లోకం తీరు ఎలా ఉంది? లోకంలో మెజారిటీ మనుషుల తీరు ఎలా ఉంది, రాజ్యం, మీడియా తీరు ఎలా ఉంది? సహజత్వంతో ఉన్నది ఎవరు లేనిది ఎవరు? ఎందుకు? అసమ సమాజంలో తీవ్రమైన అసహనం, సంక్షోభం ఏర్పడటానికి కారణం  ఏమిటి ? పరిష్కారం ఏమిటి?
రాజీపడటం గాయపడటమేనా? విలోమంగా ఉన్నది మనుషులా ? రాజ్యమా? ఉన్నట్టుండి  సరిగ్గా కనిపించకపోవడం, వినిపించకపోవడం, రుచిని వాసనను కోల్పోవడం, స్పర్శను కోల్పోవడానికి కారణం ఏమిటి?
సామాజిక స్పృహ చైతన్యం ఆలోచించే శక్తి వివేచన లేని వాళ్ళకి పంచేంద్రియాలు పనిచేస్తాయా? ఎరుక లేని వాళ్ళకి ఎలా ఎరుక కలుగుతుంది? ఒక సమాజంలోని సహజమైన అసహజ స్థితిని, తీవ్ర సంక్షోభాన్ని అసంబద్ధతని, సందిగ్ధాన్ని, నిరసనని, రాజీ పడలేనితనాన్ని, చుట్టూ ఏం జరుగుతున్నా తెలియనితనాన్ని, తెలిసినా తెలియనట్టు ఉండే తెలివిడిని, ప్రమాదకరంగా తప్పినా తప్పకున్నా తప్పుకు పోయే తరాన్ని.. ఒక చిన్న కథలో చూపించారు రచయిత జూకంటి జగన్నాథం. ఆ కథ పేరు “ఎరుక”. 2020 లో రెండవ ముద్రణ పొందిన ‘జూకంటి జగన్నాథం కథలు’ కథా సంపుటిలో 13 కథలున్నాయి. కవిగా సుప్రసిద్ధులైన జూకంటి జగన్నాథం అప్పుడప్పుడు కథలు కూడా రాశారు. ఈ కథలన్నీ  ప్రత్యేకమైన లక్ష్యంతో వ్రాయబడినవే. ఆంధ్రజ్యోతి వారపత్రిక దీపావళి కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ వలస(1986). 2008లో రాచకొండ విశ్వనాధ శాస్త్రి కథా పురస్కారాన్ని జూకంటి జగన్నాథం పొందారు.
“వలస, స్తన్యం, సహాయం, కళేబరం, పునరావాసం, శాంతి భద్రతలు, నారుమడి, దుగోడ, రాజయ్య మజిలీ, యాతనఇల్లు, వైపని, ఎరుక ” ఈ కథల నిండా ఒక తాత్వికత ఉంది. విలువల కోసం సమానత్వం కోసం స్వేచ్ఛకోసం చే‌సే పోరాటం ఉంది. అన్యాయాన్ని ఎదిరించడం ప్రశ్నించడం ఉంది. మనిషి కోసం ఆలోచన తపన ఉన్న కథలివి.
జూకంటి కథలు మొదట 2005 లో వచ్చాయి. మరోసారి “జూకంటి జగన్నాథం కథలు” పేరిట  2020లో  ఈ కథలను ముద్రించడం ఒక సాహిత్య అవసరం. 15 సంవత్సరాల తర్వాత కూడా ఈ కథలు పాఠకులను వెన్నాడుతూనే ఉన్నాయి. ఈతరం కథకులు పాఠకులు మళ్లీ ఈ కథలను చదవాల్సిన అవసరం ఉన్నదని ఈ కథలోని పాత్రలు, కథా వస్తువులు చెబుతున్నాయి. కథకుడి ప్రశ్నలకు సమాధానాలు ఇంకా అన్వేషించాల్సి ఉంది.
 ఈ కథా  సంపుటి లోని చివరి కథ ‘ఎరుక ‘2005 విపుల మాస పత్రిక లో వచ్చింది. అనాదిగా మనిషికి  లేనిది, అందరికీ తప్పనిసరిగా  కావాల్సింది అదే.. ఎరుక!

“ఎరుక”
సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేసరికి మా ఆవిడ ఇల్లు కడగడం మొదలుపెట్టింది. రేపు శుక్రవారం కాదు ఎందుకు ఇల్లుకడుగుతుంది. బహుశ ఏమైనా పండుగ వుందా ఏమిటనుకుందామంటే సెలవూ లేదు.
” ఏమిటి బడి నుంచి వచ్చీ రావడంతోటే పని మొదలు పెట్టావు. కొంచెమన్నా విశ్రాంతి లేకుండా ఏమిటి విశేషం” అడిగాను.
” ఒరిగితే అలాగే వుంటుంది. పని ఎప్పుడో ఒకప్పుడు నేనే చేయాలి. కదా! పొద్దున రెండు గంటల ముందు లేవడం కష్టం. అయినా రేపు నాగుల పంచమి. పాములకు పాలు పొయ్యాలి”. కారణం చెప్పింది.
“ఏంది పాముకు పాలు పోస్తారా ” ధ్వని విశేషంగా లోన అనుకుంటూనేపైకి అనేసాను.
“అవును పోస్తారండీ ” బకెట్టు నీళ్ళలో మగ్గు ముంచి గచ్చుమీద పోస్తూ చీపురుతో రాస్తూ మొఖం పైకెత్తి ఇంత చిన్న విషయం తెలియదా అన్నట్టు నా అమాకత్వంలోకి తొంగి చూసింది.
ఇటీవల చాలా సార్లు ఇలాగే జరుగుతుంది. సంఘటనలు చిన్నవైనా పెద్దవైనా జ్ఞాపకం వున్నా లేనట్టూ, లేకపోయినా వున్నట్టూ అంతా అదోరకంగా వుంటుంది.
పోయిన నెలలో అనుకుంటాను. దవాఖాన చుట్టూ, డాక్టర్ల చుట్టూ రకరకాలుగా తిరగడం జరిగింది. ఇంతెందుకు నన్నూ నా పరిస్థితిని తలుచుకొని మా ఆవిడ పోతానో వుంటానో అనే సందేహం వచ్చి నిక్షేపంలాటి టీచరు ఉద్యోగంవున్నా భూత భవిష్యత్ వర్తమానా కాలాలు ఏకకాలంలో చుట్టుముట్టగానే తలుచుకు భయపడి ఒకదశలో నన్ను పట్టుకు భోరున ఏడ్చేసింది.
రోజూ అదే దారిలో ఆఫీసుకుపోతాను. కానీ ఒకసారి అదే తొవ్వలో మిట్టపల్లం వున్నచోట చెప్పులు వేసుకోకుండానే వస్తూ తట్టుకొని కాలి బొటన వేలి గోరు లేచిపోయింది. మరోసారి అదేచోట కాలు తట్టుకొని చెప్పుగూడ తెగిపోయింది. చాలా సార్లు ఆ ప్రదేశం వరకు వచ్చే సరికి జాగ్రత్తగ నడువాలనుకొని బలంగా నిర్ణయించుకొని ఇంటి నుండి బయలుదేరుతాను. అనేక కారణాలు, అక్కడికి రాగానే మొన్న జాగ్రత్తగా వున్న కాస్తా ఎత్తుకన్నా కాలు చాలా పైకెత్తి ముందు పాదం ఆనకుండానే వెనుక రెండోకాలును లేపి బొక్క బోర్లా నేనూ, కంటి అద్దాలు చెరోవైపు పడిపోయాము. నొసలుకు కంకరరాయి తాకి మూడు కుట్లు పడ్డాయి. పైంటు చినిగి మోకాలు చిప్ప రాక్కపోయింది.
ఇది జరిగినప్పుడు ఎవరూ చూడలేదు. వెంటనే కూడ తీసుకొని లేచి కండ్లద్దాలను తగిలించుకొని ఆఫీసు దిక్కు నడిచాను. తొవ్వలో కిరాణం దుకాణం అతను సైకిల్ పై వస్తూ చూసి నమస్కారం పెడుతూ ఆశ్చర్యంగా “ఏంటి సార్ ఏమైంది ముఖమంతా రక్తం పొద్దుగాల్నే ఏమైంది” ప్రశ్నిస్తూ పోతున్న ఆటోను ఆపి హాస్పిటల్కు తీసుకుపోయాడు.
బడికి పోయిన మా ఆవిడ ఇంట్లో టి.వి. సీరియల్ చూసే మా అమ్మ. వున్న ఫలంగా దగ్గరకు వచ్చారు.
తెలిసిన డాక్టరు కావడం వలన వెంటనే పలుకరించి, తగిలిన గాయాలను శుభ్రపరచి నొసలుమీది దెబ్బకు కుట్లు వేసాడు. కొంచెం పడుకోండి. మళ్ళీ వస్తానని మిగిలిన పేషెంట్లను చూడడానికి వెళ్ళాడు.
నా వెంటనున్న కిరాణషాపు అతను ‘అమ్మా! సార్ ఇగో ఇక్కడవున్నాడు. చెప్పవద్దన్నా  దెబ్బలను చూసి భయపడి చెప్పానమ్మా! రండి” అంటూ నా బెడ్ దగ్గరికి మా ఆవిడను, అమ్మను తీసుకువచ్చాడు.
ఇగచూసుకో అందరి అమ్మల సొంటిది కాదు మా అమ్మ. కష్టమైనా సంతోషమైనా దుఃఖమైనా ఏది వచ్చినా మా అమ్మను ఆపడం ఎవరి తరం కాదు, ఇంతెందుకు నా భార్యకు, అమ్మకు కొట్లాట, కాకిమీదో, పిల్లిమీదో, పిల్లల మీదో, మూలకున్న చీపురు మీదో నెపం పెట్టుకొని సూటి పోటీ మాటలతో మొదలై చిలికి చిలికి గాలి వాన తుపానై నేనూ బజారుకు, పిల్లలు మా పక్క ఇంట్లోకి బెదిరి చెల్లా చెదరై పోయినా లెక్క చేసేది కాదు.
అయిదారు గంటల తరువాత నేనూ పిల్లలూ పిల్లుల్లాగా కాలులో కాలు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళే సరికి ఆశ్చర్యంగా అత్తా కోడలూ కలిసి అంతవరకూ ఏమి జరగ లేదన్నట్టూ ఎత్తేసిన నీళ్ల బిందె సొట్టను కోపంగ కింద విసిరేసినప్పుడు రెండుగా పగిలిన కప్పునూ మరచి సాయంత్రం టి.వి.లో వచ్చే సీరియల్ గురించి చర్చించుకుంటూ అన్నం తింటుంటారు. నాబెడ్ కు  చెరోపక్క చేరి దెబ్బలను చూసి ఆవిడ నిశ్శబ్దంగా కళ్ల నీళ్లు పెట్టుకుంటూ దీనంగా చూస్తుండగా, అమ్మ గొంతెత్తి ఏడ్వడం ప్రారంభించింది. ‘అమ్మా! నాకు ఏమి కాలేదు. ఇది దవాఖానా… మెల్లగా, బాగుండదు. ‘ అన్నాను.
“ఏందో! బాగుండేది. ఎవరికి సాలు లేదా కొడుకా! ఇంకా నయం. పడ్డప్పుడు తగులరానిచోట తగిలితే…” ఏమేమి యాది కొచ్చినయోగానీ ఏడుపు ఆపి ఇంకొంచెం గొంతుపెంచి ఎట్లాజరిగింది. పడేముందేమని పించింది. ” హోష్ లో  ఉన్నవా లేదా. కండ్లు చక్కరచ్చినయా డాక్టరుకున్నా సవాలక్ష ప్రశ్నలు వేసి విషయమంతా అవలోకన చేసికొని ఒక నిర్ణయానికొచ్చింది. ఇలా మొదలవుతుంది కథ. ఆమె అభ్యర్ధనపై చూపు సరిగా ఉందా లేదా అని కంటి డాక్టర్ చేత అక్కడే పరీక్షలు చేయిస్తారు.
“కండ్లకు దూరపు చూపు సరిగ్గానే వుంది. గానీ దగ్గరి చూపు తక్కువవుందమ్మా. ఇవే కండ్లద్దాలు సరిపోతాయి” అన్నాడు డాక్టర్.
బెడ్ మీద కళ్ళుమూసుకు పడుకున్నాను. ఇగ మా అమ్మ పక్కనున్నోల్ల గురించిన ఆరాలు విశేషాలు తను ఇక్కడికి ఎందుకు వచ్చిన సంగతి పూసగుచ్చినట్లు చెప్పుకు వస్తుంది..అతడి  లోపలి ఆలోచనలు  అంతర్మధనం అక్కడ ఇలా మొదలవుతుంది…
పడుకున్నాననే మాటే గానీ అనేక విషయాలు నన్ను చుట్టుముడుతున్నాయి. కండ్లముందు ఎంత అన్యాయం జరిగినా పట్టపగలు ఘోరాలు జరిగిపోతున్నా ఎందుకు ప్రశ్నించలేక పోతున్నాను. ఎన్ని సంఘటనలు. ఎన్ని పచ్చిమోసాలు. మనుషుల్ని పిట్టలెక్క కాల్చేసి కథ అల్లడం. పక్కసీట్లోని తోటి ఉద్యోగి బీడీలు చేసుకు బతుకుతున్న స్త్రీ ఇండ్ల పట్టా కోసం కేవలం దరఖాస్తు తీసుకుంటేనే యాభై రూపాయలు తీసుకోవడం, వాడలోనున్న కొత్త కోడలు పిల్లను తెల్లారేసరికి చిత్రహింసలు పెట్టి చంపి కిరోసిన్ పోసుకొని కాల్చుకు ఆత్మహత్య చేసుకుందనే కథ. ఒకటా రెండా, ఎన్ని ఎన్నెన్ని కుతంత్రాలు అన్యాయాలు, చుట్టూ ఇంత జరుగుతున్నా కండ్లకు స్పష్టంగా కనిపిస్తున్నా పుట్టుగుడ్డిలాగా ప్రవర్తించడం. ఇట్లా ఆలోచనలు ఇటీవల ఎక్కువగా అయ్యాయి. వస్తున్నాయి. నిలదీస్తున్నాయి. ప్రశ్నిస్తున్నాయి. ‘థూ’ నా నిస్సహాయతను ఛీ కొడుతున్నాయి. అసహ్యించుకుంటున్నాయి.
మాటల్ని వినివినీ “అమ్మా ఆమెఎవరు” అని ఒకామె మా అమ్మను అడిగింది.
మా కోడలు ఫలానా స్కూల్లో టీచర్. కొడుకు ఫలానా తహసీల్ ఆఫీసులో ‘తాసిలిగొట్టు’ ఉద్యోగం చేస్తున్నాడనీ తన మనుమలు మనుమరాండ్లు, కొడుకులు, బిడ్డలు, కోడండ్లు, అల్లుండ్లు, ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారో మొత్తం తన కుటుంబం గురించి టూకీగా చెప్పింది.
దెబ్బలు మానే వరకు రెండుమూడు రోజులు సెలవు పెట్టమని ఇద్దరికీఅమ్మా, పిల్లలూ చెప్పారు.
ఇంట్లో వుంటే అత్తాకోడండ్ల యుద్ధం ఏమి చూడాల్సి వస్తుందోననుకుంటూనే – నేను అడ్డం పడినప్పటి నుంచీ ‘అత్తాకోడండ్లా’ లేక వీళ్లిద్దరూ ‘తల్లీబిడ్డలా’ అనేంత కలిసిమెలిసి వుండడాన్ని చూసి ఆశ్చర్యంతో సరే నన్నాను.
ఒక రోజు ప్రశాంతంగానే గడిచింది. తెల్లారి పది గంటలకు స్టౌవుమీద పాలు పొంగి పొయ్యాయి. ఇగ అట్లా రాజుకున్న విషయం సాయంత్రమయ్యే సరికి ఇద్దరిమధ్య భగ్గున మంటలు తారాస్థాయికి లేచాయి. ఇంత గట్టిగా ఇద్దరు పోట్లాడుకుంటున్నా మౌనంగా వున్నాను.
పిల్లలు కాలేజీ నుంచి రాగానే ఎవరి మనుసుల వాళ్ళే చాయించుకొని శాంతి చిహ్నంగా తెల్లజెండా ఎగిరేసి హాలులో టీ.వి. దగ్గర మూగారు.
కూర్చున్నట్టే కూర్చొని అందరిమధ్య నుంచి లేసి ఆమె నా దగ్గరికివచ్చింది. తన లోపలి గాయాన్ని దాచుకొని కనిపిస్తున్న నా పచ్చిగాయాలకు అయింట్మెంట్ పూసింది.
“చింతపండు తొక్కుతోనన్నా ఉడుకుడుకన్నం నాలుగు బుక్కలు కళ్ళుమూసుకుతింటే నాలుకకు రుచి పుడతని చేస్తున్ననయ్యా” చిన్న మనుమనితోని అమ్మ చెప్పుతుంది.
తెల్లారిలేస్తే ఇల్లంతా మహాయంత్రం లెక్క కదులుతుంది. పిల్లలు వెళ్లగానే ఇల్లు మౌనంలోకి వెళ్ళిపోతుంది. “అత్తా” “ఏంది”
“నీ కొడుకును చూస్తుంటే నిన్నటి నుంచీ మనిద్దరం గింత లొల్లి పెట్టుకుంటుంటే హరీ అనక పాయె శివా అనక పాయె. ఇంతకుముందు ఎప్పుడన్నా నన్నో నిన్నో ఏదన్నా అనుడో లేక అలిగి సరసర్ర అవతలికి పోవుడో చేసెటోడు. ఒక్కమాట అనకపాయె. ఏందని అడుగక పాయె”.
“ఏదో వాని బాధ వాడు. పూర్తి చిన్న పిల్లగాని లెక్క బొక్కబోర్లా పడ్డానని వానిదాంట్ల వాడు పతుకులాడుతుండు. వానికేమన్నా చెవుడా ఏంది. వాంది పెద్దబుద్ధి. పెద్దమనసు”.
” ఏం బుద్దో ఏం మనసో రోజురోజుకు ఎందుకు గింత బెల్లం కొట్టిన రాయిలెక్క తయారైతుంది. నాకు నీ కొడుకును చూస్తే రోజుకింత భయమైతుంది”.
సర్దితో ప్రాణం పోయేంత దగ్గు తుమ్ములూ ఒక్కసారి వచ్చేసరికి ఇద్దరూ ఒకేసారీ నాదగ్గరికి ఉరికివచ్చారు. కొంచెంసేపటి తరువాత ఆవిరి పట్టారు. అయినా తగ్గకపోవడమే కాకసాయంత్రం వరకు మరింత ఎక్కువైంది. దగ్గి దగ్గి డొక్కలు పుండోలె నొప్పి పెట్టాయి. మధ్యాహ్నం తిన్న ఎల్లిపాయకారం చింతపండు అన్నం మెతుకులు బయటకు వచ్చేసాయి. నాలుకకు రుచి కలుగకపోగా మరింత చేదుగా తయారైంది.
“రాత్రంతా పగలంతా నిద్రే పోలేదు. ఎట్లా అత్తా”
ఒక సమాలోచన చేసి నన్ను ఎంతవద్దని మొత్తుకున్నా చెవి ముక్కు గొంతు డాక్టరు దగ్గరికి తీసుకుపొయ్యారు.
డాక్టర్ టేబుల్ ముందు నిల్చున్న కోడలు అత్తతో అనుమానంగా ఏదో గుసగుస పెడుతుంది.
“రండి సార్” అని డాక్టర్ అనగానే మళ్లీ స్టూలు మీదికి వచ్చి కూర్చున్నాను.అత్తా కోడలు ఏమి చెప్పారో గాని డాక్టరు అంతవరకూ చూసిన ముక్కూ గొంతూ నాలుకనూ విడిచిపెట్టి చెవుల్ని పరీక్షించడం మొదలు పెట్టాడు. ఏవేవో ఇటీవలే ఫారిన్ నుంచి దిగుమతి చేసుకున్న లేటెస్టు పరికరాలతో  పరిశీలించసాగాడు.
రోజు రోజు ముక్కు వాసనను, నాలుక రుచిని కోల్పోతున్నాయన్నాను.
విషయం అంతా నాకు అర్ధం గాక అర్ధమయ్యే సరికి “అమ్మా! సార్కు చెవుడు లేదు వినికిడి శక్తి బాగానే వుంది” అంటూ సరికి ఏవేవో గోళీలు ముక్కులోకి ఏవో చుక్కలు రాసిచ్చాడు.
నాకు బాగా వచ్చిన కోపాన్ని ఆపుకొని ఇంటికి రాగానే “అమ్మా నాకు మీరు ఏమైందనుకుంటున్నారే” అడిగాను.
“ఏమైందిరా ఏమిలేదు. రోజులు మంచిగలేవు ఈ రోజులల్ల ఒకటుకుంటే ఒకటవుతుంది. అయినా ఎందుకంత కోపం. అన్నీ నీమంచికోసం కాకుంటే ఎందుకురా ఇదంతా” అంది.
“అడ్డం పడ్డకావచ్చు. దెబ్బలు తగిలినై కావచ్చు. దానికి గంతగనమా అదే మొన్నటికి మొన్న కండ్లు కనిపిస్తలేవేమోనని- ఇయ్యాల చెవులు వినిపిస్తలేవేమోనని – అసలు నిన్ను గాదు అనాల్సింది. దాన్ని అనాలి. చదువుకున్న మొద్దు. బయట పేరువుంటే చాలదు. చాతనైతే ఎదుటి వారిని అర్థం చేసుకోవాలె. చాతకాకుంటే మలుసుక పడుండాలె. ఎమ్మెస్సీ బి.ఎడ్. చేసిన దాని లెక్క ఏమైనా ఆలోచిస్తున్నవా ఆచరిస్తున్నవా నా నుంచి ఏమి నేర్చుకున్నావే నువ్వు” తీవ్ర స్వరంతో అన్నాను.ఆ మాటతో కోడలు బాధపడితే, అత్త ఓదార్చడానికి వెళుతుంది.
రెండు రోజుల తరువాత కొంచెం సర్దీ దెబ్బలు తగ్గాయి. సాధారణంగా ఎప్పుడూ ఇంత కోపానికి రాని నన్ను, పిల్లలు అదోరకంగా చూడడం మొదలు పెట్టారు.
ఇగపోతే అమ్మా ఆవిడా సమయం దొరికినప్పుడల్లా నా గురించి నా ఆరోగ్యం గురించీ- మా అమ్మ వాళ్ల తాత తాతకు లేసిన ప్రకోపం గురించి – ఇనుప గొలుసులతో కట్టేయడం గురించి – కట్టేసిన గొలుసుల్ని తెంపుకొని చెట్లు గుట్టలు పట్టుకు రాత్రికి రాత్రి పరుగెత్తడం గురించి – ఇట్లా మాట్లాడుకొని మాట్లాడుకొని నా ఆరోగ్యం దగ్గరికి వచ్చి ఆగేవారు. పెద్ద తిరుగులేని రోగం వచ్చినట్టు అత్తాకొడలూ నిశ్శబ్దంగా నాకు వినరావద్దనుకుంటూనే నాకు వినిపించేలా ఏడుస్తూ నాకు కనిపించేలా ముక్కుల్ని ఎగతడుతుండే వారు.
మంచం మీద పడుకొని ఎదురుగా గోడకు కొట్టిన నిలువెత్తు అద్దంలోకి నాలోకి పదే పదే చూసుకునే సరికి పైకి ఒప్పుకోలేక పోయినమా, ఆవిడకు అమ్మకు కలిగిన భయంలాంటిది కాకున్నా తెలియని ఇది అని చెప్పలేని ఆందోళన క్రమంగా నన్ను ఆవరిస్తుంది.*ఎందుకోసం ఎం జరుగుతుందో ఎందుకు అతడు మధన పడిపోతున్నాడో, ఎందుకు మరిన్ని  ఆలోచనలు చుట్టుముడుతున్నాయో  రచయిత మాటల్లోనే..
విధ్వంసం, బీభత్సం, దుఃఖం, ఆత్మహత్యలు, హత్యలు. అన్యాయం. పనిలేకపోవడం. పనిదొరకక పోవడం. లేబర్ అడ్డాలు ప్రతి పట్టణంలో వెలియడం. ప్రజా ఉద్యమాలు, రిజర్వేషన్లు, మెరిట్లు, డిమెరిట్లు, చేతగాని రాజ్యాంగం. రాజ్యాంగబదులు. రాజ్యాన్ని కూలదోసే వాళ్లు. పట్టపగలు చట్టసభల్లో చిమ్మన్ చీకటి, మతాలు, గతాలు, ఓట్లు, ఎన్నికలు, ఎరతో సహా గాలాన్ని ఎత్తుకుపోయే దొంగలు. నీళ్లు, కన్నీళ్లు, అప్పులు, అంశాలు, తిప్పలు, చిప్పలు.
ఎన్ని ఎన్నెన్ని ఇంత చుట్టూ జరుగుతుంటే నేనే నాలోకి ముడుచుకు పోవడం కాస్సేపు మానవ సంబంధాల అబద్దపు తాబేలు తలను బయటకు పెట్టి, వెంటనే సౌకర్యాల డిప్పులోకి వెళ్లి పోవడం. మిగిలిపోతున్నది. పోగొట్టుకుంటున్నది. చెప్పతరం కాదు. పట్టనితనం. పట్టినా పట్టనట్టు వ్యవహరించే తనం. తెలియనితనం. తెలిసినా తెలువనట్టు వుండే గుణం… ప్రమాదకరంగా తప్పినా తప్పుకున్నా తప్పుకుపోయే తరం పెరిగిపోతుంది.
సెలవులు అయిపోయ్యాయి. పైన దెబ్బలు పూర్తిగా మానాయి. సర్ది తగ్గిపోయింది. కానీ లోపల గాయాలు మరింత రేగి పోతున్నాయి. ఇంకా ఇలాగే మరో రెండు రోజులు పడుకుంటే ఇద్దరూ కలిసి నన్ను సైక్రియాట్రిస్టుకు చూయించినా పెద్దగా బాధ పడాల్సిన అవసరం వుండదు. స్థితి అలాగే వుంది.
పిల్లలు రోజులాగే కాలేజికి వెళ్లిపోయారు. నేనూ, రాణీ ఒకరికొకరు చెప్పుకోకుండానే తప్పించుకు ఆఫీసుకు, బడికి తయారై పోయ్యాము.
 “లచ్చన్నా ఆఫీసుకా” నన్ను ఉద్దేశించి అమ్మ అంది.
బజారు నుంచి ఇంట్లోకి – ఇంట్లోంచి టీ.వి.లోకి – మనుషులు మరీ ఎందుకు ఇలా తయారవుతున్నారో నాకు తెలియడం లేదు.
వత్తులు చేసుకొనే దూది బుట్టను పట్టుకొని అమ్మ చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుకోవడానికి గద్దె మీదికి నడిచింది.*అతడికి మనిషి అసహజత్వం పట్ల, ఏమీ చేతకాని తనం పట్ల అవగాహన ఉంది, అదే సమయంలో ప్రశ్నించే ధోరణి ఉంది. రాజీ పడటం పట్ల అసంతృప్తి ఉంది. సర్దుకు పోవడం పట్ల చిరాకు ఉంది. అతనికి ఎక్కడ ఎలా స్పందించాలో తెలుసు, సమస్య అంతా స్పందించకపోవడం పట్లనే.
సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంది.  పాలనా విధానాలను ప్రశ్నిస్తూనే, నిరంతరం రావాల్సిన మార్పు కోసం అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉండక తప్పని పరిస్థితి. సమాజ దుస్థితి కి కారణం ఎవరో పరిష్కర్తలు కూడా వాళ్లే. వాళ్ళు పట్టీ పట్టని తనం  నుంచి, ముసుగులో నుంచి  బయటపడాలి. ఒక ఎరుక కోసం వాళ్లు మొదలు కావాలి. సమాజంలోమార్పు కోరే వాళ్ళు  కనిపిస్తారు కానీ , మార్పు కోసం నిరంతరం ప్రయత్నం చేసే వాళ్లకు ఎవరు సహకరిస్తున్నారు? జనం కోసం ముందుకు వచ్చే వాళ్ల కోసం జనం కదలివస్తున్నారా? మనుషులు అప్పుడు టీవీ లోకి ఇప్పుడు సెల్ ఫోన్ లోకి.. నిరంతరం వాళ్ళను వాళ్ళు కప్పి పెట్టుకుంటున్నారు తప్ప, రావలసిన చోటికి మనుషులు రావడం లేదు. గుమిగూడాల్సిన చోటికి మనుషులు గుమిగూడటం లేదు. కదలిక చలనం స్పందన లోపించడమే అసలైన వర్తమాన సంక్షోభం.
అందరూ ఇంటికే పరిమితమై పోతే, చెవులుండీ వినపడని వాళ్లయిపోతే, కళ్ళుండి కనపడని వాళ్ళయిపోతే, స్పర్శజ్ఞానం కోల్పోయిన వాళ్ళయిపోతే.. పంచేంద్రియాలు పని చేయని వాళ్ళయిపోతే.. మిగిలేది ఎవరు? సున్నితత్వం, మనిషితనం, వివేచన, చైతన్యం  కోల్పోయి  వికృత జీవిగా మిగిలిపోతున్నది ఎవరు? చాలా లోతైన విషయాలను చర్చకు పెట్టిన కథ ఇది. మాట్లాడుకోకుండా తప్పించుకోవటానికి మనుషులు తమ వృత్తుల్లోకి, వినోదాల్లోకి   వెళ్లిపోవడం కూడా ఒక యదార్ధ నిత్య పలాయనవాదమే. ఇంట్లో కుటుంబ సభ్యులను, కార్యాలయాల్లో సహోద్యోగులను సరిదిద్దుకోవాల్సిన చోట, ప్రజల సమస్యలను ఉచితంగా పరిష్కరించాల్సిన చోట, ప్రభుత్వ సేవలకు కూడా ఖరీదు కట్టే చోట, ఇలా సర్వత్రా తక్షణం మార్పు రావాలి.
హింసల స్వరూపం రోజు రోజుకి మారుతోంది. స్త్రీలపై కొనసాగుతున్న దౌర్జన్యాలు, దాడులు, గృహ హింసల పద్ధతులు మారాయి కానీ, నిరంతరం దోపిడి హింస కొనసాగుతూనే ఉన్నాయి. మనిషి పతనం అవుతూనే ఉన్నాడు, విధ్వంసానికి గురవుతూనే ఉన్నాడు. అయితే మనిషి లోపలి విధ్వంసానికి కారణం? పరిష్కారం ఏమిటి?
చురుకైన పదునైన ప్రశ్న  శతాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఎరుక కలగాల్సిన వాళ్లకి, ఎరుక కలిగేది ఎప్పుడు? ఎలా?

Leave a Reply