు నీటి లాగా మా పైకి వచ్చాయి, అయినప్పటికీ మేము ఆ పిరికి ఇజ్రాయెలీలకు భయపడేది లేదు! … మళ్ళీ ఆబాలికే – యూదుల్ని వచ్చి శిబిరాన్ని చూడమనండి. మేము సహించి, భరించిన బాంబు దాడులను ఒకే ఒక్క రోజు మాత్రమే వాళ్ళని అనుభవించ మనండి. ఏప్రిల్ మొదటి తేదీ నుంచి పదకొండు రోజుల పాటు నిరంతరం రాత్రింబగళ్ళు మేము సహించగలిగిన భరింపరాని మా నరక యాతనల్ని, మా ఓర్పునీ, మా సహనాన్నీ గనక వాళ్ళు చూడగలిగితే, తమను తాము చాలా గొప్పగా భావించుకుంటూ, ఇజ్రాయెల్ రాజధాని జెరూసలేం అని విర్రవీగే యూదులు దాన్ని జయించాలనే కోరికను పూర్తిగా మర్చిపోయి వెంటనే విరమించుకుంటారు. నేను అనేక మృతదేహాలను, వర్ణించలేని దారుణాలను చూశాను. సజీవంగా ఉన్న మనుషుల్ని బుల్డోజర్స్ తో లాగి చంపేశారు. ఈ దుశ్చర్యలన్నీ నా కలలను బద్దలు కొట్టాయి. ఇంత విధ్వంసం తర్వాత కూడా మేము ప్రతిఘటిస్తూనే ఉంటాం!…..
మా పోరాటదీక్ష గురించి చెప్పాలంటే ఈ శిబిరం ఎత్తైన ఒక చెట్టు లాంటిదనుకోండి. ఈ చెట్టుకు లెక్కకు అందనన్ని ఆకులున్నాయి. ప్రతి ఆకూ ఒక అమరవీరుణ్ణి గుర్తుకు తెస్తుంది. వారు మనుషుల్ని చంపినట్లుగా కొమ్మలను, ఆకులను ఎంతగా విచ్ఛిన్నం చేసినా సరే, ఇతరులు వారి స్థానంలో పుట్టుకొస్తూనే ఉంటారు. పెరుగుతూనే ఉంటారు. ఈ మూర్ఖపు ఇజ్రాయెలీలకు ఎన్ని యుగాలైనా చెట్టు పై భాగంలో చిగురిస్తున్న ఆకుల్ని చేరుకోవడం సాధ్యం కానే కాదు. అలాగే మా పాలస్తీనా పౌరుల్ని మొత్తంగా మట్టుబెట్ట లేరని నేను ఘంటాపధంగా యూదులతో చెప్పాలనుకుంటున్నాను”- అని ముగిస్తుంది.
ఈ డాక్యుమెంటరీ ప్రత్యేకతలు!
అరబ్ డాక్యుమెంటరీ చరిత్రలో మరపురానిది “జెనిన్, జెనిన్” అనే డాక్యుమెంటరీ.
పాలస్తీనాలో ఒక శతాబ్ద కాలంగా చోటు చేసుకుంటున్న అంతులేని దౌష్ట్యాలనూ, దౌర్జన్య కాండలనూ, మారణ హోమాలనూ విస్తృత ప్రపంచానికి విశదపరచడానికీ, అనేక చెరగని జీవిత చిత్రాలను ఆవిష్కరించడానికీ, తమను తాము వ్యక్తీకరించుకోవడానికీ ఒక మెరుగైన మార్గంగా చలనచిత్రాన్ని ఎంచుకున్నారు పాలస్తీనా దర్శక నిర్మాతలు. వారిలో మొహమ్మద్ బక్రీ దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్, నటుడుగా సుప్రసిద్ధుడు. రంగస్థల, చలనచిత్ర రంగాలలో విశేషమైన కృషి చేశారు.
మొహమ్మద్ బక్రీ ప్రముఖ పాలస్తీనా నటుడు కూడా! బక్రీ నటించిన చలనచిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిపొంది అతన్ని నిష్ణాతుడైన నటుడుగా నిలిపాయి.
పాలస్తీనా రాజకీయ పోరాటాన్ని ప్రతిబింబించే ప్రత్యేకమైన డాక్యుమెంటరీలను బక్రీ నిర్మించారు. “జెనిన్, జెనిన్” డాక్యుమెంటరీలో కెమెరా, మైక్రోఫోన్‌లను నిర్వాసితులైన శరణార్థుల ఇళ్లకు తీసుకు వెళ్ళారు. ఇజ్రాయెల్ ఫాసిస్టు దౌర్జన్యాలకు బలవుతున్న వారి అనుభవాలకు సంబంధించిన విషయాలపై సూక్ష్మంగా ప్రశ్నలు సంధించారు. దురాక్రమణలు, జాతి హననాలు, ఒక శతాబ్దకాలపు ఎడతెరిపిలేని దుఃఖాలు, మంచి భవిష్యత్తు కోసం వారి ఆశలు, హాస్యం, ఆనందాలు, మాతృభూమిని సాధించి తీరతామన్న ధృఢవిశ్వాసం మొత్తంగా చైతన్యవంతమైన సమాధానాలను పాలస్తీనా బాధితులనుంచి రాబట్టి, పాలస్తీనా ఆత్మను హృద్యంగా దృశ్యీకరించారు! ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న పాలస్తీనా అరబ్ గా మీ అత్యున్నత లక్ష్యాలు ఏమిటి అని అడిగినప్పుడు, అతను “నా కథ, నా ప్రజల కథ ప్రపంచానికి తెలియ జేయడమే నా ముఖ్య కర్తవ్యమని చెప్పారు.
మొహమ్మద్ బక్రీ “జెనిన్ యుద్ధం” గురించి “పాలస్తీనా సత్యం” అని పిలిచే వాటిని మాత్రమే చిత్రీకరించానన్నారు. దేశాలు సైతం నోరిప్పని సంకట పరిస్థితుల్లో, పీడితుల పక్షాన నిలబడి, ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చుకుని తన డాక్యుమెంటరీ ద్వారా వాస్తవ ఘటనలను చిత్రిక పట్టి పాలస్తీనా హృదయ ఘోషను ప్రపంచాని కందించిన మొహమ్మద్ బక్రీ ఎంతైనా ప్రశంసనీయులు! ముఖ్యంగా బాలల్ని దృశ్యీకరించడాని కెంతో కృషి చేశారు. ప్రస్తుతం మూడేళ్ళు దాటితే చాలు సెల్ ఫోన్ల వీడియో గేముల్లో మునిగిపోయే నేటి అన్ని హంగులున్న పిల్లతరానికి ఎదురుగా చైతన్యంతో పెరుగుతున్నఈ బాలల అభిప్రాయాలను దర్శకుడు మొహమ్మద్ బక్రీ శ్రద్ధాసక్తులతో క్రోడీకరించిన విధానం ప్రేక్షకుల్ని మురిపిస్తుంది!
ఇటీవల మా“మంచి సినిమా” గ్రూప్ లో పది పాలస్తీనా సినిమాల లింక్ లను గ్రూప్ అడ్మిన్ బాలాజీ గారు సభ్యుల కిచ్చారు. ఎక్కడ తీసేస్తారోనని భయపడుతూ చాలా హడావిడిగా కొన్ని సినిమాలు చూశాను. అంతు లేని హింస మధ్యలో నుంచి చిన్నారి పాపలు చూపిన చైతన్యం బోలెడంత భరోసానిచ్చింది! ముఖ్యంగా “జెనిన్ బాలిక” తెలివినీ, తెగువనూ ఒకసారి చూసిన వారెవరూ జీవితంలో మర్చిపోలేరు! ఉత్తేజాన్నిస్తున్న మండే సూర్యుడిలా ఉంది ఆ పాప! సినిమా చూస్తున్న తొందరలో ఆమె పేరు కూడా సరిగా చూసుకోలేదు. ఎక్కడో ఒకచోట Sempre Incazzato (సెంప్రే ఇన్ కజ్జాటో) అని చూశాను. అది ఆ బాలిక పేరో కాదో కూడా స్పష్టంగా తెలియలేదు. మొత్తానికి ఆమెది నటన కానే కాదు. ఆ పాత్ర ఆమెలో ఆవహించి నట్లనిపించింది!
ఆకలి మాకు ఒక సమస్య కానే కాదు అని మొదటిపౌరుడు చెప్పినట్లు గానే పసిపిల్లలతో సహా పిల్లలెవరూ కూడా ఎమైనా తింటున్నట్లు గానీ, తినడానికి ఆరాట పడుతున్నట్లుగా కూడా ప్రేక్షకులకు కనిపించరు. శిధిలాల మధ్యే దుమ్ములో పిల్లలు సంతోషంగా ఉంటారు. విరిగిన గోడలు, ధూళి ఎగిసిపడుతున్న పరిసరాల్లోనే వాటి మధ్యే పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు. ఒక బాబుని “మీ నాన్నెక్కడ” అని అడిగితే జవాబుగా ఒక సమాధిని చూపిస్తాడు. పిల్లలందరూ “జెరూసలేం మాది” అని నినాదాలిస్తూ ఒక చిన్న ఊరేగింపు కూడా తీస్తారు. ఈ చిన్నారుల ఆనందాల కేరింతల కెరటాల చప్పుళ్ళు, వారి జాతీయ గీతాల కవాతులు, నినాదాలు లోకమంతా ప్రతిధ్వనించి ఏదైనా అద్భుతం జరిగి, ఎలాగైనా సరే వీళ్ళ చిట్టి చిట్టి కోరికలు తీరితే బాగుండునని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ప్రేక్షకులు! అయినా వాళ్ళ వేమీ గొంతెమ్మ కోరికలు కావు గదా? అమ్మా-నాన్నలతో మాఇంట్లో మమ్మల్ని ఉండనివ్వ మంటున్నారు. అంతే కదా?
డాక్యుమెంట్ చేసే విషయంలో బక్రీ దర్శకత్వ ప్రతిభ అపూర్వం. గ్లోబల్ సంచారం చేస్తూ, తన డాక్యుమెంటరీలను ప్రదర్శిస్తూ పాలస్తీనాకు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. “జెనిన్ జెనిన్” డాక్యుమెంటరీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకొని వారి ఆదరాభిమానాలను పొంది, ఆలోచింపజేస్తుంది. ఫలితంగా బక్రీ మీద ఇజ్రాయెల్ దాడులు తీవ్రమయ్యాయి. “జెనిన్ జెనిన్” ఇజ్రాయెల్ సెన్సార్‌షిప్, ధిక్కారానికి గురైంది!
‘జెనిన్ జెనిన్’ ఎగ్జిక్యూటివ్ నిర్మాత “ఇయాద్ తహర్ సమౌది” అల్యా మౌన్ వద్ద ఈ చిత్రీకరణ ముగింపులో, ఇజ్రాయెల్ సైనికుల చేతిలో హత్యకు గురయ్యారు. ఆయన గౌరవార్ధం ఈ చిత్రాన్ని మొహమ్మద్ బక్రీ ఆయనకు అంకితం చేశారు.
“జెనిన్-జెనిన్” సాధించిన అవార్డులు
2002 లో కార్తేజ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో “ఉత్తమ చిత్రం” అవార్డు పొందింది.
మధ్యధరా డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్, రిపోర్టింగ్ గురించి అంతర్జాతీయ బహుమతి సాధించింది.