తేనె ఫలం
1.
ఆ మెత్తటి ఇసుకతిన్నెల్లో
పడ్డ నీ పాద ముద్ర లో
ఒలికిన నా చూపు లో
సగం చీకటి
సగం వెలుతురు ఇప్పుడు..
2.
ఎంత తీరైన నడక
ఇసుక పై రంగవల్లి అల్లినట్టు
ఏ తోట్రుపాటు లేదు
రంగు జాతీయత పట్టింపు లేని
ఆలింగనపు మహత్తు
పాదాన్ని నేల ముద్దాడుతుంది
మాటని పెదవి విహంగం చేస్తుంది
భాష కు భవబంధాలు తెలియవు
పరిస్థితులతో సంబంధం లేని పయనం నీది
మన్ను దేహంగా పొందిన నదిలాంటిది నీ ప్రయాణం
ఎడారి స్థితికి వాన మీదా
వానకి ఎడారి మీదా మమకారం పెంచి
ఒకే రకమైన ప్రేమ ను పంచి
ప్రేమ తెలియని ప్రాంతాల్లో
నీ కనుచూపును చిలకరించి
నవ్వుల్ని మొలిపించే
సేద్యం నీ పధం
వెలుతరూ చీకటి విత్తులుగా నాటి
మానవత్వపు పంట పండించడం
నీ వృత్తి
3.
ఎడారి తిన్నెల మీంచి మట్టి వేణువు గీతాలు
వినిపిస్తున్నాయా
పవనం ఎండా జమిలిగా కవిత్వం అల్లుతున్నాయా
సుఫియానా భావ ధారతో ఒయాసిస్సులు
పచ్చదనాన్ని ఒలికిస్తున్నాయా
ఖర్జూరం చెట్లు విరగ్గాసి
ఆకలిని తీరుస్తున్నాయా
నీ పాద ముద్రల పదాలను చదువుకొని
నడకలోని అనుభవాలతో మానవ చరిత్రలోని ఎత్తుపల్లాలు తెలుసుకొని
మనుషులు కొత్త నడవడికకు అలవాటు పడ్డారా?
తమ చుట్టూ చల్లదనాన్ని మొహరించి
కత్తుల సైన్యాల్ని చిర్నవ్వుతో పలకరిస్తున్నారా
నెత్తుటి ధారలను నీటితో కడుగుతూ
యుధ్ధభీభత్సాన్ని గతం
తాలుకు గాయాల పుటల్లో జమచేస్తున్నారా
భవిష్యత్తు మీద ఆశని పెంచి
ప్రశాంతతను మానవ మూల కర్తవ్యంగా మారుస్తున్నారా
పామరులందరూ జ్ఞానుల్లా
కనిపిస్తూ మాటల్లో మార్దవ్యాన్ని పలికిస్తున్నారా
అయితే నీవటుగా వెళ్ళి ఉంటావు
ఆ స్థల కాలాలకి సంస్కృతి నేర్పి ఉంటావు
నువ్వు పాదం మోపిన చోట
కోటలన్నీ ఓడిపోతాయని
కుటీరాలు తలెత్తుకుంటాయని
చరిత్ర చెప్పిన పాఠం
నవ సమానత భవిష్యత్తీగకు
వేవాడుతున్న తేనెఫలం
ఆ ఫలం మీద అందరిదీ అధికారం
4.
ఈ ఘనతను ఎలా కొనియాడాలి
ఎడారిలో దారి తెరుచుకున్నదని
ఎవరో చెప్పారు
జహాపనా
నీ దరికి బయలుదేరాను..
——–
2. కూల్చిన మనుషులకు
నా గూడు చెదిరిపోయినంత బాధ
నా బిడ్డలే వేరైపోయినంత క్షోభ
కాకపోతే చెదిరిన గూడు పావురానిది
కూల్చిన చేతులు మనిషివి
“పావురం పావురం మనుషుల దగ్గరే
ఎందుకు గూడు అల్లుకుంటావూ?”
అని అడిగి చూడండి
మనిషికి మనసుంటుంది కాబట్టి,
అతని మనసు ఇంట్లో ఉంటుంది కాబట్టి,
ఆ ఇంట్లో పిల్లలుంటారు కాబట్టి అంటుంది.
కానీ హృదయం లేని మనుషులూ
ఉంటారని తెలియని అమాయకత్వం రెక్కలుగా పొందిన పక్షి అది
గూడు మనిషిదైనా
పక్షిదైనా అందులో
ఆత్మ ఒకటే కదా
నరాలను తెగిపోయేలా శ్రమించి
నిర్మించుకున్న పొదరిల్లు
పదిలం కాకపోతే ఎలా?
మళ్ళీ రెక్కలు ముక్కలు చేసుకొని
తినీ తినక కూడబెట్టి
పునాదులలో నెత్తురు పోసి
బరువు భుజాలపై మోసి
నెత్తికి నీడనిచ్చే
ఠికానా నిట్ట నిలబెటట్టడం
చచ్చిబతికినంత కష్టం కదా
గూడు లోపలుండేది గుండె గల జీవులు
బతుక నేర్చిన జవసత్వాలు
తొలికోడి కూసే జామున లేచి
గగనాన్ని రెక్కల కింద పొదిమి
భువిని భుజాల పై మోసి
తిరిగి రావడానికీ తొంగోడానికి
నవ్వులో కన్నీళ్ళో కలిపిన ముద్దలు కొన్ని తినడానికి
జంటగా కొన్ని కబుర్లాడడానికి
నీదనే ఒక గృహం
నీదనే ఒక నమ్మకం
నీదనే ఒక నిదానం
నీదనే ఒక విలాసం
నీదనే ఒక ధైర్యం
నీదనే ఒక నిలువ నీడ
ఉండాలి
ఇప్పుడు కూలగొట్టబడినా
ఇంకోకటి కట్టుకొని తీరాలి
తీరిగ్గానే కానీ
నది ఒడ్డులాంటి ఒక గూడు అల్లుకొని
కూల్చిన మనుషులకు
చూపాలి…
చూపుతావు కదూ పావురమా?
———-
3. నెత్తుటి తడి ప్రవాహం
కవిత్వం ఒక
సత్యం
వాన చినుకుగా మొదలై
సముద్రంగా నీలో విస్తరించే
వాస్తవం
కవిత్వం
ఒక సహచరత్వం
ఒక్కసారి చేయి కలిపితే
జీవితాంతం
తోడుండే స్నేహం
కవిత్వం ఒక
నిదానం
ఎంత అల్లకల్లోలం లోనైనా
కలయికల మీద
భరోసా కోల్పోని
మోహం
కవిత్వం ఒక
రాజ్య ధిక్కారం
కరుకు సంకెళ్ళ శబ్దాన్ని
అక్షరాల మార్చే
ఇంక్విలాబ్ నినాదం
కవిత్వం
కవి హృదయం
దాని లయలంతా
నెత్తుటి తడి ప్రవాహం
———
4. శూన్యపాత్ర
కాలం మంచుగడ్డలా ఘనీభవించగానే,
ఒకానొక స్తబ్దత
నీలో అర్ధరాత్రై విచ్చుకుంటుంది
చచ్చుబడిన శరీరపు దృశ్యమొకటి
కన్నీటి బిందువులో నిక్షిప్తమై ఉంటుంది
పోతున్న ప్రాణాన్ని నిలబెట్టెకోడానికి,
చచ్చేలా, ప్రయత్నిస్తుంటావు
విచక్షణ కోల్పోయిన మస్తిష్కం ఆడిన నాటకంలో
శాలభంజికవి, నీవని, తెలిసేటప్పటకి
నీ చేత చంపబడిన సమయాలు కొన్ని ప్రేతాత్మలై,
నీ చుట్టూ మృత్యుగీతం పాడుతుంటాయి
మనిషంటే ఒక దయామయ సమయం
మనిషంటే ఒక కరుణరస నదీ ప్రవాహం
మనిషంటే నిలువెత్తు ఉద్విగ్న జలపాతం
మనిషంటే వెన్నెలకు చల్లదనం నేర్పే జ్ఞానమార్గం
మనిషంటే ఆత్మీయ ఆలింగనాల కరచాలనాల ఉన్మత్త భావం
అర్థరహిత ఉనికివి
నీకు నిర్వచనాలతో పనేముంది?
అసామాజికం, అసామూహికమైన
నీ నడకల గొప్పలపుడు
అంపశయ్యపై భీష్ముడి చివరి క్షణాల్లా వెంటపడతాయి
ఒంటరిగా మిగిలిన నీ గది కిటికీ
ఒకటి తెరుచుకొని వెన్నెలను నీపై పడేసినా
స్పర్శా రహిత నీ దేహానికొక స్పృహ అవసరముందని
నోరు తెరిచి అడగలేవు
నీకు తెలియదప్పుడు,
నీ పార్ధీవ దేహం ఖననశాల చేరుతుందో? లేదో? అని
ఏ విషన్న వదనం నీకై అక్కడ తాచ్చాడదు
నీకు నీవు కూడా అప్పుడేమీ కావు
నీవెప్పుడెపుడు
నిర్దయాపూరిత కార్యాల్లో పడిమునకలేసావో,
ఎటువంటి రక్తదాహ తెంపరితనంలో పాల్గోన్నావో
అసలు జ్ఞప్తికి రాదు
ఏ మూక దావానంలో కలిసి ఎన్ని మనోగృహాలకు నిప్పెట్టావో
లెక్కలేసుకోలేనంత లోతు తిమిరపు అగాధంలో
పని చేయ నిరాకరించే అవయవాలతో ఏం దేకులాడతావు
మనసనే ఉద్వేగ కసారాన్ని
నీలోని లోలోకి అదిమేసుకొని
ఇంత కాలాన్ని ఈదులాడావు కదా
నీకెప్పుడూ నీవైన ఆలోచనలు చేయాలనే
తలంపు ఎందకు కలగలేదూ?
పూలలో రంగుల్నీ, తుమ్మెదల్లో రెక్కలనీ
ఊహలూహలుగా గాలి తెమ్మరలను నీలోకి
ఆహ్వానించిందెపుడనీ?
అసలు నువ్వు బతికిందెప్పుడూ?
ఇపుడు నలుగుర్ని సంపాదించాలని
పరితపిస్తున్నావూ?
ఇతరుల సంగతి పక్కనెట్టు
నీకు నీవు ఉపయోగపడిందెప్పుడనీ,
నువ్వు నిలబెట్టిన
సమాధులు తెరుచుకొని
నీ కోసం మరణవాంగ్మూలం
వినిపిస్తాయని కలగంటున్నావా?
నీవల్ల మృతులుగా మిగిలిన సజీవ జ్ఞాపకాలనీ
శ్రమ పూలు పండించిన దేహ తోటలనీ
నువ్వు నలిపడ్డేసిన కాలాన్ని
నెమరువేసుకోగలవా?
నీ కనుగుడ్డు
మీద సూదిమొనై గుచ్చుకుంటున్న
మృత్యు దశలో
శ్వాసనిశ్వాసలు విఛ్ఛిన్నమౌతూ
ప్రాణం కోసం గింగిరాలుబోతున్న
ఈ సమయం లో
నీ ఆత్మకు సమాధి నీ దేహం
శూన్యం నీ ఎదపై పూలగుఛ్ఛం
———
5. జ్ఞాపకాల నీడలు
ఒకానోక మంచు సమయాన,
తారకల పుప్పొడి రాలుతున్న
రాత్రి ఏకాంతాన
నింగి చెలి వెన్నెల జెడ వేసుకుంటున్న
పౌర్ణమి రోజున
నా చుట్టూ పరుచుకుంటాయి
నీ జ్ఞాపకాల నీడలు
నువ్వు నన్ను ఎన్నడూ వీడవు
అనే సంకేతం ఇస్తూ…
నువ్వు నలిపి పడ్డేసిన కాలాన్ని నెమరు వేసుకుంటావా!!
నీమాటని పెదవి విహంగం….