శత్రువైరుధ్యాలుగా ప్రచారమవుతున్న మిత్రవైరుధ్యాలు
అసమసమాజంలో విభిన్నవర్గాల (సామాజిక, ఆర్థిక, మత, ప్రాంతాల) మధ్య గల మిత్రవైరుధ్యాలను శత్రువైరుధ్యాలుగా మార్చి, తమ పబ్బం గడుపుకోవడం నేటి పాలకులకు వెన్నతో పెట్టిన విద్య. అనునిత్యం ఉపాధికై జీవనసమరం జేస్తున్న సామాన్య ప్రజలకు పై కుట్రను అర్థంజేసుకొనే చైతన్యం వుండదు. అసమానతలవల్ల, తమకు అందనిది మరెవరికో అందుబాటులో వున్నప్పుడు, తమకూ అదే స్థాయి కావాలనే కోరిక కన్నా, పైవాడు ఆ సౌకర్యాలు పొందగూడదనే వాంఛ కలగడం సహజం. దీనికి ఎవరినీ నిందించాల్సిన పనిలేదు. అలాంటి మానసిక స్థితికి కారణం నేటి అసమ వ్యవస్థే. విద్యావంతులైనవారూ ఆ మానసిక స్థితికి గురవుతున్నప్పుడు, సామాన్యుని నిందించడంలో అర్థం లేదు. ఈ వాతావరణాన్ని పాలకులు తమకనుకూలంగా వినియోగించుకొనడం కద్దు. అందులోనూ పాలకులకు అనుకూలంగా దళారి మేధావులు, ప్రచార వ్యవస్థలూ ఉండనే వున్నాయి. ఇక వాటికి తోడూ ఈ వ్యవస్థలో అంతో ఇంతో సౌకర్యాలు అనుభవించే వర్గంలో కొందరైనా తమ అవినీతి వల్ల, విధినిర్వహణలో నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలకు దూరమయినపుడు, ఆ వర్గపు డిమాండ్లను, అవి ఎంత న్యాయమైనవైనా వాటిని పట్టించుకోకుండా, ఆ వర్గాన్ని ప్రజలలో బద్నాం జేస్తూ వారి ఉద్యమాలను అణచివేయడం ప్రభుత్వాలకు నల్లేరుపై నడకనే.
అంతేగాక, ఉపాధ్యాయ, ఉద్యోగవర్గాలు సమిష్టిగా తెగించి తమ డిమాండ్లను సాధించుకొనేదాక పోరాటం సాగించలేవనే నమ్మకం ప్రభుత్వాలకుంది. ఆ వర్గాల మధ్యగల అంతర్గత వైరుధ్యాలను పాలకులు తమకనుకూలంగా మలుచుకుంటారు కూడా. మధ్యతరగతికి చెందిన ఉపాధ్యాయ, ఉద్యోగవర్గం కొత్త సౌకార్యాలు పొందకపోయినా, ఉన్నవాటిని పోగొట్టుకునేందుకు సిద్ధపడదు. అలాంటి డిమాండ్(పాత జీతాల)నే, నేడు ఉపాధ్యాయ, ఉద్యోగావర్గాలు చేయడం గమనార్హం.
ప్రభుత్వ వైఖరి అత్యంత అప్రజాస్వామికమైనదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేతన సవరణకై నియమించబడ్డ అశుతోష్ నివేదికను బయటపెట్టక, తన అధికారులతో మరో నివేదిక రాయించి, దాన్నే అమలుజేస్తాననడం ఎంత నిరంకుశమో, దుర్మార్గామో చెప్పాలా! దేశచరిత్రలో వెతనసవరణ వల్ల ఉద్యోగులకు వేతనాలు తగ్గడం ఇదే రికార్డ్. అంతేగాక, గతంలో పొందుతున్న సౌకర్యాలనూ రద్దుజేయడం అత్యంత శోచనీయం. ప్రతి సంవత్సరం ఇంటి అద్దెలు పెరుగుతాయనేది అందరికి తెలిసిన విషయమే. అధికారుల నివేదిక దాన్ని తగ్గించడం, వారికి కామన్ సెన్స్ లేదనుకోవాలా, లేక ఉద్యోగులపై కక్ష సాధింపు అనుకోవాలా? అంతేగాకా, తానిచ్చిన మధ్యంతర భ్రుతి కన్నా తక్కువ స్థాయిలో వేతనాన్ని నిర్ణయిస్తూ, గత మధ్యంతర భ్రుతి ద్వారా పొందిన సొమ్మును ఇప్పుడు డి.ఎ.ల ద్వారా పొందుతున్న సొమ్ములో మినహాయించుకుంటాననడం ఎంత దుర్మార్గం. ఇలాంటి వేతన సవరణకు జగన్ ప్రభుత్వాన్ని గిన్నిస్‌బుక్‌లో చేర్చాల్సిందే. అంతకన్నా కుట్రపూరితమైనది, ఎవరూ డిమాండ్ చేయని ఉద్యోగ విరమణ వయసు పెంచడం. దీనివల్ల ఉద్యోగులు సంతోషిస్తారని, దాంతో వారి మిగతా డిమాండ్లను నీరుగార్చవచ్చనే భావన వుంది. దాని వెనుక మరింత దుర్మార్గమైన కూడా ఆలోచన దాగివుంది. పదవీ విరమణ వయసును పెంచడం ద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు, పదవీ విరమణ చేసేవారికి ఇవ్వవలసిన సొమ్మును రెండేళ్ళ కాలం వాయిదా వేయొచ్చు. ఈ మధ్యకాలంలో పదవీ విరమణ చేసిన వారి ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యువిటి సొమ్ము నెలలుదాటినా చెల్లించబడలేదనేది గమనార్హం. ఇక రెండవది, పదవీ విరమణ వల్ల ఉత్పన్నమయ్యే ఖాళీలను మరో రెండేళ్ళు వాయిదా వేయొచ్చు. ఇది మరీ పెద్ద ద్రోహచింతన. లక్షలాదిమంది నిరుద్యోగులు ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక సంవత్సరాల తరబడి ఉద్యోగాలకై వేచిచూస్తుంటే ఉద్యోగావకాశాలు లేకుండా చేయడాన్ని ఏమనాలి? (ఉన్న ఉద్యోగాలే భార్తీచేయని వాణ్ని, కొత్త ఉద్యోగాలడగడం మన అమాయకత్వమేననుకోండి.)
ఇక కొత్త వేతన సవరణల వల్ల నష్టం జరగదు అని వైసిపి ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పచ్చి అబద్దమని నేడు ఉపాధ్యాయ, ఉద్యోగవర్గం చేస్తున్న డిమాండ్ (పాత జీతాలనే ఇవ్వమని) మెదడున్న ప్రతివారికీ స్పష్టంజేస్తుంది. పొతే, కేవలం ఓట్లు, సీట్ల ప్రజాస్వామ్యంలో ఏ వర్గపు జనాభా ఎంత, వారిలో ఓటు అర్హత గలవారెందరూ అనే గణాంకాలను బట్టి మెజారిటీకీ సబ్సిడీలు, రాయితీల పేరుతో తాత్కాలిక లబ్ది కలిగిస్తూ, ఓట్లను కొల్లగొట్టడం అన్ని రాజకీయపార్టీలకు మామూలే. అందులో జగన్ మరింత ఆరితేరాడని చెప్పవచ్చు. అందుకే, ఉద్యోగవర్గం తనకు దూరమైనా, తన ఓటు బ్యాంక్ పదిలమనే నమ్మకం అతనికుంది.
ఇక, వైసిపి అనునాయులు, సానుభూతిపరులకు ఉద్యోగుల అవినీతి, విధినిర్వహణలో అలసత్వం ఇప్పుడు కొత్తగా గమనంలోకి రావడం విచిత్రం. అయినా అవినీతి లేని సంస్థలు ఈ వ్యవస్థలో వుంటాయనుకోవడం మన అజ్ఞానమే. అవినీతికి మూలం ఈ వ్యవస్థలోనూ, దాన్ని పెంచిపోషిస్తున్న రాజకీయాల్లోనూ వుంది. తాము అభిమానిస్తున్న ఏ రాజకీయపార్టీలోనైన అవినీతికి లోనుగాని నాయకుడున్నాడా? అయినా నేడు లంచం తీసుకొనే ఉద్యోగులను, పనిజేయని అధికారులను శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది కదా!
ఉదాహరణకు, ఒక ఉపాధ్యాయుడు తన విధులకు సక్రమంగా హాజరు కావడం లేదనుకుందాం. అతన్ని సరిదిద్దే అధికారం ప్రధానోపాధ్యాయునికి, ఆపైన మండల, జిల్లా విద్యాశాఖ అధికారికి, ఆ పైన సంచాలకులకు, వీరందరిపైన విద్యాశాఖ మంత్రికి వుంది కదా. ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా అన్నట్టు అసలు మూలం రాజకీయాల్లో వున్నప్పుడు కింది ఉద్యోగులను మాత్రమే విమర్శిస్తే ఫలితమేమిటి? నాడు చంద్రన్న ఒక కార్పోరేట్ విద్యావ్యాపారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తే, నేడు జగనన్న మరో విద్యా వ్యాపారికి ఏకంగా విద్యాశాఖనే అప్పగించాడు. అలాంటప్పుడు నేడు వైసిపి మేధావులు, అనుయాయులు తమ నాయకులంతా పవిత్రులని, కేవలం ఉపాధ్యాయ, ఉద్యోగవర్గాలు మాత్రమే అవినీతితో నిండిపోయాయని మండిపడటం హాస్యాస్పదం. అదీగాక, ఈ అవినీతి వ్యతిరేకవీరులు ఏనాడైనా, ఏకార్యాలయంలోనైనా జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాటం జేసారా? కనీసం అలా పోరాటం జేసినా వారికి మద్దతుగా నిలిచారా అనేది ప్రశ్నార్థకమే. మనం ప్రశ్నించకుండా, ప్రశ్నిస్తున్నవారికి మద్దతునివ్వకుండా అవినీతి, అవినీతిపరులూ అంటూ ముఖపుస్తకంలో పుంఖానుపుంఖాలుగా రాస్తే అవినీతి మాయం కాదు. అవినీతిని ప్రశ్నించాల్సిందే. అవినీతిపరులను శిక్షించాల్సిందే. దాన్నెవరూ కాదనలేరు. కాని, కొందరు అవినీతి పరులుంటే మొత్తం ఆ వర్గాన్నే నిందించడం హేతుబద్ధం కాదు.
శ్రమకు తగ్గ ఫలితం ఆశించడం శ్రామికుల (శారీరక/మానసిక శ్రామికుల) హక్కు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తీర్చే బాధ్యత, వారి వేతనాలకు తగ్గట్టు పనిచేయించాల్సిన భాద్యత వారిని నియమించుకున్న ప్రభుత్వానిదే. ప్రభుత్వం ఆ విధిని ప్రజా ప్రతినిధిగా నిర్వహించాలి. ఆ రెండు విధులలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఉద్యోగవర్గం ద్వారానే ప్రజలకు ప్రభుత్వం సేవలందిస్తుంది. మరి కొందరు మేధావులు అన్ని ఉద్యోగాలను ప్రైవేటీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలా జరిగితే నష్టపోయేది ప్రజలే. ప్రజాసేవలు మరింత ఖర్చుతో కూడినవి అవుతాయి. ప్రభుత్వంలో వున్న పార్టీ ఓట్ల కోసమైనా సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. కానీ, పెట్టుబడిదారుడు కేవలం తన వ్యక్తిగత లాభాలకే ప్రాధాన్యతనిస్తాడు. ఇక పేదలకు ఏ సేవా అందుబాటులో వుండదు. మనం ఆ అనుభవాన్ని ప్రైవేట్ విద్యాసంస్థలలో చూస్తున్నాము. ఎవరో కొందరు అవినీతిపరులున్నారని, ప్రభుత్వ ఉద్యోగాలను ప్రైవేటీకరణ జేయాలనడం జలుబు చేసిందని ముక్కును కోసుకోవడమే. ఇవి అర్థరహితమైన, ఆచరణసాధ్యం గాని సూచనలు.
ఆర్థిక ఇబ్బందులకు ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గం కారణం కాదని, జగన్ ప్రభుత్వ అనాలోచిత విధానాలని జగన్ అనునాయులు, అభిమానులు గ్రహిస్తారనుకోవడం మన అమాయకత్వమేనని తెలుసు. కానీ, కొన్ని చేదు నిజాలు చెప్పక తప్పదు. వారెంత ప్రచారం చేసినా జగన్ ప్రభుత్వం ప్రకటించిన వేతన స్కేల్లు అశాస్త్రీయమైనవి, అప్రజస్వామికవైనవీ. ప్రజలు ఉద్యోగవర్గాల మధ్యగల మిత్రవైరుధ్యాలను శత్రువైరుధ్యాలుగా ప్రచారంజేస్తూ జగన్ కొంతకాలం ప్రజలను తనకనుకూలంగా మలుచుకోగలడేమో గానీ, ఉద్యోగ, ఉపాధ్యాయులు, వారి కుటుంబాలు ప్రజల్లో భాగమని మరిస్తే మాత్రం అతడు రాజకీయంగా దెబ్బతినక తప్పదు.
ఇప్పుడు చెప్పాల్సిన విషయం కాదనిపిస్తున్నా, గతంలో ఒక ప్రభుత్యోగిగా ఈ భావాలను వ్యాసరూపంగా పంచుకున్నా. ఇప్పుడు పదవీ విరమణ చేసిన ఉద్యోగిగా మరల చెప్పాల్సి వస్తున్నందుకు విచారంగా వుంది. కానీ చెప్పక తప్పని పరిస్థితి ఇప్పుడూ వుండటంతో చెప్పక తప్పడం లేదు.
ఉద్యోగ వర్గం కూడా తామూ ప్రజల్లో భాగమని విస్మరించడం వారికి క్షేమదాయకం కాదు. ప్రజల్లో వారిపట్ల చాల అసంతృప్తి, దురభిప్రాయం వుందనేది చేదువాస్తవం. ప్రజల అభిమానాన్ని చూరగొనకుండా ఉద్యోగవర్గం నిరంకుశ పాలకులను ఎదుర్కొనలేదు. ఉద్యోగులు తాము ప్రజలలో భాగమని, వారి సమస్యలు తమకూ సమస్యలుగా మారుతాయనే భావన లేనంతకాలం, ఉద్యోగులు ప్రజలకు దూరంగా ఏకాంత దీవిలో బతుకుతారు. ఇప్పుటి ఉద్యోగవర్గపు పరిస్థితి ఇదే.
దేశవ్యాప్తంగా అన్నదాతలు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మహోన్నత ఉద్యమం సాగిస్తుంటే, అదేదో తమకు సంబంధం లేనట్టు ఉద్యోగులు వ్యవహరించారు. ఆ చట్టాలు అమలైతే నష్టపోయేది రైతులే కాదు, ఆహారధాన్యాల సేకరణ, పంపిణీ కార్పోరేట్ గద్దల హస్తాల్లోకి వెల్తాయని, ఆ ధరలు మిన్నంటుతాయనే జ్ఞానం విద్యావంతులైన వీరికి లేకపోవడం విచిత్రం. అదే విధంగా, కార్మికరంగ చట్టాలు, విద్యుత్‌రంగ చట్టాలు, నిత్యావసరాల ధరల పెంపు, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటడం వీరికి పట్టడం లేదు. దానివల్ల తమకు పరోక్షనష్టం జరుగుతుందనే ఆలోచనే వీరికి లేకపోవడం ఒక విషాదం. పై విధానాలవల్ల తాము నేరుగా నష్టపోకున్నా, తమ కుటుంబ సభ్యులకో, బంధుమిత్రులకో నష్టం జరుగుతుందనే ఆలోచన వీరికి రావడం లేదు. పదవీ విరమణ వయసు పెంపుతో తమపిల్లల ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయనే ఆలోచన ఈ ఉద్యోగసంఘాల నాయకులకు ఉండినట్టయితే, ఉద్యోగ విరమణ వయసు పెంపు ప్రతిపాదనకు తలూపి వచ్చేవారు కాదు.
మెజారిటీ ఉద్యోగులు ఇంతవరకు తమ సౌకర్యాలనే చూసుకున్నారు తప్ప, తామూ సమాజంలో భాగమని, సమాజాన్ని ప్రభావితంజేసే ప్రతి ప్రభుత్వ విధానం తమపైన పరోక్షంగానైనా ప్రభావం వేస్తుందని అనుకోవడం లేదు. ధరలు పెరిగితే తమ కరువుభత్యం పెరగాలనుకున్నారే తప్ప, అవి మొత్తం సమాజంపై, ప్రజలపై ఎంత దుష్ప్రభావం చూపిస్తుందో ఆలోచించడం లేదు. ఇలాంటి దృక్పథం వల్లనే ఉద్యోగవర్గం ప్రజలకు దూరమవుతూ వుంది. దాన్ని రాజకీయపార్టీలు తమకనుకూలంగా మలచుకుంటున్నాయి. మేము ఉద్యోగులను ప్రజా ఉద్యమాలలో నేరుగా పాల్గొనమని చెప్పడం లేదు. రైతాంగం, కార్మికులు చేసే ఉద్యమాలకు సంఫీుబావం తెలపండి. వీలయితే వారు నిర్వహించే సమావేశాలకు హాజరుకండి. ఊరేగింపులలో పాల్గొనండి. మీ వద్దకు సమస్యల పరిష్కారం కోసం వచ్చేవారిని గౌరవంతో చూడండి. చేతనయితే సమస్యలను పరిష్కరించండి. అది మీ చేతుల్లో లేకపోతే, పరిష్కారానికి తగిన సూచనలివ్వండి, మార్గాలు చూయించండి. చివరిగా మనం, ఉద్యోగులం, పెన్షనర్లం పొందే వేతనం శ్రమజీవుల చెమట చుక్కలేనని గ్రహిద్దాం. అంతేగాదు, కామ్రేడ్ వివి చెప్పినట్టు ‘‘మనం తొలుత మానవులం, తర్వాత పౌరులం, ఆ తర్వాతే ఉద్యోగస్తులం’’ అనే చైతన్యం మనకు కలిగిన నాడే మన న్యాయమైన పోరాటాలకు ప్రజల మద్దతు వుంటుంది. ప్రజల మద్దతు పొందగలిగిన ఏ ఉద్యమానికీ అపజయమంటూ ఉండదు. ప్రజల్లోకి వెళ్ళండి. మీ సమస్యల న్యాయబద్ధత, ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరి వివరించండి. మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువతను కూడగట్టండి. సహనంతో, సంఘటితంగా దీర్ఘకాలిక ఉద్యమాలకు సన్నద్ధం కండి. విజయం మనదే.