కాలు మోపిన చోటల్లా
ఎద ఎండిన నదినై
పగుళ్లిచ్చిన
ప్రతిఫలనాల్ని

దారి పొడుగునా
వొలక బోస్తూ..
కన్నీళ్లతో
కడుపు నింపుకున్నదాన్ని .

శత్రు శతఘ్నుల
మోతల నడుమ
పుట్టుకతోనే
కన్న తల్లినీ..

కడుపు చేత బట్టుకు
తిరుగుడులో..
తరాల తరుముడులో..
సొంత ఇంటినీ..ఊరినీ..నేలనీ…
జారవిడుచుకున్నదాన్ని..
శకలాలు శకలాలుగా
కుప్ప కూలుతున్న
స్వప్నాల పెడ్డలకింద

గుక్కపట్టిన శోకాల
చివరి ఊపిరి తీసే
చిన్నారి కళ్ళ అంచున
రాజుకుంటున్న
రాజిలేని గాజానో…

హద్దుల నెరుగని
నెత్తుటి హోళీలో
కనికరమెరుగని
కసాయి దాడుల
బూడిద గుట్టలు

వారసమిచ్చి
వొరిగిన తల్లుల
సడలని పిడికిలి
సత్తువ సావని
హమస్ శ్వాసనో…

ఫిరంగి మోతల
షహీదు బాటల
త్యాగ తోరణాల్
తయారు అన్న
లిబియానో…
లెబనాన్ నో…

ఎవర్నైతే నేం
ఎప్పుడూ సడలని
ఎక్కుపెట్టిన
అక్కల పిడికిటి
ఆయుధాన్నేను…

ద్విజాతుల దగా
స్వజాతుల పగా
లోకమంతా ఏకమైనా
నోరుమూయుడే
శరణమన్న
యుద్ధనీతుల బోధలల్లీ
బుజ్జగింపుల బురదదొక్కి
గుండె మంటలు
ఆర్ప జూసినా..

నిప్పుకణికల
హక్కు కుంపటి
పోరు సెగనై
సెంట్రి గాస్తా..

పుడమి నుదుట
పొద్దుపొడుపు
తిలకమయ్యీ
కలలు నిజమై
గెలుపు గీతపు
రాగమయ్యీ
నడచివొస్తా…

ఔను
నాదైన
చారెడు నేలకోసం..
చావెరుగని నీడకోసం..

ద్రోహాల దోస్తానాల
నెత్తుటి నదుల
నెదురీది నిలిచిన
రణభూమిని నేను..

ముప్పెట
దాడుల నడుమకూడా
గుప్పిట సడలని
పోరు పతాక హోరునినేను..!
పాలస్తీనాన్నేను..!!

Leave a Reply