(కా.   జీతన్‌ మరాండీ  మ‌న కాల‌పు గొప్ప వాగ్గేయ‌కారుడు.  ఆయ‌న  గానానికి, ప్ర‌సంగాల‌కు రాజ్యం భీతిల్లిపోయింది.  మ‌ర‌ణ దండ‌న విధించింది. ఆయ‌న‌తోపాటు త‌న  న‌లుగురు స‌హ‌చ‌రులకు కూడా. ఈ ఆదివాసీ, ద‌ళిత సాంస్కృతికోద్య‌మ క‌ళాకారుల కోసం స‌మాజ‌మంతా క‌దిలింది. వాళ్ల‌ను ఉరి తాడు నుంచి త‌ప్పించింది. జీత‌న్ ఈ నెల 13 న అనారోగ్యంతో అమరుడ‌య్యాడు.   జైలులో ఉన్నప్పుడు ఆయ‌న   బయటి మేధావులకు రాసిన లేఖ ఇది.  అయన స్మృతిలో పునర్ముద్రిస్తున్నాం.- సంపాదకవర్గం)

విజ్ఞప్తి

ప్రగతి శీల రచయితలు, కళాకారులు, బుద్ధిజీవులు, సాంస్కృతిక, సామాజిక కార్యకర్తలు మానవహక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ చైతన్యం గల పౌరులు, కార్మికులు, రైతులు, విద్యార్థి యువజనులు, శ్రేయోభిలాషులందరికీ –

మిత్రులారా,

నేను 1980లలో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టాను. మా ఊరు సుదూర్‌ అనే ఒక మారుమూల గ్రామం. ఝార్ఖండ్ రాష్ట్రం గిరిధి జిల్లా పిర్టాండ్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉంటుంది. మా గ్రామంలో ప్రభుత్వం కల్పించిన సంక్షేమం అంటూ ఏమీ లేదు. నాకు బాల్యంలో చెప్పుకునే ఘట్టాలేమీ లేవు. మా కుటుంబంలో ఎవరికీ చదువు రాదు. పేదరికం వల్ల కుటుంబ పోషణ భారం అందరం భుజాల మీద మోయాల్సి వచ్చేది.పశువులను మేతకు తీసుకుపోవడం బాలునిగా నా బాధ్యత. అందువల్ల బాల్యంలో కలమో, పుస్తకమో కాక నా చేతిలో కర్ర ఉండేది. పశువులను లెక్కపెట్టడానికి కూడ నేను గులకరాళ్ల సహాయం తీసుకునే వాణ్ని. ప్రతి రోజూ ‘రేపటి’కోసం నిరీక్షణలోనే గడిచేది. కష్టంమీద మూడో తరగతి దాకా చదివాననిపించాను. ఇది నా విజ్ఞాన సర్వస్వ సంపద. అంటే (రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లో హామీ పడిన నిర్బంధ ప్రాథమిక విద్య) బడి చదువు.

కాలం గడిచిన కొద్దీ నా దృష్టి ‘విపులాచ పృథ్వీ’ వైపు ప్రసరించింది. ఈ సమాజపు లోతులు తరచి చూడాలని నాకు ఆకాంక్ష కలిగింది. నేను నా కళ్లముందు ఈ సామాజిక వ్యవస్థ శిథిలమై పోవడం పసిగట్టగలిగాను. ఇతరులతో కలిసి దీనిని మార్చాలని నాకు కోరిక బలీయమైంది. మొదట్లో ప్రవక్తల వలె ఆదర్శవాద సంస్కరణ వాదం ఎంచుకున్నాను. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చేయకు. చెడు గుర్తించి మంచిగా మార్చు. ఒక అందమైన, సమానత్వం గల సమాజాన్ని నిర్మించు ఇట్లా …

ఈ చైతన్యాన్ని కలిగించడానికి మేము పాటలు, జానపద గీతాలు, నాటకాలు ఎంచుకున్నాం. మా గ్రామ ప్రజల సామాజిక చైతన్యం పెరిగింది. మాకు ప్రజాదరణ పెరిగింది. ఆ ఆదరణకు కారణం ప్రజల్లో పెరిగిన ఛైతన్యమే. వేము ఆదివాసీ సంప్రదాయాలను, సంస్కృతిని పరిరక్షించి పెంపొందించడానికి పాటు పడినాం.

మేం గ్రామం నుంచి పట్టణాలకు బయల్లేరాం. ఇతర ప్రగతి శీల ప్రజలతో, బృందాలతో కలుసుకుని మా భావాలు పంచుకున్నాం. మావి, వాళ్లవి ఆలోచనలు, బావోద్వేగాలు ‘మాలలో పూల వలే అల్లుకుపోయాయి. వైవిధ్యం గల లక్ష్యాలు, మార్గాల ఘర్షణ నుంచి మా ప్రాపంచిక దృక్పథం నిర్మాణమయింది. కాలం ప్రవహించి మా అనుభవం పెరిగిన క్రమంలో మా తాత్వికతయే మా జ్ఞానానికి ఆధారమైంది. ఈ విధంగా మేము వేలాదిమంది ప్రజల ప్రేమను, మద్దతును పొందగలిగాం. నేను రచయితలు, కళాకారులు, సాహిత్యవేత్తలు, సామాజిక కార్యకర్తల నుంచి కూడా ప్రోత్సాహాన్ని, మార్గదర్శకత్వాన్ని పొందాను. నేనిప్పటిదాకా కలిసిన ఆ శ్రేయోభిలాషులందరికీ నేను కృతజ్ఞుణ్ని.

నేను అందరికి ప్రజల చైతన్యాన్ని మేల్కొల్పిన ప్రజా కళాకారునిగా, ప్రగతి భావాలు గల సామాజిక కార్యకర్తగా తెలుసు. నన్ను చూసిన ఎవరైనా నన్ను ఆయుధాలతో, ఆయుధ సామగ్రితో చూడలేదని తప్పక చెప్పగలరు. ఎల్లప్పుడు నగారా, ధోలక్‌, హార్మోనియమ్‌ వంటి సంగీత పనిముట్టతో మాత్రమే చూసామని చెప్పగలరు. వాళ్లు నన్ను పంచె, గాంజీ, ఘుంఘ్రు (కాలిగజ్జెలు) వంటి జానపద కళాకారుని వేషంలో తప్ప మరో ఆహర్యంలో ఎప్పుడూ చూడలేదు. నా స్వరమూ, నా సంస్కృతియే నా ఆయుధాలు. వాళ్లు నన్నెప్పుడూ నా సాంస్కృతిక బృందం మధ్యలో, బాల కళాకారులతో పాటు భయ సంకోచాలు లేకుండా గ్రామాల నుంచి పట్టణాల దాకా ప్రజా సంస్కృతిని ప్రచారం చేస్తుండగానే చూసారు. నేనెప్పుడూ ఒక మారుపేరుగానీ, మరో పేరు (అలియాస్‌) గానీ పెట్టుకోలేదు. అందరికీ నేను జీతన్‌ మరాండీగానే తెలుసు. ఖోత్తా, సంతాలీ, నాగ్‌పురీ, హిందీ పాటలు నా స్వరంతో ఆడియో క్యాసెట్టుగా జీతన్‌ మరాండీ పేరుతోనే రికార్డయ్యాయి . ఈ పాటల్లో బూతుగానీ, అసభ్యతగానీ, అనర్థంగానీ ఎక్కడా కనిపించదు. వాటిల్లో ఉన్నదంతా సామాజిక చైతన్యం, నగరాల్లో, పల్లెల్లో అమ్మకమై అవి ప్రజా బాహుళ్యంలో ప్రచారాన్ని పొందాయి. అవి వినోదం కన్నా ఉత్తేజానికి ప్రేరకాలయ్యాయి. నేను రాజ్యాంగ చట్రానికి వెలుపల ఏమీ ఆచరించనప్పటికీ, అహింసామార్లాన్ని భగ్నం చేయనప్పటికీ నన్నివ్వాళ కారాగారంలో బంధించారు.

జీతన్‌ మరాండీ చేసిన నేరమేమిటి?

నేనొక కుట్రకు గురి అయ్యాను. నన్ను ఒక ఏడాదికి పైగా గిరిధిలోని ఒక జైల్లో బంధించారు. నా మీద చేసిన నేరారోపణలన్నీ చాలా తీవ్రమైనవి. కొత్త కొత్త సంఘటనలు జరుగుతున్నాయి. నా మీద గిరిధి పోలీసు పన్నుతున్న కుట్ర పథకం క్రమంగా బయటపడుతున్నది. నేనొక విషయం ముందుగానే స్పష్టం చేయదల్చుకున్నాను. నేనెవరో, నేనేమిటో పోలీసులకు, అధికార యంత్రాంగానికి తెలుసు. కాని వాళ్లు నన్ను తమ కుట్రకు గురి చేయదలుచుకున్నారు. ప్రత్యేకించి మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్‌ మరాండీ జెవిఎం. ( ఝార్ఖండ్ వికాస్‌ మోర్చా)కు పోలీసుకు ఉన్న అపవిత్ర బంధం నా ఈ దుస్థితికి కారణం. ఒక వైపేమో బాబూ లాల్‌ మరాండీ లంచగొండితనం లేని, భయంలేని రాజ్యపాలనను నెలకొల్పానని ప్రగల్భాలు పలికాడు. మరొకవైపేమో పోలీసుల మిలాఖతుతో నా వంటి అమాయకుల మీద తీవ్రమైన అణచివేతను ప్రయోగించాడు. దీనికి ఒక నిదర్శనాన్ని కింద వివరిస్తున్నాను:

ఈ వాస్తవాలను గమనించండి :

చిల్ఖారి హత్యల (బాబూలాల్‌ మరాండీ కొడుకు, జె.వి.ఎం. నాయకుడు అనుప్‌ మరాండీ మరి పద్దెనిమిది మంది ఒక బహిరంగ ప్రదేశంలో కాల్పుల్లో మరణించారు. మావోయిస్టుల చర్యగా భావిస్తున్నారు -అను) తర్వాత దేవ్రీ పోలీసు స్టేషన్‌లో 167-07 నెంబర్‌తో ఒక ప్రాథమిక దర్యాప్తు నివేదిక నమోదయింది. నేర శిక్షాస్మృతి సెక్షన్‌ 164 కింద జుడిషియల్‌ మెజి(స్టేట్‌ ముందు ఒక వాజ్మూలం కూడా నమోదయింది. అందులో పేర్కొన్న చాలామంది ముద్దాయిల పేర్లలో ఒక పేరు జీతన్‌.

ఈ జీతన్‌ ఎవరు? అతనిదే ఊరు? అందులో ఈ వివరాలేమీ లేవు.

ఆశ్చర్యకరంగా పత్రికల్లో (ప్రభాత్‌ ఖబర్‌ ) నా ఫోటో, నా వివరాలు ఒక పెద్ద వార్తా కథనంగా అచ్చయ్యాయి. ఈ వార్తా కథనంలో ఈ హత్యాకాండలో నన్ను ప్రధాన ముద్దాయిగా చిత్రించారు. ఇది చూసిన తర్వాత నేను దీనిని తీవ్రంగా ఖండించాను. నా ఈ నిరసన పత్రికల్లో ప్రచురించబడింది. సంపాదకులు ఈ వార్తా కథనం ప్రచురణ తాము చేసిన తప్పని అంగీకరించారు. పోలీసు యంత్రాంగంలో ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లు కూడా ఈ జీతన్‌ జీతన్‌ మరాండీ కాదని గ్రహించారు. ఈ వాస్తవాలు వెలుగు చూడడంతో నా మీంచి పెద్ద బరువు దిగిపోయినట్టయింది.

హఠాత్తుగా, ఐదు నెలల తర్వాత 2008 ఏప్రిల్‌ 5న మఫ్టీ దుస్తుల్లో ఉన్న పోలీసులు నన్ను రాంచీ – రాటు రోడ్లపై అరెస్టు చేసారు. నన్నొక రహస్య స్థలంలో ప్రశ్నించారు. నన్ను చిల్ఖరి సంఘటనలో ఇరికించే ఆధారాలేవీ నా వద్ద వాళ్లకు దొరకలేదు. ఆ తర్వాత వాళ్లు నా మీద ఒక ప్రాథమిక దర్యాప్తు నివేదిక నమోదు చేసినట్టు చెప్పారు. అయితే అందులో ముఖ్యమంత్రి నివాసం ముందు (ఆదివాసీ ప్రజల విస్థాపనకు వ్యతిరేకంగా) ఒకటి అక్టోబర్‌. 2007న ‘రాస్తా రోకో’ సందర్భంగా నేను చేసినట్టు చెప్తున్న “పేలుడు స్వభావం” గల ప్రసంగానికి సంబంధించిన నేరారోపణ మాత్రమే ఉన్నదన్నారు. ఆ తర్వాత నన్ను రాంచీ, హత్వాయిలో ఉన్న బిర్సాముండా కేంద్ర కారాగారానికి పంపించారు. నేను పోలీసుల అక్రమ ఆధీనంలో ఉన్న పది రోజులు కూడ నన్ను ప్రళ్నించిన పోలీసులకు నేను జీతన్‌ మరాండీనే కానీ ఆ హత్యాకాండలో పాల్గొన్నాడని చెప్తున్న జీతన్‌ మరాండీని మాత్రం కాదని చెప్తూనే ఉన్నాను. ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కూడ నా మాటలు విశ్వసించినట్లే కనిపించారు. పోలీసుల అక్రమ నిర్బంధకాలంలో నా మీద, నా పట్ల జరిగిన చాలా విషయాలు నేనిక్కడ చెప్పబోవడం లేదు. ఏమయితేనేం నేను చెప్పిన ఏ విషయాలూ పోలీసు డైరీలో నమోదు కాలేదు. ఈ డైరీలో మరో ముగ్గురు సాక్షుల వాజ్మూలాలు నమోదయ్యాయి. ఈ సాక్ష్యాల ప్రకారం ఈ హత్యాకాండలో ఇద్దరు జీతన్‌ మరాండీలు పాల్గొన్నారు. వివరాల్లో ఒక జీతన్‌ మరాండీది నిమియా ఘాట్‌ పోలీసు థానా కింది థేసాపుల్లి గ్రామం. మరొక జీతన్‌ మరాండీది పిర్తాండ్‌ కింది కరాండన్‌ గ్రామం. ఇతడే రూర్జండ్‌’ ఎబాన్‌ (నా సాంస్కృతిక బృందం)ను నడుపుతున్నాడు. మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే హత్యచేయబడిన వారి కుటుంబ సభ్యుల వాజ్మూలాలు ఒకటి కూడ నమోదు చేసుకోలేదు. చిల్ఖారి – దేవ్రీ నుంచి కూడ ఒక సాక్ష్యమూ లేదు. ఇదంతా ఎంత ఆశ్చర్యంగా ఉందంటే నా కన్నాముందు అరెస్టయిన ఏ ఒక్కరూ నా పేరు చెప్పలేదు. అంతేకాదు, నా అరెస్టు తర్వాత, నవంబర్‌లో ఒక ప్రకటన వచ్చింది. నిమియా ఘాట్‌ థానా కించి థేసాపుల్లి గ్రామానికి చెందిన జీతన్‌ మరాండీ ఉరఫ్‌ శ్యాంలాల్‌ను పట్టిచ్చిన వాళ్లకు లక్షల రూపాయల పారితోషకం ఇస్తామని. నా అరెస్ట తర్వాత వచ్చిన ఈ ప్రకటన, నా పేరు జీతన్‌ మరాండీ అయినందుకు మాత్రమే నన్ను గురి చేసారని స్పష్టంగా సూచిస్తున్నది. ఈ విధంగా నా మీద చాలా తప్పుడు కేసులు బనాయించారు. కొన్ని కేసుల్లో ఆ నేరాలు నేను జైల్లో ఉన్న సమయంలో జరిగినవి. కొన్ని కేసుల్లో ఇతర ముద్దాయిలు అప్పటికే నిర్దోషులని రుజువయి విడుదలయ్యారు. ఒక కేసులో (తీసేరీ పోలీసు స్టేషన్‌ కేసు నెం. 9 / 2004) ఆరోపణ చేసిన సమయంలో నేను మధుఒనిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో
పాల్గొంటున్నాను. ఆయా స్థలాల్లో, సమయాల్లో నేను ఉండే అవకాశమే లేని సందర్భాల్లో జరిగినట్టు చెప్తున్నా నేరాల్లో నేనెట్లా ముద్దాయినవుతానో ఊహకందని విషయం.

ఈ కుట్ర వెనుక దాచేస్తే దాగని సత్యం :

2009 మార్చ్‌ 24న క్రైం. నెం. 167/07 కేసులో ఉన్న మేమందరమూ కోర్టుకు వెళ్లినప్పుడు ఈ కుట్ర వెనుక ఉన్న జె.వి.ఎం., గిరిధి పోలీసుల మిలాఖత్‌ వైఖరి బట్ట బయలైంది. నిందితులందరూ సెషన్స్‌ కోర్టులో నిరీక్షిస్తున్నారు. గిరిధి పోలీసు స్టేషన్‌ ఇన్‌చార్జి నన్ను పక్కకు పిలిచాడు. తాను పట్టణ టౌన్‌ థానా ఇన్‌చార్జినని చెప్పాడు. కాని ఆయన సాధారణ దుస్తుల్లో ఉన్నాడు. పేరు, పదవి సూచించే చిహ్నాలేమీ లేవు. ఎందుకో మరి, జడ్జి ముందు హాజరు పరచడానికి నిందితుల్లోంచి నన్నాక్కణ్నే తీసుకువెళ్లారు. ఇట్లా ఎందుకు చేస్తున్నారని నేను ప్రశ్నిస్తే నా ఎస్కార్టు పోలీసులు నన్ను ప్రశ్నలు వేయొద్దని దబాయించారు. మేం నిరీక్షిస్తున్న చోటు నుంచి నన్ను తీసుకవెళ్లేప్పుడు, టౌన్‌ -థానా ఇన్‌చార్జి కొంతమందికి నన్ను చూపి ‘ఇతడే జీతన్‌ మరాండీ, ఇతణ్ని మీరు గుర్తించాల్సి ఉంటుంది’ అని చెప్పడం నేను చెవులారా విన్నాను. నా సంతకం తీసుకోకుండానే నన్ను మళ్లీ వెనక్కి తీసుకపోతున్నప్పుడు ‘నన్నెందుకు తీసుకవచ్చారు?’ అని బిగ్గరగా అడిగాను. గౌరవనీయ న్యాయమూర్తి నన్ను హెచ్చరించాడు. నేను క్షమాపణలు కోరాను. ఇది జరిగిన తర్వాత మిగతా ముద్దాయిలను కూడా గౌరవనీయ న్యాయమూర్తి కాసీం అన్సారీ కోర్టు హాల్లోకి తీసుకువచ్చారు. సంతకాలు చేసిన తర్వాత, మేమప్పటి దాకా నిరీక్షిస్తున్న స్థలానికి తీసుకపోయారు. మళ్లీ అక్కడ నిరీక్షిస్తున్నపుడు వేరే ముద్దాయిలు నాతో చెప్పారు. పోలీసు థానా ఇన్‌చార్జి నన్ను చూపి మాట్లాడిన వ్యక్తులు 170/08 కేసులో సాక్షులు అని. వాళ్లలో కొందరు నా సహ ముద్దాయిల ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్లు గనుక
వాళ్లు వాళ్లను గుర్తుపట్టారు. ఇది ఎంత అన్యాయం! పోలీసు అధికారి ముద్దాయి సాక్షులకు చూపిగుర్తు పెట్టుకొని గుర్తు పెట్టమని చెప్పడు. నేను ఈ అన్యాయాన్ని ఎత్తి చూపుతూ కోర్టుకు, సంబంధిత పరిపాలనా శాఖలకు లిఖిత పూర్వకంగా దరఖాస్తులు పంపాను.

ఈ కుట్ర ఫలితమేమిటంటే :

2009 ఏప్రిల్‌ 1న కోర్టులో ఈ నేరానికి సంబంధించిన సాక్షుల వాజ్మూలాలు పరిశీలింపబడాల్సి ఉన్నది. ఇద్దరు సాక్షులు మోతీ సావూ, సుభోధ్‌ సావూ హాజరయ్యారు. మోతీ తాను కాల్పులు జరిపిన జీతన్‌ మరాండీని గుర్తు పడతానని చెప్పి నా వైపు చూపించాడు. చిల్ధారీ హత్యాకాండలో పాల్లొన్న జీతన్‌ మరాండీ ఇతడేనని చెప్పాడు. నేను చర్యలో పాల్గొనకుండా, నేనెన్నడు అసలు దేవ్ర ప్రాంతానికి గానీ, తీస్రే గ్రామానికి గానీ వెళ్లకుండా ఇది ఎట్లా నిజమవుతుంది? నా న్యాయవాది సరియైన వాస్తవాల నన్నిటినీ చురుకైన వాదనలతో ఎంతో సమర్థంగా కోర్టు ముందుంచాడు.

నేను మొదటి నుంచీ కూడా నాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్ర గురించీ, ఈ అక్రమ కేసుల గురించీ, ఈ తప్పుడు విచారణా పద్దతుల గురించీ జైలు సూపరింటెండెంట్‌ ద్వారా గిరిధిలోని చీఫ్‌ జుడిషియల్‌ మెజిస్ట్రేట్‌, జిల్హా జడ్జి, జైళ్ల ఐజి మొదలుకొని న్యూఢిల్లీలోని జాతీయ మానవహక్కుల కమిషన్‌ వరకు దరఖాస్తుల ద్వారా దృష్టికి తెస్తూనే ఉన్నాను. కాని అత్యంత విషాదమేమిటంటే వీరిలో ఏ ఒక్కరూ ఉచితమైన చర్యలు తీసుకోలేదు. కేవలం కోర్టు ప్రొసీడింగ్స్‌తోనే నా కేసులు జరుగుతున్నాయి. ఇందుకు చాలా డబ్బు కావాలి. ఇపుడున్న పరిస్థితుల్లో నా కుటుంబం ఈ భారం మోయజాలదు. నాకు బెయిల్‌ రావడం లేదు. నాకెంతో సహాయం కావాలి. నాకు కోర్టు
మీద పూర్తి విశ్వాసం ఉంది. నా మీద చేసిన నేరారోపణలను నిశితంగా పరిశీలించి, నిష్పాక్షికంగా విశ్లేషించి న్యాయహితంగా తీర్పు చెప్తందనే నమ్మకం నాకుంది.

ప్రగతిశీల వేధావులకు, రచయితలకు, క్రియాశీల కార్యకర్తలకు – ముందుకు వచ్చి నన్ను తప్పుడు ఆరోపణల నుంచి నిర్దోషిగా ప్రకటించే తీర్పు వచ్చేలా సహకరించి, నన్ను జైలు నుంచి విముక్తం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నేను ప్రజా సంస్కృతిని, ఆదివాసీ సంప్రదాయాలను సంరక్షించే క్రియలో మళ్లీ నిమగ్నం కాగలగాలి.

ఝార్ఖండీ జోహార్లతో

జీతన్‌ మరాండీ

(జీతన్‌ మరాండీ తనకింకా కోర్టు మరణ శిక్ష విధించక ముందు న్యాయంపై అపార విశ్వాసంతో కేవలం బెయిలు ఆశించి
రాసిన విజ్ఞప్తి ఇది. మరో రెండేళ్ళు గడిచిపోయినవి. ఆయన తన ముగ్గురి సహచరులతోపాటు ఉరికంబంపై నిలిచి మనల్ని పిలుస్తున్నాడు. ఆవాహన చేసుకుందాం కదలిరండి)

అరుణతార, మే-జూన్‌ 2011

Leave a Reply