తెలంగాణ తొలి, మలివిడత ఉద్యమకారుల ఆధ్వర్యంలో ‘భూ హక్కుల పరిరక్షణ ఉద్యమకారుల సమాఖ్య’ ఏర్పడింది. హక్కుల కార్యకర్తలు, కవులు, రచయితలు, న్యాయవాదులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు ఈ సమాఖ్యలో భాగస్వాములుగా ఉన్నారు. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడం, నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయాలను ప్రశ్నించడం ఈ ఐక్య సంఘటన కమిటి ప్రధాన లక్ష్యం.
తెలంగాణ ఏర్పడ్డాక ఏడు మండలాలను అక్రమంగా ఆంధ్రాలో కలిపి తీరని అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో తెలంగాణ, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌లో లక్షలాది ఎకరాల అటవీ ప్రాంతం ముంపుకు గురవుతుంది. లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు. కూనవరం, బూర్ఘంపాడు, వరా రామచంద్రాపురం మండలాలు మొత్తం నాపరూపాల్లేకుండా మునిగిపోయే ప్రమాదం ఉంది. అరుదైన వృక్ష, పక్షిజాలం, పంటపొలాలు అంతరించిపోతాయి. పోలవరం ఇంకా పూర్తిగా నిర్మాణం కాకముందే బద్రాచలం ,పర్ణశాల, ఆంజనేయస్వామి దేవాలయం, నవ గ్రహాల, కల్యాణకట్ట ప్రాంతాలు దాదాపుగా మునిగిపోయాయి. ఇక ప్రాజెక్ట్ పూర్తయితే ఏ స్థాయిలో ముంపు ఉంటుందో తెలంగాణ సమాజం గమనించాలి.
అడవి బిడ్డలు ఈ దేశానికి మూలవాసులు. పోరాట స్పూర్తిని అందించిన మట్టిముషులు. నాటి జాతీయోద్యమం మొదలు నక్షల్బరీ పోరాటం వరకు మూలవాసుల చెమట, నెత్తురు ఎరువుగా మారింది. ఆదివాసుల బ్రతుకులను ఆధునిక సమాజం నట్టేట ముంచుతోంది. పోలవరం నిర్వాసిత ప్రాంతం మొత్తం ఐదో షెడ్యూల్లో ఉంది. ఆ ప్రాంతంలో ఆదివాసుల భూములను కొనడం, అమ్మడం కుడా నేరమే. రాజ్యాంగం కల్పించిన రక్షిత ప్రాంతంలో నిల్వ నీడ లేకుండా చేస్తోంది రాజ్యం. ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన హక్కుని కాలరాస్తున్నారు పాలకులు. లక్షలాది మందిని, అటవీ సంపదను భూస్థాపితం చేయబోతున్నారు. మూడు రాష్ట్రాలకు పెనుముప్పుగా మారిన పోలవరం ప్రాజెక్టు ఆదివాసీ జీవితాలకు శాపం, మృత్యుపాశం.
ఆదివాసుల ఇళ్లను బలవంతంగా కూలగొట్టి తరిమేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన ఆదివాసులు ఇప్పుడు రాష్ట్ర అస్థిత్వాన్నే కోల్పోతున్నారు. తమది ఆంధ్రానో లేక తెలంగాణనో తెలియని పరిస్థితి. ప్రస్తుతం పోలవరం కడుతున్న ప్రాంతంలోనే ఆనకట్ట నిర్మించాలనే కాటన్ ప్రతిపాదనను వందేళ్ల కిందే నాటి జల నిపుణులు వ్యతిరేకించారు. జరగబోయే నష్టాన్ని అంచనా వేసి, అక్కడ ప్రాజెక్ట్ కట్టడం క్షేమకరం కాదు అని తేల్చేశారు. కానీ నేటి పాలకులు నాటి ఇంజనీర్ల మాటలను తుంగలో తొక్కి ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.
పోలవరం నిర్మాణంలో అన్యాక్రాంతం అవుతున్న కోట్లాది సంపద మీద న్యాయ విచారణ జరపాలి. ప్రాజెక్టు ఎత్తు తక్కువ చేయడం ద్వారా ముంపు తగ్గించే అవకాశం ఉంటుంది. నిర్వాసితులకు నష్టపరిహారం రెట్టింపు చేయాలి. ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలి. కోల్పోయిన భూమికి రెట్టింపు భూమి కేటాయించాలి. పక్కా భవనాలు నిర్మించి ఇవ్వాలనే డిమాండ్‌తో సమరశీల, ఐక్య పోరాటాలు చేస్తున్న ఆదివాసీలు పౌర, ప్రజాస్వామిక వాదుల మద్దతు కూడగట్టాలి.