మా నాయనమ్మ పేరు వంగళాంబ. వాళ్ళ నాన్న పాలఘాట్ రామనాథఅయ్యర్. తమిళుడు. తెలుగు, తమిళనాడులు మదరాసు ప్రెసిడెన్సీగా వున్నప్పుడు కర్నూలు జిల్లాలో డోన్‌ అనబడే ద్రోణాచలం గ్రామానికి వచ్చి గడియారాల మరమ్మత్తు షాపు పెట్టుకున్నాడు. ముగ్గురు కూతుళ్లకు ఇక్కడి తెలుగు సంబంధాలే చేశాడు. పేదరికం వల్లనో ఏమో మా నాయనమ్మ మా తాతకు (జేనాన/జేజబ్బ) రెండవభార్యగా వచ్చింది. (ఆయన మొదటి భార్య పురిటిలో చనిపోయింది)

కూతుళ్ళ పెళ్లిళ్లు అయిపోయాక ఆ కుటుంబం మదరాసుకు తరలిపోయింది. ఆ తరువాత నాయనమ్మకు పుట్టింటితో ఏ సంబంధాలూ లేకపోయాయి.ఎప్పుడైనా మూడు,నాలగేళ్లకోసారి ఆమె అక్క వచ్చి వారం రోజులుండేది.చెల్లెలు అసలు వచ్చేదేకాదు. అంతులేని ఇంటిబరువు, కుటుంబ బాధ్యతల వల్ల తాను ఎప్పుడూ, ఎక్కడికీ పోగలిగేది కాదు. పుట్టింటివాళ్ళూ ఏనాడూ పిలిచిందీ లేదు.ఎంతో… ఒంటరితనం.

నాకు బాగా గుర్తు.ఒకనాడు మావూరికి దారితప్పి ఆరవ బిచ్చగాడు వస్తే అరగంట అతనితో తమిళ పాటలు పాడించుకొని, మరో అరగంట నోటినిండు గా తమిళంలో మాట్లాడి, కడుపునిండా అన్నం పెట్టి, తొడుక్కోడానికి బట్టలు ఇచ్చిపంపింది.

“మనోధర్మపరాగం” నవల చదువుతున్నంత సేపూ మా’నాయిని’, కళ్ళవెనుక నిత్యమూ కదలాడిన యీ ఒంటరితనం అగుపించింది నాకు.

మధురైనుంచి పోషకుణ్ణి వెతుక్కుంటూ చిత్తూరు వలసవచ్చింది వీణ విద్వాంసురాలు, దేవదాసీ స్కందకుముదవల్లి, కొన్ని ఏళ్ల తరువాత తన కూతురు నాగలక్ష్మికికూడా పోషకుణ్ణి వెతుకుతూ మద్రాసు కొచ్చింది. నవలలో కుముదవల్లి,ఆమె లాంటి తల్లులు పోషకుడి కోసమో, నాటకాల్లో, సినిమాల్లో వేషాలకోసమో వుండూరువదిలి మద్రాసుకో,మరొక వూరికో వలసపోతున్నప్పుడు అనేక కాలాల్లో బతుకుదెరువు కోసం దేశాలు పట్టి పోయిన మానవుల వేదన వినిపిస్తుంది.

నేను తిరుపతిలో చదువుకున్న మూడేళ్లు తమిళ స్నేహితుల సావాసం, ఐ.ఎన్ మహల్లో, జ్యోతి థియేటర్లో, రాంరాజ్ కాంప్లెక్స్ లో చూసిన ఆరవ సినిమాల నేటివిటీ. తమిళాన్ని బాగా పరిచయం చేశాయి. అంతే కాదు, ఆ మూడేళ్ళు అటు చిత్తూరు, కుప్పం మొదలు ఇటుకొస మదనపల్లి వరకు తిరిగాను. అప్పుడు తెలుగు-తమిళ భాషలు అల్లుకుపోయిన మిశ్రమ సంస్కృతి పట్ల ప్రేమ ఏర్పడింది.అది ఇప్పటికీ నిలిచివుంది. ఇవన్నీ మనోధర్మపరాగం నవల నచ్చడానికి వెనుక నాకున్న కొన్ని వ్యక్తిగతకారణాలు.
 
రాయలసీమలో పెద్ద దేవళాలు ఉన్న తిరుపతి, శ్రీశైలం, అహోబిలం,మహానంది వంటి చోట్ల తప్ప దేవాదాసీ వ్యవస్థ వున్నట్టు పెద్దగా తెలియదు.

కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలో దేవదాసీ పదంకూడా వాడుకలోవున్నట్టు నేను వినలేదు. సాధారణంగా ఇక్కడ బోగమోళ్ళు అనే అంటారు.

తమిళనాట మాత్రం గుడులు ఎక్కువ,వాటికి రాజపోషణ ఎక్కువ కాబట్టి గుడిసానుల (దేవదాసీ) సంస్కృతీ ఎక్కువే.

కర్నూలు జిల్లాలోమా వూరు పెద్దగ్రామం. ఒక “భోగము”కుటుంబం వుండేది. వాళ్ళు 1964 నాటికే ఆ వృత్తి వదలి బంగారం వ్యాపారం చేసేవారు. ఆ యింటి యజమానురాలు అప్పటికే పంచాయతీ బోర్డు మెంబర్ కూడా. అయినా ప్రజలలో వారి పట్ల, వారి ఇంటి ఆడపిల్లల (చదువుకొని ఉన్నతిలో,ప్రభుత్వఉద్యోగములో వున్నా) పట్ల ఒక చిన్నచూపు వుండేది. ఇది మన సమాజం వారికి ఇచ్చిన గౌరవం?

‘భోగము’ అంటే దేవుడికి జరిపే అంగభోగము, రంగభోగము. (అంగరంగ వైభోగము, రంగ మంటపము వంటి పదాలు దీని నుంచే వచ్చాయి) రంగభోగము గుడి అలికి శుభ్రము చేసి, దేవుని ఎదురుగా చేసే గానమో,వీణ వంటి వాయిద్య కళనీ లేక మంటపములో చేసే నృత్యమో. అంగబోగము అంటే దేవుడికి చేసే రోజు వారీ అలంకరణలో, గుడి అలంకరణలో భాగం కావటం. ఈ రెండు భోగాలు చేసే వారు భోగమువారు అయ్యారు. ఒక్కోసారి గాయని/నాట్యకత్తె ప్రాముఖ్యతను బట్టి,గుడి ఆదాయాన్ని, సంపదను బట్టి గుడి శుభ్రం చేసే పనినుంచి వారు మినహాయింపు పొందవచ్చు కూడా. “సుమారు ఏడవ శతాబ్దంలో అలా రూపొందిన దేవదాసీ వ్యవస్థ 8ివశతాబ్దానికే చేదుపువ్వుల్ని పూసింది అంటారు” రచయిత .

మనం మరీ మరీ గుర్తుంచుకోవాల్సిన విషయం దేవదాసీలు వేశ్యలు కారు. మన దేశంలో సమాంతరంగా వేశ్యా వ్యవస్థ కూడా ఉనికిలో వుండింది. కృష్ణ దేవరాయల కాలంలో వేశ్యల నుంచి ఎంతెంత పన్ను వసూలు చేసేవారో చరిత్రలోకూడా రికార్డు అయివుంది. 1889 లో పుట్టిన మధురై స్కందకుముదవల్లి అనే దేవదాసీ జీవితంతో మొదలయిన నవల ఆమె కూతురు సి.కె.నాగలక్ష్మి దేశంలోనే ప్రముఖ గాయనిగా పేరు తెచ్చుకోవడం వెనుక జీవితంలో తాను పొందినవి, కోల్పోయినవి పోల్పిచూపింది.

నాగలక్ష్మి జీవితమే స్థూలంగా నవలలో కథ. నాలుగవతరం మునిమనుమరాలు నాగలక్ష్మి నటరాజన్ కచేరీ (2020 జనవరి5) తో నవల ముగుస్తుంది. అంటే సుమారు 120 ఏళ్ల చరిత్రను తడిమిన నవల. చాలా చారిత్రక నవలల్లో ఆయా కాలాల్లో బతికిన పాత్రలను రచయిత నేరుగా చెబుతాడు.లేదా వర్ణనను బట్టి మనం ఆయా పాత్రలను గుర్తు పట్టవచ్చు.అలా చూస్తే యిది ఒక భిన్నమైన చారిత్రక నవల.రచయిత ప్రకారం “ఇందులోని ప్రధానపాత్రతో సహా మిగిలిన పాత్రలకు చారిత్రక మూలలున్నాయి కానీ అవేవీ చారిత్రక వ్యక్తులు కావు.” కానీమనకు గతంలో తారసపడిన వ్యక్తులు, ఘటనలు ఎదురొస్తాయి.

అవి అచ్చంగా మనం వూహించుకున్న వ్యక్తులు కావచ్చు, కాకపోవచ్చు.ఉదాహరణకు ఒక సన్నివేశంలో ఒకగాయని, ఒక నాట్యకారిణి స్నేహితులు.వాళ్ళు నైట్ సూట్ లో, సిగరెట్ పట్టుకొని ఫోటోదిగుతారు. చప్పున మనకు గాయని ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి, నాట్యకారిణి టి.బాలసరస్వతి గుర్తుకొస్తారు. నాగలక్ష్మి పాత్రలో సుబ్బులక్ష్మి ఛాయలు చాలా కనిపిస్తాయి. ఆమె భర్త విశ్వనాథన్ జర్నలిస్టు,పత్రిక యజమాని స్వాతంత్య్ర ఉద్యమం లో పాల్గొన్న సుబ్బులక్ష్మి భర్త టి.సదాశివంను గుర్తుతెస్తాడు. అంటే నవల స్థూలంగా సుబ్బులక్ష్మి జీవిత నేపధ్యమేనేమో అనిపిస్తుంది. యథాతథం కాకపోవచ్చు.

మద్రాసు నేరుగా బ్రిటిష్ పాలనకిందికి పోయి వాళ్ళు పరిపాలనలో నిలదొక్కుకున్నాక కొన్ని ప్రధాన ఆర్థిక సామాజిక
మార్పులు కొన్ని చోటు చేసుకున్నాయి. తమిళనాట కావేరీ పరీవాహక ప్రాంతంలోని వ్యవసాయభూముల్లో ప్రధాన భాగం దేవదాసినుల యినాము భూములు ఉందేవి. (తొలినాళ్ళ గుడిసానులు అనేక కులాల నుంచి వచ్చారని,వాళ్ళు పెళ్లిచేసుకొని స్వంత కుటుంబాన్ని కూడా కలిగివున్నారనీ బుల్లోజు బాబా గారు 15వ శతాబ్దం వరకు వున్న శాసన ఆధారాలు చూపారు.

(https:\\vskandhra.org|9672)


దేవదాసీలు తమ జీవితాలను పూర్తిగా కళకే అప్పజెప్పారు. ప్రతిఫలంగా రాజులవద్ద, జమిందార్ల వద్ద వాళ్ళు కొన్ని
సౌకర్యాలను, భోగాలను పొందారు.వ్యవసాయ భూములు అలా వచ్చినవే. బ్రిటిష్ ప్రభుత్వం పన్ను రాబడి పెంచడం కోసం దేవదాసీ ఇనాముల్ని ఏకపక్షంగా రద్దుచేసింది. (అగ్రహారభూములను వదిలేసి వీళ్ళను మాత్రమే ఫస్ట్ టార్గెట్ గా ఎంచుకోవడానికి కారణమేమి? బ్రాహ్మణులు అప్పటికే బ్రిటిష్ వారి మద్దతుదారులుగా వుంటూ వారి కార్యనిర్వాహకులుగా ప్రభుత్వజఉద్యోగాల్లో భాగమై వుండటం) దీనితో ఒక్కసారిగా దేవదాసినుల జీవితాలు అనిశ్చితి లోకి నెట్టబడ్డాయి. వారు తమను పోషించగలిగే ‘పోషకులను’ వెతకడం మొదలెట్టారు. సహజంగా ఈ పోషకులు తమకంటే వయసులో చాలా పెద్దవాళ్ళు, ధనవంతులయిన అయ్యంగార్లు, ఆయ్యర్లు,వైశ్యులు. వీళ్ళు ముసలివారై చనిపోతే మళ్లీ ఇంకో పోషకుణ్ణి వెతుక్కోవడం. ఇలా కొంతమంది తమ జీవితంలో కనీసం ముగ్గురు పోషకుల్ని
 
మార్చినట్టు కథలో తెలుస్తుంది. దేవాదాసీల సంతానం తమ తండ్రి ఎవరో తెలిసినా బహిరంగపరచడానికి వీలులేదు. ఎందుకంటే ఇవన్నీ రహస్యసంబంధాలే. నాగలక్ష్మికి తనను ఎంతగానో ప్రేమించిన తండ్రి మరణవార్త నెలతరువాత తెలిసి చాలా దుఃఖిస్తుంది. బహుశా అప్పుడే తల్లివంటి జీవితం తనకు వద్దని గట్టిగా నిర్ణయించుకుంది.

నవలలో గమనించవలసిన అంశాలు కొన్ని


1. ప్రధాన పాత్రలైన మధురై స్కందకుముదవల్లి,

(ఎం.ఎస్.సుబ్బులక్ష్మి తల్లి మధురై షణ్ముగ వడివు అమ్మాళ్) కూతురు నాగలక్ష్మి జీవితాలలో జరిగిన కథను పక్కనున్న పాత్రలు వివరిస్తూ తమ జీవితగాథను కూడా చెబుతాయి. ఇది బైబిల్ శైలి కి దగ్గరగా వుందికదా! సువార్తలో క్రీస్తు జీవితం గురించి నలుగురు చెప్పినట్టు. (మూన్ స్టోన్ అనేఇంగ్ర్లీషు నవలలో ఈ శిల్పం వాడినట్టు కొందరు అన్నారు.నేను చదవలేదు) తెలుగులో యీ శైలిని వేరెవరూ వాడినట్టు నాకు తెలియదు.

ఈ శైలిని రచయిత గొప్పగా ఉపయోగించారు .

2. నవలమొత్తాన్ని ముప్పై మంది స్త్రీలు (ఎక్కువమంది కుముదవల్లి,నాగలక్ష్మి బంధు వులో, స్నేహితులో అయిన దేవదాసీలు తక్కిన వారు బ్రాహ్మణ స్త్రీలు) తమ తమ జీవిత గాథలను చెబుతూ తమకు తెలిసిన నాగలక్ష్మి కథను కొంత కొంత జోడించారు.

3.నవలలో స్త్రీ పాత్రలు మాత్రమే ప్రధానం. (నాగలక్ష్మి భర్త విశ్వనాథన్ పాత్ర మినహాయించి) దేవదాసీ కుటుంబాల్లో మగపిల్లవాడికి యే విలువా లేదు. పైగా ఆడపిల్ల పుట్టలేదని దుఃఖిస్తారు కూడా ఎందుకంటే ఇది ఒక చిత్రమైన మాతృస్వామ్య వ్యవస్థ. ఆడపిల్ల లేకపోతే వాళ్ళవంశం అంతరించి పోతుంది. మగవాళ్ళు “పూనాపం గాడు గానే బతకల్ల” నట్టువకార్లు గానో, ,పక్క వాయిద్యకారులుగానో జీవితం మొత్తం అక్కా లేదా చెల్లి పై ఆధారపడి బతకాల్సిందే. దేవదాసీ వ్యవస్థ లో పురుషులకు ఆస్థి హక్కు లేదు.(యీ వాక్యాలు నవలలో చదువుతున్నప్పుడు మన మనసుకు ఎంత హాయి అనిపిస్తుందో చెప్పలేను).

4. బ్రిటిష్ ప్రభుత్వం దేవదాసీ ఇనాములు రద్దు చేశాక క్రమంగా దేవదాసీల జీవితాలు ఎలా చితికి పోయాయో, ప్రత్యామ్నాయాన్ని వెతుకుతూ నాటకాలకో, సినిమాలకో అవసరమైనట్టు తమను తాము ఎలా మలుచుకున్నారో చూపింది. అక్కడ కూడా మోసానికి గురి అయిన/అయ్యే కొన్ని సందర్భాల ప్రస్తావనలూ వచ్చాయి.

5. కన్యాశుల్కం చదువుతున్నప్పుడు “యాంటీ నాచ్’ ప్రస్తావన నాకు అంత బాగా ఇంకలేదు. గురజాడ వెటకారం లోని తీవ్రత ఈ నవల చదువుతుంటే తెలిసింది. స్వాతంత్రోద్యమ కాలం నుంచి కూడా ద్వంద్వ ప్రమాణాలు పాటించే కాంగ్రెస్ మార్క్ నీచరాజకీయసంస్కృతిని బయటపెట్టింది. ఒకవైపు ‘యాంటీ నాచ్’ అని నిరసిస్తూనే కాంగ్రెస్ పార్టీ నిధులసేకరణకు దేవదాసీ కళాకారులను వాడుకునే అవకాశవాదాన్ని ఎద్దేవా చేసింది.రాజగోపాలాచారి సహా అనేక మంది హిందూ కాంగ్రెస్ వాదులు ఇందులో కనిపిస్తారు. మదరాసుకేంద్రంగా తీవ్ర మార్పులకు లోనైన వందఏళ్ల దక్షిణభారత సమాజచలనాన్ని దేవదాసీల కోణంలో వ్యాఖ్యానించిన నవల.

6.దక్షిణ భారతదేశంలో సంగీతం, నాట్యం ప్రధానంగా రెండే కులాల చేతుల్లో ఉండింది. ఒకటి దేవదాసీ, రెండు బ్రాహ్మణ గాత్రంలోనూ, సన్నాయి,డోలు వంటి మంగళవాయిద్య కారులుగాను ‘మంగలి కులం’ చేసిన కృషి కూడా నిరాకరించలేనిది, బహుశా సందర్భం కాకపోవడంతో నవలలో ఎక్కడా ప్రస్తావన రాలేదు) ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబాలలో స్త్రీలు కళలు నేర్చుకున్నా బహిరంగ ప్రదర్శన చేయరాదు. ఆలాచేసే బ్రాహ్మణ స్త్రీలపై చిన్నచూపు. ఎందుకంటే అది తక్కువ కులమైన దేవదాసీల పని. అంతే కాదు స్త్రీలు గాత్రంలో మనుధర్మాన్నే పాటించాలి.పురుషులకు మాత్రమే మనోధర్మాన్ని పాటించే హక్కు ఉంటుంది. గతకాలపు కట్టుబాట్లు పటిష్టంగా ఉన్న ఆనాటి స్ధితి బ్రిటిష వాడి ఆధునీకరణతో బీటలు వారింది. క్రమంగా బ్రాహ్మణులు కూడా బహిరంగకళా ప్రదర్శనలకు, కచేరీలకు వచ్చారు.ఇది సహజంగా అంతకు ముందు కళా రంగాన్నే నమ్ముకున్న దేవదాసీ వ్యవస్థతో అనివార్యఘర్షణకు దారితిసింది.

దేవదాసీల చేతుల్లో మైలపడిపోయిన ‘కళను ప్రక్షాళన’ చేయటమనే ‘ఉద్ధరింపు’పేరుతో దేవదాసీలతో బ్రాహ్మణవర్గం బహిరంగఘర్షణకు దిగింది. దీని వెనుక అసలు ఉద్దేశ్యం యీ కళలను పూర్తిగా తమ చేతుల్లోకి లాక్కొని ఆ కళలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడమే.

7.ఈ నవల సామాజిక ప్రతిఫలనమైన రాజకీయ మార్పులనూ అనివార్యంగా తడిమింది. 20వ శతాబ్దం ప్రారంభంలో తమిళనాట బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. నవల మొదలయ్యే కాలం కూడా ఇంచుమించు ఇదే కావటం కాకతాళియం కాదు. ఈ ఉద్యమాల ప్రభావమే1917 లో మొదలయిన జస్టిస్ పార్టీ. ఉద్యోగాలలో బ్రహ్మణేతరులకు తక్కువ ప్రాతినిధ్యం ఉండటాన్ని తీవ్రంగా నిరసించింది.

నటేశ ముడలియర్,ఈ వి రామస్వామి నాయకర్, పానగల్ రాజా, బొబ్బిలి రాజాల నేతృత్వంలో ఏర్పడింది.(తరువాత ఇదే ద్రావిడ ఖజగం గా మారింది).ఇందులో మనవాళ్ల పాత్ర కూడా ఉండటం తెలుగునేలపై బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపిన త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి వారికి ప్రేరణ కూడా అయివుండవచ్చు.
 
తరువాతి కాలంలో రామస్వామి నాయకర్ నాయకత్వాన జరిగిన ఆత్మగౌరవ పోరాటాలు ఊపందుకున్నాయి. దాని ఫలితమే ద్రావిడమున్నే ట్ర కజగం(డి. ఎం. కె)పార్టీ. మరోవైపు1954 లో భారత జాతీయ కాంగ్రెస్ లో నెహ్రూ అవలంబించిన సోషలిస్టు అనుకూలవిధానాలను సి.రాజగోపాలాచారి నేతృత్వం లోని సాంప్రదాయలిబరల్ హిందూశక్తులు వ్యతిరేకించి ‘స్వతంత్ర పార్టీ’ ఏర్పాటుచేసుకున్నాయి.
తెలుగునేలలో ఎన్. జి.రంగా, ప్రకాశంపంతులు దీని నాయకులు. హిందీ వ్యతిరేక ఉద్యమమూ, కాంగ్రెస్ దొంగవైఖరీ, భాషా ప్రయుక్త రాష్ట్ర విభజన కూడా నవలలో చిత్రించబడింది.

మధ్యయుగప్రభువులు,జమిందార్ల పార్టీ గా నెహ్రూచే అవహేళనకు గురియైన ఈ స్వతంత్ర పార్టీ క్రమంగా తన ప్రాభవం
కోల్పోయి 1974 లో కాంగ్రెస్ తో కలిసిపోయిన వైనం చాలా సహజ పరిణామమే ఎందుకంటే కాంగ్రెస్ అప్పుడు తను
దాచుకున్న హిందూ ముఖాన్ని బహిర్గతపరచింది.

8.నవలలో పాత్రగా నేరుగా రాకపోయినా ఆనేకచోట్ల ప్రస్తావన వచ్చిన పాత్ర ముత్తులక్ష్మీరెడ్డి. నారాయణస్వామిఆయ్యర్, దేవదాసీచంద్రమ్మాళ్ ల కూతురు. మద్రాసు పురుషుల మెడికల్ కాలేజీలో చదివిన మొదటి లేడీడాక్టరు,మొదటి మహిళా శాసనసభ్యురాలు,సంఘ సంస్కర్త.

సుందరరెడ్డి తో వివాహం తరువాత ముత్తులక్ష్మీ రెడ్డి అయ్యింది. దేవదాసీల జీవితాలుమార్చడానికి ఆమె సంస్కరణోద్యమంచేసింది.

కులపునాది బలంగావున్న భారతదేశం వంటి చోట సంస్కరణోద్యమాలు కూడా అగ్రవర్ణాల చేతిలో ఆయుధాలుగా మారి ఒక్కోసారి బాధితులను ఎలా కష్ట పెడతాయో నవలలో చూడవచ్చు.

సంస్కరణోద్యమాన్ని,దేవదాసీరద్దు చట్టాన్ని అడ్డుపెట్టుకొని మదురైలో దేవదాసీలకు కట్టుబాటుగా న్యాయంగా రావాల్సిన రాబడిని, ప్రివిలేజెన్ నీ కూడా పూజారి వర్గం,గుడి యాజమాన్యం నిరాకరిస్తుంది.

9.అప్పటికే నాగలక్ష్మి గాయనిగా పేరు తెచ్చుకుంది. నాలుగు సినిమాల్లోనూ నటించింది. (మళ్లీ సుబ్బులక్ష్మి పోలికే) గాయనిగా సంగీతం లోనే స్థిరపడాలనుకొని తనకంటే వయసులో చాలా పెద్దవాడైన,తనతో పోల్చితే ఏమాత్రం ప్రాధాన్యత లేని విశ్వనాథన్ ను రెండో పెళ్లిగా ఎందుకు ఎంచుకుంది ?
 
పిల్లలు పుట్టకుండా అతను ఆపరేషన్ చేయించు కున్నా మౌనంగానే వుంది. మొదటిభార్య పిల్లలనే తన పిల్లలనుకునేంత ప్రేమగా సాకింది.

హిందూ బ్రాహ్మణ స్త్రీగా సంపూర్ణ పరివర్తన చెందింది.

యీ పరివర్తనను పురిగొల్పిన అంశాలేవి ? యీపరివర్తన లో ఆమె ఏమి ఆశించింది? ఏమి పొందింది? నవల చదవండి.

నా పరిశీలన యిది కాదు.

తన పునాదిని ప్రశ్నించని, సవాల్ చేయనియే దళితుడినైనా, మైనారిటీనయినా హిందూమతం నెత్తినపెట్టుకుంటుంది. ఇబ్బంది పెట్టని పై పై విషయాలు ఎన్ని మాట్లాడినా పట్టించుకోదు. అందుకు ఉదాహరణ ఎం.ఎస్.సుబ్బులక్ష్మి అబ్దుల్ కలాంలు. అవసరం కోసం వారిని భారత జాతీయతకు నమూనాగా కూడావాడుకుంటుంది.

సూటిగా వివక్షను దాని భూమికను ప్రశ్నించే వాళ్ళు ఎంత మేధావులైనా వారి వునికినే నిరాకరిస్తుంది. ఒక్కోసారి మనిషినీ నిరాకరించవచ్చు. ఉదాహరణ గౌరీ లంకేష్, కలబుర్గి, తేల్తుంబే.

పైకి ఎంత సహనం, శాంతి గురించి ప్రవచించి ప్రవక్త రూపంలో కనిపించినా సారంలో అది స్వచ్చ,ప్రజాస్వామ్య భావనలను
నిరాకరిస్తుంది. హింసను ఆచరిస్తుంది.

10. ఇంత పెద్దనవలలో ఒక వ్యక్తి జీవితాన్ని పలువురు చెప్పడం వల్ల కొన్ని వాక్యాలు అక్కడక్కడా పునరుక్తి అనిపించవచ్చు. అది ఈ శిల్పానికి ఉన్న పరిమితి. ఒక అధ్యాయం నుంచి ఇంకోదానికి మారే ప్రతిసారి కాలమో,రచయితో చెబుతున్నట్టు పది వాక్యాల ‘లింకు,’ దానివెంటనే ఆ పాత్రను తెరమీదికి తెచ్చే “ఇంట్రో ‘ వాడాడు రచయిత. రెండు అధ్యాయాల తరువాత నేను ఆ రెండూ తీసేసి నేరుగా చదువుకుంటూ పోయాను. కథను అర్ధం చేసుకోవడం లో నాకు ఏ ఇబ్బందీ కలగలేదు. వాటి అవసరం లేదనిపించింది నాకు.

గమనిక: యీ నోట్సు ఆనాటి సమాజ పరిశీలనకు మాత్రమే పరిమితం. సాహిత్యచర్చ, శిల్ప చర్చ, సంగీత ప్రస్తావనల మంచిచెడ్డలు దీని పరిధిలోకి తీసుకొనలేదు.

గానంలో గానీ, నాట్యంలో గానీ ఒక్కో కళాకారుడి మనోధర్మం ఒక్కోలా వుంటుంది.ఆ కళలో తాదాత్మ్యం చెందినపుడు కళాకారుడు పొందే రసానుభూతి ఆనందానికి ఉన్నతశిఖరం.

“గొంతు అంటే అదికూడా శరీరం లో భాగమే గదా!గొంతు విప్పారాలంటే శరీరం విప్పారాలి”
 
స్తీ పురుషులు సంగమంలో శరీరాలను పూర్తిగా విప్పార్చుకుని ఆనందపు అంచులు తాకినట్టు కళాకారుడు తన శారీరాన్నీ, మనసునూ విప్పార్చుకుని గానం చేసినప్పుడే ఆ తాదాత్మ్యత సిద్ధిస్తుంది.

Leave a Reply