2021 లో ఏడాది పొడవునా నిరసన వ్యక్తం చేసిన తరువాత, భారతదేశ రైతులు వ్యవసాయ రంగాన్ని “సరళీకరించడానికి” ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయించగలిగారు. ఇప్పుడు 2024లో రైతులు మరోసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత నిరసనలకు దారితీసిన వ్యవసాయాన్ని నియోలిబరల్ కార్పొరేటీకరణకు అనువుగా మార్చివేయడం అనే సమస్య ఇంకా పరిష్కారం కాలేదు.

ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ వ్యవసాయ వ్యాపార సంస్థలు, ఆర్థిక మూలధనం భారతదేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌పరం చేసేందుకు ఒక నిర్దిష్ట పథకం ప్రకారం ప్రయాస పడుతున్నాయి. ఈ పథకం 1990ల ఆరంభంలో మొదలైంది.  ఈ ప్రణాళికను అమలు చేయడానికి ఆనాడు భారతదేశంలో వున్న విదేశీ మారక ద్రవ్య సంక్షోభాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకొన్నారు. పైన పేర్కొన్న ప్రయోజనాలకు ఉపయోగపడే కాంట్రాక్ట్ వ్యవసాయం, పారిశ్రామిక నమూనా వ్యవసాయం, రిటైల్ ఆహార విధానాలతో ప్రస్తుత ఆహార ఉత్పత్తి వ్యవస్థను భర్తీ చేయడానికి ఈ “వ్యవస్థాగత సర్దుబాటు” విధానం, ప్రక్రియ ఉపయోగపడతాయి. పారిశ్రామిక వాణిజ్య పంటల సాగుకు అవసరమైన ప్రైవేటు మూలధనాన్ని వ్యవసాయరంగంలో పెట్టడాన్ని సులభతరం చేయడం కోసం ప్రభుత్వ రంగ పాత్రను తగ్గించడమే దీని లక్ష్యం.

కార్గిల్, ఆర్చర్ డేనియల్స్ మిడ్ ల్యాండ్స్, లూయిస్ డ్రేఫస్, బంగె, భారతదేశ రిటైల్, వ్యవసాయ వ్యాపార దిగ్గజాలతో పాటు గ్లోబల్ అగ్రిటెక్, విత్తన, అగ్రోకెమికల్ కార్పొరేషన్లు, పెద్ద టెక్ కంపెనీలు తమ “డేటా ఆధారిత వ్యవసాయం”తో లబ్ధిదారులు అవుతాయి.

రైతులను నిర్వాసితులను చేయడం, భూ మార్కెట్‌ను సృష్టించడం, భూకమతాలను కలపడం ద్వారా అంతర్జాతీయ భూ పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వ్యవసాయానికి అనువైన విశాలమైన పొలాలను ఏర్పాటు చేయడమనేదే ఈ ప్రణాళిక ఉద్దేశ్యం. ఫలితంగా, భారతదేశంలోని అనేక మంది చిన్న రైతులకు వ్యవసాయం అసాధ్యమయ్యేలా చేసి, లక్షలాదిమందిని వ్యవసాయం నుండి పట్టణ కేంద్రాలకు తరలించడానికి కొనసాగుతున్న వ్యూహం ఇది. తరచుగా వ్యవసాయపరంగా అత్యంత సారవంతమైన భూమిని పట్టణ శివారు ప్రాంతంగా విస్తరిస్తారు. అలాంటి భూములను కోల్పోవడం కూడా ఆందోళన కలిగించే అంశమే.

ఆ లక్షలాది మంది ఏమైపోతారు? ఉద్దేశపూర్వక పేదరికం కారణంగా నగరాలకు నెట్టబడతారు.  చౌకగా దొరికే శ్రామిక శక్తిగా లేదా నిరుద్యోగులుగా లేదా సరిపడా పని లేని రిజర్వ్ సైన్యంగా, యంత్రీకరణను అమలు చేస్తున్న ప్రపంచ మూలధనానికి సేవలు అందిస్తారు (ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రకారం భారతదేశంలో యువతలో 23 శాతానికి పైగా నిరుద్యోగం ఉంది).

రైతుల పేదరికం, పెరిగిన ఉత్పత్తి ఖర్చులు, ప్రభుత్వ సహాయ ఉపసంహరణ, అప్పులు చేయడం,  చెల్లించడం, చౌకైన, రాయితీ కలిగిన దిగుమతుల ప్రభావం మొదలైనవాటివల్ల రైతుల ఆదాయం తగ్గిపోతుంది.

ఒకవైపు భారతదేశంలో కార్పొరేట్‌లకు భారీగా విరాళాలు అందడంతో పాటు రుణాలు మాఫీ అవుతుండగా; మరోవైపు సురక్షితమైన ఆదాయం లేకపోవడం, అస్థిరత, అంతర్జాతీయ మార్కెట్ ధరల తారుమారు, చౌక ధరల్లో దిగుమతులు, ఉత్పత్తి వ్యయాన్ని భరించలేకపోవడం, మంచి జీవన ప్రమాణాన్ని పొందలేకపోవడం మొదలైనవి రైతుల కష్టాలకు కారణమవుతున్నాయి.

రైతులకు ఇచ్చే సహాయాన్ని మరింతగా తగ్గించి, దిగుమతి, ఎగుమతులకు అనుకూలమైన ‘స్వేచ్ఛా మార్కెట్’ వాణిజ్యానికి భారత్ ప్రభుత్వం తలుపులు తెరవాలని ధనిక దేశాలు చేస్తున్న ఒత్తిడి వంచన తప్ప మరొకటి కాదు. ఉదాహరణకు, విధాన విశ్లేషకుడు దేవీందర్ శర్మ ప్రకారం, అమెరికా గోధుమ, బియ్యం సాగుచేసే రైతులకు అందించిన సబ్సిడీలు ఈ రెండు పంటల మార్కెట్ విలువ కంటే ఎక్కువగా ఉన్నాయి. ఐరోపాలోని ప్రతి ఆవుకు ఒక భారతీయ రైతు రోజువారీ ఆదాయం కంటే ఎక్కువ సబ్సిడీ లభిస్తుందని ఆయన అన్నారు.

ప్రపంచ బ్యాంకు, ప్రపంచ వాణిజ్య సంస్థ, ప్రపంచ సంస్థాగత పెట్టుబడిదారులు, బహుళజాతి వ్యవసాయ వ్యాపార దిగ్గజాలకు ఉత్పత్తుల అమ్మకం, సేకరణ కోసం కార్పొరేట్ నిర్దేశించే కాంట్రాక్ట్ వ్యవసాయం, పూర్తి స్థాయి నియోలిబరల్ (నయా ఉదారవాద)మార్కెటింగ్ అవసరం. కొద్దిమంది కోటీశ్వరుల ప్రయోజనం కోసం భారతదేశం తన రైతులను, ఆహార భద్రతను త్యాగం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

రసాయనాలు, బయోటెక్ ఉత్పత్తులను సరఫరా చేసే సంస్థలు, ఆహార ఉత్పత్తుల తయారీ, రిటైల్ వ్యాపార కూటమిలు రైతులను కేవలం ముడి పదార్థాల (పంటలు) ఉత్పత్తిదారులుగా మాత్రమే పరిగణిస్తున్నాయి. రైతులను ఎంత ఎక్కువగా పీల్చి పిప్పి చేస్తే, అంత ఎక్కువ లాభాలను ఈ కార్పొరేషన్‌లు పొందగలుగుతాయి.  దీనివల్ల వ్యవసాయదారులు ఖరీదైన బయటి పెట్టుబడులపై, కార్పొరేట్ ఆధిపత్యం ఉన్న మార్కెట్లు, సరఫరా శ్రేణులపై ఆధారపడతారు. ప్రపంచ వ్యవసాయ ఆహార సంస్థలు తెలివిగా, నిర్లజ్జగా ఆహార సార్వభౌమత్వాన్ని నిర్మూలించడం, ‘ఆహార భద్రత’లో పరాధీనతను సృష్టించడం వంటి కథనాన్ని అల్లాయి.

రైతుల డిమాండ్లు

2018లో, అఖిల భారత కిసాన్ సంఘర్ష్ సమన్వయ సమితి (సుమారు 250 రైతు సంస్థల సమూహం) ఒక చార్టర్‌ను విడుదల చేసింది. దోపిడీ సంస్థల లోతైన వ్యాప్తి,  భరించలేని రుణ భారం, రైతాంగం  ఇతర రంగాల మధ్య విస్తరిస్తున్న అసమానతలు గురించి రైతులు ఆందోళన చెందారు.

కనీస మద్దతు ధరకన్నా తక్కువ ధరకు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడాన్ని  చట్టవ్యతిరేకమైనదిగా, శిక్షార్హమైనదిగానూ చేయాలని, వ్యవసాయానికి సంబంధించిన ఉత్పాదక  ఖర్చులను తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రజా పంపిణీ వ్యవస్థ సార్వత్రికీకరణ, వేరే దేశాల్లో  నిషేధానికి గురైన పురుగుమందుల ఉపసంహరణ, సమగ్రమైన అవసరమూ, ప్రభావాల అంచనా లేకుండా జన్యుపరంగా తయారైన విత్తనాలను ఆమోదించకపోవడంపై  ప్రత్యేక చర్చ జరపాలని కూడా ఈ చార్టర్ కోరింది.

వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉండకూడదు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ పేరుతో కార్పొరేట్ దోపిడీ నుంచి రైతులను కాపాడాలి, రైతాంగ ఉత్పత్తి సంస్థలు, రైతు సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు రైతు సంఘాల్లో పెట్టుబడులు పెట్టాలి, సరైన పంటల నమూనాల ఆధారంగా వ్యవసాయ పర్యావరణాన్ని ప్రోత్సహించాలి, స్థానిక విత్తన వైవిధ్యాన్ని పునరుద్ధరించాలి అని కూడా డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఇందుకు తగిన ఏ చర్యలూ చేపట్టకపోవడం వల్ల ఈ డిమాండ్లకు ఈనాటికీ ప్రాధాన్యత వున్నది. వాస్తవానికి, 2021 లో రైతులు ఏడాది పొడవునా నిరసన వ్యక్తం చేసిన తరువాత రద్దు అయిన మూడు వ్యవసాయ చట్టాలు వీటికి విరుద్ధంగా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అవి భారతీయ వ్యవసాయాన్ని నియోలిబరల్ మార్కెటింగ్, షాక్ థెరపీల (దిగ్భ్రాంతి చికిత్స) భారీ మోతాదుకు గురిచేయాలని అనుకున్నాయి. ఈ చట్టాలను రద్దు చేసినప్పటికీ, వాటి వెనుక ఉన్న కార్పొరేట్ ప్రయోజనాలు ఎన్నడూ లేకుండా పోలేదు. తాము కోరిన విధానాలను భారత ప్రభుత్వం అమలు చేయాలని కార్పొరేట్‌లు పట్టుబట్టాయి.

దీని పర్యవసానం భారతదేశ జాతీయ ఆహార భద్రతకు ప్రధాన అవసరమైన ప్రభుత్వం చేసే అవసరమైన ఆహార పదార్థాల సేకరణ-పంపిణీలను తగ్గించడం, ప్రభుత్వ  ఆహార తటస్థ నిల్వలను నిర్మూలించడం; దేశ అవసరాల కోసం ప్రపంచ సరుకుల మార్కెట్లలో తారుమారు చేయబడిన ధరలకు విదేశీ మారకద్రవ్య నిల్వలతో కొనుగోలు చేయడం. ఇలా చేయడం వల్ల దేశాన్ని పూర్తిగా విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ ద్రవ్యసహాయాన్ని ఆకర్షించడంపై ఆధారపడేట్లు  చేస్తుంది.

ముంబై ఆధారిత రీసెర్చ్ యూనిట్ ఫర్ పొలిటికల్ ఎకానమీ (ఆర్‌యుపిఇ) ప్రకారం, ఆహార సార్వభౌమత్వానికి, జాతీయ ఆహార భద్రతకు హామీ కల్పించాలంటే  అవసరమైన పంటలు, సరకులను కనీస మద్దతు ధర యిచ్చి ప్రభుత్వం సేకరించాలి;  మొక్కజొన్న, పత్తి, నూనె గింజలు, పప్పులు వంటి అనేక ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరను యివ్వాలి.  ప్రస్తుతానికి, ప్రధాన లబ్ధిదారులు కొన్ని రాష్ట్రాల్లో కనీస మద్దతు ధర యిచ్చి ప్రభుత్వం సేకరిస్తున్న బియ్యం, గోధుమలను ఉత్పత్తి చేసే రైతులు మాత్రమే.

భారతదేశంలో చాలా తక్కువగా వున్న తలసరి ప్రోటీన్‌ల వినియోగం లిబరలైజేషన్ యుగంలో మరింతగా తగ్గింది కాబట్టి,  ప్రజా పంపిణీ వ్యవస్థలో (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ -పిడిఎస్) పప్పుధాన్యాల సరఫరా ఎప్పటి నుంచో జరిగివుండాల్సింది. చాలా అవసరం కూడా. పిడిఎస్ కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ మార్కెట్ యార్డులు లేదా మండీలలో కనీస మద్దతు ధరతో రైతుల నుండి ఆహార ధాన్యాలు కొనుగోలు చేయడానికి ఇది బాధ్యత వహిస్తుంది. ఆ తరువాత ప్రతి రాష్ట్రానికి ధాన్యాలను కేటాయిస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ‘రేషన్ షాపులకు’ సరఫరా చేస్తాయి.

నేడు, 2024 లో, వ్యవసాయ సంఘాల నాయకులు (ఇతర డిమాండ్లతో పాటు) పంటలకు కనీస మద్దతు ధర కోసం హామీలు కోరుతున్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం 20 కి పైగా పంటలకు మద్దతు ధరలను ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరతో బియ్యం, గోధుమలను మాత్రమే కొనుగోలు చేస్తాయి, అది కూడా కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే.

ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార సంక్షేమ కార్యక్రమం క్రింద 800 మిలియన్లకు పైగా భారతీయులకు రెండు ప్రధాన ఆహార పదార్థాలు బియ్యం, గోధుమలను ఉచితంగా పంపిణీ చేయడానికి నిల్వలను వుంచడం కోసం ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరలకు రాజ్య సంస్థలు కొనుగోలు చేస్తాయి. ప్రస్తుతం, జనాభాలో సగానికి పైగా కుటుంబాలకు కనీసం వచ్చే నాలుగు సంవత్సరాల వరకు నెలకు ఐదు కిలోలు ఈ ముఖ్యమైన ఆహార పదార్థాలు లభిస్తాయి. వాటిని వారికి యివ్వడానికి “స్వేచ్ఛా మార్కెట్” నిరాకరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా మనం చూసినట్లుగా, నియోలిబరల్ మార్కెటైజేషన్ ముసుగులో జరుగుతున్న కార్పొరేట్ దోపిడీ పేదలకు, రాజ్య మద్దతుపై ఆధారపడే అవసరం ఉన్నవారికి ఏ మాత్రం సహాయపడదు.

కనీస మద్దతు ధరతో విస్తృత శ్రేణి పంటల ప్రభుత్వ సేకరణ జరిగితే, అన్ని రాష్ట్రాలలో బియ్యం, గోధుమలకు కనీస మద్దతు ధర హామీ ఇస్తే, ఆకలి, పోషకాహారలోపం పరిష్కరించడానికి, పంట వైవిధ్యీకరణను ప్రోత్సహించడానికి, రైతుల కష్టాలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ విధంగా వ్యవసాయ ఉత్పత్తిలో పాల్గొంటున్న లక్షలాది మందికి సహాయం చేయడం ద్వారా, ఇది గ్రామీణ వ్యయశక్తికి, సాధారణంగా ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

ప్రభుత్వ రంగం పాత్రను తగ్గించి, వ్యవస్థను బహుళజాతి కోటీశ్వరుల వర్గానికి, దాని కార్పొరేషన్లకు అప్పగించే బదులు, అధికారిక సేకరణ, ప్రజా పంపిణీని మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది.

కార్పొరేషన్లు, వారి కోటీశ్వర యజమానులు అందుకున్న ప్రస్తుత విరాళాలలో (ప్రోత్సాహకాలు) 20% ఖర్చు అవుతోంది, ఇది విస్తృత జనాభాకు ఏ విధంగానూ ప్రయోజనం కలిగించదు అని ఆర్‌యుపిఇ అధ్యయనం  పేర్కొంది. 2016లో భారతదేశంలోని కేవలం ఐదు పెద్ద కార్పొరేషన్‌లకు అందించిన రుణాలు మొత్తం వ్యవసాయ రుణానికి సమానంగా ఉన్నాయనేది కూడా గమనించాలి.

ఏదేమైనా, కనీస మద్దతు ధర, ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బఫర్ నిల్వల ఉనికి ప్రపంచ వ్యవసాయ వ్యాపార ప్రయోజనాలకు అడ్డంకి అని స్పష్టమైంది.

రైతుల ఇతర డిమాండ్లలో పూర్తి రుణ మాఫీ, రైతులు, వ్యవసాయ కార్మికులకు పెన్షన్ పథకం, విద్యుత్ (సవరణ) బిల్లు 2020 ద్వారా రద్దు చేసిన సబ్సిడీలను తిరిగి ప్రవేశపెట్టడం, భూమి కొనుగోలుకు సంబంధించి న్యాయమైన పరిహారం, భూ స్వాధీనానికి సంబంధించిన పారదర్శకత హక్కు ఉన్నాయి.

ఇలా వుండగా, రైతుల పట్ల  కఠినంగా వున్నానని, కార్పొరేట్ అనుకూల ఎజెండాను సులభతరం చేయడానికి స్థిర సంకల్పంతో వున్నానని, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడికి, వ్యవసాయ పెట్టుబడికి నిరూపించుకోవాలనే ఆసక్తితో ప్రస్తుత పరిపాలన వున్నది.

ప్రభుత్వమూ, రైతు ప్రతినిధుల మధ్య ఇటీవల జరిగిన చర్చలు విఫలమైన తరువాత, రైతులు శాంతియుతంగా ఢిల్లీకి యాత్ర  చేసి ప్రదర్శన చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ ఢిల్లీ సరిహద్దులో రైతులు బారికేడ్లు, టియర్  గ్యాస్, రాజ్య హింసలను ఎదుర్కొన్నారు.

రైతులు మానవాళికి అత్యంత ముఖ్యమైన అవసరమైన ఆహారాన్ని ఉత్పత్తి చేస్తారే తప్ప  “అంతర్గత శత్రువులు కాదు” కాదు. దృష్టి పెట్టాల్సింది ‘అవతలి శత్రువు’ పైన. భారతదేశంలో మీడియాలో కొంత సెక్షను, ప్రముఖ వ్యాఖ్యాతలు రైతులను ‘దేశ వ్యతిరేకులు’గా చిత్రీకరించే బదులు, భారతదేశ ఆహార భద్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసి, రైతులను పేదరికంలోకి నెట్టడం ద్వారా లాభం పొందాలనుకునే వారి ప్రయోజనాలను సవాలు చేయడంపై దృష్టి పెట్టాలి.

https://countercurrents.org/2024/02/farmers-protest-in-india-reignites-a-struggle-for-the-future-of-food-and-agriculture/

Leave a Reply