విప్లవ రచయితల సంఘం 29వ రాష్ట్ర మహా సభల ఇతివృత్తం ‘ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం’. విప్లవోద్యమ మేధో, సాంస్కృతిక కంఠస్వరమైన విరసం ఆశయం ప్రజా జీవితంలోని సంక్షోభాలను విశ్లేషించడం. వాటికి ఉండగల పరిష్కారాలను ఎత్తి చూపడం. ఈ పని ఫాసిజం చెలరేగిపోతున్న సమయంలో మరింత సునిశితంగా చేయవలసి ఉన్నది. దేనికంటే మన సామాజిక సాంస్కృతిక జీవితం  చాలా జటిలంగా మారిపోతున్నది. వ్యక్తిగత, బహిరంగ జీవితాలు కల్లోలభరితంగా తయారయ్యాయి. ఆధునిక ప్రజాస్వామిక విలువలు సంక్షోభంలో పడిపోయాయి. మానవ సంబంధాల్లో అర్థవంతమైన మార్పులు జరగలేదు. వలస వ్యతిరేక పోరాట కాలంనాటి ప్రజా ఆకాంక్షలేవీ వాస్తవ రూపం ధరించలేదు. రాజ్యాంగ రచన సాగిన రోజుల్లోనే అందులో భాగమైన కొందరు మేధావులు వీటిని సాధించడం ఎలా అని మధన పడ్డారు.  ఫలితంగా   భారత రాజ్యాంగంలోకి కొన్ని ప్రజాస్వామిక భావనలు వచ్చాయి. సామాజిక న్యాయాన్ని సాధించే ప్రక్రియలు  భాగమయ్యాయి. ఆధునిక సామాజిక జీవితానికి అత్యవసరమైన వ్యక్తి స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన అందులో చోటు చేసుకున్నాయి. 

ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సమానత్వం, సోషలిజం వంటి ఆదర్శాలతో భారత రాజ్యాంగ పీఠిక ఆరంభమవుతుంది.  ఇవేవీ పాలకవర్గాలు దయతో ప్రజలకు ఇచ్చినవి కావు. ఈ భాషలో కాకపోయినా భారతదేశంలోని దళితులు, ఆదివాసులు, పీడిత సమూహాలు ఎప్పటి నుంచో చేసిన పోరాటాల్లోంచి ఈ విలువలు వచ్చాయి. 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ కాలం నుంచి సాగిన తిరుగబాట్లు  ఎన్నో ఆదర్శాలను నెలకొల్పాయి.  భగత్సింగ్‌లాంటి విప్లవకారుల, కమ్యూనిస్టు ఉద్యమకారుల త్యాగాలు  అనేక కొత్త భావనలను తీసుకొచ్చాయి. అంతర్జాతీయంగా సాగిన ఉదారవాద ప్రజాస్వామ్య పోరాటాల ప్రేరణ కూడా రాజ్యాంగం వెనుక ఉంది.  అంతకుమించి  రష్యా సోషలిస్టు విప్లవ ప్రభావం గణనీయంగా ఉన్నది. వీటన్నిటికి భారత రాజ్యాంగ రచయితల్లోని బాబాసాహెబ్‌ అంబేద్కర్‌వంటి వ్యక్తుల సామాజిక, రాజకీయ దృక్పథం తోడైంది. 

రాజ్యాంగ నిర్ణాయక సభను ఉద్దేశించి అంబేద్కర్‌ చేసిన చివరి ప్రసంగంలో ఆయన ఆకాంక్షలు, అనుమానాలు కూడా కనిపిస్తాయి. చివరికి ఆయన అనుమానాలే నిజం అయ్యాయి. ‘భారత ప్రజలమైన మేము..’ అని మొదలయ్యే రాజ్యాంగం ఆచరణలో ఆ ప్రజల జీవితాన్ని మౌలికంగా మార్చలేకపోయింది. దేనికంటే బ్రిటీష్‌ పాలనలోనే ఆరంభమై ప్రత్యక్ష వలసానంతరం స్థిరపడిన బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే భారత రాజ్యానికి రక్షణ కవచంగా రాజ్యాంగం రూపొందింది. ప్రజా ప్రాతినిధ్య రూపంలో పని చేసే భారత రాజ్యం మీద  దళారీ బూర్జువావర్గం శాసన అధికారాన్ని నెలకొల్పుకోడానికి రాజ్యాంగం అవసరమైంది. ఉత్పత్తి సాధనాల మీద యాజమాన్యం  ఉన్న ఈ వర్గం రాజ్యాంగయంత్రం మీద, సామాజిక సంబంధాల మీద అధికారాన్ని స్థిరపరుచుకోడానికి రాజ్యాంగం తయారైంది. అందువల్ల భారత రాజ్యాంగం అనేక వైరుధ్యాల పుట్టగా మారింది.  రాజ్యాంగ రచనా క్రమంలోనే అంబేద్కర్‌ ఈ వైరుధ్యాలను ఎదుర్కోవలసి వచ్చింది. చాలా వాటికి రాజీపడాల్సి వచ్చింది. అవకాశం ఉన్నంత వరకు  పీడిత ప్రజల హక్కులను, సామాజిక న్యాయాన్ని సాధించే ప్రక్రియలను రాజ్యాంగంలోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ చాలా సహజంగానే భారత రాజ్యాంగం దోపిడీ వర్గ మూలాల మీదే నిర్మాణమైంది. దానికి తిరుగులేని ఉదాహరణ ఆస్తిహక్కు. దోపిడీని చట్టబద్ధం చేసిన రాజ్యాంగం ఇది. అందు వల్ల ప్రజలకు`పాలకులకు మధ్య వైరుధ్యమే వస్తే  రాజ్యాంగ వ్యవస్థలన్నీ పాలకవర్గం వైపే ఉంటున్నాయి.  ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు చెడ్డవాళ్లు కావడం వల్ల ఇలా జరగడం లేదు.  భారత రాజ్యాంగ స్వభావమే ఇది. రాజ్యాంగ నిర్ణయ సభ ఏర్పాటయిన పద్ధతి, రాజ్యాంగ రచనా క్రమం,  ఈ డెబ్పై ఏళ్లలో రాజ్యాంగం అమలైన తీరు ఈ విషయాన్ని దాపరికం లేకుండా రుజువు చేశాయి.

అదే సమయంలో రాజ్యాంగానికి సమాజంలో ఆధునిక మార్పులు తెచ్చే స్వభావం కూడా ఉన్నది. ఆ మార్పులు చాలా చిన్నవే కావచ్చు. కానీ వేల ఏళ్ల నుంచి ఏ చిన్న వెలుగు రేఖ సోకని అట్టడుగు ప్రజల జీవితంలో అవి కీలకమైవి. ఆ రకంగా గత డెబ్పై ఏళ్లలో పీడిత ప్రజల జీవితం కొంత మెరుగుపడటంలో రాజ్యాంగం పాత్ర ఉన్నది. రాజ్యాంగం వాళ్లకు ఎంతో కొంత చట్టపరమైన రక్షణ ఇస్తున్నది. క్రియాశీల రాజకీయ కార్యాచరణను నిరోధించినప్పటికీ ఐదేళ్లకోసారి ఓట్లు వేసే అవకాశం ఇచ్చింది.

 ఇలాంటి పరిమిత ప్రజానుకూల అంశాలను కూడా  బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టులు దెబ్బతీస్తున్నారు.  రాజ్యాంగంలోని ఉదారవాద విలువలు  ఫాసిస్టులకు నచ్చవు. సనాతన ధర్మం, కులవ్యవస్థ, పితృస్వామ్యం వంటివాటి మీద ఆధారపడిన సంఫ్‌ుపరివార్‌ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నది. రాజ్యాంగం రూపొందిన తొలి రోజుల్లో దీన్ని మేం అంగీకరించమని ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు బహిరంగంగానే ప్రకటించారు. ఇప్పుడు రాజకీయాధికారంలోకి రావడంతో దానిలోని ప్రజానుకూల అంశాలను, ప్రక్రియలను, వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారు.

అయితే ఈ పని వీళ్లే చేయడం లేదు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ చేయగలిగినంత  చేసింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన నెల రోజుల్లోనే పౌరహక్కులకు పరిమితులు విధిస్తూ  మొదటి సవరణ తీసుకొచ్చింది. రాజ్యాంగంలోని ప్రజానుకూల అంశాలను అమలు చేయకపోవడం, ప్రవేశికలోని ఆదర్శాలను ధ్వంసం చేస్తూ సవరణలు తీసుకరావడం అనే రెండు రూపాల్లో కాంగ్రెస్‌ పార్టీ శక్తిమేరకు ఈ పని చేసింది. ఇందులో మిగతా అన్ని ఎన్నికల పార్టీలు తలా ఒక చేయి వేశాయి. భారత దళారీ బూర్జువా వర్గంలోని హిందుత్వ ఫాసిస్టు ముఠా అయిన సంఫ్‌ు ఇప్పుడు  చివరి దెబ్బ వేస్తున్నది. 

అందువల్ల దేశవ్యాప్తంగా ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ ఒక ప్రజాస్వామిక ఆకాంక్షగా ముందుకు వచ్చింది. నిజానికి పాతికేళ్లుగా అన్ని స్థాయిల్లో రాజ్యాంగ ఆదర్శాలు దెబ్బతినిపోతున్న సందర్భంలోనే  పీడిత కులాల్లో, మత మైనారిటీల్లో, ఆదివాసుల్లో  రాజ్యాంగ చైతన్యం పెరిగింది. ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నారు. రాజ్యాంగంలోని హక్కుల అమలు కోసం ప్రజాతంత్ర పోరాటాలు జరుగుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా కూడా ఫాసిస్టు శక్తులు  రాజ్యాంగ విధ్వంసానికి పాల్పడుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ ఫాసిస్టు వ్యతిరేక ఉద్యమంగా రాజ్యాంగ పరిరక్షణ ఒక బలమైన వ్యక్తీకరణగా మారింది.

 అదే సమయంలో ఈ రాజ్యాంగ పరిరక్షణ ఆకాంక్ష నుంచి అంత కంటే బలంగా రాజ్యాంగ సర్వస్వవాదం తలెత్తింది. రాజ్యాంగం మీద కనీస విమర్శనాత్మక దృష్టి లోపించింది. దీని వల్ల రాజ్యాంగాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుందనే ధోరణి పెరుగుతున్నది.  రాజ్యాంగమనే పుస్తకారాధన హిందూమతంలోని విగ్రహారాధనగా మారిపోతున్నది.  అత్యంత అప్రజాస్వామిక,  నిరంకుశ పాలకవర్గ ప్రయోజనాలకు రక్షణ కవచంగా ఎన్నో అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయనే వాస్తవిక దృష్టి అడుగంటిపోతున్నది. మౌలికంగా రాజ్యాంగం అగ్రకుల బ్రాహ్మణీయ బూర్జువా వర్గ ప్రయోజనాల కోసం పని చేస్తున్న డెబ్పై ఏళ్ల  చరిత్రను విస్మరిస్తున్నారు. నిజానికి యథాలాపంగా ‘రాజ్యాంగాన్ని అమలు చేయాల’ని అంటే అందులోని సానుకూల అంశాల ప్రయోజనం కంటే ప్రజా వ్యతిరేక అంశాల నష్టాన్ని ఈ సమాజం ఎక్కువగా అనుభవించాల్సి వస్తుంది. ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలనే వ్యూహాత్మక వైఖరి తీసుకోవాల్సిందే. ఆ దిశగా ఒత్తిడి పెంచాల్సిందే. అయితే రాజ్యాంగంలోని ఏ ఏ విషయాలను ఉద్దేశించి ఆ మాట అంటున్నామో స్పష్టత ఉండాలి. అంత సంక్లిష్టత రాజ్యాంగంలో ఉన్నది. రాజ్యాంగంలో ప్రజా ప్రయోజన కోణం ఉన్నప్పటికీ మౌలికంగా అది దోపిడీ రాజ్యం స్థిరంగా ఉండటానికి తగిన మార్గదర్శకత్వం చేస్తున్నది. పాలకులు ‘రాజ్యాంగబద్ధం’గా ఉండటమంటే దోపిడీని, అసమానతలను, అంతరాలను కాపాడటమే. ఇది వర్గ సమాజం కాబట్టి చట్టం ముందు ఆస్తిపర వర్గం, దోపిడీకి గురయ్యే వర్గం అసమానంగా ఉండటమే చట్టబద్ధ పాలన. ఆధునికతా వికాసంలో భాగంగా   చట్టబద్ధ పాలన అనే ప్రగతిశీల అంశం వచ్చిందని గుర్తించి, దాని అమలు కోసం కృషి చేస్తూనే ఈ విమర్శనాత్మక వైఖరిని ప్రదర్శించాలి. ఈ రెంటికీ వైరుధ్యం లేదు. ఎంత కలిపి చూస్తే అంత వాస్తవిక దృష్టి పెరుగుతుంది. ఇది ఎంత లోపిస్తే అంతగా రాజ్యాంగవాద భావజాలం ప్రబలుతుంది. ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో లౌకిక ప్రజాస్వామికవాదులకు రాజ్యాంగం ఆయుధంగా పని చేసినదాని కంటే కూడా ఫాసిస్టు శక్తులకే అది పదునుగా ఉపయోగపడుతున్నది. వీధుల్లో చెలరేగిపోతున్న సంఫ్‌ు మూక సంగతి అటుంచితే అధికారంలో ఉన్న బీజేపీ తన హిందుత్వ, కార్పొరేట్‌ విధానాలన్నీ చట్టబద్ధంగానే, రాజ్యాంగ ద్వారానే అమలు చేస్తున్నది. సారాంశంలో ఫాసిస్టు శక్తులు రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొనే తమ మౌలిక విధానాలను తీసుకొస్తున్నాయి.

ఇవన్నీ రాజ్యాంగ వ్యవస్థల పని తీరులో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వ్యవస్థలు  తమ విధి విధానాలకు భిన్నంగా హిందుత్వ భావజాలంతో స్పందిస్తున్నాయి. ఈ మధ్య  సుప్రీంకోర్టు 370 రద్దు రాజ్యాంగబద్ధమే అని తీర్పు ఇవ్వడం అందులో భాగమే.  రేప్పొద్దున యుఎపిఎ, ఉమ్మడి పౌర స్మృతి, పౌరసత్వ సవరణ, ఆదివాసులపై వైమానిక యుద్ధం, అదానికి ఆస్తులు కట్టబెట్టడం..అన్నీ రాజ్యాంగబద్ధమే అని తీర్పులు వస్తాయి. ఇది సుప్రీంకోర్టు మీద హిందుత్వ శక్తుల పట్టును మాత్రమే తెలియజేయడం లేదు. ఇలాంటి తీర్పులు ఇవ్వగల మార్గదర్శకత్వం రాజ్యాంగంలోనే ఉన్నది. దాని స్వభావం మేరకే ఇలాంటి తీర్పులు వస్తున్నాయి. వీటిల్లో కొన్నయినా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా వచ్చేవే. ఇంకే ఉదారవాద బూర్జువా పార్టీ అధికారంలో ఉన్నా ఇవి జరిగేవే. రాజ్యాంగ పునాది మీది నుంచే బూర్జువా నియంతృత్వం, రాజ్యాంగబద్ధ హిందుత్వ ఫాసిజం  ఇంతగా చెలరేగాయనడానికి వర్తమాన చరిత్రే సాక్ష్యం.

ఈ విమర్శనాత్మకత దేశంలో చాలా వరకు లోపించింది.  రాజ్యాంగానికి ఉన్న ఒక్క పరిమితిని కూడా నోరు తెరిచి చెప్పకుండా పీఠికను సామూహిక మంత్రంగా పఠించడం రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంలోని ఒక  ధోరణిగా మారింది. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించమని ప్రభుత్వాలను డిమాండ్‌ చేసే క్రమంలో ప్రజలను రాజ్యాంగ పరిమితులకు బందీలను చేసే భావజాలం పెచ్చరిల్లుతున్నది.  సామాజిక జీవితంలో రాజ్యాంగం తెచ్చే మార్పులకు ఉన్న పరిమితులపట్ల మౌనం పెరిగిపోతున్నది. అనేక వైరుధ్యాలకు కారణమై, వాటిని బలంగా పట్టి ఉంచుతున్న రాజ్యాంగ యథాతధ స్వభావం పట్ల విస్మరణ పెరుగుతున్నది. పైగా సకల సామాజిక వైరుధ్యాలను రాజ్యాంగం పరిష్కరిస్తుందనే భ్రమ విస్తరిస్తున్నది. రాజ్యాంగంలోని ప్రజానుకూల అంశాలు  అమలు కావడానికి చట్ట పరిధిలోని పోరాటాలతోపాటు దానికి బైట మిలిటెంట్‌ పోరాటాలు కూడా అవసరం అనే సత్యం మరుగునపడిపోతున్నది. అనేక మిలిటెంట్‌ పోరాటాల వల్లనే రాజ్యాంగానికి ఉన్న సామాజిక పరివర్తనా పాత్ర కొంచెమైనా నిజమైందనే చారిత్రక వాస్తవం విస్మరణకు గురవుతున్నది. ఇది అక్కడితో ఆగలేదు. రాజ్యాంగానికి ఆవల జరిగే పోరాటాల వల్ల హింస జరుగుతున్నదని, దాన్నంతా సమాజం భరించాల్సి వస్తున్నదనే విమర్శ పెరిగిపోయింది. పాలకవర్గం రాజ్యాంగబద్ధంగానే అప్రజాస్వామిక చట్టాలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున పాల్పడుతున్న హింస అప్రధానమైపోతున్నది. తటస్థంగా ఉన్నట్లు కనిపించే రాజ్యం పీడిత ప్రజా పోరాటాల మీద సైనిక యుద్ధం చేస్తున్నదనే సంగతి గమనంలోకే రావడం లేదు. పైగా మనకు అద్భుతమైన రాజ్యాంగం ఉండగా, అది అనుమతించని పద్ధతులు చేపట్టడం తగదని ప్రజా పోరాటాలకు గీతలు గీచే సిద్ధాంత చాతుర్యం సాధికారత పొందుతున్నది. ఆంక్షలు, నిషేధాలు మొదట నిర్దిష్ట స్థలకాలాల్లో మొదలై సాధారణ స్థితిగా మారడం పట్ల, పరిమిత కాల ప్రకటనలుగా ఆరంభమై శాశ్వతంగా కొనసాగడంపట్ల విమర్శ లేకపోగా తమ వైఖరులను  సమర్థించుకోడానికి రాజ్యాంగ నైతికత అనే  వాదన కొందరు చేస్తున్నారు. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం నానాటికీ పెరుగుతున్నదని, తద్వారా రాజ్యాంగ స్ఫూర్తి బలంగా ఆచరణలోకి వస్తున్నదని వాదించేవారు ఎక్కువయ్యారు.

వాస్తవానికి 1991 నూతన ఆర్థిక విధానాల తర్వాత  రాజ్యాంగ రచయితల ఆకాంక్షలు అడుగంటిపోయాయి. రాజ్యాంగబద్ధంగానే పాలకులు సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు అనుగణమైన ఆర్థిక విధానాలు తీసుకొచ్చారు. వీటి వల్ల సామాజిక జీవితంలో గతంలోలాగా కనీస ప్రజానుకూల మార్పులు తెచ్చే శక్తిని కూడా రాజ్యాంగం కోల్పోయింది. మొదటి  మూడు దశాబ్దాల్లో ఆదివాసులకు, దళితులకు, కార్మికులకు రాజ్యాంగం ద్వారా లభించిన రక్షణలు కనుమరుగయ్యాయి. రాజ్యాంగం ద్వారానే పాలకులు అనేక ప్రతికూల చట్టాలను  తెచ్చారు. అనుకూల చట్టాలను కాలరాచారు.  ఈ మొత్తానికి న్యాయస్థానాల తీర్పుల కంటే రుజువు అక్కర లేదు. వీటన్నిటి వల్ల ప్రవేశికతో సహా ఇతర ప్రజానుకూల అంశాలకు` బూర్జువా, ఫాసిస్టు ప్రయోజనాలకు మధ్య వైరుధ్యం తీవ్రమైంది.  రాజ్యాంగ వర్గ స్వభావం బట్టబయలైంది. బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజంగా మారిపోయింది. కొద్ది మంది ఇవన్నీ విస్మరిస్తున్నారు. ఇలాంటి భావజాల వాతావరణంతో  రాజ్యాంగబద్ధమైన బూర్జువా రాజ్య రూపాన్ని అధిగమించాలనే చైతన్యం బలహీనపడుతున్నది. రాజ్యాంగంలోని అనుకూల అంశాలను  ఫాసిస్టుల నుంచి కాపాడుకుంటూనే  సామాజిక వైరుధ్యాల పరిష్కారానికి రాజ్యాంగమే గదిబండలా మారుతుందనే చారిత్రక వాస్తవంపట్ల అప్రమత్తత లోపిస్తున్నది. స్థూలంగా రాజ్యాంగవాదం అంటే ఇదే.

అయితే రాజ్యాంగం ఉత్పత్తి సంబంధాల్లో మార్పు తీసుకరాలేదు.  వర్గ సంఘర్షణ పదునెక్కుతున్నందు వల్ల రాజ్యాంగానికి అంతర్గత పరిమితులు, వైరుధ్యాలు  పెరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని భారత ప్రజలు తమకు తాము సమర్పించుకున్నట్లు చెప్పుకోవడంతో పాలకులు ఈ దేశంలో వర్గాలేవీ లేవని కల్పించిన భ్రమ ఫాసిస్టు సందర్భంలో బద్దలైపోతున్నది. బూర్జువా వర్గం ఇంత కాలం కాపాడుతూ వచ్చిన మేలి ముసుగును ఆ వర్గంలోని ఒక సెక్షన్‌ అయిన ఫాసిస్టులు చించిపారేస్తున్నారు. పనిలో పనిగా వాళ్లు రాజ్యాంగంలో తమకు నచ్చని ప్రజానుకూల అంశాలను ధ్వంసం చేస్తున్నారు. రాజ్యాంగ వ్యవస్థలను సాంతం చేతిలోకి తీసుకుంటున్నారు. అందువల్ల రాజకీయ, పాలనా రంగాల్లోని బూర్జువా ప్రజాస్వామిక విధానాలు పూర్తి స్థాయి నియంతృత్వంగా మారాయి. రాజ్యాంగం సామాజిక జీవితంలో నిర్వహించే పాత్ర అదృశ్యమైపోతున్నది.

ఈ పరిస్థితుల్లో  రాజ్యాంగంలోని ప్రజానుకూల అంశాలను నిలబెట్టడం తక్షణ అవసరం. దీని కోసం  ఉదారవాద ప్రజాస్వామిక విప్లవశక్తులు ఈ దిశగా శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్మించవలసి ఉన్నది. మనం జీవిస్తున్న ఈ సమయ సందర్భాలు అలాంటి ఒత్తిడి చేస్తున్నాయి. ఇది తక్షణ అవసరం. ఆ దిశగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉదారవాదుల నుంచి పుట్టుకొచ్చే రాజ్యాంగవాదం తిరిగి యథాతధ స్థితి దగ్గరికి తీసికెళుతుంది. విప్లవకారుల పేచీ ఉదారవాదుల ప్రజాస్వామిక కృషితో కాదు. రాజ్యాంగవాదంతో. దేనికంటే రాజ్యాంగ సర్వస్వవాదం వర్గపోరాటానికి నాజూకైన ఆడ్డుగోడను కడుతుంది. 

బూర్జువా ప్రజాస్వామిక విప్లవాల నుంచి, వలస వ్యతిరేక పోరాటాల నుంచి  ఆవిర్భవించిన రాజ్యాంగాలు ఆ క్రమంలో జరిగిన సామాజిక, రాజకీయ మార్పులకు శాసన రూపాన్ని ఇచ్చాయి. ఆ మార్పుల వెనుక ఉన్న విలువలకు ఆధునికత గీటురాయి.  వర్గపరంగా ఆ మార్పులన్నీ బూర్జువా వర్గ నిరంకుశ ఆధిపత్యానికి, అమానవీయ  దోపిడీకి శాసన రూపాన్ని ఇచ్చాయి.   ప్రజలు  అక్కడితో ఆగకుండా మరింత మార్పు కావాలని ప్రయత్నిస్తే బూర్జువా వర్గం అణచివేస్తుంది. రాజ్యాంగబద్ధం కాదని రాజ్యాంగం ఆధారంగానే నిషేధిస్తుంది. అంటే ఒకప్పుడు సామాజిక రాజకీయార్థిక మార్పుల్లోంచి పుట్టిన రాజ్యాంగం బూర్జువా వర్గ ప్రయోజనాలకు మాత్రమే కట్టుబడి ఉంటుంది. గత డెబ్బై ఏళ్లుగా ఇదే చరిత్ర నడుస్తున్నది. మిగతా  పార్టీలకన్నా  హిందుత్వ ఫాసిస్టులు రాజ్యాంగాన్ని వాడుకొని ఆ పని మరింత తీవ్రంగా చేస్తున్నారు. 

ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగాన్ని ఎత్తిపట్టవలసింది పోయి రాజ్యాంగవాదం పేరుతో విమర్శనాత్మకంగా ఉండటం తగదని  మిత్రులు అభిప్రాయపడవచ్చు. ఈ విమర్శ రాజ్యాంగంలోని పీడిత కులాలకు, తెగలకు, కార్మికవర్గానికి మేలు చేసే అంశాల మీద కాదు. అందులోని  ఆదర్శాల మీద కాదు. రాజ్యాంగవాదం మీద. మొదటి దాని కోసం అవసరమైతే జీవితాన్ని పణంగా పెట్టేందుకు కూడా సిద్ధమవుతూ రాజ్యాంగవాదాన్ని ఎదుర్కోవలసిన సందర్భం ఇది. ఈ రెంటికీ మధ్య చాలా పెద్ద తేడా ఉన్నది.  సామాజిక చరిత్రలో మౌలిక మార్పు రావడానికి రాజ్యాంగవాదం ఆటంకమని ఉదార ప్రజాస్వామిక వాదులకు విజ్ఞప్తి చేస్తూనే ఉండాలి. రాజ్యాంగ వర్గ స్వభావం వల్లే రాజ్యాంగవాదం ఆచరణలో ఓడిపోతుందని కూడా వివరిస్తూ ఉండాలి. అట్లని రాజ్యాంగవాదులందరూ ఒక్కటి కాదు.  వీళ్లలో కొందరికైనా రాజ్యాంగ పరిమితులు తెలిసి కూడా ఈ ప్రత్యేక పరిస్థితుల్లో రాజ్యాంగ సర్వస్వవాదాన్ని వినిపిస్తూ ఉండవచ్చు. ఇంకొందరు నిజంగానే రాజ్యాంగవాదాన్ని నమ్ముతూ ఉండవచ్చు. దానికి ఉన్న పరిమితులు తెలియకపోతే లౌకిక ప్రజాస్వామిక అస్తిత్వ విప్లవ శక్తుల ఐక్యతను రాజ్యాంగ ప్రమాణం మీదే ఫాసిస్టులు దెబ్బతీయగలరు. ఇదంతా కేవలం సిద్ధాంత చర్చకాదు. పూర్తిగా ఆచరణకు సంబంధించింది.

రాజ్యాంగం విధించిన పరిమితుల్లోనే ప్రజలు పోరాడాలని ఏమీ లేదు. దానికి ఆవల కూడా తమ ఆకాంక్షలను వినిపిస్తారు.  పోరాట రూపాలను చేపడతారు.  ఏ ఒక్క వ్యక్తో,  బృందమో ఇస్తే రాజ్యాంగం రాదు.   ఏ దేశ రాజ్యాంగమైనా చారిత్రక, రాజకీయార్థిక  పరిణామాల  ఫలితం. రాజ్యాంగానికంటే ప్రజాస్వామ్యం చాలా గంభీరమైనది. విస్తృతమైనది. అర్థవంతమైనది. వాటికి బూర్జువా రాజ్యాంగం కత్తెర వేస్తుంది. ఈ పరిస్థితుల్లో  రాజ్యాంగవాదమే బలపడితే ఉత్పత్తిదాయకమైన ప్రజలు చారిత్రకంగా సాధించాల్సిన ప్రజాస్వామ్యానికి, సామ్యవాదానికి తలుపులు మూసుకపోతాయి. ఫాసిస్టు సందర్భంలో ఒకే ఒక ప్రధాన శతృవును ఓడిరచడానికి మిగతా శక్తులన్నీ ఐక్యం కావాల్సిందే. ఇది ఐక్య సంఘటన ద్వారానే సాధ్యం. అలాంటప్పుడు కూడా విప్లవ శక్తులు ఇది వర్గ సమాజమని, వర్గపోరాటం ద్వారానే విముక్తి, ప్రగతి సాధ్యమనే సంగతి  మర్చిపోడానికి లేదు. ఈ రెండూ దశలవారీ వ్యవహారాలు కాదు. ఉదారవాదుల పాత్రను తగ్గించేది కాదు. వాళ్లను నొప్పించేది అంతకంటే కాదు. ఫాసిస్టు వ్యతిరేక పోరాటం చేయడమంటే విప్లవశక్తులకు వర్గపోరాటాన్ని పదునెక్కించడమే. ఈ రెంటికీ వైరుధ్యం లేదు.  ఈ రెంటినీ ఏకకాలంలో నడిపించగల పరిణతిని  సాధించాలి.

బూర్జువా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనే రాజ్య రూపాన్ని ధ్వంసం చేసి, ఉత్పత్తి సంబంధాలను  మార్చి,  అన్ని రకాల సామాజిక, సాంస్కృతిక  వైరుధ్యాలను, ఆధిక్యాలను, అంతరాలను రద్దు చేసి కొత్త రాజ్య వ్యవస్థను, కొత్త సామాజిక సంబంధాలను స్థాపించాలనుకొనే విప్లవ శక్తులకు రాజ్యాంగవాదం తీవ్రమైన ప్రతిబంధకం. ఇదొక వాదంగా, భావజాలంగా, రాజకీయ సామాజిక సిద్ధాంత రూపంగా దేశంలో ఎదుగుతున్నది. ఇది వర్గపోరాట చైతన్యాన్ని మొద్దుబార్చుతుంది. యథాతథ స్థితిని కాపాడుతుంది.  రాజ్యాంగంతోనే  సర్వం సాధించుకోవచ్చని ఉద్బోధిస్తుంది. దీన్ని అన్ని వైపుల నుంచి విరసం మహా సభల్లో చర్చనీయాంశం చేయాలనుకున్నాం.

2 thoughts on “ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం

Leave a Reply