చాయ్ గ్లాసు కథను రాసింది , నిత్య. ఈ కథ మొదట అరుణతారలో అచ్చయ్యాక , సామాన్యుల సాహసం కథాసంకలనంలో కూడా వచ్చింది.
కథ, పదకొండేళ్ల వ్యవధితో మూడు దృశ్యాలను చిత్రిస్తుంది. 1994నుంచి 2005 మధ్య దండకారణ్యంలో ఆదివాసీ సమూహంలో నూతన మానవులు ఎలా ఉధ్భవించారో చెబుతుంది కథ. కథలోని కథకురాలు 1994లో పారెనార్ గ్రామానికి రావడం, అక్కడ ఒక చిన్న పిల్లవాడి ప్రవర్తనలో పితృస్వామ్యాన్ని ఆమె గమనించడం. ఆలోచనలో పడటం. రెండో దృశ్యంలో 2000లో సంవత్సరంలో దండకారణ్యంలో జనతన సర్కార్లు ఏర్పడటంతో విద్యా వ్యవస్థ వేళ్లూనుకోవడం. భూంకాల్ స్కూళ్ల నిర్వహణలో కథకురాలు వుండటం కన్పిస్తుంది. మూడో దృశ్యంలో మొదటి దృశ్యం లోని బుడతడు యిప్పుడు నూనూగు మీసాల ప్రాయంలో, భూంకాల్ స్కూలు విద్యార్థిగా నూతన మానవుడిగా పరివర్తన చెంది కన్పించడం.
ఆరేళ్ల బుడతడిని ఆసరా చేసుకుని పితృస్వామ్య మనే పెద్ద వ్యవస్థాగత భావజాలాన్ని, దాని పని విధానాన్ని, దాన్ని ఎదుర్కోవడానికి చేయాల్సిన ఆచరణనూ వివరిస్తుంది కథ.పితృస్వామ్యమంటానే, దాని దురణ్యాయాలకు నలిగిపోయే స్త్రీల జీవితాలను చూపడం ద్వారా సాధారణంగా రచయితలందరూ కళాసృజన చేస్తుంటారు. అయితే ఈ కథ ఆరేళ్ల చిన్నపిల్లాడిలో కూడా పితృస్వామ్యం ఎట్లా ప్రతిఫలిస్తుందో చూపి, ఆ పిల్లవాడు ఆ ప్రభావం నుంచి బయటపడడానికి ఏం చేయాలో చెబుతుంది. ఒక పెద్ద దృగ్విషయాన్ని ఒక ఆదివాసీ పిల్లవాడి ఎదుగుదలలోంచీ చూపి, నూతన మానవుడి జననం ఎలా జరుగుతుందో చిత్రిస్తుంది కథ.
నాలుగైదు సంవత్సరాల అంతరంతో జరిగే మూడే మూడు దృశ్యాల్లో, ఒక చిన్న పిల్లవాడు పితృస్వామ్య లాంటి అవ్యవస్థ పట్టునుంచీ బయటపడినట్లు చిత్రించడం సాధ్యమేనా అని సందేహం రావడం న్యాయమే అయినా, కథ నిలబడి వున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అది సాధ్యమేననిపిస్తుంది. ఆ స్థలం అడవిలో ఆదివాసీలది కావడం. వాళ్ల మీద ఆధునిక జీవితపు యితర ప్రతిఫలనాల ప్రభావం లేకపోవడం. వాళ్లతో పనిచేస్తున్నది ఆధిపత్యం నెరపని ప్రజాప్రభుత్వం కావడం. వీటి వల్ల అలా సాధ్యపడివుండవచ్చు.
దళజీవిత చర్యలో భాగంగా తరచూ గండవాయి, పారెనార్ లాంటి గ్రామాల్ని తిరిగే కథకురాలికి పారెనార్ లో తూనీగ లాగే తిరిగే ఆరేళ్ల బుడతడు పరిచయం అవుతాడు.ఎవరి మాటా వినని బుడతడు కథకురాలి మాటకూ పాటకూ మాలిమి అవుతాడు. ఒక ఉదయం పూట టీ తాగాక, కథకురాలు వాడు తాగిన చాయ్ గ్లాసు ను బుడతడిని కడగమంటుంది. వాడు కోపంగా గ్లాసును ఆమె మీదకి గిరాటువేసి పరిగెడతాడు.వాడికెందుకంత కోపమొచ్చిందని విచారిస్తే తెలిసేదేమిటంటే,ఆడపిల్లలు చేసే గ్లాసులు కడిగే పనిని మగపిల్లవాడినైన తనను చేయమనడం వాడికి నచ్చలేదని అర్థమవుతుంది. దాంతో కథకురాలు ఆలోచనలో పడుతుంది. తర్వాత కథలో 2000లో సంవత్సరం తర్వాత, దండకారణ్యంలో జనతన సర్కార్ చేపట్టిన విద్యావిధానం గురించి కథకురాలు చెబుతుంది. భూంకాల్ స్కూళ్లల్లో జెండర్ తేడాలు చూపని విద్యాబుధ్ధుల్ని పిల్లలకు నేర్పుతూవుంటారు. అలాంటి భూంకాల్ స్కూలు లోనే పారెనార్ గ్రామంలో మనకు పరిచయమైన పిల్లవాడు చదువుతుంటాడు. కథలోని మూడవ దృశ్యం లో అదే భూంకాల్ స్కూల్‌కి యేదో సమావేశానికి , కథకురాలు వస్తుంది. కథలోని మొదటి దృశ్యం లోని ఆరేళ్ల బుడతడు యిప్పుడు నూనూగు మీసాల ప్రాయంలో వున్నాడు, కథకురాలిని గుర్తు పడతాడు. సమావేశం అయిపోయాక భోజనాలు పెడతారు.(అన్నాలు తిన్నాక, ఎవరి ప్లేట్ వాళ్లే కడిగి పెట్టడాన్ని అలవాటుచేసుంటారు స్కూల్లో.)ఈ అబ్బాయి, తన ప్లేట్ కడిగేసి, కథకురాలు ప్లేట్ కడగడానికి నీళ్లుపోస్తూ, తాను యిప్పుడు చిన్నప్పుడు చాయ్ గ్లాసు కడగకుండా విసిరేసిన వాడిని కాదనీ మారిన వాడినని చెప్పడంతో కథ ముగుస్తుంది.
పితృస్వామ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించాలంటే ,అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమనీ, ఆ విద్యావిధానంలో జెండర్ అంశం పొందుపరిచి శాస్త్రీయపధ్ధతిలో దాన్ని అమలుచేస్తేనే ఫలితం వుంటుందనీ , అలాంటి శాస్త్రీయ విద్యావిధానాన్ని అములుపరచడం జనతన సర్కార్ వంటి విప్లవ ప్రభుత్వాలుకు మాత్రమే సాధ్యమనీ యీ కథ అంతరార్థంలో వుంది. ఆమేరకు కథలో ఆచరణ వుంది. కథ ప్రారంభ దృశ్యానికీ ముగింపుకీ మధ్య గుణాత్మకమైన పురోగతిని చిత్రించడం ద్వారా, యీ కథ నిఖార్సయిన విప్లవ కథగా నిలబడింది.