ప్లేటో కవిత్వాన్ని-కవులను వ్యతిరేకించేవాడని మనకు గ్రీకు సాహిత్యంతో కొద్దోగొప్పో పరిచయమున్నా తెలిసే ఉంటుంది. నిజానికి ప్లేటో గ్రీకు తాత్త్విక అభివృద్ధికి బీజాలు వేసాడని మనం చెప్పుకుంటాము. అయితే హెగెల్ వంటి ప్రముఖ తాత్త్వికుడు పారమనిడ్స్ అనే తాత్త్వికుడి   పారమార్ధిక చింతన తత్త్వం మాత్రమే తత్త్వశాస్త్రం అనే శాఖ అభివృద్ధికి మూలమైనదని వివరించారు. ఏమైనా పారమనిడ్స్   ఈ పారమార్ధిక చింతన   జడత్వ సారం అలాగే జెనో యొక్క గతితార్కిక ప్రయోగాన్ని ప్లేటో సమన్వయించి తన తత్త్వశాస్త్రపు పద్ధతిని అభివృద్ధి పరిచాడు(మరికొంత మంది తాత్త్వికుల తత్త్వాలని సైతం సమన్వయం చేసాడు). పారమనిడ్స్ గతిని-చలనాన్ని కేవలం భ్రమ అని ఈ విశ్వం అనాది-అనంతం అని వివరిస్తే, జేనో గతితార్కికాన్ని అనగా వాదం-ప్రతివాదం=సంవాదాన్ని ప్రయోగించడం కేవలం స్థిరత్వాన్ని చూపడానికేగానీ చలనాన్ని-గతిని సమర్ధించడానికి కాదని వ్యక్తపరిచారు. నిజానికి ప్లేటో పదార్ధాన్ని క్షణికమైనదిగా వ్యక్తపరిచాడు. అయితే ఈ క్షణికానికి అతీతంగా నిత్యశీలమైన భావాలని మూలముగా చెప్పుకొస్తారు. ఈ నిత్యశీలమైన భావాలను గ్రహించే క్రమం అనివార్యంగా విశేషము-సామాన్యమనే వర్గీకరణల ద్వారా జరుగుతుందని వెల్లడిస్తారు. 

ప్లేటో భౌతికమైన అంశాలు పరివర్తనశీలతను కలిగి ఉండ‌టంతో అవి వాస్తవ జ్ఞానంగా కాకుండా ఉంటాయని, కాబ‌ట్టి భౌతికాతీతమైన భావాలే నిత్యశీలమైన-అనంతమైనవని ఈ జ్ఞానం  మనకు హేతుజ్ఞానంగా విశేషం, సామాన్యమనే జ్ఞాణ సిద్ధాంత పద్ధతిలో సాగుతుందని, ఇవి ఇంద్రియాలు గ్రహించలేవని, ఈ ఇంద్రియ జ్ఞాన‌ కేవలం పరివర్తనశీలమైన అంశాలను గ్రహిస్తుందని ప్ర‌స్తావించారు. కాబ‌ట్టి  నిజ-వాస్తవ జ్ఞానం తెలుసుకోలేమని కావున భౌతికమైన పదార్ధం పరివర్తన చెంది నశించినా శాశ్వత భావాల సామాన్యం మాత్రం నశించవని ఈ భావాలే తిరిగితిరిగి శరీరం వహిస్తాయని అన్నారు.   కాబ‌ట్టి ప్లేటో ఇంద్రియ జ్ఞానం ద్వారా తెలుసుకునే పరివర్తనశీలమైన భౌతిక అంశాల వాస్తవికతను శంకిస్తూ నిజ-శాశ్వత జ్ఞానం భావాల సామాన్యాన్ని హేతుజ్ఞానం ద్వారా తెలుసుకుంటాం … కాబట్టి కవిత్వం అనేది ఇంద్రియ-పరివర్తనశీలమైన భౌతిక పదార్ధాల ప్రతిఫలనంగా భావించాడు. ఫలితంగా ప్లేటో కవిత్వం ద్వారా నిజ-శాశ్వత భావాల సామాన్య వాస్తవ జ్ఞానం తెలుసుకోజాలమనే సిద్ధాంతానికి వచ్చాడు. 

ప్లేటోను ఖండించిన అరిస్టాటిల్: 

అరిస్టాటిల్ ప్లేటో సామాన్య-విశేష పద్ధతలను సవిమర్శనాత్మక దృష్టితో విశ్లేషించారు. సామాన్యం అనేది విశేషంలోనే-విశేషం అనేది సామాన్యంగా వ్యక్తం అవుతుందని స్పష్టం చేసారు. ఈ రెండింటిని విడదీసి చూడలేమని విశేషంలోనే సామాన్యం గోచరమని అలాగే సామాన్యం విశేషంతోనే వ్యక్తం అవుతుందని కాబ‌ట్టి  సాహిత్యం లేదా కవిత్వం అనేవి అనుకరణ అని, మానవుని అనుకరణ ప్రతిఫలంగా చూడాలని, ఈ అనుకరణకు మూలాన్ని కేవలం ఆనందం-ఆహ్లాదాల లక్ష్యం ఫలితంగా రసానందంగా ప్రవచించారు.  

ముగింపు:

ఇకపోతే ప్లేటో వస్తుగత భావవాద తాత్త్వికతే కవిత్వంపై ద్వేషాన్నీ లేదా కవిత్వ నిర్లక్ష్యాన్ని కలిగించే విధంగా సాగడానికి మూలమైనది. ఈ వస్తుగత భావవాదానికి వ్యతిరేకంగా-కార్ల్ మార్క్స్ “ఫోయర్ బాఖ్ ఇంద్రియ కార్యకలాపాలని, ఆలోచనా కార్యకలాపాల నుండి భిన్న రూపంలో చూడాలని కోరుతున్నమాట నిజమే, కాని ఆయన మానవ కార్యకలాపాన్ని దానికదిగా వస్తుపరమైనదిగా చూడడు..” ఈవిధంగా మానవ కార్యకలాపంగా భావించే-సిద్ధాంతీకరించే శాస్త్రీయమైనవాదం మనకు స్పష్టంగా సాహిత్య కృషిలోని మానవుని ఇంద్రియ కార్యకలాపం-ఆలోచనా కార్యకలాపపు మానవ కార్యకలాప వస్తుగత తత్త్వాన్ని నొక్కి చెబుతుంది.  సామాజిక-ఆర్ధిక మూలాల నుండి యాజమాన్య-శ్రమ-పంపిణి సంబంధాల ప్రతిఫల సామాజిక ప్రత్యేక రూపపు భ్రమాత్మక ,  వాస్తవిక జ్ఞానాలని మన ముందు పెడుతుంది.

Leave a Reply