భీమా కోరేగాం కేసును సృష్టించిన హిందుత్వ శక్తులు గత ఐదేళ్లుగా దేశ విదేశాలలో అత్యంత అప్రతిష్ట పాలు కావడంతో ఎన్ఐఏ ప్రస్తుతం మరో కేసుకు రంగం సిద్ధం చేస్తున్నది. భీమా కోరేగాం కేసులో అసలు నేరస్థులను పక్కన పెట్టి ఈ దేశంలోని లౌకిక, ప్రగతిశీల, ప్రజాస్వామిక, దేశభక్త శక్తులను (కళాకారులు, రచయితలు, వకీళ్లు, పాత్రికేయులు, ప్రొఫెసర్లు, ఆదివాసీ శ్రేయోభిలాషులు, సామాజిక కార్యకర్తలు మున్నగువారు) కక్ష పూరితంగా కటకటాల వెనుకకు నెట్టిన హిందుత్వ శక్తుల కౌటిల్యం గతంలో ఏ కేసులోనూ కానంత నగ్నంగా వెల్లడైంది. భీమా కోరేగాం కేసు అనేక మలుపులు, మెలికలు తిరిగి హిందుత్వ శక్తుల థింక్ టాంకుల కసరత్తుతో 10 వేల పేజీలకు పైగా చార్జీషీటు తయారైంది. కానీ, దేశం ముక్త కంఠంతో నిజం వైపు నిలబడి విద్వేష రాజకీయాల అసలు ముసుగు చీల్చిచెండాడింది. ఫలితంగా, ఇపుడు సర్కారువారి జేబుసంస్థ ఎన్ఐఏ ఇపుడు మావోయిస్టుల 63 పేజీల ‘‘రహస్య’’ నివేదిక అంటూ మరో అస్ర్తాన్ని దేశం మీదికి వదలడానికి సిద్ధం చేసింది. ఎన్ఐఏ సిద్ధం చేసిన రహస్య నివేదికను ఎప్పటిలాగే, ధైర్యంగా, దృఢంగా ఎదుర్కొని తిప్పికొడుదాం.
ఎన్ఐఏ వారు విడుదలకు సిద్ధం చేసిన ‘‘రహస్య నివేదిక’’ కూడ దేశంలో మరెవరికో కాదు, కల్పిత భీమాకోరేగాం కేసు సృష్టికర్తలకే (మహారాష్ట్ర) చిక్కడం వారి చౌర్య కళా నైపుణ్యాన్ని చాటుతోంది. ఒకవైపు మహారాష్ట్రలో ఇప్పటికీ 84 ‘‘మావోయిస్టు అనుబంధ సంస్థల’’పై పబ్లిక్ సెక్యూరిటీ ఆక్ట్ ఎత్తివేయలేదు. మరోవైపూ డీఐజీ సందీప్ పాటిల్ (మహారాష్ట్రలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాల ఖాకీ ప్రముఖుడు) బుట్టలో నుండి మరో విష సర్పాన్ని వెలికితీసి దేశంపైకి విసరడానికి సిద్ధమైనాడు. దేశంలో వందలాది ప్రజా పోరాట సంస్థలపై అనేక రకాల ప్రతిబందకాలు కొనసాగుతున్నాయి. అనేక మంది రచయితలు, కళాకారులు, వకీళ్లు, పాత్రికేయులు, దేశభక్త మేధావుల ఇళ్లపై ఎన్ఐఏ వారి సోదాలు ఆగకుండా సాగుతున్నాయి. వారిని ఇరికించడానికి వర్తమాన 63 పేజీల రహస్య నివేదిక రామబాణం కానుంది. కాబట్టి రహస్య ఖాకీ దస్తావేజును బట్టబయలు చేయాలి. కల్పిత భీమా కోరేగాం కేసులో భాగంగా మోదీ హత్యకు సామాజిక కార్యకర్తలు పథకం రూపొందించారంటూ పస లేని కథనాలను సృష్టించిన పాలకులు వర్తమాన 63 పేజీల రహస్య దస్తావేజులో ఈసారి ఎవరినీ హత్య చేయడానికి పథకం రూపొందించిందంటారో, ఎంత మంది మేధావులను ఈ కల్పిత దస్తావేజు పేరుతో కటకటాల వెనుకకు తోస్తారో, ఎంత మందిని ఫాదర్ స్టాన్ స్వామిలను చేస్తారో చూడాల్సిందే మరి! కాబట్టి ఇలాంటి కాల్పానిక కథనాల ద్వార వారి ఆటలు సాగనివ్వకుండా ఆలోచనాపరులంతా సమైక్యం కావాలి.
దేశ హోంమంత్రి ప్రకటించిన ‘‘నక్సల్ ఏరివేత యేడాది కేంపెయిన్’’కు ఈ సెప్టెంబర్ తో కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఈ కొత్త కేసుకు రంగం సిద్దం కావడం వారి వైఫల్యాన్ని, అసహనాన్ని, దివాళాకోరుతనాన్ని వెల్లడిస్తోంది. టైం ఆఫ్ ఇండియా విలేకరి సౌమిత్రాబోస్ ప్రచురించిన వార్తా కథనం ప్రకారం స్థూలంగా చెప్పాలంటే 63 పేజీల రహస్య దస్తావేజులో మావోయిస్టులు పట్టణ ప్రజలను జాగరూకులను చేసే లక్ష్యాలను పొందుపరిచారనీ రాయడం గమనార్హం. నిజానికి విప్లవ రాజకీయాలు బహిరంగమే, ఎలాంటి దాపరికం లేకుండానే విప్లవ రాజకీయాల ప్రచారం జరుగుతోంది.
భీమా కోరేగాం కేసులో అనేక మంది ప్రముఖ ప్రజాహిత వేధావులను అర్బన్ మావోయిస్టులని జైలు పాలు చేయడంతో ‘‘మీ టూ అర్బన్ మావోయిస్టు’’ అనే ఒక కొత్త కేంపెయిన్ కు పాలకవర్గాలు అపూర్వ స్థాయిలో ఊతం ఇచ్చాయి. వర్తమాన దస్తావేజు ఆ దిశలో దానికి మించిన స్థాయిలో దేశంలో విప్లవ శక్తులను పెంపొందిస్తాయనీ నిస్సందేహంగా చెప్పవచ్చు. పాలకవర్గాల పిరికి చేష్టలన్నీ పెరుగుతున్న విప్లవ సంక్షోభ పరిస్థితులకు అద్దం పడుతోన్నవి. భీమాకోరేగాం కేసులో 16 మందిని ఇరికించిన ఎన్ఐఏ మరో విడుత దేశ వ్యాపిత అరెస్టులకు రంగం సిద్దం చేసిందనడానికి వర్తమాన రహస్యమయ దస్తావేజును మించిన తార్కాణం అవసరమే లేదు. దీనిని మన దేశ పాలకవర్గాల అసహనానికి, విద్వేష-విషపూరిత, మతోన్మాద, ప్రజా వ్యతిరేక రాజకీయాలకు పరాకాష్టగానే భావించాలి. ఎన్ఐఏ కల్పిత రహస్య దస్తావేజుకు వ్యతిరేకంగా దేశంలోని యావత్తు హిందుత్వ వ్యతిరేక శక్తులు ఐక్యమై ఎన్ఐఏ కుట్రలను ఓడించాలి. పట్టణ ప్రాంత ప్రజలను సామాజిక అన్యాయాలపై జాగరూకులను చేయడానికి రూపొందినదిగా చెపుతున్న ఈ సరికొత్త 63 పేజీల రహస్య దస్తావేజును అగ్నివీరులు తప్పక చదవాలి. వారు దానిని ప్రత్యేకించి అధ్యయనం చేయాలి. ఆ దస్తావేజులో భద్రతా బలగాలలోకి ఇన్ ఫిల్ట్రేట్ చేయడం గురించి కూడ రాసివుందంటూ వార్తలు రాస్తున్నందున అగ్నివీరులు చదవడం అవసరం. ఎందుకంటే మూడొంతుల అగ్నివీరులను వుద్యోగాలనుండి ఊడబీకే అగ్నిపథ్ బాధితులు సమాజాన్ని అధ్యయనం చేయడానికి విప్లవ మార్గంలో వారి మౌలిక సమస్యలను పరిష్కరించుకోవడానికి వుపయోగపడుతుండచ్చు. మనుషులను చొప్పించడం మాటేమో కానీ, దస్తావేజును జనాలలోకి విడుదల చేసిన ఎన్ఐఏ వారు మాత్రం ‘అభినందనీయులే’. పట్టణాలలోని యువతను జాగరూకులను చేయడానికి దస్తావేజు పూనుకుంటుందనే వార్తలు తెరకెక్కించిన రిపోర్టర్లు కూడ అందుకు పాత్రులే.