పారిశ్రామిక విప్లవం ప్రారంభ దినాల్లో శ్రామికులు బానిసల్లా శ్రమిస్తూ ఉండేవారు. ఆనాడు శ్రమ జీవులపై పనిభారమే కాక పని గంటల భారం కూడా అధికంగా ఉండేది. వారు రోజూ 16 గంటలు శ్రమించేవారు. కొంత మంది పెట్టుబడి దారులు కార్మికులచేత రోజూ 20 గంటలు కూడా పని చేయించేవారు. పారిశ్రామికాధిపతులు శ్రమజీవులకు అతి తక్కువ జీతాలు ఇచ్చేవారు. ఆనాడు ఫ్యాక్టరీలలో శ్రామికులకు ఎటువంటి భద్రతగానీ, సౌకర్యాలుకానీ ఉండేవి కావు. ఫ్యాక్టరీలలో గాలి, వెలుతురు వంటి కనీస సౌకర్యాలు కూడా ఉండేవి కావు. కార్మికులకు యంత్రాల నుండి రక్షణ ఉండేది కాదు. అందుచేత తరచుగావారు ప్రమాదాలకు గురై మరణిస్తుండేవారు. కార్మికులు అమానుష శిక్షలకు కూడా గురౌతుండేవారు. వారు కదలినా, పాటలు పాడుకున్నా, ఒళ్ళు కడుక్కున్నా జరిమానా కట్టవలసి వచ్చేది. ఈ బాధలనుండి బయట పడటానికి, సంఘటితం కావడానికి పోరాటమే ఏకైక మార్గమని అర్థం చేసుకున్నారు.

చికాగో కార్మిక వర్గం ‘8 గంటల పని దినం సంఘం’ ఒకటి అనేక రాజకీయ దృక్పథాలు కలిగిన వారితో ఏర్పాటు చేసింది. ఆ సంఘం నాయకత్వంలో మే 1వ తేదీకి ఒక రోజు ముందు 25 వేల మంది కార్మికులతో బ్రహ్మండమైన ప్రదర్శన జరిగింది. మే 1వ తేదీన చికాగో నగరంలో వెల్లివిరిసిన కార్మిక చైతన్యానికి అంతులేదు. నగర వీధులన్నీ ఉత్సాహవంతులైన కార్మికులతో నిండిపోయాయి. నగరంలో బ్రహ్మండమైన సార్వత్రిక సమ్మె జరిగింది. కర్మాగారాలన్నీ మూతపడ్డాయి. అదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని ఐకమత్యంతో మూడున్నర లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. నగర వీధులన్నీ కార్మిక సందోహంతో నిండిపోయాయి. 8 గంటల పని దినాన్ని సాధించి తీరుతాం అనే దృఢ విశ్వాసం వారందిరలోనూ కొట్టవచ్చినట్లు కనిపించింది. కార్మిక వర్గ శత్రువులు విజృంభిస్తున్న ఈ కార్మిక ఉద్యమాన్ని ఏ విధంగానైనా నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. పెట్టుబడిదారీ వర్గానికి అండగా ప్రభుత్వం కూడా రంగప్రవేశం చేసింది.

మే 3వ తేదీన కార్మికుల రక్తాన్ని కండ్ల జూడటానికి అమెరికన్ పోలీసులు నిర్ణయించుకున్నారు. ఆ రోజున శాంతియుతంగా సమ్మె సాగిస్తున్న కార్మిక జన సమూహంపై పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురి ప్రాణాలను బలిగొన్నారు. ఈ దారుణ హత్యాకాండ పట్ల నిరసన తెలిపేందుకు 4వ తేదీన చికాగో నగరం మధ్యలో ఉన్న హేమార్కెట్లో కార్మికులు పెద్ద నిరసన సభ జరిపారు. ప్రశాంతంగా జరుగుతున్న ఆ సభ మీద పోలీసులు విరుచుకు పడ్డారు. మధ్యలో ఒక బాంబు ప్రయోగం జరిగింది. ఒక పోలీసు సార్జెంట్ చనిపోయాడు. అది సాకుగా తీసుకొని పోలీసులు నిరాయుధులైన ప్రజలపై తుపాకులతో, సన్నీలతో స్వైర విహారం చేశారు. ఐనప్పటికీ నిరాయుధులైన కార్మికులు సంఘటితంగా చైతన్యదీప్తితో పోలీసులతో బాహాబాహీగా తలపడ్డారు. ఆ ఘర్షణలో 7గురు పోలీసులు, 4గురు కార్మికులు చనిపోయారు. పాలకవర్గం అదనపు బలగాలను రంగంలోకి దించింది. హే మార్కెట్ ప్రాంతం కార్మికుల రక్తంతో తడిచిపోయింది. అక్కడే ఆవిర్భవించింది ప్రపంచవాప్తంగా ఉన్న కోట్లాది శ్రమజీవుల స్వేచ్ఛా సంకేతమైన అరుణపతాకం.

24 గంటల్లో 8 గంటలు పరిశ్రమలో పనిచేయడానికి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవడానికి, మరో 8 గంటలు భార్యా పిల్లలతో గడపటానికి ఉండాలి, శ్రమకు తగ్గ ఫలితం కావాలనీ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనీ, కార్మికులపై యాజమానుల దోపిడీ, దౌర్జన్యాలు, అణచివేతలు ఉండకూడదని కార్మికులను కట్టు బానిసలకంటే హీనంగా చూసే దుర్మార్గపు ఆలోచనలు నశించాలనీ డిమాండ్ చేస్తూ, ఆనాడు కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసింది.

ఆనాటి చికాగో కార్మికుల పోరాట తెగువను, స్ఫూర్తిని నేడు మనం అందుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత ప్రభుత్వం 8 గంటల పని దినం స్థానంలో 12 గంటల పని విధానాన్ని తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని మళ్ళీ ఒకసారి బానిస శ్రమలోకి నెట్టాలని చూస్తున్నది. నరేంద్రమోడీ ప్రభుత్వం మతోన్మాద ఫాసిస్టు విధానాలు అమలుచేస్తూ, కుల మత ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ, ప్రజలమధ్య అసమానతలు పెంచి పోషిస్తున్నది. కరోనా కష్టకాలంలో వేలాది మంది వలస కార్మికుల కాళ్ళు పచ్చి పుండైన దృశ్యాన్ని చూసి దేశం చలించిపోయింది. అలసి సొలసి రైల్వే ట్రాకుల మీద నిద్ర పోయినవారు శాశ్విత నిద్రలోకి జారుకున్న ఘటనలు కలచివేశాయి. దేశంలో ఎంత మంది వలస కార్మికులున్నదీ కేంద్రానికి కూడా తెలియదు. ఏ రాష్ట్రం నుండి ఎంత మంది వచ్చిందీ, వాళ్ల బ్రతుకులు ఎలా ఉన్నదీ, రాష్ట్రాలకు పట్టదు. పని వెతుక్కుంటూ వచ్చినవారు తిరిగి ప్రాణాలతో ఇండ్లకు చేరతారన్న నమ్మకం లేదు. వలస కార్మికులంటే, ఏ దిక్కులేనివారు. రికార్డులలో ఎక్కనివారు. గొడ్డు చాకిరీ చేసేవారు. కనుక పరిశ్రమల్లో, భవన నిర్మాణ పనుల్లో సహా చాలా చోట్ల మూడు వంతుల మంది వారే. వలస కార్మికుల పట్ల ఏమిటీ నిర్లక్ష్యం అంటూ, న్యాయస్థానాలు దుమ్ము దులిపినప్పుడు కేంద్రం ఎన్నో హామీలు ఇచ్చినా, ఆచరణకు పూనుకోలేదు. అంతఃరాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని పునరుద్దరించి, పటిష్ఠపరచి ప్రతి రాష్ట్రమూ దానికి లోబడి వలస కార్మికులకు మేలు చేకూరిస్తే తప్ప వాళ్ళ పరిస్థితులు మారవు.

రాష్ట్రంలో అసంఘటిత రంగంలోని ఉపాధి హామీ కూలీలు, మున్సిపల్ కార్మికులు, చర్మకారులు, సెక్యూరిటీ గార్డులు, ఆటో, లారీ కార్మికులు, హోటల్ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, చేనేత కార్మికుల పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నది. కరోనా లాక్డౌన్ కాలంలో ఉపాధిలేక జీతభత్యాలు లేక ఆదుకునే ప్రభుత్వాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేనేత, నిర్మాణ రంగ కార్మికులైతే ఆకలి, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆకాశమే హద్దుగా రోజు రోజుకు పెరుగుతున్న డిజిల్, పెట్రోల్, గ్యాస్, విద్యుత్, బస్ చార్జీలతోపాటు ఇతర నిత్యావసర వస్తువుల ధరల వల్ల ఒక ప్రజలు కొనలేక, తినలేక చస్తున్నాడు.

ఇక కార్మిక సంక్షేమ బోర్డు పూర్తిగా బాలహీనమైపోయింది. గత 3 సంవత్సరాల నుండి ఎటువంటి క్లైములుకానీ, కార్మికులకు కార్మికశాఖ ఇవ్వవలసిన సంక్షేమ పథకాలుకానీ, నష్టపరిహారాలుకానీ చెల్లించడం పూర్తిగా ఆపేశారు. కార్మిక చట్టాల రద్దు వలన కార్మికులకు ఎదురయ్యే ఎలాంటి సమస్య అయినా కార్మికశాఖ అధికారులు పట్టించుకునే అధికారాన్ని కోల్పోయారు. కార్మిక సంక్షేమ నిధులు, ఎస్.సి., ఎస్.టి. సబ్ ప్లాన్ నిధులతో నవరత్నాల పథకాన్ని అమలుచేస్తూ, వాళ్ల సొంత సొమ్ము ఇస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. సిపిఎస్ పోరుబాటలో ఉన్న ఉపాధ్యాయులపై పోలీసులు ఉక్కు పాదం మోపారు. సిపిఎస్ రద్దు కోరుతూ, విడతలవారీగా ఆందోళనలు చేపట్టిన ఉపాధ్యాయులు సిఎంఓ ముట్టడికి సిద్ధమయ్యారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఈ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే, ప్రభుత్వం ఊహకు అందని విధంగా ఉపాధ్యాయులు లక్షల సంఖ్యలో విజయవాడ చేరుకోవడంతో ప్రభుత్వం ఖంగు తిన్నది. అప్పటి నుండి ఉద్యోగులపై కక్షకట్టి వారిని లోబర్చుకొనే విధంగా అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ప్రభుత్వం వేధిస్తున్నది. అందులో భాగమే జీతాలు, పెన్షన్లు 10వ తారీకు దాటినా అందకపోవడం. పైపెచ్చు జీ.ఓ.నెం. 1ని తీసుకువచ్చి ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను హరించాలని చూస్తున్నది.

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని వందకు వంద శాతం ప్రైవేటీకరణ చేస్తామని పదే పదే మోడీ పునరుద్ఘాటిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మిగులుభూమిలోని 4 వేల ఎకరాల భూమిని దక్కించుకోవాలని చూస్తూ, ప్రైవేటీకరణ విషయంలో మౌనం వహిస్తూ, కార్మికులు, నిర్వాసితులకు తీరని అన్యాయం చేస్తున్నది. 32 మంది ప్రాణాలు త్యాగంచేసి సాధించుకున్న సంస్థ అది. సుమారు 64 గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చారు. అప్పట్లో ప్రభుత్వం వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి భూములు ఇచ్చిన మొత్తం 16,500 మందికి ఆర్. కార్డులు ఇచ్చింది. వారిలో 8 వేల మందికి మాత్రమే ఉద్యోగ అవకాశం దక్కింది. మిగిలిన 8,500 మంది ఎటువంటి ఉపాధి పొందకుండా నేటికీ నిర్వాసితులుగా మిగిలారు. వారు సంవత్సరాల తరబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేస్తే లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. కార్మికులకు, నిర్వాసితులకు న్యాయం చేయకుండా ఫ్యాక్టరీని బి.జె.పి. ప్రభుత్వం గౌతం అదానీకే కట్టపెట్టాలని చూస్తున్నది.

అదానీ గ్రూపు భారతదేశంలో బొగ్గు గనులు, చమురు, సహజవాయువు నిక్షేపాలు, గ్యాస్ పంపిణీ, విద్యుత్ రవాణా, పంపిణీ, నిర్మాణరంగం మౌలిక వసతుల కల్పనారంగం, ఆహార ధాన్యాల నిల్వలు, విద్య, రియల్ ఎస్టేట్, వంట నూనెలు, అంతర్జాతీయ వాణిజ్యం తదితర రంగాలలో వ్యాపారం నడుపుతోంది. 8 విమానాశ్రయాలను, 13 ఓడరేవులను నిర్వహిస్తోంది. నరేంద్రమోడీ ప్రత్యేకంగా సహకరించడం వలన నిర్మించుకున్న అదానీ అవినీతి సామ్రాజ్యాన్ని ఇటీవల అమెరికాకు చెందిన చిన్న మదుపరుల సంస్థ అయిన ‘హిండెన్బర్గ్’ ఇచ్చిన 129 పేజీల నివేదికతో బట్టబయలైంది. ఇటువంటి దోపిడిదార్ల కోసం ప్రభుత్వం దేశాన్ని, ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నది. 

తరగిపోతున్న అడవులు, పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, అడుగంటుతున్న భూగర్భజలాలు, అకాల వర్షాలు భూమిపైన నీళ్ళలోనూ ప్లాస్టిక్లు, విష రసాయనాలు, కేన్సర్ కారక కాలుష్యాలు, ఊపిరి సలుపని వాతావరణం… ఇది నేడు మన చుట్టూ ఉన్న పరిస్థితి. పేదవారు, గొప్పవారు, పిల్లలు, పెద్దలు, గ్రామీణులు, పట్టణవాసులు ఎవ్వరూ తప్పించుకోలేని పరిస్థితిలో మానవాళి చిక్కుకుపోతున్నది. అడవులలో జీవిస్తూ, అటవీ సంపదను తమ సాంప్రదాయ పద్ధతులలో కాపాడుతూ వచ్చిన ఆదివాసులను ఆక్రమణదారులుగా ఆరోపించి అడవుల నుంచి వెళ్ళగొట్టడం మొదలైనప్పటినుండి పర్యావరణ వినాశనం ఆరంభమైంది. విశాలమైన అటవీ ప్రాంతాలను లాభాపేక్షతో పరిశ్రమలకు మళ్లించడం, ఖనిజ సంపద కోసం గనులు తవ్వటం, అటవీ భూములను కాలుష్యకారక కంపెనీలకు లీజుకు ఇవ్వడం, పెద్ద ఆనకట్టల నిర్మాణం పేరుతో వేలాది ఎకరాల అటవీ భూమిని సేకరించి ఆదివాసులను నిర్వాసితులను చేయడం వినాశనానికి బాటలు వేశాయి. అదే సమయంలో విష రసాయనాలతో కూడిన వ్యవసాయం విస్తరించి ఆహారాన్ని విషతుల్యం చేయడమే కాదు, భూమి, నీరు, గాలి కూడా విషపూరిత మవుతున్నాయి. అనేక రకాల స్థానిక పంటల వైవిధ్యం నశించిపోతున్నది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారిదాకా ప్రపంచ వడగాల్పులు వీస్తున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల సెల్షియస్కు మించిపోయాయి. అయితే, సాపేక్షంగా నవీన జీవన సదుపాయాలు ఉన్నవారికి ఈ చండ్రగాడ్పుల వల్ల పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. ఇబ్బందల్లా పగలంతా మండుటెండల్లో తప్పనిసరిగా పనిచేయక తప్పని కోట్లాది సన్నకారు, చిన్నకారు రైతులు, రైతు కూలీలు, నిర్మాణ రంగ శ్రామికులకే. వారు గబ్బిలంవలే కాగిపోతున్నారు. ఋతువుల తీవ్రతకు వారే సదా బాధితులు. యాతనామయ శ్రమ వారిని వేదనాభరితులుగా చేస్తుంది. అయినా శ్రమకు విరామం లేదు. ఈ విపత్కర పరిస్థితి వారిని అనారోగ్య పీడితులుగా చేస్తోంది. ఎంతోమంది ప్రాణాలను హరిస్తోంది. మనుష్యులే కాదు, మొక్కలు ఈ వేసవి తీవ్రతకు తట్టుకోలేక పోతున్నాయి. మన దేశంలో పర్యావరణ పరిరక్షణ కోసం జరిగిన అనేక ఉద్యమాల్లో మహిళలే ముందు నిలిచారు.

భారతదేశంలో ఆదివాసులు నివశిస్తున్న అన్ని అటవీ ప్రాంతాల్లో అపారమైన ఖనిజ సంపద నిల్వలున్నాయి. ఈ సంపదనంతా కేంద్రంలోని మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం విదేశీ, స్వదేశీ కార్పోరేట్ కంపెనీలకు కట్టబెట్టడం కోసం చేసుకున్న ఎంఓయులను అమలు చేయడం కోసం దేశంలోని 132 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలతో ముడిపడిఉన్న సంపదనంతాకూడా కేవలం కొద్ది మంది కార్పోరేట్లకు అప్పజెప్పడం కోసం ఈ సంపదనంతా కాపాడుతున్న ఆదివాసులను అడవులనుండి మావోయిస్టుల పేరిట తరిమేయాలని దండకారణ్యంలో 7 లక్షల సైన్యాలను మోహరించింది. ఇటీవల జనవరి 11వ తేదీన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్లోని కిష్టారం-పామేడు ప్రాంతంలో ఇండియన్ ఎయిర్లైన్స్ హెలికాఫ్టర్లలో కోబ్రా దళాలు, సిఆర్పిఎఫ్ బలగాలు వెళ్ళి బంబు దాడులు చేశారు. ఈ దాడిలో ఒక ఆదివాసీ యువతి మృతి చెందింది. దేశాల మధ్య సరిహద్దు యుద్ధాల్లో వాడే ఇండియన్ ఎయిర్లైన్స్ ఛాపరు కేంద్ర ప్రభుత్వం ఈ దేశ పౌరులైన ఆదివాసులపై ప్రయోగిస్తున్నది.

దేశ సంపదను కాపాడుతున్న ఆదివాసీలపై జరగుతున్న హింసా, దౌర్జన్యాలపై ఇంకా దేశంలోని అనేక సమస్యలపై ప్రజాపక్షం వహించి మాట్లాడిన మేధావులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, కార్మిక, హక్కుల, ప్రజాసంఘాల నాయకులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఐఏ లాంటి అక్రమ ఏజన్సీలతో, అక్రమ సోదాలు నిర్వహించి ఉపా చట్టం క్రింద అక్రమ కేసులు బనాయించి తీవ్ర నిర్భంధాన్ని అమలు చేస్తున్నది. కానీ ఎందరో హంతకులు, నిందితులు, ఆర్థిక నేరగాళ్ళు బహిరంగంగా సంచరిస్తున్నారు.

ఈ నేపధ్యంలో 137వ మేడే చికాగో కార్మిక వర్గ స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాగిస్తున్న దోపిడీ పీడన అణచివేతలకు వ్యతిరేకంగా పోరాడాలని మనకు గుర్తుచేస్తున్నది.

Leave a Reply