అతనేదో చెప్పాలనుకుంటున్నాడు. లోపల దాగిన సంవేదనలు, వినిపించాలనిసమాయత్తమవుతున్నాడు .గడ్డకట్టిన మనుషుల మధ్య సమస్త భూగోళాన్ని అరచేతిలో ఇముడ్చుకొని తనలో గూడు కట్టుకున్న అపరిచితతత్వాన్ని వ్యక్తీకరించాలనుకున్నాడు . ఇప్పుడేది రహస్యం కాదు అనే కవిత్వ సంపుటికి కొనసాగింపుగా బహిరంగ ప్రకటన చేస్తున్నాడు . దేశం వినడానికి సమాయత్తమవుతోంది. మనుషులు తమ దైనందిక జీవితంలో కిటికీ తెరిసినట్లు అతని కవిత్వాన్ని ఆలకించండి. నాలిక పొడారిన తర్వాతనయినా సంభాషణ మొదలు పెట్టండి. అతను ఈదేశం గురించి మాట్లాడాడు. సౌకర్యవంతమైనదేశం గురించి కాదు. అసహన, అసంతృప్త భారతదేశం గురించి.
ఇలా మాట్లాడడానికి అతని యొక్కఅర్హత ఏమిటి? అతని జాతీయత ఏమిటి? నిజానికి కవి ఈ దేశ పౌరుడేనా లేదా దాయాది దేశపు మూలాలు ఉన్నాయా? స్పష్టంగా భారతీయ కంఠస్వరం నుండి సంభాషణ ఆరంభించాడా ! అతని శరీరం, హృదయం అతని నడక అంతా భారతీయమేనా! అతని పుట్టుక, ఆలోచన దేశభక్తియుతంగా ఉన్నాయా. దేశద్రోహిగా తనని తాను పునర్ నిర్మించుకుంటున్నాడా. ఇబ్రహీం నిర్గుణ్ నూటికి నూరుశాతం దేశద్రోహి. కవిగా , ఆలోచనపరుడిగా దేశపు మర్యాదను, కుహనా విలువలను అభివృద్ధి వెనుక దాగిన బీదరికాన్ని సవాల్ చేశాడు. నిరసించాడు. తన లోపల నిర్మితమవుతున్న విధ్వంసరచనను అంతిమంగా అవాహన చేసుకున్న కవి. అంతిమంగా భారతీయ సామాజిక సాంస్కృతిక భావజాల విస్తృతికి ఆటంకి సంఘ్ పరివార్ అనే ఎరుక వున్న కవి.
కవి ఎంత వాస్తవమో ఇబ్రహీం నిర్గుణ్ కవిత్వం ఎండిన ఎడారి దగ్గర నీటి చెలమ. దాహార్తితో ఉన్న ఎముకలు గూడు వంటి మనుషులు కోసం తన ముస్లిం అస్తిత్వం నుండి వ్యక్తమవుతున్నాడు. అతను భారతీయుడా కాదా అనే సందేహం కలగవచ్చు. ఇక్కడ ఊపిరి తీసుకుంటున్న ఈ దేశపు మనిషికి , ఆలోచనకు ముస్లిం అస్తిత్వం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. కవిగా ఇబ్రహీం ఈ దేశపు సమూహంలో మెజారిటీ వాదం లో చిట్టచివరి మనిషి. నిత్య అనుమానితుడు. భారతీయ సామాజిక దొంతర్లలో ఎక్కడో ఒక చోట నిలబెట్టడం ,మెజారిటీ వాదానికి అణగి ఉండాలని తలవంచాలని అనడం ఏ ఒక్కరి హక్కు కాదు. కవిగా, ఆలోచనాపరునిగా తనదైన సామాజిక అస్తిత్వం నుండి ఇబ్రాహీం నిర్గుణ్ కవిత్వం విస్తరించింది.
భారతీయ ముస్లింగా తనదయిన అస్తిత్వ పునాది ప్రశ్నార్ధకం కానిది. అయినా పరాయీకరణ అతని పుట్టుక కారణంగా అనుభవం లోకి వస్తుంది. పరాయీకరణ కవికి మాత్రమే పరిమితం కాదు. ఒక సమూహానిది. రంగు, రుచి, వాసన లేని ప్రజాస్వామ్యం నిర్మిత మవుతుంది. ఈ ఎరుక కలగడానికి చాలా కాలం ఖర్చు అయింది. చరిత్ర నిండా అనేక మరకలున్నాయి . ఆ మరకల దగ్గర నిలబడి ఇదే ఇవాల్టి వాస్తవం అనే దశ ప్రజా స్వామ్య భావన కాదు. ఆహారపు అలవాట్లు ద్వారా సాంస్కృతిక అంశాల పునాది నుండి వేరు చేయడం కాలానికి తూగే అంశం కాదు.మానవ జీవన సంస్కృతి అనేక అస్తిత్వ పునాదుల నుండి పటిష్ట మయినది. మరింత ప్రజాస్వామిక మైనది.
ఇబ్రహీం నిర్గుణ్ బహిరంగ ప్రకటన కవితా రహస్యం ఈదేశపు బొడ్డు పేగు రహస్యం. కేవలం వేదన , ఆక్రోశం నిరసన కవితా రహస్యం కాదు. అదనపు చేర్పు కావచ్చు .కవిగా నిర్మితమవుతున్న దశ అత్యంత ప్రధాన మయినది. ఈ దేశం ఏక స్వామ్యం దిశగా పయనిస్తుంది . ఏ కళకైనా సంకెళ్ల పడుతున్న కాలం . మానవులంతా ఒకే దిక్కుకు నడవాలనే భావన అమలవుతోంది. ఈ తతంగాన్ని మౌనంగా చూస్తూ ఏదో ఒక దగ్గర ఇబ్రహీం ని ర్గుణ్ ఆగిపోలేదు. ఆర్థిక రాజకీయ సౌంస్కృతిక అంశాలు ప్రపంచాన్ని మరింత మానవీయంగా మార్చాలి. కాలం, ప్రపంచం రెండు సరళరేఖలు కాదు. కలిసి పయనించ వలసిందే. ఈ ప్రయాణం స్వేచ్ఛాయుతంగా జరగాలి.
నిర్గుణ్ కవిత్వంలో అనేక పాయలు అంతర్లీనంగా ఉన్నాయి . అనేక అస్తిత్వాలు కలిగలసి ఉన్నాయి . గ్రామీణ జీవన సౌందర్యం ఇమిడి ఉన్నది. కవి ప్రకృతి ప్రేమికుడు. పల్లె నుండి దూరమైన జీవితం ఉన్నది . అంత మాత్రాన కవి నాస్టాల్జియాలోకి జారిపోలేదు. ఇంత పూర్వ రంగం ఉన్న మనుషులు ఏ రంగం లో వున్న నిజాయితీ అని నీడ ఉంటుంది . స్వచ్ఛత ఉంటుంది . మేలిమి ఉంటుంది. ఇవన్నీ కలగలిసినన అన్వేషణ సహజం. ఈ క్రమంలోనే కవిగా రూపుదిద్దుకున్న కాలం చాలా విద్వేష పూరితం కూడా.
ఇబ్రహీం నిర్గున్ కవిత్వంలో ముస్లిం అస్తిత్వ కవిత్వం ఒక పాయ మాత్రమే. ఇవాళ భారతదేశంలో అమలవుతున్న ఆధిపత్య సంస్కృతిని దాని తీవ్రతను కవిత్వం చేశారు.
ఆదివాసి , నుండి స్టాన్ స్వామి వరకు కవితా వస్తువే. ప్రధానంగా బ్రాహ్మణీయ హిందుత్వ రాజకీయాలు వాటి అణచి వేత ధోరణిని ఒకానొక మూక సంస్కృతిని ఆవాహన చేసుకొని తనదైన కంఠస్వరాన్ని నమోదు చేశాడు.
ఏ గీతం పాడాలో ఏ వాయిద్యం ఉపయోగించాలో చివరికి ఏ దుస్తులు ధరించాలో ఏ ఆహార సంస్కృతిని అనుసరించాలో ఇవన్నీ మూక స్వామ్యం చెప్తుంది. మామాట వినకుంటే ప్రత్యక్ష దాడులకు దిగుతామని హెచ్చరిస్తుంది. ఇలా ఒక దేశం మూక దాడులకు తలవంచితే మిగిలే శూన్యం ఏమిటి. ఏమిటి మిగిలిన విషాదకర ఘటనల మాటేమిటి. కాలానికి కవి అవసరం. సామాజిక జీవితంలో అసంతృప్తి ఉన్నప్పుడు ఆ అసంతృప్తికి కారణమైన అన్వేషణ కవి దగ్గర ఉండాలి కేవలం అన్వేషణ మాత్రమే సరిపోదు ధిక్కరించే రాజకీయ పరిభాష కవి దగ్గర ఉన్నది. కవిత్వం మొత్తంగానే సరి చేయలేకపోవచ్చు. పరిష్కారం చూపలేకపోవచ్చు ఎవరైతే అంచుల్లోకి నెట్టు వేయబడుతున్నారో ఆ సమూహంలోనుండి మరిన్ని పిలుపులు రావాలి. ఆ పిలుపును బహిరంగ ప్రటన విశాలం చేసింది.
ఇబ్రహీం నిర్గుణ కేవలం రాజకీయ భావజాలం కలిగిన కవి మాత్రమేనా. కవిగా అతని వ్యక్తీకరణ ఏమిటి. శైలి, శిల్పం ఎంచుకున్న వస్తువు ఇవన్నీ మాట్లాడవలసిన అంశాలే. తనదైన అస్తిత్వ ఎరుక నుండి వచ్చిన ఇంటి భాష తన చుట్టూ ఉన్న భౌతిక స్థితి. తానేమి చెప్పాలనుకుంటున్నాడు అనే స్పష్టత . ముఖ్యంగా రాజ్య వ్యతిరేకత ఇవన్నీ నిర్గుణ్ కవిత్వాన్ని ఉన్న తీకరించాయి .తడబాటు లేని ధిక్కారస్వరం. కవిగా నిర్గుణ్ కాలానికి నిలిచే కవి. ఒక కాలపు విధ్వంసక నమూనాను నిరసించే కవిగా చరిత్రలో నమోదు అవుతుంది. కాలాన్ని గెలిచే కవిత్వం రాయగలిగే సందర్భం కాలమే అనువర్తన చేసుకుంటుంది. ఇక్కడ కవి ఎక్కడ నిలబడి ఉన్నాడని మాత్రమే చర్చ . కచ్చితంగా ఇబ్రహీం నిర్గుణ్ రాజ్య ధిక్కార కవి. ఆ ధిక్కారపు పరికరాలు కవి దగ్గర ఉన్నాయి.
నా బాల్యాన్ని నీ భుజాల మీద మోస్తున్నప్పుడు
కనీసం మాటవరసకైనా చెబితే బాగుండేది నాన్న
నేను పుట్టకముందే ఈ మట్టికి శత్రువు
నయ్యానని .
భారతీయ ముఖచిత్రంపై ఈ శతృత్వపు కాలపు కొలత చూడాలి . ఆ దారి బహిరంగ ప్రకటనలో దొరికింది.