మా దేహపు నీడలోనూ
మా ఊపిరిపాట వినిపిస్తుంది

మా హృదయంలో కదలాడుతున్న ఘర్షణ
మా కడుపులోకి ఎలా దూకిందో
మా దేహపు నీడలోనూ కనిపిస్తుంది

స్థూపాల నీడలన్నీ కలగలిసి
నేలపై హృదయాలపై నదిలా పారుతుంటాయి
మా దేహపు నీడలోనూ
అదే త్యాగాల రంగు

దట్టమైన చీకటిలోనూ
నిద్ర పట్టని రాత్రిలోనూ
నేలపై పడుకున్నప్పుడు మా నీడలు మాకు కనిపిస్తాయి
మా నీడలు మా కింద నుండి పారుతుంటాయి
గుండెలు పగిలి
అచ్చం మాలాగే నిర్జీవంగా పడివున్న
మరికొందరి అమ్మలను వారి నీడలను హత్తుకోటానికి
మా నీడలు పారటం నేర్చుకున్నాయి

చిమ్మ చీకటిలోనూ
మా నీడలన్నీ సజీవమే
నీడల్లో నిండివున్న మా ఎర్రటి రక్తమంతా సజీవమే

మా త్యాగాల రంగులో మెరుస్తున్న చిక్కటి నీడలు
పిడికిళ్లుగా మారుతుంటాయి
పిడికిళ్లుగా పాడుతుంటాయి

ఎర్రగా మెరుస్తున్నయ్ చూడండి
ఇక్కడి నీడలు నలుపులో వుండవు
ఇక్కడి నీడలు నీడల్లా వుండవు
నిగనిగలాడే నిప్పు రవ్వలన్నీ సంఘటితమై
దిక్కరిస్తున్న పిడికిళ్ళలాగే వుంటాయి

మా నరాలతోనే కర్రలకు జెండాలు కట్టినం
మా పేగులతోనే స్థూపాలకు ఎర్రజెండాలు కట్టినం
మా కన్నీళ్లతోనే
అలలకు పిడికిళ్ళు మొలిచే సముద్రాన్ని కట్టినం
మా శోకాలను ఏకం చేసి
తంత్రీ వాద్యాన్ని మీటుతున్నం

మా హృదయాలను కౌగిలింతల్లో తడుపుకొని
రొమ్ముపాటలను ఎత్తిపాడుకుంటాం
మా పాలు తాగిన మా బిడ్డల కోసం
మా రొమ్ముపాటలు మూగబోవు

మా పాటలూ పారుతుంటాయి
మా నీడల్లాగే
మా పాటలూ ఎగురుతుంటాయి
అమరుల స్థూపాలపై ఎర్రటి జెండాల్లాగే !!

వాయిస్ ఆఫ్ ABMS (అమరుల బంధు మిత్రుల సంఘం)

Leave a Reply