పాట‌ల వెల్లువ ర‌మేష్‌

వీరుల మరణం వారి జ్ఞాపకాలతో మనసును బరువెక్కిస్తోంది. ఆ బరువు కారే కన్నీళ్లతో కాస్త‌ తేలికవుతోంది. అ బరువు అక్షరాలలోకి తర్జుమా అవుతే చరిత్రలో వారి త్యాగాలు సదా నిలిచిపోతాయి. ఆ బరువు స్టూప నిర్మాణంలో నిక్షిప్తమైతే, అనునిత్యం మన కళ్ల ముందు వారి జ్ఞాపకాలు నిలుస్తూ తమ ఆదర్శాలతో మనకు మార్గద‌ర్శ‌కం చేస్తుంటాయి. అలా ఆ బరువు వారి ఆశయాల సాధనతో  ప్రజల హృదయాలను తేలికపరుస్తుంది. వారి ఆశయాల సాధన కృషిలో మరింత పట్టుదలగా నిమగ్నమవుతామంటూ ప్రతిన బూనుతూ మా సోదర కళాకారుడు కామ్రేడ్‌ డప్పు రమేశ్‌కు  వినమ్రంగా విప్లవ నివాళులర్పిస్తున్నాం.

1998లో మా సంస్థ ఏర్పడింది. రానున్న సంవత్సరం రజిత‌ వేడుకల నిర్వహణకు మేం వేగిరపడుతున్నాం. కానీ, మా పోరు పాటలకు అడుగులు నేర్చిన, మా పాటకు దరువు అయిన సోదర ప్రజా గాయకులు, కళాకారులు కామ్రేడ్స్ ప్ర‌భాక‌ర్‌,  రమేశ్ ఆ    సంబురాలను మాతో పాటుగా పంచుకోగలిగి వుంటే ఎంత బావుండు!  ఇది ఒక ఆశ మాత్ర‌మే.

కానీ, అ అశలే మనలను నిలపెడుతాయి. మన అశయాలకు బలాన్ని శక్తిని, ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని ప్రాణవాయువులా అందిస్తుంటాయి. అ అశలే నిప్పులు చెరిగే నిర్బంధాన్ని అవలీలగా అధిగమింపచేస్తాయి. అ అశలే కన్నీళ్లను, కష్టాలను, అవమానాలను ఆశయాల కోసం సునాయసంగా, హ్యపీగా భరింపచేస్తాయి. నదీ, నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకడ్డంకి అనడమే కాదు ‘పర్వతాలను” గులకరాళ్లు చేస్తాయి. మూడు పర్వతాలను ముక్కలు మక్కలు చేస్తాయి అనే దృఢ విశ్వాసాన్ని ఇస్తాయి.  

జననాట్యమండలికి స్వర్ణవేడుకలు, చేతనా నాట్య మంచ్‌కు రజత వేడుకలు జ‌రుపుకోబోతున్న ఈ సంద‌ర్భం .విప్లవ చేవగల కళాకారులందరికి పండుగ వేళలు.   మా సంస్థ దృఢమైన జన కళా పునాదులపై నిలబడి, బలపడడానికి, విస్తరించడానికి ర‌మేష్ ఎంతగానో చేయూతనిచ్చాడు. ఆయ‌న  నేర్పిన  క‌ళా శిక్షణ,  విప్లవ క్రమశిక్షణ అవిస్మరణీయమైనవి. మా కళాకారుల అడుగులలో, నుడుగులలో, అటపాటలలో కామ్రేడ్‌ రమేశ్‌ అనునిత్యం మాకు ఒక చక్కని గైడ్‌లా నిలిచాడు. ఇకపై నిలుస్తాడు.

కామ్రేడ్‌ రమేశ్‌ 2001లో దండకారణ్యానికి పరిచయమయ్యాడు.  ఆయన వెంట కళాకారుడు శ్రీధర్‌, ఇతర స్థానిక  కళాకారులు హాజరై అప్ప‌డు జ‌రిగిన రాజ‌కీయ స‌మావేశ ప్రతినిధులను తమ అటపాటలతో అలరించారు. అ వేడుకల వేళ ఆయన నోట ‘ఓ అరుణ పతాకమా, చేగొనుమా రెడ్‌శల్యూట్‌, శ్రమజీవుల కేతనమా, నీకివిగో మా రెడ్‌శల్యూట్స్‌ …… కత్తులు దూసుకుపోయినా, నెత్తుటి ఏరులు పారినా, బాంబుల వర్షం కురిసినా, బారు ఫిరంగులు మోగినా జై…..జై..జై…అరుణపతాకకు జై, జై…జై..జై..విజయపతాకకు జై’ అంటూ తానే కంజర వాయిస్తూ గొంతెత్తి గానం చేయడంతో, తన్మయంతో పాటలో లీనమైన తెలుగు తెలిసిన ప్రతినిధులందరూ తమకు తెలువకుండానే పెదవులపై అ పాటకు కోరస్‌ ఇవ్వడమే కాదు, అ పాటతో ఆయన దండకారణ్య అడవులను అవాహనం చేసుకున్నాడు.   చెల్లెలా, నా చెల్లెలా, అడవి బతుకుల కన్నులల్లో వెన్నెల” పాట వినిపించి మన్యం కొండలలో తన జీవితాన్ని అరుణమయం చేసిన కోందు బిడ్డ కామ్రేడ్‌ జ్యోతి జ్ఞాపకాలతో పొటమరించింది.  

 అ వేళ ఆయనతో దాదాపు డజన్‌కు పైగా విప్లవ పాటలు పాడించుకొని వాటిని రికార్డు చేసుకొని కేసెట్లలోకి మార్చుకొని పంపిణి చేసుకున్నాం. అ సమయాన డోలు, డప్పు, కంజర ఏదీ దొరకని పరిస్థితిలో అదివాసీ గోటుల్‌లలో సాధారణంగా ఉండే తుడుంనే వాయిద్యంగా ఉపయోగించ గలిగిన నేర్పరి ఆయన. అందుకే ఆయనకు ఇంటి పేరుగా డప్పు స్థిరపడిపోయింది. తెలుగు తెలిసినవారంతా అలసి సొలసిన వేళ ఆయన గొంతుతో నేటికి వాటిని గుర్తు చేసుకుంటారు. ఆ మధుర గాయకుడు శ్రోతల హృదయాలలో చిరకాలం నిలిచిపోయాడు.

కామ్రేడ్‌ రమేశ్ ఆ రాజ‌కీయ స‌మావేశాల  నుండి వెనక్కివెళుతూ దారిలో చేతనా నాట్య మంచ్‌ కళాకారులకు కళా శిక్షణా శిబిరాన్ని నిర్వహించి వెళ్లాడు. అక్కడికి ఛత్తీస్‌గఢ్‌ నుండి వచ్చిన ప్రజా వాగ్గేయకారులతో జననాట్య మండలి అనుభవాలను పంచుకున్నాడు. అపుడపుడే ఏర్పడిన చేతనా నాట్య మంచ్‌కు అ శిక్షణా శిబిరం, మరింత పట్టుదలతో ముందుకు పోవడానికి చాలా తోడ్ప‌డింది.

ఇక అక్కడి నుండి ఎక్కువ రోజులు గడువక ముందే మళ్లీ  రమేశ్   అఖిల భారత సాంస్కృతిక కార్యశాలలో మాతో భాగమయ్యాడు. అ కార్యశాల  రూపొందించిన సాంస్కృతిక పేపర్‌పై దేశవ్యాప్త కళాకారుల అభిప్రాయాలు తీసుకొని దానిని సుసంపన్నం చేశాం.  ఢిల్లీ, హర్యానా, బిహార్‌, తెలంగాణ, ఏఓబీ, దండకారణ్యం నుండి ఆ స‌మావేశానికి కళాకారులు హజరయ్యారు. అక్కడ చాలా సూక్ష్మస్థాయిలో అ పేపర్‌పై చర్చలు జరిగి దానిని సమృద్ధం చేయడానికి తోడ్పడినాయి. అక్కడ నిర్వహించిన కళా ప్రదర్శనలు, వినిపించిన పాటలు, కళాకారుల దశాబ్దాల సాంస్కృతిక అనుభవాల మార్పిడికి తోడ్ప‌డినాయి.

అ కార్యశాలలో జరిగిన చర్చల ఫలితంగానే మా చేతనా నాట్య మంచ్‌ ఒక ప్రజా సంఘంగా అవతరించింది. ప్రజాసైనికుల   విప్లవ రాజ‌కీయ సాంస్కృతిక ప్రచార కర్తవ్యాలకు,  రచయితలు, కళాకారులతో కూడిన సాహితీ సాంస్కృతిక సంస్థలు చేపట్టే విప్లవ ప్రచారానికి మధ్య గల తేడాను స్పష్టం చేసుకున్నాం. అ వేదిక అనుభవాల పొదిలో నుండే అడవులను, ఆదివాసీ కళా అహార్యాన్ని ప్రజాగెరిల్లాల యూనిఫాంను ప్రతిబింబించే మా అహార్యాన్ని నిర్ణయించుకున్నాం. మా జెండాకు లోగో రూపొందించుకున్నాం. వాటన్నింటిలో భాగమైన కార్యశాల ప్రతినిధులందరిలో కామ్రేడ్‌ రమేశ్‌ క్రియాశీలంగా పాలుపంచుకున్నాడు. ఆయన ఒకవైపూ కార్యశాల చర్చలలో, మరోవైపూ క్యాంపు నిర్వహణలో భాగస్థుడై క్యాంపు జయప్రదం కావడానికి ఎంతో కృషి చేశాడు.

అంధ్రప్రదేశ్‌లో జననాట్యమండలిపై అప్ర‌క‌టిత నిషేధంతో  బహిరంగంగా   కళా ప్రదర్శనలను ఇవ్వలేని పరిస్థితులు ఏర్పడినాయి. దానితో, విప్లవానికి తమ పూర్తికాలాన్ని అంకితం చేసి రహస్య జీవితానికి చేరిన ప్రజా కళాకారులు ప్రజల మధ్యకు చేరి అపుడే కొత్తగా ఉనికిలోకి వచ్చిన ప్రజా విముక్తి గెరిల్లా సైనికుల రక్షణలో తమ సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వసాగారు. మన్యం కొండలలో ఆయన ‘పితూరి ఏందనా దళం’కు ప్రాణం పోశాడు. అక్కడి నుండి వెలువడుతుండిన ‘తూర్పు కనుమ” సాహితీ సాంస్కృతిక పత్రిక నిర్వహణ బాధ్యతలలో పాలు పంచుకున్నాడు. మూలవాసీ కువ్వీ ప్రజల మధ్య అయన ఎంతో అభిమానాన్ని చూరగొన్నాడు. వారి భాషను పట్టుకోగలిగాడు. వారి జానపద రీతులను కళా దృష్టితో గ్రాహ్యం చేసుకున్నాడు. కొండరెడ్ల‌తో మమేకమయ్యాడు. వారి అచార, సంప్రదాయాలను అర్థం చేసుకున్నాడు. ఆయన అక్కడి అన్ని తెగల ప్రజల మధ్య కేవలం ఒక ప్రజా కళాకారుడిగానే కాదు, వారిని సంఘటిత పరిచిన ఒక ఆర్గనైజర్‌. అ కొండలలో తరచుగా విషజ్వరాల బారినపడే మూలవాసీ ప్రజలకు ఆయన ఒక ప్రజా చికిత్సకుడుగా తనకు తెలిసిన వైద్య సేవలు వారికి అందించాడు. అడవులలోకి వచ్చి ప్రజా గెరిల్లాల మధ్య, ప్రజలతో వుండేవారెవరైనా వారు

కవులే కావచ్చు, కళాకారులే కావచ్చు, గాయకులైనా, చిత్రకారులైనా, అభివక్తలైనా, అభియంతలైనా, విద్యార్థులైనా, మేధావులైనా వారు ఎవరైనప్పటికీ ముందుగా క్రియాశీల అత్మరక్షణలో పాలుపంచుకోవాలి. తమ జీవితావసరాలన్నీ తీర్చుకోగలిగే, సాధారణ సమస్యలన్నీ పరిష్కరించుకోగలిగే ప్రాథమిక జ్ఞానాన్ని పొందాకనే విప్లవ అవసరాలు తీర్చే బాధ్య‌త‌ల్లో  నిష్ణాతులు కావాలి. తమ అభిరుచి గల రంగంలో అవకాశం వచ్చినపుడు ఎరుపుతో కూడిన నైపుణ్యాన్ని ప్రదర్శించాల్సి వుంటుందనే అవగాహనతో ఆయన తన గెరిల్లా జీవితాన్ని కొనసాగించాడు. కామ్రేడ్‌ రమేశ్  సైనికుడిగా, సాంస్కృతిక సైనికుడిగా కళారంగానికి ప్రాతినిధ్యం వహించాడు.

అ తరువాత ఇక ఆయన 2004లో విప్లవోద్యమ అవసరాల రీత్యా మళ్లీ అడవుల నుండి, అదివాసీ జనజీవితాల నుండి పట్టణ ప్రజల మధ్యకు పయనమయ్యాడు. గెరిల్లా యూనిఫాం వదిలి తిరిగి తన కళామతల్లి కార్యకలాపాలలో నిమగ్నమయ్యాడు. రహస్య జీవితం నుండి బహిరంగ జీవితానికి మారిన పిదప అక్కడ వారి జంట (జీవిత సహచరులు)  అనేక సమస్యలు ఎదుర్కొన్నారు.

వాటి గురించి తనతో కలిసి పనిచేసి నేటికి మాతృసంస్థను అంటిపెట్టుకొని వున్న కళాసంస్థ కార్యకర్తలతో తప్ప మరెవరితో అవి పంచుకోలేనివి.   సోదర కళాకారుల చేదు అనుభవాల నుండి నేర్చుకుంటూ నిస్వార్ధంగా ఉద్యమ జీవితానికే అంకితం కావాలనీ, తన యావజ్జీవితాన్ని ప్రజాసేవకే అర్పితం చేయాలనీ, నిజమైన సాంస్కృతిక సైనికుడిగా తన విప్లవ కర్తవ్యాలను పరిపూర్తిచేయాలనీ, సోదర కళాకారులను సంఘటితం చేయాలనీ మరింత గట్టి పట్టుదలతో నిర్ణయించుకున్నాడు.

ప్రజలతో మమేకమై, వారి అపార అదరాభిమానాలను చూరగొన్నవారిలో సహజంగానే విప్లవ చైతన్యం లోపిస్తే సమాజం లోని చెడు ధోరణులు త్వరితంగా ప్రభావితం చేస్తాయి. అందులో సాహితీ కళా రంగాలలో పనిచేస్తున్న వారిలో అ ధోరణులు మరింత త్వరితంగా చోటు చేసుకునే ప్రమాదం వుంటుంది. వారి కీర్తి ప్రతిష్టలకు వారి తెలివితేటలు, వారి కళా నైపుణ్యాలు, వారి విశిష్టతలే కారణం అనుకొని అహం పెంచుకొని స్వార్థంతో వ్యవహరిస్తూ  వారిని ఆ స్థాయికి తెచ్చిన విప్లవ రాజకీయాల మూలాలనే మరిచిపోవడాన్ని కామ్రేడ్‌ రమేశ్‌ తీవ్రంగా వ్యతిరేకించాడు.  తెలంగాణ వ్యాప్తంగా తన అటపాటలతో ప్రజలను ప్రత్యేక తెలంగాణ, ప్రజాస్వామిక తెలంగాణ రాజకీయాలతో అలరించాడు. అ కల 2014 జూన్‌ 2న పాక్షికంగా నెరవేరింది. దానితో, భౌగోళిక తెలంగాణతో ప్రజలకు ఒరిగేదేమీ లేదనే వాస్తవంతో ప్రజాస్వామిక తెలంగాణ ప్రాసంగికతను చాటుతూ ప్రజలలో తిరిగి తన కృషిని గతం కన్నా మరింత పట్టుదలతో చేయ నిశ్చయించుకున్నాడు. తెలంగాణ రాష్ట్రవతరణతో అధికారానికి “బాంచెన్‌” (బానిసలం) అన్న కవులను, కళాకారులను కాదని ప్రజల కోసమే కళ అని నిజాయితీగా నమ్మినవారిని సంఘటితం చేసే కృషిని రెట్టింపు చేశాడు.

 జననాట్యమండలి చరిత్రను అక్షరబద్దం చేయ‌డానికి  ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ద‌ని తెలిసి  ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆయన అప్పటికే గుండె సమస్యకు చికిత్స చేయించుకొని ఇంకా పూర్తిగా, ఎప్పటిలా కోలుకోనప్పటికీ  ఆయ‌న అందులో భాగం కావాల‌ని నిర్ణయించుకున్నాడు. జననాట్యమండలి చరిత్ర రచనను, అందులో ఐదు దశాబ్దాల కాలంలో సంస్థలో చోటుచేసుకున్న అనేక పరిణామాల నేపథ్యంలో తమ జీవిత లక్ష్యాలలో ఒక ముఖ్యమైనదిగా రచనా కర్తవ్యాన్ని భావించిన ఆ సంస్థ సీనియర్‌మోస్ట్‌ కళాకారులలో ఆయన ఒకరు. గడిచిన ఐదు దశాబ్దాల కాలంలో జననాట్యమండలి పురుడు పోసుకున్న నాటినుండి నేటివరకు అ సంస్థ కార్యకలాపాలలో పూర్తిగా, పాక్షికంగా; ప్రత్యక్షంగా, పరోక్షంగా; క్రియాశీలంగా, అవసరం పడినపుడు పాలుపంచుకొన్న వారందరి అనుభవాలను, అభిప్రాయాలను సేకరించే ప‌ని ని పూర్తి చేశాడు.   నిజంగా ఆయన సేకరించిన విప్లవాభిమానుల, సంస్థ తొలినాటి సభ్యుల అభిప్రాయాలు, అనుభవాలు, రచనలు, సంస్థ అచ్చువేసిన పుస్తకాలు, విడుదల చేసిన క్యాసెట్లు, ఆ సంస్థ నిర్మాణంలో పాలుపంచుకున్న వాళ్ల అరుదైన ఇంటర్వ్యూలు అ రంగంలో   కృషికి ఒక రకంగా ఆర్మైన్స్ (ఖజానా)గా పని చేస్తాయనడంలో సందేహం లేదు. ఎన్నటికైనా మిగిలిన కళాకారులు, కళాభిమానులు అ పని పూర్తి చేస్తారని ఆశిద్దాం.

 తను పనిచేసిన ప్రాంతం, తను నాయకత్వం వహించిన రంగం, జననాట్యమండలిలో తన పాత్రతో సహ తన అనుభవాలు, సంస్థ కార్యకలాపాలలో ఎదురైన అరుదైన అనుభవాలు, సమీక్షలు అందరితో పంచుకొని అ రచనకు న్యాయం చేకూర్చాడు. అ పుస్తకాన్ని ఎంతో శ్రద్ధ‌గా, ప్రతి భాగాన్ని లోతుగా, చదివి, చర్చించి తన సవరణలను అందరి దృష్టికి తెచ్చి దానిని పూర్తి చేయడంలో తన వంతు పాత్ర తాను క్రియాశీలంగా నిర్వహించాడు. 

కాకలు తీరిన కళాకారుడు, పాటల రచయిత, విప్లవ ప్రజలతో ‘శెహబాస్‌” అనిపించుకున్నవాడు, పాణిగ్రహి వారసుడు, మొక్కవోని దీక్షా, పట్టుదలలు కల సాంస్కృతిక సైనికుడు వర్తమాన సమాధాన్‌ సైనిక కేంపెయిన్‌ అంతిమ మాసాలలో మన మధ్య లేకపోవడం మనకు ఎంతో లోటును కలిగిస్తుంది. జననాట్యమండలి రచనా సమయంలో ఆయన దేశంలో

పెరుగుతున్న హిందుత్వ దాడులపై లోతైన చర్చలు చేశాడు. సోదర కళాకారులతో కలిసి నూతనంగా పాటలు రూపొందించాడు. కష్టకాలాలలో, శతృవు అనుసరిస్తున్న అణచివేత దాడుల\ మధ్య వర్గ పోరాటానికి ‘సలాం’ చేస్తున్నవారిని ఈసడించుకున్నాడు. అవి ఆయనలోని యాంగ్రీ యంగ్‌మాన్‌ను గుర్తు చేశాయి. వాటిని బయట రికార్డింగ్‌ చేయించి ప్రజలలోకి తీసుకెళ్చామని చేసుకున్న ప్లాన్‌ కొరోనా మహమ్మారి మూలంగా పూర్తి కాలేదు.

జననాట్యమండలిలో పని చేస్తూ విప్లవోద్యమంలో అమరులైన కళాకారుల చరిత్రలు ‘సేకరించాలని ఆయ‌న అనుకున్నాడు.  ఆ ప‌ని చాల వ‌ర‌కు చేశాడు.

కానీ, ఈరోజు అ అమర కళాకారుల సరసన మన కామ్రేడ్‌ డప్పు రమేశ్‌ కూడ చేరాడు. అ అమరుల చరిత్రతో తానను కూడ మనం భాగం చేసుకోవలసి వస్తుందని ఊహించలేకపోయాం. అ అమరుల పుస్తకం పూర్తి చేయాల్సిన కర్తవ్యం ఇపుడు మన ముందు మిగిలేవుంది. దానిని జననాట్యమండలిలో మిగిలిన నిజాయితీ కల కళాకారులు, అభిమానులు తప్పక పూర్తి చేస్తారనీ, అమరుల కృషిని అక్షరబద్దం చేసి, రమేశ్‌ తపనను తీరుస్తారనీ ఆశిస్తున్నాం.

కామ్రేడ్‌ రమేశ్‌ అమరత్వం చేతనా నాట్య మంచ్‌కు ఒక పెద్ద వెలితిని మిగిల్చింది. ఆయన మా సంస్థ నుండి వెలువడే పాటలను, నృత్యాలను, ప్రదర్శనలను నిశితంగా అధ్యయనం చేసి తగు సూచనలు, సలహాలు ఇచ్చేవాడు. చేతనా నాట్య మంచ్‌ను స్వంతం చేసుకొని దాని కార్యకలాపాలను, రూపొందించిన కళా రూపాలను సోదర కళాకారులకు తెలుపుతూ వాటి ప్రచారానికి తద్వారా దండకారణ్య వుద్యమ విస్తృతికి తోడ్ప‌డినాడు. యూట్యూబ్‌లలో వాటిని ఎక్కించడానికి చొరవ చేశాడు. తెలుగు రాష్ట్రాలలో పని చేస్తున్న సోదర ప్రజా కళా సంస్థలతో చేతనా నాట్య మంచ్‌ అనుభవాలను పంచుకుంటూ వారి ప్రతిక్రియలను, స్పందనలను వెంట వెంట ఏదో రూపంలో మాకు తెలిపేవాడు. అలాంటి సాంస్కృతిక సేనాని భౌతికంగా మనకు ఇక లేడు. కానీ, ఆయన తయారుచేసిన అనేక మంది ప్రజా కళాకారులు ప్రజలలో భాగంగా వున్నారు. వారందరి సహాయ సహ‌కారాలతో కామ్రేడ్‌ డప్పు రమేశ్‌లాంటి గొప్ప  కార్మికవర్గ కళాకారులను తయారుచేసుకుందాం. వారి ఆశయాలను పరిపూర్తి చేయడమే మనం వారికి అర్చించే నిజమైన నివాళి అవుతుంది.

తేది: షహీద్‌ దివస్‌ (23 మార్చ్‌ 2022) 

Leave a Reply