ఫ్రెంచి రాజ్యాంగాన్ని పరిశీలించి అందులోని వైరుధ్యాల గురించి మార్చు వివరిస్తూ ‘ఫ్రెంచి రాజ్యాంగంలోని ప్రధాన వైరుధ్యం : ఒకవైపు కార్మికులకు, రైతులకు, పెటీ బూర్జువాల సామాజిక బానిసత్వాన్ని కొనసాగిస్తూనే, వారు రాజకీయ అధికారం పొందడానికి సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించడం, మరో వైపు బూర్జువా వర్గ సోమాజిక పెత్తనాన్ని రక్షిస్తూనే వారికి ఉన్న రాజకీయ సౌకర్యాలను పరిమితం చేయడం. సమాజంలో నిజమయిన ప్రజాస్వామిక వాతావరణం ఉంటే ఈ రెండు వర్ణాల మధ్య వైరుధ్యం తీవ్రతరమై బూర్జువా సమాజం యొక్క పునాదికే ప్రమాదం ఏర్పడుతుంది’’ అని అన్నాడు. భారత రాజ్యాంగంలో కూడా ఇలాంటి వైరుధ్యం ఉంది. ఫ్రెంచి రాజ్యాంగంలోని ప్రతి పేరా గ్రాఫ్‌లో వైరుధ్యం ఉందని మార్చు నిరూపించాడు. ‘‘రాజ్యాంగానికి, సామాజిక వాస్తవానికి మధ్య పూర్తిగా అంతరం ఉన్నప్పుడు ప్రజల దృష్టిలో అది ఒక కల్పనగానే ఉంటుంది. ఈ అంతరం ఏ మేరకు తగ్గుతుందో లేదా తొలగిపోతుందో ఆ మేరకు రాజ్యాంగం వాస్తవంగా ఉంటుంది.’’ అని లెనిన్‌ అన్నాడు. వివిధ చారిత్రక దశల్లో ముందుకు వచ్చిన రాజ్యాంగాలు ప్రగతిశీలంగా ఉండటం, యాజమాన్యం వ్యక్తిగతంగా మారడం. ఉత్పత్తి సాధనాలపైన వ్యక్తిగత యాజమాన్యాన్ని ఆస్తిగా, ఒక హక్కుగా రాజ్యాంగం గుర్తించి కాపాడుతుంది. ఉత్పత్తి సంబంధాలను రాజ్యాంగాలు ప్రశ్నించవు. వాటిని మార్చడానికి ప్రయత్నించవు.

పెట్టబడిదారీ సమాజంలో దోపిడికి వ్యతిరేకంగా శ్రమవిముక్తి కోసం సోషలిస్టు విప్లవాలు జరిగాయి. రష్యాలో విప్లవం తర్వాత సోషలిస్టు సమాజ నిర్మాణానికి దోహదపడే విధంగా కార్మిక వర్ణ దృక్పథంతో రాజ్యాంగాన్ని రచించారు. కమ్యూనిస్టు రాజకీయ, ఆర్థిక విధానాలను అమలు చేయడానికి రాజ్యాంగాన్ని సాధనంగా ఉపయోగించారు. ఆ తర్వాత కాలంలో రష్యాలో సోషలిజం పేరుతో పెట్టుబడిదారీ విధానం పునరుద్ధరించబడిరది. రాజ్యాంగం కార్మిక వర్గ దృక్పథాన్ని కోల్పోయింది. రష్యాలోనూ, తూర్పు యూరోప్‌లోనూ జరిగిన మార్పులు పాలక వర్గాల రాజకీయాలకు, వారి ప్రయోజనాలకు అనుకూలంగానే రాజ్యాంగాలు అమలవుతాయని స్పష్టం చేస్తున్నాయి.

మూడవ ప్రపంచ దేశాల్లో యూరోప్‌లాగా పారిశ్రామిక విప్లవాలు జరగలేదు. బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలు విజయవంతం కాలేదు. ఫ్యూడలిజం పూర్తిగా నాశనం కాలేదు. సామ్రాజ్యవాదం పట్టునుండి బయటపడకపోగా నేడు మరింతగా దాని బిగి కౌగిట్లో నలిగిపోతున్నాయి. దళారీ బూర్జువా వర్గాలు రాజ్యంపైన, సమాజంపైన అధికారాన్ని చెలాయిస్తున్నాయి. రాజ్యాంగం ఒకవైపు ప్రజలకు స్వేచ్చ, సమానత్వం ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం అందించే సాధనంగా ఉంటూ మరోవైపు భూస్వాముల, పెట్టుబడిదారుల లేదా దళారీ బూర్జువాల ప్రయోజనాలను, అధికారాన్ని పరిరక్షించే విధంగా ఎలా ఉనికిలో ఉండగలదు? ఈ వైరుధ్యాన్ని రాజ్యాంగం ఎలా కొనసాగించగలదు? పరిష్కరించగలదు? ప్రధానంగా రాజ్యాంగం ఒక బలమైన భావజాలంగా సమాజం మీద పనిచేస్తుంది. పాలకవర్గాలు రాజ్యాంగం, చట్టంద్వారానే, అధికారాన్ని వ్యక్తీకరించి అమలు చేస్తాయి. ఈ అధికారానికి సామాజిక ఆమోదాన్ని పొందటానికి రాజ్యాంగంపై ఆధార పడతారు. భారత రాజ్యాంగం ఈ పరిణామాలకు మినహాయింపు కాదు.

భారత రాజ్యాంగ ‘నిర్మాత’లపై రాజ్యాంగ రచనమీద ప్రధానంగా మూడు చారిత్రక పోరాటాల స్రవంతులు, వాటి ఆలోచనల ప్రభావం ఉంది. పాశ్చాత్య దేశాల్లో జరిగిన బూర్జువా ప్రజాస్వామిక విప్లవాలు, సోషలిస్టు విప్లవాల ప్రభావంతోపాటు, మనదేశంలో బ్రిటిష్‌ వలస పాలనకు వ్యతిరేకంగా వివిధ వర్గాలు జరిపిన పోరాటం, స్వాతంత్య్ర పోరాటం ముందుకు తెచ్చిన ఆకాంక్షలు, ఆశయాలు భారత రాజ్యాంగంలో వ్యక్తీకరించ బడ్డాయి. రాజ్యాంగ వీఠరిక, ప్రాథవిక వాక్కులు, ఆదేశిక నూత్రాలుగ రూపొందించబడ్డాయి.

రాజ్యాంగ పీఠిక (ప్రియాంబుల్‌) మరో అర్ధంలో ఆనాటి పాలకులు ప్రజలకు చేసిన వాగ్దానం, అధికారం చేపట్టిన సమయంలో చేసిన ప్రతిజ్ఞ, భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించారు. పౌరులందరికీ న్యాయాన్ని (సామాజిక, ఆర్ధిక రాజకీయ) స్వేచ్ఛగా ఆలోచించి, తమ భావాలను వ్యక్తీకరించడానికి, నమ్మకాలు కలిగి ఉండటానికి హక్కు ఉంది. పౌరులందరికీ సమాన హోదాను, సమాన అవకాశాలను, ప్రజల మధ్య సౌభ్రాతృత్వం పెంపొందించడానికి రాజ్యాంగం దోహద పడుతుంది, వ్యక్తి ఆత్మగౌరవంతోపాటు, దేశ సమైక్యతను మరియు సమగ్రతను కాపాడుతాం’’ అని హామీ యివ్వబడిరది. ప్రజల వ్యక్తిత్వాన్ని మానవీయంగా మలచడానికి, దేశ ఆర్థిక విధానాన్ని ప్రజాస్వామిక సామాజిక న్యాయం ప్రమాణాల ఆధారంగా పునర్నిర్మించాలనే ఆదర్శం, లక్ష్యం ఉంది. ఈ లక్ష్యం సాధించడానికి ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు దోహదపడతాయనీ, వీటిని ‘‘సామాజిక విప్లవంగా’’ చిత్రీకరించారు. కాని, రాజ్యాంగంలోని ఆశయాలకు, ఆదర్శాలకు సామాజిక వాస్తవానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. వైరుధ్యం వుంది. దేశంలో సామాజిక రాజకీయ సంక్షోభాలు ఏర్పడినప్పుడు ఈ వైరుధ్యం తీవ్రతరం అవుతుంది. సమాజంలోని వర్ణాల మధ్య ఉండే ఘర్షణలకు రాజ్యాంగం ప్రతిస్పందిస్తుంది.

రాజ్యాంగం మూడవ అధ్యాయంలో ప్రాథమిక హక్కుల జాబితా చాలా విశిష్టమైంది. చట్టం ముందు అందరూ సమానం, చట్టం అందరికీ సమాన రక్షణ కల్పించాలి (ఆర్టికల్‌ 14). కులం, జాతి, భాష, ప్రాంతం, లింగం, మతం అనే వివక్షత చెల్లదు (ఆర్టికల్‌ 15, 16) అంటరాని తనం ఏ రూపంలోనూ పాటించడానికి వీలులేదు. (ఆర్టికల్‌ 17) దేశంలో అందరికీ, వాక్‌, సభా స్వాతంత్య్రాలు ఉన్నాయి. అభిప్రాయాలు ప్రకటించే స్వేచ్చ ఉంది. సంఘాలు పెట్టుకునే హక్కు ఉంది. దేశంలో ఏ ప్రాంతంలోనైనా నివాసం ఉండే హక్కు ఉంది. (ఆర్టికల్‌ 19) నేరం ఒప్పుకోమని ఎవరినీ బలవంతం చేయడానికి వీలులేదు (ఆర్టికల్‌ 20(3)). ఎవరినైనా పోలీసులు అరెస్టు చేస్తే 24 గంటల్లో కోర్టులో హాజరు పరచాలి (ఆర్టికల్‌ 22(1)). ఎవరిచేతా వెట్టిచాకిరీ చేయించుకోవడానికి వీలులేదు (ఆర్టికల్‌23). 14 సంవత్సరాలలోపు పిల్లలచేత ఫ్యాక్టరీలలో, గనులలో, ప్రమాదకర స్థలాల్లో పనిచేయించుకోవడానికి వీలులేదు. (ఆర్టికల్‌ 24) . 1978 సంవత్సరం వరకు ఆస్తిహక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించబడిరది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి, చట్టబద్ధమయిన హక్కుగా ఆర్టికల్‌ 300(ఎ) కింద చేర్చారు. చట్టబద్ధంగా ఆస్తిహక్కును కాపాడుకోవడానికి అవకాశం ఉంది. భూ సంస్కరణలను అమలు చేయడానికి, రాజ్యాంగ బద్ధమైన సమస్యలను తొలగించడానికి ఈ సవరణ జరిగింది.

రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత రాజ్యంపై ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాజ్యం హక్కులను ఉల్లంఘించడానికి వీలులేదు. రాజ్యాంగ యంత్రం వలన హక్కులకు ప్రమాదం ఏర్పడితే కోర్టులకు వెళ్ళి అమలు చేయమని అడిగే అవకాశం ఉంది. మనదేశంలో కుల వివక్షతకు, అంటరానితనానికి వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా హక్కులు గుర్తించడానికి కుల వ్యతిరేక పోరాటాలు ఆందోళనలు జరిగాయి. అంబేద్కర్‌, పూలేల నాయకత్వాల్లో జరిగిన ఆందోళనల కారణంగా రిజర్వేషన్లను హక్కుగా గుర్తించాల్సి వచ్చింది. అయితే మొత్తంగా కుల వ్యవస్థను నిర్మూలించే ఆశయాలు, విధానాలు రాజ్యాంగంలో లేవు. అంటరానితనం రూపుమాపడానికి, వెట్టిచాకిరిని రద్దు చేయడానికి చట్టాలు ఉన్నా వాటిని అమలు చేయకుండా అగ్రకుల పెత్తందార్లు అధికార యంత్రాంగంతో కుమ్మక్కై అడ్డుకుంటున్నారు.

ప్రాథమిక హక్కులు అమూర్తమయినవి (అబ్సల్యూట్‌) కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోను, సందర్భాల్లోనూ ప్రాథమిక హక్కులు పూర్తిగా తొలగించడానికి రాజ్యాంగమే అవకాశం కల్పించింది. ఏ కారణాల రీత్యా హక్కులపై పరిమితులు పెట్టవచ్చునో వివరించింది. ఉదాహరణకి ఆర్టికల్‌ 19 పౌరులందరికీ వాక్‌ సభా స్వాతంత్య్రాన్ని సమావేశాలు పెట్టుకొనే హక్కును, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు గ్యారంటీ చేసింది. ఎవరైనా ఎక్కడయినా స్థిరనివాసం ఏర్పరచుకొనే (ఆదివాసీలను దృష్టిలో ఉంచుకొని) హక్కు ఉంది. ఈ హక్కులన్నీ కూడా ఈ కింది పరిమితులకు లోబడి ఉండాలి. ఆర్టికల్‌ 19లోని స్వేచ్ఛకు (1) ఇతర దేశాలతో ఉన్న సంబంధాలకు అవరోధం కల్పించినా, దేశభద్రతకు ప్రమాదం ఏర్పడినా 3) దేశ సార్వభౌమత్వం, సమగ్రతను భంగపరిచినా 4) పబ్లిక్‌ ఆర్జర్‌కు ప్రమాదం ఏర్పడినా, 5) సమాజంలోని నైతిక విషయాలను విమర్శించినా, లేక పాటించకపోయినా 6) కోర్టు ధిక్కారానికి పాల్పడినా, 7) యితరులను అవమానపరిచే రీతిలో ప్రవర్తించినా 8) నేరాలను ప్రోత్సహించినా, పౌరుల స్వేచ్ఛలను చట్టం ద్వారా తొలగించే అధికారం ఉంది. పై పరిమితులను పౌరులు పాటించడానికి, అమలు చేయడానికి చట్టాలను తయారుచేయవచ్చు. అయితే ఈ పరిమితులు ఒక్కోసారి హద్దుమీరి పోయే ప్రమాదం ఉంది. పరిమితులు సహేతకమయినవా కాదా అని కోర్టులు నిర్ణయిస్తాయి. ప్రస్తుతం దేశంలో పౌర, రాజకీయ హక్కులను రాజ్యాంగబద్ధంగా, చట్ట బద్ధంగానే హరించివేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. నాసా గతంలో టాడా, పోటా, ఎస్మా చట్టాలు ఈకోవ కిందికి వస్తాయి. అలాగే క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లో కూడా చాలా ఆంక్షలు విధించారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో మావోయిస్టులు నిర్వహిస్తున్న మీటింగులను, ఊరేగింపులను, అడ్డుకోవడం, అనేక రకాలైన అడ్డంకులను కల్పించడం పరోక్షంగా వాక్‌ సభా స్వాతంత్య్రాలను, సమావేశాలను ఏర్పరచుకునే హక్కులను గౌరవించక పోవడమే. శాంతి భద్రతలను కాపాడటానికి, పబ్లిక్‌ ఆర్డరును అమలు చేయడానికి, ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయకూడదని కారణాలు పోలీసులు చెబుతున్నారు. చట్ట ప్రకారమే చేస్తున్నామని అంటున్నారు. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను రూపొందించిన తీరును, వాటిపై ఉన్న పరిమితులను గురించి చెబుతూ రాజ్యాంగ నిర్మాతల్లో ఒక సభ్యుడు రాజ్యాంగం, అందులోని ప్రాథమిక హక్కులు, పోలీసు దృక్పథానికి అనుగుణంగా ఉన్నాయి అని విమర్శించాడు. ఆర్టికల్‌ 21లో వ్యక్తి స్వేచ్ఛను, ప్రాణాన్ని చట్టరీత్యా తప్ప యితరత్రా తొలగించడానికి వీలులేదు. కాని ఆర్టికల్‌ 22లో పార్లమెంటు ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టాలు తీసుకురావడానికి, తద్వారా అరెస్టు, విచారణ సందర్భంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలను తొలగించవచ్చు. ప్రపంచంలో ఏ రాజ్యాంగంలో కూడా ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ చట్టాలకు అవకాశం యివ్వదు.

పై పరిమితులు, ఆంక్షలతో పాటు ఎమర్జెన్సీని విధించడానికి, అది అమల్లో ఉన్నకాలంలో ప్రాథమిక హక్కులను రద్దు చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పించింది. ఆర్టికల్‌ 355 రాష్ట్రాల్లో శాంతి భద్రతలు కాపాడటానికి కేంద్రం పారామిలటరీ బలగాలను, సైనిక బలగాలను మోహరింపచేయడానికి అవకాశం యిస్తుంది. ఇవ్వాళ ప్రత్యేకించి మణిపూర్‌లోనూ, ఈశాన్య భారతదేశంలోనూ, కాశ్మీర్‌లోనూ సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టం ద్వారా అక్కడ ప్రజల హక్కులను ఎలా కాలరాస్తున్నారో తెలిసిందే. ఎమర్జెన్సీ విధించడం, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించడం, సైనిక బలగాలను తరలించడం అన్నీ కూడా రాజకీయ నిర్ణయాల్లో భాగంగానే జరుగుతుంది. అధికారంలో ఉన్న పాలకవర్గాలు తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి రాజ్యాంగం ఈ విషయాల్లో అడ్డుపడదు. మొత్తంగా రాజ్యాంగం ఒకవైపు ప్రజలకు హక్కులను గ్యారంటీ చేస్తూనే మరో వైపు వాటిని తొలగించడానికి అన్ని అవకాశాలను కల్పించింది. పాలక వర్గాల స్వభావాన్ని బట్టి రాజ్యాంగం నియంతృత్వంగానూ, ప్రజాస్వామికంగాను మారుతుంది. ఇందిరాగాంధీ రాజ్యాంగబద్ధంగానే ఎమర్జెన్సీని విధించింది. రాజ్యాంగబద్ధంగానే హక్కులను కాలరాచింది.

సమాజంలో దళితులపైన, మహిళలపైన దాడులకు, వారి హక్కుల ఉల్లంఘనకు కారణం కులవ్యవస్థ, పితృస్వామిక వ్యవస్థలు. వీటికి, ఆస్తి సంబంధాలకు మధ్య పరస్పర సంబంధం ఉంది. రాజ్యాంగం ఆస్తి హక్కును వ్యక్తిగతంగా గుర్తించి పరిరక్షిస్తుంది. ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన ఉత్పత్తి సంబంధాలను ప్రశ్నించదని యింతకు ముందు చెప్పుకున్నాం. భూసంస్కరణలను జాతీయకరణను అమలు చేయడానికి పాలకవర్గాలు చట్టాలు చేసాయి. వాటిని భూస్వాములు, జమిందారులు, పెట్టుబడిదారులు ప్రాథమిక హక్కులకు ప్రధానంగా ఆస్తిహక్కుకు, సమానత్వం,  స్వేచ్ఛలకు వ్యతిరేకం అని, రాజ్యాంగ వ్యతిరేకమని కోర్టుల్లో సవాలు చేసారు. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధికోసం ఈ

సంస్కరణలు అవసరమని, రాజ్యాంగం, చట్టం సృష్టించే అడ్డంకులను తొలగించడానికి సవరణలు చేసారు. భూమిని పేదలకు, దున్నేవారికి పంపిణీ చేయాలన్నా భూమిని ప్రభుత్వం సేకరించాలన్నా ప్రభుత్వం చట్టం చేయాలి. ఆ చట్టం ప్రజాప్రయోజనాల కోసమై వుండాలి. అంతేకాకుండ ప్రైవేటు వ్యక్తుల నుండి సేకరించిన భూమికి మార్కెట్టు ధరకు సమానంగా నష్టపరిహారం చెల్లించాలి. భూమిని వ్యక్తిగత ఆస్తిగా పరిగణించినంతకాలం, నష్టపరిహారం చెల్లించినంత కాలం, భూసంస్కరణలు అమలు కావు. రాజ్యాధికారంలో

భూస్వాముల పట్టు ఉన్నంతవరకు సాధ్యపడదు. ఆదేశిక సూత్రాలను అమలు చేయడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి పాలకవర్గాల స్వభావం, వారి ప్రయోజనాలు కారణం. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టుకు వెళ్ళవచ్చు. ఆదేశిక సూత్రాలను అమలు చేయాలని కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. కేవలం వీటిని ప్రభుత్వపాలనలో ప్రాథమికంగా పాటించాల్సిన నియమాలుగా రాజ్యాంగ నిర్మాతలు పేర్కొన్నారు. ఆదేశిక సూత్రాలను ప్రజల ప్రజాస్వామిక హక్కులుగా గుర్తించాలి.

హక్కులు వ్యక్తిగతంగా విలువైనవైనప్పటికీ, వాటి ఆచరణ సామాజికంగా ఉంటుంది. హక్కులు సమాజంలోని పెత్తనాన్ని దోపిడీని ప్రశ్నించే సాధనాలుగా ఉండాలి. అసమానత, ఆధిపత్యం కొనసాగినంతకాలం హక్కుల ఉల్లంఘన ఉంటుంది.  స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను కేవలం రాజకీయ  స్వేచ్ఛకు పరిమితమై, సామాజిక ఆర్థిక సంబంధాలకు విస్తరించక పోవడం వలన ప్రజాస్వామికీకరణ పురోగమనం చెందలేదు.

సామాజిక ఆర్థిక సంబంధాలకు పునాది అయిన ఉత్పత్తి సంబంధాల్లో మార్పు జరగకుండా నిజమైన ప్రజాస్వామికీకరణ జరగదు. భారత రాజ్యాంగం పేదరికాన్ని తొలగించాలనీ, అసమానతలపై దండోరా మోగించాలనీ, అప్పుడే రాజ్యాంగం యొక్క కర్తవ్యం నెరవెరుతుందని నెహ్రూ ఆశించాడు. ఈ కర్తవ్యాన్ని నిర్వహించలేకపోతే, భారత రాజ్యాంగం కేవలం కాగితపు రాజ్యాంగంగా ఉంటుంది. పరోక్షంగా రాజ్యాంగం యొక్క ఆశయం, లక్ష్యం చాలా ఉన్నతమైందనే ఉద్దేశ్యంతో నెహ్రూ ఇలా వ్యాఖ్యానించాడు. రాజ్యాంగంలోని వైరుధ్యాలను, వాటిని పరిష్కరించకపోతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని అంబేద్మర్‌ చాలా స్పష్టంగా ప్రకటించాడు.

‘‘జనవరి, 26, 1950న మనం వైరుధ్యాల్లోకి ప్రవేశిస్తున్నాం. రాజకీయ రంగంలో సమానత్వం ఉన్నప్పటికీ సామాజిక, ఆర్థిక రంగంలో అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. ఒక విలువగా గుర్తించ బడిరది. ప్రస్తుత ఆర్థిక నిర్మాణం కారణంగా సామాజిక, ఆర్థిక రంగంలో ఈ విలువ గుర్తించబడలేదు. ఈ వైరుధ్యాన్ని మనం ఎంత కాలం కొనసాగించగలం? సామాజిక, ఆర్థిక జీవితంలో సమానత్వం లేకుండా ఎంతకాలం ఉండగలం? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజకీయ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది. ఎంత తొందరగా ఈ వైరుధ్యాన్ని రూపుమాపగలిగితే అంత మంచిది. అలా కాకపోతే అసమానత్వంతో

బాధపడుతున్న వారు ఏ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ సభ రూపొందించిందో దాన్ని బద్దలు కొడతారు

‘‘

ఉద్యమం అక్టోబర్‌ – డిసెంబర్‌ 2004

Leave a Reply