భారతదేశ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొందిన మల్లయోధులు ఏప్రిల్ 5వ తేదీ నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు 2023 జనవరిలో బహిరంగం కావడంతో నిరసనలు ప్రారంభమయ్యాయి, ఆ తర్వాత ప్రభుత్వం లైంగిక వేధింపుల ఆరోపణలపై నిష్పాక్షిక స్వతంత్ర కమిటీ విచారణ జరుపుతుందని వారికి హామీ ఇచ్చింది.

అయితే, సుప్రీంకోర్టు ఆదేశం వచ్చేవరకు పోలీసులు ఎంపీపై కేసు నమోదు చేసేందుకు నిరాకరించారు. లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే ఉద్దేశ్యంతో రూపొందించిన పోక్సో చట్టం (పిల్లల లైంగిక నేరాల నుండి రక్షణ చట్టం, 2012) లోని సంబంధిత విభాగాలు కూడా అతనిపై ఉన్నాయి. నేరాలు గుర్తించదగినవి, బెయిల్ దొరకదు. ఈ నేరాల తీవ్రత వల్లనూ, తన ప్రభావాన్ని ఉపయోగించి దర్యాప్తును అడ్డుకోకుండా వుండడానికి అటువంటి పలుకుబడి కలిగిన వ్యక్తిని అరెస్టు చేయడం చాలా అవసరం. కానీ పోలీసులు అతణ్ణి అరెస్టు చేయకపోవడం పోలీసుల తమ ఇచ్చానుసారం అధికారాలను ఎలా ఏకపక్షంగా ఉపయోగిస్తున్నారో ప్రతిబింబిస్తుంది.

బ్రాహ్మణీయ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా

ఆరోపణల తీవ్రత వున్నప్పటికీ  బ్రిజ్ భూషణ్‌కు ఉన్న అధికారం కారణంగా అధికార పార్టీ ఎంపీపై ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈ అణచివేతకు భారతదేశంలోని అర్ధ భూస్వామ్య స్వభావం ఎలా కారణమో విశ్లేషించడానికి ఈ వ్యాసం ప్రయత్నిస్తుంది.

బ్రిజ్ భూషణ్ పుట్టిన ప్రాంతమైన గోండా జిల్లాకు చెందిన  స్థానిక బిజెపి పార్టీ సభ్యుడు “బ్రిజ్ భూషణ్‌కు పార్టీ చిహ్నం అవసరం లేదు, బ్రిజ్ భూషణ్ కంటే రాజకీయ పార్టీలకు బ్రిజ్ భూషణ్ అవసరం ఉన్నది” అన్నాడు. అతను గణనీయమైన అధికారాన్ని కలిగి ఉన్న ఆ ప్రాంత స్థానిక భూస్వామి. అనేక సార్లు బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా నిలబడినప్పటికీ పార్టీ ఆయనపై ఏనాడూ చర్యలు తీసుకోలేదు.

అతను స్థానిక మద్యం మాఫియాలో భాగమైన హిస్టరీ షీటర్, డ్రగ్ మాఫియా దావూద్ ఇబ్రహీంకు సహకరించినందుకు తీవ్రవాద, విఘాతం కలిగించే కార్యకలాపాల (నివారణ) చట్టం (టాడా) కింద ఆరోపణలను ఎదుర్కొన్నాడు. గతంలో హత్య చేశానని అతడే చెబుతున్నాడు. గ్యాంగ్‌స్టర్‌గా ఉన్న వ్యక్తి ఆ నియోజకవర్గంలో బాహుబలి (బలవంతుడు) కావడం వల్ల  అనేకసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాడు. ఆ ప్రాంతంలోని రాజకీయ ప్రత్యర్థులను హత్య చేసాడు, హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బ్రిజ్ భూషణ్‌కి అప్రజాస్వామిక, భూస్వామ్య రాజకీయ అధికారం వున్నదని స్పష్టంగా తెలుస్తుంది. భూస్వామిగా ఆయన ఉన్నత స్థానమే ఈ అధికారానికి కారణం.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రిజ్ భూషణ్, కుస్తీ క్రీడాకారులు బలమైన అబ్బాయిలు, అమ్మాయిలు. అందుకే వారిని నియంత్రించడానికి బలమైన వ్యక్తి అవసరం అని అన్నాడు. అతను పోటీలను ఒక అణచివేత పద్ధతిలో నిర్వహిస్తాడు, తన డిమాండ్ల ప్రకారం పనిచేయమని రిఫరీలకు చెప్తాడు, అవసరమనుకున్నప్పుడు న్యాయమూర్తులను కూడా శిక్షిస్తాడు. ఈ కార్యక్రమం మొత్తాన్ని ఆయన పర్యవేక్షిస్తారు. ఆయన భౌతికంగా హాజరు కాలేకపోతే, కెమెరాను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాడు.

మల్లయోధుల ఆహారాన్ని నియంత్రించడమే కాకుండా వారికి వచ్చే  ప్రాయోజిత డబ్బులో సగం డబ్బును కూడా తీసుకుంటాడని, అతనికి ఉన్న క్రూరమైన అధికారం కారణంగా మల్లయోధులు ఒకరకమైన  భూస్వామ్య పన్నును చెల్లించాల్సి వుంటుందని  ద్రోణాచార్య పురస్కార గ్రహీత మహావిర్ ఫోగట్ చెప్పారు.

మల్లయోధులు వంగి తన కాళ్ళకు దండం పెట్టే బ్రాహ్మణీయ పద్ధతిని ప్రోత్సహించాడు. 2022లో రాంచీ టోర్నీ సందర్భంగా ఒక క్రీడాకారుణ్ణి చెంపదెబ్బ కొట్టిన వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి. ప్రజాస్వామ్య సంస్థలో ఒక వ్యక్తి ఈ విధమైన అధికారాన్ని వినియోగించుకోలేడు. బ్రిజ్ భూషణ్ అమలు చేసే ఈ కఠోరమైన అప్రజాస్వామిక అధికారం అతని భూస్వామ్య స్థితి కారణంగా ఉద్భవించింది. అందువల్ల, భూస్వామిక విధానం  రెజలర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వరకు కూడా విస్తరించిందని స్పష్టంగా చూడవచ్చు.

మహిళా క్రీడాకారులు ఎదుర్కొంటున్న అణచివేత తీవ్రంగా ఉంది. భూస్వామ్య పద్ధతిలోలా ఆఫీసులాగా కూడా పనిచేసే అతని వ్యక్తిగత  నివాసంలో కనీసం నాలుగు లైంగిక వేధింపులు జరిగాయి. ఈ వేధింపుల నుండి బయటపడిన వారు అతని అధికారానికి భయపడి మొదట ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. అత్యాచార సంస్కృతి అనేది భూస్వామ్య విధానంలో అంతర్గత భాగం.

పితృస్వామ్యం-సామ్రాజ్యవాదం

ఈ దేశంలో లైంగిక అణచివేతకు మూల కారణం సామ్రాజ్యవాదం. మార్క్స్ చెప్పినట్లు  “సామాజిక, రాజకీయ, మేధోపరమైన జీవన ప్రక్రియలను సాధారణంగా భౌతిక జీవన ఉత్పత్తి విధానం నియంత్రిస్తుంది. ” భారతదేశంలో, ఉత్పత్తి విధానం అర్ధ భూస్వామ్య, అర్ధ వలసవ్యవస్థగా ఉండటంతో మన సమాజం సగం భూస్వామ్య నిర్మాణం జీవితంలోని అన్ని అంశాలను ప్రభావితం చేస్తుంది. ఇందులో క్రీడలను నిర్వహించే సంస్థలు కూడా వస్తాయి.

ఈ ఉత్పత్తి సంబంధాల కారణంగా రెజలర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ నిర్వహణ బ్రాహ్మణీయ పద్ధతిలో వుంటుంది. కేవలం భూస్వామి కావడం వల్లనే  బ్రిజ్ భూషణ్‌కు ఆ సంస్థలో పలుకుబడి ఉంది. అంతేకాదు, బ్రిజ్ భూషణ్ లాంటి వ్యక్తుల ఆధిపత్యం అర్ధ-భూస్వామ్య, అర్ధ -వలస దేశాలలో కొనసాగుతుంది. బ్రిజ్ భూషణ్ కాకపోతే ఇంకొకరు అదే అధికారాన్ని వినియోగించుకుంటారు. అందువల్ల, పితృస్వామ్య అణచివేతను అంతం చేయడానికి ప్రస్తుత వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటం, ఉత్పత్తి సంబంధాలను మార్చడం అవసరం.

కుల, వర్గాల వారీగా మహిళలు బ్రాహ్మణీయ అణచివేతకు గురవుతున్నారు. కానీ రైతాంగ, శ్రామికవర్గాల విషయంలో ఈ అణచివేత చాలా ఎక్కువ. అణచివేతతో పాటు వారు దోపిడీని కూడా ఎదుర్కొంటున్నారు. అణచివేతకు గురయ్యే  కులానికి చెందిన మహిళల శరీరం ఆధిపత్య కులం పురుషుడి ఆస్తి అనే బ్రాహ్మణీయ విశ్వాసం ఇలాంటి ఉదంతాలకు దారితీసింది. రాజ్యయంత్రాంగం నేరస్థులకు ఎలా చురుకుగా మద్దతు ఇస్తుందో హత్రాస్ అత్యాచారం కేసులో చూశాము.

నేరం చేసిన వ్యక్తులకు శిక్ష పడకుండా ఉండేందుకు ప్రభుత్వ యంత్రాంగం మహిళల మృతదేహాలను కూడా తగులబెట్టింది. ఈ వర్గాల స్త్రీలు ప్రధానంగా ఎదుర్కోవాల్సిన దోపిడీ భూస్వామ్య వర్గానికి చెందిన పురుషుల నుంచి. కానీ  అందరి స్త్రీల మాదిరిగానే, రైతాంగ, శ్రామిక వర్గాలకి చెందిన మహిళ కూడా ఇంట్లో అణచివేతకు గురవుతుంది. తమ కుటుంబంలోని పురుషుల నుంచి కూడా వారు అణచివేతకు గురవుతున్నారు.

ముగింపు

నిర్భయ, ప్రియాంకల అత్యాచార ఘటనలు, ఇప్పుడు మల్లయోధులపై లైంగిక వేధింపుల గురించి మనందరం విన్నాము, అయితే శ్రామిక, దళిత, ఆదివాసీ నేపథ్యాల మహిళలపై అత్యాచారాలు జరగడమనేది భారత సమాజంలో సర్వసాధారణం. ప్రియాంక రెడ్డిపై జరిగిన అత్యాచారం భారతదేశం అంతటా వార్తా శీర్షికగా వచ్చింది. ‘జాతీయ మీడియా’ కూడా ఈ సమస్యను కవర్ చేసింది. జరిగిన ‘న్యాయం’ కూడా బ్రాహ్మణీయ స్వభావం కలిగినదే. పోలీసులు తన సాధారణ కోర్టు విచారణల ప్రక్రియకు బదులుగా, అగ్రవర్ణ పెటీ బూర్జువా వర్గాల ‘ప్రతీకారాన్ని’ తీర్చడానికి కేసుతో సంబంధం లేని దళిత, ముస్లిం శ్రామిక వర్గాల యువతను నిర్బంధించారు. హత్రాస్ రేప్ కేసు వంటి ఘటనలు మీడియాలో క్రూర అణిచివేతకు గురయ్యాయి, సిద్ధిఖీ కప్పన్ వంటి ప్రజల పాత్రికేయులు దళిత రైతు బాలికపై అగ్రవర్ణ పురుషులు అత్యాచారం చేసిన హత్రాస్ రేప్ కేసుపై నివేదిక ఇవ్వకుండా ఉండేలా క్రూరమైన UA(P)A చట్టంతో అభియోగాలు మోపారు.

మహిళలపై హింస అనేది బూర్జువా, ఆధిపత్య కుల నేపథ్యం నుండి వచ్చిన వారిపై జరిగినప్పుడు మాత్రమే ముఖ్యాంశమవుతుంది. శ్రామిక, దళిత, ఆదివాసీ వర్గాల మహిళలపై హింస వివిధ ఉద్యమకారుల కృషి కారణంగా ఒక ప్రముఖ సమస్యగా రూపొందినప్పటికీ, బ్రాహ్మణీయ భారతదేశ న్యాయవ్యవస్థ సమిష్టిగా అనేకసార్లు మహిళలకు న్యాయం చేకూర్చలేదు.

హత్రాస్ అత్యాచార కేసులో నిందితులను ఇటీవల నిర్దోషులుగా ప్రకటించారు. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో తమ ఉన్మాదంతో ముస్లిం మహిళలను సామూహిక అత్యాచారం చేసిన 26 మంది పురుషులు ఇటీవల నిర్దోషులుగా విడుదలయ్యారు. విడుదలైనప్పుడు ఫాసిస్ట్ జనసమూహాలు వారికి పూలమాలలు వేసి, తిలకాలు దిద్ది ఆహ్వానించారు. 2021 లో, భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఒక అత్యాచారితో ““మీరు ఆమెను పెళ్లి చేసుకుంటారా? మీరు ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటే మేము మీకు సహాయం చేస్తాము. లేని పక్షంలో ఉద్యోగం పోగొట్టుకుని జైలుకు వెళ్లాలి. మీరు అమ్మాయిని ప్రలోభపెట్టి, ఆమెపై అత్యాచారం చేసారు” అని అనడం సుప్రీంకోర్టుకు ఉన్న భూస్వామ్య స్వభావాన్ని తెలియచేస్తుంది.

ఈ అత్యాచార ఘటనలన్నింటినీ దేనికదే  విడివిడిగా చూడకూడదు. ఫాసిస్ట్ ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధానన్-ప్రహార్‌లో భాగంగా భారత పోలీసుల ప్రత్యేక “మావోయిస్ట్ వ్యతిరేక” గ్రేహౌండ్ యూనిట్ ఆదివాసీ కోంద్ తెగ మహిళలపై సామూహిక అత్యాచారం చేయడాన్ని బ్రాహ్మణీయ పితృస్వామ్యానికి వ్యతిరేకంగా క్రీడాకారులు సాగిస్తున్న పోరాటం నుండి విడదీయకూడదు.

భారతీయ మీడియా కూడా సేవలందిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం ఈ నిర్లిప్తతను, మహిళలపై హింస పట్ల ఏకాకి దృక్పథాన్ని నిర్ధారిస్తుంది. ఇది అగ్రవర్ణ స్త్రీల బ్రాహ్మణీయ ‘గౌరవాన్ని’ కాపాడే ప్రభుత్వ యంత్రాంగానికి మాత్రమే దారి తీస్తుంది. ప్రస్తుత అర్ధ భూస్వామ్య వ్యవస్థలో మహిళల అణచివేతను పరిష్కరించడం సాధ్యం కాదనేది  స్పష్టం. పితృస్వామ్య హింస నుండి స్త్రీల విముక్తికి ఈ కుళ్ళిపోయిన, భూస్వామ్య, సామ్రాజ్యవాద, ఫాసిస్ట్ వ్యవస్థకు వ్యతిరేకంగా శ్రామికవర్గం నాయకత్వంలో మహిళలందరి ఐక్యత అవసరం.

తెలుగు: పద్మ కొండిపర్తి

Leave a Reply