జీవితంలో తాను ఒక్కతే శిఖరంలా ఎదగడం కాదు, ఒక అరణ్యంలా మనుషుల మధ్య స్వచ్ఛమైన ఉపిరి కోసం విస్తరించాలని భావించిన మనస్తత్వం డా.కందాల శోభారాణిది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలోని కందాల అనసూర్య, రామచంద్రయ్య దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. మధ్యతరగతి శ్రామిక జీవితంలోని కష్టాలను, కన్నీళ్లను పక్కకు నెట్టేసి విద్యపై ఆసక్తితో ముందుకు సాగింది. బాల్యం నుండే మూఢవిశ్వాసాలను వ్యతిరేకించేది. స్వతంత్రమైన భావాలతో ఇతరులకు భిన్నంగా ఆలోచించడం ఆమె ప్రత్యేకత. ఉమ్మడి వరంగల్ జిల్లా పిడిఎస్‌యు మాజీ అధ్యక్షుడు తాటిపాముల రమేష్‌ను ఆగస్టు 9, 2002న ఆదర్శ వివాహం చేసుకొన్నారు. ఇక్కడి నుంచే ఆమె జీవితం రకరకాల కొత్త మూలమలుపును తిరగడం ప్రారంభమైంది. కుటుంబానికే పరిమితం కాకుండా యధావిధిగా ఉన్నత విద్యను కాకతీయ విశ్వవిద్యాలయం క్యాంపస్ నుంచి 2006లో ఎంఏ(తెలుగు) పూర్తి చేసింది. 2012లో ‘తెలుగు సాహిత్య విమర్శ`స్త్రీల కృషి’ అనే అంశంపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. 2006లో రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో తెలుగు కాంట్రాక్టు అధ్యాపకురాలుగా బోధన ప్రారంభించారు. క్రమంగా ఎదిగి కాకతీయ విశ్వవిద్యాలయంలోని మహాత్మ జ్యోతిరావు పూలె సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కు సంచాలకులుగా బాధ్యతలు నిర్వహించారు.
డాక్టర్ కందాల శోభారాణి కవిత్వం మొత్తం ఒక సగ్రమైన కవితా సంపుటిగా రావాల్సిన అవసరం ఉంది. శోభ మరణం తర్వాత ఆమె సహచరుడు టి.రమేష్ నుంచి నేను సేకరించిన కొన్ని కవితలను ఉద్దేశించి శోభారాణి కవితల్లోని అంతరంగాన్ని నాకున్న పరిమిత జ్ఞానంతో మీ ముందు విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను. వీరి కవిత్వంలో తెలుగు సమాజం, సామాజిక సంఘర్షణలు, స్త్రీవాద దృక్కోణంలో తన కలాన్ని కరవాలంగా ఎత్తిపట్టారు. స్త్రీవాద దృక్పథంతో మార్స్కిస్టు ఆలోచన విధానంలో సమాజం పడుతున్న సంఘర్షణను చిత్రిక పట్టారు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమకాలంలో విద్యార్థినిగా కాకతీయ విశ్వవిద్యాలయంలో క్యాంపస్‌లో అడుగుపెట్టారు. సమాజంలోని వివిధ సమస్యలకు, సంక్షోభాలకు కవయిత్రిగా స్పందించారో ? లేక ప్రగతిశీల విద్యార్థి ఉద్యమకార్యకర్తగ తన కలానికి పదునుపెట్టారో శోభారాణి కవితలను చదివితేనే మనకు అవగాహన కలుగుతుంది. తాను కవిత్వం కేవలం పొద్దుపోకపోవడం వల్ల రాసింది కాదు. అక్షరాల కాగడాలను వెలిగించి సమాజంలో కమ్ముకొన్న అసమానత చీకట్లను తొలగించాలని తపన కలిగిన విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన ఉద్యమకారిణి.
విశ్వవిద్యాలయంలో, సమాజంలో జరుగుతున్న వామపక్ష రాజకీయాల జ్ఞానాన్ని స్పష్టత పరచుకుంటూనే కవయిత్రిగా తనను తాను నిర్మించుకునే ప్రయత్నం చేసింది శోభ. కాకతీయ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న రోజుల్లో ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహేలాంటి ఆచార్యుల ఆలోచన విధానం శోభను ప్రభావితం చేసి వుంటుంది. సమాజాన్ని, వాటిలోని అంతరాల దొంతరలను అధ్యయనం, ఆలాపనతో అవగాహన పెంచుకున్నారు. ముఖ్యంగా స్త్రీవాద ఆలోచన దృక్పథం, మార్క్సిస్టు సాహిత్య పరిశీలన విధానంలో తన ప్రాపంచిక దృక్పథాన్ని మరింత విస్తృతం చేసుకున్నారు. ప్రతీ కవి తన సృజనాత్మక అక్షరీకరణల్లో తమ తాత్విక దృక్పథాన్ని తనకు తెలియకుండానే తమను తాము ఆవిష్కృతం చేసుకుంటారు. తమ మనోప్రపంచం ద్వారా సమాజంలో జరుగుతున్న పరిణామాలను, పరిస్థితులను ఏ విధంగా మార్పును కోరుకుంటున్నారో రచయితల సృజనాత్మక శైలి వారిని పట్టి చూపిస్తుంది. డాక్టర్ కందాల శోభారాణి మీద కవిత్వ సృజనాత్మక ప్రభావం మీద ఆమె కార్యాచరణ, ఆలోచన దృక్పథం కవిత్వంలో కనిపిస్తుంది. ‘అమ్మ పనిముట్టయి పోయింది’(2005) కవితలో..
‘‘మొదట ఆమె వీరవనిత
తర్వాత ఆమె అయ్యింది మాతృదేవత
అక్కణ్నించి మొదలయ్యింది హీనత
బిడ్డల్ని ఆమె ప్రేమించినంత
వరెవ్వరూ ప్రేమించ లేదు
…..
సమస్యంతా అమ్మను అమ్మలా, మనిషిలా ఎలా చూడాలన్నదే
నేను అమ్మనో బొమ్మనో కాకుండా
మనిషిగా ఎలా నిలబడాలన్నదే!!
అంటూ ముగిస్తుంది. పితృస్వామ్య ఆధిపత్య వ్యవస్థలో మాతృత్వంతోనే ‘ఆమె’ త్యాగాల కష్టాలు మొదలవుతాయని చెబుతుంది. మహిళ తన కోసం కాకుండా సమాజంలో శ్రామిక బానిసయ్యిందో మనిషిగా ఎందుకు కాకుండా పోయిందోనని ఆవేదన వ్యక్తం చేస్తుంది.
సమాజంలోని వివిధ సంధర్భాలకు స్పందిస్తూ వివిధ సాహితీ సంస్థలు ప్రచురించిన కవితా సంకలనాల్లో శోభారాణి విస్తృతంగా కవితలు రాసి తను కవయిత్రిగా వ్యక్త పరచుకున్నారు. అత్యాచారాలపై నిరసనగా ‘‘ఉద్విగ్న’’ కవితా సంకలనంలో ‘దహించి శాంతిస్తాను’ అంటూ నిరసనాగ్రహంతో అక్షరాలను సంధించారు. భారతీయ సమాజంలోని భూస్వామ్య, పితృస్వామ్య ఆలోచన విధానమే మహిళను అంగడి సరకుగా మార్చిందని ఆందోళన పడుతుంది. కుటుంబ వ్యవస్థ, సమాజం భిన్న పార్శ్వాల మహిళలను శ్రమ దోపిడికి గురిచేస్తున్న వైఖరిని నిరసిస్తుంది.
‘నాడు భూస్వామ్య సమాజం
స్త్రీని సొంత ఆస్తిగ చేస్తే
నేడు సామ్రాజ్యవాదం
స్త్రీ ఉనికినే సరుకుగా చేసింది
…..
సినిమా సీరియళ్లకు
వాణిజ్య ప్రకటనలకు
పెట్టుబడుల పెత్తందారీ తనాలకు
స్త్రీ శరీరమే కదా వస్తువైంది అనీ మహిళల అణచివేత గురించి తన ఆవేదనాత్మకమైన స్వరంతో కలాన్ని ఆయుధంగా చేసుకొని ప్రశ్నల కొడవళ్లతో నిలదీస్తోంది. సమాజంలో మహిళ ఇంటా, బయట పడుతున్న సంవేదనను ఆవాహనం చేసుకొని దోపిడీని దహించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపుతుంది.
యూనివర్శిటిలో చదువుకునే రోజుల నుంచే ఒక స్వతంత్రమైన భావాలతో, ఏ పీడనలేని సమాజం కోసం కలలుగన్నది. ఆక్రమంలోనే తన కవిత్వాన్ని ప్రగతిశీల విప్లవ రాజకీయాలకు స్పూర్తిగా చేసుకున్నది. ప్రజల్లో సమసమాజ ఆకాంక్షలతో సామాజిక చైతన్యాన్ని విస్తరింప చేయడానికి తన కలానికి సృజనాత్మకతకు పదను పెట్టింది. అందులో ప్రధానంగా మహిళలు అణచివేతకు గరువుతున్న తీరుపై నిరంతరం అక్షర రూపం ఇవ్వడానికి ప్రయత్నం చేశారు.
చదువుల కోసం ఆరాటపడుతున్న ఆడబిడ్డలకు విద్యాలయాలు కూడా రక్షణ కల్పించడం లేదు. ఆడ పిల్లలపై అడుగడుగునా విషపునాగులు కామంతో బుసకొడుతూనే ఉన్నాయి. అత్యాచారాలకు, హత్యకు గురైన బాధితుల ప్రశ్నలకు జవాబు చెప్పలేని పాలకులు లాఠీలతో అణచివేయడం పట్ల శోభారాణి తీవ్రంగా కలత చెందుతుంది. కాపాడాల్సిన జాతినాయకులే దారుణాలపై మాట్లాడకుండా మౌనం వహించడంపై అక్షరాగ్నులను కరిపిస్తుంది. ‘కాలంబురాగానే’ కవిత సంకలనంలో ‘‘ఆడపిల్లల బ్రతుకు’ కవిత ములుగు జిల్లాలో మూడు చెక్కలపల్లిలో దారుణంగా హతమైన గిరిజన బాలికల ఆచూకీ పట్ల పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరును నిరసిస్తుంది. బాధితుల పక్షాలన నిలవాల్సిన రక్షకభటులు విరుద్ధంగా వ్యవహరించడంపై శోభరాణి మండిపడుతుంది.
‘‘కడుపు కట్టుకొని కనిపెంచిన పిల్లల
కనిపించకుండా పోయిరేందని
నిలదీసినందుకు
తల్లిదండ్రుల వీపులపై
పోలీసుల తున్నులెందుకు?
కంచె చేను మేసిన చందాన
జాతి నేతలే మిన్నకుండిపోతే
కులమేడ బాయెరా
అధికారమంటే
ఈ జాతివారైనా ఈరీతి జరుగునా ?
….
నేరగాళ్లను కప్పిపుచ్చాలన్న ఆత్రమే గదా
కథనాల వెనుక ఉన్న అసలు కథ
మురిగిన శవాలపై
సవ్వడిలేకుండా వాలిన ఈగలవలె అధికారులు
ఈ మరణాలపై మౌనంగా దాటిపోయారేంది?
అధికార యంత్రాంగం నిజాలను దాచిపెట్టడం పట్ల, కన్నతల్లిదండ్రులకు పాలకుల నుంచి ఓదార్పు లభించని తీరుపై కన్నీరవుతుంది.
ఆదివాసీ ప్రజాపోరాటాల పట్ల శోభకు స్పష్టమైన దృక్పథం కలిగి వుంది. వారి జల్,జంగల్, జమీన్ ప్రజాఉద్యమాల పట్ల సానుభూతిని కలిగి ఉంది. ఆదివాసీ పోరాటాల పట్ల కాకతీయుల నుంచి నిజాం పాలకులు, ఆధునిక బూటకపు ప్రజాస్వామ్యం ఆదివాసీ ప్రజలపట్ల అనుసరిస్తున్న వైఖరులను దునుమాడినారు. పాలకులు ఎవరైనా ఆదివాసీల ఆకాంక్షలను నీరుకారుస్తూ నిర్లక్ష్యం చేశారని చెబుతుంది. ఆదివాసీల ఉద్యమాలు చారిత్రక సాంస్కృతిక పునాదిరాళ్లుగా నిలిచిన సమ్మక్కసారలమ్మ ధీరత్వాన్ని ఎత్తిపడుతుంది. కాకతీయ రాజులపై సమరం సాగించిన వీరవనితలు సమ్మక్కసారలమ్మల పరాక్రమ అమరత్వాన్ని సున్నితంగా ప్రశంసిస్తుంది. మరోవైపు గ్రీన్‌హంట్ ఆపరేషన్ ముసుగులో అడవిబిడ్డలపై అమలవుతున్న ఆరాచక హింసను బహిరంగకుట్రగా నిరసిస్తారు.
ప్రపంచాన్ని శాసించాలని విఫలయత్నం చేస్తున్న సామ్రాజ్యవాదుల కుట్రలు వివిధ రూపాల్లో విస్తరిస్తూనే ఉంటాయి. ప్రజలు ఎపుడూ
శాంతిని మాత్రమే కాంక్షిస్తారు. సామ్రాజ్యవాద మార్కెట్ మాయాజాలం, దోపిడీ విస్తరణ కాంక్ష దేశాల మధ్య అగ్గిరాజేయడం అగ్రరాజ్యాల కుట్రలను అర్థం చేసుకోవడంలో శోభరాణి అంతర్జాతీయ అవగాహన కలిగివున్న తీరును మనల్ని ఆలోచింప చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాల వెనక కుట్రదారులు ఆయుధ వ్యాపారులేనని వెల్లడిస్తారు. ప్రపంచ పోలీసుగా గుత్తాధిపత్యం చెలాయిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ ‘‘పోరాటాలెపుడు ప్రజలవే’’ కవితలో సామ్రాజ్యవాద టెర్రరిజాన్ని ఓడిరచాలని పిలుపునిస్తారు.
ఎగిరెగిరి పడబోకు అమెరికోడా!
మళ్లీ ఎదురుదెబ్బ తింటావు
నూరు నేరాలు చేసి నీవు
నాశనమై పోతావు
….
సోమాలియా,కాంబోడియాలో
లావోసులో మిల్ట్రి దించి
గ్రెనడా,సనామా,చిలీ
హైతీలను అక్రమించి
ఇరాక్,లిబియాలో
హైడ్రోజన్ బాంబెలెస్తివి
క్రిమి రసాయనిక ఆయుధాలతో చల్లితివిరా
….
సామ్రాజ్యవాదే యుద్ధం
సామ్రాజవ్యవాదమే మృత్యువు
యుద్ధాలెపుడు పాలకులవే
పోరాటాలెపుడు ప్రజలవే’’..
అంటూ ప్రపంచ దేశాలపై సామ్రాజ్యవాద అమెరికా ఆధిపత్యాన్ని తిరస్కరించారు. ఈ కవితలో కవయిత్రి శోభారాణి ప్రాపంచిక జ్ఞానాన్ని తెలుసుకోవచ్చును.
శోభారాణి కేవలం సాహిత్య అధ్యయనం, పరిశోధన, అధ్యాపనకు మాత్రమే పరిమితం కాలేదు. సాహిత్య అధ్యయనంలో తాను పొందిన అవగాహన, జ్ఞాన సంపదను కార్యాచరణకు జోడిరచింది. మానవహక్కుల వేదిక నాయకుడు, కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బుర్ర రాములు ఆధ్వర్యంలో మానవ హక్కుల పరిరక్షణ ప్రచార ఉద్యమంలో తనదైన పాత్రను పోషించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మానవ హక్కుల వేదిక జిల్లా బాధ్యురాలుగా పనిచేశారు. ఇదే క్రమంలో తెలంగాణ ఉద్యమంలో కూడా మహిళా నాయకురాలిగా కీలకంగా తన బాధ్యతలను నిర్వర్తించారు. జిల్లాలోని మహిళలను, విద్యార్థునులను, ఉపాధ్యాయులను తెలంగాణ ఉద్యమం పట్ల చైతన్యం చేయడంలో ముందువరసలో నడిచారు. ఆయాకాల సందర్భాలలో వివిధ సాహితీ సంస్థలు, తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా చేపట్టిన సాహిత్యకార్యక్రమాల్లో నిరసన అక్షరమై, తెలంగాణ కోసం కవిత్వమై నినదించారు. సమైక్యాంధ్రప్రదేశ్ నినాదంలోని డొల్లతనాన్ని కవితలతో బద్దలు కొట్టారు.
తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని తన కవితల్లో ఎంతో బలంగా, నిర్ధిష్టంగా చాటి చెప్పారు. వరంగల్ నగరంలో జరిగిన తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, జిల్లాలోని వివిధ ప్రాంతాలలోని కాలేజీలు, సభలు, సాహితీ సమావేశాలలో తనదైన కంఠంతో విద్యార్థి,యువతను మేల్కొల్పడంలో డాక్టర్ శోభారాణి కృషి మరవలేనిది. తెలంగాణ ఉద్యమాన్ని వైయుక్తిక రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూసే స్వార్థ రాజకీయ శక్తులను సభల్లో ముక్కుసూటిగా నిలదీసిన ధీరవనిత.
శోభ తెలుగు భాష అధ్యాపకురాలు కావడం వల్ల తెలంగాణ భాష, సంస్కృతి, సంప్రదాయాలపై అపారమైన ప్రేమాభిమానాలు కనిపిస్తాయి. తెలంగాణ భాష, సంస్కృతులు వెండితెర మీద ఏవిధంగా అవమానాలకు గురవుతున్న తీరును కళ్లకు కడుతుంది. ‘‘ఎన్నముద్ద నా బాస’’ కవితలో …
తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న సాంస్కృతిక దాడిని, అన్యాయాలను, అవహేళనలు అర్థం చేసుకొని ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్షల కోసం నినదించింది. విధ్వంసంలేని, మానవీయ విలువల తెలంగాణ కోసం పరితపించింది.
‘చీలికలు పడ్డనేల
విడివడ్డ ఖండాలం
చూపునకు మాత్రం
ఒకలాంటి మనుషులమే
అంతా తెలుగోళ్లమే
…
దశాబ్దాలుగా మూసుకుపోయిన
మీ ఊసుకండ్లు తెరిచి
మీ హద్దుల్లోని ‘ప్రామాణిక’
భాషావాద కవ్వంతోనే
చిలకరించి చూస్తే చూడండి
తెలంగాణ బాస తల్లి
మెత్తని ఎన్నముద్దొలె
ఎట్లా పైకి లేచి సవాల్ చేస్తదో
తల ఎత్తి నీళ్లలోకి చూస్తే
నీ తల నేలకే కదా వాలేది’’ అంటుంది.
జీవితం ఎన్ని సవాళ్లు విసిరినా ధైర్యంగా స్వీకరించిన స్పూర్తి ఆమెది. ఆనారోగ్య సమస్యలు, ఉద్యోగ బాధ్యతలు కుటుంబ వత్తిడులు ఎన్ని ఉన్నప్పటికీ అధ్యయనం, సృజనాత్మకతను తన శ్వాసగా మార్చుకున్న బుద్దిజీవి. సమాజంలో మధ్యతరగతి మనుషులు కొద్దిపాటి అవకాశాలు, సామాజిక బాధ్యతలతోనే తాము సమాజానికి ఎంతో మేలు చేస్తున్నామని భ్రమలు పడుతున్న తరుణంలో డాక్టర్ కందాల శోభారాణి మాత్రం తానింకా సమాజానికి చాలా చేయాల్సింది, రాయాల్సింది ఉందని తనను తాను ప్రగతిశీల దృక్పథాల కొలిమిలో పుటం పెట్టుకున్న సౌమ్యురాలు. కవిత్వం, సమీక్ష, విమర్శ కోసం నిరంతరం కృషి చేసిన ఆమె సాహసం నేటితరం యువతీ,యువకులు ఆదర్శంగా తీసుకొని మన జీవితాల్లో అధ్యయనం, ఆచరణ, సృజనాత్మకత నిరంతర భాగస్వామ్యం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది. సాధారణమైన మనుషులను పరిపూర్ణమైన మానవులుగా తీర్చిదిద్దగలిగిన శక్తి కేవలం అధ్యయనమే. మనుషుల్లోని అధ్యయనశీల స్వభావమే ఆధునిక నూతన మానవులుగా ఆచరణలోకి మార్గం వేయగలుగుతుంది. ఆ క్రమంలోనే ప్రయాణిస్తున్న డాక్టర్ శోభారాణి అర్థాంతరంగా ఆమె శ్వాస ఆగిపోయింది. ఆమె సమకాలీన మనుషులుగా శోభారాణి భుజాల నుంచి ఆమె ఎత్తుకున్న బాధ్యతలను మనం స్వీకరించాల్సిన కర్తవ్యం మనందరి మీద ఉంది. ఆమె అక్షరాల ఆకాంక్షల వెలుగుబాటలో నడవటమే డాక్టర్ కందాల శోభారాణి గారికి నిజమైన నివాళి అర్పించినవారం అవుతాం.