భారతదేశం మధ్య ప్రాంతంలోని ఆదివాసీ ప్రాంతాలలో చాలా కాలంగా ఖనిజాల దోపిడీ విపరీతంగా జరుగుతోందని మనందరికీ తెలుసు. పెట్టుబడిదారులకు ఈ దోపిడీని సుసాధ్యం చేయడానికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతాలలో నివసించే ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఈ ప్రాంతాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నాయి. భారతదేశమంతటికన్నా అత్యధిక సంఖ్యలో అర్ధ సైనిక బలగాలు ఈ ప్రాంతాలలో ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాల్లో మోహరించిన ఈ సైనిక బలగాలు ప్రభుత్వ విధానం ప్రకారం ఆదివాసీల ధైర్యాన్ని దెబ్బతీయడానికి మహిళలపై లైంగిక దాడులు చేస్తాయి.
బస్తర్‌లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్త సోనీ సోరీ కూడా స్వయంగా శారీరక రాజ్య హింసను భరించింది.
మహిళా దినోత్సవం గురించి ఆమెతో మాట్లాడాం.
మహిళా దినోత్సవం రాబోతుంది, మీరు ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం జరుపుకుంటారు కదా!
గత 2-3 సంవత్సరాల నుంచి మాకు కూడా ఆ రోజున మీతో కలిసి ఉండే అవకాశం వచ్చింది.
భద్రతా బలగాల చేతిలో అత్యాచారానికి గురై, బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చిన మైనర్ ఆదివాసీ బాలిక జ్ఞాపకార్థం మీరు ఒక స్థూపాన్ని నిర్మించారు. గత సంవత్సరం డిసెంబరులో అదానీకి వ్యతిరేకంగా ఆందోళన చేసినందుకు ఈ ప్రాంత ఆదివాసీ నాయకురాలైన మీ సహ కార్యకర్త హిడ్మేని అరెస్టు చేసి యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు. ఆమె విడుదల కోసం ఉద్యమం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా బస్తర్ ఆదివాసీ మహిళల పరిస్థితి ఎలావుందో వాస్తవాన్ని దేశానికి చెప్పండి.
“దేశం మొత్తం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటోంది, కానీ బస్తర్‌లోని ఆదివాసీ మహిళలకు మాత్రం స్వేచ్ఛ లేదు” అని సోనీసోరీ అన్నారు. గతేడాది మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని నా స్నేహితురాలు హిడ్మేతో అన్నప్పుడు చాలా సంతోషంగా అన్ని వైపులకూ కబురు చేసింది. కానీ మహిళలు సమావేశమయ్యారనే సమాచారం తెలియగానే పోలీసులు అన్నివైపులా నుంచి చుట్టుముట్టి దిగ్బంధనం చేశారు. మహిళల దుస్తుల లోపల కూడా సోదా చేశారు. వారిపై లాఠీచార్జి చేశారు. ఐదు జిల్లాల మహిళలం కలిసి మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలనుకున్నాం. బీజాపూర్, దంతేవాడ, సుక్మా, బస్తర్‌తో సహా సమీప జిల్లాల మహిళలు తమ కష్ట, సుఖాల్ని పరస్పరం కలబోసుకుందామనుకున్నారు. ఒక రాత్రి కలిసి వుండి కబుర్లు చెప్పుకొని మర్నాడు విడిపోదామనుకున్నారు. కానీ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అలా జరగనివ్వలేదు. దుఃఖం, విషాదాన్ని మాత్రమే మిగిల్చింది. మా స్నేహితురాలు హిడ్మేని కిరాతకంగా లాక్కెళ్లి జైల్లో పెట్టింది. మాకు ఇదే ఈ మహిళా దినోత్సవ ప్రాముఖ్యత.
భారతదేశంలోని మహిళలు మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు, కానీ బస్తర్‌లో మహిళలు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలనుకుంటేపోలీసులు వారిని సోదా చేస్తారు. వారిపై లాఠీచార్జి చేస్తారు. బస్తర్‌లో ఏం జరుగుతోంది, ఇక్కడి మహిళల వారు ఎలాంటి స్థితిలో వున్నారు?ఇదంతా ఎందుకు జరుగుతోందో మీరు దేశానికి తెలియచేయండి?
బస్తర్‌లో స్త్రీ,పురుషులిద్దరూ చిత్రహింసలకు గురవుతున్నారు. కానీ మహిళలు తమ విభిన్నశరీరాకృతి వల్ల అఘాయిత్యాలకు కూడా గురవుతున్నారు. బలగాలు దాడి చేసినప్పుడు, పురుషులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి అడవిలోకి పారిపోతారు, లేదా వారిని బూటకపు ఎన్‌కౌంటర్ కాల్పుల్లో చంపేస్తారు లేదా జైల్లో పడేస్తారు. కానీ మహిళలు తమ ఇళ్ల నుండి పారిపోరు. ఎందుకంటే తన ఇంటిని మహిళనే కాపాడుకోవాలి కదా. భద్రతా బలగాలు ఆహార ధాన్యాలు, డబ్బు, నగలను దోచుకుంటారు లేదా వస్తువులను చెల్లాచెదురు చేస్తారు. ఆ తరువాత స్త్రీలను వివస్త్రలను చేస్తారు, సామూహిక అత్యాచారం చేస్తారు. పోలీసులను చూసి అడవిలోకి ఎందుకు పారిపోరని గ్రామంలోని బాధిత మహిళలను నేను చాలాసార్లు అడిగాను. పిల్లలతోనో లేదా గర్భంలో ఉన్న బిడ్డతో ఎలా పారిపోగలం అంటారు.
పెద్దా గెలూరు గ్రామంలో 14 మంది మహిళలపై అత్యాచారం జరిగింది; బాల నేంద్రంలో, కూనలో కూడా అత్యాచారాలు జరిగాయి. కున్నా గ్రామంలో ఏం జరిగింది?
కూనలో చాలా పెద్ద ఘటన జరిగింది. అక్కడ తెల్లవారుజామునే పోలీసు బలగం గ్రామానికి చేరుకుంది. మహిళలు తమ పనుల్లో వున్నారు. మహిళలను పట్టుకుని, బలవంతంగా వారి బట్టలు విప్పి, కేవలం లంగా, జాకెట్లతో ఉంచారు. చేతులను వెనక్కు కట్టారు. ఆపై వారిని అటూ యిటూ తిప్పేస్తూ, కిందపడేసి వారిపైనా కూచోడానికి ప్రయత్నించారు.
ఒక పోలీసు కట్టెలు మోసుకొస్తున్న మహిళ జాకెట్‌ని విప్పి, స్తనాన్ని నొక్కి పాలు పిండాడు. మిగతా పోలీసులు అదో హాస్యంలా నవ్వారు. ఈ ఘటనపై దంతెవాడలో విలేకరుల సమావేశం కూడా నిర్వహించాం. ఆ మహిళ ధైర్యంగా తన ఛాతీని విప్పి తనకు ఏం చేశారో చెప్పింది. నీకు సిగ్గుగా అనిపించలేదా అని విలేఖరులు అడిగితే సిగ్గు పడితే చంపేస్తారు మరి అని సమాధానమిచ్చింది.
గొడ్డెల్‌గూడ గ్రామంలో అడవిలోంచి కట్టెలు తెచ్చుకోవడానికి వెళ్తున్న ఇద్దరు మహిళలు వూళ్ళోకి వస్తున్న పోలీసు బలగాలను చూసి వెనక్కి తిరిగి త్వరత్వరగా వెళ్లిపోతుంటే పోలీసులు కాల్పులు జరపడంతో ఒక మహిళ గాయపడి అక్కడే పడిపోయింది. చంటి బిడ్డ తల్లి అయిన రెండో మహిళకు తూటా తగిలింది. తాగడానికి నీళ్ళు కావాలని వేడుకొంటోంది. కాల్పుల శబ్దం విన్న వూళ్ళోని మహిళలు అధిక సంఖ్యలో రావడం గమనించిన పోలీసులు గాయపడిన మహిళను పాలిథిన్ బ్యాగ్‌లో చుట్టేసి, భుజంపై వేసుకుని పోలీసు క్యాంపుకు తీసుకెళ్లారు. ఆ మహిళ ఆరు నెలల చిన్న బిడ్డను తీసుకొని గ్రామస్తులు పోలీసు క్యాంపుకు వెళ్ళి బిడ్డ ఆకలితో అలమటించిపోతోంది. విపరీతంగా ఏడుస్తోంది. డబ్బా పాలు కూడా మా దగ్గర లేవు. పెదవులకు నీళ్ళంటించి ఏడుపు మాన్పించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక్కసారి పాలిథిన్‌ను తెరిచి ఈ చిన్నారికి తల్లి రొమ్మునివ్వండి అని ఎంత వేడుకున్నా పోలీసులు వినలేదు. చాలా తర్జనభర్జనల తర్వాత చివరకు పాలిథిన్ తెరిస్తే అప్పటికే ఆ తల్లి చనిపోయింది.
2021లో పాల్నార్‌లో ఓ ఘటన జరిగింది. పోలీసులు మధ్యాహ్నం రెండు గంటలకు ఊరంతా చూస్తుండగా ఇద్దరు ఆదివాసీ యువతులను ఎత్తుకెళ్లారు. వారిని అడవి వైపు ఈడ్చుకెళ్లారు. మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లండి లేదా పోలీసు క్యాంపుకు తీసుకెళ్లండి మమ్మల్ని అడవికి ఎందుకు తీసుకెళ్తున్నావు? అని మహిళలు వేడుకున్నారు. పోలీసులు వారిని అడవిలోకి తీసుకెళ్లారు. అమ్మాయిలు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తూనే వుంది. సాయంత్రం ఆరు గంటల సమయంలో కాల్పుల శబ్దం వినపడింది. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వారు గ్రామంలో వుంటున్న మహిళలే. వారి మృతదేహాలను చూస్తే చాలా క్రూరంగా చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లుగా వుంది. వారికి ముక్కులు లేవు. కళ్ళు లేవు. జుట్టు లేదు. జననాంగాలు నలిగిపోయాయి. ఈ విధంగా ఆదివాసీ మహిళలపై అత్యాచారాలు చేస్తారు. వీరిని కాల్చి చంపి మావోయిస్టులని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తారు. ‘మేము వారిని చంపాము’ అని వాళ్ళు బహిరంగంగా చెప్పినా కూడా ఎలాంటి విచారణ జరగడం లేదు. ఎఫ్‌ఐఆర్ ఎందుకు రాయరు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఒకవేళ వాళ్ళుమావోయిస్టులయితే కోర్టులో విచారణ జరపండి. ఇలా అత్యాచారం చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు?
తాడ్‌బల్లా గ్రామంలో కూడా అలాగే జరిగింది. అక్కడ ఐదుగురు మహిళలపై అత్యాచారం చేసి చంపేశారు. ఆమె జాకెటు, తల పిన్ను ఇప్పటికీ నా దగ్గర ఉంది. వారు 19-20 సంవత్సరాల యువతులు. వారిని పోలీసు బలగాలు పట్టుకొని గ్రామస్థుల ఎదుటే అత్యాచారం చేశారు. ఎందుకు కాపాడలేదు అని వారినడిగితే “పోలీసు బలగం మొత్తం తుపాకులు ఎక్కుబెట్టి నిలబడ్డారు. యువతుల కాళ్లపై కాల్పులు జరిపారు. సైనికులు వారిపై అత్యాచారం చేస్తుంటే ‘నాన్నా కాపాడు, అమ్మా కాపాడు, అన్నా కాపాడు’ అని అరుస్తూనే వున్నారు . కానీ మేమేమీ చేయలేకపోయాం. చివరికి వారిపై కాల్పులు జరిపి చంపేశారు” అని చెప్పారు.
అడవిలోకి మహిళలే ఎక్కువగా వెళ్తారు. వాళ్ళు వంటకు కట్టెలు తేవాలి. మహూవా ఆకులను వాళ్ళే తీసుకురావాలి. పోలీసులు (సైనికులు) ఇలాఅత్యాచారం చేస్తుంటే వాళ్ళు ఎలా బతుకుతారు? నా సహకార్యకర్త హిడ్మే “అక్కా, నేను జైలుకు వెళ్లడానికి భయపడను, చావడానికి కూడా భయపడను. కానీ అత్యాచారం అంటే భయమేస్తుంది” అని అంటుంది.
బీజాపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగిన ఘటన. పోలీసు బలగాలు గ్రామంలోకి రావడంతో అందరూ ప్రాణాలను కాపాడుకోడానికి అడవిలోకి పరుగులు తీశారు. ఒక గర్భవతి మహిళ అక్కడే వుండిపోయింది. ఎందుకు పారిపోలేదని అడిగితే “పొట్టలో బిడ్డ వున్న మహిళతో ఎవరైనా చెడుగా ఎందుకు ప్రవర్తిస్తారని అలాగే వాకిట్లో కూచుండిపోయాను” అని అన్నది.
“సైనికులు వచ్చి నన్ను ఇంట్లోకి తీసుకెళ్లారు. నాపై పది మంది సైనికులు అత్యాచారం చేశారు. వారు నా దుస్తులు విప్పేసి నా రొమ్ములను పట్టుకుని వీడియోలు తీశారు. లంగా జాకెట్టు వేయించి, నా చేతులు వెనక్కు కట్టి, కాలినడకన పోలీసు క్యాంపుకు తీసుకెళ్లారు. అర్ధరాత్రి వదిలిపెట్టారు” అని చెప్పింది. మీడియా వాళ్ళు, నేను, బేలా భాటియా కూడా అక్కడికి వెళ్ళాము. “పోలీసులు వచ్చి బలవంతంగా 1600 రూపాయలు చేతిలో పెట్టి, నీకు నొప్పిగా వుండచ్చు. వైద్యానికి, తాగడానికి (దవా, దారూ)వాడుకో అని వెళ్లిపోయారు” అని చెప్పి ఆ డబ్బులు చూపించింది.
బీజాపూర్ జిల్లా పుస్నార్ గ్రామానికి చెందిన బాలికను సైనికులు ఆమె ఇంటి నుంచి అడవిలోకి ఎత్తుకెళ్లారు. ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ బాలిక లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కొన్ని నెలల తరువాత, మైనర్ అయిన ఈ అమ్మాయి చెల్లెలు అనారోగ్యంతో బీజాపూర్ ఆసుపత్రిలో చేరింది. పోలీసులు అక్కడికి వచ్చారు. ‘ఈ అమ్మాయి మాకు శిక్ష పడాలని కోరుకుంటోందని’, ఆమెను చంపాలని పథకం వేసారు. ఆ విషయం ఆమెకి తెలిసింది. “ఫిర్యాదు చేసింది నేను కాదు నా అక్క అని చెప్పినప్పటికీ పోలీసులు బాధితురాలి చెల్లెల్ని ఆస్పత్రిలోనే చంపేశారు. నేను ఆ బాధిత బాలికను కలిశాను. ‘నాపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా నేను గళం విప్పి ఉండకపోతే ఈరోజు మా చెల్లెలు బతికే ఉండేది’ అని ఆమె విచారంతో అంది.
ఆ తర్వాత వీడియో ఇంటర్వ్యూలో ఉన్న చాలా ఘటనలను సోనీ జీ మాకు చెప్పారు. నా శరీరం కూడా ఈ చిత్రహింసలను అనుభవించింది అని ఆమె చెప్పారు.
“దయచేసి మాపై అత్యాచారం చేయవద్దు” అని ఈ రోజు బస్తర్ మహిళలు డిమాండ్ చేస్తున్నారు. భారత ప్రజలను, రాజ్యాంగాన్ని, ఈ దేశ చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని సోనీ సోరీ ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలకు ఎవరైనా సమాధానం చెప్పగలరో లేదో తెలియదు. (జన్‌జ్వార్ అనే అంతర్జాల పత్రిక కోసం హిమాంశు కుమార్ రాసిన వ్యాసం.