(ఇది దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పేట్రియాటిక్ డెమొక్రటిక్ మూవ్ మెంట్ – పిడి ఎం) మార్చ్ 26న గుంటూరులో జరిపిన సదస్సులో ‘ఫాసిజం – ఫాసిస్టు వ్యతిరేక ఐక్యసంఘటన’ అనే అంశం మీద చేసిన ఉపన్యాస పాఠం. సమయం లేకపోవడం వల్ల ఆ విశాలమైన అంశాన్ని మాట్లాడలేనని, ఫాసిస్టు వ్యతిరేక ఐక్యసంఘటన ఆవశ్యకత అనే అంశంలో కొన్ని కోణాలను, చరిత్ర అనుభవాలను మాత్రమే వివరిస్తానని ఉపన్యాసకుడు ముందే సూచించాడు)

ఫాసిజం అంటే ఏమిటి? ఇవాళ దేశంలో ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన నిర్మించవలసిన అవసరమేమిటి? ఆ ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనను ఎట్లా నిర్మించాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మాట్లాడుకోవలసిన, చర్చించుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. నిజానికి నేను ఫాసిజం – ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన అనే రెండు అంశాలు మాట్లాడాలి గాని, సమయాభావం వల్ల ఫాసిజం గురించి వివరణ మినహాయిస్తాను. ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన గురించి మాత్రమే మాట్లాడతాను. ఫాసిజం గురించి స్థూలంగా ఎట్లా అర్థం చేసుకోవలసి ఉన్నది. ఇవాళ భారతదేశంలో ఫాసిజం, మోడీ ఫాసిజం ఎట్లా ప్రవర్తిస్తున్నది, ఎట్లా ప్రజా వ్యతిరేకంగా, నరహంతకంగా ఉన్నది క్లుప్తంగా చెప్పి, ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన గురించి మాట్లాడతాను.

ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన అవసరం ఉన్నది అని మనమందరం ఈ మధ్య ఎక్కువగానే వింటున్నాం. ఒకవైపు ప్రజల వైపు నుంచి, కింది నుంచి చాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. భారత్‌ బచావో అనే ఒక ప్రయత్నం మీరందరూ చూసి ఉన్నారు. 2014 గెలుపంటే యాదృచ్ఛికంగానో మనకు తెలిసో, తెలియకో జరిగిపోయింది. 2019 గెలుపు తర్వాత ఫాసిజం మరింతగా జడలు విప్పి, వెయ్యి పడగల విషనాగులా ప్రవర్తిస్తున్నది. ప్రజల మీద దాడులు చేస్తున్నది. సంఘ్ పరివార్‌ సిద్ధాంతకర్త గోల్వాల్కర్‌, ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు అంతర్గత శత్రువులు అని ఎప్పుడో యాభై, అరవై ఏళ్ల కింద చెప్పిన విషయం ఇవాళ వాళ్లు చాల స్పష్టంగా ముస్లింల, క్రైస్తవుల మీద దాడులు, కమ్యూనిస్టుల పేరుతో భిన్నాభిప్రాయాలున్న వాళ్లందరిమీద దాడులు సాగిస్తూ ఉన్నారు. అందువల్లే ఈ సందర్భంలో ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన కావాలి అని ప్రజల నుంచి, కింది నుంచి భారత్‌`బచావో లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి.

పాలకవర్గాల వైపు నుంచి కూడా చాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. పాలకవర్గాల్లో ముఠా తగాదాలు ఉన్నాయి కాబట్టి, ఇవాళ అధికారంలో ఉండి ఫాసిజం చలాయిస్తున్న అధికార ముఠాకు వ్యతిరేకంగా, మిగిలిన పాలకవర్గ ముఠాలు కూడ ప్రయత్నాలు చేస్తున్నాయి. భారత్‌ జోడో యాత్ర మీ అందరికీ తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ భారత్‌`జోడో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఆ యాత్రకు చాల ఆదరణ, ప్రాధాన్యత వచ్చాయి. ఈ లోగా అదానీ వృత్తాంతం బైటకొచ్చింది. దానితో అధికార ఫాసిజం రంగు బైట పడుతున్నది కాబట్టి, ఈ ప్రధాన ప్రతిపక్షం పాలవకర్గం తానులోని ముక్కే అయినప్పటికీ దాన్ని అణిచివేడానికి, అది పనిచేయకుండా చేయడానికి రాహుల్‌గాంధీ మీద శిక్ష, ఆ శిక్షను వెంటనే అమలు చేసి, పార్లమెంటు నుంచి బహిష్కరించడం జరిగిపోయాయి. ఇప్పుడు దాదాపు అన్ని పార్లమెంటరీ ప్రతిపక్ష పార్టీలు ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన కావాలి అనే నినాదంతో ఉన్నాయి.

అంటే దేశంలో ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన అనే మాట సర్వవ్యాప్తంగా ఇటు ప్రజలూ మాట్లాడుతున్నారు. ఫాసిస్టు పాలకుల నిర్బంధానికీ, ఆంక్షలకూ దుర్మార్గానికీ బలైపోతున్న ప్రజలందరూ మాట్లాడుతున్నారు. అటు ఆ దుర్మార్గాన్నే ఎంతో కొంత అనుభవిస్తున్న పాలకవర్గ ముఠాలు కూడా మాట్టాడుతూ ఉన్నాయి. అంటే ఫాసిజం, హిట్లర్‌ ఫాసిజం, ముస్సోలినీ ఫాసిజం, ఫ్రాంకో ఫాసిజం, లేదా ఇటీవలి కాలంలో ట్రంప్‌ ఫాసిజం అని మనం ఎన్ని మాటలు చెప్పుకున్నప్పటికీ, వాటన్నింటినీ మన కళ్ల ముందర అనుభవించే స్థితి వచ్చింది. ఫాసిజం మన నిత్యజీవితంలో కనబడుతున్నది. దాని సిద్ధాంతం కావచ్చు, దానికున్న వందలాది నిర్మాణాలు కావచ్చు, లేదా, నిత్య నిజజీవితంలో నువ్వు ఫలానా దుస్తులు వేసుకోకూడదు, ఫలానా రకం దుస్తులు వేసుకుంటే నిన్ను చదువుకోనివ్వం, ఫలానా తిండి తినకూడదు. తింటే నిన్ను చంపేస్తాం. ఫలానా సినిమా చూడకూడదు. ఆ సినిమా నటుణ్ణి అభిమానించకూడదు. ఫలానా భాష మాట్లాడకూడదు. అలా నిత్య జీవితంలో ప్రతి ఒక్క అంశంలోనూ ఫాసిజానికి తనదైన ఒక ఎజెండా ఉన్నది. వాళ్లు చాల ఎక్కువగా మాట్లాడే మాట ఒకే దేశం, ఒకే జాతి, ఒకే మతం, దాన్ని ముందుకు తీసుకువచ్చి, ఒకే ఎన్నికలు, ఒకే పాలన, ఒకే భాష, ఒకే తిండి, ఒకే కట్టుబొట్టు అని సమస్తం కేంద్రీకృతం చేసే కుట్ర జరుగుతున్నది.

కాని భారతదేశం బహుళ సమాజం, సహజీవన సమాజం. అనేక రకాల సంస్కృతులు, ఇది ఒక సంస్కృతి కాదు సంస్కృతుల సహజీవనం, సంస్కృతుల బహుళత్వం ఇక్కడ సాగుతున్నది. కనుక ఈ రెంటికీ మధ్య ఘర్షణ, దీన్ని ఏకీకరించే ఫాసిజానికి, కాదు మేము బహుళంగా ఉన్నాము, వందల వేల సంవత్సరాలుగా మా జీవనం ఇది, దీన్ని కొనసాగిస్తాము అని చెప్పుకునే బహుళత్వ సంస్కృతికి మధ్య ఘర్షణ సాగుత్తున్నది. ఈ ఘర్షణ వల్ల అనివార్యంగానే పాలకవర్గ ముఠాలు కూడా ఫాసిస్టు వ్యతిరేక ఎజెండాను తీసుకుంటున్నాయి. ఇటువంటి సందర్భంలో, ప్రగతిశీల శక్తులుగా, ప్రజాస్వామ్య  శక్తులుగా, మనం ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనలో ఎక్కడ ఉండాలి? పాలకవర్గ ముఠాలు చెప్పే ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనను ఆమోదించి చాలామంది మేధావులు, బుద్ధిజీవులు, చదువుకున్నవాళ్లు కాంగ్రెసే ఇక్కడ ప్రత్యామ్నాయం, కాంగ్రెస్‌ వెంట పోదాం, ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనకు అదే దారి అని మాట్లాడుతున్నారు. అక్కడికి పోదామా? ప్రజలకింకా శక్తి లేదు, ఇంకా బలహీనంగా ఉన్నారు, కనుక మనం ఎటువంటి పని చేయలేము, ఏదో పాలకవర్గ ముఠాతో చేరాల్సిందే, బిజెపి పాలనను ఓడించాల్సిందే అంటున్నారు.

సరే, ఓడిస్తే, 2024 ఎన్నికల్లో అది ఓడిపోతే ఫాసిజం అంతమైపోతుందా? 1945లో హిట్లర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ముస్సోలినీని వీధుల్లోకి లాగి నరికి చంపారు. ఫాసిజం అంతమైందా? ఫాసిజం పాలకవర్గ భావజాలంగా ఉన్నన్నాళ్లు, పాలకవర్గ రాజకీయార్థిక ప్రయోజనాలు కాపాడినన్నాళ్లు కొనసాగుతూనే ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధంతో అది అంతం కాలేదు. మళ్లీ మళ్లీ పుట్టుకొస్తున్నది. గత దశాబ్దంలో లాటిన్‌ అమెరికాలో అనేక చోట్ల ఫాసిస్టు పాలకులు అధికారంలోకి వచ్చారు. 2014 నుంచి ఫాసిజం ఇక్కడ అమలవుతున్నది అంటే అంతకు ముందు ఫాసిజం లేదని కాదు. అన్ని పాలకపక్షాలూ ఎంతో కొంత ఫాసిజాన్ని అమలు చేస్తాయి. ఫాసిజం అంటే ఏమిటి అని చాల సులభంగా చెప్పాలంటే కాళోజీ అన్నాడు ‘ఏకీభవించనోని పీకనొక్కు సిద్ధాంతం ఫాసిజం’ అని. నువ్వు నాతో ఏకీభవించవా, నీ పీక నొక్కేస్తా. అంతే. అంటే భిన్నాభిప్రాయాన్ని సహించరు. మరొక అభిప్రాయాన్ని సహించరు. వ్యతిరేక అభిప్రాయం కూడా కాదు, భిన్నమైన అభిప్రాయమైతే చాలు. ఇది హిందూ రాష్ట్ర కావాలనుకున్నారు. హిందూ రాష్ట్ర కాదు, దానికి అర్థం లేదు అని మాట్లాడుతున్నావంటే నువ్వు అర్బన్‌ నక్సలైట్‌వి. పీక నొక్కాల్సినవాడివి. ఇటువంటిది ఇవాళ్టి ఫాసిజం. అంతకు ముందు కూడ ఇటువంటి ఉదాహరణలున్నాయి.

మనందరికీ తెలిసిన ఉదాహరణ 1975. ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ ఫాసిస్టు పాలన. ఇవాళ అదే ఇందిరా కాంగ్రెస్‌ నాయకుడిని, ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనకు నాయకుడుగా ఉండాలని కొందరు అంటున్నారు. ఈ నాయకుడి చేతిలోనే ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన విజయవంతం అవుతుందంటున్నారు. సిక్కు జవాను తన తల్లిని హత్య చేశాడని, సిక్కులను ఊచకోత కోయండి అని ఈ నాయకుడి తండ్రి పిలుపిచ్చాడు. ఒక వటవృక్షం పడిపోతే నేల కదిలిపోతుంది కదా అని మూడు వేల మంది సిక్కుల ఊచకోతను సమర్థించాడు. ఈ ఊచకోత తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజ్‌ బనేగా హిందూ రాజ్‌ అనే నినాదం ఇచ్చింది హిందువులు కాదు, భారతీయ జనతాపార్టీ కాదు. ఇందిరా కాంగ్రెస్‌. అందువల్ల 542 సీట్లలో 402 సీట్లు గెలుచుకున్నారు. వాళ్లే ఆ తర్వాత నూతన ఆర్థిక విధానాలు అమలు చేయడం ప్రారంభించారు.

ఈ దేశంలో ఫాసిస్టు పాలనకు ఏ ఒక్క పార్టీ మినహాయింపు కాదు. నిజానికి వామపక్షాలని తమను తాము చెప్పుకునే పార్టీలు కూడా ఫాసిస్టు తరహా పాలనలు అమలు చేసిన ఉదాహరణలు దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. వెస్ట్‌ మిడ్నపూర్, నాడియా జిల్లాల్లో ప్రత్యేకించి ఎక్కుపెట్టి ముస్లింల మీద దాడులు జరిపిన వామపక్ష ప్రభుత్వ ఉదాహరణ ఉంది. అదానీ మీద దేశవ్యాప్త ప్రచారం జరుగుతూ ఉంటే కేరళలో విళింజమ్ ఓడరేవులో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ, భారతీయ జనతాపార్టీ లతో చేతులు కలిపి అధికార భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్‌ అదానీని సమర్ధిస్తున్నది. వ్యతిరేకిస్తున్న చర్చి నాయకులను అరెస్ట్‌ చేసి, వాళ్ల మీద కేసులు పెడుతున్నారు. అంటే ఫాసిజానికి ఈ దేశంలో పాలకవర్గ, పార్లమెంటరీ పార్టీలలో మినహాయింపు లేదు.

ఇది గుర్తించిన తర్వాత మరి ఈ సందర్భంలో ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన నిర్మాణం చేయడం ఎట్లా? ఇంతకన్నా స్థితి ఘోరంగా మారకుండా ఉండాలంటే, అధికారంలో ఉన్న ఫాసిస్టులను ఓడించాలి కదా అనే వాదన ఉంది. ఇప్పుడు వీళ్లను ఓడించి, వచ్చినవాళ్లను మళ్లీ చూసుకోవచ్చు అనే అవకాశం తీసుకుందాం అనే వాదన ఉంది. ఈ అవకాశం తీసుకోవడానికి మనకు చరిత్రలో  ఒక ఉదాహరణ ఉంది. 1935లో కమ్యూనిస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫాసిజం గురించి నిర్వచనం ఇస్తూ, ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్యసంఘటన ఎందుకు నిర్మించాలంటే, ఫాసిజం అధికారంలోకి రావడమంటే ఏమిటంటే అని కొన్ని మాటలు చెప్పింది. డిమిట్రావ్ చెప్పాడు. బూర్జువా ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడైనా బూర్జువా నియంతృత్వమే. మనకు ఆ విషయం తెలిసిందే. కాని ఫాసిజం అనేది మామూలు బూర్జువా ప్రజాస్వామిక, బూర్జువా నియంతృత్వ లక్షణాలను కూడా దాటి బహిరంగంగా, నగ్నంగా టెర్రరిజం రూపంలో వస్తుంది. అది వచ్చినప్పుడు, మన ముందర ప్రశ్న బూర్జువా ప్రజాస్వామ్యమా, సోషలిజమా అని కాదు, బూర్జువా ప్రజాస్వామ్యమా, ఫాసిజమా అనే సమస్య ఎదుర్కొంటాం. ఆ స్థితిలో ఫాసిజాన్ని ఓడించడానికి బూర్జువా ప్రజాస్వామ్యాన్ని ఎంచుకోక తప్పదు అని తీర్మానం చేసుకున్నారు. ఇవాళ వంద సంవత్సరాలు గడిచిన తరువాత దాదాపు ఆ స్థితే ఉంది. ఆ స్థితి అంటే నూటికి నూరుపాళ్లు ఆ స్థితి కూడా కాదు. చరిత్ర ఎప్పుడూ యథాతథంగా పునరావృతం కాదు. పుంఖానుపుంఖాలుగా మార్పులు, చేర్పులు జరిగాయి. అందువల్ల ఆ పాత ఉదాహరణ నుంచి ఈ పాఠాలు తీసుకోగలం, దాన్ని ఎంతవరకు అనుసరించగలం అని కొత్త విశ్లేషణలు చేసుకోవాలి.

చరిత్రలోకి వెళ్లి ఎప్పుడెప్పుడు ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనలు ఏర్పడ్డాయి, ఆ ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనలు ఏ జాగ్రత్తలు తీసుకున్నాయి అని అర్థం చేసుకోవాలి. ఇది ఒక సంక్లిష్ట స్థితి. అనివార్యమైన స్థితిలో ప్రత్యర్థివర్గంలో ఒక సెక్షన్ తో చేయి కలపవలసి వస్తున్నది. తప్పనిసరిగా ఆ శత్రువు మనల్ని మింగివేయజూస్తాడు. అందులోనూ హిందూ సమాజంలో ఫాసిజం అనేది మతంలో భాగంగా ఉంది. హిందూ మతానికి రెండు ప్రధానమైన లక్షణాలు, ఒకటి చేతినిండా ఆయుధాలు. ఏకీభవించనోడి పీకనొక్కేస్తారు. రెండు, ఎదుటివారిని జీర్ణం చేసుకుని వాతాపి జీర్ణం అంటారు. ఈ రెండు రకాలుగానూ ఎదురు నిలబడి ప్రాణాలిస్తావా, మునిగిపోయి రద్దయి పోతావా అనే స్థితి హిందూ, బ్రాహ్మణీయ ఫాసిజంలో ఉంటుంది. అటువంటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.

తప్పనిసరిగా ఇవాళ ఒక విశాల ఐక్య సంఘటన నిర్మించవలసి ఉంది. ఇవాళ్టి స్థితిలో బూర్జువా ప్రజాస్వామ్యం అయినా సరే, ఫాసిజం ఓడిపోతే చాలు. బూర్జువా ప్రజాస్వామ్యం, బూర్జువా నియంతృత్వంగా మారుతుందని తెలుసు. వీళ్ల చరిత్ర తెలుసు, వీళ్లు ఆ తానులోని ముక్కలే ఐనా సరే, అనే ఒక స్థితి ఏర్పడి ఉన్నది. ప్రజాశక్తులు కనుక బలంగా ఉంటే ఆ స్థితి ఉండదు. నిజానికి, మొట్టమొదటిసారి ఐక్య సంఘటన నినాదం ఇచ్చినప్పుడు 1921లో ఫాసిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇటలీలో 1933లో నాజీపార్టీ మరొక రకమైన ఫాసిజం జర్మనీలో అధికారంలోకి వచ్చింది. ఆ రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో 1918 నుంచి 1939 వరకు ఐక్య సంఘటన ప్రయత్నాలు జరిగినప్పుడు, ఆ ఐక్య సంఘటన ప్రయత్నాలకు సోషలిస్టు శిబిరం నాయకత్వం వహించింది. ఆ సోషలిస్టు శిబిరం చేతిలో ప్రజాసైన్యం, ఎర్రసైన్యం ఉంది. ఫాసిస్ట్‌ వ్యతిరేక ఐక్య సంఘటనకు ఎర్రసైన్యం మద్దతు ఉంది. వంద సంవత్సరాలు గడిచిన తరువాత, ఇవాళ సోషలిస్టు శిబిరం లేదు, ఎర్రసైన్యం లేదు. ప్రజాసైన్యం లేదు. ఉన్నది గణనీయమైన స్థితిలో లేదు. ఇప్పుడు ఐక్య సంఘటనకు, ఆనాటి ఐక్య సంఘటన నుంచి ఏం పాఠాలు తీసుకోగలం? ఏ కొనసాగింపు చేయగలం? ఏ గుణాత్మకమైన మార్పులు తేగలం? ఇక్కడే మనం జాగ్రత్తగా చరిత్రను అర్థం చేసుకోవలసి ఉంది. చరిత్ర పాఠాలు నేర్చుకోవలసి ఉంది.

నాలుగైదు సందర్భాలు మనం గుర్తు తెచ్చుకోవలసినవి ఉన్నాయి. మొదటిది, రెండు యుద్ధాల మధ్యకాలంలో, అందులోనూ ప్రత్యేకించి, స్పెయిన్‌ అంతర్యుద్ధం తరువాత, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో జరిగిన అంతర్జాతీయ స్థాయి ఐక్య సంఘటన ప్రయత్నాలు. స్వయంగా డిమిట్రావ్, స్టాలిన్‌ లు అనేక సూచనలు చేశారు. నిజంగా ఎవరెవరితో ఐక్య సంఘటన కట్టామో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనకేమైనా అమెరికా అంటే ప్రేమనా, ఇంగ్లండ్‌ అంటే ప్రేమనా, కాని ఒక రూజ్వెల్ట్ తో, ఒక చర్చిల్‌ తో కూర్చుని స్టాలిన్‌ రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌ను, ముస్సోలినీని ఓడించే ఐక్య సంఘటన నిర్మించాడు. నిర్మించి, మీరు రెండో రంగం తెరవండి, యుద్ధంలో ఫాసిస్టులను ఓడించండి అని చెప్పినప్పటికీ, ఐక్య సంఘటన కట్టిన తరువాత మూడు సంవత్సరాల వరకూ కూడ వాళ్లు రెండో రంగం తెరవనే లేదు. మోసం చేశారు. ఇవాళ కూడా మనం భిన్నవర్గాలతో ఐక్య సంఘటన కోరుతున్నామంటే, ఆ వర్గాల్లో కొన్ని తమ వర్గ ప్రయోజనాల కోసం మాత్రమే వస్తాయి. అది మనం దృష్టిలో పెట్టుకోకపోతే, ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే ఐక్య సంఘటన మనల్ని మింగేస్తుంది.

రెండో సందర్భం, చైనాలో విప్లవ యుద్ధం ముందుకు సాగుతోంది. విప్లవోద్యమం కొన్ని స్థావర ప్రాంతాలను కూడా ఏర్పరచుకుంది. స్థానిక ప్రభుత్వంతో యుద్ధం చేస్తూ ఉంది. అప్పుడు బైటి దేశం నుంచి దురాక్రమణ జరిగింది. అప్పుడు స్థానికంగా రోజూ ఊచకోత కోస్తున్న, చుట్టు ముట్టిన, శత్రు ప్రభుత్వంతోనే ఐక్య సంఘటనకు ముందుకు రావలసి వచ్చింది. చాంగ్ కై షేక్‌తో, కొమింగ్ టాంగ్ తో ఐక్య సంఘటనకు వచ్చి, జపాన్‌ను ఓడించడానికి, జపాన్‌ వ్యతిరేక దేశభక్త ఐక్య సంఘటన నిర్మాణం చేశారు. ఐక్య సంఘటన గురించి ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి 1937 నుంచి 42 వరకు మావో రాసిన రచనలు చదవండి. ప్రాక్టీస్‌ ఆఫ్‌ యునైటెడ్‌ ఫ్రంట్‌ అని 1947లో రాసిన అద్భుతమైన వ్యాసం ఒక్కటైనా తప్పనిసరిగా చదవండి. దానిలో ఆయన ఒకమాట అన్నాడు. ఐక్యత అనేది పోరాటాన్ని వదిలి పెట్టి చేసేది కాదు. పోరాటాన్ని వదిలి ఐక్యత చేపట్టావంటే నువ్వు ఓడిపోవడానికి నువ్వే మార్గం సిద్ధం చేసుకుంటున్నావని అర్థం. పోరాటం చేస్తూనే ఐక్యతను నిర్మించి, అట్లాంటి ఐక్యత సాధిస్తే, నువ్వు సజీవంగా ఉంటావు. అది సజీవమైన ఐక్యత అవుతుంది. మావో చెప్పిన ఈ జాగ్రత్తలు – ఐక్యతకు-ఘర్షణకు మధ్య గతితార్కిక సంబంధం గురించి, ఐక్యతను సాధిస్తూనే పోరాటాన్ని వదలకుండా ఉండటం ఎట్లా అనే జాగ్రత్తలు చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ ఎన్నో సంవత్సరాలపాటు ఆమలు చేసింది. ఆ చరిత్ర తెలుసుకోవలసిన అవసరం ఉంది.

మూడవ చారిత్రక సంఘటన, మన దగ్గరికే వద్దాం. విశాలమైన దేశంలో ఆయా స్థల, కాల పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అంతర్జాతీయ చరిత్ర పాఠాలు మనకు వర్తిస్తాయా లేదా ఎంత చర్చయినా చేయొచ్చు. మన దేశపు అనుభవాలూ చూద్దాం. నిజాం ప్రభుత్వానికి లేదా ఉస్మాన్‌ అలీ ఖాన్‌కు వ్యతిరేకంగా, ఆ మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు మద్దతు ఇస్తున్న వలసవాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అయింది. దళిత, లంబాడీ రైతు కూలీలు, చిన్న రైతులు, మధ్యతరగతి రైతుల దగ్గర్నుంచి ధనిక రైతుల దాకా, సబ్బండ వర్గాలు, అన్ని కులాలు, ఆదివాసులు వెట్టిచాకిరికి, భూసంబంధాల అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టారు. ఈ పోరాటానికి ఆంధ్ర మహాసభ అనే ఐక్య సంఘటన నాయకత్వం వహించింది. ఆ ఐక్య సంఘటనలో అన్ని వర్గాల, అన్ని రంగాల వాళ్లూ ఉన్నారు. 1930లో ఏర్పడిన ఆంధ్ర మహాసభ 1944 వరకు 14 సంవత్సరాల పాటు అన్ని వర్గాల వాళ్లూ కలిసి ఉన్నారు. ప్రజల మనిషి నవల చదవండి. కూలీలు, దొరలు అందరూ ఆంధ్ర మహాసభకు బండ్లు కట్టుకుని వస్తారు. అందరూ ఆంధ్ర మహాసభలోనే ఉన్నారు. అందరికందరూ నిజాంకు వ్యతిరేకంగా పోరాడుదామంటున్నారు. నిజాంకు వెనుక ఉన్న వలసవాదాన్ని వ్యతిరేకించాలని అంటున్నారు. 

కాని ఆ పోరాటం ఎప్పుడైతే క్రియాశీలమయ్యిందో అప్పుడు భిన్న ధోరణులు మొదలయ్యాయి. అంటే ఐక్య సంఘటనలో ఒకానొక సమయంలో భిన్న వర్గాలు చేరుతాయి. వాటి వాటి ప్రయోజనాల కోసం. కాని, వర్గ పోరాటం మొదలయ్యే కొద్దీ, వర్గ ప్రయోజనాలు స్పష్టమయ్యే కొద్దీ, వాళ్లు ఐక్య సంఘటన నుంచి వెళ్లిపోవడం కూడా ప్రారంభమౌతుంది. ఐక్య సంఘటన ఆ మేరకు విచ్ఛిన్నమౌతుంది. కాని, ఈ ఐక్య సంఘటనా క్రమంలో ప్రజాశక్తి బలం పుంజుకోవాలి. 1944 దాకా ఐక్య సంఘటనలో అందరూ కలిసి ఉన్నదల్లా, 1944లో ఆంధ్ర మహాసభ రెండుగా చీలిపోయింది. కాంగ్రెస్‌ వాదులు వేరైపోయారు. పోటీ ఆంధ్ర మహాసభ పెట్టారు. కమ్యూనిస్టులు ఇక్కడి నుంచే సాయుధ పోరాటం ప్రారంభించారు. అంటే ఒక ఐక్య సంఘటనలో ఇంకా ఈ ఐక్య సంఘటన ముందుకు సాగితే ఏ వర్గాల ప్రయోజనాలైతే దెబ్బ తింటాయని అనుకున్నారో వాళ్లు వెనక్కి తగ్గారు. 1944 తరువాత 1946లో అది సాయుధ పోరాటంగా పరిణమించింది. 1948 సెప్టెంబరు 17న నెహ్రూ-పటేల్ సైన్యాలు వచ్చాయి. పోరాటం మీద దాడి చేశాయి. వందల, వేల మందిని ఊచకోత కోశాయి. వెంటనే రావి నారాయణరెడ్డి, ఒకానొక వ్యక్తి కాదు, అది ఎవరో ఒక వ్యక్తి పేరు కావచ్చు గాని వాళ్లు ఒక వర్గానికి ప్రతినిధులు, ఒక సమాజానికి, సమూహానికి ప్రతినిధులు. కొన్ని ప్రయోజనాలకు ప్రతినిధులు. 1948 రాగానే ప్రజలేమో, అట్టడుగు ప్రజానీకమేమో పోరాటం కొనసాగించాలి అంటున్నారు. నెహ్రూ వచ్చినా ఏమీ మారేది లేదు, నెహ్రూ, పటేల్‌ సైన్యాలు మా మీద ఊచకోతలు కోస్తున్నాయి. కనుక నిజాం దిగిపోయాడని మనం ఆగనక్కరలేదు. ముందుకు సాగిపోవాలి అనుకున్నాయి. కాని రావి నారాయణరెడ్డి, ఆయన నాయకత్వంలోని కొందరు ఇంక ఇక్కడ ఆపొచ్చు పోరాటం అన్నారు. అంటే వాళ్ల  వర్గ ప్రయోజనాలు కాపాడుకున్నారు.

అంటే ఒక విశాల ఐక్య సంఘటన కట్టవలసిందే, ఒక ప్రయోజనం సాధించాలంటే, ఒక లక్ష్యం సాధించాలంటే ఏ ఒక్కరితోనో సరిపోదు. అనేక రకాల వర్గాలను కలుపుకోవాలి. అదే సమయంలో, ఐక్య సంఘటన కట్టేటప్పుడు ఈ వర్గాలు ఎప్పుడైనా ఈ పోరాటాన్ని వదిలిపోవచ్చు అనే అంచనాలు మనలో ఉండాలి. హిందూత్వ విషయంలో, మోడీ విషయంలో మేము పోరాడుతాం, కలిసి వస్తాం అంటున్న వర్గాలే అదానీ విషయం, కార్పొరేట్‌ విషయం వస్తే రాకపోవచ్చు. కలిసి వచ్చినంతవరకు కలుపుకుని పోదాం. కాని నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ విధానాలు తెచ్చింది ఈ పార్టీ. ఊపా అనే దుర్మార్గమైన చట్టాన్ని తెచ్చింది ఈ పార్టీ. ఇవాళ మోడీని వ్యతిరేకిస్తున్నది కావచ్చు, అందువల్ల మనతో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్లూ అనుకోవచ్చు, మనమూ అనుకోవచ్చు. రేపు వీళ్లు ఎక్కడ ఉంటారు? కనుకనే చరిత్ర చెప్పవలసి ఉంది. వాళ్లూ ఆ తానులోని ముక్కలే అని చెప్పవలసి ఉంది. వాళ్లు తప్పనిసరిగా వాళ్ల చరిత్ర ప్రకారం పోరాటంలో తుది దాకా రారు. మధ్యలో ఆగిపోతారు అని చెప్పడం అవసరం. వాళ్ల చరిత్రను చెప్పడమంటే, ఐక్యంగా ఉన్నప్పటికీ కూడా మావో చెప్పిన సూత్రం, ఐక్యంగా ఉంటూనే ఘర్షణ గురించి మాట్లాడుకోవడం అవసరం. కనీసం వాళ్ల పరిమితులు ఇవి, వాళ్లు చరిత్రలో గతకాలంలో ఈ పనులు చేశారు అని చెప్పడం అవసరం. చెప్పకుండా దాచిపెట్టే దానికంటె అది మేలు. అంతిమంగా ప్రజలు అన్నీ తెలిసి ఒక అభిప్రాయానికి వస్తారు. అలా చెప్పడం అందరూ తమ వర్గ ప్రయోజనాలు కాపాడుకోవడానికి మాత్రమే దారితీస్తుంది. ఇది మన కళ్ల ముందర కనబడిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేర్పిన గుణపాఠం.

ఆ తర్వాత మరొక ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన చరిత్ర మన కళ్లెదుటే ఉన్నది. 1975 జూన్‌ 25న ఇందిరా గాంధీ ఈ దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. వెంటనే చాల మంది ఈ ఇందిరా ఫాసిస్టు నియంతృత్వానికి వ్యతిరేకంగా ఐక్య సంఘటన నిర్మించాలి అని ఆలోచించారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఐతే ఇందిరా కాంగ్రెస్‌ను సమర్థించింది. ఇది ఫాసిస్టు నియంతృత్వమే కాదు, వామపక్ష నియంతృత్వమే అన్నది. ఇది ప్రజల కోసమే అన్నది. దాని సంగతి పక్కన పెట్టండి. మిగిలిన అన్ని పక్షాలు కలిసి సోషలిస్టు పార్టీ నాయకులు జయప్రకాశ్ నారాయణ్ నాయకత్వంలో ఒక విశాల ప్రజా ఐక్య సంఘటన కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇంతకీ అది ఎక్కడికి దారి తీసింది? ఒక ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన పేరుతో ఈ దేశంలో అసలైన ఫాసిస్టు సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ ను దానిలో చేర్చుకోవడం జరిగింది. అంటే ఏ ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన నిర్మించడానికి అడుగులు వేశామో ఆ ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనలో ఫాసిస్టులను కూడ కలుపుకున్నాం. అసలైన ఫాసిస్టులను కలుపుకున్నాం. అందువల్ల ఆర్‌ ఎస్‌ ఎస్‌ ను అప్పటి వరకూ, 1948 లో గాంధీ హత్య జరిగిన తరువాత వాళ్లు ఒకపార్టీ పెట్టినప్పటికీ, భారతీయ జనసంఘ్ పెట్టినప్పటికీ 1952 నుండి 1975 దాకా వాళ్లను ఎవరూ దగ్గరికి రానీయలేదు. వాళ్లను దూరం పెట్టారు. వాళ్లు ఎన్నికల్లో కూడ పెద్దగా విజయం సాధించలేదు. 1952 ఎన్నికల నుంచి 1971 దాకా ఏ ఒక్క ఎన్నికల్లోనూ వాళ్లు ఆరు శాతం వోట్లు కూడా సంపాదించలేదు. అటువంటి వాళ్లకు జయప్రకాశ్ నారాయణ్‌ ఫాసిస్ట్‌ వ్యతిరేక ఐక్య సంఘటన ఒక స్థానం కల్పించింది. స్థానం ఇవ్వడం వల్ల ఏం జరిగిందో తెలుసా? 1977 ఎన్నికల్లో ఆర్ ఎస్ ఎస్ సభ్యులు 91 స్థానాలు గెలుచుకున్నారు. జనతా పార్టీ మొత్తం 231 స్థానాలు గెలుచుకుంటే అందులో ఆర్‌ ఎస్‌ ఎస్‌ సభ్యులు 91 మంది ఎన్నికయ్యారు. అలా ఆర్‌ ఎస్‌ ఎస్‌కు ఆమోద యోగ్యత వచ్చింది. దేశ రాజకీయాల్లో ఇవాళ మనం అనుభవిస్తున్న ఆర్‌ ఎస్‌ ఎస్‌ పాత్రకు బీజాలు ఆ ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనలో ఏర్పడ్డాయి.

నిజానికి ఇవాళ చరిత్రలో వెనక్కి వెళ్లి చూస్తే, ఈ ఫాసిస్ట్‌ వ్యతిరేక ఐక్య సంఘటనలోకి అందరూ వెళ్లిపోతున్న సందర్భంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆనాటి భారత కమ్యూనిస్ట్‌ పార్టీ మార్క్సిస్టు ప్రధాన కార్యదర్శిగా, తన ప్రధాన కార్యదర్శిత్వానికి రాజీనామా చేస్తూ, ఒక లేఖ పెట్టారు. ఆ లేఖలో మొదటి అంశమే ఆయన ఇందిరాగాంధీ వ్యతిరేక, ఫాసిస్ట్‌ వ్యతిరేక ఐక్యత పేరుతో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ లాంటి ఫాసిస్టు సంస్థకు మనం చోటు కల్పిస్తున్నాము. ఇది తీవ్రంగా అభ్యంతరకరం, ప్రమాదకరమైన విషయం అని రాశారు. ఆయన మాత్రమే కాదు, 1975లో, 76లో ఫాసిస్ట్‌ వ్యతిరేక ఐక్య సంఘటన కోసం జరిగిన ప్రయత్నాల మీద కొండపల్లి సీతారామయ్య గారు కూడా ఆ రోజుల్లో వచ్చే తెలుగు పత్రికల్లో వ్యాసాలు రాశారు.

ఇలా అంతర్జాతీయంగా, దేశీయంగా, ప్రాంతీయంగా మనకు ఐక్య సంఘటనల చరిత్రల అనుభవం ఉంది. ఇవాళ మళ్లీ ఒక ఐక్య సంఘటన సందర్భంలోకి ప్రవేశించినప్పుడు ఈ చరిత్ర అంతా అధ్యయనం చేయాలి. ఆ చరిత్ర అధ్యయనం చేసి ఇవాళ్టి సందర్భానికి తగిన పాఠాలు తీసుకోవాలి.

తప్పకుండా నరేంద్ర మోడీ, అమిత్‌ షాలు దిగిపోవాల్సిందే. వాళ్లు ఆ పదవులలో ఉండడానికి అర్హులు కారు. నరహంతకులు. ఐతే ఆ నరహంతకులను దించడానికి ఎవరితో చేతులు కలపవచ్చు? కొన్ని అనివార్యమైన ఐక్యతలు అవసరం కావచ్చు. కాని, ఆ విషయం ప్రజలకు తెలియజెప్పుతూ ఆ ఐక్యతలోకి వెళ్లాలి. ఇప్పుడు ఈ  ప్రత్యేక అవసరం కోసమే మేమీ పనిచేస్తున్నాము అని చెప్పుకోవాలి. ఒక హెచ్చరిక, ఒక ముందు జాగ్రత్త ఉండాలి. చరిత్ర రికార్డు నమోదు చేయడం కోసమైనా ఆ పని చేయకపోతే, ఐక్య సంఘటన ప్రయత్నం చేయలేము. లేకపోతే సరిగ్గా 1975 నాటి ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన పునరావృతం అవుతుంది. ఏ పార్టీ ఐతే ఇవాళ ఒక ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనకు నాయకురాలు అని ఒక అభిప్రాయం వస్తున్నదో, ఆ పార్టీ హోం మంత్రిగా చిదంబరం, ఊపా వంటి అన్యాయమైన చట్టాలకు మరింత అన్యాయమైన సవరణలు తీసుకుచ్చాడు. ఎన్‌ఐఎ చట్టం తీసుకువచ్చాడు.

అదంతా గత చరిత్ర, పది సంవత్సరాల కింద జరిగింది, ఇవాళ్టి గురించి మాట్లాడండి అని కూడ కొందరు అంటున్నారు. సరే, సరిగ్గా రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర నడుస్తూ ఉన్నప్పుడు, ఆయనేమో పాదయాత్ర చేస్తున్నాడు. చత్తీస్‌ఘడ్‌లో ఆదివాసీలపై జరుగుతున్న అత్యాచారాలకు, నిర్బంధాలకు, దమనకాండకు వ్యతిరేకంగా పాదయాత్ర జరుపుతాం రాజధాని రాయ్‌పూర్‌కు అని బయల్దేరితే అక్కడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ పాదయాత్రను అడ్డుకొని అరెస్టులు చేసింది. పాదయాత్రలో రాహుల్‌ గాంధీ కార్పొరేట్‌లు, మోడీ కలిసిపోయి, దేశాన్ని నాశనం చేస్తున్నారు అని చెప్తున్నప్పుడు రాజస్థాన్‌లో అదే కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యమంత్రి గెహ్లాట్‌ మా రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి అని అదానీకి ఎర్రతివాచీ పరుస్తున్నాడు. ఎవరో ముఖ్యమంత్రిని అడిగారు, మీ నాయకుడేమో ఆదానీని వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేస్తున్నాడు. మీరు అదానీని ఆహ్వానిస్తూ ఎర్రతివాచీ పరుస్తున్నారు, ఏమిటిది మీ పార్టీకొక విధానం లేదా అని. ఆయన నేను అదానీని ఏమిటి, అమిత్‌షా కొడుకు జయ్ షాను కూడా ఎర్రతివాచీ పరిచి ఆహ్వానిస్తాను అన్నాడు.

అంటే ఈ దేశంలో ఫాసిస్టులు, ఫాసిస్టు పాలక వర్గాలు వాళ్ల రంగూ, దిక్కూ రెండూ మార్చుకోరు. వాళ్లందరూ ఒక్కటే, ఈ స్పృహ మనకు ఉంటున్నదా అనేది ప్రశ్న. వాళ్లతో కలిసేటప్పుడు తప్పనిసరిగా ఈ స్పృహతో, ఈ జాగ్రతతో, ఈ ఎరుకతో, ఈ ఎరుకను ప్రజలకు కూడా బహిరంగంగా తెలిపి, ఇటువంటి ఒక సంక్లిష్టమైన సమయంలో కలుస్తున్నాము అని చెప్పాలి. ఇంతకు ముందు నేను చెప్పిన వ్యాసంలో మావో ఒక మాటన్నాడు, ఉన్న పరిస్థితి మరింత దిగజారకుండా ఉండటం కోసం ఈ పని చేస్తున్నాము అని. ఈ తెలివిడి మనకు ఉండాలి.

అట్లాగే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో డిమిట్రోవ్ గాని మిగిలిన వారు గాని మాట్లాడినదేమంటే పెద్ద శత్రువు, చిన్న శత్రువు, పెద్ద ప్రమాదం, చిన్న ప్రమాదం అనే తేడా చూడాలి అని. నిజానికి చిన్నదైనా పెద్దదైనా ప్రమాదం ప్రమాదమే. అది చెప్తూ కలుస్తామా, చెప్పకుండా దాచిపెట్టి కలుస్తామా అనేది ముఖ్యమైన అంశం.

ఇవాళ ఈ జాగ్రత్తలు దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా ఒక విశాలమైన ఐక్య సంఘటన కావలసిందే. ఇందులో ఎవరుండాలి? ఫాసిజం ఏ వర్గాలను పునాదిగా చేసుకుంటుందో ఆ వర్గాలలో చీలిక తేవడానికి, ఆ వర్గాలకు చైతన్యం కల్పించడానికి ఐక్య సంఘటన కావాలి. ఆ వర్గాలలో తాము ఇప్పుడు ఏదో ప్రమాదంలో ఉన్నామని, దాని నుంచి బైటపడడానికి ఈ పాలన కావాలనే అభిప్రాయం ఫాసిజం పునాదిగా ఉంది. అది దేశభక్తి కావచ్చు, లేదా ముస్లింలు చేసిన అన్యాయాలు అనబడే అబద్ధ ప్రచారం కావచ్చు, చరిత్ర గురించిన అబద్ధ ప్రచారం కావచ్చు. లేదా బహుజన కులాల నుంచి మొదటిసారి ప్రధానమంత్రి అయ్యాడు అనే తప్పుడు అస్తిత్వ భావన కావచ్చు, అనేక అభిప్రాయాలు ఉన్నాయి. కాని మధ్యతరగతి ఇవాళ ఫాసిజానికి ఒక ప్రధానమైన కుదురుగా ఉన్నది. ఈ మధ్యతరగతిలోకి ఎట్లా ప్రవేశించి ఫాసిస్టు వ్యతిరేక భావనలు కల్పిస్తాము అనేది సవాల్.

ఇందాక నేను చెప్పిన వ్యాసంలో మావో ఆనాటి చైనా సమాజంలో ఉన్న ప్రజలందరినీ ఏయే వర్గాలున్నాయి అని విభజన చేశాడు. ఏ వర్గంతో ఎట్లా ప్రవర్తించాలి, ఏ వర్గాన్ని కచ్చితంగా వ్యతిరేకించాలి. ఏ వర్గంతో ఘర్షణతో కూడిన ఐక్యత కావాలి. ఏ వర్గాన్ని పూర్తిగా ఆమోదించి కలుపుకోవాలి అని విభజన చేశాడు. ఇవాళ భారత సమాజంలో మనం అటువంటి విభజన చేయగలమా? చేసి, ఆ విభజన ఆధారంగా అటువంటి ఒక సృజనాత్మకమైన విశ్లేషణ ఆధారంగా ఐక్య సంఘటన నిర్మించగలమా?

పార్లమెంటరీ పార్టీలున్నాయి. మొట్టమొదటిగా పార్లమెంటరీ పార్టీలలో తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీని, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ ను వేరు చేయాలి. ఒంటరి చేయాలి. అందుకోసం పార్లమెంటరీ పాలకవర్గ ముఠాలలో ఉన్న తగాదాలను మనం తప్పనిసరిగా వాడుకోవలిసిందే. ఎట్లా వాడుకుందాం? వారిలో ఎవరిని పూర్తిగా మన విశ్వాసంలోకి తీసుకుందాం? ఎవరిపట్ల ఘర్షణతో కూడిన ఐక్యత సాధిస్తాము? ఎవరు ఇంక పనికిరారు అని తోసేస్తాము? పార్లమెంటరీ పార్టీలలో ఏ ఒక్కరో చేసేది కాదిది. దేశవ్యాప్తంగా అవసరమైన ఒక స్థితి, దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సమూహాలు, ఫాసిజానికి బలి అవుతున్న ప్రజలందరూ కూడి తీసుకోవలసిన నిర్ణయమిది. అట్లా పార్లమెంటరీ పార్టీల నుంచి కొందరైనా, తప్పనిసరిగా ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన వైపుకు వస్తారు. తప్పనిసరిగా, ఎన్ని విమర్శలున్నప్పటికీ వామపక్ష పార్టీలు ఫాసిస్టు వ్యతిరేక  ఐక్య సంఘటన వైపు రావలసిందే. వాటి నాయకత్వం రాకపోయినా, శ్రేణులైనా తప్పనిసరిగా రావలిసిందే.

ఇక పార్లమెంటేతర రాజకీయ పక్షాలు దేశంలో వందల సంఖ్యలో ఉన్నాయి. అవి ఎన్నికల్లో పాల్గొనకపోవచ్చు, శాసన సభల్లో, పార్లమెంటుల్లో ఎన్నిక కాకపోవచ్చు, కాని, చిన్న చిన్న సమూహాలు, ఆయా ప్రాంతాల కోసం, ఆయా అస్తిత్వాల కోసం, ఆయా  భాషల, సంస్కృతుల కోసం ఏర్పడిన అనేక పార్టీలున్నాయి. నిజానికి ఇన్ని పార్టీలు ఉన్నాయంటేనే బహుళత్వానికి చిహ్నాలుగా ఉన్నాయి. బహుళత్వానికి వ్యతిరేకమైన ఫాసిజం ఇవాళ హింసా నాట్యం చేస్తున్నది. కనుక వాళ్లందరినీ ఆకర్షించడానికి, వాళ్లకు చెప్పడానికి, వాళ్లను ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనలో భాగం చేయడానికి అవకాశం ఉన్నది. ఈ ఫాసిస్టు పార్టీ ఉండడం వల్ల రేపు మీ ఉనికే రద్దయిపోతుంది, మీ బహుళత్వం, మీ పాలన కాదు, అసలు బహుళత్వమే వద్దు అంటున్నారు. మీ సార్వభౌమత్వం కోసం, మీ భాషా సంస్కృతుల కోసం, మీ అస్తిత్వం కోసం, మీ రాజకీయాభిప్రాయం కోసం మీకొక పార్టీ ఉండడానికి వీల్లేదంటున్నారు. ఈ ఏక పార్టీ నియంతృత్వాన్ని ఓడించడానికి మీరు ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనలో చేరక తప్పదు అని ప్రతి ఒక్క పార్టీకి చెప్పవలసి ఉంది. మళ్లీ ఒకసారి మావోను గుర్తు చేస్తున్నాను – ఐడెంటిటీని వదులుకుని ఐక్యత రాదు. జీర్ణం అయిపోవడం కాదు. దానిలో కలిసిపోవడం కాదు. నా అస్తిత్వం నాకుంటుంది. నా ఎజెండాలు నాకుంటాయి. ఒక ఉమ్మడి ఎజెండా కోసం, కనీస ఉమ్మడి కార్యక్రమం కోసమే కలుస్తున్నాము. ఆ కనీస ఉమ్మడి కార్యక్రమం హిందుత్వ ఫాసిజాన్ని ఓడించడం. అటువంటి చర్చ దేశంలో నడిపితే, పార్లమెంటేతర పార్టీలు కూడా ఫాసిస్టు ఐక్య సంఘటనలో చేరతాయి.

ఇంకా సంఘటిత ప్రజాసంఘాలు కొన్నివేలు, లక్షలున్నాయి. దేశంలో ఈ ప్రజాసంఘాలన్నీ, తప్పనిసరిగా వాటిలో కనీసం 90 శాతం హిందూత్వ ప్రమాదానికి గురైనవే. ఒకసారి మనుస్మృతి ప్రజల చేత చదివిస్తే అర్థమౌతుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో. ఎంత అమానుషమైన, ఎంత క్రూరమైన మానవ వ్యతిరేక పుస్తకం అది. ఆ పుస్తకాన్ని ప్రాచీన భారత రాజ్యాంగమని అంటున్నారు. అసలు ఆధునిక భారత రాజ్యాంగం వద్దు, మనుస్మృతే ఈ దేశపు రాజ్యాంగం అంటున్నారు. ఈ స్థితిని దూరం చేయడానికి ఈ ప్రజా సంఘాలతో, ఆయా అస్తిత్వాల మీద ఏర్పడిన ప్రజా సమూహాలతో ఏర్పడిన సంఘటిత ప్రజా సంఘాలన్నీ,  తప్పని సరిగా ఒక ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనలో భాగమవ్వాలి.

ఇది కాకుండా సంఘటితం కాని ప్రజా సమూహాలు కోట్లాదిగా ఉన్నాయి. అశేష ప్రజానీకం ఉన్నది. ఈ అశేష ప్రజానీకానికి ఫాసిజం ప్రమాదమేమిటో, 20వ శతాబ్దపు ఫాసిజమైతే ఒక్క జర్మనీలో 60 లక్షల మందిని చంపింది. ఇటలీలో 20 లక్షల మందిని, యుద్ధంలో మరికొన్ని లక్షల మందిని చంపింది. అది విభజన మీద, విద్వేషం మీద, హత్యల మీద ఆధారపడే మనస్తత్వం. ఈ మాటచెప్పి, వారు ఏ సంఘంలో లేకపోవచ్చు. ఏ పార్టీలో లేకపోవచ్చు. వ్యక్తులుగా ఉండవచ్చు. అటువంటి అసంఘటిత ప్రజా సమూహాలు కోట్లాది మంది ఉన్నారు. ప్రతి మనిషికీ సంఘ్ పరివార్‌ ప్రమాదం మీద స్పష్టత ఇవ్వగలమా?

ఇవాళ కాదు, 1943లోనే, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ ఏర్పడిన తరువాత 15 ఏండ్లకే ‘ఆర్‌ఎస్‌ఎస్‌ నిజస్వరూపం’ అని చండ్ర రాజేశ్వరరావు, అంటే ఆనాటి కమ్యూనిస్టు పార్టీ, పుస్తకం రాశారు. అది ఎంత ప్రమాదకరమైందో, దుర్మార్గమైందో అది పుట్టిన 15 ఏండ్లకే మనం గుర్తించాం. దానికిప్పుడు 100 ఏండ్లు రాబోతున్నాయి. నూరేళ్లు నిండడం అనే నుడికారాన్ని నిజం చేయవలసిన చారిత్రక సందర్భంలో మనం ఉన్నాం.

కనుక ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి, హిందూత్వ ఫాసిజం గురించి ఎట్లా ప్రచారం చేస్తాము, ప్రజలకు ఎట్లా చేరవేస్తాము అనే ముఖ్యమైన సవాల్ మన ముందు ఉంది. మన చుట్టూ ఉన్న అనేక మంది వ్యక్తులకు, ఆలోచనాపరులకు, బుద్ధిజీవులకు, చదవగలిగిన, రాయగలిగిన, ఆలోచించగలిగిన వాళ్లకు హిందూత్వ సంఘ్ పరివార్‌ ఫాసిజం గురించి వివరణలు, విశ్లేషణలు, సమాచారం అందజేయగలమా? అట్లా వాళ్ల నిజస్వరూపాలను బైటపెట్టగలిగినప్పుడు, తప్పనిసరిగా విశాల ప్రజా ఐక్య సంఘటన నిర్మించగలం. నిర్మించడంతో అయిపోలేదు. నిర్మించి దాన్ని ఒక విజయం వైపు తీసుకువెళ్లాలి. విజయం వైపు తీసుకెళ్లే సమయంలో, ఐక్య సంఘటనలో భిన్నవర్గాలుంటాయనే స్పృహ ఉండాలి. ఐక్య సంఘటన అంటేనే భిన్న వర్గాల కూటమి. అది ఒకే వర్గానిది కాదు. అనేక వర్గాలుంటాయి. అనేక ప్రయోజనాలుంటాయి. కనుక వాళ్లు తమ ప్రయోజనాలు నెరవేరినప్పుడు దాన్నుండి వైదొలిగే ప్రమాదం, వైదొలిగే అవకాశం ఉంది అనే గుర్తింపును కూడా ఐక్య సంఘటనలో ఉన్న ప్రజాశక్తులు, ఐక్య సంఘటనకు నాయకత్వం వహించే ప్రజాశక్తులు తప్పనిసరిగా గమనంలో పెట్టుకోవలసిన నియమం.

జపాన్‌ వ్యతిరేక దేశభక్త ప్రజా ఐక్య సంఘటన నిర్మాణంలో మావో ఒక మాటన్నాడు. ఐక్య సంఘటన ఎప్పుడైనా, మన నాయకత్వంలో, ఆయన కమ్యూనిస్టు పార్టీని ఉద్దేశించి అన్నాడు, పోనీ ఇవాళ్టి సందర్భంలో ప్రగతిశీల శక్తుల నాయకత్వంలో అనుకుందాం, మన నాయకత్వంలో, మన చొరవతో ఏర్పడుతుందా? మరొకరి నాయకత్వంలో మరొకరి చొరవతో ఏర్పడుతుందా? మరొకరి నాయకత్వంలో, మరొకరి చొరవతో మనం భాగమౌదామా అనేది చర్చనీయాంశం. మరొకరి నాయకత్వంలో, మరొకరి చొరవతో కనుక జరిగితే అది ప్రజాశక్తుల విజయం కాదు. ప్రజాశక్తుల ఓటమికే దారితీస్తుంది. ప్రగతిశీల శక్తుల చొరవతో, ప్రగతిశీల శక్తుల నాయకత్వంలో ఫాసిస్టు వ్యతిరేక ఐక్యసంఘటన నిర్మాణ అవసరాన్ని ఇవాళ చరిత్ర మనమీద పెడుతున్నది. కాలం మనమీద పెడుతున్నది. సమాజం మన మీద పెడుతున్నది. ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో పిడిఎమ్‌ అనేది ఒక చిన్న సంస్థే కావచ్చు. లేదా ఇటువంటి అనేక సంస్థలు, ప్రగతిశీల శక్తులు ఆ కర్తవ్యాన్ని ముందుకు తీసుకుపోవలసి ఉన్నది. ఐక్య సంఘటనను నిజమైన ఫాసిస్ట్‌ వ్యతిరేక ఐక్య సంఘటనగా, ఏ పాలకవర్గ ముఠా ప్రయోజనాల కోసమో నినాదంగా ఏర్పడే ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటనగా కాదు. ఫాసిజాన్ని రద్దు చేసే నిజమైన ఐక్య సంఘటనగా నిర్మించగలమా అనేది చరిత్ర మనమీద పెడుతున్న సవాల్‌. ఆ సవాల్‌ని తీసుకుంటామా లేదా మనమీదనే ఉంది.

Leave a Reply