కొవిడ్ తరువాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న దశలో పులి మీద పుట్రలా యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం రావడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుంగిపోతుందన్న భయాలు పెరుగుతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్య్లూటిఓ) మాంద్యం తప్పదని హెచ్చరిస్తోంది. డాలర్ దెబ్బకు ప్రపంచ దేశాల కరెన్సీలు కుదేలవుతున్నాయి. డాలర్ డామినేషన్ దినదినం పెరుగుతోంది. ప్రపంచం మరో ఉత్పాతానికి దగ్గరగా చేరుకుంటోంది. ద్రవ్యోల్బణం, రుణభారం, మాంద్యం ఒకపక్క, ఇంధన కొరతలు, ఆకలికేకలు, ఎంతకీ వీడని కొవిడ్ వైరస్, యుద్ధ ప్రభావం మరోవైపు కలిసి ఏకకాలంలో మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మాంద్యం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది 2008 ఆర్థిక సంక్షోభమే. వందల ఏళ్ల చరిత్ర కలిగిన కంపెనీలు సైతం కనుమరుగై పోయిన రోజులవి. కంపెనీల పునాదులు కదిలిన మహా ఆర్థిక సంక్షోభం అది. అయితే ఇప్పుడు అలాంటి మహా మాంద్యానికి ప్రపంచం చాల దగ్గరగా ఉందని అనేక మంది ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాణిజ్యంలో డాలర్ మార్పిడి విధానం ప్రపంచ కరెన్సీగా ఉన్నందున అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తోంది.
ఆయా దేశాల ద్రవ్యోల్బణం అంచనాలను అంతర్జాతీయ అనిశ్చితి మేఘాలు కమ్మేస్తున్నాయి. అధిక ద్రవ్యోల్బణాన్ని ఇలాగే వదిలేస్తే మరో దుష్ప్రభావాన్ని ఆహ్వానించినట్లు అవుతుంది. అయితే అంతర్జాతీయ చెల్లింపులన్నీ అమెరికన్ డాలర్లలోనే ఉండడంవల్ల డాలర్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉన్నది. ఇంకా, ఐఎంఎఫ్‌లోని 189 సభ్యదేశాలు, సంస్థలో చేయవలసిన డిపాజిట్లలో కొంత శాతం తప్పనిసరిగా అమెరికన్ డాలర్లలోనే చేయాలన్న నిబంధన వల్ల డాలర్‌కు డిమాండ్ అదనంగా పెరుగుతున్నది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణతో దేశాలపై తమ ఆధిపత్యాన్ని నెరపడంలోనూ, సామ్రాజ్యవాద దోపిడీకి నిరంతరం సాధనాలుగా ఉపయోగపడే ఐ.ఎం.ఎఫ్ వంటి ఆర్థిక సంస్థల నిధుల ప్రవాహం ద్వారా అమెరికన్ డాలర్ పెత్తనం మరింతగా స్థిరపడుతూ వచ్చింది.
1980ల నుంచి విరుచుకుపడిన ప్రతి ఆర్థిక సంక్షోభానికి సామ్రాజ్యవాద అమెరికా డాలర్ విలువ పెంచడం, లేదా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం కారణంగా ఉంది. 1982లో లాటిన్ అమెరికా దేశాల్లో రుణ సంక్షోభం, 1994లో మెక్సికో రుణాల ఎగవేత, 1997లో తూర్పు ఆసియా దేశాల ఆర్థిక సంక్షోభం, 1998లో రష్యా రుణాలకు ఎగనామం, 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఇలా ప్రతి దాని వెనకా పైన చెప్పుకొన్న కారణమే ఉంది. ఈ ఏడాదీ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును రెండున్నర శాతం పెంచింది. ఫలితంగా డాలర్ విలువ 22 శాతం పెరిగింది. గడచిన కొన్ని నెలలుగా ప్రపంచమంతటా స్టాక్ మార్కెట్ మదుపరులు 32 లక్షల కోట్ల డాలర్ల మేర సంపద కోల్పోయారు. అందుకే అమెరికన్ ఆర్థికవేత్త పాల్ శామ్యూల్ సన్ ఏమన్నారంటే ‘అమెరికన్ డాలర్‌కున్న విపరీతమయిన డిమాండ్ వల్ల అమెరికా ప్రభుత్వ పరిధిలో పనిచేసే ఫెడరల్ రిజర్వు బ్యాంకు ఎటువంటి డిఫాల్ట్ రిస్క్ లేకుండా అతి తక్కువ వడ్డీకి అమెరికన్ డాలర్లను ఇష్యూ చేయగలదు. వడ్డీరేటు మార్పులతో ప్రపంచ దేశాలలో డాలర్ సరఫరాని ప్రభావితం చేస్తోంది.
గడచిన థాబ్దంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీరేట్లను పెంచడం గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నాం. ఫలితంగా ఈసారి వచ్చే ఆర్థిక సంక్షోభం 2008 కంటే తీవ్రంగా ఉంటుందని మాక్రో అసోసియేట్స్ సిఇవో, ప్రముఖ ఆర్థిక వేత్త నూరియల్ రూబినీ అంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారుకుని వచ్చే ఏడాది పూర్తిగా మాంద్యంలోనే కొనసాగుతుందని హెచ్చరించాడు. ప్రముఖ మదుపరి స్టాన్లీ డ్రకెన్ మిల్లర్ కూడ మాంద్యం తప్పదంటున్నారు. ఇది ప్రపంచ దేశాలన్నిటిని కుదిపేస్తుందన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై మానవాళికి తీవ్ర ఇక్కట్లు వాటిల్లనున్నాయని డబ్య్లూఈఎఫ్ (వరల్డ్ ఎకనమిక్ ఫోరం) నివేదిక నాలుగు నెలల క్రితమే ప్రమాద ఘంటికలు మోగించింది. ఈ ఏడాది చివరికి వివిధ నూనెలు, తిండిగింజలు, కూరగాయలు, మాంస ఉత్పత్తులు తదితరాల ధరలు ప్రజ్వరిల్లనున్నాయని, నికర వేతనాలు కుంగిపోతాయన్న నివేదికాంశాలు అప్పట్లో వెలుగు చూశాయి. ఇప్పటికే చాలా దేశాలలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుందని 1980 తర్వాత ద్రవ్యోల్బణం ఇంత భారీగా పెరగడం ఇప్పుడేనని ‘ఎకనమిక్ అవుట్ లుక్’ నివేదిక పేర్కొంది. ఇప్పుడు ప్రపంచాన్ని అలుముకుంటున్న మాంద్యం వల్ల గిరాకీ పడిపోయి ఉద్యోగాలు, వ్యాపారాలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అనిశ్చితి :
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి రోజు రోజుకు పెరుగుతున్నది. ఒకప్పుడు సాపేక్ష అంచనాలకు అనువుగా ఉండే ఆర్థిక వ్యవస్థ ఇవాళ అంతులేని అనిశ్చితి దిశగా వేగంగా కదులుతున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిష్టాలినా జార్జివా ఆందోళన వ్యక్తం చేసింది. మాంద్యం పరిస్థితిని ప్రపంచంలోని మూడింట ఒకవంతు దేశాలు ఈ ఏడాది చివరి త్రైమాసికం లేదా వచ్చే ఏడాది మొదటి రెండు త్రైమాసికాల్లో ఎదుర్కొనున్నాయని ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వార్షిక సమావేశానికి ముందు తన ప్రధాన విధాన ప్రకటనలో జార్జివా హెచ్చరించారు. ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటును ఇప్పటికే మూడుసార్లు తగ్గించామని ఆమె అన్నారు. ఈ ఏడాది 3.2 శాతంగా, 2023లో 2.9 శాతంగా వృద్ధిరేటును నిర్ధారించినట్లు ఆమె తెలిపింది. వాస్తవ ఆదాయాలు తగ్గిపోతాయని, ధరల పెరుగుదల ప్రజలకు కష్టాలు తెస్తుందన్నారు. మొత్తం మీద 2022-2026 మధ్యకాలంలో దాదాపు 4 ట్రిలియన్ డాలర్ల ఉత్పత్తి నష్టాన్ని అంచనా వేస్తున్నామని పేర్కొంది. ఆర్థిక స్థిరత్వానికి ఆటంకాలు పెరుగుతున్నాయని, మితిమీరిన అనిశ్చితి, అస్థిరత, భౌగోళిక రాజకీయాల ఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి పలు సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా కాలంలో ఏర్పడ్డ ద్రవ్య కొరతను నివారించడానికి అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి అదనంగా డబ్బును సమకూర్చడానికి ఫెడరల్ బ్యాంకు భారీగా నిధులను విడుదల చేసింది. వడ్డీరేట్లను 0.5 శాతానికి తగ్గించింది. ఫలితంగా అమెరికాలో అనూహ్యంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఇప్పుడేమో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీరేట్లను 2.5 శాతానికి పెంచింది. అమెరికా, పశ్చిమ దేశాలు ద్రవ్య విధానాన్ని అంచనాలకు మించి కఠినతరం చేస్తున్నందున ఆసియా ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నస్థితికి చేరుతుందని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఎడిబి) హెచ్చరించింది. సెప్టెంబర్ 21న ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు (ఎడిబి) ప్రెసిడెంట్ మసత్సుగు అసకవా మీడియాతో మాట్లాడుతూ స్థానిక కరెన్సీల మారకం రేటు మరింత తరిగిపోతుందన్నారు.
పశ్చిమ దేశాలు… ప్రత్యేకించి అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్న నేపథ్యంలో రిస్క్ సంబంధిత దేశాల విదేశీ నిధులు వేగంగా తరలిపోతాయన్నారు. ఆసియా దేశాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితులు సవాలుగా మారాయని, కొవిడ్ నుంచి ఆర్థిక వ్యవస్థలు కోలుకుంటున్న తరుణంలో మళ్లీ భవిష్యత్ అనిశ్చితంగా మారిందని ఎడిబి ప్రెసిడెంట్ వాపోయారు. ఈ నేపథ్యంలో జపాన్ తమ కరెన్సీ యెన్ కు మద్దతుగా నిలిచేందుకు సెప్టెంబర్‌లో ఏకంగా 20 బిలియన్ల డాలర్లను ఖర్చు చేసింది. దీంతో ఆ దేశ విదేశీ మారక నిల్వలు 10 శాతం తగ్గాయి. 1998 తర్వాత ఇలా తమ కరెన్సీని నిలబెట్టేందుకు ఆ దేశ సెంట్రల్ బ్యాంకు జోక్యం చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇదే కారణంతో చెక్ రిపబ్లిక్ విదేశీ మారక ద్రవ్య నిల్వలు 19 శాతం కుంగాయి.
యూరప్‌లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం :
యూరోజోన్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ మాసాంతానికి రికార్డు స్థాయిలో నమోదైంది. దీంతో అక్టోబర్‌లో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ మరోసారి వడ్డీ రేటును భారీగా పెంచుతుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. యూరో కరెన్సీ అమల్లో ఉండే 19 దేశాల్లో సెప్టెంబర్ మాసంలో ధరల పెరుగుదల 10శాతానికి చేరుకుంది. అంతకుముందు నెలల్లో ఈ పెరుగుదల 9.1 శాతంగా ఉందని యరోస్టాట్ డేటా తెలియచేసింది. యూరప్‌లో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో ద్రవ్యోల్బణం రేటు గత 70 ఏళ్ళలో ఎన్నడూ లేని స్థాయికి చేరింది. ఇందుకు ప్రధానంగా ఇంధన, ఆహార ధరలే కారణంగా భావిస్తున్నారు. ఈ పెరుగుదల సేవల నుండి పారిశ్రామిక ఉత్పత్తుల వరకు పడుతుండడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. ఏడాది క్రితంతో పోలిస్తే ఇంధన ధరలు 41 శాతం పెరిగాయి.
ప్రపంచ వాణిజ్య సంస్థ హెచ్చరిక :
కరోనా వైరస్ ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయగా.. దానికి యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం తోడైన కారణంగా ఆర్థిక మాంద్యం దిశగా ప్రపంచం పయనిస్తోందంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్య్లుటిఓ) చీఫ్ నగొజి ఒకొంజ సెప్టెంబర్ 27న హెచ్చరించారు. జెనీవాలో డబ్య్లుటిఎఫ్ వార్షిక సమావేశాలను ప్రారంభిస్తూ ఆమె మాట్లాడారు. తక్షణమే అభివృద్ధి క్రమాన్ని పునరుద్ధరించేందుకు రాడికల్ విధానాలను రూపొందించాలన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం, వాతావరణ సంక్షోభం, ఆకాశనంటుతున్న ఆహార, ఇంధన ధరలు, దీనికి తోడు కొవిడ్ మహమ్మారి దెబ్బ అన్నీ కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యం వైపునకు నెడుతున్నాయని అన్నారు. రాబోయే పరిస్థితులను ఎదుర్కోవడంపై తక్షణమే దృష్టి సారించాలన్నారు. అయితే వీటి ప్రభావం మార్కెట్లపై, వర్ధమాన దేశాలపై చాలా తీవ్రంగా ఉంటుందన్నారు. ముందుగా ఆహార భద్రతకు హామీ కల్పించే చర్యలకు తొలి ప్రాధాన్యత, ఆ తర్వాత ఇంధన భద్రత గురించి ఆయా దేశాల నేతలు ఆలోచించాలన్నారు. ఇంధన కొరత, వాతావరణ మార్పులు, విపరీతంగా పెరుగుతున్న ఆహార ధరలు సంక్షోభాన్ని పెంచుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచదేశాల మధ్య వాణిజ్య కార్యకలాపాలు సైతం మందగించాయి. ప్రపంచ దేశాలపై ఈ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. యుద్ధం కారణంగా ఏర్పడిన సరఫరా అంతరాయాలు తిరిగి సాధారణ స్థితికి రాకుంటే దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జర్మనీ అతలాకుతలం… అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ముప్పుకు దగ్గరగా చేరుకుంటోంది. అయితే వాస్తవ పరిస్థితులు 2008 కంటే దారుణంగా మారాయని అక్కడి ఐఎఫ్ఓ సర్వే సూచీ వెల్లడించింది. రష్యా చర్యల కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం ముదురుతోంది. వీటి ధరల కారణంగా వ్యాపారులు సైతం తమ ఉత్పత్తిని నిలిపివేస్తున్నారు. రష్యా నుంచి వచ్చే చవకైన గ్యాస్ పైప్‌లైన్ నిలిచిపోవటంతో అమెరికా నుంచి లిక్విపైడ్ గ్యాస్‌ను జర్మనీ దిగుమతి చేసుకుంటోంది.
ఈసారి ప్రజల్ని ప్రభుత్వాలు రక్షించలేవు :
ప్రపంచంలోని అన్ని దేశాలు అప్పులు అనే ఇంధనంతోనే నడుస్తున్నాయి. అయితే కొన్ని దేశాలు పరిమితికి మించి చేస్తున్న అప్పులు సంక్షోభం వైపు నడిపిస్తున్నాయి. దీనికి మన పొరుగున సంక్షోభంలోకి జారుకున్న శ్రీలంక పెద్ద ఉదాహరణ. 2008లో హౌసింగ్ బబుల్ సమయంలో బ్యాంకులు, రియల్ ఎస్టేట్ వంటి రంగాలు మాత్రమే దెబ్బతిన్నాయి. కానీ ప్రస్తుతం ఏకంగా ప్రభుత్వాలు కుప్పలు తెప్పలుగా అప్పులు చేస్తున్నాయి. అప్పు పుడితే కానీ పొద్దుగూకని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ద్రవ్యోల్బణం భారం.. కరోనా ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీయగా… దానికి రష్యా యుద్ధం తీవ్రతరం చేసి ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరింది. గడిచిన థాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచటం, పెద్ద ఎత్తున ఉపశమన ప్యాకేజీలను ప్రకటించటం మనం చూస్తున్నాం. వడ్డీ రేట్ల పెంపు వల్ల ఆర్థిక వ్యవస్థలు నెమ్మదించటంతో పాటు ఆదాయాలు పడిపోతున్నాయి. రానున్న కాలంలో ఇవి కొనసాగితే ఆర్థిక మాంద్యం భయంకరంగా ప్రభావితం చేస్తుందని ఆర్థిక వేత్తలు ఇప్పటికే హెచ్చరించారు.
అనేక దేశాల్లోని సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఫెడ్ నవంబర్, డిసెంబర్ నాటికి మరింత రేట్ల పెంపు ప్రకటించనుంది. పలు దేశాల రిజర్వు బ్యాంకులు సైతం అదే దారిలో ముందుకు సాగుతోన్నాయి. దీనివల్ల ఉపశమనం కలగకపోగా సామాన్యులకు అప్పుల భారం మరింతగా పెరుగుతోంది. రక్షించలేని స్థితిలో ప్రభుత్వాలు.. ఈసారి వస్తున్న మహా మాంద్యాన్ని ఎదుర్కొనే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ఎందుకంటే వాటి వద్ద అంత స్థాయిలో నిధులు సైతం లేవు. ఈ క్రమంలో మార్కెట్లు సైతం కుప్పకూలుతున్నాయి. అమెరికా సూచీలు 40 శాతం వరకు నష్టపోగా, భారతీయ మార్కెట్లు ప్రస్తుతం భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. అమెరికా, జపాన్, యూరప్, చైనాతో సహా ప్రధాన స్టాక్ మార్కెట్లపైనా ఈ ప్రభావం ఉంటుంది. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న సమస్యలకు తోడు మరిన్ని ఇబ్బందులు సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. కరోనా వల్ల చైనాలో కొనసాగుతున్న ఆంక్షలతో కుదేలైన ఉత్పత్తి రంగం, సరఫరా గొలుసు దెబ్బతినటం వల్ల పెరుగుతున్న వస్తువుల ధరలు తారా స్థాయిలకు చేరుకుంటున్న రిటైల్ ద్రవ్యోల్బణం. అనేక దేశాల్లో పాటిస్తున్న వాణిజ్య రక్షణ విధానాలు. తైవాన్ విషయంలో చైనా, అమెరికాల మధ్య జరుగుతున్న కోల్ట్ వార్ మాంద్యాన్ని పెంచే ప్రమాదముంది.
ముగింపు :
ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ ద్రవ్యనిది రెండూ అంతర్జాతీయ ఆర్థిక వృద్ది రేటును తగ్గించాయని వాణిజ్యాభివృద్ధికి సంబంధించిన సంకేతాలు ఏమీ బాలేవు. ఒకే సమయంలో ఇన్ని సమస్యలు, సంక్షోభాలు ప్రపంచ దేశాలను చుట్టుముట్టడంతో సాధారణ స్థితిలో వాణిజ్య కార్యకలాపాలు ఇకమీదట సాగే అవకాశం లేదు. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని డబ్య్లూటివో చీఫ్ అన్నారు. వడ్డీ రేట్ల పెంపు తప్ప సెంట్రల్ బ్యాంకులకు ఇతర మార్గాలు లేవు. ఇదే క్రమంలో ఆహార భద్రత ప్రపంచానికి పెద్ద సవాలుగా మారనుంది. ఈ క్రమంలో ఉద్యోగులను తొలగించడం, లే ఆఫ్‌లు ప్రకటించడం వంటివి చేస్తుంటారు. ప్రజల ఆదాయాలు తగ్గిపోవడంతో పాటు నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇది ఉద్యోగ భద్రతపై ప్రభావం చూపుతుంది.
ద్రవ్యోల్బణం డబ్బు విలువను తగ్గిస్తుంది. ద్రవ్యోల్బణ నియంత్రణకు రిజర్వు బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతాయి. ద్రవ్యోల్బణంతో సమాజంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పర్మినెంటు కార్మికులు, పాక్షికంగా ఉపాధి పొందుతున్న కార్మికులు, పనులు దొరకకుండా ఉన్నవారు, ఎవరికైనా ద్రవ్యోల్బణం దుర్బరమే. ద్రవ్యోల్బణం రెండు రకాలు. ఒకటి ఉత్పత్తి ఖర్చులు పెరిగినందువల్ల ఏర్పడేది. రెండోది కీలకమైన రంగాల్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో సాగించనప్పుడు సరుకుల డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. డిమాండు అధికమైనందువల్ల ద్రవ్యోల్బణం ఏర్పడిన సందర్భాలలో శ్రామికుల వేతనాలను పెరిగిన ధరల కనుగుణంగా పెంచరు. ఫలితంగా కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. మార్కెటు మందగిస్తుంది. అందువల్ల పెట్టుబడిదారీ వ్యవస్థలో ‘ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసే విధానం’ అంటే కార్మికుల నిజ వేతనాలను కుదించడమే అని అర్థం.