యాప నారాయణ హరిభూషణ్‌గా ఎదిగిన క్రమం మనసు తెరమీద రూపు కడుతున్నది. మానుకోట దొరల గడీల చుట్టూ మర్రి ఊడల కింద మొలిచిన గడ్డి మొక్కలు ఆంబోతులను బంధించిన ముకుతాళ్లలో బిగిసిన పిడికిళ్లు గుర్తుకొస్తున్నాయి. ఆదివాసి జీవితం ఒక విప్లవ పాఠశాల అయిన క్రమం వరంగల్‌ ఆర్ట్స్‌ సైన్స్‌ కాలేజీ విద్యార్థిగా జ్ఞానం అంటే రాడికల్‌ మార్పు అని నేర్చుకున్న  చదువులు. అప్పటి అధ్యాపకులు అందరు ఆ విద్యార్థుల దగ్గరే నేర్చుకున్నామన్నారు. సమాజాన్ని చదువుకోవడం. 

ఖమ్మం జిల్లాలో చేపట్టిన విప్లవోద్యమ విస్తరణ,  తెలంగాణా మీదుగా దండకారణ్యం దాకా రెండడుగులు నాలుగు అడుగులుగా నడిచింది. రెండు గుండెలు ఒక దండోరాగా ఒక తుడుం దెబ్బగా మోగింది. 

నాకెపుడో నలభై ఏళ్ల కింద మామిడాల హరిభూషణ్‌ మాత్రమే సన్నిహితంగా, ప్రత్యక్షంగా తెలుసు. ఆ పేరు పెట్టుకున్న భూషణ్‌ల లొంగుబాటుల సంగతి ఎందుకు గాని తెలంగాణ ప్రజల హృదయాకాశంలో నా పాలిటి భరతపక్షవి నీవు. వినడము చదవడమే కాని నిన్ను ఎప్పుడూ చూసింది లేదు. నీ అమరత్వంలో తప్ప. జీవితమంతా నీ విప్లవాచరణ వ్యక్తీకరణలో తప్ప. నిషిద్ధ రాజకీయాలకు ఒక ప్రతీకవయ్యావు.

ఎంత కంగు తినిపించావు శతృవుని. ప్రజా యుద్ధాన్ని ఎన్ని ఫ్రంట్‌లలో తెరిచావు. ఎన్ని చెరువుల నీళ్లు తాగించావు శతృవుకు. గ్రేహౌండ్స్‌ సిఆర్‌పిఎఫ్‌ గాలింపులు ఎన్‌ఐఏ, ఎస్‌ఐబి నిఘా నేత్రాలు ఎన్ని దాడలు, ఎన్ని ఎదురుదాడులు ఎన్ని అంబుష్‌లు, ఎన్ని ఎన్‌కౌంటర్‌లు. పూజారి కాంకేర్‌లు, పువ్వర్తులు. నువ్వు తెలంగాణ కార్యదర్శిగా ఉన్నంతకాలం అన్నీ ఆపరేషన్‌ హరిభూషణ్‌లే. ప్రతి ఎన్‌కౌంటర్‌ నీకో పునర్జన్మనిచ్చింది. 

పోలవరం విద్యార్థుల పాదయాత్రలో బుడి బుడి అడుగుల వివేక్‌ ప్రజాస్వామిక తెలంగాణ స్వప్నంలో నీ ఆచరణ చూశాను. నువ్వే కదూ ప్రవేశపెట్టావు ఏటూరు నాగారం అడవుల్లోకి ఆదివాసి ఆకాంక్షల సాగర ఘోష, విప్లవ స్మృతిని, శృతి చితిలో రగిలిన ప్రజాస్వామిక ఆక్రోశం. ఒక ఆకాంక్షలోని ఎంత ఉవ్వెత్తున్న ఎగిసింది నిషిద్ధ రాజకీయాల నిజ స్వభావం. ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాలను రుజువుచేసి పోయావు. 

ఇది అన్నింటిలోకి దుర్మార్గమైన ఎన్‌కౌంటర్‌. ప్రపంచ పాలకవర్గాల కుట్రలో భాగమైన ఎన్‌కౌంటర్‌. విప్లవ దండకారణ్యంపై గ్లోబల్‌ వైరస్‌ దాడి. మధుకర్‌, గంగన్న, కత్తి మోహన్‌రావు, సారక్కల దాక. ఇదీ ఆపరేషన్‌ హరిభూషణే. భూస్వాముల దాడులు తప్పుకొని  అగ్రవర్ణాల అత్యాచారాలు, హత్యాకాండలు తప్పుకొని ఎన్నో ఎన్‌కౌంటర్‌లలో తృటిలో తప్పించుకొని టైగర్‌లు, కోబ్రాలు, సాల్వాజుడుంలు, కమెండోలు అన్నింటిని అధిగమించి, అన్ని అభియాన్‌లు, సమాధాన్‌లు, ప్రహార్‌లు, నిర్బంధాలు, నిషేధాలు తలల మీద వెలలు భూమి నా తల వెల కట్టమని ధిక్కరించి మీ ఆఖరి పోరాటంలో సామ్రాజ్యవాద వైరస్‌ ఎన్‌కౌంటర్‌లో ఆశ్చర్యం కదూ. అడవిలో ఆక్సిజన్‌ కరువై విధ్వంస కరోనాకు బలయ్యారు. శతృవు చికిత్స ప్రలోభ గాలాలకు చిక్కని ప్రజల్లోని చాపలు మీరు. శతృవెంత అప్రతిభుడయ్యాడు. అవార్డులు దక్కలేదు, ప్రమోషన్‌ల అత్యాశ తీరలేదు. ప్రతీకారేచ్ఛ‌ వాళ్లనే పల్లార్చింది. రెండు రోజులు కంఠశోషతో నీ మరణవార్త చెప్పిన పోలీసుల నోటితో నీ అమరత్వాన్ని వినదల్చుకోలేదు ప్రజలు, విప్లవాభిమానులు రక్తబంధువులు నువ్వు నేల మీద కళ్లు తెరిచి వర్గ బంధువుల మధ్యన వర్గ పోరాట యుద్ధ క్షేత్రంలో యోధుల్లాగా అంత్యక్రియలు జరుపుకున్నారు. 

మీకు జల్‌ జంగల్‌ జమీన్‌లను విముక్తం చేసేదాకా అడవిలో నీ రక్తంతో విత్తిన విత్తనాలను విప్లవ ఫలాలుగా హామీ పడిపోయారు.

సిద్దబోయిన సారక్క – సమ్మక్క సారక్కల వారసురాలు ` మేడారం పక్కనే నీ పుట్టిన ఊరు కాల్వపల్లి చూశాను. ఏటూరు నాగారం, తాడ్వాయిల నుంచి గోదావరి తీరాన ములుగు దాకా విప్లవాన్ని విస్తరించిన అమరుడు బడే నాగేశ్వరరావు నేరుగానే కాదు పన్నెండు మంది విప్లవ మహిళల స్మారక స్థూపం నిర్మించుకున్న గ్రామంగా. నీ ముప్పై ఏళ్ల విప్లవ ప్రస్తానంలో ఇరవై తొమ్మిదేళ్ల కత్తి మోహన్‌ రావు సహచర్యం. కొడుకు అభిషేక్‌ విప్లవంలోనే గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్‌. ఇంద్రావతి ఏరియాలో జనతన సర్కార్‌ బడి బాధ్యతలు.

విప్లవమే మీ శ్వాస, ధ్యాస. విప్లవమే జీవితంగా అమరులైన మీ అందరికి ఇవే వినమ్ర జోహార్లు.

Leave a Reply