నేప‌థ్యంః

దక్షిణ కొరియా స్టీల్ కంపెనీ పోస్కో కోసం  ఒడిశా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న  వ్యవసాయ భూమిని  రైతులు పోరాడి సాధించుకున్నారు. ఈ పోరాటం ద‌శాబ్దంపైగా న‌డిచింది. సుమారు 3,000 వ్యవసాయ కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి.    ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం అదే భూమిని భారతీయ ఉక్కు కంపెనీకి అప్పగించింది. తిరిగి ఆ ప్రాంతం మళ్లీ నిరసనలు, ఘర్షణల‌తో అట్టుడుకుతున్న‌ది. ఎప్ప‌టిలాగే పోలీసుల క్రూరత్వంతో అల్లకల్లోలమైంది.

ధింకియా, నవ్‌గావ్, గడకుజంగా అనే మూడు గ్రామ పంచాయతీల పరిధిలోని ఎనిమిది గ్రామాలలో దాదాపు 20,000 మంది  ఉంటున్నారు. వారిలో  అత్యధికులు షెడ్యూల్డ్ కులాలకు (SC) చెందినవారు. వీరు 60% కంటే ఎక్కువ ధింకియా, గడకుజంగా గ్రామ పంచాయతీలలో, 40% ఒకే గ్రామ పంచాయతీ అయిన నుగావ్‌లో ఉన్నారు.

తరతరాలుగా పానా (తమలపాకు), దానా (వరి), మినా (చేపలు), కాజు (జీడిపప్పు) వంటి వాటి మీద ఈ ప్రాంత ప్ర‌జ‌లు ఆధార‌ప‌డ జీవిస్తున్నారు. ఈ ప్రాంతంలో బలమైన, ఆరోగ్యవంతమైన  ఆర్థిక వ్యవస్థ  ఉన్న‌ది.   3,500  తమలపాకు తోటలు, తీరప్రాంత అటవీ ఇసుక విస్తీర్ణంలో ఉన్న లక్షల జీడి చెట్లు ఈ ప్రాంతం ప్రధాన ఆదాయ వనరుగా వున్నాయి.

జనాభాలో దాదాపు 80% మంది తమలపాకులను సాగు చేస్తారు. ఈ ప్రాంతంలోని నేల, చక్కటి ఇసుకల సమతుల్య మిశ్రమం జీడిపప్పు చెట్లు, తమలపాకు సాగుకు తగిన వాతావరణాన్ని అందిస్తుంది. తమలపాకు తోటలలో, దీర్ఘచతురస్రాకార పందిళ్ళపై తీగలు పెరుగుతాయి. పచ్చదనంతో నిండిన నీడతో నిండిన ప్రదేశంలో 14 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు ఆడా, మొగా కుటుంబమంతా ఏడాది పొడవునా పని చేస్తారు.

ధింకియాలోని తమలపాకు తోటలలో వేతన కూలీలుగా, చేప‌లు ప‌ట్టే వాళ్లుగా  వంద‌ల సంఖ్య‌లో దళిత కుటుంబాలు    ఉన్నాయి.

సగటున తమలపాకులను 10 ‘దశాంశం’ నుండి 50 ‘దశాంశం’ మధ్య కొలుస్తారు. దశాంశం అనేది ఒక ఎకరంలో పదోవంతు లేదా 436 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే భూమి యూనిట్. 15 దశాంశాల భూమిలో తమలపాకు తోట ఉన్న కుటుంబం నెలకు రూ. 20,000 వరకు సంపాదించగలదు. ఇది భారతదేశంలోని సగటు గ్రామీణ ఆదాయం కంటే చాలా ఎక్కువ. కూలీ అయితే రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు యిస్తారు. అనేక కుటుంబాలు ధాన్యం లేదా జీడిపప్పు సేకరణ నుండి అదనపు ఆదాయాన్ని సంపాదిస్తాయి.  

జిందాల్ స్టీల్ అండ్ వర్క్స్ (JSW)  ప్రతిపాదిత ప్రాజెక్ట్ వ‌ల్ల అభివృద్ధి ముసుగులో ఈ ప్రాంతంలో తరతరాలుగా ఉన్నసంప్ర‌దాయ‌క‌, సుస్థిర జీవనోపాధికి   అంతరాయం కలిగింది. ఇది పర్యావరణ వ్యవస్థను కోలుకోలేని   ప్రమాదంలోకి నెడుతుంది.

పాస్కో వ్యతిరేక ఉద్యమం :

దక్షిణ కొరియా ఉక్కు సమ్మేళనమైన పోస్కోను నిలువరించడంలో ధింకియా చరిదేశ్ ప్రజలు 2005 నుండి 2017 వరకు పోరాడి విజ‌యం సాధించారు.   కానీ రాజ్యం మరోసారి వందల ఎకరాల సారవంతమైన తమలపాకు తోటల సాగు భూమిని లాక్కొని, కూలీలను, మత్స్యకారులను పేదరికంలోకి నెట్టుతోంది. పోస్కో కోసం సేకరించిన భూమిని ల్యాండ్ బ్యాంక్‌లో ఉంచడంతో పాటు, మరింత భూమిని JSWకి యివ్వాలనుకుంటోంది. ఆ కంపెనీకి ఇంకా పర్యావరణ అనుమతి లభించలేదు.

2005లో ఒడిషా ప్రభుత్వంతో పోస్కో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్న తర్వాత ఈ వ్యవసాయ ప్రాంతం తీవ్ర ముప్పును ఎదుర్కొంది. ఆ సమయంలో ఇది భారతదేశంలోని ఏకైక అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కలిగిన  (FDI) ప్రాజెక్ట్. 12 బిలియన్లు (అప్పుడు రూ. 52,000 కోట్లు) అమెరికన్ డాలర్ల పెట్టుబడితో 12 MTPA ( MTPA=మిలియన్ టన్ పర్ యానం ) మూడు గ్రామ పంచాయితీల గ్రామాలకు చెందిన 4,004 ఎకరాల భూమిపై ఉక్కు ప్రాజెక్ట్‌‌ను ఏర్పాటు చేయతలపెట్టింది.

ధింకియాకు చెందిన నలభైల మధ్య వయసున్న మహిళ సంజు మంత్రి శాంతియుత భూసేకరణ “ఒక పెద్ద జోక్” అని అన్నారు.

భూసేకరణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యకు మెజారిటీ గ్రామస్తుల నుంచి తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. వారు పోస్కో ప్రతిరోధ్ సంగ్రామ్ సమితి (PPSS) పతాకం కింద ధింకియాను బలమైన కోటగా చేసుకుని పోస్కో వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు.

కానీ ఈ సంఘటనలు గ్రామ సమాజాన్ని విచ్ఛిన్నం చేశాయి. ఒక సమూహం యునైటెడ్ యాక్షన్ కమిటీ (UAC) పోస్కోకు మద్దతు ఇచ్చింది. POSCO అనుకూల, వ్యతిరేక సమూహాల మధ్య విభేదాలు ఐదుగురు ప్రాణాలను బలిగొన్నాయి. అటవీ భూమిలో గ్రామస్తులు తమ తమలపాకు తోటలను అక్రమంగా వేసుకున్నారని 466 మంది నిర్వాసిత కుటుంబాలకు మొత్తం రూ. 70 కోట్ల పరిహారం ప్యాకేజీని తాము పెద్ద మనస్సుతో అందజేస్తున్నామనేది ప్రభుత్వ వైఖరి. మరోవైపు పోస్కో వ్యతిరేక గ్రామస్తులు తాము తమలపాకులను తరతరాలుగా సాగుచేస్తున్నామని అటవీ హక్కుల గుర్తింపు చట్టం, 2006 ప్రకారం తమకు భూమి పట్టాలు (పద్దులు) మంజూరు చేసే పెద్ద మనస్సు కలిగి వుండాల్సింది అని అంటున్నారు.

చాలా చిన్న ప్లాంట్ కోసం పర్యావరణ శాఖ ఆమోదాన్నివ్వడం తరచుగా జరుగుతుంది. పోస్కో ప్రతిపాదన 12 MTPA పర్ ప్లాంట్‌గా ఉన్నప్పటికీ, పర్యావరణం & అటవీ మంత్రిత్వ శాఖ (MoEF) 4 MTPA ప్లాంట్‌కు వేగవంతమైన పర్యావరణ ప్రభావ అంచనా (EIA) ఆధారంగా మొదటి పర్యావరణ అనుమతి పత్రం యిచ్చింది.

2007లో కంపెనీ 12 MTPA ప్రాజెక్ట్‌ ను ఏర్పాటు చేయడానికి అనుమతులు పొందినప్పుడు పర్యావరణవేత్తలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో సవాలు చేశారు. (MoEF పేరును 2014లో పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, MoEF&CCగా మార్చారు.)

“సాంకేతికంగా చెప్పాలంటే, భూమి, నీరు, గాలి, అడవిపై నాల్గవ వంతు సామర్థ్యం ఉన్న ప్లాంట్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై నివేదిక ఆధారంగా పెద్ద సామర్థ్యం గల ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రాజెక్ట్ ఆమోదం పొందింది” అని పిటిషనర్లలో ఒకరైన పర్యావరణ కార్యకర్త, ప్రతిష్టాత్మక గోల్డ్‌ మ్యాన్ పర్యావరణ బహుమతి విజేత ప్రఫుల్ల సమంత వివరణనిచ్చారు.

2010లో 170,000 చెట్లను నరికేసినప్పటికీ, స్వాధీనం చేసుకున్న భూమి చుట్టూ సరిహద్దు గోడలను నిర్మించే పేరుతో 800,000 చెట్లను నరికివేయాలనే పరిపాలనా చర్యను నిలిపివేయడానికి ఈ పిటిషన్ సహాయపడింది.

2011లో, గ్రామస్తుల నిరసనలు, చట్టపరమైన అడ్డంకుల కారణంగా ఒడిశా ప్రభుత్వం పోస్కో ప్లాంట్ సామర్థ్యాన్ని 8 MTPAకి, దాని విస్తీర్ణాన్ని 2,700 ఎకరాలకు తగ్గించింది.; బలమైన గ్రామాన్ని ఏకాకిని చేయడం, పోస్కో వ్యతిరేక ఉద్యమాన్ని నీరుకార్చడం, ఇతర గ్రామాల్లో భూమిని స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనతో ప్రాజెక్ట్ ప్రాంతం నుండి ధింకియాని మినహాయించినట్లుగా కనిపించింది.

జిల్లా యంత్రాంగం 2011 మరియు 2013 మధ్య రెండు దశల్లో మిగిలిన గ్రామాల్లో 1,100 తమలపాకు తోటలను కూల్చివేసి భూసేకరణను పూర్తి చేసింది.

అయినప్పటికీ, పోలీసులు మరిన్ని కేసులు నమోదు చేయడం, మరిన్ని అరెస్టులు చేయడంతో నిరసనలు కొనసాగాయి. 2500 మంది గ్రామస్థులపై (మహిళలు 700, పురుషులు 1800) కేసులు నమోదు చేశారు.

పోరాటంలో మహిళలు :

ఆనాటి పోస్కోకి, ఇప్పటి JSW  కి  అప్ప‌గించ‌డానికి  జరుగుతున్న భూసేకరణ వ్యతిరేక పోరాటంలో మహిళలు ముందు నిలబడి నాయకత్వం వహించారు. అరెస్టు అయిన సుమారు 70 మంది గ్రామస్తుల్లో కనీసం 20 మంది మహిళలు విచారణా ఖైదీలుగా ఒక నెల నుండి ఒక సంవత్సరం వరకు జైలులో ఉన్నారు.

పోస్కో వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైనప్పుడు వారే మొదట సంఘటితమయ్యారు. వారు అన్ని ర్యాలీలు, ప్రదర్శనలలో సగ భాగంగా ఉన్నారు. పురుషుల చుట్టూ రక్షణ కవచంలా పనిచేశారు. పరిపాలన ఒత్తిడి కారణంగా లేదా ఇతర ప్రయోజనాల ఎర కారణంగా పురుషులు ప్రాజెక్ట్‌ పై తమ అభిప్రాయాన్ని మార్చుకున్న సందర్భాల్లో కూడా మహిళలు తమ వ్యతిరేకతలో స్థిరంగా ఉన్నారు.

పోస్కో వ్యతిరేక ఉద్యమంలో ప్రముఖ మహిళా నాయకురాలు మనోరమ ఖతువాపై 52 నేరారోపణలు చేశారు. హత్య, హత్యాయత్నం, దొంగతనం, దోపిడీ, చివరికి అత్యాచారం అభియోగం కూడా ఆమెపై మోపారు. అయినప్పటికీ, వెదురు గేట్లతో అడ్డుగా ఉన్న ధింకియాలో వుండి ఆమె అరెస్టును తప్పించుకుంది, అక్కడ మహిళలు రాత్రింబగళ్ళు రోజుల తరబడి జాగారం చేసి కాపలా కాశారు.

నలభైల వయసులో ఉన్న ధింకియాకు చెందిన SC మహిళ గండెయ్ మల్లిక్ 2010, మే 15న అరెస్టు అయి మూడు నెలలు జైలులో వుంది. కస్టడీలో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం క్షీణించడంతో, బెయిల్‌పై విడుదలైన కొన్ని వారాల తర్వాత ఆమె మరణించింది.

తరచుగా, కుటుంబంలో వున్న ఆడా, మొగా అందరి పేర్లు నిందితులుగా ఏదో ఒక కేసులో చేర్చారు. నేరారోపణలు హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, అల్లర్లు, దొంగతనం నుండి పోలీసులపై భౌతికంగా దాడి చేయడం, అత్యాచారం వరకు ఉన్నాయి.

పోరాటంపై నిర్బంధం :

చాలా మంది గ్రామస్తులను కూరగాయలను అమ్మడానికి వెళ్లినప్పుడు స్థానిక మార్కెట్ల నుండి పోలీసులు తీసుకెళ్ళిపోయారు.  మైనర్ కొడుకును ఒంటరిగా, రోడ్డు మీద వదిలేసి పోలీసులు తండ్రిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అరెస్టుల నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో ప్రజలు తమ జీవనోపాధి కోల్పోయారు.

“మొత్తం ప్రక్రియ మమ్మల్ని శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా హరించివేసింది. మా కుటుంబ జీవితాలను ప్రభావితం చేసింది. ఎవరైనా తలుపు తడతారనే నిరంతర భయంతో నెలల తరబడి ఇంట్లోనే ఉండిపోయానని” తన పేరు చెప్పకూడదని కోరుకున్న గోవింద్‌పూర్‌లోని 60 ఏళ్ల నివాసి వేదన వ్యక్తం చేశారు.

నిరసనలు, పర్యావరణ కేసులలో చిక్కుకున్న పోస్కో తన ప్రాజెక్టును అమలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని తెలియడంతో 2015 నాటికి పోలీసుల నుండి ముప్పు తగ్గింది. రెండు సంవత్సరాల తర్వాత కొరియన్ కంపెనీ అధికారికంగా ప్రాజెక్ట్ నుండి వైదొలిగినప్పుడు, ప్రభావిత ప్రాంతం వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయిన వారితో, నరికేసిన వేలాది చెట్ల కొమ్మలతో మిగిలిపోయింది.

ఎనిమిది గ్రామాలలో అతిపెద్దదైన నౌగావ్ చాలా నష్టపోయింది. UAC యొక్క బలమైన కోట నుగావ్. 2011లో POSCOను స్వాగతించిన మొదటి గ్రామం. ప్రాజెక్ట్ నిర్మాణకాలంలో అద్దె వాహనాలుగా నడుపుకోవచ్చని గ్రామస్తులు పరిహారం డబ్బుతో కార్లను కొన్నారు. చిట్ ఫండ్ కుంభకోణంలో చిక్కుకుని దివాళా తీసిన చిట్ ఫండ్ కంపెనీవల్ల  పెద్ద సంఖ్యలో గ్రామస్తులు తాము పొందిన నష్టపరిహారాన్ని మరో విధంగా కోల్పోయారు.

జిందాల్ స్టీల్ అండ్ వర్క్స్ (JSW) ప్రతిపాదిత ప్రాజెక్టు వ్యతిరేక పోరాటం  :

జిందాల్ స్టీల్ అండ్ వర్క్స్ (JSW) ఉత్కల్ స్టీల్ లిమిటెడ్‌కు 13.2 MTPA, 900MW క్యాప్టివ్ ఎలక్ట్రిసిటీ ప్లాంట్, 10MTPA సిమెంట్ ప్లాంట్, 52 మిలియన్ టన్నుల రవాణా సామర్థ్యం కలిగిన ఒక క్యాప్టివ్ పోర్ట్ అభివృద్ధి కోసం ఒడిషా ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (IDCO),మొత్తం 1193.974 హెక్టార్ల భూమి కేటాయించింది. ఇందులో అటవీయేతర భూమి 137.64 హెక్టార్లు. ( ఒక హెక్టార్ కు= 2.47 ఎకరాలు)

JSW ప్రాజెక్ట్‌ లో వున్న ఉక్కు కర్మాగారం, క్యాప్టివ్ జెట్టీ, సిమెంట్ కర్మాగారం దుర్బలంగా ఉన్న ఒడిశా తీరప్రాంతంలో తరచుగా తుఫానులు రావడం, భూప్రాంతం తగ్గుముఖం పట్టడం వల్ల ఉపద్రవాల్ని సృష్టిస్తుంది.

2009లో ఒడిశా ప్రభుత్వం పోస్కో ద్వారా ప్రతిపాదిత ఉక్కు కర్మాగారం, క్యాప్టివ్ పోర్ట్ కోసం పెద్ద సంఖ్యలో భూమి హక్కుదారులైన రైతుల నుండి బలవంతంగా తొలగించడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో ఒడిశా ప్రభుత్వం 2700 ఎకరాల భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకుంది. 2017లో పోస్కో విడిచిపెట్టివెళ్లిపోవడం వల్ల భూమి ప్రభుత్వం వద్ద ఉండి రైతులను భూమిలోకి ప్రవేశించకుండా నిరోధించింది. ఇప్పుడు రంగంలోకి వచ్చిన JSW డిమాండ్ చేసిన 1193.97 హెక్టార్ల భూమి కొరతను తీర్చడానికి ప్రభుత్వం మరింత ఎక్కువ మంది ప్రజల్ని తొలగించడానికి ప్రయత్నిస్తోంది. 2009లో సేకరించిన భూమిని తీసుకున్న అవసరాలకు వినియోగించలేదు కాబట్టి అప్పటి చట్టం ప్రకారం ఈ భూమిని ల్యాండ్ బ్యాంక్‌లో ఉంచడం చట్టవిరుద్ధం అవుతుంది. మీనా గుప్తా కమిటీ, సక్సేనా కమిటీ, పోస్కో విచారణ కమిటీతో సహా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు కూడా రైతులకు అనుకూలంగా కొన్ని పరిశీలనలు చేశాయి. స్వాధీనంలో వున్న భూమి రైతులకే చెందుతుంది. ప్రభుత్వం భూమి స్వభావాన్ని అక్రమంగా మార్చడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంది.

2022 జనవరి14 న సాయుధ పోలీసులకు, కోస్తా జిల్లా ధింకియా గ్రామంలోని దాదాపు 500 మంది నివాసితులకు మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత 57 ఏళ్ల శాంతి దాస్ కుటుంబానికి చెందిన సుమారు 80 సంవత్సరాలుగా సాగు చేస్తున్న రెండు తమలపాకు తోటలను ప్రభుత్వ ఉద్యోగులు ధ్వంసం చేశారు.

అర ఎకరం కంటే తక్కువ భూమిలో ఉన్న, ఆ రెండు తోటల వల్ల, ఏడుగురున్న దాస్ కుటుంబానికి నెలవారీ ఆదాయం దాదాపు రూ. 70,000 లేదా ప్రతి సంవత్సరం రూ. 840,000దాకా వుంటుంది.

ప్రతిపాదిత ఉక్కు కర్మాగారం కోసం తమలపాకు తోటలను కోల్పోయినందుకు, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం దాస్‌కు “ఒకేసారి పరిష్కారంగా”తో దాదాపు రూ. 700,000 మాత్రమే ఇస్తానంటోంది.

అణచివేత చర్యలు :

జనవరి 14న జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని ధింకియాలోకి ప్రవేశించే మూడు చోట్లా, గ్రామస్తులు అడ్డుపెట్టిన వెదురు అడ్డంకులను బద్దలు కొట్టి పోలీసులు గ్రామంలోకి వచ్చి ప్రజలను విపరీతంగా కొట్టారు. దాదాపు 500 మందికి పైగా సాయుధ పోలీసులు పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.

ర్యాలీకి తరలివస్తున్న వారిపై పోలీసులు నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. మహిళలు, పిల్లలను వెంబడించి కొట్టారు.  కింద పడి పోయిన గ్రామస్థులపై  పోలీసుల గుంపులుగా లాఠీ చార్జి చేశారు.  ప్రజలు సహాయం కోసం ఏడుస్తూండడం, పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం లాంటి దృశ్యాలను ప్రాంతీయ టీవీ ఛానెళ్ళు ఆ సాయంత్రం చూపించాయి. ఈ ఘటనలో అనేక మంది గ్రామస్తులు గాయపడ్డారు. ఒడిశా పోలీసులు సృష్టించిన భీభత్సం, హింసల కారణంగా చాలా మంది చికిత్స చేయించుకోవడం కోసం బయటకు రాలేకపోయారు. వీరిలో కొందరి ఆచూకీ ఇంకా తెలియడంలేదు. బహుశా వారు ఇంకా అడవిలోనో, తమలపాకుల తోటల్లోనో దాక్కుని వుంటారు.

వాస్తవాలను తెలుసుకోడానికి ఆ ప్రాంతానికి వెళ్ళిన ప్రజా ఉద్యమ నాయకుడు దేబేంద్ర స్వైన్‌తో సహా ఆరుగురిని, క్యాంపెయిన్ ఎగైన్స్ట్ ఫ్యాబ్రికేటెడ్ కేసెస్ (భువనేశ్వర్) (కల్పిత కేసుల వ్యతిరేక ప్రచారోద్యమం)నుండి నరేంద్ర మొహంతి, మురళీధర్ సాహూ, నిమై మల్లిక్, మంగులి కంది, త్రినాథ్ మల్లిక్ లను అరెస్టు చేసి, బంధువులకు ఎలాంటి సమాచారం యివ్వకుండా వారిని బలవంతంగా పోలీసు వాహనాల్లోకి ఎక్కించి, రహస్యంగా ఉంచి, జనవరి 15 తెల్లవారుజామున మేజిస్ట్రేట్‌ ముందు ప్రవేశ పెట్టారు. వారు వైద్య పరీక్షలు చేయమని కోరడానికి వీల్లేకుండా, లేదా పోలీసు లో వున్నప్పుడు వారి పట్ల జరిగిన దుర్వ్యవహారం ఎవరికీ తెలియకుండా వుండడానికి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారు. వారి పైన  PC నంబర్ 21/22 GR-34/22 , IPC, CLA, PPDP చట్టాల సెక్షన్లు 307, 147, 148, 323, 294, 324, 354, 336, 325, 353, 332, 379, 427, 506, 186, 149కింద కేసు పెట్టారు..

పోలీసులు ధింకియాలోని 3,000 మంది నివాసితులపై 25 క్రిమినల్ కేసులు పెట్టారు-ప్రతి FIRలో అనేక మంది నిందితులు ఉన్నారు. ఒక ఎఫ్‌ఐఆర్‌లో 99 మంది నిందితులు, 1,000 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారు. ఒక కేసులో గుర్తించిన నిందితులు 81 మంది వుంటే, 200 మంది “ఇతరులపై” మరో కేసు నమోదు అయితే. మరో కేసులో 60 మంది నిందితులు, 100 మంది “ఇతరులు” ఉన్నారు. జనవరి 14న జరిగిన సంఘటనకు సంబంధించిన ఫిర్యాదులో 18 మంది గుర్తించిన, 500 మంది గుర్తుతెలియని నిందితులు అని ఉంది.  

భారతీయ శిక్షాస్మృతి 1860లోని సెక్షన్ 307 (హత్యాయత్నం), 147 (అల్లర్లకు శిక్ష), 148 (అల్లర్లు, మారణాయుధంతో ఆయుధాలు కలిగి ఉన్నారు), 341 (శిక్ష తప్పుడు సంయమనం) 353 (ప్రభుత్వ సేవకుని తన విధిని నిర్వర్తించకుండా నిరోధించడానికి దాడి లేదా నేరపూరిత బలప్రయోగం), 436 (అగ్ని లేదా పేలుడు పదార్థాన్ని అమర్చడం), లతో సహా యితర వివిధ సెక్షన్లు, ప్రభుత్వ ఆస్తుల నష్ట నిరోధక చట్టం 1908 లోని మొదలైన అనేక నాన్-బెయిలబుల్ సెక్షన్‌ల కింద కేసులు పెట్టారు. మాజీ పంచాయితీ సమితి సభ్యుడు, స్వైన్ పైన IPC సెక్షన్లు 379 (పోలీసుల నుండి తుపాకీని లాక్కోవడం) 395 (దోపిడీకి శిక్ష) పేలుడు పదార్థాల చట్టం, 1908లోని సెక్షన్లు 3, 4 తదితర బెయిల్ యివ్వకూడని సెక్షన్ల కింద కేసులు పెట్టారు. అతని రెండు వారాల తర్వాత జనవరి 28న అరెస్టు చేసిన అతను యింకా జైలులోనే వున్నారు.

మహిళా కానిస్టేబుళ్లు, అధికారులు లేకుండా పోలీసులు తరచుగా రాత్రిపూట దాడులు చేస్తారు కాబట్టి  యువత  రాత్రి సమయంలో గ్రామాల్లో ఉండడం లేదు. గ్రామంలోకి ప్రవేశించే లేదా బయటకు వెళ్లే వ్యక్తులు తమ ఐడి కార్డులను చూపించమని అడుగుతున్నారు

JSW   వ్యతిరేక పోరాటానికి మద్దతుగా.. :

జిందాల్ స్టీల్ వర్క్ ఉత్కల్ లిమిటెడ్ కోసం ఒడిశా ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధింకియా చారిదేశ్ (మూడు గ్రామ పంచాయతీలు)  ప్రాంతంలోని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఈ పోరాటానికి దేశ నలుమూలల నుండి మద్దతు లభిస్తోంది.

జనవరి 14న ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా ధింకియా గ్రామస్థులపై జరిగిన క్రూరమైన పోలీసు హింస, భయాత్పోతాన్ని తీవ్రంగా ఖండిస్తూ దేశం నలుమూలల నుండి అనేక మానవ హక్కుల సంస్థలు, విద్యార్థి, రైతు సంఘాలు, సామాజిక, రాజకీయ, స్త్రీవాద కార్యకర్తలు ఒక ప్రకటన విడుదల చేశారు. ధింకియా చారిదేశ్ ప్రాంతాల నుండి పోలీసు బలగాలందరినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఇప్పటి వరకు JSW విషయంలో పోస్కోకు వ్యతిరేకంగా ఉద్యమం నుండి ప్రజలపై పెండింగ్‌లో ఉన్న అన్ని క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిరసనకారులందరినీ విడుదల చేయాలని, పోస్కో ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని మొదట ఎవరి నుంచి సేకరించారో వారికే తిరిగి అప్పగించాలని ప్రకటనపై సంతకం చేసినవారు ఒడిశా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

ప్రభుత్వానికి ఈ మెయిల్ ద్వారా ప్రతిపాదిత ప్రాజెక్టు అనుమతినివ్వడాన్ని వెనక్కు తీసుకోవాలని పర్యావరణ న్యాయం కోసం విద్యార్థులు డిమాండ్ చేశారు.

జిందాల్ స్టీల్ వర్క్ ఉత్కల్ లిమిటెడ్ కోసం ఒడిశా ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధింకియా, చారిదేశ్ (మూడు గ్రామ పంచాయతీలు)  ప్రాంతంలోని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. జనవరి 14న ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లా ధింకియా గ్రామస్థులపై జరిగిన క్రూరమైన పోలీసు హింస, భయాత్పోతాన్ని తీవ్రంగా ఖండిస్తూ దేశం నలుమూలల నుండి అనేక మానవ హక్కుల సంస్థలు, విద్యార్థి, రైతు సంఘాలు, సామాజిక, రాజకీయ, స్త్రీవాద కార్యకర్తలు ఒక ప్రకటన విడుదల చేశారు. ధింకియా చారిదేశ్ ప్రాంతం నుండి పోలీసు బలగాలందరినీ తక్షణమే ఉపసంహరించుకోవాలని, ఇప్పటి వరకు JSW విషయంలో పోస్కోకు వ్యతిరేకంగా ఉద్యమం నుండి ప్రజలపై పెండింగ్‌లో ఉన్న అన్ని క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవాలని, జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిరసనకారులందరినీ విడుదల చేయాలని, పోస్కో ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని మొదట ఎవరి నుంచి సేకరించారో వారికే తిరిగి అప్పగించాలని ప్రకటనపై సంతకం చేసినవారు ఒడిశా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

జనవరి 15నాడు లాఠీ ఛార్జ్ ఘటనపై దర్యాప్తు చేయడానికి, గ్రామస్తులకు మద్దతు, సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న SKM-ఒడిశా బృందాన్ని, వారి సమర్థకులను త్రిలోచన్‌పూర్ వైపు, ధింకియా వెలుపల 50 నుండి 60 మందికి పైగా వున్న పురుషుల గుంపు  అడ్డుకుంది. వీరిని ఆపి, తిట్టి, మానవ హక్కుల సమర్థకులు గ్రామానికి ఇబ్బంది కలిగిస్తున్నారని ఆరోపించారు. బెదిరించారు, అవమానించారు, అసహ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించారు. వారి నుంచి మద్యం సేవించిన వాసన వస్తోంది. మహేంద్ర పరిదా, ప్రఫుల్ల సమంత, జ్యోతి రంజన్ మహాపాత్రో, ప్రదీప్త నాయక్, సంతోష్ రథా, జాంబేశ్వర్ సమనత్రే, సుజాతా సహాని, రంజనా పాధి తదితరులు ఆ బృందంలో వున్నారు. ముగ్గురు సభ్యులు అభయచంద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులను ఉపసంహరించుకోవాలని, సాధారణ పరిస్థితులు నెలకొనాలని పీయూసీఎల్ ఒడిశా డిమాండ్ చేసింది. ఒడిశా-ఎస్‌కేఎం గవర్నర్‌కు విజ్ఞప్తి పత్రాన్ని అంద చేసింది.

ఒడిశాలోని ధింకియాలో పోలీసుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ర్యాలీ చేపట్టేందుకు జనవరి 19 న కోల్‌కతా పోలీసులు విద్యార్థులను అనుమతించలేదు. ఉత్కల్ భవన్ వైపు ర్యాలీగా వెళుతుండగా నిరసన తెలిపిన విద్యార్థులను పోలీసులు బౌబజార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఒడిశాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వం జిందాల్ గ్రూప్ ద్వారా మెగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం గ్రామస్తులను వెళ్లగొట్టి బలవంతంగా భూమిని సేకరించడాన్ని ప్రతిఘటిస్తున్న ప్రజలపై ఒడిశా పోలీసులు భీభత్సం జరుపుతున్న నిర్బంధకాండను ఖండించారు.

కోఆర్డీనేషన్ ఆఫ్ డెమాక్రటిక్ రైట్స్ ఆర్గనైజేషన్స్(CDRO), గణతంత్రిక్ అధికార్ సురక్య సంఘటన్ (GASS),  ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ (OPDR) సభ్యులతో కూడిన సంయుక్త నిజనిర్ధారణ కమిటీ బృందం, జనవరి 29-30 లలో ధింకియా, గోవింద్‌పురా, పటానా, మహాలా గ్రామాలకు వెళ్లింది. ఈ బృందం కుజంగాలోని సబ్‌డివిజనల్ జైలులో ఉన్న నరేంద్ర మొహంతి, దేబేంద్ర స్వైన్‌లతో పాటు అభయ్‌చంద్‌పూర్ పోలీసు స్టేషన్ SHOని కూడా కలుసుకున్నది. గ్రామస్తులపై కేసులను విచారిస్తున్న సంబంధిత న్యాయవాదిని కూడా బృందం కలిసింది. బర్ధమాన్ ఎస్టేట్ సమయంలో ఆ భూమిలోని కొన్ని భాగాలను అద్దెకు తీసుకున్నట్లు బృందం కొన్ని రుజువులను చూసింది. 1982లో రైతులకు హక్కులు కల్పిస్తూ ఒడిశా అటవీ శాఖ జారీ చేసిన కొన్ని పత్రాలను కూడా బృందం చూసింది. కాబట్టి గ్రామస్తులకు తాము చాలా కాలం నుంచి సాగుచేసిన భూమిపై హక్కులు లేవని ప్రభుత్వమూ, JSW చేస్తున్న వాదన సరి కాదు అని బృందం అభిప్రాయపడింది.

హక్కుల సంఘాలు వారు పెట్టిన డిమాండ్లు :

JSW ప్రాజెక్ట్‌ను తక్షణమే నిలిపివేయాలి

గ్రామాలనుండి పోలీసుబలగాలన్నింటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలి

అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి; గ్రామస్తులపై పెట్టిన కేసులన్నింటినీ బేషరతుగా ఎత్తివేయాలి

రైతులను వారి భూమి నుండి బలవంతంగా ఖాళీ చేయించడంతో సహా అన్ని అంశాలను పరిశీలించడానికి సిట్టింగ్ సుప్రీం కోర్ట్ జడ్జి నేతృత్వంలో జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేయాలి

తమలపాకు తీగల తోటలు నష్టపోయిన రైతులకు, కూలీలకు పరిహారం ఇవ్వాలి మొదలైన డిమాండ్లతో జరుగుతున్న పోరాటం విజయాన్ని సాధిస్తుంది.

పోస్కో లాగానే జిందాల్ కంపెనీ కూడా పారిపోక తప్పదు. అంతిమ విజయం ప్రజలదే.

Leave a Reply