సాయీ
నీతో పాటుగా ఇంతమంది
మాటాడుతుంటే వాడికేదో భయం కదా
చావు నీ ముందు కరాళ
నృత్యం చేసినా
నీ గుండె చెదరలేదు
నీ నిబ్బరం వెనక వున్న
నమ్మకమే నీ కళ్ళలో మెరుపు కదా?
నీ మాటా నీ నవ్వే వాడిని
బెదరకొడుతూ వున్నాయా?
ఎందుకో మాటాడే వారంటే
చెదరని నవ్వుగలవారంటే
రాజుకెప్పుడూ భయమనుకుంటా
ఎందుకంటే వాడెక్కిన అందలమెప్పుడూ
ముప్పాతికమంది ఒప్పుకోనిదే కదా
నువ్వెప్పుడూ అంటావు కబీరుని
ఆలపించమని
మనుషుల్ని ప్రేమించమని
కానీ వాడు ఉన్మాదాన్ని వ్యాప్తి చేస్తూ
దేశాన్ని దోచుకోవాలనుకుంటున్నాడు
న్యాయానికి గంతలు కట్టి
న్యాయమూర్తుల గుండెలపై
ఉక్కుపాదం మోపి
తీర్పులను తిరగరాయిస్తున్నాడు
చీకటిని తెరచే ఉషోదయమొకటి
వేచి వుందని కబీరన్నది గుర్తుకొస్తోంది
పిచుకలకు రెక్కలొచ్చి
నిన్ను ఎత్తుకొచ్చే కాలమెంతో
దూరంలో లేదు బాబా !!
(సాయిబాబా విడుదల కోరుతూ)