ఫోర్బ్స్ 2021 నివేదికను మనం విశ్వసిస్తే,(బిలియనీర్ల సంఖ్య, వారి సంపదను లెక్కించడం లో ఫోర్బ్స్ సంస్థ అత్యంత విశ్వనీయతను మనం ప్రశ్నించగలమా?) గత సంవత్సర కాలంలో ఇండియాలో బిలియనీర్ల సంఖ్య 102 నుండి 140 కి పెరిగింది. ఆదేకాలంలో, వారి ఉమ్మడి సంపద ఇంచుమించు రెండింతలు. అంటే,596 బిలియన్ డాలర్లకు చేరింది.
140 మంది వ్యక్తుల లేక దేశజనాభాలో 0.000014 శాతం మంది మొత్తం సంపద, మనదేశ స్థూల ఉత్పత్తి(2.62 ట్రిలియన్ డాలర్ల)లో, 22.7 శాతం గా వుండటం గమనార్హం. (స్థూల అనే పదానికి అర్థమూ ,పరమార్థమూ చేకూర్చేది వారేగా!)
దేశ ప్రధాన దినపత్రికలన్నీ ఫోర్బ్స్ నివేదికను ప్రచురిస్తూ, మన బిలియనీర్ల సామర్థ్యాన్ని మెచ్చుకోలుగా రాసాయి. అయితే , సంపద దైవ వాక్యం (oracle of pelf)ఫోర్బ్స్, నిజాయితీగా, నిర్భయంగా వెలిబుచ్చి న వివరాలను మాత్రం తెలివిగా వదిలివేసాయి.
మనదేశంపై, విడుదలజేసిన తన నివేదిక మొదటి పేరాలోనే, ఫోర్బ్స్ * మరో కోవిద్-19 ఇండియాను ఉప్పెనలా ముంచేస్తున్నది. ఇప్పుడు మొత్తం కోవిద్-19 కేసులు 12 మిలియన్లను దాటాయి. కానీ, దేశీయ స్టాక్ మార్కెట్ మాత్రం, మహమ్మారి కరాళ నృత్యం, విలయతాండవం నుండి బయటపడి, నూతన శిఖరాలకు చేరింది. గత సం. తో పోలిస్తే సెన్సెక్స్ 75%పైన ఎగబాకింది. గత సంవత్సర కాలంలో ఇండియాలో బిలియనీర్ల సంఖ్య 102 నుండి 140 కి పెరిగింది. ఆదేకాలంలో, వారి ఉమ్మడి సంపద ఇంచుమించు రెండింతలు, అంటే, 596 బిలియన్ డాలర్లకు చేరింది*.
అయ్యో! ఈ 140 మంది సంపన్నుల సంపద , సంవత్సర కాలంలో 90.4% పెరిగితే, దేశ స్థూల ఉత్పత్తి ఆదేకాలం లో 7.7% తగ్గిందా?. దేశంలో రెండవ విడత మహమ్మరీ కాలంలో, లెక్కించేందుకు వీలు లేనంతమంది వలస కార్మికులు, నగరాల వదిలి గ్రామాల బాటపట్టిన సమయం లో, మనకు ఈ మహత్తర సాధన గురించిన సమాచారం అందింది. తత్ఫలితంగా లక్షలాది మంది ఉపాధి కోల్పోవడం మన స్థూల ఉత్పత్తి కి మంచిదేమీ కాదు. కానీ, అదృష్ట వశాత్తు ఆ మహమ్మారి మన బిలియనీర్ల పైన పెద్దగా ప్రభావం చూపలేదు. మనకు ఆ విషయం లో ఫోర్బ్స్ నివేదిక హామీ ఇస్తున్నది. దీనికి మనం ఏడవాలో? నవ్వాలో? గర్వంతో తలెత్తుకోవాలో? సిగ్గుతో తలదించుకోవాలో?
అంతేగాక కోవిడ్ -19 తో మన బిలియనీర్ల సంపద వ్యతిరేక తర్కం(inverse logic)లో వున్నట్టు కనపడుతుంది. సంపద కేంద్రీకరణ హెచ్చేకొద్దీ, మహమ్మారి ప్రభావ ఫలితం తక్కువయ్యింది.
మన దేశ సంపన్నులు సాధించిన మహత్తర విజయాలు:
భారత బిలియనీర్ల సంఖ్య పెరుగుదల: 102-140. 37%., సంపద – 596 బిలియన్ డాలర్లు. 90.4%, అంబానీ సంపద పెరుగుదల – 36.8 బిలియన్ డాలర్ల నుండి 50.5 బిలియన్ డాలర్లు. 467%., దేశస్థూల ఉత్పత్తి తగ్గుదల-7.7%.
“సంపద అత్యంత ఉన్నతస్థాయిలో పాలనచేస్తుంది. భారతదేశం లోని అత్యంత సంపన్నులు మాత్రమే వారిమధ్య సంపదను 100 బిలియన్ డాలర్లు పెంచుకున్నారు.”అని ఫోర్బ్స్ నివేదిక చెబుతుంది. భారతదేశం లోని ముగ్గురు అత్యంత సంపన్నుల మొత్తం సంపద-153.5 బిలియన్ డాలర్లు. ఇది మొత్తందేశపు 140 బిలియనీర్లసంపదలో 25% గా వుంది. ఇక దేశ ఇద్దరు అత్యంత సంపన్నులు సంపద- అంబానీ -84.5 బిలియన్ డాలర్లు, ఆదానీ-50.5 బిలియన్ డాలర్లు. వీరిద్దరి సంపద మొత్తం-135 బిలియన్ డాలర్లు. ఇది పంజాబ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 85.5 బిలియన్ డాలర్లు, హర్యానా రాష్ట్ర స్థూల ఉత్పత్తి 101 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ. (బిలియనీర్లలో,ప్రభుత్వ ఆశ్రిత బిలియనీర్లు వేరయా!)
మహమ్మారి సంవత్సర కాలంలో అంబానీ తన సంపదను 47.7 బిలియన్ డాలర్లు. అంటే సగటున ప్రతి సెకండ్ కు రూ. 1.13 లక్షలు పెంచుకున్నారు. ఈ మొత్తం పంజాబ్ లోని 6 వ్యవసాయ కుటుంబాల(సగటుకుటుంబ సభ్యుల సంఖ్య-5.24) మొత్తం నెలవారి ఆదాయం(ఒక్కొక్క కుటుంబపు సగటు నెలవారి ఆదాయం -రూ. 18,059*6 =1,08,354)కన్నా ఎక్కువ.
ఒక్క అంబానీ మొత్తం సంపద(84.5 బిలియన్ డాలర్లు)నే ఇంచుమించు పంజాబ్ రాష్ట్ర స్తూల ఉత్పత్తి (85.5 బిలియన్ డాలర్ల)తో సమానంగా వుంది. అదీ కూడా వ్యవసాయరంగ నూతన చట్టాలు పూర్తిగా అమలుగాకముందేననేది గమనార్హం. ఇక అవి అమలులోకి వస్తే ఆ సంపద మరింత పెరుగుతుంది. ఈ కాలంలోనే పంజాబ్ రైతు సగటు నెల ఆదాయం. ఇంచుమించు రూ. 3,450/(జాతీయ నమూనా సర్వే-70).
చాలా దినపత్రికలు, Press Trust Of India రిపోర్ట్ ను యధాతధంగానో, లేక చిన్నపాటి మార్పులతోనో ప్రచురించాయి. అంతేగానీ ఫోర్బ్స్ నివేదిక చేసినట్టుగా, బిలియనీర్ల సంపద అనూహ్య పెరుగుదలకు, నేటి కోవిడ్-19గల సంభంధంగురించి మన పత్రికలు చెప్పలేదు. Press Trust Of India కథనంలో ఎక్కడా “కోవిడ్”,”కరోనా వైరస్”,”పాండమిక్” లాంటి పదాలు కనపడవు. అంతేగాక, Press Trust Of India గానీ, మరే కథనం గాని, ఫోర్బ్స్ నివేదిక వెల్లడించిన, ‘కోవిడ్ కాలంలో, ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి వల్ల బలోపేతమయిన ఆరోగ్య సంరక్షణ (health care ) రంగం నుండి అత్యంత సంపన్నులయిన పదిమంది భారతీయులలో ఇద్దరు సంపన్నులు తమ సంపదను అనూహ్యంగా పెంచుకున్నారు” అనే వాస్తవాలను దాచాయి. సంపద అనూహ్య పెరుగుదలకు నేటి పరిస్థితిలకు గల సంబంధాన్ని ఫోర్బ్స్ తన నివేదికలో స్పస్టం జేసింది. మన140 మంది బిలియనీర్లలో 24 మంది బిలియనీర్లు ఆరోగ్య సంరక్షణ (health care ) రంగం ద్వారా సంపద పెంచుకున్నట్టు స్పస్టంజేసినా, ఆరోగ్య సంరక్షణ (health care ) అనే పదం Press Trust Of India రిపోర్ట్ లో గానీ, మరే కథనంలో గాని మచ్చుకయిన కానరాకపోవడం గమనార్హం.
ఫోర్బ్స్ ప్రకటించిన ఆ 24 భారతీయ ఆరోగ్య సంరక్షణ (health care ) బిలియనీర్లలో, అగ్రశ్రేణిలో వున్న ఇద్దరు బిలీనీర్ల ఉమ్మడి సంపదకు కోవిడ్-19 కాలంలో, అదనంగా, 24.9 బిలియన్ డాలర్లు(సగటున రోజుకు రూ.5 బిలియన్లు)చేరాయి. వారి ఉమ్మడి సంపద 75% పెరుగుదలతో.58.3 బిలియన్ డాలర్లకు(రూ. 4.3 ట్రిలియన్ల) చేరింది. ఈ సంధర్భం లో, కోవిడ్ “సమవర్తి (great leveller)”అనే మాట ఎంత అపహాస్యంగా వున్నదో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా!
మన Make-in-India పేరుతో, ఎక్కడైనా, ఎలాగైనా సంపదపెంచే డబ్బు సంచులు(Rake-it-in-Anywhere money bags)ఫోర్బ్స్ పట్టికలో శిఖరాగ్రస్థానానలో ఉన్నారు. కేవలం మొదటిస్థానానికి దిగువ రెండు స్థానాల లో ఉన్నారు. 140 నాట్ అవుట్ గా ప్రపంచలోని ఎక్కువ మంది బిలియనీర్లు కలిగిన దేశంగా ఇండియా అమెరికా, చైనా ల తర్వాతి స్థానం వుంది. ఒకానొక కాలంలో జర్మనీ, రష్యా మనల్నిదాటి ముందుకు పోతున్నట్టుగా కన్పించాయి. కానీ, ఇప్పుడు వాటి స్థానమేదో వాటికి స్పస్టం చేశాం.
మనదేశ 140 మంది బిలియనీర్ల మొత్తం సంపద 596 బిలియన్ డాలర్లు. అంటే, ఇంచుమించు రూ.44.5 ట్రిలియన్లు. అది,75 రాఫెల్ విమానాలు ధర కన్నా కొంచెం ఎక్కువ. మనదేశం లో సంపదపై పన్ను లేదు. సంపద పన్ను 10% గా వేస్తే ఆ మొత్తం రూ.4.45 ట్రిలియన్లు కాగా,ఆ మొత్తంతో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిపథకాన్ని, నేడు కేటాయించిన రూ.73 వేల కోట్ల (2021-22) తో 6 సం. నడపవచ్చు. ఆ విధంగా, గ్రామీణ భారతం లో, వచ్చే 6 సం. లలో 16.8 బిలియన్ పని రోజులనివ్వవచ్చు.
ఒక సమాజంగా, మనపట్ల న్యాయబద్ధంగా విశ్వసనీయత కోల్పోయిన వలస కార్మికులు పట్టణాలను, నగరాలను వదలి వెళ్లిపోతోంటే, నేడు మనకు ఆ పనిదినాల అవసరం గతంలో కన్నా ఎక్కువగా ఉందనేది గమనార్హం.
ఈ అధ్బుతమైన 140 కి వాళ్ళ స్నేహితుల చేయూత వుందనేది మనం గమనించాలి. గత రెండు దశాబ్దాలుగా, కార్పొరేట్ పన్నుల రాయితీల వేగం పుంజుకుంది. అది ఆగస్ట్ 2019 నుండి మరింత వేగం అందుకుంది.
కరోనా సమయంలో, రైతులకు కనీస మద్ధతు ధరలో ఒక్క పైసా కూడా రాయితీ ఇవ్వకపోగా, కార్మికుల పనిగంటలు 8 గం. నుండి 12 గం. లకు(కొన్ని రాష్ట్రాలలో అదనపు 4 గం. లకు ఓవర్ టైమ్ వేతనం కూడా లేదు)పెంచుతూ ఆర్డినెన్స్ జారీచేసారు. అంతకన్నా ఎక్కువగా, దేశ వనరులను, ప్రజారోగ్యాన్ని కార్పొరేట్లకు అప్పగించారు. ఈ కరోనా సంవత్సర కష్టకాలం లో ఒకానొక సమయాన ఆహారధాన్యాల బఫర్ స్టాక్ 104 మిలియన్ టన్నులుగా వున్నా, కేవలం జాతీయ ఆహార భద్రతా చట్టపు పరిధి లో వున్నవారికి మాత్రమే (ఆ పరిధిలో లేనివారు, సహాయం అవసరమయిన వారు లక్షలాది మంది ఇంకా మిగిలే వున్నారు). 5 కి. గ్రా ల బియ్యం/గోధుమలు, ఒక కిలో తృణధాన్యాలు ఉచితంగా పంపిణీజేశారు. అదీ దశాబ్దాలుగా ఎన్నడూ లేనంతగా, వందల మిలియన్ల ప్రజలు ఆకలితో అల్లల్లాడుతున్న కాలంలో.
ఈ సంపద “ఉప్పెన” (surge)ప్రపంచ వ్యాపితంగా వుందని ఫోర్బ్స్ నివేదిక వెల్లడిజేస్తుంది. “గత సం. కాలం లో ప్రతి 17 నిమిషాలకు ఒక బిలియనీర్ ఉద్భవించాడు. మొత్తం మీద ప్రపంచపు అత్యంత సంపన్నుల సంపద గత సంవత్సరం కన్నా 5 ట్రిలియన్ డాలర్లు పెరిగింది.” పెరిగిన ఆ 5 ట్రిలియన్ల డాలర్లలో మనదేశ అత్యంత సంపన్నుల వాటా 12% గా వుంది. మళ్ళీ మొదటికి వస్తే, ఆన్నిరంగాలలోకన్నా, మనదేశం లో , అసమానత రంగం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న రంగమని చెప్పవచ్చు.
అలాంటి సంపద “ఉప్పెన”, సాధారణంగా కడగండ్ల “ఉప్పెన” పై సవారిజేస్తుంది. ఇది, కడగండ్ల “ఉప్పెన” అంటే,కేవలం మహమ్మారి కాలమే కాదు.అన్ని రకాలవిపత్తులు అద్భుతమైన వ్యాపారం. మెజారిటీ ప్రజల ఇబ్బందులలో డబ్బును చేసుకొనే అవకాశాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఫోర్బ్స్ అభిప్రాయపడినట్టుగా, మనవాళ్లు, అంటే బిలియనీర్లు కేవలం “మహమ్మారి భయాన్ని వదిలించుకోలేదు”(shake off the pandemic funk).వారు దాని ఉత్తుంగ తరంగాలపై బ్రహ్మాండంగా సవారిజేసారు. ప్రపంచ వ్యాపితంగా, ఆరోగ్యసంరక్షణ(రంగం) మహమ్మారి అనే బలఔషదం వల్ల మరింత బలోపేతమైంది.కానీ, ఈ బలఔషధాలు, ఉప్పెనలూ, వివిధ రకాల విపత్తుల కాలంలో ఇతర రంగాలలో కూడా ఉద్భవించ వచ్చు.
2004 లో చాలా దేశాలను అతలాకుతలం చేసిన సునామీ సంభవించిన విషయం మనకు విదితమే. అయితే సునామీ సంభవించినవారంలో నే, సునామీవల్ల తీవ్రనష్టానికి గురైన దేశాలతోసహా, ప్రపంచమంతా స్టాక్ మార్కెట్ అత్యధిక లాభాలను పొందింది.
సునామీ వల్ల లక్షలాదిప్రజలు నిరాశ్రయులయ్యారు. తమ సర్వస్వం కోల్పోయారు. ఇండోనేసియాలో, సునామీ వల్ల లక్షలాది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఆ దేశ రాజధాని జకార్తా స్టాక్ మార్కెట్ సూచిక గత రికార్డ్ లన్నింటిని అధిగమించింది. మనదేశ సెన్సెక్స్ దీ ఆదేబాట. వెనక్కి తిరిగి చూస్తే అది నిర్మాణ రంగం లో పొందే డాలర్ల , పాయలను ముందుగా పసిగట్టిందని అర్థమవుతుంది. అందుకే సెన్సెక్స్ రికార్డుల ఉత్తేజమంతా (boom) నిర్మాణ, తత్సంబంధిత రంగాలలోనే అని వేరే చెప్పాలా?
ఈసారి, ఆరోగ్యసంరక్షణ, సాంకేతిక (మరీ ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సేవల) రంగాలు చాలా లాభాలు తెచ్చిపెట్టాయి. ఇండియాలోని మొదటి 10 స్థానాలలో వున్న సాంకేతికరంగ వ్యాపారవేత్తల ఉమ్మడి సంపద సంవత్సర కాలం లో 22.8 బిలియన్ డాలర్లు(రోజకు సగటున రూ.4.6 బిలియన్లు)77%పెరిగి, వారి ఉమ్మడి ఆస్తి 52.4 బిలియన్ డాలర్ల(రూ. 3.9 ట్రిలియన్ల)కు చేరింది. ఇక, కోట్లాదిపేదవిద్యార్థులు ప్రధానంగా ప్రభుత్వ పాట శాలల విద్యార్థులకు ఏ రకమైన చదువుకొనే అవకాశం లేకపోయినా, ఆన్ లైన్ విద్య కొందరికి కాసుల వర్షమే. బైజు రవీంద్రన్,అదే కాలంలో, 39% ఆదాయ వృద్ధి తో 2.5 బిలియన్ డాలర్ల(రూ.187 బిలియన్లు)కు చేరాడు.
ప్రపంచదేశాలకు వాటి వాటి స్థానాలేమిటో చూపించామని మనం గర్వంగా చెప్పడం న్యాయమైనదే. అదే సమయంలో ఐక్యరాజ్యసమితి మానవ అభివృద్ది సూచీకలో, మనస్థానం 131 స్థానం కూడా అని తెలపింది. మానవ అభివృద్ది సూచికలో , మొత్తం 189 దేశాలలో, ఎల్ సాల్వడార్, తజికిస్తాన్, కాబోవర్దీ(Cabo Verde), గౌతమేలా, నికరాగ్వా, భూటాన్, నమీబియా లాంటి దేశాలు మనకన్నా మంచి ర్యాంక్ లలో వున్నాయి. అందువల్ల మనల్ని గత సంవత్సరం కన్నా కింది స్థానం లోకి తోసిచూపిన గ్లోబల్ కుట్ర పై ఒక వున్నతస్థాయి విచారణ ఫలితాలకై మనం వేచి వుండాలనుకుంటా. వేచిచూద్దాం మరి.
(FORBES,INDIA AND PANDORA’ PANDEMIC BOX-P.SAINATH)
24/04/2021
అనువాదం: అరుణ్