ఓ అమ్మాయి చెప్పింది, ‘మేము కన్‌వర్టెడ్‌’ అని.


‘అది కాదమ్మా! మీరు బి.సి.నా? ఎస్సీనా? ఇంకేదైనానా?’ అన్నప్పుడు, ‘నాకు తెలీదు సర్‌, మేము దేవున్ని నమ్ముకున్నం’ అంది. అప్పుడు ఆ సంభాషణను పొడిగించలేదు.

 క్రైస్తవానికి మారి ‘కన్‌వర్టెడ్‌’ అని పిలిపించుకున్నా కులం పేరుతో ఈసడిరపులు, కులవివక్షలు, అణచివేతలు కొనసాగుతూనే ఉంటాయి. మతం మారినందుకు కులాన్ని వదిలేసి చూడదు సమాజం.   అందుకే తమను ‘అంటరాని’గా చేసిన మతం నుంచి తప్పించుకునిపోయినా సరే, ఎన్నేళ్లైనా అంటరానిగానే ఇంకా బతుకులీడుస్తున్నారు ‘కన్‌వర్టెడ్స్‌’. పైగా వెళ్ళిన మతంలోనూ అంటే క్రైస్తవ మతంలోనూ వచ్చిన కులం ఆధారంగానే సమూహాలుగా విడిపోయి ఆ మతంలోనూ ఈ కుల జాడ్యాన్ని పటిష్టంగా బతికిస్తున్న దారుణాలున్నాయి. కులం నీచమైన అస్తిత్వం. ఈ నైచ్యాన్ని కేవలం కన్‌వర్ట్‌ అయినంత తీసేసుకోలేం.  

అలాంటి పేద, దీన కన్‌వర్టెడ్‌ల కథల పుస్తకమే ‘బ్లాక్‌ ఇంక్‌’. ఎమ్‌.ఎమ్‌. వినోదిని గారు వేర్వేరు సందర్భాలలో వేర్వేరు పత్రికలకు రాసిన కథలను సంపుటిగా వేసిన పుస్తకమిది. ఇందులో మొత్తం పదకొండు కథలున్నాయి. అన్నీ దళిత సామాజిక వర్గానికి, దళిత క్రైస్తవ సామాజిక పరిస్థితులకు సంబంధించి రాసిన కథలే. ఆయా సమాజాల్లోని పేదరికం, కుల అణిచివేత, అంటరానితనం లాంటి ఇప్పటికీ కొనసాగుతున్న దయనీయ పరిస్థితులను కాథాంశాలుగా తీసుకుని రాసిన కథలివి. ప్రతి కథా తప్పక చదవాల్సిన, చదివి ఆయా సమాజాల మనుషుల గురించి తెలుసుకోవాల్సినదే. ఏ కథ కాకథే వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టి మనతో కంట తడి పెట్టిస్తుంది. వస్తువుపరంగా విభిన్నత, ప్రత్యేకత, వాస్తవికతలతో కూడిన వస్తువులను తీసుకుని శైలిపరంగా వివిధ మాండలికాలు, విభిన్న వ్యక్తీకరణలు, ప్రత్యేక వర్ణనలతో ప్రతి వాక్యము, ప్రతి అక్షరమూ ఒక్కటి చదవకపోయినా ఏదో కోల్పయినంతగా బాధపెట్టే రీతిలో పుస్తకమంతా పరుచుకుని ఉన్నాయి. పుస్తకాన్ని జీవితంగా, వివిధ జీవితాలుగా మనముందుంచిన వినోదిని గారి పదునైన, సూటి కలం నుంచి వచ్చిన ఒక మంచి పుస్తకం ‘బ్లాక్‌ ఇంక్‌’.

ఈ పుస్తకంలోని  మరియ, బ్లాక్‌ ఇంక్‌, బాలేదు, జెరమొచ్చింది కథలను ప్రత్యేకంగా చూడాలి.  ఈ మూడిరటిలో  పిల్లలు ప్రధానపాత్రలు.  రెండు కథల్లో దళిత పిల్లలు. ఒక కథలో బ్రాహ్మల పిల్ల వల్ల బాధపడే దళిత అమ్మాయి. ఈ మూడు కథల్లోని ఇతివృత్తాలను, వాటిలో పేర్కొన్న వివిధ విలువలు, వ్యక్తీకరణలు, వర్ణనలు, మానవీయాంశాలు తదితరాలను చూడాలి.

ఈ మూడిరటిలో మొదటి కథ పేరు ‘మరియ’.

ఇందులో  మరియ, మార్త అక్కచెల్లెలు. మరియ అంటే అందరికీ ఇష్టం. ఆమె తండ్రి ఎలిమెంటరి స్కూల్‌లో అటెండర్‌. తాగుబోతు. అతనికి చాలా మంది స్నేహితులు. ఎప్పుడూ వాళ్లంతా ఇంట్లో మనుషుల్లాగా ప్రేమగానే ఉండేవాళ్లు. అందరూ మరియను ముద్దు చేసేవాళ్లు. తరచూ అక్కడే తినేవాళ్లు, పడుకునే వాళ్లు. మరియ తల్లి చాలాకష్టం చేసేది. భర్త డబ్బులన్నీ తాగుడుకే పోతే తాను కూలిపని చేస్తూ సంసారాన్నీడ్చేది. ఇల్లెడు చాకిరితో పాటు ఈ స్నేహితులందరికీ అన్నీ సమకూర్చే పనీ చేసేది. ఆ అన్ని పనుల్లోనూ మరియ ఆమెకు సాయం చేసేది. మరియ చిన్నప్పుడు చిన్నగా సన్నగా ఉన్నా కాస్త పెద్దయ్యాక ‘దిట్టంగా, పలుకురాయి తొక్కితే పదారొక్కల’య్యేలా బలంగా అయింది. ఐదో తరగతితో తమ్మున్ని ఎత్తుకోడానికి చదువు ఆపేసింది. మరియను అత్త కొడుక్కు మేనరికం ఇవ్వాలని ఇంట్లో అందరి నిర్ణయం. బావంటే మరియకూ ఇష్టమే.

అయితే ఆ ఇంట్లో అతన్ని కూడా పక్కన పెట్టేంతగా భయపడే సందర్భం- వెంకటేశ్వర్రావు రాక. ఆయనది ఓ రకంగా మెడికల్‌ రిప్రెజెంటేటివ్ ఉద్యోగం. బ్రాహ్మడు. వచ్చినప్పుడల్లా మరియ ఇంట్లోనే దిగేవాడు. బ్రాహ్మడు కిరస్తాని ఇంట్లో దిగడమే అదృష్టమని భావిస్తూ ఇల్లెడు మందీ అతనికి సర్వచాకిరి చేస్తూ అన్ని సౌకర్యాలు కలిగించే వారు. అతన్నున్నన్ని రోజులూ ఇంట్లో మాంసాహారం, గుడ్లు అన్నీ బంద్‌. ఇంటికి స్నేహితులను రానిచ్చేవారు కాదు. ఆయనకు ప్రత్యేకంగా సబ్బు. ప్రత్యేకంగా విస్తరి. ఆయన విడిచిన బట్టలు ఇంట్లో వాళ్లు ఉతికి ఇస్త్రీ చేయడం. వెన్నపూసతో వేడివేడిగా తిండి పెట్టడం. ఇంగ్లిష్‌ పేపర్‌ రెడీగా ఉంచడం. కానీ అతనొక చెత్త వేధవ. కనీస ఇంగితం లేని మనిషి. ఏసయ్య కోసం పెట్టిన క్యాండిల్‌కే సిగరెట్‌ ముట్టించేవాడు. పదేసి రోజులున్నా వెళ్ళేటప్పుడు పిల్లల చేతిలో రూపాయి బిళ్ల పెట్టేవాడు కాదు.

ఓసారి ఇంట్లో గొడవతో మరియ తల్లి కోపంతో పుట్టింటికి పోవడం, తండ్రి గుంటూరు ట్రాన్స్‌ఫర్‌కు ప్రయత్నించడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలను వెంకటేశ్వర్రావు ఇంట్లోని ఓ మూలకున్న పూరింట్లో ఉండాల్సి వస్తుంది. చెత్త పడేసే దిబ్బలాంటి గది అది, బ్రాహ్మల ఇల్లు కనుక ఇక్కడ మళ్లీ మాంసాహారం, కోడిగుడ్లు, చేపలు అని బంద్‌. ఆ ఇంటమ్మ వకుళాదేవి మరియతో బండెడు చాకిరి చేయించేది. ఇదిలా జరుగుతుంటే వెంకటేశ్వర్రావు కొడుకు మల్లి మార్తాను లైంగికంగా వాడుకోవాలని చూసేవాడు. శరీరాన్ని అసభ్యంగా తాకడం, తన శరీరాన్ని ముట్టించడం లాంటి పనులు చేసేవాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించేవాడు. మార్తా ఎంతసేపూ మల్లి ఎందుకలా చేశాడని ఆలోచించేది బాధపడేది గానీ తాను మానసికంగా కుంగిపోయి జీవితం మీద నిరాశను పెంచుకోలేదు. బళ్లో చేరాక అక్కడ పిల్లలు, సార్లు మార్తాను కిరస్తాని అంటూ దూరముంచారు. బడినుంచి పారిపోయి ఇంటికి వచ్చి చూసే సరికి వెంకటేశ్వర్రావు మరియను అత్యాచారం చేస్తుంటాడు. మరియ ఏడుస్తూ మార్తాను వాటేసుకుంది. తెల్లవారి మరియ బావిలో దూకి చనిపోయింది. ఏం జరిగిందో మార్తా చెప్తే, తాను చూసిన విషయాన్ని అందరి ముందూ చెప్తే ఆ ఇంటి వాళ్ళందరూ మార్తానే తిట్టారు. తమది నిప్పును కడిగే వంశమని, కడజాతి పిల్లలను తాము తాకమని, ఇలాంటిది ఎప్పుడు జరగదని తప్పించుకుంటారు. నల్లగా ఉబ్బిపోయి, నానిపోయి, బావిలో తేలిన మరియ చనిపోయాకా మోసపోయింది. బ్రాహ్మల ఆధిపత్యానికి, బ్రాహ్మణ ఆధిపత్యానికి. మరియ జ్ఞాపకాలు నిరంతరం మార్తాతోనే సజీవంగా ఉంటాయి.

ఈ కథలో వినోదిని కొన్ని దళిత విలువలను, విషయాలను బలంగా ప్రొజెక్ట్‌ చేశారు. దళిత క్రైస్తవ సమాజాల్లో కొనసాగుతున్న కుటుంబ పరిస్థితులను చూపించారు. ఆ సమాజాల్లో తల్లులంతా ఇంటా బయటా చాకిరి చేస్తారు. ఇంట్లో వెలకట్టబడని ఇంటి పని, బైట అతి తక్కువ వెలకట్టే కూలిపని. ఇప్పటికీ గ్యాస్‌ పొయ్యి లేని కుటుంబాలెన్నో కట్టెల మీద వండుకుంటూనే ఉన్నాయి. సాధారణీకరించలేమేమో గానీ భర్త తాగుబోతుగా ఉంటాడు. పైగా అతనికి స్నేహితులు. వేరే కులాల వాళ్లు దగ్గరికి రానివ్వరు కనుక వాళ్లంతా దళిత లేదా దళిత క్రైస్తవ కులాల వాళ్లేననుకోవాలి. కానీ ఆ దళిత స్నేహితులు ఉన్నత కుల, బ్రాహ్మణ స్నేహితుడైన వెంకటేశ్వర్రావు లాంటి వాళ్ళు కాదు. వాళ్లు మరియను చాలా ప్రేమగా చూస్తారు.  మరియ తల్లిని ‘వదినమ్మా’ అంటూ గౌరవంగా పలకరిస్తారు. ఆ ఇంట్లోనే తిని పడుకునేంత ఆత్మీయత అందరిలో. దళిత స్నేహం అంత గొప్పగా ఉంటుంది. ఎక్కువకెక్కువగా పైకి ప్రేమగా పలకరించి లోతున గోతులు తీసేలాంటి పెద్ద కులపు స్నేహం కాదది. ఒకరి కోసం ఒకరు ప్రాణమిచ్చేంత గొప్ప స్నేహం దళిత సమాజాల్లో ఇప్పటికీ నిలిచి ఉంది. మరియ తండ్రికి కుటుంబ బాధ్యత లేదు, భార్యను కొట్టేలాంటి పురుషాధిక్య ధోరణులున్నాయి.

ఇవి  అన్ని సమాజాలలో ఉన్నట్లు దళిత సమాజాల్లోనూ ఉన్నాయి. మరియ లాగే చాలా మంది పిల్లలు, తల్లిదండ్రులు కూలి పనులకు పోతే తమ్ముళ్లను, చెల్లెలను పట్టుకోవడానికి చిన్న తరగతుల్లోనే చదువులు ఆపేస్తున్నారు. కాస్త పెరిగాక వీళ్లూ కూలి పనులకు పోతారు. ఇప్పటికీ దళిత సమాజాలలో ఎక్కువ మంది చేసే పని కూలి పనే అవడానికి చదువుకు దూరమవడానికి కారణం ఇదే. దీని వెనక ఉన్న రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులే. అయినా ఇప్పటికీ వాళ్లు పెద్ద కులాల వాళ్లను గౌరవిస్తారు. ముఖ్యంగా బ్రాహ్మలను వాళ్లు ఇంటికి రావడం, ఇంట్లో తినడమే తమ అదృష్టమనుకుంటారు. అలాంటి పరిస్థితే వస్తే కథలో వెంకటేశ్వర్రావు లాగా సకల సౌకర్యాలు సమకూర్చి దేవుళ్లలాగా చూసుకుంటారు. ఎందుకో పెద్ద కులాల మీద ఆ గౌరవం! ఆ కులాలు అణిచివేస్తేనే తమ బతుకులిట్లా అయినాయని అక్కడా ఇక్కడా విని ఉన్నా కూడా మళ్లీ మళ్లీ అదే గౌరవాన్ని ప్రదర్శిస్తుంటారు. ఏసయ్య క్యాండిల్‌కు సిగరెట్‌ ముట్టించినా, పిల్లలకు చిన్న చాక్లెట్‌ కూడా కొనియ్యక పోయినా, ఇంటికి పోతే పిల్లలను పాకలో ఉండమన్నా వెంకటేశ్వర్రావు మీద తండ్రికి గౌరవం ఏమాత్రం చెదిరిపోదు. చివరకు అతని వల్ల తన కూతురు చనిపోయినా ఏమీ అనలేనంత అశక్తతతో కూడిన గౌరవం. ఎదుటి మనిషి పట్ల ఇంతటి గౌరవాన్ని కలిగి ఉండటాన్ని గొప్ప సాంస్కృతిక విలువ అనాలో, దీన్ని గౌరవం పేరుతో కొనసాగుతున్న బానిస ధోరణి అనాలో మరి… రాబోయే ఫలితాలతో సంబంధం లేకుండా తోటి మనుషుల మీద ప్రేమ, గౌరవాలను కలిగి ఉండటం దళిత సమాజాలలో ఇప్పటికీ చూస్తుంటాం. దళితులు తమకు అన్ని పనులు చేసే మనుషులని, వాళ్ల నుంచి ఆ పనులు తీసుకోవడం తమ జన్మహక్కు అని భావించే వెంకటేశ్వర్రావు లాంటి బ్రాహ్మలు ఇప్పటికీ నూటికి నూరు శాతంగా ఉంటారు. దళితులను అంటరాని వాళ్లని చీదరించుకుని, దూరముంచే ఇలాంటి మనుషులు వాళ్లతో పనులు చేయించుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. వెంకటేశ్వర్రావులాగా అవసరం తీర్చుకోవడానికి మాత్రం ఏ కులమూ అడ్డు కాదు.

వెంకటేశ్వర్రావు పదేసి రోజులు తనకు అవసరం కనుక దళితుల చేతి తిండి తింటాడు, కాని తన దాక వస్తే వాళ్లను ఇంటికి రానియ్యడు, పాకలో పెడతాడు. అతని భార్య అంట్లు తోమిన చోట శుద్ధి కోసం నీళ్లు చల్లుతుంది. కనీసం మిగిలిన కూరలు తమ గిన్నెల్లో ఇవ్వకుండా గిన్నె తెచ్చుకోమంటుంది. అంటే తమ అక్కరకు అన్ని నియమాలు పక్కనబెట్టి ప్రవర్తిస్తారు. లేకుంటే శుచి, శుద్ధి అంటూ నీలుగుతారు. ఇదీ ధోరణి. అంతగా కులాన్ని పాటించే, ముట్టుకుంటేనే పాపమని భావించే వెంకటేశ్వర్రావు, అతని కొడుకులకు దళిత అమ్మాయిలతో సంబంధం ఎలా కావాల్సి వచ్చింది? ఈ అనుమానం కథ పొడుగునా మార్తాను వేధిస్తుంది. పదే పదే ఇదే ప్రశ్న అడుగుతుంటుంది. జవాబు లేని, జవాబు దొరకని ప్రశ్న.

చిన్న కులాల మీద పెద్ద కులాల సెక్సువల్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌ ఎంత దుర్మార్గంగా ఉంటుందో ఇందులో మార్తా, మరియ పాత్రలు చూపిస్తాయి. మార్తాకు కాస్త ధైర్యముంది కనుక తనలో తానే ఆలోచించుకుని మధనపడి తేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరియది సున్నిత మనస్తత్వం కనుక ఆత్మహత్య చేసుకుంటుంది. ఇద్దరి విషయంలోనూ బాధితులు దళితులు. శిక్ష కూడా వాళ్లకే. అందుకు కారణమైన వాళ్లకు శిక్ష లేదు. ఇందుకు రెండు కారణాలు ` వాళ్లు మగవాళ్లు, పైగా బ్రాహ్మలు. సమాజంలో ఇలాంటివే వందలకొద్దీ చూస్తూనే ఉన్నాం. వీటికి సాంపుల్సే మరియ, మార్తాలే.

బాధిత కులాల వాళ్లకు న్యాయమూ జరగదు. మార్తాను బెదిరించి న్యాయాన్ని చంపితే, మరియను చంపేసి న్యాయాన్ని పాతరేశారు. పైగా ‘నిప్పును కడిగే కులం’ అని ‘కడజాతి పిల్లను అలా చేయడ’నే తీర్పులతో న్యాయం దొరుకుతుందేమోనన్న ఆశనూ చిదిమేశారు. మొత్తంగా ఆ కులాలకు న్యాయం అందదనే విషయాన్ని, నిజాన్ని కథలోనూ చూపించారు.

వినోదిని ఈ కథను చాలా సహజసిద్ధంగా రాశారు. రోజూ మాట్లాడుకేనే సహజమైన భాషను కథలో వాడారు. మాండలిక భాషను వాడినా అది ఎక్కడా సంక్లిష్టమవకుండా ఆ మాండలిక అవగాహన పెద్దగా లేని వాళ్లకు కూడా సులభంగా అర్థమయ్యేలాగా కథ సాగుతుంది. ‘ముడ్డి కాస్త కిందికి దించవే, మొహమ్మీద పెడతన్నావ్‌, తీస్కొచ్చి’, ‘పలక్కపోతే చిన్న చిన్నగా పిర్రల మీద గిచ్చేది’ లాంటి పెద్ద కులాల వాళ్లు ఇబ్బంది పడే మాటలను స్వేచ్ఛగా వాడారు. చదువుతుంటే హాయి గొలుపుతూ ఈ పదాలు సహజత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కథలో వ్యక్తీకరణలు కూడా ఇంతే సహజంగా ఉంటాయి. ‘నా చుట్టూ కమ్ముకున్న చీకటి నల్లటి వాసనొస్తోంది. అచ్చం అక్క మరియలా’ లాంటివి. ‘బడి నుంచి ఇంటికొచ్చే దారిలో పాకీ దిబ్బలుండేవి. ఊర్లోంచి పెద్ద పెద్ద డబ్బాల్తో దొడ్డికి తెచ్చి ఆ దిబ్బల మీద పోసేవాళ్ళు. ఆ దిబ్బల్ని కూడా మేం ఇంతగా చీదరిచ్చుకోని దూరం జరగలేదు’ ` అంటరాని మనుషులను దొడ్డికి కంటే హీనంగా చూస్తున్నారనేది వ్యక్తీకరించడమిది. ఇట్లాంటివే కథలో చాలా కనిపిస్తాయి.

మొత్తంగా ఈ కథలో దళిత సమాజాలపై ఈనాటికీ వేర్వేరు రూపాలలో కొనసాగుతున్న అణిచివేతలను, లైంగిక అత్యాచారాలను, శ్రమ దోపిడీలను వినోదిని చాలా హృద్యంగా వివరించారు.

ఇక రెండవ కథ ` బ్లాక్‌ ఇంక్‌. ఇందులో శ్రియ నాల్గవ తరగతి చదివే చిన్నారి. రెండ్రోజుల సెలవుల కోసం చిన తాత ఇంటికి వస్తుంది. సెల్లార్‌లో పిల్లలంతా ఆడుతుంటే వాళ్ళతో పాటు తానూ ఆడుకోడానికి వస్తుంది. మంచినీళ్ల కోసమని రచయిత్రి (బహుశ) ప్లాట్‌కి వచ్చి పరిచయం పెంచుకుని ముద్దుమాటలతో చేష్టలతో ఆకట్టుకుంటుంది. ఎన్నో ముచ్చట్లు చెప్తుంది. హార్లిక్స్‌ అడిగి కలిపించుకుంటుంది. ఇంట్లో ఎప్పుడూ అమ్మ పనుల్లో సాయం చేస్తుండే ఆ పాప ఇక్కడ కూరగాయాలను ఫ్రిజ్‌లో సర్దుతుంది. ఆరిన బట్టలను మడతపెడుతుంది. మధ్య మధ్యలో తన చిలిపి పనులతో నవ్విస్తుంది. కూరగాయాలను పూలుగా, పక్షులుగా, ఆర్నమెంట్లుగా చేసి కర్చీఫులను సమోసాల్లా మడత పెట్టి, చిరుతిండిని మెగాస్టార్‌ ఫుడ్‌ అని తనకున్న చిలిపి తనమంతా ప్రదర్శిస్తుంది. ఈ చిలిపి పనులే కాదు గతంలో ఒక పందికి తాను వెళ్తున్న ఆటో మూలంగా దెబ్బ తగిలితే దానికి కట్టు కట్టించినంత దయార్ధ్ర హృదయం కూడా పాపకుంది. పాప రోజూ డైరీ రాస్తుంది. ఆ డైరీలో తనకు నచ్చిన విషయాలు నీలి ఇంకుతో, నచ్చనివి నల్ల ఇంకుతో రాస్తుంది. చివరికి అన్నం తినే సమయంలో పాప అడుగుతుంది, మీ కులం ఏమిటని. ‘దళిత్‌’ అని చెప్తే, ‘హరిజన్సా! మేము బ్రాహ్మలం, హరిజన్స్‌ ఇంట్లో తినకూదం’టూ అసహ్యించుకుంటూ వెళ్ళిపోతుంది. కథ ముగుస్తుంది. కళ్లు తడుస్తాయి.

పసిపిల్లలకు కులాలు, మతాల విషబీజాలను తల్లిదండ్రులు, పాఠశాలలు, సమాజం ఎట్లా చొప్పిస్తున్నాయో చెప్పే ఈ కథ చాలా సేపు ఆలోచింపచేస్తుంది. కథ మొదటి నుంచీ పాప అల్లరి, వేషాలకు ముద్దొస్తే చివర్లో ‘మా డాడీకి, మా మమ్మీకి హరిజన్స్‌ ఫ్రెండ్సే లేరు! నాక్కూడా లేరు! అసలు మాకు వాళ్లతో ఫ్రెండ్షిప్పే ఇష్టం ఉండదు. నా ఫ్రెండ్సంతా బ్రామ్మిన్స్‌, చౌదరీస్‌, రెడ్డీస్‌, వేరే హిందూస్‌…’ అంటుంటే విపరీతమైన కోపం వస్తుంది. చాచా లాగిపెట్టి చెంప పగలగొట్టాలనేంత కోపం. తప్పు ఆ పాపది కాకపోవచ్చు, కానీ ఆ మాటలకు కోపం రాకమానదు.

కథలో చక్కని విషయమేమిటంటే కథ సాంతం చిన్నపాపను వినోదిని గారు వర్ణించిన తీరు. చిన్న పిల్లల మీద ఆమెకున్న ఇష్టమెంతో ప్రతి వాక్యం యొక్క వర్ణనా చెప్తుంది. కథలో మూడొంతులు పాప వర్ణన వాక్యాలే. సెల్లార్‌ను పిల్లలతో విరగబూసిన తోటగా, సైకిళ్లను తూనీగలుగా, పిల్లలను సీతాకోక చిలుకలుగా, నవ్వులను రాలిపడుతున్న పుప్పొళ్లుగా చెప్పడంలో పిల్లలతో పాటు ప్రకృతి మీదా ఆమెకున్న ఇష్టం కనిపిస్తుంది. ఆమె వర్ణనల్లో పాప ఫ్రాక్‌ సీతాకోక రెక్కల్తో నేసినట్లుంటుంది. పాదాలు పూరేకుల్లా ఉంటాయి. నవ్వు కళ్లనిండుగా ఉబికి వస్తుంది. పిచ్చుక గూళ్లలో పసి పావురాయి పాదాలను దోపినట్లుగా చెప్పులు వేసుకుంటుంది. వెన్నెల్లో ముంచి తీసిన రెండు పూరెక్కలకూ మధ్య తేనెచుక్కలద్దినట్లు కళ్లుంటాయి. వాటి మీద వాలడానికి తటపటాయిస్తున్న రెండు కందిరీగల్లా దట్టమైన వెంట్రుకలతో కనురెప్పలుంటాయి. నవ్వు చెమట పట్టినట్లుగా మొహమంతా పట్టి ఉంటుంది. ప్రతి మాటకు ముందు వెనకా నవ్వుల కాన్వాయ్‌ ఉంటుంది. చేతివేళ్లు మీగడతో చేసినట్లుంటాయి. మార్కెట్లో రంగురంగుల పూలు కుప్పలు కుప్పలుగా పోసినట్లు నవ్వులుంటాయి. గోడకంటిన డిజైన్‌ కాగితాల్లా పాప మాటలు గాలికి ఊగుతాయి.

ఇంతందంగా చిన్న పిల్లలను ఇదివరకెవరూ వర్ణించి చెప్పలేదేమో! అంత ఇష్టమున్న పాప చివర్లో కులం గురించి మాట్లాడేటప్పుడు ఆ మాటలను చాలా బాధాకరంగా రాస్తారు వినోదిని. ఆరో తరగతిలో డ్రిల్లు మాస్టారు గ్రౌండ్‌లో పరిగెత్తమన్నపుడు కాడ దాకా దిగి విరిగిన చూపుడు వేలంత ముల్లిప్పుడు గుండెల్లో కసుక్కున దిగినట్లున్నాయా మాటలంటారు. ఆ సమయంలో పాప మొహంలోని రంగులన్నీ మాయమవుతాయి. చిన్నగా బూడిద రంగు అలుముకుంటుంది. ఆకాశం అంచుల దాకా ఎగిరిన రంగుల గాలిపటం పుటుక్కున తెగినట్టుంటుంది. వాంతి తన్నుకొస్తుంటే అతికష్టం మీద ఆపుకున్నట్లు పెడుతుంది పాప ముఖం. లుకలుకమని తిరుగుతున్న తెల్లటి పురుగుల్ని చూస్తున్నంత అసహ్యంగా పెడుతుందా ముఖాన్ని. పాప వెళ్ళిపోయాక గది నిండా పేరుకుపోయిన రంగు రంగుల సీతాకోక చిలుకలు బొచ్చు పురుగులై మీదకు పాక్కుంటూ వస్తున్నాయంటారు.

పాపను ఎంత అందంగా వర్ణిస్తారో పాప ముఖంలోని భావాలను, అయిష్టతలను అంతే బాధగా వర్ణిస్తారు. కథలో ఎక్కడా పాప తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ప్రస్తావనే లేకున్ననూ కథ చివరి పాప ప్రవర్తనకు పాఠకుల కోపమంతా వాళ్ళమీదకే మరలక మానదు. అంత బాధ్యతాయుతంగా వాళ్ల బాధ్యతారాహిత్యాన్ని పరోక్షంగా చూపిస్తారు. కథ చివర్లో కళ్లు చెమర్చే సంభాషణలుంటాయి. పెద్ద కులాల్లోని చిన్న పిల్లలు చిన్న కులాల్లోని ఎంత పెద్దవాళ్లనైనా ఎంతగా అసహ్యించుకుంటారో పాప పాత్ర ద్వారా చెప్పారు. కథంతా పసిపాప గురించి అందంగా వర్ణించడమే న్యాయం. కానీ కథ చివర్లో పాపను ఏమాత్రం అసహ్యించుకోకుండా, తాను, తన మనసు మాత్రమే బాధ పడిపోయిందని చెప్పడం వెనుక అందమైన పసిపాపను వెనకేసుకు రావాలనే ఆతృత చిన్నప్పటికీ తనకు తెలియకుండానే పాపలో పాతుకుపోయిన విషబీజాలను ప్రశ్నించలేని అసహాయతే కనబడిరది.

మూడోది, ఈ వ్యాసంలో ప్రస్తావించే చివరి కథ ` ‘బాలేదు… జెరమొచ్చింది!’. ఆకలి తీరిపోవాలని, ఏదో ఓ మార్గం వాళ్ల కడుపులు నింపాలని కోరుకుందాం! మనసార కోరుకుందాం!

ఇట్లా ‘బ్లాక్‌ ఇంక్‌’ కథా సంపుటిలోని పిల్లల కేంద్రంగా సాగిన ఈ మూడు కథలు చాలా హృద్యంగా, చక్కగా రాసినవి. లిఖిత ప్రెస్‌, హైదరాబాద్‌ ప్రచురణగా వచ్చిన 150 పేజీల ఈ పుస్తకంలో మిగిలిన ఎనిమిది కథలూ అనేక సామాజికాంశాలను ప్రతిబింబిస్తూ బాధ్యతాయుతమైన కథలుగా మనముందుంటాయి.

Leave a Reply