మనమింకా బతికే వున్నామా?
ఇదేదో భేతాళుని
భుజాన వేలాడే రాజు ప్రశ్న కాదు
వాదనలు ముగిసిన వేళ
వాడొక్క మాటతో ఫుల్ స్టాప్
పెట్టేసే వేళ
అటూ ఇటూగా సరిపెట్టుకుంటే
నువ్వూ నేనూ కోల్పోయేదేమీ లేదు
వాడి తుపాకీ మొన ముందు
వారి మానం ఛిద్రమైన వేళ
కోర్టుల ముందు
నగ్నంగా నిలబడిన
తల్లులను వంచించిన
నీ న్యాయం
నీకు నైతిక విజయమా?
కోల్పోయిన మానానికి
కళ్ళు లేని న్యాయం
ధర కడుతుందా?
తాను రుజువు చేయలేని
ఆ పదముగ్గురినీ
వాకపల్లిలో నిలబెడితే
న్యాయమేదో బిగ్గరగా
వినబడేది కదా?
పదారేళ్ళ నీ విచారణకు
తమ కొంగు చివర
కట్టుకున్న దమిడీ బిళ్ళ
ఫీజు చెల్లుబడేయ్యేది కదా
నల్ల గౌను పోలీసూ?
తిప్పి తిప్పి
నువ్ వాళ్ళు చదవమన్న
తీర్పు చదివి
కళ్ళు తుడుచుకుంటే
పోయిన మా నెత్తుటి ముద్దుబిడ్డ
డానియెల్ ప్రశ్న నీకెరుకవుతుందా?
భూమిని మాటాడనివ్వు
సత్యమేదో సూరీడు
ప్రకటిస్తాడు!!
Related
సూరీడు సత్యం ప్రకటించేనా?!
తప్పకుండా