దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులను పెద్దపెద్ద కంపెనీలు నిలువునా ముంచేస్తున్నాయి. మొండిబకాయిలు లేదా నిరర్థక ఆస్తులు (నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్స్‌/ఎన్‌పిఎ).. పేర్లు ఏవైనా, లాభపడుతున్నది ఎగవేత కంపెనీలు.. నష్టపోతున్నది ప్రత్యక్షంగా బ్యాంకులు, పరోక్షంగా ప్రజలు. ఘరానా కంపెనీలు బ్యాంకులను ముంచకపోతే, ఈ బ్యాంకుల లాభాలు మరింతగా పెరిగి ఉండేవి. పెద్దపెద్ద కార్పొరేట్‌ కంపెనీలు రుణాలను ఎగవేయడమే బ్యాంకులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ప్రభుత్వం దర్జాగా మొండిబాకీలను రద్దు చేస్తోంది. ఇలాంటి రుణాలను రద్దు చేయడం కంటే, వసూలు చేయాల్సిన అవసరం ఉందని ఎఐబిఇఎ చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోకపోగా, మరింతగా రాయితీలను కల్పిస్తున్నది. ఎన్‌పిఎల పేరుతో రుణాల ఎగవేతను ప్రోత్సహించడమే జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ బ్యాంకులపై ప్రైవేటీకరణ కత్తితో విరుచుకుపడుతున్న బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలు మరో 10 నెలల్లో ఎదుర్కోబోతున్నప్పటికీ తన ప్రైవేటీకరణ ఎజెండా నుంచి ‘తగ్గేదేలే’ అంటోంది. ‘బ్యాంకింగ్‌ రంగంలో మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నాం’ అంటూ ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనతో మరోవిడత పబ్లిక్‌ రంగ బ్యాంకులను విలీనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అర్థం అవుతుంది. 2019లో 10 పబ్లిక్‌ రంగ బ్యాంకులను విలీన ప్రక్రియతో 4కు కుదించిన కేంద్రం.. మరో 12 చిన్న ప్రభుత్వరంగ బ్యాంకులను విలీన ప్రక్రియ ద్వారా 4కు కుదించడానికి పావులు కదుపుతోంది. నిజానికి 2021లోనే నీతిఆయోగ్‌ చేసిన సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వం ‘బ్యాంకింగ్‌ చట్టాలు (సవరణ) బిల్లు- 2021’ను రూపొందించింది గానీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టలేదు.

కేంద్ర ప్రభుత్వ ఆలోచనలను పసిగట్టిన బ్యాంకు ఉద్యోగ సంఘాలు ‘బ్యాంక్‌ బచావో.. దేశ్‌ బచావో’ అనే నినాదంతో ఆందోళన చేయడానికి సమాయత్తం అవుతున్నాయి. నిజానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ అంశం బ్యాంకు ఉద్యోగులకు మాత్రమే పరిమితం అయినది కాదు. ఇది యావత్‌ దేశ ప్రజలకు సంబంధించిన అంశం. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఐదున్నర దశాబ్దాలుగా వెన్నెముకగా నిలుస్తున్నాయి. దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు స్థిరమైన వృద్ధి సాధించడంలో ప్రభుత్వరంగ బ్యాంకులే కీలకంగా ఉన్నాయి. 60 శాతం జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగానికి, 20 కోట్ల మంది ఆధారపడిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (యంఎస్‌యంఇ) పరిశ్రమలకు తక్కువ వడ్డీపై రుణాలందించి వాటి వ్యాపార కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించడానికి దోహదం చేస్తున్నవి పిఎస్‌బిలే. అదేవిధంగా, గత రెండు దశాబ్ధాలకు పైగా దేశంలో విస్తరించిన మహిళల స్వయం సహాయక సంఘాలకు వెన్నుదన్నుగా నిలిచింది కూడా ప్రభుత్వరంగ బ్యాంకులే.

1969లో బ్యాంకులు జాతీయం అయ్యేనాటికి గ్రామీణ ప్రాంతాలలో రుణవితరణ కేవలం రూ.115 కోట్లు కాగా, జాతీయం అయ్యాక కేవలం ఒక దశాబ్ద కాలం (1979) నాటికే రూ.3,000 కోట్లకు చేరుకున్నట్లు ఆర్‌బిఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా, వ్యవసాయ రుణాలు అదే కాలంలో రూ.67 కోట్ల నుండి రూ.2,800 కోట్లకు చేరింది.  ప్రస్తుతం జాతీయ బ్యాంకులు అందిస్తున్న వ్యవసాయ రుణాలు రూ.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రాధాన్యత రంగాలలో మొదటిది వ్యవసాయరంగమే. రిజర్వ్‌ బ్యాంకు నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ రంగ బ్యాంకులు అందించే మొత్తం రుణవితరణలో 40 శాతం ప్రాధాన్యత రంగాలకు అందించాలి. అంతేకాదు.. పిఎస్‌బిలు చేసే వ్యవసాయ రుణవితరణలో తప్పనిసరిగా చిన్న, సన్నకారు రైతాంగానికి 8 శాతం మేర రుణాలు అందించాలి. దేశ ఆర్థికాభివృద్ధిలో జాతీయ బ్యాంకులు పోషిస్తున్న పాత్ర ఏమిటో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా, ప్రభుత్వరంగ బ్యాంకులపై చట్టపరంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, ఆర్‌బిఐలు అజమాయిషీ, నియంత్రణ గలిగి ఉంటాయి. వాటి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటాయి. పైగా, డిపాజిట్ల రక్షణ విషయంలో సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిటీ (సివిసి), సిబిఐలు కూడా అవసరమైన సందర్భాలలో జోక్యం చేసుకొనే అవకాశం ఉంది.

1947 ఆగష్టులో బ్రిటీష్‌ వలస పాలకుల నుండి భారత బడా బూర్జువా వర్గానికి అధికార బదిలీ జరిగాక 1955లో ఇంపీరియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా రూపాంతరం చెందింది. ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1969లో తొలుత 14 బ్యాంకుల జాతీయీకరణ జరిగింది. అధికార బదిలీ జరిగిన ఏడాది తర్వాత భారత రిజర్వు బ్యాంకును జాతీయం చేశారు. కాగా, 1980లో మరో 6 బ్యాంకుల్ని జాతీయం చేశారు. జాతీయ బ్యాంకులకు సామాజిక బాధ్యత ఉండటం వల్ల సంక్షేమ రాజ్యం భావనతో రాజ్యాంగం ఏర్పరిచిన లక్ష్యాల మేరకు సామాన్యులకు సైతం సేవలు అందిస్తున్నాయి. అయితే, 1991లో దేశంలో ‘సంస్కరణలు, ప్రపంచీకరణ ఆర్థిక విధానాలు’ మొదలయ్యాక.. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో, ప్రభుత్వ రంగ బ్యాంకులలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ మొదలయింది.

ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వరంగ బ్యాంకుల తాజా జాబితాను సిద్ధం చేసేందుకు ప్రభుత్వం మే రెండవ వారంలో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఒక సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. ప్రభుత్వరంగ బ్యాంకులలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ చాలాకాలం క్రితమే మొదలయింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల బోర్డులలో రాజకీయ నాయకులకు స్థానం కల్పించడం ఎక్కువయ్యాక, వారి ప్రమేయంతో పేరు, ఊరు లేని సంస్థలకు భారీగా రుణాలందించడం కూడా ఎక్కువైంది. కావాలని బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే జాఢ్యం దేశంలో పెరిగిపోయింది. ఫలితంగా ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తులు దాదాపు 12 శాతం మేరకు చేరుకొన్నాయి. అయితే, వాటిని సమర్ధవంతంగా రికవరీ చేయకుండా ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరించడం ఏకైక మార్గంగా పరిగణించడం కేంద్రంలోని ప్రభుత్వాలకు అలవాటైంది. ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణబాట పట్టించడం వల్ల ఒనగూరే లాభాలు చాలా స్వల్పం.

కార్పొరేట్లకు రెడ్‌కార్పెట్‌ :

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా ఎగవేసే బడామోసగాళ్ళతో రాజీపరిష్కారాలు చేసుకోవాలని రిజర్వు బ్యాంకు ప్రకటించడంతో బ్యాంకు ఉద్యోగ సంఘాలు విస్తుపోయాయి. ఈ నోటిఫికేషన్‌ విడుదల చేయవద్దని, వెనక్కు తీసుకోవాలని ఎఐబిఇఎ (అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం), ఎఐబిఓఎ (అఖిల భారత బ్యాంకు ఆఫీసర్ల సంఘం) వంటి అతిపెద్ద సంఘాలు ఐబిఎ, రిజర్వు బ్యాంకులకు విజ్ఞప్తులు చేశాయి. ఈ నోటిఫికేషన్‌ విడుదల చేయడమంటే బ్యాంకు మోసగాళ్ళకు బహుపరాక్‌ పలకడమేనని హెచ్చరించాయి. చరిత్రలో ఇది డిపాజిట్‌దార్లు, ఖాతాదారులను అవమానించిన అత్యంత అమర్యాదకర చర్యగా మిగిలిపోతుందని బ్యాంకు ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. బ్యాంకులు ఎగవేతదార్లముందు మోకరిల్లడంతో సమానం అని తీవ్రంగా ఖండిరచారు. రిజర్వుబ్యాంకు అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవలసి వచ్చింది? రిజర్వుబ్యాంకుకు రాజ్యాంగంలో స్వయంప్రతిపత్తి ఉన్నప్పటికీ తొమ్మిదేళ్ళుగా దాని స్వతంత్రతకు తీవ్ర విఘాతం కలిగింది.

లక్షల కోట్లు ప్రజాధనాన్ని పిప్పరమెంటు బిళ్ళల్లా చప్పరించేందుకు ‘రాజీ’ పరిష్కారం’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎగవేతదార్లకు ఎర్రతివాచీ పరిచి స్వాగతం పలుకుతోంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారులతో వన్‌-టైమ్‌-సెటిల్‌మెంట్‌ (ఒటిఎస్‌)లోకి ప్రవేశించడానికి బ్యాంకులను ఆర్‌బిఐ జారీ చేసిన సర్క్యులర్‌ను అందరూ వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నిజమైన (రైతులు) రుణగ్రహీతలు, నిజాయితీగా తిరిగి చెల్లించే వారిమధ్య తేడాను గుర్తించడంలో పాలకులు విఫలమయ్యారు. నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు 2013-14లో బ్యాంకుల్లో మోసాలు, రుణాల ఎగవేతల సంఖ్య 4,306గా ఉండగా, 2021-22 నాటికి వాటిసంఖ్య 9,103కు చేరుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లోనే 5,406 బ్యాంకింగ్‌ మోసాలు దేశంలో నమోదయ్యాయి. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో ఆర్థికమంత్రి చెప్పిన ప్రకారం, గడచిన ఆరేళ్ళలో 12 లక్షల కోట్ల రూపాయలను బ్యాంకింగ్‌ వ్యవస్థ నుండి మోసగాళ్ళు దోచేశారు. రిజర్వుబ్యాంకు తాజా సమాచారం ప్రకారం రుణమాఫీల ద్వారా మొండి బకాయిలు ప్రస్తుతానికి 13 లక్షల 22 వేల 309 కోట్ల రూపాయలుగా తేలాయి. ఇప్పుడు జూన్‌ 8వ తేదీ (2023) సర్కులర్‌లో మోసగాళ్ళతో రాజీపడమని బ్యాంకులకు రిజర్వుబ్యాంకు మళ్ళీ ఆదేశాలు ఇచ్చింది. బ్యాంకింగ్‌ వ్యవస్థను లాభాల్లో నడిపించడం అంటే  ఇలా రాజీపడి మోసగాళ్ళకు మర్యాదలు చేయడమేనా?

బిజెపి ప్రభుత్వం చెబుతున్న ఆర్థికవృద్ధి, ఆర్థిక సమానత్వం, పేదల ఉద్ధరణ ఎన్నికలవేళ ఈ సర్క్యులర్‌తో పచ్చిబూటకమని తేలిపోయింది. విజయ్‌మాల్యా (7,500 కోట్లు), మెహుల్‌ఛోక్సీ (7,080 కోట్లు), జతిన్‌ మెహతా (6,580 కోట్లు), లలిత్‌ మోడీ (1,700 కోట్లు), నీరవ్‌ మోడీ (6,4978 కోట్లు), నితిన్‌-చేతన్‌ సందేశరా (5,383 కోట్లు) రితేశ్‌జైన్‌ (1,421 కోట్లు), రాజీవ్‌గోయల్‌-అల్కాగోయల్‌ (778 కోట్లు) సహా 72 మంది మోసగాళ్ళు వేలకోట్లు ఎగవేశారు. వీరంతా కేవలం ఫ్యూజిటివ్‌ ఎకనామిక్‌ అఫెండర్స్‌ (విదేశాలల్లో తలదాచుకున్న ఆర్థిక నేరగాళ్ళు) మాత్రమే. ఇక బ్యాంకులకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ప్రజాధనం దండుకుని ఐపి పెట్టినవారికి విడిగా ప్రత్యేక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింది. పెద్ద పెద్ద షిప్పింగ్‌ కంపెనీలు, ఎగుమతి కంపెనీలు, రియల్‌ఎస్టేట్‌ కంపెనీలు వ్యాపార ప్రయోజనం పేరుతో రుణాలను హవాలా మార్గంలో వ్యక్తిగత అవసరాలకు మళ్ళించాయి. ఇలాంటి ఉద్దేశపూర్వక మోసగాళ్ళను పిలిచి కూర్చోబెట్టి బ్రతిమాలి అయినకాడికి ఎంతోకొంత వారినుండి తీసుకుని వదిలిపెట్టేయాలన్నదే రిజర్వుబ్యాంకు రాజీపరిష్కార సూత్రం. వారికి నో డ్యూ సర్టిఫికెట్లు (అప్పు తీరిందనే ధృవీకరణ) ఇచ్చి సగౌరవంగా సాగనంపాలన్నదే ఈ ప్రతిపాదన! ఎంతటి నయవంచన! ఇది పట్టపగలే బాహాటంగా బ్యాంకులను దోచిపెట్టడం కాదా!

బ్యాంకులపై సంస్కరణల ప్రభావం :

దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం నియంత్రణ ఉన్నకాలంలో అంటే ప్రపంచీకరణ విధానాలను అమలుచేయడానికి ముందు కాలంలో, బ్యాంకులు స్వల్పకాలిక రుణాలపై ప్రధానంగా దృష్టి సారించాయి. వ్యాపారంలో, పరిశ్రమల్లో సరుకులను సమీకరించుకోడానికి ప్రధానంగా రుణాలు ఇచ్చాయి. ఇక స్థిర పెట్టుబడిని (యంత్రాలు, భవనాలు వగైరా) సమకూర్చుకోవడానికి, కావలసిన దీర్ఘకాలిక రుణాలను అందించడానికి వేరే ప్రత్యేకమైన ఆర్థిక సంస్థలను ఏర్పాటు చేశారు. ఆ సంస్థలకు రిజర్వు బ్యాంకు వంటి ప్రభుత్వ వనరుల నుండి నిధులు అందించారు. ఆ రుణాలకు వడ్డీలు బ్యాంకులు సాధారణంగా వసూలుచేసే వడ్డీరేటు కన్నా తక్కువగా ఉండేవి. చాలా సందర్భాల్లో అప్పటి ధరల పెరుగుదల వేగంకన్నా తక్కువగా వడ్డీ రేటు ఉండేది (నెగెటివ్‌ రేటు అంటాం). ఆ విధంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహం లభించేది. ప్రపంచీకరణ విధానాలు వచ్చాక ఇదంతా మారిపోయింది. ప్రత్యేకంగా పరిశ్రమలకు దీర్ఘకాలిక రుణాలను అందించే ఆర్థిక సంస్థల పాత స్వరూపం మారిపోయింది. ఐడిబిఐ వంటివి సాధారణ బ్యాంకుల మాదిరిగా తమ కార్యకలాపాలను మార్చుకున్నాయి. దీర్ఘకాలిక రుణాలు కావాలంటే పరిశ్రమలు ఇప్పుడు మార్కెట్‌ మీదే ఆధారపడాలి.

పెట్టుబడిదారులు ప్రభుత్వరంగ బ్యాంకుల మీదే ఎక్కువగా ఆధారపడడం పెరిగింది. దీర్ఘకాలిక రుణాలకోసం కూడా ప్రభుత్వరంగ బ్యాంకులనే ఆశ్రయించడం పెరిగింది. ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా భారీ రుణాలను ఇవ్వడం పెరిగింది. ముఖ్యంగా మౌలిక వసతుల ప్రాజెక్టుల (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) కోసం ఎక్కువ రుణాలను ఇచ్చాయి. ప్రభుత్వం కూడా ఆ విధంగా రుణాలను ఇవ్వాలన్న వత్తిడిని బ్యాంకులమీద ఎక్కువగా తెచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రభుత్వం చెప్పినట్లు వినాల్సిందే కనుక అవి కూడా తలగ్గాయి. దాని ఫలితంగా ఆ బ్యాంకుల ఆర్థిక పరిస్థితులు ప్రమాదంలో పడ్డాయి. బ్యాంకులకు డిపాజిట్లు ప్రధానంగా ప్రజల నుండి వస్తాయి. ఆ ప్రజలు ఏ క్షణాన్నైనా తమ డిపాజిట్లను వెనక్కి తీసేసుకోవచ్చు. అటువంటప్పుడు తమ వద్దనున్న డిపాజిట్లను బ్యాంకులు దీర్ఘకాలిక రుణాల నిమిత్తం ఇవ్వడం వలన (ఆ బ్యాంకులు తీసుకుంటున్న డిపాజిట్లు స్వల్పకాలికంగా ఇచ్చే రుణాలు దీర్ఘకాలికంగా ఉంటున్నాయి) చేతిలో డబ్బులేని పరిస్థితి (లిక్విడిటీ లేకపోవడం) ఏర్పడే ప్రమాదాన్ని ఆ బ్యాంకులు ఎదుర్కొంటున్నాయి. ఒకవేళ ఎక్కువమంది డిపాజిటర్లు తమ డిపాజిట్లను వెనక్కి తీసేసుకోవాలని గనుక నిర్ణయిస్తే ఆ బ్యాంకు మూతపడుతుంది.

అయితే ఆ చట్టాన్ని 1999లో రద్దు చేశారు. దాంతో మళ్ళీ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని చవిచూడవలసి వచ్చింది. ఐతే అదొక్కటే సంక్షోభానికి కారణం అని మాత్రం చెప్పడం లేదు. ఏ రుణం వెనుక ఎంత రిస్క్‌ ఉందో అంచనా వేయడంలో చాలా తక్కువగా అంచనా వేశారు. దాంతో లేమాన్‌ బ్రదర్స్‌ వంటి పెట్టుబడుల బ్యాంక్‌ సైతం కుప్పకూలిపోయింది. దాంతోపాటు వాణిజ్య బ్యాంకులు దెబ్బతినిపోయాయి. ప్రభుత్వ నియంత్రణతో మార్కెట్లు నడుస్తున్న కాలంలో (ప్రపంచీకరణ విధానాలకు పూర్వకాలంలో) మాదిరిగా స్వల్పకాలిక రుణాలకు పరిమితం కాకుండా దీర్ఘకాల పెట్టుబడుల కోసం కూడా రుణాలను ఇవ్వడంతో ఈ వాణిజ్య బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకు పోయాయి. ఇప్పుడు భారతదేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా ప్రభుత్వం తెస్తున్న వత్తిడికి లోనై వ్యవహరిస్తున్నాయి. అవి ఇంకా ప్రభుత్వరంగంలో కొనసాగుతున్నందువలన ప్రజలు వాటిమీద నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు గనుక ఆ బ్యాంకులు ప్రైవేటుపరం అయితే మాత్రం అగ్నిపర్వతం బద్ధలుకాక మానదు. దానివలన డిపాజిటర్లు చాలా నష్టపోతారు.

బ్యాంకులను ప్రైవేటీకరిస్తే ఏమవుతోంది? :

ప్రభుత్వరంగ బ్యాంకులను కొన్నిటినైనా ప్రైవేటీకరించాలని ప్రభుత్వం పథకాలు వేస్తోంది. అదే గనుక జరిగితే తయారీ రంగానికి ఇంతవరకూ అందిస్తున్న బ్యాంకు రుణాలు ఇక ముందు స్పెక్యులేషన్‌ వైపు మళ్ళుతాయి. రైతులకు రుణాలు ఇచ్చే బదులు బడా వ్యాపారులకు ఇస్తారు (దీంతో రైతు వ్యవసాయం చితికిపోయి, ఆహార భద్రత కరువౌతుంది. ఉపాధి దొరకకుండా పోతుంది.) దేశీయ అవసరాలను పట్టించుకోకుండా విదేశాలకు పెట్టుబడి తరలిపోతుంది. ఈ అభ్యంతరాలన్నీ అందరికీ తెలిసినవే. అందరూ చర్చించినవే. కాని ఈ ప్రభుత్వానికి దేశం బాగుకండాలన్న ధ్యాస లేదు. ఎంతసేపూ దేశీయ, విదేశీయ బడా కార్పొరేట్లను ఏవిధంగా సంతృప్తిపరచాలా అన్నదే దాని యావ అంతా. అయితే, ఈ అభ్యంతరాలకు తోడు మరో తీవ్ర ప్రమాదం పొంచి ఉంది. దేశం దానిని గనుక విస్మరిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి.

ప్రైవేటీకరణ తర్వాత బ్యాంకులు తమ ప్రాధాన్యతా రంగాల్ని తామే ఎంచుకొంటాయి. గ్రామీణ ప్రాంతాలలో కార్యకలాపాలు సాగించే బ్రాంచీలను ఎత్తివేస్తే ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదు. రాజ్యాంగం ప్రవచించిన ‘సంక్షేమ రాజ్యస్థాపన అన్నది ప్రైవేటు బ్యాంకులకు పట్టదు. వాటి లక్ష్యం కేవలం లాభార్జనే. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగ నియామకాల్లో అమలు జరిగే రిజర్వేషన్లను ప్రైవేటు బ్యాంకులు అమలు చేయవు. దానివల్ల ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు అవకాశాలు లేకుండా పోయి, సామాజిక న్యాయం జరగాలన్న రాజ్యాంగ లక్ష్యం దెబ్బతింటుంది.

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం ప్రైవేటు బ్యాంకులకు చివరి ప్రాధాన్యతగా మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సామాజిక బాధ్యతగా రుణాలందిస్తున్న పిఎస్‌బిలు ప్రైవేటీకరణ అనంతరం ఆ బాధ్యత నుంచి తప్పుకొంటే కలిగే నష్టం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. బ్యాంకుల జాతీయీకరణకు ముందునాటి పరిస్థితుల్ని దేశంలో పునరావృతం చేయడానికి ఎన్‌డిఎ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. అదే జరిగితే దేశంలో ఆర్థిక అసమానతలు మరింత పెరిగిపోతాయి. అర్బన్‌-రూరల్‌ డివైడ్‌ అన్నది పెరిగిపోతుంది. బ్యాంకు ఉద్యోగాలలో, బ్యాంకుల రుణాలు పొందడంలో బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. క్షుప్తంగా చెప్పాలంటే.. భారత రాజ్యాంగం ప్రభుత్వాలకు నిర్దేశించిన సామాజిక న్యాయానికి అన్యాయం జరుగుతుంది.

ముగింపు :

బ్యాంకులను ప్రైవేటీకరించినా ఎటువంటి సంక్షోభమూ తలెత్తదని కొందరు భావించవచ్చు. కాని ప్రభుత్వమే బ్యాంకుకు యజమానిగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మీద తీసుకురాగలిగినంత వత్తిడి ఆ బ్యాంకు వేరే యాజమాన్యం కిందకు మారిపోయాక తీసుకురావడం సాధ్యం కాదు. ప్రభుత్వరంగ సంస్థలమీద అనుచితంగా వత్తిడి తెచ్చి వాటిని పారుబకాయిలపాలు చేస్తున్నదీ ఈ ప్రభుత్వమే. ఇప్పుడు ఆ బ్యాంకును ప్రయివేటీకరించి తమ చేతులు దులుపుకోవాలని చూస్తున్నదీ ఆ ప్రభుత్వమే. దీనితో ప్రజలకు బ్యాంకింగ్‌ వ్యవస్థ మీదే విశ్వాసం సన్నగిల్లుతుంది. దీంతో వాళ్లు బ్యాంకుల్లో దాచుకోవడం మానేసి నగదు రూపంలో నిల్వ ఉంచుకోడానికే మొగ్గుచూపుతారు. దానివలన దేశాభివృద్ధికి అవసరమైన పెట్టుబడుల సమీకరణ దెబ్బతినిపోయి అభివృద్ధి చాలాకాలం పాటు స్తంభించిపోతుంది. మోడీ సర్కార్‌ ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేయకుండా, ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటుపరం చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. ప్రభుత్వం అనుకున్నట్టు ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రైవేటు చేతుల్లోకి వెళితే, గ్రామీణ బ్యాంకింగ్‌ వ్యవస్థ తీవ్రంగా నష్టపోతుంది. ప్రైవేటు బ్యాంకుల దృష్టి ప్రజా సంక్షేమం కంటే లాభాలపైనే ఉంటుందనేది కాదనలేని నిజం. క్రమంగా కేవలం ధనవంతులు మాత్రమే బ్యాంకుల్లో ఖాతాలు తెరవగలుగుతారు. ఒకవేళ బ్యాంకులు దివాళా తీస్తే, వాటిని ధనవంతులే కొనుక్కుంటారు. ప్రజా సంక్షేమానికి, గ్రామీణ వికాసానికి విఘాతం కలుగుతుంది. అందువలన ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి.

Leave a Reply