(‘ది కోరస్‘ లో కోబాడ్ గాంధీ పుస్తకం “ఫ్రాక్చర్డ్ ఫ్రీడం” పై విమర్శ రాసిన మనీష్ఆజాద్‌కు సమాధానాలు)
పెట్టుబడిదారీ విధానం ప్రజల జీవితాలను, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్ట్ ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగడం మంచిది. చర్చల ద్వారా మాత్రమే మనకు మరింత స్పష్టత వస్తుంది. కానీ దీనిని ప్రదర్శించే విధానం భారతీయ వామపక్షానికి విలక్షణమైనది, వీరిలో చాలామంది తమ స్వంత ఆచరణని (దాని ప్రాసంగికతను) విశ్లేషించుకోరు, కాని అసలు విషయం లేకుండా వ్యంగ్యంగా రాయడంలో ప్రవీణులు. మనీష్ ఆజాద్ ప్రశ్నలు మాత్రమే లేవనెత్తి, ఒక్క సమాధానం కూడా ఇవ్వలేదు, అతనికి సమాధానం చెప్పే ముందు, నేను మొదట అతన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను; తరువాత నేను అతని పద్దతి గురించి, అతను లేవనెత్తిన అంశాల గురించి రాస్తాను.
కొన్ని ప్రశ్నలు:
ప్రపంచవ్యాప్తంగా విప్లవాల/సోషలిజం వైఫల్యానికి కారణాలు ఏమిటని మనీష్ఆజాద్ అనుకుంటున్నారు?
భారతదేశంలో కమ్యూనిస్ట్ / విప్లవోద్యమాలలో స్తబ్దతకు కారణాలు ఏమిటి?
తన స్వంత గ్రూపు/పార్టీ పెరుగుదల, అభివృద్ధి గురించి అతని ఆలోచనలేమిటి (ఆ విషయం చెప్పనప్పటికీ అతను ఏదో ఒకపార్టీకి చెంది వుంటాడని నా భావన) విప్లవం అనివార్యమని భావిస్తున్నప్పుడు తన సంస్థ దాన్ని ఎప్పుడు సాధించగలదని అతను ఆశిస్తున్నాడు?
జిపిసిఆర్ (మహత్తర శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం) తలకిందులవడానికి కారణాలు ఏమిటి, అది కూడా మావో మరణించిన వెంటనే.
గత విప్లవాలను వివరించేటప్పుడు – పారిస్ కమ్యూన్, సోవియట్, జిపిసిఆర్ – అతను చైనా విప్లవం గురించి ప్రస్తావించలేదు; ఎందుకని?
పాలకవర్గాల మధ్య యుద్ధాల సమయంలో మాత్రమే సాయుధ విప్లవాలు విజయవంతమయ్యాయని నేను చెప్పిన విషయాన్ని అతను ఎగతాళి చేశాడు; శాంతి కాలంలో విజయవంతం అయిన విప్లవాలు ఏవో అతను చెప్పగలడా?
భక్తి ఉద్యమాన్ని నిరాకరిస్తూ, అంబేద్కర్, ఫూలే, పెరియార్‌లపై మౌనం వహించిన అతను, కుల / దళిత సమస్య పైన భారతదేశంలో మార్క్సిస్టుల వైఖరి ఏమిటో వివరించలేదు. దయచేసి వివరించండి.
విధానం (Methodology)
మనీష్ఆజాద్ అనుసరించిన విధానం, సరిగ్గా నా పుస్తకం ఫ్రాక్చర్డ్ ఫ్రీడం సెక్షన్ III లో, నేను చెప్పడానికి ప్రయత్నించిన వామపక్ష ఉద్యమాన్ని పీడిస్తున్న తరహాగా అనిపిస్తుంది. ఇది చాణక్య శైలిలో ఉంది: అనురాధను (ప్రత్యుత్తరం ఇవ్వలేని చనిపోయిన వ్యక్తి; అది కూడా అతనికి తెలియని వ్యక్తి) నాకు వ్యతిరేకంగా నిలబెట్టడం; అంశాలను తప్పుగా వ్యాఖ్యానించడం, తప్పుగా అర్థం చేసుకోవడం (నేను సమాధానాలలో వివరిస్తాను); దానిని ఖండించడానికి వేరే అభిప్రాయాన్ని ముద్రవేయడం (ఫ్రాంక్‌ఫర్ట్ స్కూల్, లియు షావో చి, మొదలైనవి); మార్క్సిస్ట్ గ్రంథాలను ఆచరణకు మార్గదర్శకంగా కాకుండా ఒక భగవద్గీతగా భావించడమనే వితండవాద సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఉద్యమంలో స్తబ్దత/వెనుకబడటానికి కారణాన్ని అంచనా వేయడానికి కూడా ప్రయత్నించ లేదు. చివరకు, స్వీయ ఆచరణను ఏ మాత్రం విమర్శనాత్మకంగా చూడకపోవడం; తద్వారా మార్క్సిస్ట్ ప్రామాణిక సిద్ధాంతాన్ని తాను తు చ తప్పకుండా అనుసరిస్తున్నాననే అభిప్రాయాన్ని కలిగిస్తాడు. నా సమాధానాలలో వ్యంగ్యాన్ని వాడను, ఎందుకంటే అంత నీచ స్థాయిలో వ్యాఖ్యానించాల్సిన అవసరం నాకు లేదు, అతను లేవనెత్తిన అంశాల గురించి మాత్రమే ప్రస్తావిస్తాను.
ముఖ్యాంశాలకు సమాధానం
బీహార్-ఒడిశా ఉద్యమం: దానిపై ఆయన నొక్కిచెప్పడం ద్వారా అతను ఆ ఉద్యమంలో క్షేత్ర కార్యకర్త అని, ఆ అనుభవం ఆధారంగా అనేక వ్యాఖ్యానాలు చేసాడని ఎవరికైనా అనిపిస్తుంది. ఉద్యమం ‘ముఠాలు’ గా మారిందని నేను అన్నానని తప్పుగా ఉదహరించాడు. జార్ఖండ్ జైలులో మావోయిస్టుల గురించి నేను చూసిన దాని మీద నా అభిప్రాయం చెప్పాను తప్ప, నాకు చాలా తక్కువగా తెలిసిన మొత్తం ఉద్యమం గురించి వ్యాఖ్యానించలేదు. వివిధ ప్రాంతాలలో ఉద్యమాలు ప్రజల నుండి దూరమవుతున్నాయి అని నేను అన్నది రాజ్య అణచివేత సందర్భంలో. నేను ప్రస్తావించినది ఒక ప్రామాణిక చక్రం, దీన్ని మనీష్ ఆజాద్ తన స్వీయ అనుభవంలో చూసివుండవచ్చు (ఎప్పుడైనా అణచివేతను ఎదుర్కొన్నట్లయితే). ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఉద్యమాల గురించి జైళ్ళలో నాకు చెప్పినవి, నా స్వంత అనుభవం గురించి కూడా ఇక్కడ వివరించాను. అంటే: విప్లవకర నాయకత్వంలో పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్మితమయ్యాయి; అప్పుడు తీవ్ర స్థాయిలో రాజ్య అణచివేత వస్తుంది, ప్రజా ఉద్యమం కూలిపోతుంది (ఒక సెక్షన్ చంపబడుతుంది/ఖైదు చేయబడుతుంది, ఒక చిన్న సెక్షన్ లొంగిపోతుంది); తరువాత విప్లవకారులు ప్రజల నుండి దూరమవుతారు, సులభమైన లక్ష్యాలుగా మారతారు లేదా సంచార తిరుగుబాటుదారులుగా మారాల్సి వస్తుంది. ఉద్యమం ఎదుర్కొంటున్న సమస్యగా నేను దీనిని చెప్పాను, కాని ఆ సమస్యను చూసి, ఈ సందిగ్దాన్ని ఎలా ఎదుర్కోవాలో సూచనలు ఇవ్వడానికి బదులుగా మనీష్ ఆజాద్ ప్రామాణిక గ్రంథాలకు అంటుకొనివున్న ‘పవిత్ర ఆవు’ (holy cow) లాగా ప్రవర్తిస్తాడు. మార్క్సిజాన్ని ఆచరణకు మార్గదర్శకంగా కాకుండా, పిడివాదానికి అంటిపెట్టుకునివుంటే, క్షేత్ర స్థాయిలో సమస్యను పరిష్కరించడంలో సహాయపడదు. బీహార్‌లోని అగ్ర-కుల సేనకు వ్యతిరేకంగా చేసిన పోరాటాలను ఎవరూ ఎక్కడా నిరాకరించలేదు, కానీ రెండు, మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలను తిరిగి చెప్పేబదులు (నాకు తెలియని) ప్రస్తుత పరిస్థితిని వివరిస్తే మరింత సందర్భోచితంగా ఉండేది.
ఆనందం-స్వేచ్ఛ-నూతన విలువల సమస్య: నేను ఎజెండాను, ‘సమానత్వం’ కోసం పోరాడటం నుంచి ‘ఆనందం కోసం పోరాటానికి’ మార్చాను అని మనీష్ ఆజాద్ మళ్ళీ తప్పుగా ఉదహరించారు. ఆనందం కోసం జరిగే పోరాటంలో, సమానత్వం కోసం జరిగే పోరాటం భాగంగా ఉండాలి అని నేను స్పష్టంగా చెప్పాను. ‘నూతన విలువలు’, ‘అనురాధ మోడల్’ కి సంబంధించిన అంశంలో మనీష్ ఆజాద్ స్థిరత్వం లేనివాడిగా అనిపిస్తాడు, కొన్నిసార్లు ‘ఫ్రాంక్‌ఫర్ట్ స్కూల్’ అని, కొన్నిసార్లు లియు షావో చి ‘మంచి కమ్యూనిస్టు ఎలా వుండాలి’ (సాంస్కృతిక విప్లవం, మావో విమర్శించిన) అని ముద్ర వేసి, ‘అనురాధ నమూనా’ ఒక ‘ఉన్నతవర్గ నమూనా’ అనేంతవరకు వెళతాడు …… కానీ సమాజాన్ని మార్చడంలో భాగంగా కమ్యూనిస్టులు తమను తాము మార్చుకోవాలా వద్దా అనే విషయాన్ని మాత్రం ఎక్కడా చెప్పడు. అది కూడా, పుట్టుక నుండే మనలో బ్రాహ్మణీయ, కుల విలువలు అంతర్లీనంగా వుండే భారతదేశంలాంటి దేశంలో ఈ విషయంపై ఆయన మౌనంగా ఉన్నారు. ఇది సందర్భం కాదు కాబట్టి ఇక్కడ నేను ‘ఫ్రాంక్‌ఫర్ట్ స్కూల్’ లేదా లియు షా చి పుస్తకంపై చర్చ చేయదలుచుకోలేదు (మనీష్ఆజాద్ కూడా ఆ వాదనలను వ్యతిరేకించ లేదు, ముద్ర వేయడానికి మాత్రమే ఉపయోగించాడు) కానీ, విలువలను మార్చడానికి ప్రయత్నించిన GPCR ఎందుకని విఫలమైంది, మావో మరణం తరువాత మొత్తం ప్రక్రియ ఎందుకని తారుమారైంది అనే విషయాల గురించి మనీష్ఆజాద్ ఆలోచించాల్సిన అవసరం వుంది. కానీ మనీష్ఆజాద్‌కి బహుశా ఆచరణను మెరుగుపరచుకోవడంలోనూ, గత చరిత్ర నుండి నేర్చుకోవడంలోనూ కాకుండా వాదనలో అధిగమించడంలోనే ఎక్కువ ఆసక్తి వున్నట్టుంది.
‘స్వేచ్ఛ’ అనే అంశంపై నేను మార్క్స్‌ను ఎందుకు ఉదహరించలేదని మళ్ళీ అంటాడు. వాస్తవ జీవిత ఆచరణలో, సంస్థాగత పనిలో ఆ స్వేచ్ఛ ఏమిటో అనుసంధానించకుండా, కేవలం మార్క్స్‌ను ఉటంకించడంలో ప్రాముఖ్యత ఏముంటుంది? ఒకరి ఆలోచనల ‘స్వచ్ఛతను’ నిరూపించడానికి ఉదహరించడం మేధోవాదం తప్ప ఆచరణకు సహాయపడదు.
ఒక నిర్దిష్ట సందర్భంలో ఒకటిన్నర శతాబ్దాల క్రితం ఎంగెల్స్ చెప్పినదానికి, నేను చెప్పినదానిని ఏ విధంగానూ అనుసంధానించకుండా ఎంగెల్స్ ‘ఊహాజనిత సోషలిజం’ గురించి ప్రస్తావించడం ద్వారా ఊహాజనిత సమస్యపై మనీష్ఆజాద్ మళ్ళీ ముద్ర వేయడానికి ప్రయత్నించారు. భిన్నమైన అభిప్రాయాల మధ్య ఘర్షణ ద్వారా కొత్త ఆలోచనలు రావు అని వెంటనే మరొక సమస్యలోకి దూకేస్తారు. ఇది మౌలికంగా గతితార్కిక వాదాన్ని నిరాకరించడమే అవుతుంది. యిది అనేక మార్క్సిస్ట్ సమూహాలలో వుండే విలక్షణమైన చిన్న సమూహ మానసికత. వీరు విభిన్న దృక్పథాన్ని ఎదుర్కోలేక, విషయాన్ని తర్కించడానికి బదులు ఒక ముద్ర వేయడానికి ప్రయత్నిస్తారు.
చివరగా, మనీష్ ఆజాద్ బ్రాహ్మణీయ శబ్దార్థశాస్త్రాన్ని ఆశ్రయించటానికి బదులు, మన ఆచరణను మెరుగుపరచుకోడానికి, విప్లవకర వృద్ధిలో(మార్పు సంగతి పక్కన పెట్టేయండి) మరింతగా విజయాన్ని సాధించాలనే లక్ష్యంతో నిర్దిష్ట అంశాలను చర్చిస్తే బాగుండేది. భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం 1925 నుండి ఉనికిలో ఉంది, ఈ కాలంలో (దాదాపు ఒక శతాబ్దం) ఎంతవరకు అభివృద్ధి చెందిందో, యింకా ఎందుకు వెనుకబడి వుందో మనం అంచనా వేయాల్సిన అవసరం వుంది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా, ముఖ్యంగా భారతదేశంలోని నిర్దిష్ట పరిస్థితులలో, ఉద్యమాలు ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలపై మరింత స్పష్టత తీసుకురావడానికి సహాయపడే విమర్శలను నేను స్వాగతిస్తాను.
తెలుగుః కె. పద్మ