ఈ వేసవి కాలం
దోసిళ్ళ లోంచి క్షణాల్ని ఒంపుకుంటూ
గొంతులోని తడిని ఎగరేసుకుపోతూ
ఎండను రాల్చుకుంటుంది .

ఇంటిలోంచి కళ్ళు బయట ఆరేస్తే చాలు
పిల్లలు మూగిన ఐస్ క్రీం బండి
బాధ్యత రెక్కల్ని విప్పుతుంది .
కన్నీటి దుఃఖాల్ని
లోలోపల ఆరేసుకుంటుంది .

ఇంటి  లోపల ఉతికిన వస్త్రాల్ని చూస్తే చాలు 
బయట ఎండలో
వయసు భారాన్ని లెక్కచేయని
ఇస్తిరి పెట్టి ముసలివాడు
బొగ్గుల నిప్పుల్లోంచి జీవితాన్ని చూపిస్తాడు .

ఎండ పేలిపోతున్న
బండి కదలదు .
శ్వాస ఆగిపోతున్న
బతుకు పోరాటం ఆగదు .

చూపులు తిప్పుకుని
నీటి టబ్బు వైపు చూస్తే చాలు 
గడపలో నీటి కోసం కాకులు
ఊగుతుంటాయి.
నీట మునుగుతుంటాయి .

ఒక ఎండా కాలం నీటి స్పర్శ కోసం
గొంతులు మధన పడుతుంటాయి .
నా చుట్టూ ఎండను తీసి
గొడుగులా  కాసి
ఒక్కో గొంతులో నీటినిపోసి
స్వచ్ఛంగా  స్వేచ్ఛగా
పక్షిలా బతకాలనుంటుంది .

ఒక ఎండాకాలపు దాహం
మనిషిని కాల్చకుంటే ఎంతబావుణ్ణు.
చినుకునై కురిస్తే ఇంకెంత బావుణ్ణు .

===========================

Leave a Reply