ఆ క్షణం ఎప్పటికీ మరువలేనిది
పాల కోసం తల్లడిల్లుతున్న 
ఆ బిడ్డను చూసి
పాలకై తన రొమ్ములను 
ఎగేసి గుద్దుకున్న 
ఆ క్షణం ఎప్పటికీ మరువలేనిది

రాజ్యం నేరస్తులను 
సత్ప్రవర్తనతో రిలీజ్ చేసినప్పుడు
"బిల్కీస్ బానో" మనోవేదనకు కారణమైన 
ఆ న్యాయస్థాన అన్యాయాన్ని
కన్నీళ్ళతో లెక్కించిన నిస్సహాయపు
ఆ క్షణాల్ని ఎలా మరువగలం?

ఓ నినాదం
మన మస్తిష్కంలో 
మతాన్ని బోధిస్తున్నప్పుడు 
ప్రజలంతా మానవత్వాన్ని మరిచి 
మతానికై పరుగులు తీస్తున్నప్పుడు
"బార్బీ మసీదు"లను కూలగొడుతున్నప్పుడు
న్యాయం అన్యాయాన్నే
మరలా అనుసరించినప్పుడు 
టీవీల ముందు కండ్లల్లో ఒత్తిడేసుకుని
మనమంతా నోరు మెదపకుండా చూస్తున్న
మతస్వార్థ మానవత్వపు 
ఆ క్షణాల్ని మనం ఎలా మర్చిపోగలం?

మహిళల హత్యల వెనక
రాజకీయం ఉందన్న విషయం
మనకు తెలిసినప్పుడు
ఆ రాజకీయంలో కులం 
పునాదులు ఉన్నాయన్నప్పుడు
కులాన్ని బట్టి న్యాయం జరుగుతున్నప్పుడు
"టేకు లక్ష్మి మానస" నుండి
"మూడు సంవత్సరాల పసిపాపల"పై 
గాయాలను నిజానికి
ఎప్పటికీ మరువలేము,

అక్షరమే ఆయుధమై
గళం ఎత్తి ప్రశ్నించినప్పుడు
అక్షరాల అణుబాంబులను 
మనము కురిపించినప్పుడు
ప్రశ్నించిన వారిపై,
ఒక "పీడీ యాక్ట్"
ఒక "ఊపా"
ఒక "అర్బన్ నక్సలైట్" అని
జైలు గోడల రుచిని చూపిస్తున్న
ఈ రాజ్యపు రాజకీయ కుట్రలకు
బలవుతున్న సంఘటనను
మనం ఎదుర్కొంటూ నిట్టూర్పిడిచిన
ఆ క్షణాలు ఎప్పటికీ మరువలేనివి,

తగిలిన గాయాలను
మానిన గాయాల అనుభవాలను
మళ్ళీ పురుడు పోసుకుని కదులు....
చర్చబడ్డ చెల్లెల్ల కోసం,
అవమానించబడ్డ అక్కల కోసం,
ఆకలి పేగులను మోస్తున్న
అమ్మల కోసం,పసి పాపల కోసం..
మరువలేని పోరాటం చేయ్!
మరుపురాని అమరుల
త్యాగాల బాటలో
నడుస్తూ....
మరువలేని పోరాటం చేయ్.

Leave a Reply