ఫాసిజాన్ని మౌలికంగా ఓడించే  పోరాటాలు నిర్మాణం కావలసే ఉన్నది. ఆ వెలితి దేశమంతా ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో కూడా  కనిపిస్తోంది. అయితే ఫాసిజాన్ని సమగ్రంగా అర్థం చేసుకొనే ప్రయత్నం మిగతా భాషల్లో కన్నా మన దగ్గరే  లోతుగా జరుగుతున్నదని నా అభిప్రాయం. ఇప్పటికీ ఇండియన్‌ ఫాసిజాన్ని మతతత్వమని, మతోన్మాదమని, మెజారిటేరియనిజమని, మత ఫాసిజమని అనే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ అవగాహనలు కూడా అవసరమే. ఫాసిజంలోని కొన్ని కోణాలను ఇవి వివరిస్తాయి.

అయితే మన దగ్గర జరుగుతున్న కృషికి ఒక ప్రత్యేకత ఉన్నది. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం అనే సూత్రీకరణను ఆర్థిక శక్తులతో కలిపి చూసే ఒరవడి తెలుగులో బలంగా ఉన్నది. ఈ రెంటినీ సమ తూకంలో చెప్పి వదిలేయకుండా  ఆవి ఎన్నెన్ని తలాల్లో కలిసి పని చేస్తున్నదీ కొందరు తెలుగు మేధావులు విశ్లేషిస్తున్నారు. సంఘ్ పరివార్‌ శక్తులు ప్రభుత్వంలోకి రావడం వెనుక మతతత్వం, బ్రాహ్మణీయ హిందుత్వ ఉన్నట్లే కాంప్రడార్‌ కేపిటల్‌ కూడా ఉన్నది. అది  నిత్య సంక్షోభాల మధ్యనే నానాటికీ మరింత  వికృతంగా,  అమానవీయంగా తయారవుతున్నది. దేశాన్ని వెల్లువలా చుట్టుముడుతున్న  కార్పొరేట్ల ప్రయోజనాల కోసం అధికారంలో ఉన్న పార్టీ  బరితెగించి పని చేస్తున్నది. ఈ మొత్తం ఫాసిస్టు  వ్యూహం తెలియకపోతే  సంఫ్‌ుపరివార్‌ దుర్మార్గాలు అర్థం కావు.

మన దేశంలోని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం తొలినాళ్ల నోటి మాటల ఆదర్శాలు కూడా అడుగంటిపోయి  పూర్తిస్థాయిలో కార్పొరేట్‌  నియంతృత్వంగా  బట్టబయలైంది.  గత డెబ్బయ్యేళ్ల నుంచి బలపడుతున్న ఈ ఆర్థిక పునాది మీద ఆధారపడి  బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని కార్పొరేట్‌ హిందుత్వ ఫాసిజం అని కూడా అనవచ్చు.

అంటే భారతీయ ఫాసిజానికి ఈ దేశ నాగరికతలో,  కులంలో,  పితృస్వామ్యంలో, సనాతన ధర్మంలో  ప్రాచీన మూలాలు ఉన్నట్లే, దళారీ పెట్టుబడిలో.. దాని కార్పొరేటీకరణలో పునాది ఉన్నది. ఈ రెంటిలో ఏది ప్రధానం? ఏది అప్రధానం? అనే విచికిత్స ఉదారవాదులకు ఉండవచ్చు. ఆ మేరకే వాళ్లు ఫాసిజాన్ని సూత్రీకరించవచ్చు. భారతీయ ఫాసిజాన్ని   సమగ్రంగా చూడ్డానికి   ఈ వైఖరులు సరిపోవు.  కార్పొరేట్‌ హిందుత్వ ఫాసిజాన్ని   సనాతన, కార్పొరేట్‌ మూలాలు వైెపు నుంచి  చూడాలి. ఈ పుస్తకంలోని వ్యాసాలు మనల్ని  ఆ దిశగా ఆలోచింపజేస్తాయి.

దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పిడిఎం) ‘జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, సంక్షోభాలు’ అనే అంశం మీద 28 ఫిబ్రవరి 2023న విజయవాడలో ఒక సదస్సు జరిపింది. మార్చి 26న భగత్సింగ్‌ 92వ వర్ధంతి సందర్భంగా గుంటూరులో ‘దేశభక్తి`హిందూ జాతీయవాదం’ అనే అంశం మీద గుంటూరులో మరో సదస్సు జరిపింది. ఈ రెండు సమావేశాల్లోని ఆరు  ప్రసంగపాఠాలు  ఈ పుస్తకంలో ఉన్నాయి. 

ప్రపంచ పరిణామాల నేపథ్యంలో  ద్రవ్య పెట్టబడి`ఆర్థిక మాంద్యం గురించి మాట్లాడుతూ ఇఫ్టూ ప్రసాద్‌ భారత రాజకీయార్థిక వ్యవస్థను  వివరించారు. దీనికి  కొనసాగింపుగా ఎ. నరసింహారెడ్డి మోదీ ప్రభుత్వ దన్నుతో అదాని అక్రమాలు అనే అంశాన్ని విశ్లేషించారు. నిజానికి ఈ వ్యాసం  ఇంకో వైపు నుంచి భారతదేశంలో హిందుత్వ ఫాసిజం పెచ్చరిల్లడానికి వెనుక ఉన్న కార్పొరేటీకరణను ఎత్తి చూపుతుంది. ఫాసిజానికి ఉన్న మత, సాంస్కృతిక  మూలాన్ని , భారతీయ సంస్కృతుల పరిణామాన్ని బ్రాహ్మణిజం`బౌద్ధం`హిందూయిజం అనే వ్యాసంలో ఇంతే ప్రతిభావంతంగా రమేష్‌పట్నాయక్‌ వివరించారు. దీన్ని గత వందేళ్లుగా సంఫ్‌ుపరివార్‌ చెబుతున్న దేశభక్తి`హిందూ జాతీయవాద  ఫాసిస్టు వ్యూహంలోకి వెళ్లి జాతి, దేశం, దేశభక్తి, జాతీయతలను వరలక్ష్మి  వివరించారు. ఈ క్రమంలో ఆమె ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయార్థిక దృక్పథాన్ని కూడా ప్రస్తావించారు. హిందుత్వ ఫాసిజంలోని కార్పొరేటీకరణ, సైనికీకరణను వివరిస్తూ అది పౌర హక్కులను ఎట్లా కాలరాస్తున్నదో చిలుకా చంద్రశేఖర్‌ కొన్ని ఉదాహరణతో చెప్పారు.బ్రాహ్మణీయ హిందుత్వ మూలాలు,   దళారీ పెట్టుబడిదారీ పునాది ఉన్న ఫాసిజాన్ని ఓడిరచడానికి   ఐక్యసంఘటన అవసరాన్ని, అవకాశాలను వేణుగోపాల్‌ విశ్లేషించారు.

మొత్తంగా ఈ వ్యాసాలు  ఫాసిజాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం?  అనే మౌలి క ప్రశ్న దగ్గరికి మనల్ని తీసికెళతాయి.మతతత్వ, ప్రగతివ్యతిరేక శక్తులు అధికారంలో కూచొని చేస్తున్న  విధ్వంసాలనే  ఫాసిజం అనుకుంటున్నామా? బీజేపీ అధికారంలోంచి దిగిపోతే పరిష్కారమయ్యే సమస్యగానే చూస్తున్నామా? లేక   ఏడు దశాబ్దాలుగా  రాజ్యాంగబద్ధ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పేరుతో సాగుతున్న ప్రహసనం హిందుత్వ ఫాసిజంగా బట్టబయలైన చారిత్రక సన్నివేశంలో మనం జీవిస్తున్నామనే ఎరుక మనకేమైనా ఉన్నదా? అనే దిశగా ఆలోచింపజేస్తాయి. ఏ దేశంలో అయినా ఫాసిజం సామాజిక సాంస్కృతిక రాజకీయార్థిక క్రమాల నుంచే పుట్టకొస్తుంది. అత్యంత ప్రగతివ్యతిరేక, అమానవీయ శక్తులు ఆ సమాజ గర్భంలోనే ఉంటాయి. ఒక్కోసారి అవి బలహీనంగా కనిపించవచ్చు. మరోసారి విజృంభించి దేశాన్ని కబళించే ప్రయత్నం చేయవచ్చు. భారతదేశంలో గత డెబ్పై ఏళ్లలో ఏ ఏ దశల్లో ఈ శక్తులు ఎట్లా బలపడ్డాయో,  ఎట్లా దేశ ప్రజల మీద దాడులు చేశాయో మనకు తెలుసు.  ఈ మొత్తానికి అసలు కారణం.. మన సమాజం లౌకిక, ప్రజాస్వామ్య దశకు ఎదగకపోవడమే.  లౌకికవాదం, ప్రజాస్వామ్యం గురించి గుట్టలకొద్దీ చర్చలు, సిద్ధాంతాలు జరిగాయి కానీ చాలా కొద్దిగానే అవి భౌతిక రూపం తీసుకొన్నాయి. అదీ రూప సంబంధంగానే ఉండిపోయాయి. ప్రజాస్వామికీకరణకు అవకాశమే కలగలేదు. భారత సమాజపు ఎదగకుండాపోవడానికి  కారణమైన ఈ వైరుధ్యం నుంచి హిందుత్వ కార్పొరేట్‌ ఫాసిజం పుట్టుకొచ్చింది.

అందుకే భారతీయ ఫాసిజాన్ని ఇరవయ్యో శతాబ్దపు ఫాసిజంతో పోల్చడానికి లేదు. ఇవాళ ప్రపంచంలో ఫాసిస్టు ప్రభుత్వాలు ఏర్పడిన, ఏర్పడబోతున్న అనేక దేశాల అనుభవాలతో కూడా ఇండియాను పోల్చలేం. ఈ దేశ నాగరికత నుంచి, సామాజిక సాంస్కృతిక చరిత్ర నుంచి, ఈ దేశంలోని  దళారీ బూర్జువా శక్తుల పరిణామ క్రమంలోంచి భారతీయ ఫాసిజాన్ని చూడాల్సిందే. ద్రవ్యపెట్టుబడి విజృంభిస్తున్న కాలంలో అత్యంత అమానవీయమైన సనాతన ధర్మ పునాది మీది నుంచి, కులవ్యవస్థ ఆధారంగా పుట్టి పెరిగిన ఫాసిజం ఇది. కులం తప్ప ఈ దేశ ప్రజలకు మరో మౌలిక గుర్తింపు ఏదీ లేని  చోట హిందూ జాతి పేరుతో, జాతీయత పేరుతో, దేశభక్తి పేరుతో ఫాసిజం రావడం ఇక్కడి ప్రత్యేకత. 

ప్రపంచంలోని గత, వర్తమాన ఫాసిజాలతో ఇండియన్‌ ఫాసిజానికి చారిత్రకంగా చాలా పోలికలే ఉండవచ్చు. అవన్నీ పెట్టుబడిదారీ వ్యవస్థలోని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని సాధారణ అంశాలు. కానీ ఇక్కడి పెట్టుబడి స్వభావంలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఉన్న తేడాల వల్ల కూడా ఈ సాధారణ అంశాల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీనికి భారతీయ నాగరికత, సంస్కృతి, భావజాలం వంటి ఎన్నో తోడయ్యాయి. ఇక్కడి ఫాసిజంలో ఇవన్నీ కలిసి ఉన్నాయి.  అందువల్ల దానికి  దీర్ఘకాలిక స్వభావం వచ్చింది. ఈ పుస్తకంలోని వ్యాసాలన్నీ పాఠకులను ఆ దిశగా కదిలిస్తాయి. కేవలం ఫాసిజాన్ని అర్థం చేయించడానికేకాక ఫాసిస్టు వ్యతిరేక పోరాటాల అవసరాన్ని కూడా ఇవి గుర్తింపచేస్తాయి. ఆ పోరాటాలను ఎన్నెన్ని రంగాల్లో ముందుకు తీసికెళ్లాలో అవగాహనను ఇస్తాయి. ఫాసిజం మీద అకడమిక్‌ దృష్టితో కాకుండా పోరాట క్షేత్రంతో ఈ వ్యాసాలను సంబంధం ఉంది. ఫాసిస్టు వ్యతిరేక పోరాటాలను సన్నిహితంగా గమనిస్తూ, లోటుపాట్లను పరిశీలిస్తున్న ఆలోచనాపరులు ఈ వ్యాసాలు రాశారు. వీటన్నిటినీ వరుసగా చదివాక   పాఠకులు తప్పక తమ అవగాహనలో చాలా విషయాలను భాగం చేసుకుంటారు. మరింత లోతుగా ఫాసిజాన్ని తెలుసుకోవాలనే ఉత్సుకతతో అధ్యయనంలోకి వెళతారు. అక్కడితో ఆగకుండా మన చుట్టూ జరుగుతున్న చిన్నా, పెద్దా ఫాసిస్టు వ్యతిరేక పోరాటాల్లో ఏదో ఒక స్థాయిలో భాగం కావాలనే స్పూర్తిని ఇస్తాయి. అలాంటి అంతర్మథనాన్ని, ఆగ్రహాన్ని కలిగిస్తాయి. ఆ రకంగా కూడా తప్పక చదవాల్సిన వ్యాసాలివి.

One thought on “ఫాసిజాన్నిసమగ్రంగా చూపే వ్యాసాలు

Leave a Reply