1. బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చాక తెలుగు ప్రాంతాల్లోని కొందరు వామపక్ష మేధావులు కూడా మమతకు జేజేలు పలుకుతున్నారు. ఈ విషయం వింటే మీకేమనిపిస్తోంది?
ఇది ప్రతిచోటా జరుగుతోంది. బిజెపి వ్యతిరేక శక్తులన్నీ ఇప్పుడు ఆమెను ఎంతో గౌరవంతో, ఆపేక్షతో చూస్తున్నాయి. ఈ ఎన్నికల విజయం ఆమెను ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యమైన వ్యక్తిగా మార్చింది అనడంలో సందేహం లేదు. కొంతమంది ‘వామపక్ష’ మేధావులు మమతకు జేజేలు పలుకుతున్నారు లేదా జనాకర్షణ పొందిన రాజకీయాలను ముందుకు వెళ్ళే అంతిమ మార్గంగా సిద్ధాంతీకరించడం కొత్తేమీ కాదు. బెంగాల్లో చాలా మంది ‘వామపక్ష ’ మేధావులు నిజమైన “అట్టడుగు వర్గాల (సబల్టర్న్)” పార్టీగా టిఎంసిని చూస్తున్నారు. కాబట్టి మమత రాజకీయాలను ఆశ్రయంగా భావించే ప్రజాస్వామిక వామపక్ష మేధావులు నాకు ఆశ్చర్యం కలిగించరు.
2. పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టు మేధావులు దీదీని ఏ లెవల్లో పొగుడుతున్నారు?
నాకు తెలిసినంతవరకు విప్లవకర మేధావులు ఆమెను ప్రశంసించడం లేదు. కొంతమంది ML శక్తులు, వారి మేధావులు మమతకి మార్గదర్శకులుగా మారినప్పటికీ, విప్లవ శిబిరంలోని ప్రతి ఒక్కరూ ఆమె అభిమాని కాదు. అయితే, బిజెపి ఓడిపోయిందని వారు ఉపశమనం పొందుతున్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలోనూ బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేయాలని బెంగాల్‌లోని మేధావి ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. వారు బిజెపి ఓటమిని ఆనందిస్తున్నారు, అయితే వారంతా దీదీని ప్రశంసిస్తున్నారని కాదు. మమత ఎప్పుడూ కూడా హిందీ-హిందూత్వ దురాక్రమణకు వ్యతిరేకంగా, బెంగాలీ ప్రాంతీయవాద భావన కోసం నిలబడిందనే సంక్లిష్ట పరిస్థితి వల్ల ఆమెను బిజెపితో కలిపేయడం అంత సులభం కాదు. సిపిఎం ఈ తప్పుడు రాజకీయాలను ప్రోత్సహించడానికి ప్రయత్నించినప్పటికీ అది ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉంది.
3. ఇంతకూ మన మేధావులన్నట్లు ఇప్పటికి మమతను ఫాసిస్టు వ్యతిరేక వీరయోధురాలంటే మీరంగీకరిస్తారా?
ఫాసిజాన్ని, ప్రపంచ నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ సంక్షోభపు రాజకీయ వ్యక్తీకరణగా నేను అర్థం చేసుకుంటే కనక, ఖచ్చితంగా మమతా ఫాసిస్ట్ వ్యతిరేకి కాదు. బిజెపి మత రాజకీయాలను ఫాసిజంతో గుర్తించడమనేది ప్రాథమికంగా తప్పు. మతతత్వం అనేది కేవలం ఒక ఎత్తుగడ, ప్రైవేటీకరణ, లాభ దోపిడీ ద్వారా నయా వలసవాద, నయా ఉదారవాద విధానాలను అమలు చేయడానికి ఒక దూకుడు ఎత్తుగడ మాత్రమే. కాబట్టి అధికారంలోకి వచ్చిన రోజు నుండే కార్పొరేట్ ప్రయోజనాలకు సేవ చేయడానికి హర్తాల్, సమ్మెలను వ్యతిరేకించిన, అనేక మంది ప్రజాస్వామ్య కామ్రేడ్లను UAPA కింద జైలులో పెట్టిన , అత్యాచార బాధితురాలిని నిందించిన, అనేక మంది ప్రతిపక్ష కార్యకర్తలను కొట్టించిన, హత్య చేయించిన, కట్-మనీ- (కట్ మనీ అంటే స్థానిక రాజకీయ నాయకులు స్థానిక ప్రాంత ప్రాజెక్టులకు ప్రభుత్వ నిధులను ఆమోదించడానికి వసూలు చేసిన అనధికారిక కమిషన్ – కాబట్టి ప్రభుత్వ శాఖ ఇచ్చిన మొత్తం డబ్బును ‘కట్’ చేయడంవల్ల ఈ పేరు పెట్టారు.) లంపెన్ పాలనల మధ్య సంబంధాన్ని సృష్టించిన మమత ఫాసిస్ట్ వ్యతిరేకి కాదు. కానీ ఖచ్చితంగా ఆమె ధైర్యస్థురాలు.
4. మొత్తంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలను మీరు ఎట్లా విశ్లేషిస్తారు?
బిజెపి తన మత సూత్రాన్ని బెంగాల్లో అమలు చేయడంలో విఫలమైంది. NRC-CAA వారికే తిప్పికొట్టింది. బెంగాల్లో తమకు గొప్ప ప్రభావం ఉందని చూపించడానికి బిజెపి ప్రయత్నించింది, అయితే నిజం ఏమిటంటే వారికి పోలింగ్ బూత్ స్థాయి నిర్మాణం లేదు. ఎన్నికల పనుల కోసం ప్రజలను బాడుగకు కుదుర్చుకోవాల్సి వచ్చింది. సంక్షేమ పాలనగా అత్యంత ఆసక్తికరమైన జనాకర్షణ పొందిన రాజకీయాలను తృణమూల్ పోషించింది. ఉచిత రేషన్, ఉచిత ఆరోగ్య వ్యవస్థ, ఒక వ్యక్తి పుట్టుక నుండి మరణం వరకు, మరణం తరువాత కూడా వివిధ భత్యాలు మొదలైనవి కార్మిక, పేదవర్గాలలో మమతకు ప్రాచుర్యాన్ని పెంచాయి. బిజెపిని తన కేంద్ర శత్రువుగా ఉంచడమనే రాజకీయ వ్యూహమే టిఎంసి శక్తిని పెంచింది. విశ్లేషణలో పొరపాటు, తప్పుడు రాజకీయాల కారణంగా వామపక్ష కాంగ్రెస్ కూటమి భ్రష్టుపట్టిపోయింది.
5. బీజేపీ 77 సీట్లు సాధించడానికి వెనుక నెట్ వర్క్ ఏమిటి? ప్రజల అవగాహన, మానసిక స్థితి ఎలా పని చేశాయి? ఇది మమతా బెనర్జీ పాలనపట్ల రియాక్షనా? లేక మతతత్వానికి ఆ మేరకు సానుకూలత పెరిగిందనుకోవాలా?
బెంగాల్లో సుదీర్ఘకాల ఓటుప్రక్రియ ద్వారా బిజెపికి ఎక్కువ సీట్లు రావడానికి ఎన్నికల సంఘం సహాయపడింది. ఒక సెక్షన్ మమతకు వ్యతిరేకంగా ఓటు వేసింది, ఆ ఓటు బిజెపికి వెళ్ళింది అనేది వాస్తవం. వారిలో చాలా మంది గతంలో వామపక్ష ఓటర్లేనని క్షేత్రస్థాయి సర్వేలో తేలింది. అయితే కొన్ని ప్రాంతాలలో మత విభేదాల్ని కలిగించడంలో బిజెపి, ఆర్ఎస్ఎస్లు సఫలమయ్యాయి. మత ఘర్షణల వల్ల మాత్రమే అది జరిగింది, ఆ ఘర్షణలను సంబాళించినప్పుడు, అవి కొంతవరకు తటస్థమయ్యాయి. ఈ మత సంస్థలు మరింత మత ఉద్రిక్తతలు, అల్లర్లను సృష్టించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నాయి.
6. మతతత్వానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా ఈ ఎన్నికలను చూస్తున్నారు కదా? ఇంతకూ గ్రౌండ్ రియాలిటీ ఏమిటి?
అలా ఎంత మాత్రమూ కాదు. ఆర్ఎస్ఎస్ తదితర హిందుత్వ సంస్థలు సృష్టిస్తున్న మత చైతన్యాన్ని సమతుల్యం చేయడానికి మమతా మృదువైన-హిందుత్వ తురుపు ముక్క పాత్ర పోషిస్తుంది. వాస్తవానికి ఆర్ఎస్ఎస్ సభ్యులుగా వున్నవారు చాలా మంది టిఎంసి అభ్యర్థులుగా ఈసారి గెలిచారు. కాబట్టి టిఎంసి ఒక లౌకిక శక్తి కాదు, ఇది అన్ని రకాల మత భావాలను సమతుల్యం చేయడం ద్వారా రాజకీయ అధికారాన్ని కోరుకునే లంపెన్ బలగం.
7. ప్రజా ప్రత్యామ్నాయం లేని కాలంలో ఎన్నికల పరిధిలో ఈ ఫలితాలను మీరు ఎలా అంచనా వేస్తున్నారు?
తక్కువ చెడు గెలిచింది. మతతత్వ ప్రభుత్వం తమ వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోదని లేదా నిర్బంధ శిబిరాలకు పంపడం ప్రారంభించదని ప్రజలు కనీస ఉపశమనం పొందారు. కానీ రాజకీయ హింస ఎలా వుండిందో అలాగే వుంటుంది. ప్రజాస్వామిక ఉద్యమాలు అణచివేయబడతాయి, కేంద్ర ప్రభుత్వం చేసే ప్రతిదాన్ని మాటల్లోనే వ్యతిరేకిస్తుంది తప్ప తరువాత అమలు చేస్తుంది. అయితే, ఈ ఎన్నిక మమతా బెనర్జీకి ఒక కొత్త అవకాశాన్నిచ్చింది, ఆమె ఇప్పుడు జాతీయ స్థాయిలో, ప్రధానమంత్రి అవడం కోసం తయారీ చేస్తుంది.
8. ఎన్నికల రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక దేశవ్యాప్త ఫ్రంట్‌కు ఈ ఫలితాలు ఊతం ఇస్తున్నాయనే వాదన ఉంది. నిజంగానే అది ఫలిస్తే కేంద్రంలో బీజేపీని మార్చే వ్యూహవుతుందా? లేక ఫాసిస్టు వ్యతిరేక వ్యూహమవుతుందా?
కాంగ్రెస్ మినహా ప్రస్తుత పరిస్థితిలో బిజెపి వ్యతిరేక శక్తులన్నీ ప్రాంతీయ శక్తులు. వారు 2015 నుండి ఇటువంటి అఖిల భారత బిజెపి వ్యతిరేక ఫ్రంట్ కోసం సన్నద్ధమవుతున్నారు, కాని వారిలో వారికి వున్న గొడవల వల్ల అది ఎప్పటికీ విజయవంతం కాదు. నాకు తెలిసినంతవరకు ఈ పార్టీలన్నీ కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత క్రమశిక్షణ కలిగినవి కాదు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు ప్రత్యామ్నాయం పట్ల ఆశను కలిగిస్తాయి, కాని జాతీయ స్థాయిలో తన సామర్థ్యాన్ని ఇంకా రుజువు చేయాల్సి వుంది.
9. మమత వీలైనంత కాలం అటు కాంగ్రెస్‌తో, బీజేపీతో కూడా చెలిమి చేసింది కదా. ఆమెలో మతతత్వ వ్యతిరేకతను ఎలా అంచనా వేయవచ్చు?
ఎవరైనా సరే తనకు ఉపయోగపడిన ప్రతి ఒక్కరితోనూ మమత గతంలో స్నేహంగా ఉండేది. ఇప్పుడు ఆమె పరిపాలనాలో వుంది, కానీ ముఖ్య విషయాలలో ఆమె ప్రభుత్వానికి, కేంద్రంలో బిజెపి ప్రభుత్వానికి మధ్య సాధారణ అవగాహన, సంప్రదింపులు ఉన్నాయి. జనాకర్షణ పొందిన రాజకీయంగా, సంవత్సర పొడవునా వచ్చే ప్రతి మతపరమైన వేడుకలలో పాల్గొంటుంది ఆమె ఆచరిస్తుంది. (She practices the populist politics of all year celebration of every religious ceremony.) ఆమె మత వ్యతిరేకి కాదు, ప్రభుత్వ యంత్రాంగాన్ని అస్థిరపరుస్తాయి కాబట్టి మతపర రాజకీయాలకు వ్యతిరేకం.
10. మౌలికంగా కేంద్రంలోని పాత కాంగ్రెస్, బీజేపీ, ఒకప్పుడు పశ్చిమ బెంగాల్లో సీపీఎం ఆర్థిక విధానాలకు మమత విధానాలకు ఏమైనా తేడా ఉ౦దా?
అదానీ-అంబానీలకు బిజెపి సేవ చేస్తుంది, నియోటియా-గోయెంకా-డాల్మియా లాంటి వ్యతిరేక పెట్టుబడిదారుల లాబీ ద్వారా మమతకు నిధులు సమకూరుతాయి. ప్రైవేటీకరణ, అమ్మకాలలో బిజెపి దూకుడుగా వ్యవహరించడం తప్ప, వారి ఆర్థిక విధానాలలో తేడా లేదు. మమత అదే చేస్తుంది కానీ నెమ్మదిగా, తక్కువ దూకుడుగా చేస్తుంది. విభజించు, ఆనందించు అనేది TMC ఆర్ధిక నీతి, దోపిడీ చేసిన సంపదను అన్ని స్థాయిల కార్యకర్తలు, నాయకుల మధ్య పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నందున అది ప్రాచుర్యం పొందింది. ప్రతి ఒక్కరికీ కొంత దొరుకుతుంది. కానీ బిజెపి బాగా ఖచ్ఛితంగా నియంత్రిస్తుంది, లాభాన్ని నేరుగా పెట్టుబడిదారీ దొరలకు అందిస్తూ, క్షేత్ర స్థాయి కార్యకర్తలను మతోన్మాద హిందుత్వ ఆలోచనలలో నిమగ్నమయేట్లు చేస్తుంది. కానీ చివరికి అన్ని పాలకవర్గ పార్టీల్లాగానే, ఇది కూడా అర్ధ భూస్వామ్య నిర్మాణ అవశేషాలను నిలబెట్టడానికి ప్రయాసపడుతోంది.
(సౌరవ్ బెనర్జీ బెంగాల్ నుండి వెలువడే ‘Towards A New Dawn’ పత్రికా సంపాదకులు)