కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజలను మోసం చేసే చర్యలను కొనసాగిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా యధేచ్ఛగా పెట్రో ఉత్పత్తుల ధరలను భారీగా పెంచి, ప్రజల సొమ్మును యదేచ్ఛగా దోపిడీ చేస్తోంది. ఇంధన ధరల పెరుగుదలతో ప్రభుత్వానికి, ఉత్పాదక కంపెనీలకు, మార్కెటింగ్ కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని, అదంతా మార్కెట్ శక్తుల వల్లే జరుగుతోందని మోడీ ప్రభుత్వం చెబుతున్నదంతా శుద్ధ అబద్దం. వివిధ రాష్ట్రాల్లో అక్టోబర్ 30న జరిగిన ఉపఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో మోడీ సర్కార్ నవంబర్ 3న పెట్రోల్, డీజిల్ పై నామమాత్రపు తగ్గింపును ప్రకటించి, వ్యాట్ పేరుతో మిగిలిన దంతా రాష్ట్రాల పైకి నెట్టేసింది. దీపావళి బహుమతి అంటూ పెట్రోల్, డీజిల్ రేట్లను స్వల్పంగా తగ్గించడమంటే సామాన్యుల కంట్లో మట్టికొట్టడమే అవుతుంది. ఈ స్వల్ప తగ్గింపు వల్ల సామాన్య ప్రజలకు ఒరిగేది ఏమి ఉండదు. దీపావళి ముందు పెట్రోల్ పై లీటరు రూ. 5, డీజిల్ పై లీటర్‌కు రూ. 10 మేర తగ్గించింది. అయితే ప్రభుత్వం పెంచేది కొండంత, తగ్గింది గోరంత అని ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేపథ్యంలో కార్పొరేట్ అనుకూల విధానాల్లో భాగంగా మన్మోహన్ ప్రభుత్వం 2010లో పెట్రోల్ ధరలపై నియంత్రణను ఎత్తివేయగా 2014లో మోడీ అధికారంలోకి రాగానే డిజిల్ ధరల నియంత్రణను ఎత్తి వేశాడు. ఎప్పుడైతే ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేశారో అప్పటి నుంచి ఇంధన ధరలు రోజుకో తీరు మారుతోన్నాయి. హేతుబద్దత కొరబడింది. కార్పొరేట్ మార్కెట్ శక్తులు సహజ వనరులను తమ గుప్పెట్లో పెట్టుకున్నాయి. ఈ అనుచిత విధానమే ఇంధన ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. ఇటీవల మూడు లోకసభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లో ఒక లోకసభ, మూడు అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవటం బిజెపికి షాకిచ్చింది. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలనే ప్రచార అస్త్రాలుగా ప్రయోగించింది. మొత్తం మీద కాంగ్రెస్ 8, బిజెపి 7 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నాయి. ఫిబ్రవరిలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాల్లో ఎదురుదెబ్బలను నిలువరించే ఉద్దేశంతోనే కేంద్రప్రభుత్వం ఎక్సైజ్ సుంకం తగ్గింపుకు ఆకస్మిక నిర్ణయం తీసుకుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
కేంద్ర పాలకులు తగ్గింపు ప్రకటన చేసిన తర్వాత వెనువెంటనే కేంద్ర పాలిత ప్రాంతాలు లడఖ్, పుదుచ్ఛేరితో పాటు బిజెపి పాలిత రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ పై రూ.8.7, రూ.9.52 చొప్పున వ్యాట్ ను తగ్గించాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు కారణంగా ఉత్తరాఖండ్ లో పెట్రో పై లీటరు తగ్గింపు రూ.1.97గా, లడ లో అత్యధిక తగ్గింపు కారణంగా లీటర్‌కు రూ.8.70గా ఉంది. ఇక డీజిల్ పై ఉత్తరాఖతం లో లీటర్‌కు రూ.17.5, లడఖ్ లో రూ. 9.52గా ఉన్నట్లు ప్రభుత్వరంగ చమురు సంస్థల ధరల జాబితా పేర్కొంది. అసోంలో పెట్రోల్, డీజిల్ పై రూ.7 తగించారు. కేంద్రం తగించిన దానితో కలిపి అక్కడ పెట్రోల్ రూ.12, డీజిల్ రూ.17 మేర తగ్గుతోంది. త్రిపురలో పెట్రోల్, డీజిల్ పై రూ.7 తగ్గించారు. హరియాణా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ను తగ్గించింది. కర్ణాటకలో లీటర్ పెట్రోల్ పై రూ.8.62, డీజిల్ పై రూ. 9.40, మధ్య ప్రదేశ్ లో పెట్రోల్ పై రూ.6.89, డీజిల్ పై రూ.6.96 తగ్గాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్ పై రూ. 6.96, డీజిల్ పై రూ.2.04 వ్యాట్ ను తగ్గించింది.
ఇప్పటివరకు వ్యాట్ తగ్గించని రాష్ట్రాల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పాలిస్తున్న రాజస్థాన్, పంజాబ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు ఉన్నాయి. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీ, టిఎంసి పాలనలోని పశ్చిమబెంగాల్, టిఆర్ఎస్ నేతృత్వంలోని తెలంగాణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లు ఉన్నాయి. వామపక్షాల పాలిత కేరళలో ఇప్పటికే వ్యాట్ పది రూపాయలు తగ్గించడంతో తాజాగా ఎటువంటి తగ్గింపులు జరపలేదు. నవంబర్ 3 నాటి ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో దేశవ్యాప్తంగా లీటరు పెట్రోల్ ధర రూ. 5.7 నుంచి రూ.6.35 వరకు, డీజిల్ ధర రూ.11.16 నుంచి రూ.12.88 వరకు తగ్గింది. మే 5, 2020 నుండి ఎక్సైజ్ సుంకాన్ని రికార్డు స్థాయిలకు పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంవత్సరంన్నర కాలంలో పెట్రోల్ ధరలో మొత్తం పెరుగుదల లీటరుకు రూ. 38.78కి చేరింది. ఈ సమయంలో డీజిల్ ధర లీటరుకు రూ. 29.03కు ఎగబాకింది.
గడచిన రెండేళ్ళలో పెట్రోలు, డీజిల్ రేట్లపై విధించే ఎక్సైజ్ సుంకం రూపురేఖలనే కేంద్ర సర్కారు మార్చేసింది. నిజానికి, ఇంధనంపై కేంద్రం వసూలు చేసే పనుల్లో 41 శాతం వాటాను రాష్ట్రాలకు పంచవలసి ఉంటుంది. కానీ, కేంద్రం తెలివిగా పెరిగిన పెట్రో ఆదాయం డివిజబుల్ పూల్ లోకి రాకుండా సెన్లు, సర్ ఛార్జీల రూపంలోనే రూ.2,87,500 కోట్లు వసూలు చేసింది. అలా వచ్చినదాన్ని రాష్ట్రాలకు ఇచ్చే పని లేకుండా, తన దగ్గరే ఉండిపోయేలా కేంద్రం రాష్ట్రాలను దగా చేసింది. పెట్రోలియమ్ ప్లానింగ్ అండ్ ఎనాలసిస్ సెల్ డేటా ప్రకారం పెట్రోలియమ్ రంగంపై వివిధ రకాల పన్నుల ద్వారా కేంద్రానికి 2014-15లో రూ.1.72 లకల కోటు వస్తే, ఇప్పుడది 2020-21లో ఏకంగా రూ.3.35 లక్షల కోటకు చేరింది. అందులో రాషలకు దక్కేది రూ.19,475 కోట్లే. అంటే 5.8 శాతమే. కొవిడ్ విపత్తు కారణంగా అంతర్జాతీయ సగటు క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గినా సరే, సామాన్యుడు కొనే పెట్రోల్, డీజిల్ రేట్లు చుక్కలనంటాయి. 2019 మేలో లీటరు పెట్రోల్ రూ.76.89, డీజిల్ రూ.71.50 ఉండేవి. పాలకుల పుణ్యమా అని ఈ ఏడాది నవంబర్ 1 నాటికి పెట్రోల్ రూ. 115.99, డీజిల్ రూ. 108.66కు సర్రున పెరిగాయి. ఇది కళ్ళెదుటి నిజం.
ఇన్నాళ్లు బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలూ ఇంధన ధరలు తగ్గించాలని అనేకమార్లు డిమాండ్లు చేస్తున్నా పట్టించుకోని బిజెపి అలవిగాని ధరా భారాన్ని మౌనంగా భరిస్తున్న వినియోగదారులపై మోపింది. దేశమంతా జిఎస్ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ను తీసుకురావాలన్న డిమాండను మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. పెట్రోలియం ఉత్పత్తులను జిఎస్ పరిధిలోకి తీసుకురావాలనే చర్చ, డిమాండ్ వినిపిస్తూనే ఉంది. ఇదే కనుక జరిగితే వినియోగదారులు చెల్లించే పన్ను శాతం భారీగా తగ్గుతుంది. కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారంలో ఉన్న పార్టీలు ఏవైనా కూడా ఇందుకు సుముఖంగా లేవని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. వినియోగదారులను, ప్రజలను నిలువునా దోచుకునేనిదుకు, తమకు కావలసిన సొమ్మును నయానోభయానో ఏదోవిధంగా రాబట్టుకునే ఏ అవకాశాన్నీ ఈ ప్రభుత్వాలు వదులుకోవడం లేదనే వాస్తవాన్ని దేశ ప్రజలు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇటీవల అక్టోబర్ 30న దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు బిజెపికి చెంపపెట్టు లాంటివిగా పరిణమించడంతో నామమాత్రంగా పెట్రోల్ ధరను తగ్గించారు. ఇది కూడా ప్రజలపై ప్రేమతో కాదు. ఈ సంవత్సర కాలంలో పెంచిందెంత? ఇప్పుడు తగ్గించిన మొత్తం నిజంగా సంతృప్తి కలుగజేస్తుందా? పెట్రో ధరలు ఎగబాకుతుండగా సుంకం తగ్గించి ఉపశమనం చేకూర్చాలని ఒత్తిళ్లున్నా ధరల పెరుగుదలను సమర్థించుకున్న ప్రభుత్వ వాదనల నేపథ్యంలో తాజా నిర్ణయం ఉపఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు పర్యవసానమే. ఇప్పుడు ఇంధన ధరలను నామమాత్రంగా తగ్గించడం కచ్చితంగా రాజకీయమైనదే.
2014తో పోలిస్తే ఆ తరువాత పెట్రోలుపై దాదాపు మూడున్నర రెట్లు, డిజిల్ పై తొమ్మిది రెట్ల వరకు ఎగసిన ఎక్సైజ్ సుంకానిదే అసలు పాపమన్నది పచ్చినిజం! దానికి రాష్ట్రాల వ్యాట్ బాదుడు జతకలిసి పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలు అల్లకల్లోలమయ్యాయి. పెట్రో రంగం నుంచి గడచిన ఏడేళ్లలో ప్రభుత్వాలు పిండుకున్న రూ.36.17 లక్షల కోట్ల మొత్తంలో అరవై శాతానికి పైగా కేంద్ర ఖజనాకే జమపడింది. తమ ఆదాయాలను ఇబ్బడిముబ్బడి చేసుకోవడానికి ప్రజల జేబులను గుల్లచేసింది. సుంకం పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలను ఎలా పిండుకుందో మరొక ఉదాహరణ చూదాం. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ గణాంకాల ప్రకారం 2021 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఎక్సైజ్ సుంకం వసూలు రూ.1.71 లక్షల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వసూలైంది. రూ.1.28 లక్షల కోట్లు. అంతకుముందు సంవత్సరం (2019-20) వసూలైంది రూ. 95, 930 కోట్లు మాత్రమే.
ప్రాథమిక చమురు ధరకు కేంద్ర ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ను కలిపితే వచ్చేది పెట్రోల్ బంకుల్లో అమ్మే రిటైల్ ధర. అంతర్జాతీయ ముడి చమురు ధరలను బట్టి దేశీయంగా పెట్రోల్ రిటైల్ రేటు పెరగడం అర్థం చేసుకోవచ్చు. కానీ, అంతర్జాతీయ మార్పులతో సంబంధం లేకుండా, ఇక్కడ పాలకులు ఎప్పటికప్పుడు అధిక సుంకాలు విధించుకుంటూ పోవడం దివాళకోరు విధానం తప్ప మరోకటి కాదు. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చేనాటికి లీటర్ పెట్రో పై కేంద్ర సుంకాలు రూ. 9.48 కాగా, లీటరు డీజిల్ పై రూ.3.56గా ఉండేవి. ఆ సుంకాలలో ప్రాథమిక ఎక్సైజ్ సుంకం, ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం, రోడ్డు సెన్సులు కలిపి ఉన్నాయి. కేంద్రం 2014లో ఈ సుంకాలను లీటరు పెట్రోలుపై రూ.10.43, డీజిల్ పై రూ.4.52ల వరకు పెంచింది. 2015లో వాటిని సవరించి లీటరు పెట్రోలుపై రూ.9.13, లీటరు డీజిల్‌పై రూ.6.66 అదనంగా సుంకం విధించింది. పెట్రోలు, డీజిల్‌పై పెద్ద పెరుగుదల 2020లో జరిగింది. జూన్ 2014లో 109 అమెరికన్ డాలర్లు ఉన్న ముడి చమురు ధరలు 2020 మార్చిలో బ్యారెలకు 33.36 డాలర్లకు, మే 2020లో 30.61 డాలర్లకు పడిపోయాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తెలివిగా, పౌరులకు అర్థం కాని విధంగా సెన్లు, సర్ ఛార్జీలను రికార్డు స్థాయిలో పెంచింది.
పెట్రోలు, డీజిల్ పై 2020 మార్చిలో కేంద్రం లీటరుకు రెండు రూపాయల మేరకు ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దీనితోపాటు లీటరుకు ఒక రూపాయి చొప్పున రోడ్ సెస్ కుడా పెంచింది. 2020 మే నెలలో రెండిటిపై రోడ్డు సెస్సును లీటరుకు రూ.8 చొప్పున పెంచింది. పెట్రోలుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని మరో రెండు రూపాయలు, డీజిల్ పై రూ. 5 పెంచింది. 2021-22 బడ్జెట్ లో కేంద్ర వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్సు (ఎఐడిసి) పేరిట కొత్త సెస్సును పెట్రోలుపై లీటరుకు రూ.2.5, డీజిల్ పై రూ. 4 వడ్డించింది. ఈ విధంగా, మార్చి 14, 2020 నుంచి సెస్సులు, సర్ ఛార్జీలను పెట్రోలు, డీజిల్ పై వరుసగా రూ. 14.50, రూ. 19లు పెంచారు. ప్రస్తుతం, వీటితో సహా మొత్తం ఎక్సైజ్ సుంకాలు లీటరు పెట్రోల్ పై రూ. 32.90లు కాగా డీజిల్ పై రూ.31.80 బాదుతోంది. కేంద్రం 2014 నుంచి 2020 మధ్యకాలంలో ఎక్సైజు సుంకాలను పెట్రోల్ పై 216 శాతానికి పైగా, డీజిల్ పై 604 శాతానికి పైగా పెంచడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం చమురుపై విధించిన సెస్ రద్దు చేస్తే రూ.77కె పెట్రోల్, రూ. 69కే డీజిల్ దొరుకుతుంది.
కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలతో పాటు, దిగుమతి చేసుకున్న ముడిచమురుపై కస్టమ్స్ సుంకాలను విధిస్తోంది. మన దేశం ముడిచమురు అవసరాలలో దాదాపు 89 శాతం మేరకు దిగుమతి చేసుకుంటోంది. 2014-15లో దిగుమతి చేసుకున్న ముడిచమురుపై కస్టమ్స్ సుంకం మెట్రిక్ టన్నుకు రూ. 50 కాగా ఇప్పుడు రూ.30కి తగ్గించారు. దీనివల్ల చమురు దిగుమతి చేసే కార్పొరేట్లకు మేలు జరిగింది కాని ప్రజలకు ఏలాంటి మేలు జరుగలేదు. కేంద్రానికి పెట్రోలియం రంగం (కస్టమ్స్ అండ్ ఎక్సైజ్) నుంచి 2014-15లో రూ.1,72,065 కోట్ల ఆదాయం రాగా, అది 2020-21లో రూ.4.55.069 కోట్లకు పెరిగింది. ఈ పెరుగుదల 165 శాతం. ఇప్పుడు 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర హైదరాబాద్లో రూ.952. పార్లమెంటులో అనేక ప్రశ్నలకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, కేంద్ర పెట్రోలియం మంత్రి 14.2 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర మార్చి 1, 2014న రూ.410.50 ఉన్నదని వివరించారు. అంటే ప్రస్తుత ధర దాదాపు 132 శాత పెరిగిందన్నమాట. పెట్రోలియం ధరల ప్రభావం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసి ప్రజలపై నిత్యావసర వస్తువుల ధారాభారం పడింది. చేతి దెబ్బ కాలిదెబ్బ రెండూ ప్రజలకే దీంతో దే వ్యవస్థపై చాలా ప్రతికూల ప్రభావం పడింది.
ఇప్పుడు ఎక్సైజ్ సుంకం స్వల్పంగా తగ్గించటానికి ప్రభుత్వ సమర్థన కూడా చిత్రంగా ఉంది. ఆర్థిక వ్యవస్థలోని రంగాలన్నిట్లో కార్యకలాపాలు గణనీయంగా పెరిగినందున, వాటికి మరింత ప్రోత్సాహమివ్వటానికి సుంకం తగ్గించారట! అలాగే కరోనా కాలంలో మంచిగా పంటలు పండించిన రైతులకు మరింత ప్రోత్సాహకారిగా ఉంటుందని డీజిల్ పై సుంకం తగ్గించారట! డీజిల్ వాడేదిది రైతులేనా? దేశంలోని యావత్ సరుకు, ప్రజా రవాణా వ్యవస్థలు, అనేక పరిశ్రమలు డీజిల్ వాడతాయి. ప్రజల బాధలపట్ల దయతో గాక రానున్న అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ప్రజల్ని మభ్య పెట్టటమే ప్రధాన లక్ష్యం. ఏది ఏమైనా ఈ నామమాత్రపు తగ్గింపు ఫలం ఎన్నాళ్లు లభిస్తుందో చెప్పలేము. చమురు కంపెనీలు రోజువారీ రేటు పెంచకుండా ఉంటాయా ? అంటే, సందేహామే.
కేంద్రం పెట్రో రంగంపై బాదుడుతో ఆదాయాన్ని పెంచుకొనే ప్రయాస మానేసి, దశాబ్దకాలంగా పడిపోతున్న ప్రత్యక్ష పన్నుల ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టడం అత్యవసరం. మరోపక్క జిఎస్ మెరుగ్గా అమలయ్యేలా, మరింత ఆదాయం వచ్చేలా చూసుకోవాలి తప్ప ప్రజలపై పన్నులు వేయడం సబబు కాదు. కరోనా వల్ల కోట్లాది మంది ఉపాధి కోల్పోయి, ఆదాయాలు లేక కొనుగోలు శక్తి క్షీణించి పస్తులుంటున్నారు. నిజానికి ఈ విధానం ఆర్థిక వ్యవస్థకు గానీ, ప్రజా సంక్షేమానికి గానీ తోడ్పడదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా పన్నులను సమర్థించుకోవడం వల్ల భారం వినియోగదారుడి మీదే పడుతోంది. ఇకనైనా, పెట్రో రేట్ల వ్యవహారాన్ని రాజకీయ విన్యాసంగా మార్చకుండా, పాలకులు ప్రజల కోణంలో నిర్ణయం తీసుకోవాలి. రాబడిలో న్యాయమైన వాటాపై కేంద్రం, రాష్ట్రాలు ఒక అంగీకారానికి వచ్చి, పెట్రో పై అధిక పన్నులు తగ్గించాలి. సామాన్యులకు మేలు చేయాలి. లేకుంటే ప్రజలు మోడీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.