ఆదాయం, సంపద పంపిణీలో అసమానతలు అనూహ్యంగా తీవ్రమవుతున్నాయి. ఆధిపత్య ధోరణులు బలపడుతున్నాయి. లింగ వివక్ష, జాత్యహంకారం, కుల వివక్ష్మ, మైనారిటీల మీద దాడులు వికృతంగా పెరుగుతున్నాయి. అమానవీయత, పెత్తనం, క్రూరత్వం, హింస, నేటి వ్యవస్థ సహజ లక్షణాలైనాయి. ఇవన్నీ అత్యధిక ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్నాయి. కొవిడ్‌ విలయంతో ఈ సంక్షోభం మరింత జటిలం అయ్యింది. గత మూడు దశాబ్దాలుగా చేపట్టిన సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల వినాశకర క్రమం గురించి చర్చించటాన్ని అభావం చేయడంతోపాటు సంపద సృజన, కేంద్రీకరణ, కుబేరుల సంఖ్య, సంపదలో పెరుగుదలే ముఖ్యం అన్న భావజాలాన్ని కూడా బలంగా ప్రచారం చేస్తోన్నారు. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఆర్థిక నిర్మాణాలే, వాటిని పెంచి పోషించిన ధోరణులే ఈ స్థాయిలో అసమానతలు తీవ్రం కావడానికి కారణం అన్నది అందరికీ తెలిసిందే.

మన దేశ స్వాతంత్రోద్యమం బ్రిటన్‌లో వలే భూస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా ప్రభవించిన ఉద్యమం వంటిది కాదు. వలస పాలనపై పోరుతో 1947 ఆగష్టు 15న దళారీ బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్ణాలకు అధికార బదిలీ జరిగింది. భారత్‌లో ప్రజాతంత్ర విప్లవం జరుగలేదు కనుకనే భూ సంస్కరణలు అమలు కాలేదు. విదేశీ ఆస్తులు జాతీయం కాలేదు సరికదా, బ్రిటిష్‌ సామ్రాజ్యవాద పెట్టుబడులకు తోడు వివిధ సామ్రాజ్యవాద దేశాల పెట్టుబడులు దేశంలోకి చొరబడ్డాయి. సామ్రాజ్యవాద పెట్టుబడి దేశీయ స్వతంత్ర పెట్టుబడిని ఎదుగనివ్వదు. దేశీయ పెట్టుబడిని తనకు తొత్తుగా మార్చుకుంటుంది. అందువల్లనే ఏడున్నర దశాబ్దాలు గడిచినా భూస్వామ్య మత విలువలు, విదేశీ పెట్టుబడి దోపిడీ అంతం కాలేదు. అది మరింత పెరిగింది. ఫలితంగా ప్రజాస్వామ్యం పేరుతో ధనస్వామ్యం అధికారం చెలాయిస్తోంది. 1947 ఆగష్టు 15న నెహ్రూ ప్రసంగంలో పేదరికాన్ని, అజ్ఞానాన్ని, అవకాశాలలో అసమానతలను రూపుమాపడమే దేశం ముందున్న కర్తవ్యమని ఉద్దాటించారు. మన ప్రభుత్వాలు అమలు చేసిన ప్రణాళికబద్ధ అభివృద్ధి బడా బూర్జువా, బడా భూస్వామ్య వర్గాల పురోగతికి తోడ్పడింది తప్ప ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఉపయోగపడలేదన్నది ఏడు దశాబ్దాల అనుభవం రుజువు చేస్తోంది.

1990వ దశకం నుంచి సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ఆర్థిక విధానాల అమలు పేరుతో సాగుతున్న విధ్వంసం దేశ ఆర్థిక వ్యవస్థను అల్లకల్లోలం చేస్తున్నది. పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద ధోరణులు జొరబడి మౌలిక రంగాలపై గుత్తాధివత్యాన్ని చెలాయిస్తున్నాయి. ఇప్పుడు సామ్రాజ్యవాద దేశాలన్ని భారత్‌వైపే చూస్తున్నాయి. ఇక్కడి మార్కెట్‌ను, సహజ వనరులను కొల్లగొట్టడానికి భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అంతకు కొన్ని వందల రెట్లు లాభాలను ఆర్జిస్తున్నాయి. దేశ సంపదను పరోక్షంగా దోచుకుంటున్నాయి. ఇవాళ ప్రపంచ బహుళజాతి సంస్థలు, ద్రవ్యసంస్థలు భారత ప్రభుత్వంతో పలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ప్రపంచీకరణ వల్ల కార్పొరేట్‌ దిగ్గజాలకు తప్ప సామాన్యుడికి ఒరుగుతున్న లాభం ఏమీ లేదు. శ్రమ దోపిడీ, పర్యావరణ విధ్వంసం మరింతగా పెరిగిపోతున్నది. దేశం అనుసరిస్తున్న విధానాలు ఈ శక్తులను పెంచి పోషించేవిగా ఉండడం దురదృష్టకరం.

ఏడు దశాబ్దాల పైగా దేశీయ పాలనలో దేశం ఎంతో పురోగమించిందని దోపిడీ పాలకులు తొణక్కుండా ప్రకటిస్తున్నారు. కానీ నానాటికీ దిగజారుతున్న జీవన ప్రమాణాలతో శ్రామిక ప్రజానీకం దిక్కుతోచకున్నారు. నిజానికి కరోనా సృష్టించిన సంక్షోభం కంటే మన పాలకులు, ముఖ్యంగా ఎనిమిదేళ్లుగా మోడీ ప్రభుత్వం అమలు చేస్తోన్న రాజకీయార్థిక విధానాలతో ప్రజాజీవనం కకావికలౌతున్నది. కరోనా ఆంక్షల నడుమ ప్రజా ప్రతిఘటన ఇబ్బందిని ఎదుర్కొనకుండానే ప్రజా వ్యతిరేక విధానాలను నల్లేరు మీద నడకలా అమలు చేస్తూ పోతున్న నేపథ్యమిది. మోడీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలైన జిఎస్‌టి, పెద్దనోట్ల రద్దు, కార్మిక చట్టాల సవరణ వంటి విధానాలన్నీ సామ్రాజ్యవాద, బడా కార్పొరేట్లకే తోడ్బ్చడ్డాయి.

చిన్న మధ్య తరహ పరిశ్రమలు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. చిల్లర వర్తకంలోకి 100 శాతం విదేశీ పెట్టుబడికి అనుమతించడం, దేశానికి స్వావలంబనకు వెన్నెముకలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం వంటి విధానాలతో పాటు ప్రజా ఉద్యమాలపై, మేధావులపై, జర్నలిస్టులపై, కళాకారులపై, ప్రజాసంఘాలపై దేశద్రోహ చట్టాన్ని, ఉపా చట్టాన్ని విచ్చలవిడిగా ప్రయోగిస్తున్నారు. దేశంలో భావ వ్యక్తీకరతణ స్వేచ్ఛ తీవ్ర సంక్షోభంలో ఉంది. మీడియా, ముఖ్యంగా స్వతంత్ర జర్నలిస్టులపై అప్రకటిత ఎమర్జెన్సీని దేశంలోని నేటి పరిస్థితులు రుజువు చేస్తున్నాయి. భిన్నాభిప్రాయాలను నేరంగా పరిగణించి, విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులపై క్రిమినల్‌, టెర్రరిస్టు వ్యతిరేక చట్టాల కింద నేరాలు ఆరోపించి కేసులు నమోదు చేస్తున్నది.

పెట్టుబడిదారీ ఆర్థిక సంక్షోభం 2008 నుంచి ప్రపంచాన్ని చుట్టుముట్టింది. అన్ని ఖండాల్లోని పెట్టుబడిదారీ దేశాలన్నిటా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగం ప్రబలింది. ఆర్థిక అసమానతలు పెరిగాయి. భారతదేశ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. ఆర్థిక సంక్షోభానికి తోడు కరోనా మహమ్మారి కాలంలో పెట్టుబడిదారీ సానుకూల ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రపంచీకరణ విధానాలు శ్రామిక ప్రజల జీవనాన్ని మరింత దుర్భరం చేస్తున్నాయి. 1980వ దశకంలో అట్టహాసంగా ప్రకటించిన ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు పెట్టుబడిదారీ వ్యవస్థలోని అన్ని సమస్యలకూ సర్వరోగనివారిణిగా ప్రచారం చేసుకున్నారు. కానీ మూడు దశాబ్దాలు గడిచేసరికి ఆ విధానాల డొల్లతనం ప్రస్తుత ఆర్థిక సంక్షోభ రూపంలో వ్యక్తమవుతోంది. భారత దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల ప్రపంచీకరణ విధానాల వల్ల దేశం కరోనాకు ముందే మాంద్యంలోకి జారుకున్నది.

కరోనా వైరస్‌ను అరికట్టడంలో మోడీ ప్రభుత్వ అసమర్ధత వల్ల పరిస్థితి మరింత దిగజారింది. ఒకవైపున ఆర్థిక సంక్షోభం, ఉపాధి కోల్పోవడంతో పాటు, అన్ని నిత్యావసర సరుకుల, ప్రత్యేకించి పెట్రోలియం ఉత్పత్తుల ధరలు దారుణంగా పెరగడం ప్రజలనుభవిస్తున్న దుర్భర పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నది. మోడీ ప్రభుత్వ హయాంలో తారాస్థాయికి చేరిన ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ప్రజల వద్ద ఏమీ మిగల్బలేదు. భూములు, గనులు, అడవులు, అంతరిక్షంలోని టెలికాం స్పెక్టమ్‌లు అన్నింటినీ కార్పొరేట్లకు అర్చించేస్తున్నారు. అందుకు చట్టాలు ఆటంకంగా ఉంటే ఆ చట్టాలనే మార్చేస్తున్నారు. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తున్నారు. ఈ విధానాలు సామాజిక న్యాయాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ప్రజాధనంతో నిర్మించిన లక్షల కోట్ల విలువ చేసే ప్రభుత్వ రంగ సంస్థలను గుండుగుత్తగా అమ్మేస్తున్నారు.

ఇవాళ దేశంలో పాలకవర్గ పార్టీలన్నీ తమ కండబలం, ధనబలంతో పాటు వివిధ ప్రజాకర్షక పథకాలపై ఆధారపడుతూ ప్రజలను పరాధీనులుగా చేస్తున్నారు. దేశంలో ప్రపంచీకరణ విధానాల దుష్ఫలితాలు నేడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శత కోటీశ్వరులు సహస్ర కోటీశ్వరులుగా పైపైకి పోవడం, సామాన్యులు మరింత అథోగతికి దిగజారడం చూస్తునే ఉన్నాం. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మడం, దేశ విదేశీ ప్రైవేటు సంస్థలకు ఎర్రతివాచీ పరవడం యథేచ్ఛ‌గా కొనసాగుతున్నది. మరోవైపున రైతుల, కార్మికుల ఇతర (శ్రమ జీవుల హక్కులు హరించబడుతున్నాయి. మొత్తంగా ప్రజాతంత్ర, పౌరహక్కులే ప్రమాదంలో పడిపోయాయి. ప్రభుత్వం నుండి ఏక కాలంలో తీవ్రతరమైన ఈ దాడులు దేశంలోని కార్మిక, రైతాంగ ఇతర శ్రామిక వర్గాలన్నీ ఏకమై ఎదిరించాల్సిన అనివార్య పరిస్థితులను కూడా కల్పిస్తున్నాయి. రైతులు, వివిధ సెక్షన్ల కార్మికులు, ఉద్యోగులు దేశవ్యాపిత పోరాటాల్లోకి వస్తున్నారు.

మానవ జాతి చరిత్రలో ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో ప్రస్తుత ఆర్థిక అసమానతలు ఉన్నాయని మంత్లీ రివ్యూ తాజా పత్రిక పేర్కొంది. విపరీతంగా పెరిగిపోతున్న ఆర్థిక అసమానతల గురించి ఈ మధ్య కథనాలు చాలా వచ్చాయి. “చంపుతున్న అసమానతలు” అన్న పేరుతో ఇటీవలే ఆక్స్ ఫామ్‌ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2021లో 84 శాతం కుటుంబాల ఆదాయం పడిపోయింది. అయితే అదే సంవత్సరంలో బిలియనీర్ల సంఖ్య 102 నుంచి 142కి పెరిగింది. దేశంలో 100 మంది కుబేరుల సంపద అదే సంవత్సరంలో 57.3 లక్షల కోట్లకు పెరిగింది. దిగువ 50 శాతం కుటుంబాల సంపద జాతీయ ఆదాయంలో 6 శాతం మాత్రమే కలిగి ఉన్నారు. 1 శాతం కుటుంబాల వద్ద జిడిపిలో 33 శాతం సంపద పోగుపడింది. 10 శాతం కుటుంబాల వద్ద జిడిపిలో 73 శాతం సంపద ఉంది. ధనవంతులైన 100 కుటుంబాల సంపదలో ఐదవ వంతు పెరుగుదలకు ఒకే వ్యక్తి మరియు వ్యాపార సంస్థ అయిన అదానీల సంపద పెరుగుదల కారణమని ఆక్స్ ఫామ్‌ ఎత్తి చూపింది.

భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశం. ఆర్థిక వ్యవస్థ పెరుగుతోంది. అదే సమయంలో నిరుద్యోగం, పేదరికం పెరుగుతోంది. మన ఆర్థిక వ్యవస్థ ఉపాధి రహిత వృద్ధికి తోద్బడుతుంది. మోడీ ప్రభుత్వం కార్మికులు, రైతాంగం, గిరిజనులు, యువకులు, మహిళలు, దళితులు, మైనారిటీలు ఎదుర్కొంటున్న ఏ ఒక్క సమస్యను పరిష్కరించడం లేదు. మరోవైపు దేశ ప్రజల ప్రయోజనాలను సామ్రాజ్యవాదులకు అమ్మివేస్తున్న, ప్రజాస్వామిక హక్కులను, విలువలను, సాంప్రదాయాలను ధ్వంసంచేస్తున్న, దేశాన్ని మతపరంగా, సాంస్కృతికంగా చీల్చడానికి ప్రయత్నిస్తున్న నేటి పాలకులకు వ్యతిరేకంగా శక్తివంతమైన, నిశ్చయాత్మకమైన ఐక్యపోరాటం సాగించాలన్నది దేశంలో బలంగా వ్యక్తమవుతున్న ఆకాంక్ష.

రాష్ట్రంలో, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావడం అసాధ్యమని గత ఏడున్నర దశాబ్దాల పైగా సాగిన పాలన అనుభవం రుజువు చేస్తోంది. అందువల్ల భారత పాలక వర్గాల ప్రజావ్యతిరేక భూస్వామ్య, స్వదేశీ, విదేశీ పెట్టుబడి అనుకూల విధానాలకు, హిందూత్వ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు సంఘటిత కావాలి. దోపిడీ, పీడన, సామ్రాజ్యవాద ఆధిపత్యాలకు వ్యతిరేకంగా పోరాడటం తప్ప మరో మార్గం లేదు. బడా బూర్జువా, భూస్వామ్య పార్లమెంటరీ రాజకీయాలను నమ్మడం ఇకపై సాధ్యం కాదు. భారతదేశ ప్రజలందరికి స్వాతంత్య్రం నూతన పొందికతో ఆవిర్భవించాలి. ప్రజాతంత్ర ప్రత్యామ్నాయంగా కార్యక్రమం రూపొందించుకోవాలి. అది ప్రజల రాజకీయ, ఆర్థిక, సామాజిక విముక్తి లక్ష్యాలను కలిగి ఉండాలి. ఆ కార్యక్రమం, కార్మిక, కర్షక, యువత సంఘటిత ప్రతిఘటన ప్రజా ఉద్యమాల ద్వారానే ప్రత్యామ్నాయం ఆవిర్భవిస్తుంది.
ప్రజాస్వామ్య, లౌకిక, అభ్యుదయ శ్రేణులు ప్రజా ఉద్యమానికి దన్నుగా నిలువాలి.

ఎ. నర్సింహారెడ్డి

Leave a Reply