మరణం ఎప్పుడూ మనిషిని భయపెట్టేదే ..ఏ దేవుడ్ని నమ్ముకున్నా ఆ బాధ తీరేది కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ కొన్ని సమస్యలకు పరిష్కారం కొందరి చావులతోనే ముడిపడేవి.. అంతకు మించి ఆలోచించే స్థాయికి సమాజాలు కూడా ఎదగలేక పోయాయి.
మార్కిజం వెలుగులో సమస్యలకు అసలు పరిష్కారం ఎక్కడుందో తెలుసుకున్న బెల్లంపల్లి యువకులు కొందరు విప్లవాచరణలోకి వెళ్లారు. అందులో ఒకరు కామ్రేడ్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్.
రాష్ట్రంలో 1973 నుంచి విప్లవ విద్యార్ధి ఉద్యమం ప్రారంభమైంది. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతం నుండి చాలా మంది విద్యార్థులు వరంగల్, హైదరాబాద్ పట్టణాలలో ఇంజనీరింగ్ , పాలిటెక్నిక్ కోర్సుల కోసం వెళ్లేవారు . అప్పటికే నగరాల్లో విస్తరించి వున్న విప్లవ రాజకీయాలు వీరికి అబ్బి, వాటిని బెల్లంపల్లి పట్టణంలో ప్రచారం చేసేవారు. వరంగల్ రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి అయిన కామ్రేడ్ గజ్జెల గంగారాం ప్రథముడు. మంచిర్యాల డిగ్రీ చదువుకుంటున్న కటకం సుదర్శన్ కూడా ఈ విప్లవ రాజకీయాలకు ఆకర్షితుడైనాడు.
ఎమర్జెన్సీ (1975)కాలంలోనే కార్మికుల్ని ఆర్గనైజ్ చేయడం కోసం కామ్రేడ్ ఆనంద్ కార్మికుడిగా ఉద్యోగంలో చేరాడు. యువకులను రహస్యంగా ఆర్గనైజ్ చేసాడు. ఆ కాలంలో మూడు నాలుగు స్టడీ సర్కిల్స్ ఏర్పాటయ్యాయి.
ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత 1977లో బెల్లంపల్లి పట్టణ కమిటీలో సభ్యుడిగా పని చేసాడు. 1978 లో కామ్రేడ్ ఆనంద్ రైతాంగ ఉద్యమాన్ని నిర్మించడానికి ఆదిలాబాద్ జిల్లా లక్షట్ పేట్ తాలూకా కి వెళ్ళాడు. ఆ తర్వాత అతడు భారత్ విప్లవోద్యమానికి ముఖ్య నాయకుడు అయ్యాడు .
వాళ్ళు ఆయుధం పట్టుకున్నారనే సాకుతో విప్లవకారుల మరణాలను దోపిడీ ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి. అప్పుడప్పుడు ప్రజల ఆకాంక్షల మేరకు చర్చలు జరుపుతున్నా ఫలితాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఇల్లు విడిచి, ఊరు విడిచి ఆదివాసుల కోసం, మొత్తంగా పీడితప్రజల విముక్తి కోసం ఒక స్పష్టమైన అవగాహనతో రాజకీయ పోరాటం చేయటం పెద్ద నేరం అయిపోయింది. ప్రభుత్వం వారి తలలకు వెలలు కట్టి వేట మొదలు పెట్టింది. వాటిలో కోటి రూపాయల తల కామ్రేడ్ ఆనంద్‌ది. ఆయనది పెద్దతలకాయే. గత 45 ఏండ్లుగా శత్రువు కన్ను గప్పి, తన ఫోటో కూడా దొరకనీయకుండా ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నాడు . ప్రభుత్వ దాడుల్ని తిప్పికొట్టే వ్యూహంలో తాను తలమునకలై ఉన్నాడు. ప్రజల్ని ఒక యుద్ధానికి సన్నద్ధం చేసే పనుల్లో సిద్ధహస్తుడు. ఒక లెనిన్‌లా, ఒక స్టాలిన్‌లా, ఒక మావోలా సామ్రాజ్యవాద పెట్టుబడికి గోరి కట్టే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ యుగానికి అవసరమైన పనిని అతను తల కెత్తుకున్నాడు.
ప్రభుత్వం, మీడియా పనిగట్టుకుని కొన్ని మాటల్ని, భావాల్ని భలే ప్రచారం చేస్తాయి. ఉగ్రవాది, తీవ్రవాది, నక్సలైట్ అనే పదం కూడా మొదట్లో మీడియాలోనే వచ్చింది. నక్సలైటు అంటే ప్రజలు ఎక్కడ మంచివాళ్లు అనుకుంటారో అని కాబోలు తీవ్రవాదులు, ఉగ్రవాదులు అని రాస్తున్నారు ఈ మధ్య. అంతలోనే వారితో చర్చలు జరుపుతారు. అంతలోనే అన్నీ చట్ట విరుద్ధం అయిపోతాయి. అణచివేత ను బట్టి తిరుగుబాటు ఉంటుంది. చరిత్రలో ఏ తిరుగుబాటుని వెంటనే ఒప్పుకున్న దాఖలాలు లేవు. కాని, చరిత్ర నిర్మాతలైన ప్రజలే నిజమైన న్యాయ నిర్ణేతలు.
Lalsalaam