(1981లో వచ్చిన *గద్దర్‌ పాటలు* పుస్తకానికి రాసిన ముందుమాట)

ఆటా పాటా మాటా? ఆటా పాటా మాటా – మూడూ ఏది యేదో విడిగా కనిపించనంత ముప్పేటగా ఒక కవి – గాయకుడిలో కలవడం, ఆదిమ మానవ గణ జీవితాన్ని ఆధునిక కాలంలో ప్రస్తుత క్షణంలో అపురూపంగా చూపించ గలుగుతూంది. అశేష ప్రేక్షక/ శ్రోతల్ని మెప్పించగలుగుతూంది. ఇది సర్వసాధారణ విషయమైతే ఇక్కడ ప్రస్తావించవలసిన పని లేదు. సులభమైతే పేర్కోవడం అనవసరం. అనుకరించడానికి గూడా అందని సూక్ష్మం ఏదో ఇమిడి వుంది యీ కళా యింద్రజాలంలో ` అందుకే నిజంగా కూడా ఈనాడు గద్దర్‌ను చూపాకనే ఇంకెవరినైనా చూపాలి.

ఒడ్డూ పొడుగూ, బక్కా బలుపూ, పీలా గౌళా, బరువూ లఘువూ – ఇవేవీ గద్దర్‌ సాంస్కృతిక కార్యక్రమంలో ఎవరికీ తోచవు – తనకంటె ఘనంగా రాగాలు సాగదీస్తూ పాడేవాళ్ళు వుండవచ్చుగాని  కదలికలుంటేనా? ఒక్క పాటనో రెండు మూడింటిలోనో ,  తనకంటె వీనుల నిండుగా ఆలపించగల వాళ్ళూ ఉండవచ్చుగాని, సహజత్వముంటేగా? తేలిగ్గా చలాకీగా రివటలా కనిపించే వాళ్ళుండవచ్చుగాని, ఒళ్ళా, రబ్బరా అనిపించాలిగా ? ఒక్క ‘‘రసాన్నో’’ మరొక్క ‘‘రసాన్నో’’ బాగా, ఒక్కోమారు అతిగా కూడా పలికించవచ్చుగాని, కంఠంలో, ముఖ కవళికల్లో, అవయవాల తేరికలో ఏ ‘రసాని’కి తగినట్టు, ఆ ‘రసాన్ని’ తాననుభవించి తతిమా వారి ననుభవింప జేయగలగడం గద్దర్‌ విశిష్టత.

పేరూ వూరూ ఎవరిక్కావాలి, గద్దర్‌ కావాలిగాని? అసలు పేరు ఎవరికీ గుర్తుండ నంతగా ఈ గొప్ప పేరు పోరాట ప్రజా సంస్కృతికి మారుపేరై పోయింది. జననాట్యమండలి వూసే యెత్తకుండా ఒక్క గద్దర్‌కే ‘‘పెద్దపీట’’ వెయ్యడం తనకే ఇష్టం వుండదు. ఒకప్పుడు భూపాల్‌ ఆట, సంధ్య పాట, గద్దర్‌ ఆటా మాటా పాటా సమ్మేళనం లాగుండేవి. విప్లవ రచయితల సంఘం అంటూ 1970లో కవులు, కథకులు, విమర్శకులూ, రైతాంగ సాయుధ పోరాట దీప్తితో, వయస్సుతో పనిలేక మనస్సులొకటై సంస్థగా రూపొందాకనే ఏర్పడిరదని, అందుచేత వి.ర.సం. అన్నకు జననాట్యమండలి తమ్ముడని ఎవరైన ఆనుకుంటే అది పొరపాటే. వి.ర.సం. ధైర్యంగా వేసిన బాట దానిదే కాదు. ఆ తర్వాత ఒకటొకటిగా వచ్చిన సాంస్కృతిక సంస్థలన్నిటిదీ ` నిజానికి వి.ర.సం. కొత్తగా సాంస్కృతిక రంగంలో వేసింది, ‘‘రాజ’’ మార్గం. కాదు ` రక్కసి ముళ్ళ దారి ` ప్రస్తుత ‘‘రాజ్య’’ విధ్వంసనా మార్గం. ప్రజాపంథా `దానికి విప్లవోద్యమ సారథులైన మార్క్సిస్టు ` లెనినిస్టు పార్టీకీ, ఇంకా లోతుకెళ్ళి చూస్తే ఉద్యమ పోరాటకారులకీ, వారికి ఆసట, బాసట ఇచ్చిన విప్లవ ప్రజానీకానికీ చెందిన ప్రజాయుద్ధ పంథాయే ` సంజీవ్‌గాని, మరొకరుగాని, గద్దర్‌ సహచరులే తప్ప అనుచరులు కాదంటే కారణం ఇది వుమ్మడి కుటుంబంవంటి సంస్థ కావడమే. వీరందరినీ కూడగట్టి ఓర్పుతో ప్రజాకళకూ, ప్రజారాజకీయానికీ మధ్య గల విడదీయరాని సంబంధాన్ని తెలియజెప్పి, బైటిచూపుతో లోజూపూ విస్తరింపజేయడంతో బాటుగా పదు నెక్కించి మాటను తూటాగా, పాటను ‘‘కాటా’’గా, మాటాపాటా జతబడిన ఆటను సాంస్కృతిక పోరాటంగా మలిచి మెలిపిన కా॥ బి. నరసింగరావు నిర్మాత, సూత్రధారి, నిర్వాహకుడు.

ప్రజానాట్యమండలి చివరి రోజుల్లో సాంస్కృతిక రంగంలో ప్రవేశించిన నాకు, జననాట్యమండలిగానీ, తదితర ప్రజా సాంస్కృతిక సంస్థలుగానీ ఆశ్చర్యం, మెప్పు కలిగించి వుండగూడదు గాని, కలిగించాయి. ఈ కలిగించింది, నిజానికి కనువిప్పు. బ్రహ్మంగారి తత్వాలు, సిద్ధప్ప తత్వాలు, తుమ్మెద పాటలు, రాజకీయ వీధి భాగవతాలు, చెంచీత పాటలు, బుడబుక్కల వారి మాటలధాటి, పిట్టల దొర ప్రసంగాలు, గొల్లసుద్దులు – ఇవి ఒకెత్తు. బుర్రకథలు ఒకెత్తు – ఇవన్నీ బీదజనాన్ని అలరించేవే. ఇక మధ్యతరగతి వాళ్ళకు నాటకాలు, మొదటి జాబితాలో చేరివున్న వాటిని విశ్లేషిస్తే, రూపానిదేముందని అనిపించవచ్చుగాని, వస్తువు (ఇతివృత్తం) నుంచి రూపాన్ని విడగొట్టి చూడడమే తప్పని తెలుస్తూంది. జడలాగా అల్లుకుపోతేగాని, సంస్కృతి – సందేశానికి రూపమనేది అడ్డంకి అనిపిస్తూంది. జానపద సాహిత్యంలో పురాణాలకూ, ఇతిహాసాలకూ, ఏమీ తీసిపోని పుక్కిటి కథలూ, ‘‘అచల’’ తత్వ బోధలూ మెట్ట వేదాంతాలూ, మూఢవిశ్వాసాలూ, క్రూర దురాచారాలతో గూడిన గాథలూ కావలసినన్ని ఉన్నాయి. ఆధ్మాత్మ రామాయణ కీర్తనలు మొదలు అచల బోధ దాకా, సీత సమర్త మొదలు కుచ్చల కథ దాకా, బ్రహ్మంగారి మొదలు యేగంటివారి దాకా, పాలకవర్గాల సంస్కృతే ఈ ప్రజా కళారూపాల్లోకి విషంలా ఎక్కి జనాన్ని నిర్జీవంగా నిష్క్రియగా ఉంచి వేసేందుకు పనికి వచ్చింది. దేశింగు రాజు కథగాని, పెద బొబ్బిలి కథగాని గత చరిత్ర నుంచి ప్రస్తుత రాజకీయానికి సరైన దారి సూచించనైనా లేదు. అందుచేత రూపాన్ని బట్టి మాత్రమే జానపద సంస్కృతిని తలమీద కెక్కించుకోవడం తెలివి  మాలిన పని. అసలు మనది జానపద సంస్కృతే కాదు. ప్రజా సంస్కృతి !పాత రూపాల్నే వాడుకోనక్కర్లేదు. నిత్య జీవితంలో జనం తమ కష్టాలనూ, కన్నీళ్ళనూ మూలుగులనూ తెగువనూ తెంపరి తనాన్నీ, ఎన్నెన్ని ‘‘నిత్య నూతన’’ మైన కొత్త – వింత రూపాల ద్వారా ప్రకటిస్తుందో తెలుసుకోటానికి ఒక జీవిత కాలం చాలదనిపిస్తుంది.

ఎంతోకొంత చదివి కుదురుగా ఏదో ఉద్యోగం చేసుకుంటూన్న గద్దర్‌ గాని, మరొకరుగాని, వీటినెలా ఒడుపుగా పట్టుకుని సొంతపరచుకున్నారు? జనం వెంట బడీ జనంతో వుండీ అడిగీ బతిమాలీ బుజ్జగించీ, అన్నిటికంటె ముఖ్యంగా తాము జనం మనుషులమేనని జనానికి నమ్మకం కలిగించీ అభిమానం పుట్టించీ నేర్చుకున్నారు. నిజమైన ప్రజా సంస్కృతికి చరిత్రకు లాగే తత్వశాస్త్ర భావాలకు లాగే, కర్తలు ప్రజలే. ఇది మౌలిక సత్యం ` దీన్ని తెలుసుకుంటే నువ్వు ప్రజల్ని వదలవు, ప్రజలు నిన్ను వదలరు ` రూపమే గాక భాషో? ఆ భాషలలో యాసో? పలుకుబడి మెళకువో? ‘‘అవలీల’’ అనిపించేదానిలో ఎంత ఓర్పుతో గూడిన కష్టం దాగొని వుంటుందో! తేలిక అనిపించే దాని కంటె బరువైనదేదీ ఉండదు. ఆ సూక్ష్మం కథల్లో కొడవటిగంటి కుటుంబరావుకి తెలుసు – పాటల్లో గద్దర్‌కి తెలుసు.

1857లో తొలి భారతీయ స్వాతంత్య్ర పోరాటం ఒక ‘ఘదర్‌’. 1913 ప్రాంతంలో అమెరికా పశ్చిమకోస్తా – కాలిఫోర్నియా రాష్ట్రంలో కాయకష్టం చేస్తూ ‘‘మాతృ’’ భూమిలో కంటె ఎక్కువే సంపాదించుకుంటూ, పేద కూలీలైన శిఖ్కు రైతాంగంలో లాలా హర్దయాళ్‌ లాంటి మేధావులు రగిలించిన ప్రతీకారాగ్ని ‘ఘదర్‌’’ పత్రికగా మొదలై, ఆ కూటమి పేరునే ‘‘ఘదర్‌’’గా మార్చింది. సైనిక పితూరీ ద్వారా బ్రిటీష్‌ వలసాధిపత్యాన్ని మట్టుబెట్టాలనే ప్రయత్నంలో ఘదర్‌ వీరు లెందరో ప్రాణదానం చేయగా మిగిలినవారు 1930 నాటికి కమ్యూనిస్టులయ్యారు. టెర్రరిజం కుబుసాన్ని పూడ్చుకుని భగత్సింగ్‌, జాతీయ విప్లవ యోధులు అంతర్జాతీయ కార్మిక వర్గ విముక్తి దృక్పథం వైపు పయనించారు. అతని అనుచరులు గాని, తూర్పు బెంగాలులోని చిటగాంగ్‌ ఆయుధాగారం మీద దాడి చేసిన అమరుడు సూర్య సేన్‌ అనుచరులు గాని, అండమాన్‌ దీవులలోని ‘‘సెల్యులర్‌’’ జైల్లో మార్క్సిస్టు బృందాలు కట్టారు. అయితే కొంతకాలం మితవాద అవకాశవాదానికీ మరికొంతకాలం అతివాద దుస్సాహసిక విధానానికీ మార్చి మార్చి గురైంది కమ్యూనిస్టు ఉద్యమం. ముఖ్యంగా వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటాన్ని, జ్వాలలను ఆర్పడంలో తానూ చల్లని కన్నీళ్ళ కడవలతో  పాల్గొన్నాక, ఇరవయ్యేళ్ళకు డార్జిలింగ్‌ జిల్లాలోని నగ్జల్బరీలో, ఆ పిమ్మట ఖీర్భూమ్‌లో, దేబ్రాలో, గోపీవల్లభ్‌ పూర్‌లో, తరైలో, ఇలా దావానంలా శ్రీకాకుళానికీ, గోదావరి లోయకీ, ఈనాటికి, సిరిసిల్లా, జగిత్యాలకీ వ్యాపించిన ప్రజా పోరాట సంప్రదాయం, మహోజ్వలమైన, త్యాగమయమైన భవిష్యత్తు వేసి ముళ్ళబాటలో తూటాలగుండా  పోలీసు కేంపులగుండా ఎదురుకాల్పుల హత్యాకాండ గుండా ముందుకి సాగిపోతూంది. అలుపు తీర్చుకొని ఆటు దిశని మీరి, మళ్ళీ ఉప్పొంగుతున్న యీ రైతాంగ పోరాటం వ్యవసాయిక విప్లవాన్ని ధ్యేయం చేసుకుంది. నూతన ప్రజాస్వామిక నిర్మాణాన్ని లక్ష్యం చేసుకుంది. అయినా ఇప్పటి నుంచీ దీని దూరదృష్టిలో సోషలిజం అంతర్లీనంగానైనా ఉండి తీరుతుంది. లేకుంటే తెన్నుగాని, వ్యూహంగానీ, సవ్యంగా ఉండవు ` పైగా సంస్కరణల వూబిలో ఎన్నికల భ్రమలలో తప్పుడు ఎత్తుగడల ఫలితంగా నేటి ఊబిలో కాలూనే ప్రమాదం ఎప్పుడూ వుంది కాబట్టి విప్లవ రాజకీయ అవగాహన వినా విప్లవ సంస్కృతి నిజంగా ఫలవంతంగా లేదు. గద్దర్‌కూ ఆయన సహచరులకూ, అనుచరులనే వారికీ ఇలాంటి చైతన్యమే కాదు, వర్గపోరాటాల అంతిమ పర్యవసానంగా సోషలిస్టు ` కమ్యూనిస్టు చైతన్యం – ఉండి తీరాలి. దీనికి ఆచరణ, అధ్యయనం కంటె ముఖ్యం కావచ్చుగాని, అధ్యయనాన్ని, అవగాహననీ పూర్తిగా కిందికి నెట్టడం అవివేకం. బుద్ధి జీవులూ, కష్టజీవులూ సంగమించే బిందువిదే. అక్కడికి వచ్చి చేరుకునే క్రమంలో  ఉన్నాడు గద్దర్‌ – స్వాగతం పలికేందు కెందరో పురోగాములు లేరు.

2

‘‘ఆర్బేనిటి’’ కి గద్దర్‌ కవితారీతికి చుక్కెదురు. తనకు పాఠకులకంటె ప్రేక్షక శ్రోతలే ముఖ్యం, వీళ్ళెక్కువగా ‘‘పాటక’’ జనమే. తన పాట వాళ్ళకే, తన మాటా ఆటా వాళ్ళకే. అవేవీ తాత్విక చింతనా శిఖరాలెక్కవు. కడుపుకి చల్ల కదలని విధంగా నింపాదిగా నిమ్మళంగా సొంత, వింత సంకేతాల సుభావం సమకూర్చుకొని అగమ్య గోచరత్వానికో తళుక్‌ ` చమక్‌ ట్రిక్‌ ` టక్కులతో పాటుబడే కవులు నగ్నమునితో మొదలూ కాలేదు ` అంతమూ కాబోరు. ‘‘ప్రయోగవాద’’ మనో ‘‘అనుభూతివాద’’ మనో ఏవో పేర్లు మెడల్లో వేసుకు, మధ్యతరగతి  కింద ఫాయా పాఠకుల్ని ప్రలోభపెట్టుతూ, కీర్తి ప్రతిష్ఠా సంపాదించుకోవచ్చు, ఆకర్షణా కలిగించవచ్చు. ఇవి మిణుగురులు కాకపోతే మెరుపులు. వంపులూ, విరుపులూ ఎన్నో ఉండీ యీ మెరుపులు సాహిత్యంలో ‘‘శిలాశాశ్వతం’’గా నిలిచిపోయినా ఆశ్చర్యం లేదు. అసూయా పన్లేదు ` కావల్సింది నిలిచి వెలిగే దీపాలు ` గుడిసెలో గుండెలో, చిమ్మచీకట్లో ఘోర నిరాశలో పోరాట సమ్మర్థంలో ఉద్యమ సంరంభంలో ` కరదీపాలు వెలిగి వెలిగించేవి. కాలుతూ వెలుతురు నిచ్చేవి. ముందు దారి చూపేవి. వీటి తైలం రక్తం.

ఇలాంటివి అపూర్వాలా ? సుంకర బుర్రకథలు, నాజర్‌ పాటలు కోగంటి గేయాలు వగైరా ఏ ముప్పైయేళ్ళ కిందటే వచ్చాయికావా?  ప్రజానాట్యమండలి ఉండేది కాదా? కాదని ఎవరంటారుగాని, ఏ ఒకటో, అరో తృప్తిస్తే, జననాట్యమండలి – అందులోనూ గద్దర్‌ ` పాటలకూ వాటికీ మధ్య పోలికలనటుంచి తేడాలను చూడవచ్చు. బాణీయే ప్రధానం కాదు. భాషలో పాండిత్య వాసనలు భూస్వామ్య దుర్గంధాలే – రైతు దృక్పథం అప్పట్లో తత్వాలనో పదాలనో ఆశ్రయించి ఉండేది. అనుకోకుండానే ఆధ్యాత్మిక ధోరణి తోచేది. నగ్నముని ‘‘శ్రీశ్రీ యుగం’’ అంతమైందని అంటే, ఆరుద్ర శ్రీశ్రీ స్థానంలో కోగంటిని యుగకర్తగా భావించడం ఉత్తినే జరగలేదు. వ్యక్తిని బట్టి యుగమేమిటి? యుగ హృదయం (జీట్‌ గెస్ట్‌) ఏ కవిలో నిండుగా, మెండుగా స్పందిస్తుందో అతడు పేరెన్నిక గంటాడు. శ్రీశ్రీదీ కాదు, కోగంటిదసలే కాదు, గద్దర్‌ది కూడా కాదు. కాలం `-అది ప్రజలది -దాన్ని బలంగా పలికించిన కవి చరితార్థుడు.

సరోజ్‌ దత్తానటుంచి, ప్రాణిగ్రహిని వరవడిగా తీసుకున్నా జముకుల కథ లోనూ ఆయన పాత రోత బూర్జువా జాతీయవాద ధోరణులు మిగిలినట్టుగా గత వైభవాన్ని ప్రస్తుతించే సందర్భాలు కనిపిస్తాయి. కమ్యూనిస్టుపార్టీ ప్రత్యేకాంధ్రనూ విశాలాంధ్రనూ కోరడం వేరు, గతంలో గోరంతల్ని  కొండంతలు చెయ్యడం వేరు. వేములపల్లి శ్రీకృష్ణ, కొండేపూడి లక్ష్మీనారాయణ, పులుపుల శివయ్య వగైరాలు అభూత కల్పనలకు గూడా వెనుకాడలేదు. అతిశయోక్తి అంటే అబద్ధమనే అవగాహన వారికి లేదు. నిజానికి వాళ్ళు వాళ్ళ పార్టీ అప్పటినుంచే బూర్జువా జాతీయవాదం  బందీ. అది వ్యాధిగా ముదిరి 1962 తరువాత ఉన్మాద స్థితికి చేరుకుంది. దీనికి అంటు తెగులులాంటి రివిజనిజం తోడై చివరి కా పార్టీ వట్టి ‘‘వామ’’ పక్ష పార్టీగా మిగలడమే గాక ‘‘అంతర్జాతీయ కార్మిక సమైక్యత’’ నెపాన రష్యన్‌ సోషల్‌ సామ్రాజ్యవాద పూజా పీఠం ముందు దేశ స్వాతంత్య్ర సార్వభౌమాధికారాలను బలి పెట్టడానికి గూడా సిద్ధమైంది. ‘‘సమదూరం’’ అంటూ సమతూకం అంటూ గుర్రాన్నీ గాడిదనీ ఒకేలా చూస్తూ గాడిదకాళ్ళు పట్టడానికే, గాడిదకు మాలిష్‌ చేయడానికే ‘‘మార్క్సిస్టు’’ పార్టీ నిర్ణయించుకుని తానూ ఒక సాహిత్య, సాంస్కృతిక సంఘాన్ని నిర్మించుకుంటూంది.అయితే ఆ పార్టీగానీ ఈ పార్టీగానీ చివరికి ఆర్‌.యస్‌.యస్‌. సైతం గద్దర్‌ పాటల్ని వంగపండు పాటల్ని పాదాలు నరికీ శీర్షికలు మార్చీ తమ సంకలనాలలో ప్రకటించుకునే దివాళాకోరు తనానికి దిగాయి. తమ రాజకీయభ్రష్టతకే ఇది సాంస్కృతిక ప్రతిబింబం. పోరాడే జనం నుంచి ఉత్ప్రేరణ పొందినప్పుడే కళ ముఖాన జీవకళ లేనప్పుడు  ప్రేతకళే. ప్రతిబింబానికి స్వయం ప్రకాశం ఎక్కడిది. ప్రతిధ్వనికి రసమెక్కడిది? నిశ్శబ్దాన్నే మహారవంగా భావించే వాళ్ళు నారాయణబాబు నుంచి నగ్నముని దాకా ఉన్నారు. ఇది ఘనమనిపించే శూన్యత. బుద్ధిహీనత చేసే బహుపాత్రాభినయంలో ఇదో భాగం. ప్రపంచాన్నే జయించగోరే మహోద్యమానికి కావలసింది, సహజ మానుష, ధీర సంకల్పం. అది వాచ్యమైనంతగా వ్యంగ్యం కాదు. ‘గళర్గళ గోదావరి’ని కుక్కలూ ఈదలేవు, వాటి తోకలు బట్టిన నక్కలూ ఈదలేవు. ఎందుకంటే ఇది ఏటి ఎదురీత. మొసళ్ళను, మోసగాళ్ళనూ, గండాలనూ, గూండాలనూ, సుళ్ళనూ, వురవళ్ళనూ ఎదుర్కోడానికి శక్తికి పర్యాయపదమైన వ్యక్తే ఈది అద్దరి చేరుకోగలడు. చేర్పించనూ గలడు. ఇదిగో గద్దర్‌ ఇలాంటి కవితాశక్తికి పర్యాయపదమైన వ్యక్తి. ఇప్పటికింకా అంకురప్రాయంగానే ఆరంభంగానే కనిపిస్తున్నా భవిష్యత్తు యీ పాటల సొత్తు.

చదువుకోడానికైతే చప్పగానూ, వినడానికేమో గొప్పగానూ ఉంటాయని గద్దర్‌ పాటల విషయంలో ఒక విమర్శ – విమర్శ అనగానే ప్రతికూల విమర్శ అనో, కువిమర్శ అనో భావించవలసిన పనిలేదు. డా॥ చేకూరి రామారావు విమర్శ కూడా అలాంటిదేమి కాదు. మిత్రుని సూచనగానే గ్రహించాలి తప్ప దాన్ని రాతిబెడ్డ అనుకోగూడదు. విమర్శ నుంచి నేర్చుకోవలసింది రచయిత. రచనను బోధపరచుకోవలసిందీ రచనలో రచయితలాగా అనుభవించవలసిందీ విమర్శకుడు – ఇది అన్యోన్యతాక్రియ. ‘బాబూ’ ‘బాబూ’ పల్లవిలో గద్దర్‌ రాసిన సాదా పాటనే తీసుకుందాం. ఇందులో మనకు వినిపించేది నిస్సహాయమైన దీన మానవ దుస్థితి ` మూగగుండె మూలుగుకి అక్షర రూపమిచ్చిన తీరని ఆర్తి. దీన్ని విమర్శకుడు గ్రహించకపోతే ఆదిలోనే హంసపాదు పెట్టుకుంటున్నారన్నమాట.

చెవికీ, కంటికీ ఒకే సమయంలో పట్టి తన వైపుకి లాక్కోగలిగిన కవితకు వచన కవితలో అవకాశం తక్కువ. ఉదాత్త అనుదాత్త స్వర భేదాలు మాత్రమే చాలవిక్కడ. బాణీ ఒక్కటే సరిపోదు. చైతన్యాన్ని బలంగా తాకి ఎత్తి దించి ముందుకీ, మీదికీ తోసినట్టుగా తీసుకెళ్ళే వస్తు ప్రపంచాన్ని మార్చడానికి అనువైన తీవ్రతను వుద్దీప్తిలా కలిగిస్తే రచన సఫలమైనట్టు. శిల్పం, వాక్య విన్యాసం, ఎత్తుగడలో ముగింపులో నేర్పు, నిర్వహణలో ప్రజ్ఞ – ఇవి అనవసరమని అననుగాని, ఇవే అవసరమనీ అనను. ఎందుచేతంటే రచన హృదయ కేంద్ర బిందువు పరివేషంలో లేదు. నిజాయితీతో గూడిన మనోభావం అక్షరమై పదమై వాక్యమై పాదమూ అయి చెవికి తగిలిన్పుడు అది అచ్చపు సరుకో కాదో దాని మోతవల్లనే తెలుస్తుంది. దిన వెచ్చపు సరుకు అబద్దీకమైందనీ, సొగసైన నకిలీ కూడా కృత్రిమమైందనీ తనని తానుగా బయటేసుకుంటుంది. సహజత్వం, సాధారణత్వ మనింపించుకుంటే తప్పు రచయితది కాదు.

గ్రామంలో పుట్టి పట్నానికి వచ్చి ఏదో వృత్తిలో స్థిరపడి ఏళ్లూ పూళ్లూ గడిపాక గూడా నాగరికతా నాజూకు లంటని గ్రామీణ భావ ధోరణే మాన్యమని ఎవ్వరూ అనబోరు. దీనికీ దానికీ పోటీయే లేదు. లాలూచీ కుస్తీ యేర్పాటు చేస్తే తప్ప ! ఈ పక్షిదో ఈక, ఆ పక్షిదో ఈక తన ఒంటికి గుచ్చుకుని పక్షుల అందాల పోటీకి ముస్తాబై వెళ్ళే దాని పేరు ‘ఆధునికత’ కాదు. ఇది ఎన్నటికి వేషధారి కాబోదు. బడాయిలు చూపదు. ఆడంబరాలకు పోదు. చైతన్యంతో సూర్యరశ్మిలా వ్యాపించి, జితించి రచనలో వేడినీ, వెలుగునీ ఇస్తుంది తప్ప వేడుకనీ, ముచ్చటనీ కాదు. రూసో ‘నోబుల్‌ శావేజ్‌’ తరహా అమాయక ఆటవికతనుగానీ ‘‘పాస్టొరల్స్‌’’ లోని సరళ సుందర బుద్ధి శైశవాన్ని గాని ‘ఆధునికత’’కు పోటీ బెట్టడంలేదు సుమా! నాగరీకుడవై గూడ నువ్వెప్పుడెలా జీవిత పోరాటాన్ని జీవన నిష్ఠురత్వాన్ని నీ రచనల కెక్కించి ‘‘నాగరికత’’ పేరిట ‘‘నాగర సంస్కారం’’ పేరిట కుహనా ఆచ్ఛాదనలతో పనిబెట్టుకోక, వ్యక్తి వేదనతో సరిపెట్టుకోక, నీ రచనని మహాచారిత్రక శక్తుల దోహద క్రియకు నీరుగా ఎరువుగా జీవధాతువులా చేస్తావో, అప్పుడే నిజానికి నువ్వు ఆధునికుడివి. పంచభూతాలు ‘‘ఎలిమెంటల్‌’’ శక్తులే కాదు. అశేష ప్రజాకోటి పురోగమన ధాటి నీ రచనకు అనన్యమైన శక్తినిస్తుంది. నిర్వేదాన్ని జయిస్తావు. నీరసాన్ని తోసేస్తావు. నిన్ను నీవే మీరి మందిని ఇముడ్చుకుంటావు ` అప్పుడిక  నీకు ‘‘నీ’’ తనం లేదు. ‘మన’ తనం వస్తుంది. వర్గసమాజం వచ్చాక కవికీ పాఠక/శ్రోతకీ మధ్య ఏర్పడి క్రమేపీ విస్తరించిన గండి యిలాగే పూడ్చుతూ వర్గరహిత సమాజం రాకముందు నుంచీ కష్టజీవికీ బుద్ధిజీవికీ భావ, కార్య సమైక్యతకు ప్రాతిపదిక బలపడుతూ స్థిరపడుతూ పోతుంది. వ్యక్తి విశిష్టతావాదమనే భౌతిక భావజాడ్యం ఏ కర్మల వ్యవస్థలో పుట్టి పెరిగి చివరకు భస్మాసుర హస్తాన్నెత్తి వ్యక్తి సమగ్రతనే బంధించిందో, ఆ వ్యవస్థ మీదికి పీడిత వర్గ శక్తులతో బాటుగా వాటిలో ఒకటైపోయిన నువ్వు రామం దాడిగా దెబ్బ తర్వాత దెబ్బ తీస్తూ దాని బురుజులకు లగ్గలు వేస్తూ ఆ దుర్గాన్ని ముట్టడిస్తావు. దక్షాధ్వర ధ్వంసంలో ప్రమథ గణంలా నిర్వచక్షణగా అనాలోచిత విధ్వంసానికి పూనుకోవు సరికదా, చారిత్రక బాధ్యతను గుర్తెరిగి, పడిపోయే దోపిడీ గడిలో నీకు ముందు ముందు అక్కరకు రాగల వాటిని చేజిక్కించుకొంటూ, తక్కిన వాటిని నీ కాళ్ళతో తొక్కి చేతులతో నొక్కి వేస్తావు. అప్పుడే నీ చూపులో వర్తమాన కాలం భవిష్యత్కాలంగా మార్పు చెందుతుంది. కళకు కల తోడౌతుంది. అంతేగాని కాలాన్ని వుయ్యాలలా చేసుకొని నువ్వు సవిలాసంగా డోలికా కేళిలో మైమరచిపోవు. నీ కర్తవ్యం వూగిసలాటకాదు. ముందంజ. నువ్వు అడ్డనడకల పీతవికావు, దౌడెత్తే అరబీ గుర్రానివి. మారుతూ, మారుస్తావుగాని నువ్వుగానే వుండి మురుసుకుంటూ మురుసుకుంటూ మరుగున మురుగైనా అవుతావు. శుద్ధ అంతర్వేదనాగ్నిలో మాడిపోనైనా పోతావు. మనుగడ గురించి గానీ జరుగుబాటు గురించిగానీ వేదన బయల్పడాలి. లలితంగా తగిలే ‘జాలగాలి’గానో నీ చెలికే వినిపించే రోదనగానో కాదు` పచ్చి పుండుగా మారిన గుండెలోంచి పెరికిన కత్తిలా, శత్రువు తలపైకి విసరబోయే కఠిన శిలలా, కసితో కక్షగా లేకుంటే అట్టతో చేసిన నీ ‘ముళ్ళ కిరీటాలు’గానీ కెమెరా కంటి నీ ఒంటి మేకులుగానీ నిన్ను దగాకోరుగా దగుల్బాజీగా నిరూపిస్తాయి. పత్రికలు మెచ్చి అచ్చుకిచ్చి ‘సేల్సు’ పెంచుకోవచ్చు. సభలు కరతాళ ధ్వనులతో నిండిపోవచ్చు. ప్రజలకు మాత్రం నీ అసలు రూపు తెలీక పోలేదు. నీ ‘కౌంటర్‌ ఫీట్‌’ సరుకు చెల్లదు. ‘సేన’ పెట్టుకో, ‘ఎంబ్లెమ్‌’ వుంచుకో, ‘రబ్బర్‌ స్టాంప్‌’, ‘లెటర్‌పేడ్‌’, జెరాక్స్‌ వగైరా హంగులు సమకూర్చుకో. ఫలితం శూన్యం. అక్షర వ్యాపారం ‘తిరుక్షవర’ మౌతుంది. వడ్డీ కూడా కిట్టదు. అక్షర లక్షాధికారీ, కళా కుబేరుడా, శిల్ప భోగీ, ‘కావ్యానంద’ సుఖరోగీ, కళా మర్మస్థాన సర్వజ్ఞ శిఖామణీ, ఒరే బద్మాష్‌ ! రుక్కుల నకళ్ళు తీస్తున్నావట్రా? గోస్టులను వూరేగిస్తున్నావట్రా? బాద్‌లేర్‌, రాంబోఁ, కాప్కా, జాయిస్‌, డిలాన్‌, థామస్‌, ఆలెన్‌ గిన్స్‌బర్గ్‌ల ‘లలితా సహస్ర నామం’ చెబుతున్నావట్రా? నీకూ నీ జనానికీ పంగనామాలు దిద్దుతున్నావు. నీ కళ్ళ ముందు సాగిపోతున్న మహా మానవ యాత్ర లాంటి వర్తమాన చరిత్రకు యెడంగా వరదెత్తే నదీ తటాన నిలుచుని శిథిలమౌతున్న నీ వ్యక్తిత్వాన్ని విశిష్టమైనదని భావిస్తున్నావు. పిచ్చాడా, పొగరుబోతూ, మాయావీ, ఇంద్రజాలీ, నీ అద్దం రంగు వెలసి పోతుందిరా! నీ కళాయి రాలిపోతుందిరా ! తెలుసుకోరా బాబూ ! సమయం మించి పోలేదు. అక్షరం అద్వితీయ సిద్ధి. కళ అనన్య మహాయుధం. సాహిత్యం యుద్దరంగం. సంస్కృతి మానవ జీవిత సాఫల్యానికి భావ ప్రత్యాకృతి. నీ మూలాలు చూసుకో. మూల్యాలను నిర్థారించుకో.

3

పీల గుండెలు దద్దరిల్లు తున్నాయి. పొడి ఇసక కన్నీటి బుగ్గ అవుతూంది. నిట్టూర్పు నుంచి సెగ లుబుకుతున్నాయి. అక్షరాలు అగ్నిగుండా లవుతున్నాయి. ప్రజా యుద్ధానికి సాహిత్యమూ ఒక రంగమౌతూంది. పాట తూటా కంటె శక్తివంతమౌతూంది. రచయిత సాంస్కృతిక సైనికుడౌతున్నాడు. ‘దందహ్యమాన’ దశాబ్దం గడిచి ‘జాజ్వల్యమాన’ దశాబ్దం మొదలైంది. ఈ వ్యవస్థ  చీకటి కొష్ఠానికి  నిప్పంటుకుంది. దీనుడు ధీరుడౌతున్నాడు. శ్రీశ్రీ యుగమో, గద్దర్‌ యుగమో కాదిది. ప్రజా విప్లవ పోరాటయుగం. దాని నట్టనడుమ నిల్చున్నాడు గనుకనే దాని గుండె చప్పుళ్ళు డప్పుల వాద్యంలా వినిపిస్తున్నాడు గనుకనే గద్దర్‌ ఘనుడౌతున్నాడు. చరిత్ర ప్రవాహ గతిలో వుధృతిలో సాదా వ్యక్తి తరంగ ప్రాయుడు కూడా కాడు. ‘సాదా’ వ్యక్తి నీటి వాలున పడిపోయే చెత్త. గొప్ప వ్యక్తి ప్రవాహ పురోగమనాన్ని అనితర సాధ్యంగా ప్రతిబింబించగలడేగాని దాన్ని యిష్టాధీనంగా మార్చలేడు. ప్రజలే చరిత్ర నిర్మాతలన్నది పిడివాదం కాదు, తిరుమంత్రం కాదు, ప్రత్యక్షర సత్యం. అందువల్లనే గద్దర్‌ పాటల్లో ‘నేను’ పొరబాటున ఎక్కడైనా కనిపించినా, అది సమష్టికి మచ్చుతునకగానే తప్ప,హెచ్చులకోసం వచ్చి తిష్టవేసుక్కూచునే ‘నార్సిపిస్టిక్‌’ (తనంటే తానే మురుసుకునే తత్వం) ధోరణికిగానీ ‘మెగలో మేని యాకల్‌’ (తనకు మించిన వాళ్ళెవరూ లేరనే స్వాధిక్య భావం) వైఖరికి గానీ నిదర్శనం కాదు.

‘‘వ్యక్తికి బహువచనం శక్తి’’ అని సూత్రీకరించిన శ్రీశ్రీ ` శ్రీశ్రీ కంటె ఎక్కువ న్యాయం చేకూరుస్తున్న ప్రజాకవులలో ప్రథముడు గద్దర్‌. శివసాగర్‌లా గూడా విద్యా సంస్కారాలు ఎక్కడా చూపని సహజ కవులలోనూ గద్దర్‌ ప్రథముడే. ‘డీక్లాస్‌’ అయిన కవులలోనూ ప్రథముడే. మరి గద్దర్‌ పాటలు పుస్తకంగా వస్తున్నాయంటే మొదట నేన్నమ్మలేదు. అచ్చైన అక్షరం చచ్చినదాన్తో సమానం. ఎందుకంటే మారే, పెరిగే విస్తరించే  ప్రాణిగుణాన్ని అది పోగొట్టుకుని స్థిరమవుతుంది. బిరుసెక్కుతుంది. ముఖ్యంగా ప్రజాకవిత్వానికి యిది దుర్గతి. ఉదాహరణ కావాలంటే తెలంగాణా పోరాటకాలంలో యాదగిరి రాసిన ‘నైజాము సర్కరోడా’ ఎన్నెన్ని రూపాంతరాలు పొందలేదు ? ఎవడో రాసిన ‘బండెనక బండిగట్టీ’ ప్రతాపరెడ్డికీ, నైజాముకీ వర్తిస్తుంది కాదా! మధ్యయుగాల యూరపులో శిల్ప వృత్తులకు చెందిన వారి వస్తువుల మీద శిల్పి పేరుండేదేకాదు. తాత్వికార్థంలోనేగాక ఆర్థికంగా కూడా పెట్టుబడిదారియే ‘వ్యక్తి’ని సృష్టించింది. సుస్థితికి తెచ్చింది. సంహరిస్తూందిప్పుడు తన అటవీ వ్యవస్థలో. ‘ట్రేడ్‌ మార్కు’ల యుగంలో జీవిస్తూన్న మనం మళ్ళీ 19వ శతాబ్ది చివర విలియమ్‌ మోరిస్‌ లాంటి వాళ్లు కోరినట్టుగా మధ్య యుగాలకు తిరుగు ప్రయాణం కట్టబోవడం లేదు. ‘ఆధునిక మనబడే పెట్టుబడిదారిని కాలితో తోసేసి నూతన ప్రజాస్వామికాన్నీ, సోషలిజాన్నీ చేరబోతున్నాం. ‘ఆనామధేయత్వం’ (Anonymity) రానక్కర్లేదుగాని, ‘సార్వజనీనత్వం’ (Unonimity) వస్తే చాలు ` చీనీ భాషలో  White-haired Girl (తెల్లకురుల పిల్ల) రాసిందెవరు? ఇదిగో గద్దర్‌ పాట సరీగా యీ బాటవెంబడే పోతూంది. రాసింది రాసినట్టుగానే ఉంటుందా? ఇక్కడ పాడిరది మరొక స్థలంలో అదేలా వినిపిస్తూందా? ఇప్పుడు రాసిపాడిరది, కొంతకాలం తర్వాత అలాగే వుంటుందా? భాష, యాస, వుపమానాలు, సాటువలు, ఉదాహరణలు, ఎప్పటికప్పుడు ఎక్కడి కక్కడ మార్పు చెందుతున్నాయి. ప్రజా కవితకు గల సార్వజనీనత కివే లక్షణాలు. ఇవి దిద్దుబాట్లో, తిరగదోడడాలో, ‘ఫేర్‌కాఫీ’ తీయడాలో కాదు. ప్లేటు ఫిరాయించడా లసలు కావు-` ‘ఎప్పటి కయ్యది ప్రస్తుత…’ బాపతు వ్యవహారాలు కానేకావు. మరి ? ప్రాంతీయ, మాండలిక అసమానతల వైవిధ్యం యీ మార్పుల నపేక్షిస్తూ వాటి ఆవశ్యకతను నిర్ణయిస్తూంది.

గద్దర్‌ పాట ప్రతిదీ ఆణిముత్యం అనుకునే ఆరాధక భావం నాకెన్నడూ లేదు. ఏ వ్యక్తికీ అర్చకుణ్ణి కాదు. గద్దర్‌ పాటల్లో పునరావృత్తి  (చెప్పిందే చెప్పడం) వల్ల కలిగే విసుగుదల నా అనుభవానికి రాకపోలేదు. వాటి నిడివి గురించీ నాకు అభ్యంతరం వుంది. కొన్ని కొన్ని పాటల బాణీలు నాకు అంతగా నచ్చలేదు. బూతు విషయంలో అంత పట్టింపులేకున్నా మసాళాగా ‘పెప్‌’గా పనికివస్తాయని నాకు నేను సమాధానం చెప్పుకుని సంతృప్తి చెందినా, వాటి మూలంగా వెలువడే నవ్వుల్నీ చప్పట్లనీ విని విని  వాటి ఆకర్షణ శక్తికి పోనుపోను గద్దర్‌ లోబడి ప్రలోభం చెందుతున్నాడా అని ఒకప్పుడు అనుమానం వేస్తుంది. ఇంకొక ఫిర్యాదు నాది యేమిటంటే ‘యేలరా ఈ మాదిగ బతుకు’ లాంటి పాటల ఆలాపనలో గద్దర్‌ చూపించవలసిన శ్రద్ధ చూపడం లేదేమోననేది. ‘‘యేలరా’’ అని ఎక్కువ వ్యవధి యివ్వకుండా ‘‘ఈ మాదిగ బతుకు’’ అనేసి వెంటనే దరువేస్తూ ‘‘యేలరా యీ మాదిగ బతుకూ / కొట్టుకున్న దొరకదురా మెతుకు’’ అని పాడుతున్నాడు. ‘‘యేలరా’’ను బాగా సాగదీసి ఆ మూడక్షరాల మాటలో బాధనూ, ఆక్రోశాన్ని, దైన్యాన్ని, నిస్సహాయస్థితినీ ఎంతగానైనా పలికించే అవకాశం వుండి కూడా, దాన్ని పూరాగా వాడుకోవడం లేదు. పాటగాణ్ణి కాకున్నా శ్రోతను గనక ఫిర్యాదు చేసే యీ హక్కు నాకుంది.

గద్దర్‌ పాటలో వైవిధ్యం ఆశ్చర్యకరం. గ్యాంగు వాళ్ళెక్కడ ? సాయిబాబా ఎక్కడ? మాదిగ లెక్కడ, దొరలెక్కడ? ప్రాణత్యాగా లెక్కడ, అమీనో ళ్ళెక్కడా? లచ్చుమమ్మ లెక్కడ? దొరలెక్కడ ? వస్తువులోనేగాదు భావంలోనూ వైవిధ్యమే. – ‘లాల్‌ సలామ్‌’ ఆలాపన గర్జన. దాని చరణాలు అమరవీరుల రక్తారుణ చరణాలు. దాని ముగింపు తెగింపుతో గూడిన ప్రతిజ్ఞ. ‘సాయిబాబా’ పాటలోని హాస్యం నిజానికది కాదు. ‘‘వడ్డెరోళ్ళమండి మేము’’ ప్రారంభం పరమ సాధారణం, పరిసమాప్తం పరమ అసాధారణం. నీరసంగా నడిచి నిరాశ మిగిలించే పాటలు గద్దర్‌ మార్క్‌ పాటలేకావు -అలుపు సొలుపుల్లేని నిరంతర పోరాటం చివరి  గెలుపు – గద్దర్‌ మార్క్‌ పాటల పరమార్థం.

సికిందరాబాదు కావల ఒకానొక కుగ్రామంలో ‘బలహీన’ పరిస్థితుల్లో పుట్టి, చనుబాలతో బాటు జనం పాటలను గూడా తాపించిన కన్నతల్లి ఒడి నుంచి బడికివెళ్ళాక కేరుతూ తుళ్ళుతూ వచ్చిన ఒక ‘పోరగాడు’ నిజంగా చెవులు కోసుకునేంత పిచ్చిగా పాటల వేటలో పడి భజన సంఘాలనీ, మరొకటనీ అంతరాలెంచి మడి గట్టుకోక, గాత్రాన్ని అదుపులోకి తెచ్చుకున్న ఎంత కాలానికో మతాన్నీ, కులాన్నీ దాటుకుని వాటి సంకుచిత విష తత్వాలను విరుచుకుని చివరికి ‘జననాట్యమండలి’’ పెన్నిధిలా లభించాడు. దేశ పర్యటనలో పొగడ్తలేగాదు ` కరకురాతి వేట్లూ అందుకున్నాడు. జనం నుంచి ఎంతటి అభిమానం సంపాదించుకున్నాడో, జన కంటకులనుంచి అంత విద్వేషాన్నీ అనుభవించాడు. ఇలా రాటుదేలుతూ, పుఠాలు పడుతూ, అనారోగ్యాన్నీ శ్రమనీ జయిస్తూ, దేశాన్ని పాటల చేతులతో చుట్టేశాడు. ఇంత ప్రసిద్ధి వచ్చిందిగదా అని పొగరు మోతు కాలేదు. సినిమాలో కనిపించినా, పాట వినిపించినా, వెనకటి ప్రజానాట్యమండలి ప్రముఖుల్లో అనేకుల్లో వెండి తెర తుత్తరతో టైటిల్స్‌ దుగ్ధతో మనీ మాయలోకమైన సినీమాయాలోకానికి ప్రయాణం కట్టలేదు. మురికి మొగాల, పుసికళ్ళ, బొక్కి దవడల, పీల రొమ్ముల, బక్క రెట్టల, కాయలుగాచిన చేతుల, అరిగి పగుళ్ళు బారిన కాళ్ళ జనాన్ని విడిచి, నానా తంటాలతో మనవులతో  సిఫార్సులతో జోహుకుందారీ తనాలతో చెప్పుడు మాటలతో చాడీలతో కొండేలతో తారా పథాన్ని చేరుకోవాలని తహతహ చూపడం లేదు. వెనకటివారిలో ఒకరిలా తన వేళ్ళను మరచి గతాన్ని రోసి గండపెండేరాలు బంగారుంగరాలూ తొడగాలనుకోవడం లేదు.

గారడీ జరుగుతూంటే అక్కడ తాను. కొంపా గోడూ పోయిన ఆడాళ్ళు రోజంతా నగరంలో నిరసన ప్రదర్శన చేస్తుంటే వారి వెంట తాను. కొత్త వింత పలుకుబళ్ళు వినిపించిన వారి వద్ద శిష్యుడుగా తాను. బహిరంగ సభల్లో తాను, వీధుల్లో బృందగానాల్లో తాను. ఇలా ఎప్పటికప్పుడు మారాకు వేస్తూ జనం నుంచి స్వయంగా నేరుస్తూ, రోజులూ, వారాలూ వారి యిళ్ళలో వుంటూ తింటూ, తాను వాళ్ళై, వాళ్ళు తానై, గద్దర్‌ అక్షరాలా జనం బిడ్డడయ్యాడు. జనం తలలో పాటల నాలుకయ్యాడు. ప్రజా కళలకు నమూనా అయ్యాడు. పోరాట సాహిత్య సంప్రదాయానికి నమూనా అయ్యాడు. విప్లవోద్యమంలో  సాంస్కృతిక రంగానికి మారు పేరయ్యాడు.

జీవిత కాలంలో కథా పురుషులు (లెజెండరీ పర్సనాలిటీస్‌) కాగలిగిన వాళ్ళు బహుకొద్ది మంది. వారిలో గద్దర్‌ సాహిత్యరంగంలో ముందు వరసలో మున్ముందు నిలిచాడు. సంకలనాలకు మించిన కవి. సన్మానాల పై కెదిగిన కవి. జనానికీ రచయితలకూ గండిని పూడుస్తున్న కవి.

గద్దర్‌ పాటల పుస్తకానికి యీ మాటలు రాయడం నా భాగ్యం.

Leave a Reply