బస్తర్ చరిత్ర అంటేనే పోరాటాల చరిత్ర. తమ భూమిని, జీవితాలను, ప్రకృతి వనరులను దోచడమే గాక, తమ స్వీయ గౌరవాన్ని దెబ్బతీసే శక్తులను బస్తర్ తీవ్రంగా ప్రతిఘటించింది. అలాంటి తిరుగుబాట్లలో 1910 లో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన  భూంకాల్ తిరుగుబాటు ఒకటి. గుండాదుర్ అనే ఆదివాసీ నాయకత్వాన ఆదివాసీలు వలసవాదుల అటవీ మరియు ప్రకృతి వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడారు. నాటినుండి నేటిదాకా, బస్తర్ లో లభించే అపారమైన ప్రకృతి వనరుల దోపిడీకి వేచి చూస్తున్న దేశ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాల రక్షణకై ప్రభుత్వo చేస్తున్న సైనికీకరణను, బస్తర్ ప్రజలు సాయుధంగా ఎదుర్కొంటూనే వున్నారు.

పూనెం సోమ్లి ఒక ఆదివాసీ గర్భిణి. ఆమె ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బిజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దులోని దండకారణ్య అటవీ లోతట్టు ప్రాంతంలో ఒక చిన్న గ్రామానికి చెందిన మహిళ. తాను  గతదశాబ్దాలుగా ఎదుర్కొంటున్నకష్టాలను తనకు పుట్టబోయే బిడ్డ అనుభవించకూడదనుకుంది. తనబిడ్డ కూడా తను పుట్టిపెరిగిన చోటనే జీవితం గడపాలనుకున్నట్టుంది. ప్రభుత్వo “వామపక్ష తీవ్రవాదాన్ని” నిర్మూలించి, ఆ ప్రాంతాన్ని “అభివృద్ధి”చేసేందుకై ఆ ప్రాంతంలో పోలీస్ క్యాంప్ నెలకొల్పేందుకు  చట్టవిరుద్ధంగా  అక్కడి భూమిని స్వాధీనం చేసుకొనేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నాన్ని ప్రతిఘటించిన వేలాది ఆదివాసీలలో సోమ్లి ఒకరు.

అదేవిధంగా 14-17 ఏళ్ల మధ్య వయసు గల బాలుడు ఉయికా పాండు. అతనూ సిల్ గెరిలో పోలీస్ క్యాంప్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడు. సోమ్లి వలె పాండు కూడా తన పుట్టిన ప్రాంతాన్ని వదిలేందుకు ఇష్టపడలేదు. తన స్వంత భూమిలోనే తాను పరాయివాడు కావడం అతనికి నచ్చలేదు. మే17, 2021 న,  పోలీస్ క్యాంప్ వ్యతిరేక నిరసన ఊరేగింపుపై సీఆర్పీఎఫ్ కాల్పులు జరిపింది. ఆ కాల్పులలో ముగ్గురు ఆదివాసీలు- కౌవాసివాగ్నా, కుర్సం భీమా, ఉయికా పాండు మరణించగా, అప్పుడు జరిగిన తోక్కిసిలాటలో  పూనెం సోమ్లి, ఒక ఆదివాసీ గర్భిణి, గాయపడి మర్నాడు మరణించింది.

13 మే, 2021న రాత్రికి రాత్రే సీఆర్పీఎఫ్ సిలిగిరిలో క్యాంప్ ను పెట్టింది. అలా చేయడo  షెడ్యూల్ ప్రాంతాలలో అక్కడి ప్రజల అభిప్రాయసేకరణ చేయకుండా, అనుమతిలేకుండా ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోగూడదనే PESA చట్టాన్ని ఉల్లంఘిoచడమే. అక్కడి ప్రజల అభిప్రాయసేకరణ అటుంచి, వారికి కనీసం క్యాంప్ నెలకొల్పే విషయమే తెలియదు. అంతేకాదు, ఆ ప్రాంతంలో పోలీసు, పారా మిలిటరీ దళాల క్యాంప్ ల ఏర్పాటుకు బస్తర్ ప్రజల వ్యతిరేకత కొత్తదేం కాదు. అక్కడి సైనికీకరణకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెల్పారు కూడా. మావోయిస్టు వ్యతిరేక దాడుల పేరుతో గ్రామాలపై దాడులు, బూటకపు ఎన్కౌంటర్లు, మహిళలపై అత్యాచారాలు, చిత్రహింసలు, చట్టవ్యతిరేక నిర్భందాలు, ఉపా, నాసా, పబ్లిక్ సెక్యూరిటి చట్టం లాంటి దుర్మార్గమైన చట్టాల కింద అరెస్టులు అక్కడ నిత్యకృత్యమే. ఇలాంటి దుర్మార్గమైన అణచివేతకు వ్యతిరేకంగా ఎటువంటి నిరసన గళాన్నైనా ప్రజా రక్షణ చట్టం కింద నొక్కివేయడమే ప్రభుత్వం జేస్తున్న పని. ఇక పైవాటికి తోడుగా, ఆగ్రామాలపై పడి, దోపిడీ, మహిళల మీద అత్యాచారం, మహిళలను, పసిపిల్లలను, గ్రామాలకు గ్రామాలనే  తగలబెట్టడం లాంటి చర్యలకు సల్వాజుడుం, అగ్ని, తంతముక్తి మరియ ఇతర ముసుగు సంస్థలకు ప్రభుత్వాలు పూర్తిగా  స్వేచ్చనిచ్చాయి. మధ్యభారత ప్రజలు ఆపరేషన్ గ్రీన్ హంట్ అనుభవాలు ఇంకా మరువలేదు.

మరల సిల్ గేర్ కొస్తే, ఆ ప్రజల నిరసన కార్యక్రమం గత ఆరు నెలలుగా కొనసాగుతూనే వుంది. వారి పట్టుదలముoదు కుండపోత వర్షాలు, తీవ్రమైన నిర్భంధాలు నిలువలేకపోయాయి. 1 నవంబర్, 2021న చత్తీస్ ఘర్ మూలవాసి బచావో మంచ్ సంస్థ 23 సంస్థాపన రోజున వేలాదిమంది ఆదివాసీలు ఊరిగింపు తీసారు. చత్తీస్ ఘర్ మూలవాసి బచావో మంచ్ సంస్థ సిల్ గెరి నుండి పోలీస్ క్యాంప్ లను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ తో ఏర్పడిన ప్రజా సంస్థ. ”హమారీ మాంగ్ పూరా కరో”, ”నారి శక్తి జిందాబాద్” లాంటి నినాదాలు బస్తర్ అడవుల్లో మిన్నంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరిచే “అభివృద్ధి నమూనా” బహుళజాతి కంపినీలకు మరియు వారి దేశీయ స్నేహితులకు ప్రయోజనాలు కలిగించే విధానాలని, వాటిని   తిరస్కరిస్తూ, ప్రజలు తమకు శుభ్రమైన తాగునీరు, విద్యా, వైద్య సౌకర్యాలవంటి మౌలిక సదూపాయాలు కల్పిoచాలని డిమాండ్ చేస్తున్నారు.

బస్తర్ ప్రజల అకుంటిత, సంఘటిత  ప్రజానిరసనలను భగ్నం చేసేందుకు, పోలీసులు తాము దశాబ్దాలుగా అమలుపరిచే ఎత్తుగడ ప్రతి ప్రజానిరసన కార్యక్రమం మావోయిస్టు ప్రేరితమైనదనే ప్రచారాన్ని మొదలెట్టారు. ఏభైమంది ఆదివాసీలు సైకిళ్ళపై తమ ఇండ్లకు తిరిగి వస్తుండగా కోబ్రా పోలీసులు, సుక్మా జిల్లా పోలీసులు మధ్యలో అడ్డుకొని నిర్భందించారు. వారిలో ఎనిమిదిమందిపై, అక్రమంగా ఆయుధాలు కలిగివున్నారని కేసు పెట్టి జైలుకు పంపారు. మిగతా వారిని వదలిపెట్టారు. అరెస్ట్ అయినవారు మావోయిస్టులని ఆ జిల్లా సూపరింటేండెంట్ ప్రకటించాడు.

దేశంలో ఎటువంటి విచారణ లేకుండా వేలాదిమంది ఆదివాసీలు జైల్లో మగ్గుతున్నారు. జాతీయ నేర రికార్డ్ బ్యూరో నివేదిక ప్రకారం మన దేశంలో ప్రతి పదిమంది ఖైదీలలో ఏడుగురు విచారణకై ఎదురుజూస్తున్నారు. జైల్లో వున్నప్రతి ముగ్గురిలో ఒకరు దళితుడో లేక ఆదివాసీనో అయి వున్నాడు. ఈ గణాంకాలు కేవలం పోలీసులకు అందిన సమాచారం మాత్రమే. వందలాదిమంది చట్టవిరుద్ధంగా నిర్భందిoచబడటమే గాక, పదులసంఖ్యలో వాళ్ళు ఎన్కౌంటర్ చేయబడుతున్నారు.

సైనికీకరణ-ఎవరికోసం, ఎందుకోసం?

ఆర్ ఎస్ ఎస్ మరియు బిజెపి నేతృత్వంలోని బ్రాహ్మానీయ హిందూత్వ ఫాసిస్ట్ కేంద్ర ప్రభుత్వం “వామపక్ష తీవ్రవాద” ప్రమాదాన్ని ఎదుర్కొనే నెపంతో, 2017 లో “ఆపరేషన్ సమాధాన్ –ప్రహార్” అనే నూతన విధానాన్ని ప్రకటించింది. అయితే ఇది గత ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’కు కొనసాగింపే. ఆ విధానం మావోయిస్టు వ్యతిరేక చర్యాలనే పేరిట ఆదివాసీలపై మారణహోమం జరిపేందుకు పోలీసు మరియు పారా మిలిటరీ దళాలకు పూర్తి స్వేచ్చనిచ్చింది. ఈ కొత్త విధానం కింద, మధ్య మరియు తూర్పు భారతంలో పెద్దఎత్తున సైనికీకరణ జరుగుతున్నది. తద్వారా మావోయిస్టులను మరియు మావోయిస్టు పార్టీని పూర్తిగా రూపుమాపాలని పాలకుల ఉద్దేశ్యం.

 ప్రభుత్వం రక్షణరంగం పై ఖర్చు విపరీతంగా పెంచుతూ వస్తుంది. 2021-22 బడ్జెట్ లో రక్షణ రంగానికి రూ.4,78,196  కోట్లు కేటాయించింది. అది మొత్తం బడ్జెట్ లో 13.73% . డ్రోన్లతో సహా ఆధునిక ఆయుధాల సరఫరా అనే అమెరికా, భారతదేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం సైనికీకరణ ఎంత వేగంగా సాగుతున్నదో తెలియజేస్తుంది. ఈ బడ్జెట్ కేటాయింపులో సింహ భాగం కాశ్మీర్, మధ్యభారతం, నాగాలాండ్ మణిపూర్ మరియు అస్సాం భూభాగంలో ననేది తెలిసిన విషయమే. అంతేకాదు పై ఆయుధాలపై ఖర్చు ఆ ప్రాంతాలలో ప్రజ్వరిల్లుతున్న ప్రజా ఉద్యమాలను అణచివేయడం కొరకే.

 దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాలలో, బొగ్గు, ఇనుము, బాక్సైట్, క్రిస్టల్, సున్నపురాయి, క్వార్ద్జ్, యురేనియిం లాంటి ఖనిజ సంపద ఇబ్బడి ముబ్బడిగా లభ్యమవుతుంది.. వాటిని లాభాపేక్షతో ఆవురావావురుమంటూ బహుళజాతి కంపెనీలు  వేచివుoడడంతో ఈ ప్రకృతి వనరులు ఆదివాసేలకు శాపంగా మారాయి. గనుల త్రవ్వకానికి ప్రాథమికవనరు భూమి. చాలా సంవత్సరాలుగా బడాకార్పోరేట్ల మద్దతుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ నయా ఉదారవాద అజండాను అమలుజేయ ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న“అభివృద్ధి ” ఎవరికోసం? ఆదివాసీలను తమ స్వంత భూమి నుండి వెల్లగొట్టడమనేది “అభివృద్ధి” ఎలా అవుతుంది?

“వామపక్ష తీవ్రవాద” అణచివేతకి “ఆపరేషన్ సమాదాన్” అనే నూతన విధానాన్ని చేపట్టింది. ఈ విధానం కింద “ఫార్వార్డ్ ఆపరేషనల్ స్థావరాల”ను ఏర్పాటుచేసుకునే ప్రక్రియలో భాగంగా సిఆర్ పిఎఫ్ అధీనంలో పోలీసు క్యాంపులు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2022 నాటికంతా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్ఘడ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ లాంటి  నక్సల్ ప్రభావిత రాష్ట్రాలలో 22 అలాంటి పోలీసు క్యాంప్ లను నెలకొల్పాలని కేంద్రం ప్రణాలికను సిద్ధం జేసింది. ఇప్పటికే అలాంటి పోలీసు క్యాంప్ లను దేశంలోని వివిధ ప్రాంతాలలో నెలకొల్పారు కూడా. 2020లోనే అలాంటి పోలీసు క్యాంపులు 18 ఏర్పాటు జేసారు. వాటిలో అత్యధికంగా ఖనిజ సంపద వున్న ఝార్ఖండ్, ఛత్తీస్ఘడ్, ఒడిస్సాలో ఏర్పాటుజేయడం గమనార్హం. ఆ ప్రాంతాలలో కార్పోరేట్ దోపిడీకి, భూముల ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రజలు సమరశీల పోరాటాలు జేస్తున్నారనేది విదితమే. ఆ కార్పోరేట్ శక్తులకు, వాటి తొత్తుల ప్రయోజనాలు కాపాడెందుకై, కేంద్రరాష్ట్ర  ప్రభుత్వాలు సాయుధ దళాలను ఆ ప్రాంతాలలో  దిoపుతున్నది. ఇది మన పాలకవర్గాల దళారీ స్వభావాన్ని  స్పష్టం జేస్తున్నది. మన ప్రధానమంత్రి ఒకవైపు దేశాన్ని స్వయం ఆధారితం చేస్తానంటాడు. మరోవైపు సామ్రాజ్యవాద పెట్టుబడికి దేశం తలుపు బార్లా తెరిచి, అవి దేశంలో చొరబడి దేశ వనరులను, చౌక కార్మికశక్తిని కొల్లగొట్టేందుకు అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తున్నాడు.

అలాంటి దళారీలు, మన దేశవనరులను సామ్రాజ్యవాద శక్తులు ఎలాంటి అడ్డూ, ఆపు లేకుండా కొల్లగోట్టేoదుకనువుగా దేశప్రజలపైనే నిస్సిగ్గుగా బాంబుల వర్షం కురిపించే ప్రయత్నాలు జేయడంలో ఆశ్చర్యమేముంది. 19 ఆగస్టు 2021  న అర్ధరాత్రి బస్తర్ ప్రజలంతా గాఢ నిద్రలో వుండగా, బిజాపూర్ జిల్లాలోని బోటలంక మరియు పాలగూడెంపై డ్రోన్ల సహాయంతో బాoబుల వర్షం కురిపించారు. దాన్ని ఖండిస్తూ, ప్రభుత్వానికి, మావోయిస్టులకు మధ్య శాంతి చర్చలు జరిపేందుకు ప్రభుత్వమే నియమించిన శాంతికమిటీ సభ్యులు ప్రముఖ జర్నలిస్ట్ కమాల్ శుక్లా ఆ కమిటీకి రాజీనామా జేసారు. అలాంటి బాoబుదాడులకు సిల్ గెరి మరెంతో దూరంలో లేదు.

సిల్ గెరికి  దాదాపు 250 కి.మీ.దూరం లో మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా, ఈటాపల్లి తాలూకకు చెందిన సుర్జాగర్ అనే గ్రామం వుంది. ఆ గ్రామం ఇనుప ఖనిజ త్రవ్వకాలకు వ్యతిరేకంగా జరుగుతున్ననిరశనలకు కేంద్రమని చెప్పవచ్చు. సుర్జాగర్ వద్దగల గనులను లాయడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ కంపినీకి లీజుకిచ్చారు. దానికి వ్యతిరేకంగా, 25అక్టోబర్, 2021 న వేలాదిమంది ఆదివాసీలు తమ నిరసన తెల్పెందుకు  ఈటాపల్లికి ఊరేగింపుగా వెళ్ళారు. ఆ కార్యక్రమానికి నాయకత్వం వహించింది “సుర్జాగర్  పారంపరిక్ ఇలాక గోటుల్ సమితి అనే సంస్థ. దాంతో, నిరసనకారుల వేట మొదలైంది. జిల్లాపరిషత్ సభ్యులతో సహా, ఆ సంస్థకు చెందిన అనేకమంది నిర్భంధానికి గురయ్యారు.

సామ్రాజ్యవాద వనరుల దోపిడీకి వ్యతిరేకంగా ప్రజావుద్యమాలు కేవలం  సుర్జాగర్ ప్రాంతంలోనే జరగడం లేదు. పర్సా బొగ్గు బ్లాక్ -11 వద్ద బొగ్గుతవ్వకాలకై హస్దియో ఆనంద్ ప్రాంతంలో, అడవిని కొట్టేయడం కోసం ఇచ్చిన అనుమతులకు వ్యతిరేకంగా ప్రజలు పెద్దేత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పర్సా బొగ్గు బ్లాక్ -11 ను రాజస్తాన్ రాజ్య విద్యుత్ ఉత్పదానకు కేటాయించగా, ఆ త్రవ్వక కార్యకలాపాలు చేపట్టేది అదాని గ్రూపు. దీనివల్ల రెండు గ్రామాల ప్రజలు పూర్తిగా నిర్వాసితులవుతారు. మారో మూడు గ్రామాలు పాక్షికంగా తొలగించబడుతాయి. అంతేగాక, ఉత్తర ఛత్తీస్ఘడ్ అడవులలో పర్యావరణ ప్రాముఖ్యత కలిగిన 841 హెక్టార్ల అటవీ ప్రాంతంలో ఒక లక్ష చెట్లు కొట్టివేయబడుతాయి.

 ఈ “అభివృద్ధి” విధానం వల్ల నష్టపోయేది ఆదివాసీలు, దళితులు మరియు ఇతర పీడిత, తడిత జనాలు మాత్రమే. నయా వుదారవాద అభివృద్ధి అంటేనే స్థానభ్రంశం(Displacement), విధ్వంసం (Destruction) మరియు దారిద్రం(Destitution) గాక మరేమిటి? ప్రభుత్వానికి మరియు మైనింగ్ మాఫియాకు మధ్య గల పవిత్ర కలయికను గుర్తెరిగి దానికి వ్యతిరేకంగా పోరాడక తప్పదు.

 ప్రజావుద్యమాలను నిరంకుశంగా అణచివేసిన ఉదాహరణలు చాలానే ఉన్నాయి. కానీ, అణచివేత ప్రతిఘటనకు దారితీస్తుందని చరిత్ర చెబుతున్న సత్యం. దోపిడీకి, పీడనకు గురవుతున్న ప్రజలను అలాంటి ఉద్యమాలు సంఘటితం జేస్తాయి. వాటిని పూర్తిగా అణచివేయలేరు. అవి దేశంలోని ఇతరప్రాంతాలకు నిప్పురవ్వల లాగా వ్యాపిస్తాయి. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిజం అంతిమంగా సామ్రాజ్యవాద సేవలో తరిస్తుంది. సైనికీకరణ, ప్రజాస్వామ్య ఉద్యమాలపై, మహిళలపై, దళితుల, ఆదివాసీల, ముస్లింల, క్రిష్టియన్ల, సిక్కుల మరియు కాశ్మీర్, నాగాలాండ్, మణిపూర్ లాంటి అణచివేయబడ్డ జాతులపై  దాడులు ఇండియాను హిందూ రాష్ట్రంగా మార్చే ఆర్ ఎస్ ఎస్ అజండాలో భాగమే. దానికి వ్యతిరేకంగా, దేశంలోని పీడిత, అణచివేయబడుతున్న ప్రజలందరితో ఒక విశాల ఐక్యసంఘటన నిర్మించడం ద్వారానే, ప్రజలపై, ప్రజాస్వామ్య ఉద్యమాలపై నేడు జరుగుతున్న దాడులను తిప్పికొట్టగలము.

 అనువాదం: అరుణ్

Leave a Reply