నేను కొత్తగా దళంలోకి వెళ్లిన రోజులవి.

నేను కొత్తగా దళంలోకి వెళ్లిన రోజులవి.

ఉదయాన్నే ఐదు గంటలకు ‘లెగండి లెగండి.. బయలుదేరాలి..’ అంటూ డిప్యూటీ కమాండర్‌ అరుపులతో అందరం నిద్ర లేచాం. నేను కళ్లు తెరిచి చూసేసరికే ఒకరిద్దరు కిట్లు సర్దుకుంతున్నారు. దీర్ఘ ప్రయాణం చేసి రాత్రి డ్యూటీ పడ్డ కామ్రేడ్స్‌ లేవడానికి ఇబ్బంది పడుతున్నారు. మూత పడుతున్న కళ్ళతోనే పాలిథిన్‌ కవర్లు మడత పెట్టుకుంటున్నారు. ఆ ప్రశాంత వాతావరణంలో కామ్రేడ్ల కదలికల జోరుతో పాలిథిన్ల చప్పుడు తోడైంది.

నేను బద్ధకంగా లేచి కూర్చున్నాను. అది గమనించిన మా దళం ఫ్రంట్‌ పైలెట్‌ మంగన్న ‘నిర్మలక్క ఇక్కడే ఉంటది. తిరుగు ప్రయాణంలో తీసుకెళ్దాం’ అని చిన్నగా నవ్వేడు.

ఆయన మంచి ఒడ్డు పొడవు. దిట్టంగా ఉంటాడు. కారు నలుపు మనిషి. నాయకపు తెగ ఆదివాసీ. ఆయన మాటవరసకే అన్నా కూడా అమ్మో వదిలేసి వెళతారా? అనుకున్నా.

దళ జీవితం అంటే మాలాంటి పట్టణ ప్రాంత యువతకు ఉండే ప్రకృతిపై వుండే రంగురంగుల ఊహలు అప్పటికే పటాపంచలయ్యాయి. ఆ జీవితంలోని కఠోర శ్రమ తెలిసి వస్తూ ఉన్నది. దళ క్రమశిక్షణ, సైనిక రంగంలోని సాదకబాదకాలు అనుభవంలోకి వస్తూ ఉన్నాయి. మరోవైపు తిండి లేక చిక్కిపోయాను. నాజూకుతనం ఆనవాలే లేకుండా శరీరం కందిపోయి, రంగు మారింది.

అది నిర్బంధం తీవ్రంగా ఉన్న మండుటెండల రోజులు. వరుసగా భీతి కొలిపే ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. రిట్రీట్‌, అఫెన్స్‌, డిఫెన్స్‌లతో అలసట లేకుండా నడుస్తూ ఉన్నాం. అంతకు ముందు రోజే కొద్దిలో ఫైరింగ్‌ తప్పిపోయింది. దాదాపు పది గంటలు ప్రయాణం చేసి ఒక సేఫ్‌ ప్లేస్‌కు చేరుకున్నాం. అయినా పోలీసులు ఎక్కడి నుంచి వస్తారో, ఎక్కడ తారసపడతారో తెలియడం లేదు. కత్తి సాములా వుంది నాకైతే. ఏరి కోరుకున్న దళజీవితాన్ని చాలంజ్‌ తీసుకోవాలి.

ఇది అలవాటుపడటం నాకు చాలా కష్టంగానే ఉంది. కానీ మిగతా కామ్రేడ్స్‌కు ఇవన్నీ మామూలే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంగన్న తన చమత్కారపు మాటలతో వాతావరణాన్ని తేలిక పరుస్తుంటాడు. ఆయన మాటల తీరుకు మొదట నేను ఆశ్చర్యపోయాను. ఎవరిని నొప్పించని ఆయన మాటల్లోని చలాకి అంటే అందరిరీ ఇష్ట్టమే.

చలో చలో అంటూ కమాండర్‌ అందరినీ కదిలించింది.

ఫార్మేషన్‌లోకి వచ్చాం. నడక మొదలైంది.

ఇంకొద్ది దూరమే నడిచాం. అప్పటికి బాగా తెల్లారింది. మరో ప్రాంతానికి చేరుకున్నాం. అక్కడ నిండుగా సెలయేరు పారుతోంది. దాని పక్కనే మకాం వేశాం. పెద్ద చెట్టు కింద అందరం కూర్చున్నాం.

ఆ కిందికి కిచెన్‌ ఏర్పాటు చేశారు. అడవిలో కిచెన్‌ అంటే నలచదరంగా శుభ్రం చేసిన నేల. దిగొట్టిన మూడు కొయ్యలు. అంతే. పెద్ద వంట అయితే దానికి తగ్గ ఏర్పాట్లు ఉంటాయి. లక్ష్మక్కకు, భీమన్నకు, నాకు వంట డ్యూటీ వేశారు.

భీమన్న పొయ్యి ముట్టించాడు. టీ కోసం ఏర్పాట్లు జరుగుతుండగా లక్ష్మక్క ‘ఛాయ పత్తా అయిపోయింది కామ్రేడ్‌’ అని డిప్యూటీ కమాండర్‌ మురళి వంక చూస్తూ అంది.

‘అన్న చాయ్‌ పత్తా పట్టించుకోడు. చక్కెర అయితే బస్తాలకు బస్తాలు తెప్పిస్తాడు..’ అని పక్కనే ఉన్న మరో కామ్రేడ్‌ మంగుదాదా అన్నాడు. ‘అట్లా చాయ్‌పత్తా లేకంటే చాయ్‌ మానేస్తమా ఏంది. వేర్ల కషాయం పెట్టుకుందాం..’ అంటూ పక్కనే ఉన్న చెట్లపొదల్లోకి దూరాడు. రెండు నిమిషాల్లో వేర్లతో సహా ప్రత్యక్షమయ్యాడు. లక్ష్మక్క ఆ వేళ్లను దంచి మరుగుతూ ఉన్న నీళ్లలో వేసింది.

‘నీవు ఇది ఎప్పుడు తాగలేదు కదా. మంచిగా ఉంటది. ఇక్కడ గొండ్వాన వాసులు వాడుతారు. మాకు అట్లనే అలవాటు అయింది’ అన్నది లక్ష్మక్క.

మేం ఈ పనుల్లో ఉంటే కమాండర్‌ భారతి అక్కడికి వచ్చింది.

‘ఈరోజు మన ఫారెస్ట్‌ కమిటీ బాధ్యుడు ఆనందన్న వస్తున్నాడు. ఆయనతో పాటు మరికొంత మంది కామ్రేడ్స్‌ కూడా వస్తున్నారు. మనం ఇక్కడ నాలుగు రోజులు ఉంటాం. మిగతా దళాల కామ్రేడ్స్‌ కూడా ఇక్కడికి చేరుకుంటారు. నాయకత్వ రక్షణలో అప్రమత్తంగా ఉండాలి’ అని మమ్మల్ని ఉద్దేశిస్తూ చెప్పింది.

ఆ మాట వినగానే కామ్రేడ్స్‌ ఉత్సాహంగా తలుపారు.

ఆనందన్న వస్తున్నడన్న సంతోషంతోనే ‘మైనక్క రావడం లేదా?’అని అడిగాను. మహిళ కామ్రేడ్స్‌కు ఆమె అంటే ఇష్టం. 

దానికి ఆమె సమాధానం ఇవ్వలేదు. బహుశా మైనక్క రాకపోవచ్చు అనుకున్నా. నాకు ఆమెను, ఆనందన్న సహచరి లలితక్కను చూడాలని చాలా ఉండేది. దక్షిణ తెలంగాణలో రాధక్క, డీకేలో మైనక్క మైదాన ప్రాంతం నుండి వచ్చిన విద్యావంతులైన మొదటి మహిళలు. తెలంగాణ సాయుధ పోరాట మహిళా వారసత్వాన్ని కొసాగిస్తున్న పోరాట యోధులు. మా కమాండర్‌ భారతి ఆదివాసీ మొదటి మహిళ కమాండర్‌. వీరు ముగ్గురు మొట్ట మొదటి మహిళా కమాండర్స్‌. భారతక్కను చూసాను. రాధక్కను, మైనక్కను చూడాలనే కోరిక బలంగా వుండేది. చూడనేమో అని దిగులు కూడా ఉండేది.

కా.ఆనంద్‌ వస్తున్నాడని తెలియడంతో నేను ఆయన జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయాను.

నేను చిన్నగా వున్నప్పుడు ఓ రోజు గజ్జల గంగారాంతో ఆనంద్‌ను చూసాను. వాళ్లు మా ఇంటికి వచ్చి ఎడతెగని చర్చలు చేసుకుంటుంటే తలుపు చాటుగా చూస్తూ ఉండిపోయాను. అప్పుడు గంగన్న నన్ను దగ్గరకు తీసుకొని మాటలు పెట్టాడు. ఇండ్లు పక్క పక్కనే కదా.. మీ వాదులాటకు మళ్ళీ టైం వుంటుందిలే..అంటూ మరో కామ్రేడ్‌ రావడంతో నేను బిడియపడి బయటకు పరుగుతీసాను. ఆనందన్నకు సంబందించిన నా తొలి ఎరుక అది.    

  పది నిమిషాల్లో కామ్రేడ్స్‌ వచ్చారు అని ఎవరో అంటుండగానే అందరిని ఒక దగ్గరకు రమ్మని విజిల్‌ వినిపించింది. చాలా దళాల నుండి కామ్రేడ్స్‌ వచ్చారు. ఆ సందడి, సంబరం  భలేగా ఉంటుంది. అన్నీ నేను దూరం నుంచే గమనిస్తున్నాను. వంట డ్యూటీలో ఉన్నందు వల్ల మేం ముగ్గురం బైటి నుంచి వచ్చిన కామ్రేడ్స్‌ను రిసీవ్‌ చేసుకోలేకపోయాం.

కానీ వాళ్లలో ఆనందన్న ఉంటాడని తెలిశాక కూడా అక్కడ ఎట్లా ఉండిపోగలను? లక్ష్మక్క చాయ్‌ వంచుతుంటే సాయం కూడా చేయకుండా పరిగెత్తాను.

అక్కడ కొత్త కామ్రేడ్స్‌ ఉన్నారు. అంతమంది మధ్యలో ఆయన్ను గుర్తుపట్టడం కష్టమైంది.

కొంచెం అయోమయంగా నిలబడిపోయాను.

మా కార్యదర్శి వేణు ‘ఈ కామ్రేడ్‌ ఎవరో తెలుసా?’ అని ఆడిగాడు. ఆయన కూడా సింగరేణి ప్రాంతం వాడే. నన్ను ఆట పటించడమంటే సరదా ఈయనకు. ఈయన దగ్గర జాగర్తగా వుండాలని…ఏమో అని తల అడ్డంగా ఊపాను.

కానీ కొత్త కామ్రేడ్‌ ‘ఏం బుజ్జమ్మా.. బాగున్నావా’ అన్నాడు.

ఆయన అలా అనగానే నేను ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఆ పిలుపు నన్ను బాల్యంలోకి తీసికెళ్లింది. ఆయనెవరో తెలిసిపోయింది. గట్టిగా పట్టుకున్నాను. వేణన్న గొల్లున నవ్వి తలమీద చేయసి ఆప్యాయంగా నిమిరాడు.

బిడియపడి వదిలి పక్కకు జరిగాను. ‘ఎట్ల గుర్తుపట్టావన్నా’ అని అడిగాను. దానికి ఆయన నవ్వాడు.

‘ఇక్కడ ఉన్నవాళ్లంతా పాతవాళ్లే. నీవు ఇక్కడే ఉన్నవని నాకు తెలుసు..’ అన్నాడు. నీవు రెబల్‌ కదా… మాతో పొట్లాట అంటే ఇష్టమాయే నీకు. అప్పుడపుడు మా మాటల్లో నీ ప్రస్తావన వస్తుంటుంది’ అన్నాడు.

కొంచం ఇబ్బందిగా అనిపించింది. అన్న వచ్చిన ఆనందం ముందు అన్నీ కొట్టుకుపోయాయి.

            ఆనందన్న దండకారణ్య విషయాలు అక్కడున్న కామ్రేడ్స్‌కు చెప్పడం మొదలు పెట్టాడు. ఆ మాటలు నా కోసం కాదు. అక్కడున్న వాళ్ల కోసం కూడా కాదు. తన కోసమే అన్నట్లు ఇష్టంగా గుర్తు చేసుకొని చెప్పినట్లు ఆయన కళ్లలో ఆ మెరుపు కనిపించింది.

            భీమన్న, లక్ష్మక్క అందరికీ వేళ్ల కషాయం పోసింది.

            ఆ తర్వాత నేను వాళ్లతోపాటు వంట డ్యూటీలోకి వెళ్లిపోయాను.

•••

            ఆ రోజే కమిటీ సభ్యులు సమావేశంలో కూచున్నారు. సాయంకాలం మళ్లీ టీ టైంలో ఆనందన్న నాతో రెండు నిమిషాలు మాటలు కలిపాడు. రెండో రోజు మధ్యాన్నం భోజనం టైంలో నేను ఏదో రాసుకుంటూ ఉంటే వచ్చాడు.

‘ఏం రాస్తున్నావు..’ అని అడిగాడు.

రాస్తున్న కథ చూపించాను. విప్లవంలోకి  రెండు పక్షులు వచ్చినట్లు, వాటి మధ్య ప్రేమ మొదలైనట్లు రాశాను.

ఆయన శ్రద్ధగా చదివాడు. ‘బాగ రాశావు. విప్లవంలోకి పక్షులు రావడం, అవి ప్రేమించుకోవడం. ఇట్ల కూడా రాయవచ్చు. కానీ మన చుట్టూ ఇంత మంది మనుషులు ఉన్నారు కదా. సామాన్య జనాలు, ఆదివాసులు విప్లవంలోకి వచ్చారు. పక్షులను కాకుండా వాళ్లలో ఎవరినన్నా పాత్రలుగా పెట్టి, వాళ్ల మధ్య ప్రేమ గురించి రాయవచ్చు కదా. అప్పుడు కథలో ఇంకా చాలా చెప్పవచ్చు. పక్షులకంటే మనుషులకు తెలివితేటలు ఉంటాయి. విప్లవంలో ప్రేమలు వుండవని చెప్పుకుంటారు కదా, నవీన మానవుల విప్లవ విలువలు ఎలా ఉంటాయో, వుండాలో రాయాలి మనమే ..’ అన్నాడు.

నిజమే కదా అనిపించింది. పిల్లల కథలు, పంచతంత్రం కథల ప్రభావంతో అది రాశాను.

పక్షులను తీసేసి ఒక అబ్బాయిని, అమ్మాయిని పాత్రలుగా పెట్టి రాశాను. ఎక్కడెక్కడి నుంచో వాళ్లు విప్లవంలోకి వస్తారు. ప్రేమలోపడతారు.

నాలుగో రోజు సమావేశం అయి ఇక ఆనందన్న వెళ్లిపోతాడనగా కథ తీసికెళ్లి చూపించాను.

‘అప్పుడే అయిపోయిందా?’ అని చదివాడు.

బాగుంది.. అని మెచ్చుకున్నాడు. దాన్ని. తీసి బ్యాగులో పెట్టుకుంటూ  మన పత్రికలో అచ్చు వేయిస్తానని అన్నాడు.

‘ప్రకృతిలో పక్షులు, మనుషులు అన్నీ ఉన్నా ప్రతి కథలో ఒక  విలువ ఉండాలి. సమాజాన్ని మార్చే ప్రజలు దాన్ని తీసుకుంటారు.   ప్రేమ, పోరాటం కూడా అందులో భాగమే..’  సుమారుగా ఇలాంటి మాటలు అప్పుడు చెప్పాడు. ఆ రోజు నాకేం అర్థమైందో చెప్పలేను. కానీ మనుషుల ప్రపంచం చాలా పెద్దదని, దాన్ని కలపాలని మాత్రం చూచాయగా అర్థం అయింది. ఆనంద్‌ను ఆ తర్వాత కలవలేకపోయాను. ఎప్పుడైనా తెలిసిన వాళ్లు కలిస్తే మా కామ్రేడ్‌ ఎట్లుంది? అని అడిగేవాడట. అది తెలిసినప్పుడు ఏ పని చేసినా మనుషులకు ఉపయోగపడాలని నా మొదటి కథ సందర్భంలో చెప్పిన మాటలు గుర్తుకు  వస్తూ ఉంటాయి.

One thought on “మనుషులను కలపడమే మన పని

 1. మా సత్యం
  జూలై 15 వసంత మేఘంలో పద్మ కుమారి గారు రాసిన కథ
  ” మనుషులను కలపడమే మన పని” శీర్షిక ఆలోచింపచేస్తున్న చిన్నకథ సామాన్యం కాదు. చాలా సులభంగా కనబడుతున్నప్పటికీ కానీ మిక్కిలి కష్టం. బుద్ధికి పదును పెడుతూ చదివింప చేస్తుంది.
  కామ్రేడ్ ఆనంద్ అన్న మాటలు
  “ఏ పని చేసినా మనుషులకు ఉపయోగపడాలని”
  ఎంతో ప్రభావంతమైన మాటలు.
  పని చేసే ముందు ప్రతి ఒక్కరికి కూడా నిత్య చైతన్య స్ఫూర్తిని కలిగించే వాక్యాలు. కథ రచయిత్రి పద్మ కుమారి గారికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ….

Leave a Reply