ఏ కాలం నాటి సామాజిక చలనాలైనా ఆ కాలపు సమాజంలోని వర్గ పోరాటాల మీదే ఆధారపడి ఉంటాయి.ఆయా పోరాటాల ఉధృతిని బట్టే ఆ సామాజిక చలనాలు వేగవంతం అవుతాయి. పోరాట శక్తులు ఎంతగా విద్యావంతమై సైద్దాంతీకరణ చెందితే అంతగా అవి చారిత్రిక ఫలాలను అందిస్తాయి.

ఉదాహరణకు, నక్సల్బరీ విస్ఫోటనం తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో విద్యార్థి చలనాలు చాలా వేగవంతమయ్యాయి. ఈనాటి అకడెమిక్ విద్యా రంగంతో పోలిస్తే ఆనాటి ప్రభుత్వరంగ విద్యలో అంతరాల వ్యవస్థ లేదు. ప్రైవేట్ పెట్టుబడి ఇంకా చొరబడలేదు. సాపేక్షికంగానైనా ఉమ్మడి పాఠశాల విధానం అమలులో ఉండేది. దాని వల్ల విద్యార్థుల్లో సామాజిక వాస్తవికత పట్ల సరైన అవగాహనా చైతన్యాలు  అలవడడానికి అవకాశాలు ఎక్కువగా ఉండేవి. సహజంగానే విద్యార్థి, యువతలో ఉండే ఆదర్శాలకు, సాపేక్షిక స్వార్ధ రాహిత్యానికి ఆనాటి చరిత్ర ఊతం ఇచ్చినందువల్ల విద్యార్థులెందరో వారి వారి స్వవర్గ(కుల) పరిమితులను అధిగమించి కార్యాచరణకు దిగారు. గ్రామాలకు తరలివెళ్లి ప్రజల జీవితాలను చదివి అసలైన విద్యా జ్ఞానాలను పొందారు. ప్రజల జీవితాల బాగు కోసం విప్లవ పోరాటాల్లోకి వెళ్లి అమర నాయకులై తమ చారిత్రక పాత్రను పోషించారు.                                                                                                                                

నిజానికి అధికార మార్పిడి(1947) అనంతరం రెండు దశాబ్దాలలోనే స్వాతంత్ర్యోద్యమ ఆకాంక్షలు నెరవేరతాయనే ఆశలు ప్రజల్లో అడుగంటనారంభించాయి.(పైన పేర్కొన్న నక్సల్బరీ విస్ఫోటనాన్ని ఈ నేపథ్యంలో నుంచి చూడవచ్చు) ఇప్పటివలె ఆనాటి ప్రభుత్వాలు (ప్రైవేటు)పెట్టుబడికి పూర్తిగా కీలుబొమ్మలు కావు. ఆనాడు అంతో ఇంతో స్వతంత్రతతో వ్యవహరించే పాలకులు కావడం వల్ల ఆ పెట్టుబడికి ఇప్పటివలె ప్రభుత్వాలపై పూర్తిపట్టు లేకుండింది. ఎందుకంటే పాలకులకు, ప్రజలకు మధ్య నున్న సంబంధాలు ఇప్పటివలె అంత వ్యాపారాత్మకమైనవి కావు గనుక, అవి పాలకులను ఎంతో కొంత మేరకు ప్రభావితం చేసే  దశలో ఉండేవి. ఆ సంబంధాల ప్రభావం వల్లనే పెట్టుబడికి, నాటి పాలకవర్గానికి మధ్య ఎక్కువగా సంఘర్షణాత్మక సంబంధాలుండేవి. ఆ రెంటి మధ్య అధికార పోటీ కొంతకాలం నడిచిందేమోననిపిస్తుంది. అందుకు వివిధ బ్యాంకుల జాతీయీకరణ , ఆ తర్వాత (ఇందిరా) కాంగ్రెస్ ఓడిపోవడం, జనతా పార్టీ అధికారంలోకి రావడాన్ని నిదర్శనాలుగా భావించవచ్చు. క్రమంగా వాటి మధ్య ఆ అధికార పోటీ క్షీణించి, 1980ల నాటికల్లా పెట్టుబడిదే పైచేయి కావడం కూడా మనం గమనించవచ్చు.

అందుకే అంతకు ముందు లేనివిధంగా 1985,86ల నాటికి పాలకవర్గాల (లాభ)దృష్టి విద్యారంగంపై పూర్తిగా పడింది. ఆనాటి విద్యార్థుల చలనాలను, పోరాట ఆచరణలను గమనించిన పాలకులు క్రమేణా విద్యావ్యవస్థను తమ ప్రయోజనాలకు అనుగుణంగా ‘మార్చడం’ ప్రారంభించారు. సాపేక్షిక  ఉమ్మడి పాఠశాల విధానాన్ని ధ్వంసం చేసే పనికి పూనుకున్నారు. విద్యలో అప్పటికే ఉన్నవాటికి(ప్రభుత్వ రెసిడెన్షియల్, గురుకుల పాఠశాలల వంటివి) తోడు ఇంకా వివిధ రకాల అంతరాలను సృష్టించే ప్రయత్నాలను (నవోదయ పాఠశాలలు, 1990ల నాటికైతే ప్రైవేట్ రెసిడెన్షియల్ విద్యాలయాల స్థాపన వగైరా) ముమ్మరం చేశారు. విద్యార్థుల సమూహాన్ని అనేక విభజనలు చేసి వారిని వేరు చేశారు.

ఆ క్రమంలో భాగంగానే 1986లో నూతన విద్యా విధానాన్ని ముందుకు తీసుకొచ్చారు. విద్యా రంగంలో పెట్టుబడులు ప్రవేశించడానికి మార్గాన్ని సుగమం చేసుకొని విద్యా వ్యాపారీకరణకు నాంది పలికారు. తొలిదశలోని  విద్యారంగంలో అంతగా చొరబడని కులాంతరాల వ్యవస్థను ఆ తర్వాత కాలంలో ప్రవేశపెట్టి విద్యారంగాన్నంతా కులమయం చేశారు. విద్యార్థులను కులాల వారీగా విభజించి ప్రత్యేక స్కూళ్ళు, హాస్టళ్లను తెరిచి వారి సామాజిక చైతన్యాన్ని తెగ్గొట్టారు. తరువాతి తరం విద్యార్థులొచ్చేసరికి విద్యారంగం ముఖ చిత్రమంతా  మారిపోయివుంది. ముక్కలు చెక్కలుగా విభజితమైన సమాజం మాదిరే విద్యారంగాన్నంతా  విచ్ఛిన్నం చేశారు. అలా విచ్చిన్నమైన విద్యా వాతావరణంలో, సంక్షుభిత సమాజ నేపథ్యంలో విద్యార్థులకు సామాజిక వాస్తవికతకు సంబంధించిన అసలైన జ్ఞానం అలవడకుండా చేశారు.

మరోవైపు  2014 నాటికల్లా ప్రచ్ఛన్న సనాతనవాద పార్టీలన్నీ కనుమరుగై దేశ రాజకీయాల్లో ఎన్డీయేలో భాగంగా  రైటిస్ట్ భారతీయ జనతా పార్టీ తొలిసారి అధికారానికి వచ్చింది. ఒకసారి కాదు, 2019లో కూడా భారీ మెజారిటీతో బిజెపి రెండోసారి అధికార పీఠాన్నెక్కింది. తన పాలనలో క్రమంగా సమాజంలో నామమాత్రంగా ఉండిన  ప్రజాస్వామిక వ్యవస్థలన్నింటిని, వాటి స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం అనే ఏకైక గుంజకు వాటిని కట్టిపడేయనారంభించింది. ప్రజలచే ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల అస్తిత్వాలను సైతం గుర్తించకుండా సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ నిరంకుశ పాలన దిశగా సాగింది. అంతేకాదు, ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలని చెప్పబడ్డ శాసన, కార్యనిర్వాహక, న్యాయ, మీడియా వ్యవస్థలన్నింటి స్వతంత్రతను దెబ్బతీసి తన కేంద్రీకృత పాలన ద్వారా రాజ్యాంగాన్ని మరింతగా  నిర్వీర్యం చేయనారంభించింది. సరిగ్గా అదే సమయంలోనే  కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం-2019 డ్రాఫ్ట్ ను(ఆ మరుసటి సంవత్సరం జూలై 29న జాతీయ విద్యావిధానం-2020ని కేంద్రం ప్రకటించింది) ముందుకు తెచ్చింది. గతంలో కంటే ఈ డ్రాఫ్ట్ మరింత బలంగా అభివృద్ధి నిరోధక తిరోగమన భావాలను ప్రవేశపెట్టింది. గ్లోబల్ మార్కెట్ ప్రయోజనాలను నెరవేర్చే దిశగా యావత్ విద్యా విధానాన్ని రూపొందించింది.

ఇటువంటి సామాజిక సందర్భంలోనే మిత్రుడు చింతకింది కాశీం  ‘అకడమిక్ అన్ టచ్ బులిటీ’ అనే పుస్తకాన్ని  వెలువరించాడు. నిజానికిది జనవరి 2020లో అచ్చయినప్పటికీ ఇందులోని వ్యాసాలను ఆయన గత 20 ఏళ్ల కాలంలో రాశాడు. అంటరాని కులంలో పుట్టినప్పటికీ ఆయన అక్షరాన్ని అక్కున చేర్చుకున్నాడు. ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ పెద్ద చదువులు చదివి యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యాడు. గ్రామాన్ని వదిలి పట్టణానికి వచ్చి ప్రొఫెసర్ అయినప్పటికీ కులభూతం ఆయన్ను వీడలేదు. అది అడుగడుగునా ఆయన్ను వెంటాడి గాయపరిచింది. అలాంటి పచ్చి  గాయాలు సలుపుతుండగా అతని పీడిత మనసు పడిన బాధలకు భాష్యంగానే ఈ పుస్తకంలోని వ్యాసాలు రచించబడ్డాయి.

మనుషులు సృష్టించే ఉత్పత్తికి అంటు లేదు. మనుషుల శ్రమ సృష్టించే సంపద(డబ్బు)కు అంటు లేదు. కాని మనుషుల మధ్య అంటరానితనం ఇంకా సజీవంగానే ఉన్నది. దోపిడీకి లేని అంటు  దోస్తీకి ఉన్నది. రంకుకు లేని అంటు రిశ్తాలకు ఉన్నది. ఏకాంతపు ఒడికి లేని అంటు బహిరంగపు బడికి ఉన్నది. బ్రాహ్మణ్యపు గుడికి ఉన్నది. ఇలా సర్వవ్యాపియైన అంటరానితనం విద్యారంగంలో ఎన్నెన్ని రూపాల్లో ఉంటుందో, కొట్టొచ్చినట్టు కనబడకుండా ఎంత నర్మగర్భంగా, ఎంత ద్రవాత్మకంగా ఉంటుందో రచయిత ఈ వ్యాసాల్లో వివరించాడు.

ఏ విద్యనయితే అంబేద్కర్ సామాజిక పరివర్తనకు ఒక శక్తివంతమైన ఆయుధం అన్నాడో, ఆ విద్యను భారత పాలకులు ఈ ఏడున్నర దశాబ్దాలలో ఎలా నిస్సారం చేసి, పదును పోగొట్టి దాన్నెలా మొండికత్తిగా మార్చారో రచయిత ఇందులో చక్కగా వివరించాడు. విశ్వ జ్ఞానానికి నిలయాలుగా విలసిల్లాల్సిన విశ్వవిద్యాలయాలు ఆధునిక అగ్రహారాలుగా ఎలా మారుతున్నాయో చర్చించాడు. విద్యా రంగంలో సరికొత్తగా వెలుస్తున్న ‘గేటెడ్ కమ్యూనిటీలు’  పేద, దళిత బహుజనులకు అవి ఎలా ప్రవేశించరాని అగడ్తలవుతున్నాయో విశదీకరించాడు. అలాగే పాలకులు విద్యను ఒక సృజనాత్మక సామాజిక ప్రక్రియగా కాకుండా ఒక వ్యాపారాత్మక కార్యకలాపం గా చూడడాన్ని రచయిత విమర్శించాడు. దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు రావడం వల్ల విద్యపై ప్రజలకు ఉన్న హక్కు పూర్తిగా పోయి, విద్య కొనుక్కునే ఒక సరుకు అయి ప్రజలు కన్స్యూమర్ లు అయిపోతారని హెచ్చరించాడు. సరిపడా ఆదాయం లేక అంతగా కొనుగోలుశక్తి లేని ప్రజలు విద్యను పొందలేరు. ఇలా ప్రత్యక్ష విద్యకు దూరం అయిన వారికి ఆన్లైన్, దూరవిద్య వంటి అనియత  మార్గాలలో ప్రధానంగా విద్య అందించబడుతుందని ప్రస్తుత జాతీయ విద్యావిధానం చెప్పకనే చెబుతుంది. అంటే, కొనుగోలుశక్తి లేని పేదప్రజలు, అల్పాదాయ  ప్రజాశ్రేణులు విద్యకు శాశ్వతంగా దూరమైపోతారని అర్థం.

పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు (వారి కొనుగోలు శక్తికి అనుగుణంగా) పాఠశాల విద్యలోనే కాదు, ఉన్నత విద్యలో కూడా వృత్తివిద్యా కోర్సులు ఉంటాయి. దీనికి భిన్నంగా ధనిక, ఎగువ మధ్య తరగతి వర్గాల పిల్లలకు మాత్రం ప్రకృతి శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలను బోధిస్తారు. అంటే, పాఠశాల విద్య ద్వారా కుల వృత్తుల నైపుణ్యాలను, ఉన్నత విద్య ద్వారా రోబోటిక్ నైపుణ్యం ఉన్న సాంకేతిక కార్మికులను తయారు చేస్తారన్న మాట. దీంతో ఈ జాతీయ విద్యా విధానంలో కులదొంతరల సమాజాన్ని పునర్నిర్మించే విధంగా కోర్సుల వివక్ష కొనసాగబోతోందని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే- ఇదివరకే ఉన్న వనరుల, వసతుల వివక్షలకు తోడుగా బోధనలో, కోర్సులలో, పరీక్షలలోని వివక్షలు మొత్తం కలిసి చతుర్విధమైన చిత్ర వివక్ష ఉంటుందని చెప్పవచ్చు.

పైగా పరస్పర సంబంధం ఉన్న సబ్జెక్టులను విడదీసి, అలాంటి సంబంధం లేని సబ్జెక్టులను చదువుకునే అవకాశం విద్యార్థులకు కల్పించడం, వాటిలో దేనినైనా వారు స్వేచ్ఛగా ఎంపిక చేసుకోవచ్చని చెబుతున్న ప్రస్తుత జాతీయ విద్యావిధానంలో విద్యార్థులకు అసలు సమగ్ర విజ్ఞానం అలవడకుండా చేసే కుట్రపూరిత ధోరణి ఒకటి ఇమిడివుందని రచయిత చెబుతాడు. ఇంకా మౌలిక పరిశోధనను, విద్యా బోధనను విడదీసే విధంగా కొన్ని విశ్వవిద్యాలయాలు పరిశోధనా విశ్వవిద్యాలయాలుగా, మరికొన్ని బోధనా విశ్వవిద్యాలయాలుగా ఉంటాయని ఈ విద్యావిధానం  ప్రతిపాదిస్తుంది. అసలు పరిశోధనను, బోధనను వేరు చేయడమే అశాస్త్రీయమని, దానివల్ల అటు పరిశోధన గాని, ఇటు బోధన గాని మెరుగుపడకుండా క్రమంగా అవి క్షీణిస్తాయని మనం అర్థం చేసుకోవాలి.

సరే, ఇన్నిన్ని అవరోధాలను అధిగమించి ఒకవేళ దళితులు ఎవరైనా విద్యార్థులుగా గాని,  ఉద్యోగులుగా గాని యూనివర్సిటీల్లోకి ప్రవేశించగలిగితే వారిపట్ల రకరకాల అంటరానితనం ప్రదర్శించబడుతుంది. మేధోపరమైన(ఇంటలెక్చువల్), ఫెలోషిప్ పరమైన, న్యాయపరమైన (జుడిషియల్), సాధారణ విద్యాపరమైన(అకడమిక్) అంటరానితనాలను వారు ఎదుర్కోవలసి వస్తుంది. తనతో సహా దళితులు ఈ అన్ని రకాల అంటరానితనాలను ఎలా ఎదుర్కొం(టు)న్నారో  రచయిత ఇందులో వివరిస్తాడు. అంతేగాదు, రాజ్యాంగం హామీ పడిన రిజర్వేషన్లను పూర్తిగా ఎత్తివేసి సామాజిక న్యాయాన్ని అటకెక్కించాలనే పాలకుల కుటిల విధానాన్ని కూడా రచయిత తీవ్రంగా విమర్శిస్తాడు.

ఇంతకూ, అంటరానితనం ఎలాంటిదని చెప్పాలి? అంటరానితనం ఎంత పాతదో అంత కొత్తదని  చెప్పాలి. ఒకప్పటి గుడి, మడులే బడులైన కాలం మారిపోయి బందీ అయిన విద్య సాపేక్షికంగా విముక్తం కావడం అనేది బ్రిటిష్ వలస పాలన వల్లే జరిగింది. ఫలితంగా ఆనాటి మిషన్ పాఠశాలలో చదివిన జ్యోతిరావు ఫూలేకు అబ్బిన విజన్ సాధారణమైంది కాదు. మానవహక్కులు, స్వాతంత్ర్యం,సమానత్వం లాంటి ఆధునిక భావాలు ఫూలేను చాలా ప్రభావితం చేశాయి. సాంఘిక  మార్పు పైనుంచి కాదు అట్టడుగు నుంచి జరగాలని, అందుకు విద్య ఒక ముఖ్య సాధనమని ఆయన గాడంగా నమ్మాడు. శూద్రులకు, అతి శూద్రులకు, స్త్రీలకు మొత్తంగా ఉత్పత్తి కులాల ప్రజలకు విద్య అవసరాన్ని గుర్తించిన ఆధునిక దార్శనికుడు ఫూలే. యాదృచ్చికంగానే కావచ్చు గాని  ప్రపంచానికి కారల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోను అందించిన 1848 వ సంవత్సరం లోనే ఫూలే బాలికలకు తొలి పాఠశాలను ప్రారంభించడం విశేషం. బ్రాహ్మణుల, హిందూ సంప్రదాయ వాదుల అవమానాలనెన్నింటినో ఎదుర్కొని ఫూలే దంపతులు శూద్రులకు, స్త్రీలకు విద్య నేర్పించారు. ఇలా విద్య గురించి చాలా రాడికల్ గా ఆలోచించిన ఆధునిక భారతీయుల్లో ఫూలే, అంబేద్కర్ లు  చాలా ముఖ్యులని ఈ పుస్తకం చదివితే పాఠకులకు తెలుస్తుంది.

చివరగా- ఇన్నేళ్లుగా విద్యను పాలకులు ఎంత భ్రష్టు పట్టించి మొండి కత్తిగా చేసినా ప్రజలకిప్పుడు ఆ మొండి కత్తే దండిదని చెప్పాలి. ఎప్పుడైనా సానబెట్టి సాధన చేస్తే అది సాధించగల మహత్తులెన్నో ఉన్నాయని చరిత్ర మనకు చెబుతోంది. అంటే, మార్క్స్,ఎంగెల్స్ లు అన్నట్టుగా విద్యను ప్రజల ఉత్పాదక శ్రమతో జత కలిపి బోధించినప్పుడే అది సమాజాన్ని మార్చే అత్యంత శక్తివంతమైన సాధనాలలో ఒకటిగా రూపొందుతుందని దానర్థంగా మనం గ్రహించాలి.

ఇక అంటరానితనం గురించి గతంలో గాంధీ పాపమని అన్నా, అంటరానితనం నేరం అని ఆగత రాజ్యాంగ చట్టం అంటున్నా అదంతా నీడతో చేసే నిరర్ధకమైన యుద్ధమే అవుతుంది. ఎందుకంటే సమాజంలో కులం పోకుండా దాని నీడయైన అంటరానితనం పోదు. కాబట్టి కుల వైరస్ విరుగుడుకు సంఘటితమైన కులనిర్మూలనా, ప్రజాపోరాటాలే సరైన టీకామందు.

Leave a Reply