‘జబ్బు పడిన కాదు జబ్బ చరిచిన ఏడుగురు అక్క చెల్లెళ్ళను చూడడానికి వెళ్లి వచ్చాను’ అని రాసాడు శివసాగర్ విరసం ఏర్పడిన పదేళ్ల సందర్భంగా వేసిన కవితా సంకలనానికి ‘పది వసంతాలు’ పేరుతో 1980 అక్టోబర్‌లో. ఆ ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఎవరో కాదు ఈశాన్య రాష్ట్రాలు. సిపిఐ (ఎంఎల్) (పీపుల్స్ వార్) ఏర్పడినాక తన ప్రజా యుద్ధ వ్యూహంలో దండకారణ్య పర్స్పెక్టివ్తో నక్సల్బరీ నాటి నుంచే తనకున్న ఈశాన్య రాష్ట్రాల, కశ్మీరు స్వయం నిర్ణయ హక్కును విడిపోయే హక్కుగా కూడా గుర్తిస్తున్న పార్టీగా ఏం చేయవలసి ఉంటుందో, ఏం చేయగలదో మళ్లీ తాజాగా ఒక అవగాహనకు వచ్చి ఉంటుంది. ఈ ఈశాన్య రాష్ట్రాలలో ముఖ్యంగా నాగాల్యాండ్‌కు, మణిపూర్‌కు సుదీర్ఘమైన జాతి విముక్తి కోసం సాయుధ పోరాటం చేసిన చరిత్ర ఉన్నది. నాగాల్యాండ్కైతే ఫిజో బతికున్నంత కాలం నాగాల్యాండ్లోనూ, బ్రిటన్‌లోనూ ప్రవాసం నుంచి ఈ పోరాట నాయకునిగా బ్రిటిషిండియా ప్రభుత్వం, నెహ్రూ ప్రభుత్వం కూడా అతని నాయకత్వాన్ని గుర్తించింది.
ఇప్పటికీ మువయ్యా నాయకత్వంలో ఉన్న నాగాల్యాండ్ సోషలిస్టు రిపబ్లిక్‌ను వాజపేయి ప్రభుత్వం కూడా గుర్తించి రెండు ప్రభుత్వాల ప్రధానులుగా వాజపేయి, మువయ్యాలు మూడో దేశంలో చర్చలు కూడ జరిపారు. ఆ చర్చల కాలంలోనూ, అప్పటినుంచి ఇప్పటికీ రెండు ప్రభుత్వాలు చర్చలు జరుపుతూ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి. ఇటీవల కాలంలో తమిళనాడుకు గవర్నర్‌గా నియమింపబడిన రవి భారత ప్రభుత్వం తరఫున ఇంటర్లాక్యుటరీ (మధ్యవర్తి)గా వ్యవహరించాడు. స్వయంప్రతిపత్తి, అందుకోసం నేషనల్ కౌన్సిల్ వంటివి ఆమోదం పొంది కేవలం స్వతంత్రమైన జెండా, ప్రత్యేక రాజ్యాంగం (2019 ఆగస్టు 5 వరకు జమ్ము, కశ్మీర్ విషయంలో ఉన్నట్లు) వంటి విషయం దగ్గర ఒప్పందం కుదరక అది అట్లా ఆగిపోయింది. కానీ కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నది. వాజపేయి జీవించి ఉన్నా, మోడీ అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం వాజపేయి విధానాలను అమలు చేసినా తమ డిమాండ్లు నెరవేరి ఉండేవని మువయ్యా నాయకత్వంలోని స్వయంప్రకటిత ప్రభుత్వం నమ్ముతున్నది.
వాజపేయి విషయంలో మీడియా, ఉదార ప్రజాస్వామ్యవాదులకున్న భ్రమ అక్కడితో ఆగిపోయిందేమీ కాదు, జమ్ము కశ్మీర్లో హురియత్‌కు ఈశాన్య రాష్ట్రాలలో ప్రభుత్వంతో చర్చలు జరిపిన జాతి విముక్తి లేదా స్వయం నిర్ణయాధికారం కోరే, సాయుధ పోరాటాన్ని ఎంచుకున్న చాలా గ్రూపులకు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా 2008 నుంచీ ఉన్నది.
ఇప్పటికీ మీడియా నాగాలాండ్ ‘జాతి విముక్తి’ నాయకునిగా ప్రస్తావించే మువయ్యా, మణిపూర్‌లో మైతీ, కుకీల తర్వాత ఎక్కువ జనాభా కలిగిన నాగా తెగ నుంచి వచ్చిన వాడేనని గుర్తు పెట్టుకుంటే ప్రస్తుతానికి చాలు.
ఈ మధ్యకాలంలో చాలా నీళ్ళు నెత్తురు ప్రవహించి ఈశాన్య రాష్ట్రాలలో అన్నింటా బిజెపితో పొత్తు పెట్టుకున్న ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు గానీ, సాయుధ పోరాటం విరమించి వచ్చిన పార్టీలు గాని, లేదా ఇప్పుడు 2019 నుంచి మణిపూర్‌లో వలె బిజెపియే ఏకైక పార్టీ గాని అధికారంలోకి వచ్చాయి. ఇది ఎట్లా సాధ్యమైందనడానికి చాలా సుదీర్ఘ చరిత్ర ఉన్నది
శ్యాంప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ స్థాపించి కశ్మీరుకి వెళ్లి అరెస్టయిన నాటి నుంచి ఆ మాటకొస్తే ఆర్ఎస్ఎస్ ఏర్పడిన నాటి నుంచి అది ఏ పేరయినా, భారతీయ జనసంఘ్ కావచ్చు, జనతా పార్టీ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు అందులో ఉన్న సంఘ్‌పరివార్ శక్తులకు కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాల విషయంలో ఒక పాలసీ ఉన్నది. ఆ మాటకొస్తే విభజించి పాలించు రాజనీతిని ఈ దేశంలో అనుసరించిన బ్రిటిష్ సామ్రాజ్య వలస విధానానికున్న పాలసీ, ఇక్కడ ఉన్న బ్రాహ్మణీయ హిందుత్వ పాలసీకి భిన్నమైంది కాదు. అట్లాగే యావత్తు స్వాతంత్ర పోరాటాన్ని జాతీయోద్యమంగా బ్రిటిష్ వలస పాలనను వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి కూడా కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాల విషయంలో భిన్నమైన అభిప్రాయం లేదు.
నక్సల్బరీ పంథాలో చారు మజుందార్ నాయకత్వంలో జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని ఇండియన్ యూనియన్ నుంచి విడిపోయే హక్కుగా గుర్తించేదాకా 1948 నాటికే నెహ్రూ పటేల్ ప్రభుత్వాన్ని బలపరిచే అవగాహనకు వచ్చిన అవిభక్త కమ్యూనిస్టు పార్టీ కూడా నిర్ద్వంద్వంగా ఆ అవగాహనతో ఉన్నదని చెప్పలేం.
ఇవ్వాళ మణిపూర్‌లో అమలవుతున్న జెనసెడ్ (మారణకాండ)లో అంతర్యుద్ధ లక్షణాల్లో బయటపడుతున్న వాస్తవాలయినా, అంతకన్నా ఎన్నో రెట్లుగా ప్రచారమవుతున్న అబద్ధాలు కూడా అర్థం చేసుకోవడానికి ఈ మాత్రం చారిత్రక నేపథ్యం తెలిసి ఉండడం అవసరం.
మణిపూర్‌లో మైతీ తెగ ఫ్యూడల్ రాచరిక పాలనలోనూ ఉన్నది ఒక తెగగా ఉంటూ, బహుశా బెంగాల్‌లోని భక్తి ఉద్యమం ప్రభావంతో వైష్ణవ మతాన్ని స్వీకరించిన దశలోనూ ఉన్నది. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలోనూ ఉన్నది. ఈ కాలంలో, జాతి విముక్తి సాయుధ పోరాట కాలంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ నిర్మాణంలో ఉన్నది. సిపిఐ (ఎంఎల్) ఏర్పాటు కాలం నుంచి మావోయిస్టు పార్టీ ఏర్పడేదాకా ఆ పార్టీలో భాగమైన జాతి విముక్తి సాయుధ పోరాటంలో భాగమయ్యే విప్లవ పార్టీ, విప్లవ సైన్యం, విప్లవ ప్రజాసంఘాల నిర్మాణంలోనూ ఉన్నది. ముఖ్యంగా సాయుధ జాతి విముక్తి పోరాటాలను ఉక్కుపాదంతో అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వ సైన్యానికి ప్రత్యేక అధికారాలిచ్చిన చట్టాన్ని కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలలో అమలు చేసినపుడు మణిపూర్‌లో వచ్చినంత తీవ్ర ప్రతిఘటన మరే ఈశాన్య రాష్ట్రంలోనూ రాలేదు. ఈశాన్య రాష్ట్రాల చరిత్రను విప్లవోద్యమం అర్థం చేసుకున్న, ప్రత్యేక దృష్టితో చూసిన వాళ్ళకు కనీసం ఇందులో మైలురాళ్ళవంటి కొన్ని సందర్భాలైనా గుర్తు ఉండే ఉంటాయి. ఈశాన్య రాష్ట్రాలలోనూ ఊరుకు ఊరుకు మధ్యన సైనిక చెక్‌పోస్ట్ కూడా ఏర్పాటు చేసి, సైన్యం ఇచ్చిన గుర్తింపు కార్డు లేకుండా వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళు తిరగడమే ఒక నిషేధంగా అమలు చేసిన రోజుల్లో ఇప్పుడు మణిపూర్ జెనొసైడ్ దాకా, ముఖ్యంగా ప్రధాని మోడీ నోరు విప్పేదాకా ప్రధానస్రవంతి పత్రికలకు మణిపూర్ గానీ, ఇతర ఈశాన్య రాష్ట్రాలు గాని వార్తయే కాని ఊళ్ళో సైన్యం ఎన్కౌంటర్ పేరిట ఇద్దరు మణిపూర్ యువకులను చంపిన కేసులో (ఆ రోజుల్లో అంటే ఎమర్జెన్సీ ఎత్తివేసిన రోజుల్లో) ఇటువంటి సంఘటనలను గానీ, ఈశాన్య రాష్ట్రాలను గానీ బయట సమాజానికి పరిచయం చేసిన సంస్థలు, తర్వాత కాలంలో పియుడిఆర్గా ఏర్పడిన పియుసిఎల్ అండ్ పియుడిఆర్ అని జయప్రకాష్ నారాయణ్ ఏర్పాటు చేసిన సంస్థ. వ్యక్తులుగా నందితా హక్సర్, తపన్ బోసు, సివి సుబ్బారావు వంటి వాళ్లు. (ఈ సంస్థ సభ్యులుగా గానీ, విడిగా గానీ) సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ చిన్నపురెడ్డి దీనిని హత్య కేసుగా నమోదు చేయాలని తీర్పు ఇచ్చిన వెంటనే ఆ యువకుల కుటుంబాలకు చెరి ఒక లక్ష రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని రాసినపుడు తెలుగు సమాజం ఆసక్తి చూపింది.
ఇంక ఈ సైనిక శిబిరాల్లో మనోరమ అనే యువతిపై సైన్యం సామూహిక అత్యాచారం జరిపి చంపివేసినపుడు మణిపూర్ రాజధాని ఇంఫాల్ సైనిక శిబిరం ముందు యువతులు సామూహికంగా చేసిన నగ్న ప్రదర్శన దేశాన్ని ఒక కుదుపు కుదిపింది. ఇప్పటి వలె ప్రచార సాధనాలు లేని ఆ కాలంలో కూడ మే 4న ముగ్గురు కుకి తెగ యువతులపై మైతీ తెగకు చెందిన మూకలు పోలీసుల సహకారంతో చేసిన లైంగిక అత్యాచారం కుదిపేసినంతగా కుదిపింది. ఆ సంఘటనతో చలించిన మహాశ్వేతాదేవి వ్రాసిన ‘ద్రౌపది’ అనే కథ విశ్వవిఖ్యాతమై, మళ్ళీ నాటికగా రూపాంతరం చెంది సిఎఎ, సిఆర్సికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 2019లో జరిగిన షహీన్‌బాగ్ ప్రజాస్వామిక పోరాటంలో కురుక్షేత్ర యూనివర్సిటీ (హర్యానా) వంటి చోట్ల ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తే అధికారులు ఆంక్షలు విధించారు. చివరకు ఢిల్లీ యునివర్సిటీ ఇంగ్లీషు పాఠ్యగ్రంథాల నుంచి ఆ పాఠాన్ని తొలగించారు. 370 ఆర్టికల్ రద్దయినాక కశ్మీర్లో ఇప్పుడు ఆగా షహీద్ అలీ సాహిత్యాన్ని, బషార్ అహ్మద్ ‘కర్ఫ్యూ నైట్స్’ సాహిత్యాన్ని కశ్మీరు, జమ్ము క్లస్టర్ యునివర్సిటీలలో నిషేధించినట్లే.
ఇంక 16 సంవత్సరాల పాటు ప్రత్యేక అధికారాలు పొందిన సైన్యాన్ని వెనక్కి పిలిచి, చట్టాన్ని రద్దు చేయాలని ఇరోమ్ షర్మిలా చేసిన నిరాహార దీక్షను ఎన్నికల రాజకీయాలు ఎట్లా నీరుగార్చగలవో కూడా మన ముందు దృష్టాంతం ఉన్నది. ఆమె పదహారేళ్ళ తర్వాత నిరాహార దీక్ష విరమించి, అదే డిమాండ్‌పై ఎన్నికల్లో నిలబడినప్పుడు ఆమెకు 71 ఓట్లు వచ్చి డిపాజిట్ కూడ గల్లంతయింది.
ఎమర్జెన్సీ ప్రారంభకాలంలోనే సిక్కింను ఇందిరా గాంధీ ఇండియన్ యూనియన్‌లో అక్కడి రాజు, ప్రజల అభిష్ఠానికి భిన్నంగా కలిపేసుకున్నప్పుడు అది దురాక్రమణ అని ఒక్క ఎన్నికల పార్టీ కూడా మాట్లాడలేదు. ఎమర్జెన్సీ ఎత్తివేసేదాకా కాంగ్రెస్‌పార్టీలో యంగ్ టర్క్‌లుగా పేర్కొనబడిన చంద్రశేఖర్, కృష్ణకాంత్‌లు పియుసిఎల్ అండ్ పియుడిఆర్లో ఉన్నారు. కానీ ఎమర్జెన్సీ తర్వాత జరిగిన అఖిల భారత సదస్సులో పౌరహక్కుల గురించి తప్ప ప్రజాస్వామిక హక్కుల గురించి జనతా ప్రభుత్వ పాలనలో అడుగనక్కర్లేదన్న చంద్రశేఖర్ ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీరు విషయంలో పౌర హక్కుల గురించి కూడా మాట్లాడవద్దన్నాడు. అది వ్యతిరేకించి పియుడిఆర్, ఢిల్లీ ఏర్పాటుచేసిన సురేష్ వైద్, సుమంతా బెనర్జీ, సీవి సుబ్బారావు వంటి వాళ్లు మాత్రమే ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీరు స్వయం నిర్ణయ హక్కు గురించి మాట్లాడారు. ఇప్పుడు ఎన్నికల కమ్యూనిస్టు పార్టీలన్నిటికీ కశ్మీరు, ఈశాన్య రాష్ట్రాలు ఇండియన్ యూనియన్‌లో భాగమే. ఆ అర్థంలో అఖండ భారత్‌లో భాగమే. కాకపోతే ఫెడరల్ భావన ఆచరణతో చూస్తారు. కశ్మీరు, మణిపూర్, అస్సాం వంటి సంస్థానాలున్న రాజ్యాల్లో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి 1951 వరకు కూడా వర్గ పోరాట దృక్పథంతో పనిచేసింది. నక్సల్బరీ తర్వాత సిపిఐ (ఎంఎల్) ఏర్పడినప్పటి నుంచి సిపిఐ (ఎంఎల్) (సిఓసి) ఏర్పడేదాకా కశ్మీర్ నుంచి ష్రాఫ్ అనే కమ్యూనిస్టు నాయకుడు సాయుధ విప్లవాన్ని బలపరిచాడు. ఇటీవల మరణించిన కె.డి. సేథీ కూడా ఎంఎల్ పార్టీలో ఉన్నాడు. జాతి విముక్తి పోరాటం సాయుధంగా కొనసాగిస్తున్న సోషలిస్టు, కమ్యూనిస్టు నిర్మాణాలు ఉన్నచోట్ల కశ్మీరులో గానీ, ఈశాన్య రాష్ట్రాల్లో గానీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా ఏర్పడిన విప్లవ పార్టీలు (అది పీపుల్స్ వార్ గానీ, పార్టీ యూనిటీ గానీ, ఎంసిసి గానీ) అన్నీ ఇండియాలో పని చేస్తున్న పార్టీలుగానే ప్రకటించుకున్నాయి. గనుక కశ్మీర్లోగానీ, ఈశాన్యరాష్ట్రాలలోగానీ ఆ పేరుతో వ్యవహరించకూడదనే అవగాహనతోనే అక్కడ ఆర్గనైజర్లనయినా, కమిస్సార్లనైనా అటువంటి నిర్మాణాలు చేసింది. కేంద్రప్రభుత్వం కూడ వ్యూహంలో భాగంగానే చాలాకాలం అటువంటి ఆర్గనైజర్లను దేశంలో విప్లవోద్యమం ఉన్నచోట్ల అరెస్టు చేసినట్లుగానే చూపింది.
ఒకప్పుడు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన మైతీలు ఇప్పుడింత బ్రాహ్మణీయ హిందుత్వ పార్టీ బిజెపి సేనలుగా మారారు అని గందరగోళం పడుతున్న వాళ్ళు చరిత్రలో ఈ ప్రాసెస్‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుబడిదారీ విధానం దాని అత్యున్నత దశకు చేరుకున్న తరువాత సామ్రాజ్యవాదంగా, ముఖ్యంగా వలసలు, నయా వలసలపై రాజకీయ, రాజకీయార్థిక, సైనిక ఆధిపత్యాలు కూడా చలాయించినప్పుడు అమెరికా, యూరప్ ఆస్ట్రేలియాలతో సహా తన వలస దేశాల్లో జాతి (రేస్), తెగ (క్లాన్), కుల (క్యాస్ట్) కుదుర్లను ముట్టుకోలేదు. అంటే జోక్యం చేసుకొని భంగపరచలేదు. అమెరికాలోనైతే జాతి (రేస్) వివక్ష ఇవాళ ఎంత దూరం వెళ్లిందంటే నల్లజాతి వాళ్ళనే కాదు తెల్ల జాతి వాళ్లు కానివాళ్లను కూడ నిర్విచక్షగా చంపుతున్నారు. ఆ వైఖరి, వివక్ష ఇచ్చిన బలంతో అమెరికాసంయుక్తరాష్ట్రాల్లో అధిక సంఖ్యలో ఉన్న ఇండియన్ అగ్రవర్ణాలు హిందూ సంఘాలను నెలకొల్పుతూ, ప్రత్యేక కాలనీలుగా కూడా ఏర్పడుతూ స్థానికులు కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయా రాష్ట్రాల్లో చట్టాలు చేసే స్థితికి తీసుకుపోయారు.
తాజాగా భారతదేశ చరిత్రను మార్క్సిస్టు దృక్పథంతో కానీ, ప్రజాస్వామిక దృష్టితో కానీ రాసిన చరిత్రకారులను హిందూ వ్యతిరేక అంటే భారత వ్యతిరేక చరిత్రకారులుగా చిత్రించేవారు ఒక మేధోవర్గంగా ఏర్పడ్డారు.
బ్రిటిష్ ఇండియా ఏర్పడడానికి దారితీసిన ప్రథమ భారత స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ఇక్కడి రైతాంగం బిడ్డలను బ్రిటిష్ సామ్రాజ్యం హిందూ ముస్లిం మతస్తులుగానే చూసి ఆ చీలికకు, విద్వేషాలకు రాజ్యస్థాయిలో బీజం వేసింది. అటువంటి విభజించి పాలించు దృష్టితోనే రాజవంశం కూడా అయిన మైతీలను షెడ్యూల్డ్ ట్రైబ్‌గా గుర్తించింది. ఇప్పటికీ వలసీకరణ భావజాలానికి లోనైన ఆదివాసి సంఘాలు తాము చంద్రవంశ రాజులుగా పాలించాము కనుక క్షత్రియులమని ప్రకటించుకుంటున్న ఉదాహరణలు కూడా మనకున్నాయి.
ఆర్ఎస్ఎస్ కశ్మీరులో శ్యాంప్రకాష్ ముఖర్జీ ద్వారా బ్రాహ్మణీయ హిందూత్వను ప్రవేశపెట్టినట్లుగానే ఈశాన్య రాష్ట్రాలకు కూడా అక్కడి తెగలన్నీ హిందువులే అని ప్రచారం చేయడానికి కార్యకర్తలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ థింక్ ట్యాంక్‌గా గుర్తింపు పొందిన రాంమాధవ్ బహిరంగంగానే ఈ ప్రచారానికి బాధ్యత వహించాడు. బ్యురాక్రసీ నుంచి నాగాల్యాండ్తో సంభాషణలు కేంద్రంగా చేసి ఈ కర్తవ్యం నిర్వహించాడు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్‌గా రవి నాగాల్యాండ్తో ఈ కర్తవ్యం నిర్వహించాడు. ఆయన రాజకీయ వ్యవహార సరళిని గమనిస్తే ఆయన ఎంత విద్వేష రాజకీయాలను ప్రచారం చేయగలడో ఊహించవచ్చు. ఆర్ఎస్ఎస్ దృష్టిలో దేశమంటే జాతి, జాతి అంటే మతం, మతం మరేదీ కాదు బ్రాహ్మణీయ హిందూ మతం – అంటే వర్ణాశ్రమాన్ని, మనుధర్మాన్ని గుర్తించే బ్రాహ్మణాధిక్య సమాజం. దాని దృష్టిలో ముస్లింలు, క్రైస్తవులు తప్ప జైన, బౌద్ధ, సిఖ్ఖులు కూడా హిందువులే అయినట్లు, అన్ని ఆదివాసీ తెగలు, మతం, కులం, దేవుడు లేని ఆదివాసీ సమాజం – హిందూ సమాజమే. అయితే వీళ్ళు అడవిలో ఉండే వాళ్లను (అడవి మనుషులను) వనవాసీలుగానే గుర్తిస్తారు. ఎందుకంటే ఈ ఆర్యావర్తంలో వీళ్ల పురాణ చరిత్ర ప్రకారం నివసించినవారు బ్రాహ్మణులు. బ్రాహ్మణీయ భావజాలంతో పాలన సాగించే క్షత్రియులు మినహా అందరూ శూద్రులే కానీ హిందువులు.
ఈ ప్రచారం ఇంకెక్కడి కన్నా ఎక్కువగా చేయవలసిన అవసరం ఆర్ఎస్ఎస్ ఏర్పడినప్పటినుంచి ఈశాన్య రాష్ట్రాలలోనే వచ్చింది. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలలో బ్రిటిషిండియా కాలం నుంచి కూడ ఈ ఆదివాసి తెగల మధ్యన చర్చి కేంద్రంగా క్రైస్తవమతం సంక్షేమ కార్యక్రమాలతో విస్తృతమైన ప్రచారం చేసింది. ఆదివాసుల చదువు, ఆరోగ్యం మీద కేంద్రీకరించి నాగాల్యాండ్ రాష్ట్రంలో మాతృభాష ఇంగ్లిషు అని చెప్పుకునేంతగా అన్ని తెగలను ఐక్యం చేసింది. మణిపూర్‌లో అందరికన్నా ఎక్కువ జనాభా ఉన్న కుకీలు మాత్రమే కాదు ఇతర తెగల్లో కూడా మెయితీలతో సహా క్రైస్తవులున్నారు. అందుకే ప్రభుత్వ, పోలీసు, మైతీ పాలకవర్గ లక్ష్యం కుకి జాతి ప్రజలెంత అయ్యారో, చర్చిలు కూడా అంత అయ్యాయి. ఇది ఇవాళ ఈశాన్య రాష్ట్రాలలో కనిపించవచ్చు. కానీ ఆదివాసేతర రాష్ట్రాలలో, కర్ణాటకలో చర్చిల విధ్వంసం చూసాం. బీజేపీ సంఘ్ పరివార్ ప్రాబల్యం ఎక్కువుంటే అక్కడ చర్చిల విధ్వంసం సాగింది. ఇప్పుడు మణిపూర్‌లో ఎస్టి గుర్తింపు కోరుకున్న మైతీ తెగ ఇందుకు పూనుకుంటే, ఒడిశాలోని కందమాల్‌లో ఎస్సి ప్రజల మీద చర్చిల మీద, ఇటువంటి దాడి, ఫాదర్ స్టెయిన్‌తోపాటు ఆయన కుటుంబాన్నంతా సజీవ దహనం చేసింది సంఘ్ పరివార్. అక్కడ ప్రజల్లో ఒక బలమైన శక్తిగా పనిచేస్తున్న అప్పటి పీపుల్స్ వార్, లక్ష్మణ్ అనే సంఘ్ పరివార్ ప్రచారక్‌ను చంపితే అందుకు ప్రతీకారంగా దళిత క్రైస్తవుల మీద దాడి చేసారు. వందలాదిగా దళిత క్రైస్తవుల ఇళ్ళు దహనం చేసారు. తమ పశువులు, పంటలు కాపాడుకోవడానికి వాళ్ళు నిరాశ్రయులై అడవుల్లోకి పోయారు.
ఎక్కువ గత చరిత్రలోకి వెళ్ళనక్కరలేకుండానే ఇటువంటి దాడుల వెనక ప్రత్యేకించి సామ్రాజ్యవాద ప్రపంచీకరణ కాలం నుంచి, బాబ్రీ మసీదు విధ్వంస కాలం నుంచి రాజకీయార్థిక కారణాలు కూడా బ్రాహ్మణీయ భావజాలానికి దోహదం చేశాయి. గుజరాత్ మారణకాండ సందర్భంగా నరేన్ పాటియా ముస్లిం కార్మిక బస్తీలో ప్రతి ముస్లిం గృహం, అద్దెకున్న వాటితో సహా తగులబెట్టి 97 మందిని చంపించిన మారణకాండకు స్వయంగా ఒక మంత్రి నాయకత్వం వహించి, రుజువై శిక్షపడి, జైలుకు వెళ్ళి క్యాన్సర్ నెపంతో బయటికి వచ్చి గుజరాత్ హోం మంత్రి అయింది. అప్పటి మూడు రోజుల ముఖ్యమంత్రి మౌనం ఇప్పుడు ప్రధాని 79 రోజుల మౌనంతో తెస్తున్న పోలిక తెలిసిందే.
అయితే ఒరిస్సాలోనైనా, గుజరాత్‌లోనైనా ఈ సంఘ్ పరివార్ సాకులు వెతుక్కున్నారు కానీ ఇలాంటి సాకులు ఏమీ అవసరం లేకుండానే 2000 సంవత్సరంలో ఏర్పడిన జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్‌లలో ఏ చర్యకూ ప్రతి చర్య చూపాల్సిన అవసరంలేని వర్గపోరాటాన్ని ఎంచుకున్న విప్లవకారులు ఆదివాసీల మధ్యన పనిచేయడమే కారణమైనది. బీహార్, జార్ఖండ్‌లలో భూమిహార్ సేనతో ప్రారంభించి ఆదివాసీ సమాజాన్ని చీల్చి, లొంగిపోయిన నక్సలైట్లను చేరదీసి ఆదివాసీల నుంచే సేత్నా, తృతీయ ప్రస్తుతి వంటి సంస్థలు స్థాపించి ప్రతిఘాతుక దాడులను వ్యవస్థీకరించారు.
అంతకన్నా సుప్రీంకోర్టు దృష్టికి కూడ వెళ్లి రద్దయిన సల్వాజుడుంనయితే అధికారంలో ఉన్న రమణ్ సింగ్ బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు మహేంద్ర కర్మ రచించిన పథకంగానే అమలు చేసాడు. ఇంక సల్వాజుడుంను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పేదాకా దండకారణ్యంలో అది ఒక అంతర్యుద్ధమే. అది ఒక దశాబ్దం పాటు సాగిన మారణకాండ. సుప్రీంకోర్టు తీర్పులో పోలీసుల్లోకైనా ఆదివాసీలను కనీస విద్యార్హత, ఆయుధ శిక్షణ లేకుండా చేర్చుకోవద్దు అని చేసిన సూచన ఆధారంగా నాలుగో తరగతి చదివినట్లు సర్టిఫికెట్లు ఇచ్చి, సల్వాజుడుం నుండి మొదలు పోలీసు యాక్సిలరీ ఫోర్స్‌లోకి, తర్వాత ఇపుడయితే డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫోర్స్‌లోకి లొంగిపోయిన మావోయిస్టులను, గతంలో సల్వాజుడుంలో పనిచేసినవారిని చేర్చుకొని మావోయిస్టుల ఆనుపానుల కోసం గాలింపులో వాడుకుంటున్నారు. ఇప్పుడీ అక్రమం ఎంత వ్యవస్థీకృతమైందంటే ఆకాశం నుంచి మావోయిస్టు స్థావరాలు లక్ష్యంగా దాడి చేయడానికి ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడుల్లో ఈ డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఫోర్స్ పోలీసులను కూడా వెంట తీసుకపోతున్నారు. కనుక మధ్య భారతంలో, ఇప్పటికీ మెజారిటీ తెగ మూకలను ఒదిశా, జార్ఖండ్‌లలో ఆదివాసి ప్రాంతాల్లో మాత్రమే కాదు, ట్రై జంక్షన్‌గా పిలుచుకొనే తమిళనాడు, కేరళ, కర్ణాటక సర్వమంగళం అడవుల్లోనే కాదు, ఆదివాసి రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో కూడ ఈ అంతర్యుద్ధ స్థాయి దాడులన్నీ, అవి సైన్యానికి ప్రత్యేక అధికారాలు ఇచ్చేవైనా, అర్ధ సైనిక బలగాలని పంపేవయినా, సల్వాజుడుం వంటి సైన్యాన్ని, ఇప్పటికీ ఒకే మూకలను తయారు చేయడంలోనైనా బ్రాహ్మణీయ, హిందూత్వ శక్తులు, బిజెపి ప్రభుత్వాలు, ఆర్ఎస్ఎస్ బహుళ జాతి కంపెనీల కోసం నిర్వహిస్తున్న దళారీ పాత్రయే. అందుకే ప్రధాని స్వయంగా మణిపూర్ మండుతున్న కాలమంతా కీలకమైన రక్షణ ఒప్పందాలు చేసుకోవడానికి అమెరికా, ఫ్రాన్స్‌లకు వెళ్ళాడు. జి-20 సమావేశాల్లో అన్ని సామ్రాజ్యవాద దేశాల అగ్రనాయకులను కలిసాడు. ఇండియాలో ముస్లింల పట్ల తాను చూపుతున్న విద్వేషపూరిత విచక్షణను ప్రపంచం దృష్టిలో కప్పిపుచ్చుకోవడానికి ఈజిప్ట్ మొదలు ఇస్లాం దేశాలు, యుఏఇ వంటివాటికి కూడా వెళ్లి వచ్చాడు. ఈ జి-20 విశ్వగురువు పాత్ర అంతా కేవలం విద్వేష రాజకీయాల ప్రచారం కోసమే కాదు, బహుళ జాతి కంపెనీలకు ఇండియాలోనే కాదు, అన్ని దేశాల్లో ప్రజల పైన, ముఖ్యంగా శ్రమజీవుల, ఆదివాసీల, మైనారిటీల, మహిళల మానవసారాన్ని, ప్రకృతి సంపదను దోచిపెట్టడానికే. ఇవ్వాళ మణిపూర్ మాత్రమే కాదు ఈశాన్య రాష్ట్రాలు దేశ సరిహద్దు రాష్ట్రాలై కూడా ఈ వ్యూహంలో తమకున్న ప్రకృతి సంపద వల్ల, చవకగా వచ్చే మానవ శ్రమ వల్ల ఎంత కీలకమైన పాత్ర నిర్వహిస్తాయో పాఠకుల ఊహకే వదులుతున్నాను.
మణిపూర్‌లో ఎంత విలువైన ఖనిజాలు ఉన్నాయో, రక్షణ వ్యూహంలో భాగంగా అక్కడ ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రక్షణ ప్రాజెక్టులు, మయన్మార్ మీదుగా అంతర్జాతీయ రైల్వే మార్గం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుళ జాతి కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు, ఇవన్నీ అదానీ ద్వారా కట్టబెట్టే పథకం రచింపబడింది అనే వార్తలు వస్తూనే ఉన్నాయి.
మన పొరుగు దేశాల్లో భారత ప్రభుత్వం అత్యంత స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం మయన్మార్. మయన్మార్ నుంచి, ప్రభుత్వం సైనిక జుంటా దాడుల నుంచి, హత్యాకాండ నుంచి తప్పించుకొని వస్తున్న రోహింగ్యాలను దేశంలోకి అనుమతించకుండా చొరబాటుదారులుగా, నేరస్తులుగా చూస్తూ రోహింగ్యాల కాందిశీకుల శిబిరాల భారమంతా బంగ్లాదేశ్ మీదికి తోసేసిన చతురత భారత ప్రభుత్వానిది. నాగాల్యాండ్, మిజోరాం, మణిపూర్లకు మయన్మార్‌తో సుదీర్ఘమైన సరిహద్దు ఉన్నది. మయన్మార్ నుంచి ఎక్కువగా మిజోరాంకు చెందిన ఆదివాసి తెగలు, కుకీ తెగలు కూడా ఈ రాష్ట్రాల్లోకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా ఈ మూడు రాష్ట్రాలకు వచ్చే కాందిశీకులను నిరోధించే విధానాలను అమలు చేస్తున్నా ఇప్పటికైతే మిజోరాం ప్రభుత్వం దానినంత కఠినంగా పాటించడం లేదు. అందుకని సరిహద్దులు దాటి వస్తున్న మిజోలు, నాగాలు, కుకీలు సాయుధులై వస్తున్నారని, కుకీల్లోని కొన్ని విద్రోహశక్తులైన సాయుధులు గంజాయి వ్యాపారం చేస్తున్నారని బిషన్ సింగ్ స్వయంగా వాళ్లను విద్రోహులు (ఇన్సర్జెంట్స్), నేరస్తులు (క్రిమినల్స్) అనే హోమ్ మంత్రి అమిత్ షా వచ్చిపోయినాక కూడ అన్నాడు. హోం మంత్రి అమిత్ షా నాలుగు రోజులుండి అన్ని తెగలతో మాట్లాడినట్లు ప్రభుత్వాన్ని రద్దు చేయడం మినహా పాలననంతా ముఖ్యంగా రక్షణ బాధ్యతంతా తీసుకునే చట్టం ద్వారా శాంతిభద్రతలు చక్కబడ్డాయని చేసిన బుకాయింపు 30 వేల సైన్యాన్ని మణిపూర్‌కు పంపించి కుకీల మీద దాడి చేయడానికి మైతీ పాలకవర్గాల ముఠాల చేతికి ప్రభుత్వ ఆయుధగారాన్ని ఒప్పచెప్పడమే. ప్రభుత్వ ఆయుధాగారం మీద దాడి చేసి వేల సంఖ్యలో మైతీలు కుకీల మీద దాడి చేసి హత్యలు చేసినట్లు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు సుప్రసిద్ధ న్యాయవాది దుశ్యంత్ దవే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసాడు.
ఎవరు జవాబుదారి (హూ ఈస్ అకౌంటబుల్) అని శీర్షికతో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన వ్యాసంలో సుప్రసిద్ధ రచయిత ప్రొఫెసర్ అవినాశ్ పాలివాల్ ప్రభుత్వ లెక్కలే ఉటంకిస్తూ మణిపూర్ పోలీసు ట్రైనింగ్ సెంటర్ నుంచి ఆరు లక్షల ముప్పయి రెండు వేల బుల్లెట్లు, నాలుగువేల అయిదువందల ముప్పై ఏడు ఆయుధాలు (అందులో తేలికపాటి, మీడియం మిషన్గన్లు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈ పోలీసు శిక్షణా కేంద్రం ఏడవ ఇండియా రిజర్వు బెటాలియన్ 8వ మణిపూర్ రైఫిల్స్‌కు సంబంధించిన శిక్షణా కేంద్రం.) ఇంతకన్నా ఎక్కువగా ఏకే 47 వంటి ఆయుధాలే పట్టుకొని వేలాదిగా మైతీ తెగ మూకలు కుకీల మీద దాడులు చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో వస్తున్నది.
యాభై, అరవై లక్షలు జనాభా మించని దేశం, పోనీ రాష్ట్రం. హైదరాబాదు నగర జనాభాలో సగం కూడ కాకపోవచ్చు. వాళ్లను అణచి ఉంచడానికి అక్కడ ఉన్న మణిపూర్ రైఫిల్స్, రెగ్యులర్ పోలీసు అమిత్ షా వచ్చిపోయాక వచ్చిన ముప్పై వేల సైన్యాన్ని పంపించి ఇద్దరూ కలిసి కుకీ స్త్రీ పురుషులపై కాల్పులు జరిపితే ఇప్పటిదాకా 170 మంది మరణించారు. మొన్నటి నుంచి ముగ్గురు మహిళల నగ్నదేహాల ప్రదర్శన తర్వాతనే ఎంతమంది మహిళలపై లైంగిక అత్యాచారాలు జరిగాయో ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి. ఈ అరాచక హత్యల కోసం, అత్యాచారాల కోసం ప్రభుత్వ ఆయుధాగారాలు, సైనిక ట్రైనింగ్ సెంటర్ల నుంచి ఎన్ని లక్షల బుల్లెట్లు, ఎన్ని వేల ఆయుధాలు మైతీ మూకల చేతులకు స్వయంగా పోలీసులు అందించారో పైన చూశారు.
ఆయుధాల ప్రస్తావన వచ్చింది కనుక మణిపూర్‌కు ఆయుధాలకు సంబంధించిన ఒక కట్టు కథ చెప్పాలి. అది విచిత్రంగా, కుట్రపూరితంగా, భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్ కేసులో భాగమైంది కనుకనే ఆసక్తికరం. ఈ కేసులో రెండవ విడత అరెస్టుల తర్వాత 28 ఆగస్టు 2018 రాత్రి రొమిల్లా థాపర్‌తోపాటు ఐదుగురు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసారు. ఆ రిట్‌ను వెంటనే స్వీకరించి ఆ సాయంకాలానికే అందరిని (అంటే ఈ ఐదుగురిని) హౌస్ అరెస్టులో ఉంచాలని ఉత్తర్వులు ఇచ్చి సుప్రీంకోర్టు హియరింగ్‌ను సెప్టెంబర్ 2 కు వాయిదా వేసింది.
సుప్రీంకోర్టు పిటిషన్‌ను వింటుండగానే అప్పుడు ముంబై మహానగర పోలీస్ కమిషనర్‌గా ఉన్న పరంవీర్ సింగ్ ఈ అర్బన్ మావోయిస్టులు భీమాకోరేగావ్ హింసా దౌర్జన్యాలకు మాత్రమే బాధ్యులు కాదు. వాళ్ళ కంప్యూటర్లలో తమకు ఒక లేఖ దొరికింది అని ఒక సంచలనాత్మక లేఖను చదివాడు. అది కిషన్ అనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రాసిన లేఖగా పేర్కొన్నాడు. రాజీవ్ గాంధీని హత్య చేసిన విధంగానే ప్రధాని మోదీని హత్య చేయాలని. కానీ అది ఆత్మహత్యా సదృశ్యమని భావించి కేంద్ర కమిటీ దృష్టికి తెచ్చినట్లుగా ఒక ఉత్తరం దొరికిందన్నాడు.
అంత తీవ్రమైన నేరపూరిత కుట్ర ఆరోపణ చేస్తూ అది విచారించే బాధ్యత పూనా పోలీసులు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చేతుల్లో పెడితే ఎట్లా అని చంద్రచూడ్ ప్రశ్నించినప్పుడు అప్పటికి ఇంకా అడిషనల్ సెషన్స్ జడ్జి సాలిసిటర్ జనరల్ గానే ఉన్న తుషార్ మెహతా మేము ఆరోపణకంత ప్రాధాన్యమివ్వడం లేదన్నాడు.
2019 ఫిబ్రవరిలో చార్జిషీట్ కోర్టులో దాఖలు చేసినప్పుడు మాత్రం, ప్రధానమంత్రి మోడీ మీద రాజీవ్ గాంధీపై తీసుకున్నటువంటి చర్య తీసుకోవడానికి నేపాల్ నుంచి, మణిపూర్ నుంచి కోట్ల రూపాయల విలువ చేసే ఆయుధాలు, కాట్రిడ్జెస్ కొనాల్సి ఉంటుందని, ఈ విషయంలో సంప్రదించడానికి, కొనుగోలు వ్యవహారాన్ని నిర్వహించడానికి ఆర్డిఎఫ్ నాయకత్వానికి మాత్రమే అథారిటీ ఉన్నదని, ప్రాసిక్యూషన్ నేరారోపణ చేసింది.
నాలుగున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. నేపాల్ మావోయిస్టు పార్టీ అధ్యక్షుడు, ఆ దేశ ప్రధానమంత్రి ప్రచండ ఇండియాకు వచ్చి దేశ ప్రధానిని కలిసి, పర్యటించిపోయాడు. ఇప్పుడు మణిపూర్‌లో ఎవరి ప్రభుత్వం ఆయుధాగారం నుంచి ఎవరి చేతుల్లోకి వేలకొద్దీ ఆయుధాలు, లక్షల కొద్ది కాట్రిడ్జెస్ పోయినాయో పైన చూసాం.
ఇంక ముగించే ముందు చెప్పుకోవలసింది ఇటువంటి యుద్ధంలో మహిళల, పిల్లల దేహాలే రణక్షేత్రాలు కావడం చరిత్రలో చూస్తున్నాం. మే 4న ఆ ఇద్దరు కుకీ యువతుల విషయంలో సామూహిక అత్యాచారం జరిగితే ఇంతవరకు ఎందుకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదని ముఖ్యమంత్రిని అడిగితే అప్పటినుంచి ఇప్పటివరకు మా దృష్టికి ఇటువంటి సంఘటనలు వందల కొద్దీ వచ్చినాయని అందుకే ఇంటర్నెట్ బంద్ చేశామని సమాధానం చెప్పాడు. ప్రధాని మోడీ 79 రోజుల తర్వాత మౌనం వీడి ఇది దేశం సిగ్గుపడే చర్య అని ఆగ్రహావేశాలతో మాట్లాడితే బాధిత మహిళలు, ప్రజలకు, బాధితులకు రక్షణ కల్పించలేకపోయిన ఆదివాసీ రాష్ట్రపతి, ‘మహిళా సమ్మాన్’ గురించి మాట్లాడే ప్రధాని సిగ్గుపడాలి, రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుపడాలి. కానీ నేరం మా మీద జరిగింది కదా. న్యాయం కోరడం సిగ్గెట్లా అవుతుంది’ అని అన్నాడు.
ఇటువంటి సంఘటనను, లైంగిక అత్యాచారాన్ని ‘నిర్భయ’ కేసుతో పోల్చడానికి లేదు. అది దేశంలో మధ్యతరగతి మహిళలను అభద్రతా భావానికి గురిచేసి లక్షల సంఖ్యలో దేశవ్యాప్తంగా కదిలించింది. దానికి లంపెన్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్న రాజ్యం, వ్యవస్థ, మీడియాలను తప్పు పట్టగలమే కానీ అందులో గుజరాత్ లో 2002లో ఉన్నట్లు మతరాజ్య ప్రమేయం లేదు. అందుకే వెంటనే గుర్తుకు వచ్చేది బిల్కిస్ బానో కుటుంబం పై జరిగిన ఆ సామూహిక లైంగిక అత్యాచారం. ఐదేళ్ల పసిపాపతో పాటు పన్నెండు మందిని చంపిన హంతకులకు సుప్రీంకోర్టు జోక్యం వల్ల శిక్ష పడిందనుకుంటే మళ్ళీ ఆ సుప్రీంకోర్టు ఆదేశాలపైననే రెమిషన్ దొరకడం బిల్కిస్ బాను పన్నెండు ఏళ్లుగా ఈ యుద్ధ రంగంలో న్యాయం కోసం పోరాడుతున్న చిత్రహింసల కొలిమిలో ఉక్కు సంకల్పంతో నిలబడిన యోధగా కనపడుతున్నది. అది స్పష్టంగా జస్టిస్ వర్మ చెప్పినటువంటి మత ఘర్షణల్లో జరిగిన అత్యాచారం, హత్యాచారం కిందికి వస్తుంది.
పన్నెండు మంది కుటుంబాన్ని అగ్రవర్ణ హిందూ శక్తులు చంపడం (2002లో)అనేది శ్రీకాకుళం పోరాటంలో తాబేలు నాయుడు కుటుంబం పన్నెండు మందిని ఎన్కౌంటర్ పేరుతో చంపడం కంటే దారుణం.
ఇంక దండకాకారణ్యంలో సోనీ సోరీ ఒక ధనిక రైతు కుటుంబం నుంచి వచ్చి టీచర్‌గా పని చేస్తున్న మహిళ. మావోయిస్టు పార్టీకి నిధులు సేకరిస్తున్నదనే ఆరోపణతో ఆమెను అరెస్టు చేసి లైంగికంగా సామూహిక అత్యాచారం చేసి యోనిలో రాళ్లు దూర్చిన ఉదంతం సుప్రీంకోర్టు దాకా వెళ్లి, మళ్లీ కోర్టు ఆదేశాలపై కలకత్తా మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చేసిన పరీక్షలో రుజువై, బెయిల్ పై విడుదలై ఇవాళ ఆమె నిత్యమూ ఆదివాసి ప్రజలపై, మహిళలపై జరిగే హత్యాకాండ, అత్యాచారాలు ప్రశ్నించే యోధగా నిలిచింది.
సామాన్య ఆదివాసీ మహిళలు మావోయిస్టులుగా ఆరోపించబడి లైంగిక అత్యాచారానికి గురయి చంపబడిన ఘటనలకు హిడ్మా ఉదాహరణ చెప్పవచ్చు. హిడ్మాను ఇంట్లో తన తల్లితో పాటు పడుకున్న చోటి నుంచి తీసుకెళ్లి అర్ధ సైనిక బలగాలు సామూహిక లైంగిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ తర్వాత ఆమెకు మావోయిస్టు దళ సభ్యురాలు యూనిఫాం వేసి, శవం పక్కన తుపాకి పెట్టి ఎన్కౌంటర్ అని ప్రకటించారు. ఖననం చేసిన ఆమె మృతదేహాన్ని తీసి పోస్ట్‌మార్టం చేయడానికి సోనీ సోరి బాధితుల కోసం నిలబడి, పోరాడి హైకోర్టు దాకా వెళ్ళి ఈ ఉదంతాన్ని ప్రపంచ దృష్టికి తెచ్చింది.
మౌలికంగానే ఇది మత వర్గ తత్వంతో, వర్గ ప్రయోజనంతో, భూస్వామ్య, సామ్రాజ్యవాద ప్రయోజనాలతో జరిగినప్పుడు వీటిని పీడిత ప్రజల పైన భూమి, ప్రకృతి సంపద, శ్రమ శక్తిని దోచుకునే దాడిలో భాగంగా చూసి బాధితులే యోధులుగా ఇటువంటి బాధితుల కోసం, ఇటువంటి అంతర్యుద్ధాల నుంచి ఒక ప్రజా సంస్కృతి రూపొందుతున్నదనడానికి దండాకారణ్య ఆదివాసీ పోరాట మహిళలు ఒక నిదర్శనంగా ఉన్నారు. మణిపూర్ బాధిత మహిళలు అటువంటి ఆదర్శాన్ని స్వీకరిస్తారని ఆశిద్దాం.