నీ ఊపిరి విశ్వమంతా పాకిపోయింది
విశ్వాన్నెలా భస్మం చేస్తాడు
నీ ఆలోచన జనసంద్రం నిండా నిండిపోయింది
సముద్రాన్నెలా బందీ చేస్తాడు

నీ ఆలోచనకు కాళ్లెలా వుంటాయి 
గాలికీ జీవనదికీ కాళ్లుంటాయా
మండే సూర్యుడున్నాక 
వెలిగే చంద్రుడున్నాక 
నీ శ్వాసకు అంతమెలా వుంటుంది

పీక పిసుకుతాడు
కనురెప్పల్ని పీక సాగుతాడు
ఊహకెలా ఉరితాడు వేస్తాడు
వరిగింజల్లో పిడికిళ్లున్నాయని
రాలుతున్న వరిపొట్టులోంచి
పిట్టలు పైకెగురుతున్నాయని 
సృజన చేసిన మెదళ్ళను కూల్చడానికి
ఏ బుల్డోజరూ సరిపోదు

నీ చేతులు విల్లంబులు పట్టలేదు
నీ వాక్యాలు బాణాలయ్యాయి
నీ చేతులు తుపాకులు పట్టలేదు
చావును నిరాకరించిన నీ దైర్యం
తూటాగా మారింది
నీ తలనరాలు విల్లు కట్టడానికి వీలుగా ఉన్నాయని 
దోపిడీ వర్గానికి భయంభయంగా వున్నదేమో
మెదడు వుండకూడదట
ఊపిరి పాడకూడదట
రెక్కలు కదలకూడదట
పచ్చిమట్టిలో వినిపిస్తున్న ఆదివాసీ పాటలాగ
అమరుడి కనురెప్పల కవాతు లాగ
శ్రమజీవుల చెమటచుక్కల ఆలాపన లాగ
తెగిపడ్డ నీ రెక్కలు గీస్తున్న చిత్రమే సాఖ్యం 
పోరాటశ్వాసలకు చావులేదు
ఊహలకు అంతము లేదు!

దిక్కరించే మేఘాలను
పోలీసు తూటాలేం చేస్తాయి
పోరాడే సముద్రాలను
విమాన బాంబులేం చేస్తాయి.
ఎరుపుతో ఎన్నో చిత్రాలు గీసినావు
వాడి కత్తిపోట్లు 
నీ ఊహనేం చేస్తాయి!

ఊపిరి పిల్చడమే
మానవుల కళాత్మకమైన ధిక్కారన!
పదేపదే ఊహ చేయడమే
సంకెళ్ళకు సృజనాత్మక హెచ్చరిక!

మేఘాల పాత్ర లేకుంటే
అన్నం మెతుకులెక్కడివి
ఊహ పాత్ర లేకుంటే
సృజన పేరెక్కడిది
మెదళ్ళలో కదిలే సీతాకోకలు లేకుంటే
స్వేచ్ఛా కాంక్షలెక్కడివి
సంకెళ్ళ శబ్దాల మధ్య కవితా పాదాలు లేకుంటే
జైళ్లకు కోర్టులకు భయమెక్కడిది
అసలు విల్లు బాణమే లేకుంటే
పోరాటమెక్కడిది!

నిప్పురవ్వల్లాంటి నీ ఊహ చేత
నీ ఆగ్రహం నిత్యం యవ్వనమౌతున్నది
పక్షుల కిలకిలా రావాలవలె
నీ సృజన
ప్రజాపోరాటంలో మరింత ఊపిరౌతున్నది
ఊహ చేస్తూనే వుండు
సృజనకు సాన బెడుతూనే వుండు
మెదళ్ళలో సీతాకోకలను కదిలిస్తూనే వుండు
తెగిపడ్డ రెక్కలతో చిత్రాలు గీస్తూనే వుండు 
నీ ఊపిరి అందుకుంటూ
మున్ముందుకు సాగుతూనే వుంటాం.
•••

ఈ కవిత వీళ్లకు అంకితం:

•జి.ఎన్.సాయిబాబా (తల తప్ప ఇంకేది కదలని 99% వికాలంగుడైన అతను ఏ ఆయుధాలు పట్టలేదు కదా అని అడిగితే, “అతనికి మెదడు ఉంది కదా” అని అమానవీయమైన కోర్టు తీర్పు చెప్పింది.)

•గ్రాంసీ (ఇరవై ఏళ్ల పాటు గ్రాంసీ అలోచన చేయకుండా, తలనరాలు పని చేయకుండా చేయాలని అప్పటి దుర్మార్గ ప్రభుత్వం కోర్టును కోరింది)

•వరవరరావు (తానొక సముద్రమని ప్రకటించి, ఎన్నో నిర్భందాల మధ్య కూడా సముద్రంలాగే జీవిస్తున్న ధిక్కార కవి)

•లియోనార్డ్ పెల్టియర్ (నలబై ఆరు సంవత్సరాల నుంచి జైలు జీవితం అనుభవిస్తూ జైళ్లో కూడా పోరాట చిత్రాలు గీస్తున్న చిత్రకారుడు, కవి, ఆదివాసీ హక్కుల నాయకుడు)

One thought on “ఊహ చేయడమే హెచ్చరిక

  1. మా సత్యం
    దొంతం చరణ్ రాసిన కవిత వాక్యాలు
    “దిక్కరించే మేఘాలను
    పోలీసు తూటాలేం చేస్తాయి
    పోరాడే సముద్రాలను
    విమాన బాంబులేం చేస్తాయి.
    ఎరుపుతో ఎన్నో చిత్రాలు గీసినావు
    వాడి కత్తిపోట్లు
    నీ ఊహనేం చేస్తాయి!” కొత్త గొంతుక నుండి వెలువడిన పదునైన వాక్యాలు. భారతదేశ నేరపూరిత పాలకులకే కాదు సామ్రాజ్యవాదులకు ఒక హెచ్చరికగా ప్రతిధ్వనిస్తోంది.🤝

Leave a Reply