ఈ విషాద సమయం ఇలా వస్తుందనుకోలేదు. 90 సంవత్సరాల వయసులో నాన్న సెప్టెంబర్ 30, 2022న మనల్ని వదిలి వెళ్లిపోయాడునే దుఃఖకరమైన సమాచారాన్ని పేపర్లో చూశాను. నేను మిమ్మల్ని విడిచి విప్లవ పథంలో అడుగు పెట్టాక నాన్న మరణ వార్తతో నాకు నాలుగు దశాబ్దాల కిందటి విషయాలన్నీ గుర్తకు వచ్చాయి. నీతో, నాన్నతో, న కుటుంబసభ్యులతో, ఊళ్లో వాళ్లతో గడిపిన రోజులన్నీ నా మనసులోకి వచ్చాయి. నేను విప్లవంలోకి రావడానికి ముందు మీ అందరి ప్రేమతో, వాత్సల్యంతో జీవించడం వల్లే ఇప్పుడు ఇలా నేను ఎంచుకున్న మార్గంలో నడవగలుగుతున్నానని అనిపించినప్పుడు మీ అందరి మీదా మరింత గౌరవం కలుగుతోంది. ముఖ్యంగా నాన్న నా కోసం, నా తోబుట్టువుల కోసం, మన ఇంటి కోసం పడిన ఎంతో కష్టపడ్డాడు. ఈ దేశంలో సగటు మానవులందరూ అలా జీవిస్తున్నవారే. అందులోని బాధ్యత, ప్రేమ, శ్రమ చేసే సుగుణం చాలా గొప్పవి.
చిన్నప్పుడు మా తాత పుల్లయ్య, నాయనమ్మ పెద్దమ్మ ఒడిలో ఆటలాడుకున్న రోజులు నా బాల్యమంత సజీవమైనవి. నాన్న మోటగొట్టి, పొలం, చెలక దున్ని, పెంటకొట్టి విత్తనాలు వేసి పంటలు పండిరచేవాడు కదా. ఆయన చేసిన కష్టమంతా నీదే. మీ ఇద్దరు కడుబీదతనంతో మమ్మల్ని సాదడానికి అప్పులు చేసి ఎన్ని కష్టాలు పడ్డారో కదా. అంత శ్రమ చేసినా ఆరోజుల్లో మన కుటుంబమంతా పస్తులు వున్న రోజులూ ఉన్నాయి. నాకు అవన్నీ చెరగని జ్ఞాపకాలే. ఈ దేశంలో మన లాంటి ఎన్నో కుటుంబాలు అట్లా బతుకుతున్నవే. మీరు కడుపు కట్టుకొని మమ్మల్ని సాదిన తీరు తల్లిదండ్రులందూ ఎవరైనా, ఎక్కడైనా ఇట్లాగే ఉంటారని నాకు ఆ తర్వాత చాలా సార్లు అనుభవంలోకి వచ్చింది. అంత కష్టంలో కూడా మీకు భవిష్యత్‌పై గొప్ప ఆశ ఉండేది. బహుశా మన సొంత జీవితంలో మీరు చూసిన ఆశే నాకు మానవాళి మీద, ఈ దేశ చరిత్ర మీద ఆశావాదంగా మారింది కావచ్చు. అందుకే నీవూ, నాన్నా ఆ రోజుల్లో చెప్పిన మాటలు నేనెన్నటికీ మరువలేను.
ఇంటి పెద్దకొడుకుగా నాపై చూపిన అమితమైన ప్రేమ, వాత్సల్యం, నమ్మకం నన్ను నా విప్లవ పంథాలో సదా రాటుతేలుస్తున్నాయి. ఆ రోజుల్లో నేను చదువు కోడానికి మన ఊరు నుండి నేను నల్లగొండ టౌన్‌కు వెళ్లడానికి బస్ కిరాయికి కూడా డబ్బులు లేకపోతే నీవు రెండు రోజులు నాట్లకూలికి పొయ్యి తెచ్చి ఇచ్చిన డబ్బులతో నేను బయల్దేరాను. నేను పై చదువులు చదివి ఏదైనా కొలువు చేసి కుటుంబాన్ని సాదుతానని మీరు అందరు అమ్మనాన్నల్లాగే అనుకున్నారు. కానీ, నేను విప్లవ మార్గం ఎంచుకున్నాను. అయితే మీరు నేను ఆ బాధ్యతల నుండి తప్పుకోలేదని, సరైన దారిలోనే ఉన్నానని మీరు ఆ తర్వాతైనా అర్థం చేసుకున్నారని తెలిసి చాలా సంతోషించాను.
నేను ప్రాథమిక చదువులు చదువుతున్న రోజుల్లో తాత పుల్లయ్య తాను నలభైయవ దశకంలో నల్లగొండ జిల్లలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న అనుభవాలను చెప్పేవాడు. ఆరోజుల్లో గ్రామాల్లో కొనసాగుతున్న దొరల దౌర్జన్యాలను, దోపిడి పీడనలను, వెట్టిచాకిరీని ఆయన కళ్ళకు కట్టినట్టుగా చెప్పేవాడు కదా. ఆనాడు కమ్యూనిస్టు గెరిల్లాలను అణచడానికి నైజాం పోలీసు బలగాలు, రజాకార్ల దాడులు, నెహ్రూ, పటేల్ నాయకత్వంలోని భారత సైన్యం నల్లగొండ జిల్లాను ఎట్లా చుట్టుముట్టినవో చెప్పేవాడు. గ్రామాలలో పేదల ఇండ్ల దహనం, లూటీలు, దౌర్జన్యాలు, మహిళలపై కొనసాగించిన అత్యాచారాలె ఒక్కొక్క ఘటనను వివరంగా చెప్పేవాడు.
మన పల్లెల్లో తాతలాగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న అనుభవం ఉన్న పెద్దలు ఎంతో మంది ఉన్నారని నాకు కాస్త పెద్దయ్యాక తెలిసింది. అట్లాగే ఆనాటి విప్లవ వారసత్వాన్ని, వేలాది మంది అమరుల త్యాగాలనూ ఎత్తి పడుతూ నక్సల్బరి, శ్రీకాకుళ పోరాట యోధులు కొనసాగుతున్నారని తెలుసుకున్నాను. అంతగా తాత తన పోరాట అనుభవాలతో నా మీద చెరగని ముద్ర వేశాడు.
ఆయన మాటల వల్ల నా యవ్వన కాలంలో నేను సమాజంలో జరుగుతున్న దోపిడి, అసమానతల గరించి సీరియస్‌గా ఆలోచించే అవకాశం కలిగింది. విప్లవ రాజకీయాలతో ప్రభావితమై రాడికల్ విద్యార్థి సంఘంలో సభ్యుడిగా చేరి జిల్లా కమిటీలో వుంటు పనిచేశాను. 1981లో కాలేజీలో డిగ్రీ చదువుతూ కాలేజీ చదువులను మధ్యలో వదిలేసి, మనలాంటి పేద ప్రజల బతుకులు బాగుపడాలని, కోట్లాది పేద రైతులను, మీ లాంటి తల్లి దండ్రులను, ప్రజలను దోపిడి పీడనల నుండి, మహిళలను పితృస్వామ్యం అణిచివేతల నుండి అత్యాచారాల నుండి, విముక్తి చెయ్యాలనే ఒక న్యాయమైన ఆలోచనతో విప్లవోద్యమంలోకి వెళ్లాను. నీవూ నాన్న అందించిన నిజాయితీ, శ్రమ చేసే తత్వం, తాత అందించిన పోరాట అనుభవాలు నన్ను ఇప్పటికీ నడిపిస్తున్నాయి. మీరు నేర్పిన మాననీయ విలువలు సామాజిక విలువలుగా, విప్లవ ఆదర్శాలుగా, విప్లవాచరణగా నాలో మారాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. స్వార్థం లేకుండా జీవించాలనే విలువ నా విప్లవ ప్రస్థానాన్ని నిత్యం గట్టిబరుస్తున్నాయి.
ఈ నలభై ఏళ్లలో పోలీసు బలగాలు అనేకసార్లు మన యింటిపై దాడులు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు నేను తెలుసుకున్నాను. ముఖ్యంగా నాన్నను చండూర్ పోలీసు స్టేషన్ తీసుకెళ్లి నా ఆచూకి కోసం అవమానపరుస్తూ హింసించారు. నన్ను లొంగిపొమ్మని పత్రికా ముఖంగా ప్రకటించాలని నాన్నను ఎన్నోసార్లు వేధించినప్పటికీ ఆయన తలవంచలేదు. ఒక విషయంలో స్పష్టత ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా దాని కోసం నిలబడి ఉండాలనే విలువను ఆయన తన సొంత జీవితంలో పాటించాడు. నా వల్ల వచ్చిన నిర్బంధాన్ని తట్టుకొనే విషయంలోనూ కొనసాగించాడు. కార్మికులు, రైతులు, దళితుల, మహిళల విముక్తి కోసం విప్లవకారునిగా నా కొడుకు పనిచెయ్యడాన్ని గర్వంగా భావిస్తున్నానని ధైర్యంగా చెప్పేవాడని తెలుసుకొని నేను ఉప్పొంగిపోయాను. మీవంటి తల్లిదండ్రులు ఈ దేశంలో వేల, లక్షల మంది ఉన్నారు. దేశవ్యాపితంగా విప్లవోద్యమం పురోగమించడంలో వీలాంటి తల్లిదండ్రుల ఆకాంక్షలు కూడా భాగం. అలాంటి ఆలోచనలతోనే నాన్న తన తుది శ్వాస వదిలి ఉంటాడని నేను ఊహించగలను.
ఈ రోజు అనేక మంది విప్లవకారులు తమ ప్రియమైన తల్లిదండ్రులను తోడబుట్టిన వాళ్లను తలచుకోవడమే తప్ప కలుసుకోలేని విధంగా దోపిడీ రాజ్యం నిర్బంధం విధించింది. విప్లవకారులను హత్య చెయ్యడానికి తహతహలాడుతూ తలలకే కాదు మేం ధరించిన ఆయుధాలకూ బహుమతులు ప్రకటించింది. అనేక కుట్రలు, కుహకాలతో దేశవ్యాప్తంగా ఆల్ఔట్ వార్ కొనసాగిస్తున్నది. బీహార్-జార్ఖండ్ మొదలుకొని దండకారణ్యం, ఒడిశా, తెలంగాణ వరకూ దాదాపు 7 లక్షలపోలీసు, కమాండోలు, అర్థ సైనిక బలగాలను మోహరించి కార్పెట్ సెక్యూరిటీని విస్తరింప చేస్తు దేశవ్యాప్తంగా విప్లవోద్యమాన్ని 2022 వరకు సమూలంగా నిర్మూలించాలని ఆపరేషన్ సమాధాన్ పేరుతో బహుముఖ దాడులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. పట్టణ ప్రాంతాల్లో ప్రజాస్వామిక, అభ్యుదయ, విప్లవ ప్రజాసంఘాల నాయకులపై మేధావులపై, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అణచివేత ప్రయోగిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వంతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో మిలాఖత్ అయి అర్బన్ నక్సలైట్ల పేరుతో వాళ్లను నిర్బంధిస్తున్నాయి. దేశీయ, విదేశీ కార్పొరేట్ సంస్థల దోపిడీ కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఈ విధానాలను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న ఆదివాసుల మీద అర్ధ సైనిక బలగాలను, పోలీసు కమాండోలు యుద్ధం చేస్తున్నాయి. డ్రోన్ల ద్వారా బాంబులను గుమ్మరిస్తున్నారు. ఈ ఫాసిస్టు నిర్వంధం మూలంగా రక్తసంబంధీకులు మరణించిన సందర్భంలో కూడా మేం మిమ్మల్ని కలవలేదకపోతున్నాం. విప్లవకారులు అమరులైనప్పుడూ, వాళ్ల రక్త సంబంధీకులు చనిపోయినప్పుడూ ఎందరో ప్రజలు, ప్రజాసంఘాల సభ్యులు కలిసి అంతిమ వీడ్కోలు పలికే సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. నాన్నను కూడా అట్లే గౌరవంగా సాగనంపారని తెలిసి ఈ విషాదంలో కూడా సంతోషం కలిగింది. వాళ్లందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉంటాను..నీ బిడ్డ
పి. హనుమంతు
15 నవంబర్, 2022.