1 వేడుకోలు
చీకటి పాత్ర లో
నిండుగా ఉన్నది వెన్నెల మధువు
మత్తుని ఆహ్వానించడానికి సిధ్ధంగా ఉంది
ప్రేమ నిండిన హృదయం
ఏక్కడో దూరం నుంచి ఓ తల్లి గాత్రం
బిడ్డకి పాలు పడతూ
ఆదమరచడానికి భూమికింత
చల్లగాలిని జోలపాటగా అందిస్తోంది
ఏ బతుకు యుధ్ధంతో ఘర్షణ పడుతున్నారో
మనుషుల జాడ లేదు
మధువు తాగేటప్పుడు తోడు
కోరుతుంది కదా మనసు
ఒంటరితనం
ఒక ఉన్మత్త దుఃఖం
దుఃఖం ఓ ఒంటరి యుధ్ధం
దేహానికీ, హృదయానికీ
గాయం కానివాడెవడూ
మధువుని కోరుకోడు
తోడునీ కోరుకోడు
తెగిన బంధాలని జతచేయడానికి
గాయాలు మానడానికి అనువైన
కాలం ఇది
జహాపనా!
కొందరు
భక్తులను ఇటుగా పంపు
కాసింత మధువునీ
ఒకట్రెండు గీతాలని మలాములా
వారి గాయాలకు పూస్తాను
వారి తోడు మలాములో
నా గాయాలను నయం చేసుకుంటాను
పాత్రా మధువు వేచి చూస్తున్నాయి..
**
2 ఇటుగా
నా భయాలన్నింటినీ
వారి మధ్యలోనే
పొగొట్టుకుంటాను
బాధ్యతా బరువు
ప్రేమా ఆత్మీయత
లాంటి
సుగుణాలని వారిలో నింపిన
కళాకారుడివి దయామయుడవి
జనులు మనలో ఖాళీలను
పూరించడానికి పుట్టిన పదాలు
అందుకేనేమో జహాపనా
వారికి
నేను నిలువెత్తు కవితలా కనబడతాను
వారేమో నాకు పదాల సముద్రంగా అనిపిస్తారు
ఇచ్చిపుచ్చుకోవడమే
నిజమైన భక్తి కదా
నిండైన కవిత్వమే జీవితం కదా
3 కార్మికులు
వాళ్ళు ఎంత సున్నిత హృదయులూ!?
కరుకు శబ్దాల లోహ సాధనాలతో
ఏ సజీవార్థం పలకని ముడి పదార్థాలను
సుందరమైన వస్తులువుగా మలుస్తారు
వాయిద్యాన్ని ముట్టుకున్నపుడు పలికే
సంగీతంలా
ఆ వస్తులను ముట్టుకున్నప్పుడు
వాళ్ళ హృదయం
పలుకుతుంది
ప్రతి కార్మికుడు గొప్ప సంగీత విద్వాంసుడు
వారిని మలిచిన నీవు అమోఘమైన శిల్పివి
జహాపనా
ప్రతి కరుకు పనితో
సౌందర్యవంతమైన
వస్తువును మలిచే
పనితనపు మధువుని వారిలో ఒంపినందుకు
నీ పానశాలకు నిత్య నేను సేవకుడను
ఒట్టి ప్రపంచం నువ్విస్తే
వారు దీనిని పూలవనంగా మలిచారు
అందుకే
ఈ పూల నుండి
వ్యాపిస్తున్నది నీ దయా పరిమళం!!
4 దోసిలి
నీ దోసిలి నుంచి ఎప్పుడు విదిల్చావు
నక్షత్రాలనీ!?
అవి అనంతంగా ప్రకాశిస్తూనే ఉన్నాయి
పొలాన్ని దున్నే రైతులుగా
పొలం లో నాట్లేసే మహిళలు గా
**
Related