– సిద్ధికీ కప్పన్‌, రైహానాలతో ఇంటర్వ్యూ

 (సిద్ధికీ కప్పన్‌ 43సంవత్సరాల వయసున్న మళయాళీ జర్నలిస్టు. కేరళ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ ఢల్లీి శాఖకు కార్యదర్శి. ఆయన్ను 5 అక్టోబర్‌ 2020న ఉత్తరప్రదేశ్‌లోని మథుర టాల్‌ప్లాజా వద్ద అరెస్టు చేశారు. ఆయనతోపాటు ఇద్దరు విద్యార్థి కార్యకర్తలు అతికూర్‌ రహ్మన్‌, మసూద్‌ అహ్మద్‌, డ్రైవర్‌ మొహ్మద్‌ ఆలంను కూడా నిర్బంధించారు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌ అనే గ్రామంలో నలుగురు అగ్రకుల ఠాకూర్‌లు ఒక దళిత బాలికమీద సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో నిజనిర్ధారణకోసం ఆ గ్రామానికి వెళుతుండగా ఈ అరెస్టులు జరిగాయి. కప్పన్‌పై ఊపా, పియమ్‌ఎల్‌ఏ లతో సహా అనేక ఇతర సెక్షన్ల కింద కేసులు పెట్టారు. 851 రోజుల నిర్బంధం అనంతరం ఆయనను 2 ఫిబ్రవరి 2023న బెయిల్‌ పై విడుదల చేశారు. జైల్లో వుండగా ఆయన తల్లి మరణించింది. ఆయనకు రెండుసార్లు కోవిద్‌ సోకింది. జైలులో శారీరక, మానసిక చిత్రహింసలను తట్టుకున్నారు ఆయన.

            23 ఏప్రిల్‌ 2023న కేరళకు చెందిన జర్మలిస్టు, సామాజిక కార్యకర్త రెజాజ్‌ యమ్‌ షిబా సైదీక్‌, కప్పన్‌ను ఆయన సహచరి రైహానాను వాళ్ళ ఇంట్లో ఇంటర్వ్యూ చేశారు. రెండున్నర గంటలపాటు సాగిన ఈ సంభాషణలో కప్పన్‌ పత్రికా స్వేచ్ఛ, రాజ్య హింస, సమకాలీన భారత రాజకీయాలు, తన అనుభవాల గురించి తన అభిప్రాయాలను దృఢంగా వ్యక్తీకరించారు. 40 సంవత్సరాల వయసుగల రైహానా తన భర్త నిర్బంధంలో వుండగా తానూ, తన బిడ్డలు పొందిన అనుభవాలను వివరించారు. అలానే తమ రాజకీయ పరిశీలనలను కూడా వివరించారు. )

రెజాజ్‌ : మీ అరెస్టు, మీ సహచరుల అరెస్టు హత్రాస్‌ కేసు నుండి ప్రజల దృష్టి మరల్చడానికి జరిగిందని మీరు నమ్ముతున్నారా? నిందితులలో ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించి, నాలగోవ్యక్తిని అత్యాచారం, హత్య ఆరోపణలతో సంబంధం లేకుండా న్యాయస్థానం శిక్షించడంపై మీ స్పందన ఏమిటి?

కప్పన్‌ : మమ్మల్ని 5 అక్టోబర్‌ 2020న అరెస్టు చేసి మరుసటిరోజు అరెస్టు చేసినట్టుగా రికార్డులలో చూపించారు. హత్రాస్‌ కేసు జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుందని గుర్తించిన తరవాత ఈ కేసు విచారణను సిబిఐకి అప్పచెప్పారు. హత్రాస్‌ ఘటనలో ఒక ముద్దాయి ఒక బిజెపి నాయకుడికి బంధువని ఆరోపణలు వున్నాయి. ఆ నిందితుడిని కాపాడడానికి, నిర్భయ కేసులోలాగానే హత్రాస్‌ కేసుకూడా ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తుందని గుర్తించిన ప్రభుత్వం దానిని నుండి దృష్టి మళ్ళించడానికి మమ్మల్ని అరెస్టు చేసింది. రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, జయంత్‌ చౌదురిలతో పాటు భీం ఆర్మీకి చెందిన చంద్రశేఖర ఆజాద్‌ను కూడా హత్రాస్‌కు వెళ్తుండగా అడ్డగించారు. వాళ్ళను ఒకవేళ నిర్బంధించినా అక్కడ టెర్రరిస్టులనే కథనాన్ని అల్లడానికి అవకాశం లేదు. అలాంటి కథ అల్లడానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ముస్లింలు, కేరళకు చెందిన నేను సరిపోతాం. వాళ్ళ ఓట్‌ బ్యాంక్‌ను తృప్తి పరచడానికి రాజ్యానికి ఎప్పుడూ ఒక టెర్రరిస్టు కథనం అవసరం.

            గుజరాత్‌ నరమేధం కేసులో మాయా కొదనానీని విడుదల చేయడం మనం చూశాం. ఒక సర్దుబాటు ఆధారంగా ఇక్కడ న్యాయం నిర్ణయించబడిరది. సాధారణ ప్రజలు ప్రతిదాన్నీ తేలిగ్గా మర్చిపోవడమనేది ఫాసిజానికి అత్యంత ఉపయోగకరం. అది వాళ్ళకు ఒక గొప్ప వరం లాంటిది. ప్రజల నిరక్షరాస్యతను, మర్చిపోయే తత్వాన్ని ఫాసిస్టులు సొమ్ము చేసుకుంటారు. తాము ఏమి చేసినా ప్రశ్నించేవారు ఎవరూ వుండరనే వాస్తవమే వాళ్ళ ఆత్మవిశ్వాసానికి మూల కారణం. న్యాయస్థానాన్ని, రాజ్య ప్రతినిధులను విమర్శించడాన్ని కూడా జాతి వ్యతిరేకంగా చిత్రిస్తున్నారు. వేలు చూపించి ప్రశ్నించే వాళ్ళ చేతులకు బేడీలు తగిలిస్తున్నారు. బిహెచ్‌ లోయా వంటి న్యాయమూర్తి కూడా హత్యకు గురయ్యారు. ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టేవాళ్ళు మంత్రులుగా పార్లమెంటులోనూ, శాసనసభల్లోనూ సభ్యులుగా, న్యాయమూర్తులుగా నియమించబడుతున్నారు.

            ముద్దాయిలు దళితులో, ఆదివాసీలో, ముస్లింలో, క్రైస్తవులో అయితే న్యాయస్థానం కుందేలులాగా పరిగెడుతుంది. వాళ్ళకు ఉరిశిక్ష విధించడానికి అర్థరాత్రి కూడా సుప్రీంకోర్టుతో సహా అన్ని న్యాయస్థానాల తలుపులు తెరుచుకొని వుంటాయి. ఒకవేళ ముద్దాయిలు వున్నత కులాలకు చెందినవాళ్ళయితే న్యాయస్థానం తాబేలులాగా నెమ్మదిగా పాకుతూ పోతుంది. హత్రాస్‌ కేసులో ముద్దాయిలపై హత్య, అత్యాచారం సెక్షన్ల కింద కేసు పెట్టలేదు. శిక్షార్హమైన అసహజ మరణానికి సంబంధించిన  (కల్పబుల్‌  హోమీసైడ్‌) సెక్షన్‌నే పెట్టారు. దళిత బాలిక ఆత్మహత్య చేసుకుందని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు.

            ప్రజాస్వామ్యంలో న్యాయస్థానానిది ఒక ముఖ్యమైన పాత్ర. అయితే న్యాయస్థానం రాజ్య ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తున్నంత కాలం అమలులో వుండేది నియంతృత్వమేగాని, ప్రజాస్వామ్యం కాదు. 2008 మాలెగావ్‌ పేలుళ్ళ కేసులో ముద్దాయిలపట్ల సానుభూతితో వ్యవహరించమని ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను ఎన్‌ఐఏ కోరడాన్ని మనం చూశాం. అదే విధంగా ఈ కేసులో కూడా ఆ బాలికపై అత్యాచారానికి, హత్యకు పాల్పడ్డ ముద్దాయిపట్ల సానుభూతిగా వ్యవహరించమని ఆదేశాలు వచ్చి వుండవచ్చు.

రెజాజ్‌ : మిమ్మల్ని మీ మతం కారణంగా కాక మీ వృత్తి కారణంగా అరెస్టు చేశారని మీరన్నారు. అయితే మీ అరెస్టులో ఇస్లాం వ్యతిరేక కోణం లేదని మీరనుకుంటున్నారా?

కప్పన్‌ : ఇస్లాం వ్యతిరేకత మనం నిరాకరించలేని ఒక ప్రాపంచిక వాస్తవం. అది ఒక ప్రధాన కారణం. అయితే కేవలం నేను ముస్లింను కాబట్టే నన్ను అరెస్టు చేయలేదు. నేను కేరళకు చెందిన జర్నలిస్టును. నా పట్ల మతపరమైన వివక్ష కంటే ప్రాంతీయపరమైన వివక్షే ప్రదర్శించారని నేను మొదటి నుంచీ చెప్తున్నాను. దీన్ని నిరూపించడానికి ఒక ఉదాహరణ ఇవ్వగలను. హత్రాస్‌కు వెళ్తున్న ఆ కారులో నలుగురం ప్రయాణిస్తున్నాం. అందరమూ ముస్లింలమే. అయితే అందులో ముగ్గురు ఉత్తరప్రదేశ్‌కు చెందినవాళ్ళు. పోలీసులు మా కారు ఆపగానే ముందుగా అడిగిన ప్రశ్న, కేరళకు చెదిన జర్నలిస్టు కప్పన్‌ మీలో ఎవరూ అని? పోలీసులు ఆ ముగ్గురినీ ముందుగా ఇంటరాగేట్‌ చేసి వుండవచ్చు. కాని నన్నే ప్రశ్నించారు. నాతోపాటు వున్న విదార్థి కార్యకర్తలపై వాళ్ళు పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, క్యాంపస్‌ ఫ్రంట్‌ అనే సంస్థలకు చెందినవాళ్ళనే ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రశ్నించటం నాతోనే ప్రారంభమైంది. పోలీసులు నన్నే సరైన ఎరగా గుర్తించారు.  నన్ను కేవలం ‘‘ముస్లిం సిద్ధికీ కప్పన్‌’’గా మాత్రమే చూడలేదు. వాళ్ళకు కేరళ కూడా ఒక సమస్యే. అందుచేతనే సమస్య కేవలం మతమో, లేక పిఎఫ్‌ఐ మాత్రమే కాదు. నేను మళయాళీని కావడం కూడా సమస్యే. అమిత్‌షా కర్ణాటకలో మాట్లాడుతూ ఎన్నికల్లో తిరిగి తమ పార్టీని ఎన్నుకోకపోతే కేరళకు ఏ గతిపట్టిందో కర్ణాటక ప్రజలకు కూడా అదే పడుతుందని హెచ్చరించిన విషయం మీకు గుర్తుండే వుంటుంది.

            తమనితాము లౌకిక పార్టీలుగా చెప్పుకుంటున్న అనేక రాజకీయపార్టీలు కూడా ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఇస్లాం ద్వేషాన్ని వాడుకుంటున్నాయని నా నమ్మకం. అది యునైటెడ్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ కాని, లెప్ట్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ కాని` వాళ్ళ మంత్రులు కేరళలో ఉద్యమకారుల్ని ముస్లిం టెర్రరిస్టులుగా ఆరోపిస్తున్నారు. గెయిల్‌కు, జాతీయ రహదారి నిర్మాణానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న ప్రజల్ని లెఫ్ట్‌ డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ నాయకులు ముస్లిం టెర్రరిస్టులుగా పిలుస్తున్నారు. యుడిఎఫ్‌లో ఒక భాగమైన ఒక ముస్లిం పార్టీ నాయకుడు కూడా ఆ జాతీయ రహదారి నిర్మాణానికి వ్యతిరేకంగా వుద్యమిస్తున్న నిరసనకారుల్ని ముస్లిం టెర్రరిస్టులు అన్నారు. ఎన్‌ఆర్‌సి., సిఏఏ చట్టాల వ్యతిరేక ఉద్యమ సమయంలో కూడా నరేంద్రమోడీ ముస్లింలనే లక్ష్యంగా చేసుకున్నారు. ‘‘హింసా దౌర్జన్యాలకు పాల్పడుతున్నవాళ్లని వాళ్ళ దుస్తుల్ని బట్టే గుర్తించవచ్చును’’ అని ఆయన అన్నారు. అందుచేత అది ఏ రాజకీయ పక్షాల కూటమి అయినా తమ ప్రయోజనాల రక్షణకోసం ఇస్లాం ద్వేషాన్ని వాడుకుంటున్నాయని నా నమ్మకం.

రెజాజ్‌ : ఇదే కేసులో ఇంకా నిర్బంధంలో వున్న మిగిలినవాళ్ళుకూడా విడుదలైతేనే నిజంగా సంతోషం కలుగుతుందని మీరు జైలు నుంచి విడుదలయ్యాక మీడియాతో అన్నారు.  ఊపా చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామని చెప్పుకునేవాళ్ళు మిగిలిన ఖైదీలను సీరియస్‌గా పట్టించుకోలేదని మీరు అనుకుంటున్నారా? 

కప్పన్‌ : అవును. అలాంటి పరిస్థితే వున్నది. కొన్ని సమస్యలలో ప్రజలు రక్షణవలయంలో లోపలే వుండి పనిచేస్తారు. ఎన్‌ఆర్‌సి., సిఏఏ వ్యతిరేక ఉద్యమ కార్యకర్త ఫతీమా గుల్‌ఫిషా, బెంగుళూరు బాంబు పేలుళ్ల కేసులో విచారణలో వున్న ఖైదీగా నిర్బంధంలో వున్న జకరియాల తరఫున ఎవరూ మాట్లాడడం లేదు. ఊపాకు వ్యతిరేకంగా జరిగే నిరసనలలో ఎంపిక చేసుకుని ప్రవర్తిస్తున్నారు. ఖైదీల తరఫున అప్పటికే వేరెవరైనా మాట్లాడి వుంటే అలాంటి వాళ్ళ గురించి తిరిగి మాట్లాడడం సులువు. అదే రక్షణ వలయంలో వుంటూ పనిచేసే పద్ధతి.  సమాజంలో అందరికీ తెలిసిన, గణుతికెక్కిన వాళ్లగురించి మాట్లాడడానికే రాజకీయ పార్టీలు సిద్ధంగా వుంటాయి.

            ఊపా చట్టబద్ధంగాని చట్టం అని నేననుకుంటాను. ముద్దాయిల్ని కాలపరిమితి లేకుండా అక్రమంగా జైలులో నిర్భంధించడానికే ఆ చట్టం వుంది. వలసవాద ప్రభుత్వం ప్రయోగించిన రాజద్రోహ చట్టానికి ఊపా కొత్త అవతారం. బ్రిటన్‌లో దాన్ని రద్దు చేస్తే దాని వలస అయిన భారత్‌లో దీన్ని ప్రవేశపెట్టారు. ఊపా కింద ఎవరినైనా జైలులో వుంచాలంటే నేరానికి సాక్ష్యం అవసరం లేదు. నా కేసు విషయంలోనే చూడవచ్చును. మీరు నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఎర్నాకుళం నుండి వెంగారా వచ్చారు. కాని మీరు ఇక్కడ ఒక దౌర్జన్యకర ఆందోళనను రెచ్చగొట్టటానికి వచ్చారని ఒక పోలీస్‌ అధికారి భావిస్తే మీ మీద ఊపాలోని 16, 17, 18 సెక్షన్ల కింద నేరం మోపవచ్చు. ఊపాకు వ్యతిరేకంగా శక్తివంతమైన ప్రకటనలు ఇస్తున్నవాళ్ళని టెర్రరిస్టులుగా ముద్రవేసి జైలులో పడేస్తున్నారు. అలాంటి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడడం పౌరుల బాధ్యత. గత 10, 11సంవత్సరాలుగా నేను ఊపాకు వ్యతిరేకంగా పత్రికల్లో రాస్తున్నాను. ఇప్పుడు ఆ చట్టాన్ని నా మీదనే ప్రయోగించారు. మనం ఇలాంటి చట్టాల్ని ఖండిరచడంలో పరిమితులు పెట్టుకుంటే రేపు మన తరఫున మాట్లాడేవాళ్ళు ఎవరూ వుండరు.

రెజాజ్‌ : మీ అరెస్టు పట్ల ప్రధాన స్రవంతికి చెందిన మళయాళం మీడియా స్పందన గురించి తీసుకున్న వైఖరి గురించి మీరేమనుకుంటున్నారు?

కప్పన్‌ : హిందీ మీడియా తప్ప మిగిలిన అన్ని భాషల మీడియా వాళ్ళ వాళ్ళ పరిమితులకు లోబడే నాకు అనుకూలమైన వైఖరిని అవలంబించాయి. నా అరెస్టుకంటే ముందు టెర్రరిస్టు ఆరోపణలపైనా, విదేశాలతో సంబంధాల ఆరోపణలపైనా అరెస్టులు జరిగినప్పుడు మళయాళం మీడియా తీసుకున్న వైఖరితో పోల్చుకుంటే ఇప్పటి పరిస్థితి మెరుగ్గా వుంది. వాళ్ళు నా పక్షాన దృఢంగా నిలబడ్డారు.

రెజాజ్‌ : మీరు కేరళ వర్కింగ్‌ జర్నలిస్టుల యూనియన్‌ ఢల్లీి శాఖకు కార్యదర్శి అయినప్పటికీ, ఎక్కువ ప్రసారమాధ్యమాలు మిమ్మల్ని ‘‘జర్నలిస్టుగా చెప్పుకుంటున్న వ్యక్తి’’ అని ఎందుకు పిలిచాయి? దీనికి, కాశ్మీరీ జర్నలిస్టులను అరెస్టు చేసినప్పుడు జాతీయ, కేరళ ప్రసారమాధ్యమాలు పాటించిన మౌనానికి పోలిక ఏదైనా వుందా?

కప్పన్‌ : ముస్లిం జర్నలిస్టులను అరెస్టు చేసినప్పుడు మాత్రమే ఇలాంటిది జరుగుతోందని నా ఆలోచన. కాశ్మీర్‌ ఒక యుద్ధ రంగం. అక్కడి జర్నలిస్టులను, ఫోటో జర్నలిస్టులను టెర్రరిస్టుగా పరిగణిస్తున్నారు. అక్కడ సమాజం కొన్ని బృందాలు వాళ్ళను విశ్వసించడం లేదు. సరిగ్గా నా అనుభవం కూడా అదే. వికీపీడియా 2018లో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌ నగరంలో నిర్వహించిన వికీ మానియా కాన్ఫరెన్స్‌కు నేను ఆహ్వానితుడుగా వెళ్ళినప్పుడు అది మీడియాకు నేరంగా కనపడిరది. వాళ్ళు దాన్ని అతిశయోక్తులతో వర్ణించారు. హిందీ ప్రచార మాధ్యమాలు నన్ను ‘‘జర్నలిస్టునని చెప్పుకుంటున్న వ్యక్తి’’ అనీ, ‘‘వివాదస్పదుడైన జర్నలిస్టు’’అని పేరుపెట్టాయి. ఇదే సమయంలో మరొక కోణం చూద్దాం. ఒక వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ఆర్నాబ్‌ గోస్వామిని అదే మీడియా, జర్నలిస్టుగా చూస్తోంది. కాశ్మీర్‌, రైతు ఉద్యమాలు వంటి సమస్యలమీద రిపోర్టులు రాసిన జర్నలిస్టులను అరెస్టు చేస్తే సోదర జర్నలిస్టులు కూడా అలాంటివాళ్ళ వృత్తి గురించి ప్రశ్నలు వేస్తారు. కాని మతవాద మనస్తత్వం వున్న యూట్యూట్‌ వ్లాగర్స్‌గాని, ఇతరులపట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టేవారుగాని క్రిమినల్‌ కేసులో ముద్దాయిలుగా వున్నవారినిగాని జర్నలిస్టులుగా గుర్తించి గౌరవిస్తారు.

           ప్రఖ్యాతిచెందిన ఒక మీడియా సంస్థ తాను నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడానికి రాణా ఆయూబ్‌ను కేరళకు ఆహ్వానించినప్పుడు, మీడియాకు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి సిద్ధికి కప్పన్‌ గురించి మాట్లాడవద్దని ఆమెను అడిగాడు. కాని బిబిసి, రాయటర్స్‌, ది గార్డియన్‌, సిఎన్‌ఎన్‌, వాషింగ్టన్‌ పోస్టులతో సహా అంతర్జాతీయ మీడియా నా పక్షాన నిలబడిరది. ప్రభుత్వ పక్షాన పనిచేసే మీడియా నన్ను జర్నలిస్టుగా గుర్తించాలన్న పట్టింపు నాకు లేదు. నా జర్నలిజం అలాంటిది కాదు.

రెజాజ్‌ : హత్రాస్‌ లో బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన సుభాష్‌ చంద్రబోస్‌ వైద్యకళాశాల అసిస్టెంట్‌ ఫ్రొపెసర్‌ డాక్టర్‌ రాజకుమారిని మావోయిస్టు అని నిందించారు. మిమ్మల్నికూడా  భీమాకొరెగావ్‌ కేసుతో సంబంధం వుందని చెప్పి మావోయిస్టుగా ముద్రవేయడానికి ప్రయత్నించారు. రూపేష్‌ కుమార్‌ సింగ్‌లాంటి మానవ హక్కుల కార్యకర్తలను , జర్నలిస్టులను జైళ్ళలో పడవేయడానికి మావోయిస్టు ముద్ర వేయడాన్ని మీరెట్లా చూస్తున్నారు.

కప్పన్‌ : అన్ని కాలలలోనూ, ప్రత్యేకించి వర్తమాన ప్రపంచంలో ఇది వున్నదే. జర్నలిస్టులని టెర్రరిస్టులుగా ముద్రవేయడం జరుగుతూ వున్నదే. నన్ను మావోయిస్టుగా చిత్రించడం అందులో భాగమే. ఆదివాసీలు, దళితులు, ముస్లింల తరఫున మాట్లాడేవాళ్ళని, అణచివేత దారులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నవాళ్ళని మావోయిస్టులుగా చిత్రించే ప్రయత్నాలు ఎప్పుడూ వున్నవే. ఫాదర్‌ స్టాన్‌స్వామి కేసు తీసుకోండి.  ఆయనపై మావోయిస్టు ముద్రవేసి, అదే సమయంలో క్రైస్తవ మత గురువుగా కూడా గుర్తించారు. నాపై ఐయస్‌ఐ సానుభూతిపరుడు, పిఎఫ్‌ఐ సభ్యుడు, ముస్లిం ఉగ్రవాది, మావోయిస్టు సానుభూతిపరుడు అనే ముద్రలు వేసి హైబ్రీడ్‌ టెర్రరిస్టుగా చిత్రించారు. మావోయిస్టులకు మిగిలినవాళ్ళకు మధ్యన వుండే మత సంబంధమైన వైరుధ్యాలను కూడా వాళ్లు పట్టించుకోలేదు. అంటే బలహీనపక్షాల వైపు  నిలబడేవాళ్ళపై రాజ్యం ఉగ్రవాదులు, కమ్యూనిస్టులు, మతఛాందసవాదులు అనే ముద్ర వేస్తుందన్నమాట. తద్వారా కొంతమేరకు వాళ్ళు మౌనంగా వుండేలా చేస్తుంది. నాకు వ్యతిరేకంగా ఏదైనా ఆరోపణ వుంటే నిన్ను నిరంతరాయంగా నిర్బంధించవచ్చు. నాపైన ఏ కేసు అయినా పెట్టవచ్చు. కేరళకు చెందిన లాయర్లు తుషార్‌ నిర్మల్‌లు , జైసన్‌ కూపర్ల కేసు తీసుకోండి. ఒక మావోయిస్టు కేసులో వాళ్ళపై ఊపా చట్టాన్ని ప్రయోగించారు. కాని ఇప్పటికే చార్జీషీటు దాఖలు చేయలేదు. మీ మీద ఏదైనా ముద్రవేస్తే మీరు ప్రజల మద్ధతు కోల్పోతారు. కాని నా కేసులో అది విఫలమైందని నా నమ్మకం. రాజ్యం ప్రజల తరఫున మాట్లాడే వాళ్లపై ఇలాంటి ముద్రలు వేస్తుందని ప్రజలు గుర్తించారు.

రెజాజ్‌ : మీరు జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో ఎందుకు చదివారని ప్రజలు అడుగుతారు? ఎన్‌ఆర్‌సి, సిఏఏ వ్వతిరేక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న డెమొక్రాటిక్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ గురించి కూడా ప్రశ్నిస్తారు. 2020 ఢల్లీి హింసా కాండ వెనుక వున్న వాళ్ళు ఎవరో తెలుసా అని కూడా అడుగుతారు? ఈశాన్య ఢల్లీిలో జరిగిన హింసాత్మక ఘటనల కేసులో మిమ్మల్ని ముద్దాయిగా చేర్చే ప్రయత్నం చేస్తున్నారని మీరనుకుంటున్నారా?

కప్పన్‌ : భీమాకొరెగావ్‌ కేసులోను, ఈశాన్య ఢల్లీి హింసాత్మక కేసులోను నన్ను ఇరికించే ప్రయత్నం జరిగింది. నన్ను ప్రశ్నించే సమయంలో ఒక అధికారి నాకు భీమాకొరెగావ్‌ కేసుతో సంబంధం వుందని అన్నాడు. అయితే ఆ కేసులో ఒక ముద్దాయి అయిన డాక్టర్‌ హనీబాబు సహచరి డాక్టర్‌ జెన్నీని నేను ఇంటర్వ్యూ మాత్రమే జరిగిందని చెప్పాను. అప్పుడు అతను 2020 ఢల్లీి హింసాకాండ వెనుక ఎవరున్నారని అడిగాడు. ముస్లింలకు వ్యతిరేకంగా ఆ హింసాకాండ జరిగిన వెంటనే సంఘపరివార్‌ అనుకూల జర్నలిస్టులు నాకు టిఎఫ్‌ఐ నుండి డబ్బు వచ్చిందని, దాన్ని నేను ఆందోళనకారులకు పంచానని అప్పట్లో తప్పుడు వార్తల్ని ప్రచారం చేశారు. అప్పటికి నేను కేరళ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఢల్లీి శాఖకు కార్యదర్శిగా వున్నాను. కొందరు జర్నలిస్టులు తమ వృత్తిపరమైన అహంకారంతో ఇలా ప్రచారం చేసారని నేననుకుంటున్నాను. నిషా భంభాని అనే ఒక ప్రసిద్ధ న్యాయవ్యాది ద్వారా ఆ సంఫ్‌ుపరివార్‌ వెబ్‌సైట్‌కు నోటీస్‌ ఇచ్చారు. ఆ వెబ్‌సైట్‌లో నాకు వ్యతిరేకంగా ఏమి వుందో దాన్నే పోలీసులు చార్జిషీట్‌లో యథాతథంగా వాడుకున్నారు.

            ఢల్లీి హింసాత్మక సంఘటన చిత్రీకరణ సందర్భంగా మీడియా వన్‌, ఏషియా నెట్‌ న్యూస్‌ ఛానళ్ళను 48గంటలపాటు నిషేధించినప్పుడు దానికి వ్యతిరేకంగా జరిగిన నిరసన సభలో నేను కేరళ యూనియన్‌ ఆఫ్‌ వర్కిగింగ్‌ జర్నలిస్టుల ఢల్లీి యూనిట్‌ కార్యదర్శిగా పాల్గొని మీడియాకు సంఫీుభావాన్ని ప్రకటించాను. ఆ సమయంలో ఢల్లీి పోలీసులు నా పేరు, తదితర వివరాలు సేకరించారు. బహుశా అప్పటి నుండి నా మీద నిఘా పెట్టారని అనుకుంటున్నాను.

రిజాజ్‌ : ఎన్‌ఆర్‌సి , సిఏఏ వ్యతిరేక ఉద్యమ కాలంలో కేరళలోని ఒక ముస్లిం మత గురువు నిరసనలలో పాల్గొనవద్దని, పిడికిళ్ళు బిగించవద్దని ముస్లిం మహిళలను ఆదేశించారట. అయినా మహిళలు ఫాసిజానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చారు. మీ అరెస్టుకు నిరసనగా జరిగిన అనేక సభల్లో మీ సహచరి పాల్గొని ఇతర రాజకీయ ఖైదీల గురించి కూడా మాట్లాడారు. సాంఘిక దురభిప్రాయాలను ధైర్యంగా ఎదుర్కొని ఆమె ఫాసిజానికి వ్యతిరేకంగా ముందు వరసలో నిలబడ్డప్పుడు మీకేమనిపించింది.

కప్పన్‌ : అది  నాలో గొప్ప ఆశను రేకెత్తించింది. సాధారణంగా ఒక వ్యక్తి అరెస్టు అయితే అతని కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. కాని నా విషయంలో ఇందుకు భిన్నంగా జరిగింది. నా సహచరి ఉద్యమంలో ముందుభాగాన నిలబడిన కారణాన కార్యకర్తలు , జర్నలిస్టులు నా వెనుక నిలబడ్డారని నా నమ్మకం. ఇది గొప్ప మార్పు. నా భార్యే కాదు, నా పిల్లలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. టెర్రరిస్టులుగా నిందితులయిన వ్యక్తుల కుటుంబాలను ప్రజలు భయపెడతారు. అయితే  కేరళ ప్రజలు, ప్రత్యేకించి ముస్లిం మహిళలు ‘‘ఉగ్రవాదం గురించి రాజ్యం చెప్పే కథనాల’’ వాస్తవాన్ని అర్థం చేసుకున్నారు. రాజ్య అణచివేత సాధారణ ప్రజల్లో చైతన్యానికి కారణమైంది.  ఆ రకంగా చూసినప్పుడు అది గొప్ప ఆశావాహమైన పరిస్థితి.

రిజాజ్‌ : ఏ వ్యక్తినైనా, ప్రత్యేకించి ముస్లింను ఊపా కింద అరెస్టు చేస్తే వాళ్ళకు సహాయంచేసే న్యాయవాదుల్ని కూడా ఉగ్రవాదుల స్నేహితులుగా భావించే స్థితి వున్నది. కేరళకు చెందిన ఒక ముస్లిం ఉత్తరప్రదేశ్‌లో ఊపా కింద నిర్భంధించబడి అతనికి బెయిల్‌ బాండు ఇవ్వాల్సి వస్తే తదనంతర పరిణామాల గురించి అక్కడి ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. లక్నో విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ ఛాన్సలర్‌ రూప్‌రేఖవర్మ మీరు బెయిల్‌పై విడుదల కావడానికి సహకరించారు. దీన్ని ఫాసిజానికి వ్యతిరేక ఐక్యతగా మీరు ఎలా చూస్తారు.

కప్పన్‌ : ఓటర్లలో 40శాతం ఓటు బ్యాంకు సహాయంతోనే ఫాసిస్టులు దేశాన్ని పరిపాలిస్తున్నారు. మిగిలిన 60 శాతం మంది ప్రజాస్వామిక వాదులు , లౌకికవాదులు, మత విద్వేష వ్యతిరేకులు. రూప్‌రేఖవర్మ, ఉత్తరప్రదేశ్‌లో ప్రముఖ జర్నలిస్ట్‌ కుమార్‌లు నా పక్షాన నిలబడ్డారు. ఈ ప్రజాస్వామిక లౌకికవాద గొలుసులో వాళ్ళు ఒక లింక్‌ లాంటి వారు. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహకవర్గం, శాసనసభలు ఎంతగా మతోన్మాదంతో నిండిపోయినా, ఇలాంటి ప్రజలు ఫాసిజానికి ప్రమాదకారులు. హిట్లర్‌ పాలనా సమయంలో ఆయనకంటే అన్నేఫ్రాంక్‌కు ఎక్కువ ప్రజాదరణ వుండేది. ఆమె రచించిన ‘ద డైరీ ఆఫ్‌ ఏ యంగ్‌ గర్ల్‌’ అనే పుస్తకం హిట్లర్‌ రాసిన ‘మెయిన్‌ కాంఫ్‌’ కంటే విశేష ప్రాచుర్యాన్ని పొందింది. ఎంతటి అధికారం, బలం, వున్నా ఫాసిస్టు నియంతృత్వాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోవు. కాని అన్నేఫ్రాంక్‌ , రూప్‌రేఖవర్మ, కుమార్‌లాంటి వాళ్ళు సదా గుర్తుండిపోతారు.

రిజాజ్‌ : భారత సైన్యంలో వివిధ రెజిమెంట్లు యుద్ధంలో ఇచ్చే నినాదాలు లౌకికమైనవి కావు. రాష్ట్రాలలో పోలీసు యంత్రాంగం కూడా రాజకీయమయమైపోయింది. తాము అధికారంలో వున్న ప్రతిచోటా భాజపా, పోలీసుల మధ్య ఒక కూటమి ఏర్పడిరది.  మిమ్మల్ని భాజపా జెండా తగిలించిన కారులో పోలీసులు తీసుకువెళ్ళడం దీనికి సూచికయేనా?

కప్పన్‌ : ఇది ఉత్తరప్రదేశ్‌లో పెద్ద సమస్య కాదు. దీని గురించి నేను చెప్పిన విషయాలుగాని, ఈ సంఘటననుగానీ ఎవరూ పట్టించుకోలేదు. యూ.పి. భారతదేశంలో భాగం కాదా? అక్కడ భారత రాజ్యాంగం అమలు కాదా అని మమ్మల్ని మేం ప్రశ్నించుకోక తప్పలేదు. ఇది ఏ దేశమో, ఏ రాష్ట్రమో మేం గుర్తించలేకపోయాం. సివిల్‌ దుస్తుల్లో వున్న పోలీసు అధికారులు భాజపా జెండా తగిలించిన ఒక ప్రైవేటు వాహనంలో మమ్మల్ని మధుర సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరు పరచడం ఎవ్వరికీ ఆశ్చర్యం కలగించలేదు. దీని గురించి పరిశోధించాలని కూడా ఎవరూ అనుకోలేదు. ఫాసిస్టు పాలనలో రాజ్యం ఇలా మారిపోవడం ఆందోళనకరం.

రిజాజ్‌ : ‘‘మీరు భీఫ్‌ తింటారా’’? ఇంటరాగేషన్‌లో మిమ్మల్ని అడిగిన ఒక ప్రశ్న ఇది. ప్రశ్నలు అడగడం, కొట్టటం. మణిపూర్‌కు చెందిన జర్నలిస్టు కిశోర్‌ చంద్ర వాంగ్‌ ఖెమ్‌ను ఎన్‌యస్‌ఏ కింద అరెస్టు చేశారు. కారణం ఆవుపేడ, ఆవు మూత్రం కోవిద్‌ -19ని తగ్గించవని ఆయన ఫేస్‌బుక్‌లో రాయడం. భారతదేశంలో జర్నలిస్టుల కంటే ఆవు మూత్రానికి, పేడకు, బీఫ్‌కు ఎక్కువ రక్షణ వుందని మీరు భావిస్తున్నారా?

కప్పన్‌ : 2014లో ఆర్‌ఎస్‌ఎస్‌ సలహా మీద నడిచే ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత జర్నలిస్టులతోపాటు సామాన్య ప్రజలకంటే ఆవుకు ఎక్కువ ప్రాధాన్యత లభించింది. చాలా పాతకాలం నుండి సంఫ్‌ుపరివార్‌, అగ్రకులాలకు అది ‘పవిత్రమైన ఆవు’. కాంగ్రెస్‌ కూడా అలాంటిదే. అందుచేత ‘పవిత్రమైన ఆవు’ గురించిన విషయంలో సంఫ్‌ుపరివార్‌ ఒక్కదాన్నే నిందించాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కాంగ్రెస్‌ మహాసభల్లో అగ్రకులాల కాంగ్రెస్‌ సభ్యులకు వేరే భోజనశాలలు వుండేవని మనకు తెలుసు. అల్ప సంఖ్యాకులుగా వున్న అగ్రకులాలవారికి నిచ్చెనమెట్ల కులవ్యవస్థను కాపాడడం అవసరం. దీనిపైన గుత్తాధికారాన్ని చాలా సౌకర్యవంతంగా భాజపా స్వీకరించింది. ఆవు పవిత్రమైనది అనే ప్రేమకంటే అధికార రాజకీయాలకు దాన్ని వాళ్ళు ఒక సాధనంగా వాడుకుంటున్నారు.

రిజాజ్‌ : భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వున్నది. అయితే రాజ్యానికి వ్యతిరేకంగా ఈ స్వేచ్ఛను ఉపయోగించుకున్న వ్యక్తికి ఇంక ఏ స్వేచ్చా మిగలదు. సిద్దికీ కప్పన్‌  అరెస్టుకు ముందు ఇలా వుంటుందని మీరెప్పుడైనా అనుకున్నారా?

రైహానా : లేదు. దీని గురించి వార్తలలో వినివున్నానుగాని, దాని తీవ్రత కప్పన్‌ అరెస్టు తరవాత మాత్రమే తెలిసింది.

రిజాజ్‌ : ‘‘నువ్వు రాజకీయాల్లో జోక్యం చేసుకోకపోతే , అంతిమంగా రాజకీయాలు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాయి’’ అని లెనిన్‌ అన్నాడు. మీ పిల్లలు 19ఏళ్ళ మహమ్మద్‌ ముజమ్మిల్‌, 15ఏళ్ళ జిహాన్‌, ప్రత్యేకించి 10సంవత్సరాల మెహనాజ్‌` కూడా దేశంలో స్వేచ్ఛ ఆవశ్యకత గురించి మాట్లాడడం ప్రారంభించారు. దాన్ని మీరెలా అర్థం చేసుకుంటున్నారు.

రైహానా : మా పిల్లలకు బాల్యానికి సంబంధించిన అమాయకత్వం వున్నది గానీ, వాళ్ళకు రాజకీయాలు నేర్పాం. కప్పన్‌ అరెస్టు నన్ను, నా పిల్లల్ని రాజకీయీకరణ చేసింది.  అంతకుముందు పిల్లలకు ఊపా అంటే తెలియదు. వాళ్ళ నాన్నను అరెస్టు చేసిన తరవాతే దాని పరిణామాలు అర్థమయ్యాయి. సత్యానికి విలువ లేకుండా ఎందుకు పోయిందని వాళ్ళు అడుగుతున్నారు. నా కూతురు ఇలా అడిగింది. ‘‘న్యాయస్థానానికి సత్యం తెలియదా?’’. ఆమె టీచర్‌ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక ప్రసంగం చేయమని నా కూతురుని అడిగింది. అప్పుడు నేనన్నాను ‘‘సిద్ధికీ కప్పన్‌ కూతురు ‘స్వాతంత్య్రదినం’ గురించి ఏం మాట్లాడాలని’’? అని. మా సంభాషణలో స్వాతంత్య్రం అనే పదం వచ్చినప్పుడు అప్పటికి తొమ్మిదేళ్ళ బాలికైన మెహనాజ్‌ హేళనగా నవ్వింది. తన తండ్రి గురించి ప్రస్తావించకుండా తాను మాట్లాడనంది. తానుకూడా జైలుకు వెళ్ళడానికి, నాతోపాటు కలిసి చనిపోవడానికి సిద్ధంగా వున్నానని కూడా నా కూతురు చెప్పింది. మాకు అన్యాయం జరిగినప్పుడు పరిస్థితి మారుతుందని, మేం మాట్లాడేటట్లు చర్యలలో పాల్గొనేనటట్లు చేస్తుందని మేం గుర్తించాం.

రిజాజ్‌ : సంఘపరివార్‌ అధికారంలో వున్న రాష్ట్రాలలో, ప్రత్యేకించి గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లలో జరిగిన మానవహక్కుల ఉల్లంఘనలను కేరళ ప్రభుత్వం నిత్యం విమర్శిస్తూ వుంటుంది. అయినప్పటికీ సిద్దికీ కప్పన్‌కు సంబంధించిన విషయంలో కేరళ ప్రభుత్వం ఆలస్యంగా ప్రతిస్పందించడానికి కారణం ఏమై వుంటుందని మీరు అనుకుంటున్నారు? మీరు ఫేస్‌బుక్‌లో పినియారి విజయన్‌ పై కామెంట్‌ పెట్టడానికి దారితీసిన పరిస్థితి ఏమిటి?

రైహానా : నేను అనేక పర్యాయాలు ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశాను. అయితే నాకు డి.జి.పి నుండి, ముఖ్యమంత్రి ప్రైవేటు కార్యదర్శి నుండి మాత్రమే సమాధానాలు వచ్చాయి. ముఖ్యమంత్రికి కొన్ని పరిమితులు వుంటాయని అధికారులు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ‘‘ఒక జర్నలిస్టుకే న్యాయం జరగనప్పుడు సాధారణ వ్యక్తికి న్యాయం ఎలా జరుగుతుంది? అని ఆలోచించేదాన్ని. ముఖ్యమంత్రి అధికారులకు లేఖ పంపించి వుండాల్సింది. ఆయన అలాంటిదేమీ చేయలేదు. ఉత్తరప్రదేశ్‌లో సంఫ్‌ుపరివార్‌ శక్తులు రైల్లో ప్రయాణిస్తున్న క్రైస్తవ సన్యాసినులపై చేసిన దాడిని ముఖ్యమంత్రి ఖండిరచినట్టు, ఈ విషయంలో న్యాయం చేయమని కోరుతూ అమిత్‌షాకు ఉత్తరం రాసినట్టు ఫేస్‌బుక్‌ ద్వారా నాకు తెలిసింది. ఆయన తక్షణ స్పందనను చూసి నాకు విచారం కలిగింది. బాధితుల పక్షాన ఆయన మాట్లాడినందుకు కాదు విచారం, సిద్దికీ కప్పన్‌ పట్ల మాత్రమే ఆయన మౌనం వహించినందుకు. కప్పన్‌ నేరం చేసి వుంటాడని ఆయన అనుకుంటున్నారా అనే ఆలోచన  నాకు కలిగింది. అందుకే ఆ సమయంలో అలాంటి వ్యాఖ్య చేశాను.

రిజాజ్‌ : కప్పన్‌కు అనుకూలంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఎంపి, ఎమ్‌ఎల్‌ఏలను కూడా ఆహ్వానించారు. దాన్ని భగ్నం  చేస్తామని ఆర్‌ఎస్‌ఎస్‌ హెచ్చరించింది. కార్యక్రమాన్ని రద్దుచేసుకోమని కేరళ పోలీసులు నిర్వాహకులను కోరారు. భాజపా కూడా ఆ కార్యక్రమం గురించి ఎన్‌ఐఏకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి ప్రజాస్వామిక కార్యక్రమాలకు కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ నుండి ప్రమాదం వుందని మీరు అనుకుంటున్నారా?

రైహానా : అవును, ప్రమాదం వున్నది. కప్పన్‌ జైలు జీవితం గడిపి సంవత్సరకాలం అయిన సందర్భంగా ఒక మీటింగ్‌ జరిగింది. అక్కడ ఎలాంటి సమస్యలూ రాలేదు. కప్పన్‌కు ఊపా కేసులో బెయిల్‌ వచ్చిన సందర్భంగాపెట్టదలచుకున్న సమావేశాన్ని సంఫ్‌ుపరివార్‌ భగ్నం చేసింది. నిజానికి అది నిరసన సభ కాదు. అయినా పోలీసులు దాన్ని రద్దు చేసుకోమని అడిగారు.

రిజాజ్‌ : మలప్పురం జిల్లాను అపఖ్యాతి పాలు చేయడానికి అక్కడ హిందువులు ముస్లింలతో కలిసి  సహజీవనం చేయలేరనే అబద్ధాన్ని ప్రచారం చేయడం సంఫ్‌ుపరివార్‌కి ఇష్టం. కప్పన్‌ కేసుపట్ల హిందూ సమూహం ఎలా స్పందించింది?

రైహానా : మలప్పురం జిల్లాలో అలాంటి మతసంబంధమైన సమస్యలేవీ లేవు. ప్రజలు తమ దు:ఖాన్ని బంధువుల కంటే ఎక్కువగా స్నేహితులతో బహిరంగంగా పంచుకుంటారు. నా స్నేహితుల్లో ఎక్కువ మంది హిందువులు. కప్పన్‌ కోసం పోరాడడానికి అవసరమైన బలాన్ని వాళ్ళే నాకిచ్చారు. వాళ్ళు కప్పన్‌ను ‘బావ’ అని పిలిచేవాళ్ళు. కప్పన్‌ విడుదలను కోరుతూ వాళ్ళు మత సంబంధమైన ప్రార్థనలు కూడా చేశారు. బహుశా దీనిమూలంగానేమో ఉత్తరప్రదేశ్‌లోని మధురకు చెందిన ఒక హిందూ సన్యాసి జైల్లో కప్పన్‌ను కలిసి పుస్తకాలు, ఆహారపదార్ధాలు ఇచ్చేవారు. కప్పన్‌ పెరోల్‌మీద కేరళ వచ్చినప్పుడు ఆయనతోపాటు వచ్చిన ఎస్కార్ట్‌ పోలీసు  అధికారులు కూడా తమ సెలవుల్లో కేరళ రావడం ఇష్టం అనేవారు. సంఫ్‌ుపరివార్‌ ప్రజల్ని మోసం చేస్తుంది. మలప్పురం జిల్లాలో హిందువుల, ముస్లింల మతసామరస్యమే వాళ్ళ అబద్ధపు ప్రచారాన్ని ఎండగడుతుంది.

రిజాజ్‌ : ఊపా కింద ప్రొఫెసర్‌ షోమాసేన్‌, జ్యోతి జగ్‌తప్‌, ఫతిమా గుల్‌ఫిషా వంటి మహిళా రాజకీయ ఖైదీలు కూడా వున్నారు. పురుష రాజకీయ ఖైదీలతో పోలిస్తే వీళ్ళకు అనుకూలంగా కొన్ని గొంతులు మాత్రమే వినపడుతున్నాయి. దీనికి కారణమేమిటని అనుకుంటున్నారు?

రైహానా : జైళ్ళలో పురుష ఖైదీలతో పోల్చుకుంటే మహిళా ఖైదీలు ఎక్కువ హింస అనుభవిస్తారు. జైళ్ళలో మనకు తెలియని అనేకమంది మహిళా రాజకీయ ఖైదీలున్నారని నాకు ఈ మధ్యనే తెలిసింది. వాళ్ళ గురించి ఎవరూ ఎక్కువగా ఎందుకు మాట్లాడడం లేదో నాకు తెలియదు.

            రెండున్నర సంవత్సరాలపాటు జైలు నిర్బంధంలో వున్న ఒక అమాయక వ్యక్తి సహచరిని నేను. ఆ సమయంలో నేను అనుభవించిన భాధ నాకు మాత్రమే తెలుసు. విచారణలో వున్న ఖైదీలుగా ఇంతకంటే ఎక్కువ కాలం మించి జైళ్ళల్లో అనేకమంది వున్నారు. వాళ్ళ భార్యలు, భర్తలు, పిల్లలు , తల్లిదండ్రులు అనుభవించే బాధ చెప్పనలవి కాదు. మన పక్షాన వాస్తవం వుంటే , ప్రభుత్వం వాళ్ళను జైళ్ళలో వుంచడానికి అబద్ధాలు ఆడుతోందని మనకు ఖచ్చితంగా తెలిస్తే మహిళలతో సహా అందరం పోరాటానికి సిద్ధం కావాలి.

రిజాజ్‌ : ‘‘జీవించే హక్కు’’ ఖరీదైనదా? బెయిల్‌ పొందడం అంటే జీవితానికి రక్షణ వున్నట్టే. సుప్రీంకోర్టులో ఖర్చులు భరించడం పేద ప్రజలకు సాధ్యమేనా?

కప్పన్‌ : కపిల్‌ సిబాల్‌, ఐ.బి.సింగ్‌ వంటి న్యాయవాదులు నా తరఫున ఎలాంటి ఫీజు తీసుకోకుండా సుప్రీంకోర్టులో వాదించారు కాబట్టే నాకు బెయిల్‌ లభించింది. లేని పక్షంలో నా ఆస్తి అంతా అమ్మినా బెయిల్‌ వచ్చి వుండేది కాదు. వాళ్ళు ఉచితంగా వాదించినా న్యాయపోరాటంలో ఇంకా కొన్ని ఖరీదైన ఖర్చులు వుంటూనే వుండేవి. వీటిని భరించడం సామాన్య మానవుడికి సాధ్యం కాదు. నేను ప్రతిరోజూ వెంగార పోలీస్‌ స్టేషన్‌లో సంతకం పెట్టాలి. దాని కారణంగా నేను నా ఉద్యోగం చేసుకోవడానికి పరిమితులు ఏర్పడ్డాయి. బెయిల్‌ వచ్చాక కూడా నేను బాధలు అనుభవిస్తూనే వున్నాను. వాళ్ళు పెట్టే నిబంధనలే ఒక శిక్ష లాంటివి. బెయిల్‌ కండిషన్‌ ప్రకారం ఒకటిన్నర నెలలు ఢల్లీిలో వుండాల్సి వచ్చింది. అక్కడ నివాసం చాలా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి  న్యాయసంబంధమైన చిక్కుల్లో వుండడమంటే ఆర్థికభారమే. నాకు బెయిల్‌ వచ్చాక కూడా నా భార్య బ్యాంకు ఎకౌంట్‌లో డబ్బులు వేయడానికి ప్రజలు భయపడేవారు. నాకు పని లేకపోవడంతో నేను బికారిగా మారాను. ప్రభుత్వ న్యాయస్థానాల్లో వుండే న్యాయ అధికారులకు ప్రజలు కట్టిన రెవిన్యూ నుండి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుంది. కాని సాధారణ ప్రజలు మాత్రం వాళ్ళు కష్టపడి సంపాదించి కూడబెట్టిన డబ్బు న్యాయస్థానాల్లో ఖర్చు చేయాల్సి వుంటుంది.

రిజాజ్‌ : ప్రభుత్వాన్ని విమర్శించినందుకు జర్నలిస్టులను ఊపా లాంటి చట్టాలకిందా, రాజద్రోహ నేరాల కింద అరెస్టు చేస్తున్నారు. ఆ కారణంగా నిజానికి జర్నలిస్టులే ఈ ప్రభుత్వానికి నిజమైన ప్రతిపక్షం అనుకుంటున్నాం. జర్నలిజం కూడా ఒక రాజకీయ కార్యకలాపమే అని మీరు నమ్ముతున్నారా? ప్రధాన స్రవంతి మీడియా ప్రభుత్వానికి లొంగిపోయి దాని తరఫున ప్రచారం చేస్తోంది?

కప్పన్‌ : జర్నలిజం అంటే పౌరసంబంధాల నిర్వహణ కాదు. అది కూడా ఒక రాజకీయ , సాంఘిక కార్యకలాపమే. ప్రజాస్వామ్యానికి ప్రధాన పునాది మీడియా అని నా నమ్మకం. చాలామంది అనుకుంటున్నట్టుగా అది నాలుగో స్తంభం కాదు, మొట్టమొదటి స్తంభం. ప్రపంచమంతటా నియంతృత్వ, ఫాసిస్టు ప్రభుత్వాలు ప్రజాస్వామ్యం ద్వారానే అధికారంలోకి వచ్చాయి. ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఫాసిజం ఎలా అధికారంలోకి  వచ్చిందో మనం చూశాం. అలాంటి పరిస్థితిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీడియా మొదటి స్తంభంగా వుండాలి. కాని ఇప్పుడు జర్నలిస్టులు పౌరసంబంధాల కార్యకర్తలుగా మారిపోయారు.  వాళ్ళను కూడా డబ్బుతో కొనవచ్చు. ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడం ద్వారా గూగుల్‌లో వ్యాపార ప్రకటనలు రాబట్టట ద్వారా కూడా వాళ్ళు యూట్యూబ్‌ల ద్వారా డబ్బులు సంపాదించడానికి అలవాటుపడ్డారు. నిజానికి జర్నలిజం సామాన్య ప్రజల గొంతుక. అది ఎల్లప్పుడూ ప్రతిపక్షంగానే వుండాలి.

రిజాజ్‌ : తప్పుడు సాక్ష్యాలను సృష్టించి అమాయకులను జైళ్ళలో పెడుతున్నారు. ఇలాంటి నేరపరిశోధనా సంస్థలమీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

కప్పన్‌ : నా కేసే ఉదాహరణగా తీసుకోండి. నేను ప్రయాణిస్తున్న కారులో ఒక ఇంగ్లీషు నోటీసును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు అంటున్నారు. అది బ్లాక్‌ లైవ్స్‌ మేటర్‌ కిట్‌ అని  పోలీసులు సుప్రీంకోర్టుకు చెప్పినప్పుడు మాత్రమే నాకు తెలిసింది. నేను హత్రాస్‌లో స్థానికులకు కరపత్రాలు, డబ్బు పంచానని, ఉపన్యాసాలు ఇచ్చానని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. దీనికి బలం చేకూర్చడానికి ఇద్దరు దొంగ సాక్షుల్ని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఇలాంటివాళ్ళ పట్ల కూడా గట్టి చర్యలు తీసుకోవాలి. అయితే ఎవరు తీసుకోవాలి. న్యాయస్థానాలు పనికిమాలినవి. నాకు వ్యతిరేకంగా పెట్టిన చార్జిషీట్‌ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి కేరళ ప్రభుత్వానికి కూడా వ్యతిరేకమైన చార్జిషీట్‌. ప్రొఫెసర్‌ గిలానీని ప్రభుత్వం ఉరితీసి చంపిందని అందులో పేర్కొన్నారు.  నిజానికి ఒక జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో ఆయన చనిపోయారని మనకు తెలుసు. ఆ చార్జిషీట్‌ తయారుచేసిన వ్యక్తిని జైల్లో వేయడానికి ఇది చాలదా? ఏం విచారణ ఇది. అలాంటి చార్జిషీట్‌ను ఉపయోగించి నన్ను అరెస్టు చేసిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. నా ఫోన్‌లో జార్జియా దేశానికి సంబంధించిన వీసా ఉందని, నేను జార్జియా గుండా సిరియా వెళ్ళి అక్కడ ఐఎస్‌ఐఎస్‌ సంస్థలో చేరాలని పథకం వేస్తున్నారని వాళ్ళన్నారు. వాళ్ళు ఇలాంటి కట్టుకథలు ఎన్నో అల్లుతున్నారు న్యాయస్థానాలు ప్రమత్తంగా వుండాలి. లేనిపక్షంలో ప్రజాస్వామ్యాన్ని సమాధి చేయటంలో  న్యాయస్ధానం కూడా ఒకటౌతుంది.

రిజాజ్‌ : రైహానా ముస్లంలీగ్‌లో చేరబోతోందని సంఫ్‌ుపరివార్‌ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసింది. సిపియం, కాంగ్రెసు, మావోయిస్టు సంస్థలపై ప్రచారం చేసినట్టుగానే ముస్లింలీగ్‌కు కూడా ఈ కేసుతో సంబంధం వుందని చెప్పడానికి వాళ్లు ప్రయత్నించారు. ప్రతిపక్షాల్ని ఒంటరులను చేసి దెబ్బతీయడానికి భాజపా ప్రయత్నిస్తోంది. ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఐక్యమయ్యే అవకాశం వుందని మీరు అనుకుంటున్నారా?

కప్పన్‌ : సంఫ్‌ుపరివార్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ మనస్తత్వాలు అలాంటివేనన్న అభిప్రాయం అందరిలో వున్నది. నేను కూడా దాన్ని నమ్ముతున్నాను. తమ స్వార్థ ప్రయోజనాలకోసం కులతత్వాన్ని, మతతత్వాన్ని రెచ్చగొట్టడానికి అనేక రాజకీయపార్టీలు వాటి శక్తికొద్దీ ప్రయత్నం చేసాయి. కొన్ని రాజకీయ పార్టీలైతే పూర్తిగా విఫలమైన పార్టీలని నేననుకుంటున్నాను. అవి రాజ్యదాడిని ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పనిచేయకపోవడమే దానికి కారణం. సిబిఐ తనను ప్రశ్నించిన తరవాతనే కేజ్రీవాల్‌ భాజపా వ్యతిరేక ఐక్యత గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. కాంగ్రెస్‌ కూడా ఫాసిజంమీద పెద్దగా దాడిచేయదని నేననుకుంటున్నాను. అయితే ఇప్పటికీ కనీసం ఫాసిజానికి వ్యతిరేకంగా అంశాలవారిగానైనా ప్రతిపక్షాలమధ్య ఐక్యత వుండాలని నేను కోరుకుంటున్నాను.

రిజాజ్‌ : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏటిఎస్‌ అధికారులు, మీ మీద పెట్టిన కేసు కట్టుకథ అని తెలిసిన తరవాత, ఎందుకు మిమ్మల్ని అరెస్టు చేసారని ఇతర అధికారులు ప్రశ్నించినట్టు మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కిందిస్థాయి పోలీసులు  అధికారులమీద పై స్థాయి అధికారులు ఒత్తిడి తెస్తున్నారని మీరనుకుంటున్నారా?

కప్పన్‌ : నా అరెస్టు అలాంటి వత్తిడిమూలంగానే జరిగిందని నేను గట్టిగా చెప్పగలను. ప్రారంభంలో నన్ను అరెస్టు చేసిన స్థానిక పోలీసులు ఆ విషయం చెప్పారు. మమ్మల్ని వెంటనే విడుదల చేస్తామని చెప్పి కూడా 24 గంటలపాటు నిర్బంధంలో వుంచారు. నాపైన 151, 166, 107 సిఆర్‌పిసి కింద కేసు నమోదు చేశారు. డి.జి.పి., ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఒత్తిడి తెచ్చాకనే నన్ను ఊపా కింద నిర్బంధించారు.

రిజాజ్‌ : ఆకాశవాణి , దూరదర్శన్‌లకు వార్తలందించే బాధ్యతను హిందూస్తాన్‌ సమాచార్‌ గుత్తకు తీసుకుంది. గోడీ మీడియా తప్పుడు సమాచారంతో నేరాలను రెచ్చగొడుతుంటే సరైన సమాచారం కోసం సాధారణ ప్రజలు దేనిమీద ఆధారపడాలి?

కప్పన్‌ : ప్రభుత్వం ఏమి చెప్తుందో దానినిమాత్రమే జర్నలిస్టులు రిపోర్టు చేయాల్సిన పరిస్థితి  ఏర్పడింది  తప్ప మిగిలిన వార్తలన్నింటినీ అసత్యాలంటున్నది. పత్రికా స్వాతంత్య్రం వుందా లేదా అనేదాన్నిబట్టి ఒక దేశంలో ప్రజాస్వామ్యం వుందో లేదో నిర్ణయించవచ్చు. ఇప్పుడు దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి వుంది. మీడియా నోరు నొక్కేశారు. హిందీ మీడియా హోంశాఖ కంట్రోల్‌లో వుంది. వాళ్ళు వాస్తవ వార్తలకు బదులు ప్రభుత్వ మిచ్చే ప్రకటనలనే వార్తలుగా ప్రచురిస్తున్నారు.  పత్రికా పాఠకులు ప్రమత్తంగా వుండాలి. గోబెల్స్‌ సమాచార శాఖామంత్రిగా వున్నప్పుడు నాజీ జర్మనీలో పరిస్థితి ఇలానే వుండేది. ప్రజాస్వామ్యంలో ఎల్లప్పుడూ ఫాసిజానికి అవకాశం వుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఫాసిజానికి ముసుగుగా మారింది. ఆ కారణం చేత సమకాలిన భారతదేశంలో అసలైన వార్తలను గుర్తించడం చాలా కష్టం.

రెజాజ్‌ : మీరు వున్న జైలులో ఖైదీల పరిస్థితి ఎలా వుంది? అక్కడ కూడా మానవహక్కుల ఉల్లంఘనను మీరు గమనించారా?

కప్పన్‌ : 50మంది ప్రజల్ని ఒకే ఒక తరగతి గదిలో నిర్బంధించారు. వాళ్ళలో చాలామంది పేదలు, అమాయకులు. కొందరు ఆకలి కారణంగా దొంగతనాలు చేసినవారు. కొందరు మయన్మార్‌ వత్తిడ్ల కారణంగా పారిపోయి వచ్చిన రోహింగ్యాలు. చాలామంది ఖైదీలు మానసిక రోగులు. వాళ్ళని ఆసుపత్రులకు పంపించడానికి బదులు జైళ్ళలో పెట్టారు. ఉత్తరప్రదేశ్‌ జైళ్ళలో అనేకమంది దళితులు, ఆదివాసీలు, ముస్లింలు వున్నారు. వాళ్ళకి తమ న్యాయవాదులు ఎవరో తెలియదు. బంగ్లాదేశ్‌, మయన్మార్‌ , రష్యాలకు చెందిన ఖైదీలు కూడా వున్నారు. వాళ్ళకు పూచీకత్తులు ఇచ్చేవాళ్ళు వుండరు కాబట్టి ఎప్పుడు బయటికి వస్తారో తెలియదు. వాళ్ళకి ఎలాంటి న్యాయసహాయం అందించడం లేదు. ఈ సమస్యను మానవహక్కుల సంఘాలు పట్టించుకోవాలి. 21రోజుల తరవాత నేను స్నానం చేయగలిగాను. అదీ రహస్యంగా. మూత్ర విసర్జన చేసిన తరవాత సుభ్రం చేయడానికి ఇచ్చిన నీటితోనే స్నానం చేయాలి. రోజులో ఒకసారి మాత్రమే ఆహారం ఇచ్చేవాళ్ళు. కోవిడ్‌ సోకినప్పుడు నన్ను ఆసుపత్రిలో చేర్చారు. అప్పుడు కూడా నన్ను మంచానికి కట్టేసి వుంచారు.

రిజాజ్‌ : హందీని బలవంతంగా రుద్దుతున్న కారణంగా హిందీయేతర ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. జైల్లో వుండగా ఇంటి దగ్గర నుంచి ఫోన్‌ వస్తే  ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు.?

కప్పన్‌ : మమ్మల్ని కేవలం హిందీలోనే మాట్లాడిరచారు. ఇంగ్లీషులోగాని, మళయాళంలోగాని మాట్లాడడానికి అవకాశం లేదు. మళయాళం పుస్తకాలు చదవనివ్వడానికి కూడా నిరాకరించారు. జైలులో 45రోజులు గడిపిన తరవాతనే నా అరెస్టు గురించి నా కుటుంబానికి మొదటిసారిగా చెప్పుకునే అవకాశం నాకు లభించింది. నా కుటుంబ సభ్యులతో మళయాళంలో మాట్లాడుకోవడానికి అధికారుల్ని ప్రాధేయపడాల్సి వచ్చింది. ఈ కారణంగా జబ్బుతో వున్న నా 80ఏళ్ళ తల్లితో కూడా మళయాళంలో మాట్లాడలేకపోయాను. హిందీయేతర భాషలను పురాతన భాషలుగా చూసే సంస్కృతి ఉత్తరభారతదేశంలో వుంది. వాళ్ల వుద్దేశ్యంలో హిందీ మాత్రమే ప్రాచీన భాష. బెంగాలీలో మాట్లాడినిచ్చేవాళ్ళుగాని, మళయాళంలో మాత్రం మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు. జైలు అధికారుల్లోనూ రాష్ట్ర పోలీసులలోనూ కేరళ ప్రజల పట్ల అసహ్యత వున్నది. ఉత్తరప్రదేశ్‌లో సాధారణ ప్రజానీకానికి మాత్రం కేరళ పట్ల గౌరవం వున్నది. అక్కడ మంచి వేతనాలు లభిస్తాయనే భావన వున్నది.

రిజాజ్‌ : మీ చేతిమీద మిమ్మల్ని విడుదల చేస్తున్నట్లు ముద్ర వేశారు. ఒక ఉగ్రవాదిగా, లేక జాతివ్యతిరేకిగా వేసిన ముద్ర మిమ్మల్ని నిర్దోషిగా ప్రకటించిన తరవాత అదృశ్యమైపోతుందా?

కప్పన్‌ : ఉగ్రవాది, జాతివ్యతిరేకి అనే పదాలతో నేను భయపడడం లేదు. గర్వంగా భావిస్తున్నాను. ఎందుకంటే వ్యవస్థను, అధికారాన్ని ప్రశ్నిస్తున్నవాళ్ళ నోళ్ళు నొక్కడానికే ఇలాంటి పదాలను వాడుతున్నారు. గాంధీని హత్య చేయడం దేశభక్తి అనుకుంటే ఆ హంతకుడు, మీరు ఇద్దరూ దేశభక్తులు కాలేరు? మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మాత్రమే దేశభక్తులు కావాలి? ఆ హంతకుడు దేశభక్తుడయితే మనమందరం జాతి వ్యతిరేకులమే. అందుచేత ఇలాంటి పదాలతోటి నన్ను భయపెట్టలేరు.

రిజాజ్‌ : ఈ ఇంటర్వ్యూను ప్రపంచ పత్రికా స్వాతంత్య్ర దినం అయిన మే 3న ప్రచురిస్తాం. ఇప్పుడిప్పుడే జర్నలిజంలో అడుగుపెడుతున్న వాళ్ళకి మీరిచ్చే సందేశం ఏమిటి?

కప్పన్‌ : మీరు ప్రజల గొంతులు కండి. అలా కావడానికి మీరు చాలా కష్టాల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. అది ముళ్ళబాట. గౌరవంలేని జర్నలిస్టులు కాదల్చుకుంటే రాజ్యానికి అనుకూలంగా వుండండి. జర్నలిస్టులు ఎప్పుడూ ప్రతిపక్షంలో వుండాలి. సాధారణ ప్రజల ఆలోచనలను, ఉద్వేగాలను మనం పట్టుకోగలగాలి. వార్తల పేరుమీద ప్రజల మొదళ్ళల్లో ఇతరుల అభిప్రాయాలను ఎక్కించకూడదు. మన రాజకీయాభిప్రాయాలు మనకుంటాయి. కాని సాధారణప్రజల సమస్యల దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళ పక్షాన నిలబడాలి. మన రాజకీయ అభిప్రాయాలకు మనం రాసే వార్తల్లో స్థానం ఉండకూడదు. ఇలాంటి జర్నలిజమే కలకాలం నిల్చిపోతుంది.

            జర్నలిస్టులపై జరిగే నేరాల వ్యతిరేక పోరాటంలో మనం ముందు పీటీన నిలబడాలి. నేను సిపియం మద్ధతు దారుణ్ణి కాను. అయినా బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ సిపియం పత్రిక ‘గణశక్తి’ పై చర్యలు తీసుకున్నప్పుడు నేను ఢల్లీిలో దానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేసాను. నేను ‘ఏషియానెట్‌ న్యూస్‌’లోగాని, ‘మీడియా వన్‌’లోగాని పనిచేయలేదు. అయినా వాటిని కేంద్ర ప్రభుత్వం నిషేధించినప్పుడు వాటికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో వున్నాను. గౌరీ లంకేష్‌ హత్యకు జరిగిన నిరసన ఉద్యమంలో నేనున్నాను.

            తమకు సంబంధించిన అంశాలమీద జర్నలిస్టులు ఐక్యం కావాలి. వాళ్ళ దృక్పథాలు, ప్రాంతాలు, కులాలు ఏవైనా అలా ఐక్యం కాకపోతే వంటరివాళ్లం అయిపోతాం. మనకు భిన్నమైన రాజకీయాభిప్రాయలు గల మీడియా మీద ప్రభుత్వం దాడిచేసినప్పుడు కూడా మనం ఆ మీడియాకు మద్ధతుగా నిలబడాలి. కాశ్మీరీ జర్నలిస్టుల తరఫున నిలబడాలి. ప్రజలెప్పుడూ మనం రాసిన దానికంటే ప్రభుత్వం చెప్పిందే ఎక్కువ నమ్ముతారు. నా విషయంలో కూడా ఇలానే జరిగింది.  కొంతమందికి నాకు మద్దతు తెలపడానికి సంవత్సరం పైగా పట్టింది. నేను వికీపీడియాకు రాస్తుంటాను కాబట్టి నాకు విదేశీ మీడియా సంస్థల నుండి చాలా మద్దతు వచ్చింది. ఆ తరవాత మాత్రమే స్థానిక మీడియా నన్ను బలపర్చడం ప్రారంభించింది. మనం ముందు ఐక్యం కావాలి. అప్పుడు మాత్రమే మనం పత్రికా స్వాతంత్య్రంకోసం నిలబడతామని గర్వంగా చెప్పుకోగలం.

(రిజాజ్‌ యం సైదిక్‌ కేరళకు చెందిన డెమొక్రటిక్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌లో సభ్యుడు. కేరళ సెంట్రల్‌ యూనివర్శిటీలో సోషల్‌వర్క్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశారు. ఆయన ఈ ఇంటర్వ్యూను కౌంటర్‌ కరెంట్స్‌. ఆర్గ్‌ కోసం 7-5-2023న చేశాడు.)

అనువాదం : సి.యస్‌.ఆర్‌.ప్రసాద్‌

Leave a Reply