పి.చిన్నయ్య రాసిన ‘మెట్ట భూమోడు’ , పీడిత ప్రాంతాల కథ.పీడిత ప్రజలవైపు నిలబడటం మనందరికీ తెలిసిన ఆదర్శభావం.ఈ కథ ఆ విలువ ను విస్తృతం చేస్తూ పీడిత ప్రాంతాల వైపు నిలబడమంటుంది.ఈ కథలో పీడిత ప్రాంతాన్ని ప్రేమించే ప్రొటాగనిస్టుది ఆ పీడిత ప్రాంతమే అయ్యుండవచ్చు.దాంతో తన ప్రాంతాన్ని తాను ప్రేమించక యేంచేస్తాడు అనుకోవచ్చు.అయితే యీ ప్రొటాగనిస్టుకు సుభిక్షమైన పచ్చని పంటలతో తులతూగే కాలువల ప్రాంతంలో స్థిరపడే, ఆస్తులు చేసుకొనే అవకాశం వచ్చినా వద్దనుకొని మెట్టభూముల్లోకి వెళ్తాడు.ఎందువల్ల?

ఈ కథలోని ప్రొటాగనిస్టు టీచర్.కోదాడలో కాపురముంటూ, నాలుగు కిలోమీటర్ల దూరంలో రోడ్డు మీద వున్న రామచంద్రాపురం హైస్కూలు లో వుద్యోగం.ప్రజాసంఘాల వెనుక తిరిగే, ఆదర్శాలు పలికే ఆచరణ వున్నవాడే ఆయినా, ఆలోచనలు కలిసిన అమ్మాయిని, తలిదండ్రులు కోరుకున్న కట్నకానుకలకు వదలుకొని , మాగాణి భూములు గలవారి యింటళ్లుడవుతాడు.

దారిన పోతుంటే చల్లటి వరిచేల గాలులు, కనుచూపు మేరా పచ్చని పంటలు.ఎంతో అందంగా కన్పించే దృశ్యాలు.తన ప్రాంతలో ఎక్కడున్నాయీ.వర్షాలు పడితే తప్ప నిండని చెరువులు తమవి.నిత్యం పారే కాలువలు ఎక్కడివి.ఈ తారతమ్యం అతడిలో  అశాంతిని రేపింది.చివరకు భార్య కూడా ‘మీ ఏరియా వేస్టండీ..’ఒక్క మాటలో కొట్టేస్తుంది.అశాంతి మరింతగా పెరుగుతుంది.ఒకే జిల్లాలో రెండు ప్రాంతాల మధ్య వైరుధ్యానికి కారణాలు ఆలోచనకు అందుతూ వుంటాయి. ప్రజాసంఘాల సమావేశాల్లో  కుట్రలు అర్థమవుతుంటాయి.నీళ్లున్న ప్రాంతంలో స్థిరపడే అవకాశం వద్దనుకొని , భార్యతో ఘర్షణకు సిధ్ధపడుతూ మెట్టభూములవైపు ట్రాన్సఫర్ చేయించుకుంటాడు.

మెట్ట భూమి లాంటి , పొడినేలలాంటి వస్తువులో కథకుడు తడిని ఎలా సాధించాడు?అది కథకుడి కున్న ప్రాంతీయ స్పృహ.పీడిత ప్రాంతాల వైపు నిలబడాలన్న విలువే యీ కథ కు యిరుసు.ఒక జిల్లా భౌగోళికత లోనే ఒక ప్రాంతానికి నీళ్లు అందించడానికి యింకో ప్రాంతాన్ని బలి యివ్వడమనే రాజకీయ దుర్మార్గం తెలుసుకున్నాక రగిలే అశాంతి వల్ల వరిపొలాలతో , వూగే తెల్లటి రెల్లు గడ్డితో నిండిన అందమైన దృశ్యం లోనూ అందవికారమే కనిపిస్తుంటుంది.దగాపడ్డ తమ నేలల్లో గాలికి వూగే తెల్లటి రెల్లు పూలు కన్పించవు నిజమే, మెట్ట భూముల్లో  గునుగుపూలె పూసేది. తమది గునుగు పూల పరిమళం. అణుకువగా  వర్షం తక్కువైనా మొలిచి ఎదిగే గునుగుపూలకీ , కాలువలై పారే సంపన్నానికి గుర్తైన రెల్లపూలకీ మధ్యా అసమానతలూ , తారతమ్యాలు ఎలా వచ్చాయి.అవి ఎట్లా పోతాయి.అనేదాని చుట్టూ యీ కథ పాఠకుల్ని తిప్పుతుంది.

ఈ కథను చదువుతున్నప్పుడు ఒక జిల్లాలోని రెండు ప్రాంతాల మధ్య వైరుధ్యమొక్కటే  గోచరించదు.ఒకే రాష్ట్రంలోని రెండు ప్రాంతాల వైరుధ్యమూ కన్పించవచ్చు.ఈ కథ చదువుతున్నప్పుడు రాయలసీమ లాంటి ప్రాంతం, కథకుడి ప్రాంతంతో సారూప్యత పొందవచ్చు ‌.ఇట్లా కథలో సాధింపబడే ప్రాంతీయతా స్పృహనే యీ వస్తువును కథ చేస్తున్నది.

మనుషులు స్వార్థంతో సుఖంగా బతకడానికి కావలసిన హంగూ ఆర్భాటాలూ ఎదురుగా వున్నా వాటిని వదులుకోవడంలో ఐచ్చికత ఎంత వుంటుందో, అంతే ఘర్షణా వుంటుంది.సామాజిక , కౌటుంబిక సంబంధాలు మధ్యా ప్రాంతీయతా స్పృహ నిలబడుతుందా , అది రాజేసే అగ్నితో కథ ముందుకు నడవగలుతుందా అని ఆలోచిస్తే, ఈ కథ ఆ అనుమానాన్ని అధిగమించిందనే చెప్పాలి.నిజానికి  ప్రాంతీయతే యీ కథను హైట్స్ కు తీసుకెళ్లగలిగింది.ఈ కథలోని కథ ఒక వ్యక్తి ది కాదు.ఒక ప్రాంతానిది.ఆ మెట్ట భూముల లాంటి అనేక ప్రాంతాలది.ఆ విస్తృతే దీన్ని కథ చేసింది.

Leave a Reply